మంటి ఘటాల్లో మా ఐశ్వర్యం
“ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.”—2 కొరింథీయులు 4:7.
1. యేసు మాదిరి మనల్ని ఎలా ప్రోత్సహించాలి?
ఇక్కడ భూమిపై యెహోవాచే మలచబడుతున్న కాలంలో, యేసు మానవాళి బలహీనతలను స్వయంగా అనుభవించాడు. యథార్థతను కాపాడుకునే విషయంలో ఆయన చూపించిన మాదిరి మనల్ని ఎంతగా ప్రోత్సహిస్తుందో గదా! అపొస్తలుడు మనకిలా చెబుతున్నాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:21) అలా మలచబడడానికి అంగీకరించడం ద్వారా, యేసు లోకాన్ని జయించాడు. తన అపొస్తలులు కూడా విజేతలు కావాలని యేసు వారిలో ధైర్యాన్ని నూరిపోశాడు. (అపొస్తలుల కార్యములు 4:13, 31; 9:27, 28; 14:3; 19:8) తాను వారికిచ్చిన తుది ప్రసంగపు ముక్తాయింపులో ఆయన ఎంత గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చాడు! ఆయనిలా ప్రకటించాడు: “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయంచి యున్నా[ను].”—యోహాను 16:33.
2. లోకపు ‘అంధత్వానికి’ భిన్నంగా, మనమే ‘ప్రకాశాన్ని’ కల్గివున్నాం?
2 “ఈ యుగ సంబంధమైన దేవత” కలుగజేసిన గ్రుడ్డితనానికీ “మహిమను కనుపరచు సువార్త ప్రకాశము”నకూ ఉన్న తారతమ్యాన్ని చూపించిన తర్వాత, అపొస్తలుడైన పౌలు మన ప్రశస్తమైన పరిచర్యను గురించి ఇలా తెలియజేశాడు: “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయనను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.” (2 కొరింథీయులు 4:4, 7-9) మనం బలహీనమైన ‘మంటి ఘటాలం’ అయినప్పటికీ, సాతాను లోకాన్ని పూర్తిగా జయించగల్గేలా తన ఆత్మచే దేవుడు మనల్ని మలిచాడు.—రోమీయులు 8:35-39; 1 కొరింథీయులు 15:57.
ప్రాచీనకాల ఇశ్రాయేలులో మలచడం
3. యూదా జనాంగం మలచబడడాన్ని గురించి యెషయా ఎలా వర్ణించాడు?
3 యెహోవా ఆ యా వ్యక్తుల్ని మాత్రమేగాక యావత్ జనాంగాల్నీ మలుస్తాడు. ఉదాహరణకు, ప్రాచీనకాల ఇశ్రాయేలు యెహోవా చేతిలో మలచబడడానికి అంగీకరించినప్పుడు, అది వర్ధిల్లింది. కానీ చివరికది అవిధేయతను చూపించేదిగా తననుతాను కఠినపర్చుకుంది. తత్ఫలితంగా, ఇశ్రాయేలుపైకి దాని రూపకర్త “శ్రమ”ను తీసుకొచ్చాడు. (యెషయా 45:9) సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో, ఇశ్రాయేలు గంభీర పాపాన్ని గూర్చి యెహోవాతో యెషయా ఇలా చెప్పాడు: “యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు; మేమందరము నీ చేతిపనియై యున్నాము. . . . మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.” (యెషయా 64:8-11) నాశనానికి తప్ప మరి దేనికీ పనికిరాని పాత్రగా ఇశ్రాయేలు మలచబడింది.
4. యిర్మీయా ద్వారా ఏ ఉపమానం ప్రదర్శించి చూపబడింది?
4 ఒక శతాబ్దం గడిచిన తర్వాత, పగతీర్చుకోవాల్సిన దినం సమీపిస్తుండగా యెహోవా, మంటి కూజానొకదాన్ని తీసుకొని యెరూషలేములోని పెద్దలతోపాటు హిన్నోము లోయ దగ్గరకు వెళ్లమని యిర్మీయాతో చెప్పి, ఇలా ఉపదేశించాడు: “నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను—సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మరల బాగుచేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను.”—యిర్మీయా 19:7-11.
5. ఇశ్రాయేలుపైకి వచ్చిన యెహోవా తీర్పు ఎంత తీవ్రమైనది?
5 సా.శ.పూ. 607లో నెబుకద్నెజరు యెరూషలేమును దాని ఆలయంతోపాటు నాశనంచేసి, బ్రతికిబయటపడ్డ యూదుల్ని బంధీలుగా బబులోనుకు తీసుకుపోయాడు. కానీ డెభ్బై ఏళ్లపాటు చెరజీవితాన్ని అనుభవించిన తర్వాత, పశ్చాత్తాపాన్ని చూపించిన యూదులు యెరూషలేమునూ, దాని ఆలయాన్నీ పునర్నిర్మించేందుకు తిరిగి వచ్చారు. (యిర్మీయా 25:11) అయితే, సా.శ. మొదటి శతాబ్దంనాటికి, ఆ జనాంగం మహాగొప్ప కుమ్మరిని మరలా విడనాడింది, చివరికది దేవుని స్వకీయ కుమారుడ్ని హత్యచేసేంత మహాఘోరమైన పాపానికి ఒడిగట్టే స్థితికి దిగజారింది. జనాంగాన్ని తుడిచిపెట్టేందుకూ, యెరూషలేమునీ, దాని ఆలయాన్ని సమూలంగా నాశనం చేసేందుకూ తన సంహారకురాలిగా రోమా ప్రపంచ శక్తిని దేవుడు సా.శ. 70లో ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం యెహోవా దేవుని చేతిలో ‘పరిశుద్ధంగానూ, శృంగారమైనదిగానూ’ మరెన్నడూ మలచబడదు.a
ఆధ్యాత్మిక జనాంగాన్ని మలచడం
6, 7. ఆధ్యాత్మిక ఇశ్రాయేలు మలచబడడాన్ని పౌలు ఎలా వర్ణిస్తున్నాడు? (బి) ‘కరుణా పాత్ర ఘటాల’ పూర్తి సంఖ్య ఎంత, మరి అది ఎలా రూపొందించబడింది?
6 యేసును అంగీకరించిన యూదులు, ‘దేవుని’ ఆధ్యాత్మిక ‘ఇశ్రాయేలు’ అయిన కొత్త జనాంగానికి పునాదిరాళ్లవంటి సభ్యులుగా మలచబడ్డారు. (గలతీయులు 6:16) కాబట్టి పౌలు చెప్పిన ఈ మాటలు సముచితమైనవి: “ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? . . . దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛయంచినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, . . . తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?”—రోమీయులు 9:21-23.
7 ఈ ‘కరుణాపాత్ర ఘటాల’ సంఖ్య 1,44,000 అని పునరుత్థానుడైన యేసు తర్వాత తెలియజేశాడు. (ప్రకటన 7:4; 14:1) ఆ సంఖ్యకు సరిపడినంతమంది సహజ ఇశ్రాయేలీయులలో నుండి ప్రతిస్పందించలేదు గనుక, యెహోవా తన కరుణను అన్యజనాంగాలకు విస్తరింపచేశాడు. (రోమీయులు 11:25, 26) నవజాత క్రైస్తవ సంఘం త్వరితగతిన విస్తరించింది. 30 ఏళ్లలోనే సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడిం[ది].” (కొలొస్సయులు 1:23) అందువల్ల, చెల్లాచెదురుగా ఉన్న అనేక క్రైస్తవ సంఘాల్ని సరియైన పర్యవేక్షణ క్రిందకు తీసుకురావడం అవసరమైంది.
8. తొలి పరిపాలక సభగా ఎవరు రూపొందించబడ్డారు, ఈ సభ ఎలా వృద్ధిచెందింది?
8 యేసు పరిచర్య నిమిత్తం తన అపొస్తలులకూ, అలాగే ఇతరులకూ తర్ఫీదునిస్తూ, తొలి పరిపాలకసభగా తయారయ్యేందుకు తన పన్నెండు మంది అపొస్తలులను సిద్ధపర్చాడు. (లూకా 8:1; 9:1, 2; 10:1, 2) సా.శ. 33 పెంతెకొస్తునాడు, క్రైస్తవ సంఘం స్థాపించబడింది. కొంతకాలం తర్వాత, దాని పరిపాలకసభ విస్తరించబడింది, దానిలో ‘యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ’ చేర్చబడ్డారు. యేసు సహోదరుడైన యాకోబు అపొస్తలుడుకాకపోయినా, దీర్ఘకాలంపాటు పరిపాలకసభ ఛైర్మన్‌గా సేవచేసినట్టు కనబడుతోంది. (అపొస్తలుల కార్యములు 12:17; 15:2, 6, 13; 21:18) చరిత్రకారుడైన యోసిబస్ ప్రకారంగా, అపొస్తలులు ప్రత్యేకంగా హింసాలక్ష్యాలుగా అయ్యారు. వాళ్లు ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. పరిపాలక సభ స్వరూపం దానికి అనుగుణంగా మార్పుచేయబడింది.
9. విచారించదగ్గ ఏ పెరుగుదల జరుగుతుందని యేసు ముందుగానే ప్రవచించాడు?
9 మొదటి శతాబ్దాంతానికి, ‘శత్రువైన అపవాది’ గోధుమల్లాంటి ‘పరలోక రాజ్య’ వారసుల మధ్య ‘గురుగులను విత్త’నారంభించాడు. “యుగసమాప్తియందు” విచారించదగ్గ ఆ పెరుగుదల కోతకాలంవచ్చేంత వరకూ అనుమతించబడుతుందని యేసు ప్రవచించాడు. ఆ తర్వాత మరలా, ‘నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుతారు.’ (మత్తయి 13:24, 25, 37-43) అదెప్పుడు జరుగుతుంది?
నేడు దేవుని ఇశ్రాయేలును మలచడం
10, 11. (ఎ) దేవుని ఇశ్రాయేలును మలచే ఆధునికకాల కార్యక్రమం ఎలా జరిగింది? (బి) క్రైస్తవ మత సామ్రాజ్యానికీ, ఆసక్తిగల బైబిలు విద్యార్థులకూ మధ్య ఏ భిన్నమైన బోధలు ఉన్నాయి?
10 అమెరికాలోని పెన్సిల్వేనియానందలి పిట్స్‌బర్గ్‌లో 1870నందు చార్లెస్ తేజ్ రస్సెల్ ఒక బైబిలు స్టడీ గ్రూపును ఏర్పాటు చేశాడు. నేడు కావలికోటగా సుపరిచితమైన పత్రికను 1879లో ఆయన మాసపత్రికగా ప్రచురించడం ఆరంభించాడు. బైబిలు విద్యార్థులుగా పిలువబడిన వాళ్లు, అమర్త్యమైన ఆత్మ, నరకాగ్ని, పాపవిమోచన లోకం, త్రిత్వ దేవుడు, శిశు బాప్తిస్మం వంటి లేఖనాధారంలేని అన్య బోధలను క్రైస్తవ మత సామ్రాజ్యం అరువు తెచ్చుకుందని త్వరలోనే గ్రహించారు.
11 అయితే, బైబిలు సత్య ప్రేమికులైన వాళ్లు, యేసు విమోచన క్రయధన బలి ద్వారా విమోచన, దేవుని రాజ్యం క్రింద సమాధానకరమైన భూ పరదైసులో నిత్యజీవాన్ని పొందేందుకు పునరుత్థానమవ్వడం వంటి బైబిలు ప్రాథమిక బోధల్ని పునరుద్ధరించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అన్నింటికన్నా మిన్నగా, విశ్వ సర్వాధిపతిగా యెహోవా దేవుని నామంపైకి వచ్చిన నింద త్వరలోనే తొలగించబడుతుందనే విషయానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక” అనే ప్రభువు ప్రార్థనకు జవాబు వెంటనే దొరుకుతుందని బైబిలు విద్యార్థులు విశ్వసించారు. (మత్తయి 6:9, 10) శాంతికాముకులైన క్రైస్తవుల ప్రపంచవ్యాప్త సంస్థలోనికి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్లు మలచబడుతున్నారు.
12. బైబిలు విద్యార్థులు ఒక ప్రాముఖ్యమైన తారీఖును ఎలా గ్రహించారు?
12 దానియేలు 4వ అధ్యాయాన్నీ, మరితర ప్రవచనాల్నీ లోతుగా అధ్యయనం చేయడం, మెస్సీయా రాజుగా యేసు ప్రత్యక్షత త్వరలోనే రానైవుందని బైబిలు విద్యార్థుల్ని ఒప్పింపచేసింది. 1914 “అన్యజనముల కాలములు” ముగిసిపోయే నిర్ణీత తేదీ అవుతుందన్న విషయాన్ని వాళ్లు గ్రహించారు. (లూకా 21:24; యెహెజ్కేలు 21:26, 27) బైబిలు విద్యార్థులు, అమెరికా అంతటా ‘క్లాసులను’ (తర్వాత అవి సంఘాలు అని పిలువబడ్డాయి) ఏర్పాటుచేసి, తమ కార్యకలాపాల్ని వేగంగా విస్తృతపర్చారు. మరో శతాబ్దంలోకి అడుగుపెట్టేటప్పటికి వారి బైబిలు విద్యా కార్యక్రమం, యూరప్ ఆస్ట్రలేషియా దేశాల్లోనికి విస్తృతపర్చబడింది. మంచి సంస్థీకరణ ఆవశ్యకమైంది.
13. బైబిలు విద్యార్థులు చట్టపరమైన ఏ హోదాను పొందారు, సొసైటీ మొదటి అధ్యక్షుడు ఏ విశిష్టమైన సేవను చేశారు?
13 బైబిలు విద్యార్థులకు చట్టబద్ధమైన హోదాను కల్పించడానికి, పెన్సిల్వేనియానందలి పిట్స్‌బర్గ్‌లో ప్రధాన కార్యాలయాలతో జయన్స్ వాచ్ టవర్ ట్రాక్ట్ సొసైటీ అమెరికాలో 1884లో రిజిస్ట్రేషన్ చేయబడింది. దాని డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్య ప్రచారపనిని పర్యవేక్షిస్తూ కేంద్రీయ పరిపాలక సభగా పని చేశారు. సొసైటీ మొదటి అధ్యక్షుడైన చార్లెస్ టి. రస్సెల్ లేఖనాలపై అధ్యయనాలు (ఆంగ్లం) అనే పేరుగల ఆరు సంపుటులను రచించి, ప్రకటించడానికి విస్తృతంగా పర్యటించారు. ఆయన తన బైబిలు అధ్యయనాల్ని ప్రారంభించడానికి ముందు తాను కూడబెట్టుకున్న ధనాన్ని ప్రపంచవ్యాప్త రాజ్య పనికి విరాళంగా ఇచ్చాడు కూడా. ఐరోపాలో మహా సంగ్రామం ముమ్మరంగా జరుగుతుండగా 1916లో, బాగా అలసిపోయిన రస్సెల్ తాను చేస్తున్న ప్రచార ప్రయాణంలో మరణించారు. దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యమిచ్చే పనిని విస్తృతపర్చడానికి ఆయన తనకున్న సమస్తాన్ని ఇచ్చారు.
14. జె. ఎఫ్. రూథర్‌ఫర్డ్ ఎలా ‘మంచి పోరాటాన్ని పోరాడారు’? (2 తిమోతి 4:7)
14 మిస్సోరిలో తాత్కాలిక జడ్జిగా పనిచేసిన రూథర్‌ఫర్డ్ తర్వాతి అధ్యక్షుడయ్యాడు. ఆయన బైబిలు సత్యం తరుపున నిర్భయంగా వాదించిన ఫలితంగా, “కట్టడవలన కీడు కల్పిం”చేందుకు క్రైస్తవమత సామ్రాజ్యపు గురువుల శక్తులు రాజకీయశక్తులతో చేతులు కలిపాయి. అనేకసార్లు పునరావృతమయ్యేలా 10 ఏళ్లపాటు లేదా 20 ఏళ్లపాటు శిక్షతో 1918 జూన్ 21న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌నీ, నడిపింపును ఇస్తున్న మరితర ఏడుగురు బైబిలు విద్యార్థులనూ జైలులో పెట్టారు. దాన్ని అడ్డగించడానికి బైబిలు విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. (కీర్తన 94:20; ఫిలిప్పీయులు 1:7) అప్పీలుపైన వాళ్లు 1919 మార్చి 26న విడుదల చేయబడ్డారు, వాళ్లపై మోపిన తప్పుడు నిందల నుండి పూర్తిగా బయటపడ్డారు.b సత్యం కోసం బలంగా వాదించేవారిగా వారిని మలచడానికి ఆ అనుభవం పనిచేసింది. మహా బబులోను ఎంత వ్యతిరేకించినా సువార్తను ప్రకటించేందుకు చేసే ఆధ్యాత్మిక పోరాటంలో విజేతలవ్వడానికి వాళ్లు యెహోవా సహాయంతో తాము చెయ్యగల్గినదంతా చేశారు. ఆ పోరాటం ఈ 1999వ సంవత్సరం వరకూ కొనసాగుతూనే ఉంది.—పోల్చండి మత్తయి 23వ అధ్యాయం; యోహాను 8:38-47.
15. చరిత్రాత్మకంగా 1931వ సంవత్సరం ఎందుకు ప్రాముఖ్యమైంది?
15 పందొమ్మిది వందల ఇరవైలలోనూ, ముఫ్పైలలోనూ మహాగొప్ప కుమ్మరి నిర్దేశకత్వంలో దేవుని అభిషిక్త ఇశ్రాయేలు మలచబడుతూనే ఉంది. యెహోవా దేవునికి ఘనతనిస్తూ, యేసు మెస్సీయా రాజ్యంపై కేంద్రీకరిస్తూ లేఖనాల్లో నుండి ప్రవచనాత్మక వెలుగు ఉదయించింది. యెహోవాసాక్షులు అన్న తమ క్రొత్త పేరును స్వీకరించేందుకు 1931లో బైబిలు విద్యార్థులు ఎంతో సంతోషించారు.—యెషయా 43:10-12; మత్తయి 6:9, 10; 24:14.
16. లక్షా నలభై నాలుగు వేల మంది పూర్తి సంఖ్య ఎప్పుడు పూర్తైంది, దానికి ఏ నిదర్శనం ఉంది? (పందొమ్మిదవ పేజీలో ఉన్న బాక్సును చూడండి.)
16 ‘పిలువబడినవారూ, యేర్పరచబడినవారూ, నమ్మకమైనవారూ’ అయిన 1,44,000 మంది సంఖ్య 1930లలో పూర్తైనట్టు కనబడింది. (ప్రకటన 17:14; 19వ పేజీలో ఉన్న బాక్సును చూడండి.) మొదటి శతాబ్దంలో ఎంతమంది అభిషిక్తులు సమకూర్చబడ్డారో, శతాబ్దాలపాటు సాగిన క్రైస్తవ మత సామ్రాజ్య మహా భ్రష్టత్వపు అంధకార సమయాల్లో ‘గురుగుల్లో’ నుండి ఎంత మంది సమకూర్చబడ్డారో మనకు తెలియదు. కానీ 1935లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 56,153 మంది ప్రచారకుల శిఖరాగ్రపు మొత్తం సంఖ్యలో 52,465 మంది ప్రచారకులు జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగంవహించడం ద్వారా తమ పరలోక నిరీక్షణను సూచించారు. ఇంకనూ సమకూర్చబడాల్సిన అనేకమంది గమ్యస్థానం ఏమై ఉంటుంది?
‘ఇదిగో గొప్ప సమూహము’
17. ఏ చరిత్రాత్మక పురోభివృద్ధి 1935లో జరిగింది?
17 అమెరికాలోని వాషింగ్‌టన్ డి.సి.లో 1935 మే 30 నుండి జూన్ 3 వరకూ జరిగిన ఒక సమావేశంలో, “గొప్ప సమూహము” అన్న పేరుగల ఒక మలుపురాయి వంటి ప్రసంగాన్ని సహోదరుడు రూథర్‌ఫర్డ్ ఇచ్చారు. “యెవడును లెక్కింపజాలని” ఆ గుంపు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులైన 1,44,000 మంది తుది ముద్ర పూర్తవుతుండగా కనబడుతుంది. వాళ్లు కూడా “గొఱ్ఱెపిల్ల”యైన యేసు ‘రక్తానికున్న’ విమోచించే శక్తినందు విశ్వాసాన్నుంచి, ఆరాధన కోసం చేయబడిన యెహోవా ఆలయ ఏర్పాటులో పవిత్ర సేవను చెల్లిస్తాయి. ఒక గుంపుగా వాళ్లు, “మరణము ఇక ఉండ”ని భూ పరదైసును స్వతంత్రించుకునేందుకు సజీవంగా ‘మహాశ్రమలను’ దాటి వస్తారు. ఆ సమావేశం జరగడానికి కొన్ని సంవత్సరాల క్రిందటి నుండీ, ఆ గుంపు యెహోనాదాబులుగా పిలువబడింది.—ప్రకటన 7:9-17; 21:4; యిర్మీయా 35:9, 10.
18. ఏ యే రీతుల్లో 1938వ సంవత్సరం ఎంతో ప్రాముఖ్యమైన సంవత్సరం?
18 ఆ రెండు గుంపుల్నీ స్పష్టంగా గుర్తించడంలో 1938వ సంవత్సరం ఎంతో ప్రాముఖ్యమైంది. కావలికోట (ఆంగ్లం) మార్చి 15, ఏప్రిల్ 1, 1938 సంచికలు “ఆయన మంద” అనే రెండు భాగాలుగల పఠన శీర్షికను ప్రచురించి, అభిషిక్త శేషానికీ, దాని సహవాసులైన గొప్ప సమూహానికీ ఉన్న సంబంధిత స్థానాల్ని స్పష్టపర్చాయి. ఆ తర్వాత జూన్ 1, జూన్ 15 సంచికలలో యెషయా 60:17వ వచనం ఆధారంగా “సంస్థ” అన్న అంశంపై పఠన శీర్షికలు ప్రచురించబడ్డాయి. స్థానిక సేవకులను నియమించేందుకు పరిపాలక సభను అభ్యర్థించమని సంఘాలన్నీ కోరబడ్డాయి, ఆ విధంగా మెరుగుపర్చబడ్డ, దైవనియమితమైన, దైవపాలనా ఏర్పాటు పరిచయం చేయబడింది. సంఘాలు అలానే చేశాయి.
19. ‘వేరే గొఱ్ఱెలకు’ ఇవ్వబడుతున్న సాధారణ పిలుపు, ఇప్పటికి 60 సంవత్సరాలకు పైబడి కొనసాగుతూనే ఉందని ఏ వాస్తవాలు ధ్రువపరుస్తున్నాయి? (పాదవచనము చూడండి.)
19 పందొమ్మిది వందల ముప్ఫైతొమ్మిది యెహోవాసాక్షుల వార్షిక పుస్తకములోని (ఆంగ్లం) రిపోర్టు ఇలా తెలియజేసింది: “ఇప్పుడు భూమిపై ఉన్న క్రీస్తుయేసు అభిషిక్త అనుచరులు సంఖ్యాపరంగా చూస్తే తక్కువమంది, వారి సంఖ్య ఇక ఎన్నటికీ పెరగదు. వాళ్లు, దేవుని సంస్థయైన సీయోను సంతానంలో ‘శేషించినవారి’గా లేఖనాల్లో గుర్తించబడ్డారు. (ప్రక. 12:17) ‘గొప్ప సమూహము’గా రూపొందించబడే తన ‘వేరే గొఱ్ఱెల్ని’ ప్రభువు ఇప్పుడు తన కోసం సమకూర్చుకుంటున్నాడు. (యోహా. 10:16) ఇప్పుడు సమకూర్చబడుతున్నవారు అభిషిక్త శేషపు సహవాసులు. వారు శేషంతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటి నుండి, ‘వేరే గొఱ్ఱెలు’గా రూపొందించబడుతున్న వాళ్లు, ‘గొప్ప సమూహము’ సమకూర్చబడేంతవరకూ సంఖ్యాపరంగా పెరుగుతారు.” గొప్ప సమూహము సమకూర్చబడడం విషయంలో శ్రద్ధ తీసుకునేలా అభిషిక్త శేషము మలచబడింది. గొప్ప సమూహం కూడా ఇప్పుడు మలచబడాలి.c
20. పందొమ్మిది వందల నలభైరెండు నుండీ సంస్థాగతమైన ఏ మార్పులు చేయబడుతూ వచ్చాయి?
20 రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్నప్పుడు అంటే, 1942 జనవరిలో జోసెఫ్ రూథర్‌ఫర్డ్ మరణించారు, అధ్యక్షునిగా ఆయన స్థానంలోకి నేథన్ నార్ వచ్చారు. సంఘాల్లో దైవపరిపాలనా పాఠశాలల్నీ, మిషనరీలకు తర్ఫీదును ఇచ్చేందుకు గిలియడ్ పాఠశాలనూ స్థాపించడం విషయంలో సొసైటీ మూడవ అధ్యక్షుడ్ని ఎంతో మక్కువతో జ్ఞాపకం చేసుకుంటాం. 1944లో జరిగిన సొసైటీ వార్షిక మీటింగ్‌లో, వస్తుపరంగా ఇచ్చే విరాళాల ఆధారంగాగాక ఆధ్యాత్మికత ఆధారంగా సభ్యత్వం ఇవ్వబడేలా సొసైటీ చార్టర్ నవీకరించబడుతుందని ఆయన ప్రకటించారు. ఆ తర్వాతి 30 ఏళ్ల కాలంలో, ప్రపంచవ్యాప్తంగా క్షేత్ర పనివారల సంఖ్య 1,56,299 మంది నుండి 21,79,256 మంది వరకూ పెరిగింది. 1971-75 సంవత్సరాల్లో సంస్థాపరంగా మరిన్ని మార్పులు అవసరమయ్యాయి. అధ్యక్షునిగా సేవ చేస్తున్న ఒక్క వ్యక్తి, ప్రపంచ వ్యాప్త రాజ్య పనికి సమగ్రమైన పర్యవేక్షణను ఇవ్వడం ఇక ఎంత మాత్రం సాధ్యంకాదు. వంతులవారీగా ఒక్కొక్కరు చొప్పున చైర్మన్‌గా బాధ్యత చేపట్టే పరిపాలక సభ, 18 మంది అభిషిక్త సభ్యులు ఉండేలా విస్తరించబడింది. వారిలో దాదాపు సగంమంది ఇప్పటికల్లా భూ జీవితాన్ని పూర్తిచేశారు.
21. రాజ్యం కోసం చిన్నమందలోని సభ్యుల్ని అర్హుల్నిగా చేసినదేది?
21 చిన్నమందకు చెందిన శేషించబడిన సభ్యులు, అనేక దశాబ్దాలపాటు అనుభవించిన శోధనలచే మలచబడ్డారు. స్పష్టంగా ‘ఆత్మ సాక్ష్యాన్ని’ పొందినవారై, వాళ్లు ధైర్యంగా ఉన్నారు. వారికి యేసు ఇలా చెప్పాడు: “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.”—రోమీయులు 8:16, 17; లూకా 12:32; 22:28-30.
22, 23. చిన్నమందా, వేరే గొఱ్ఱెలూ ఎలా మలచబడుతున్నాయి?
22 భూమిపై ఉన్న ఆత్మాభిషిక్తుల సంఖ్య తగ్గిపోతుండగా, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నింటిపైనా ఆధ్యాత్మిక పర్యవేక్షణ గొప్ప సమూహంలోని పరిణితిచెందిన సహోదరులకు ఇవ్వబడింది. వృద్ధులైన చివరి అభిషిక్త సాక్షులు తమ భూసంబంధమైన జీవితాన్ని పూర్తిచేసేటప్పటికి, వేరే గొఱ్ఱెలకు చెందిన రాజసంబంధమైన సారీమ్ భూమిపై అధిపతి తరగతిగా కార్యనిర్వాహక కర్తవ్యాల్ని నిర్వర్తించేలా మంచి తర్ఫీదును పొందుతారు.—యెహెజ్కేలు 44:3; యెషయా 32:1, NW.
23 ఘనత కోసం ఉపయోగపడే పాత్రలుగా చిన్నమందా, వేరే గొఱ్ఱెలూ ఒకేలా మలచబడుతూ ఉన్నారు. (యోహాను 10:14-16) మన నిరీక్షణ ‘క్రొత్త ఆకాశము’పైన ఉన్నా లేక ‘క్రొత్త భూమి’పైన ఉన్నా సరే, “నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను” అని యెహోవా ఇచ్చిన ఆహ్వానానికి మనం హృదయపూర్వకంగా ప్రతిస్పందిద్దాం. (యెషయా 65:17, 18) ‘బలాధిక్యత’చే అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తిచే మలచబడినవారమై, బలహీన మానవులమైన మనం ఎల్లవేళలా వినమ్రంగా సేవచేద్దాం.—2 కొరింథీయులు 4:7; యోహాను 16:13.
[అధస్సూచీలు]
a ప్రాచీనకాల ఇశ్రాయేలుకు ఛాయారూపంగా ఉన్న భ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యం, యెహోవా నుండి అదే తీర్పుతో హెచ్చరించబడుతుంది.—1 పేతురు 4:17, 18.
b బైబిలు విద్యార్థులను బెయిలుపై విడుదల చేయడానికి నిరాకరించిన రోమన్ క్యాథోలిక్ జడ్జి మాన్‌టన్, అటు తర్వాత లంచగొండి అని రుజువైనందున అతనికి జైలు శిక్ష విధించబడింది.
c 1938లో ప్రపంచ వ్యాప్తంగా 73,420మంది జ్ఞాపకార్థ కూటానికి హాజరయ్యారు. వారిలో 53 శాతం మంది అంటే 39,225 మంది చిహ్నాల్లో భాగంవహించారు. 1998 నాటికి హాజరైనవారి సంఖ్య 1,38,96,312 కాగా, 8,756 మంది మాత్రమే చిహ్నాల్లో భాగంవహించారు. అంటే భాగంవహించిన వారి సంఖ్య సగటున ప్రతీ పది సంఘాలకూ 1కన్నా తక్కువన్న మాట.
మీరు జ్ఞాపకానికి తెచ్చుకుంటారా?
◻ తన తండ్రిచే మలచబడడానికి అంగీకరించే విషయంలో యేసు ఏవిధంగా మనకు మాదిరికర్తయై ఉన్నాడు?
◻ ప్రాచీన ఇశ్రాయేలులో ఏ విధమైన మలచబడడం జరిగింది?
◻ ‘దేవుని ఇశ్రాయేలు’ ఇప్పటి వరకూ ఎలా మలచబడింది?
◻ ‘వేరే గొఱ్ఱెలు’ ఏ సంకల్పం కోసం మలచబడ్డాయి?
[18వపేజీలోనిబాక్సు]
క్రైస్తవ మత సామ్రాజ్యంలో మరింత మలచడం
ఏథెన్సు, గ్రీసుల నుండి పంపించబడిన అసోసియేటెడ్ ప్రెస్, గ్రీకు ఆర్థడాక్స్ చర్చిలో ఇటీవల నియమించబడిన పెద్దను గురించి ఈ విధంగా నివేదించింది: “అతడు శాంతి సందేశకుడై ఉండాలి. కానీ గ్రీకు ఆర్థడాక్స్ చర్చి లీడర్ యుద్ధానికి సన్నద్ధమౌతున్న ఒక జనరల్‌లా మాట్లాడుతున్నాడు.
“‘అవసరమైతే రక్తాన్ని చిందించి, బలుల్ని అర్పించేందుకు మేం సిద్ధం. ఒక చర్చిగా మేం, శాంతి కోసం ప్రార్థిస్తాం . . . కానీ పరిస్థితి డిమాండ్‌చేస్తే పవిత్ర ఆయుధాల్ని మేం ఆశీర్వదిస్తాం’ అని ఇటీవల జరిగిన కన్య మరియ స్వర్గలోక స్వీకారోత్సవ పండుగ దినాన ఆర్చిబిషప్ క్రిస్టోడులస్ అన్నాడు, ఆ రోజు గ్రీసు సైనిక ఆయుధ దినంగా కూడా ఆచరించబడింది.”
[19వపేజీలోనిబాక్సు]
“ఇక చేర్పులు లేవు!”
1970లో జరిగిన ఒక గిలియడ్ గ్రాడ్యుయేషన్‌లో వాచ్ టవర్ సొసైటీ అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయిన ఫ్రెడ్రిక్ ఫ్రాంజ్, వాళ్లలో ఉన్న భూ సంబంధమైన నిరీక్షణగల వేరే గొఱ్ఱెలకు చెందిన వాళ్లు, అభిషిక్త శేషానికి చెందినవాడినని చెప్పుకునే ఒకరికి బాప్తిస్మం ఇవ్వాల్సి ఉండవచ్చు. ఇది సంభవించగలదంటారా? బాప్తిస్మమిచ్చు యోహాను వేరే గొఱ్ఱెలకు చెందినవాడు, అతడు యేసుకూ, అపొస్తలుల్లో కొందరికీ బాప్తిస్మమిచ్చాడు అని ఆయన వివరించాడు. ఆ తర్వాత ఆయన, శేషించబడిన వారిలో అనేకమందిని సమకూర్చడం కోసం పిలుపు ఇంకా నిలిచివుందా అని పదే పదే అడిగాడు. “దానికిక చేర్పులు లేవు! 1931-35లలో ఆ పిలుపు పూర్తయింది! ఇక చేర్పులు లేవు. అయితే, జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగంవహిస్తున్న కొద్దిమంది క్రొత్త సహవాసులు ఎవరు? వాళ్లు శేషానికి చెందినవారైతే, వాళ్లు భర్తీచేయబడినవారే! వాళ్లు అభిషిక్తుల శ్రేణుల్లో అదనంగా చేర్చబడినవారుకాదుగానీ, బహుశా పడిపోయినవారి స్థానంలో భర్తీచేయబడినవారై ఉండవచ్చు.
[15వ పేజీలోని చిత్రం]
మన సేవా ఐశ్వర్యాన్ని మనమెంత విలువైందిగా పరిగణిస్తామో కదా!
[16వ పేజీలోని చిత్రం]
ప్రాచీనకాల ఇశ్రాయేలు నాశనానికి తప్ప మరిదేనికీ పనికిరాని పాత్ర అయ్యింది