క్రైస్తవ శకంలో దైవపరిపాలనా నిర్వహణ
“తన దయాసంకల్పముచొప్పున . . . పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూ[ర్చెను].”—ఎఫెసీయులు 1:8-10.
1, 2. (ఎ) సా.శ. 33లో ఆరంభమై, ‘పరలోకంలో ఉన్నవాటి’ సమకూర్పు ఎలా ముందుకు సాగింది? (బి) 1914 నుండీ అభిషిక్త క్రైస్తవులు మోషే ఏలీయాల స్ఫూర్తిని ఎలా చూపించారు?
సా. శ. 33లో ‘దేవుని ఇశ్రాయేలు’ ఉద్భవించినప్పుడు, ‘పరలోకంలో ఉన్నవాటిని’ సమకూర్చే ఈ పని ఆరంభమైంది. (గలతీయులు 6:16; యెషయా 43:10; 1 పేతురు 2:9, 10) సా.శ. మొదటి శతాబ్దానంతరం, (యేసు ‘గోధుమలు’ అని పిలిచిన) నిజ క్రైస్తవుల కంటే సాతాను విత్తిన భ్రష్టత్వపు ‘గురుగులు’ అత్యధికంగా పెరగడం మూలంగా సమకూర్చడం కుంటుపడింది. కానీ “కాలాంతం” సమీపిస్తుండగా, దేవుని ఇశ్రాయేలు మరలా కన్పించింది, అలాగే 1919లో యేసు ఆస్తులన్నిటిపైనా నియమించబడింది.a—మత్తయి 13:24-30, 36-43; 24:45-47; దానియేలు 12:4, NW.
2 మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, అభిషిక్త క్రైస్తవులు మోషే ఏలీయాలు చేసినట్లుగానే శక్తివంతమైన కార్యాల్ని చేశారు.b (ప్రకటన 11:5, 6) 1919 నుండీ వాళ్లు విద్వేషపూరితమైన లోకంలో సువార్తను ప్రకటించారు. అలా ప్రకటించడంలో వాళ్లు ఏలీయా చూపిన ధైర్యాన్ని చూపించారు. (మత్తయి 24:9-14) మోషే ప్రాచీన ఐగుప్తుపైకి దేవుని తెగుళ్లను తీసుకు వచ్చినట్లుగానే, 1922 నుండి మానవజాతిపైకి యెహోవా తీర్పులను వాళ్లు ప్రకటించారు. (ప్రకటన 15:1; 16:2-17) ఈ అభిషిక్త క్రైస్తవుల శేషం, నేడు యెహోవాసాక్షుల నూతన లోక సమాజపు మూలకేంద్రం అయ్యింది.
కార్యాచరణలో పరిపాలక సభ
3. తొలి క్రైస్తవ సంఘం బాగా సంస్థీకరించబడినదని ఏ సంఘటనలు చూపిస్తున్నాయి?
3 ప్రారంభం నుండీ, యేసు యొక్క అభిషిక్త అనుచరులు సంస్థీకరించబడ్డారు. శిష్యుల సంఖ్య పెరుగుతుండగా స్థానిక సంఘాలు స్థాపించబడి, పెద్దలు నియమించబడ్డారు. (తీతు 1:5) సా.శ. 33 తర్వాత, అధికారపూర్వక కేంద్ర పరిపాలక సభగా 12 మంది అపొస్తలులు పనిచేశారు. ఆ విధంగా, సాక్ష్యమిచ్చు పనిలో వాళ్లు నిర్భయమైన నడిపింపును తీసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 4:33, 35, 37; 5:18, 29) వాళ్లు, అవసరమైన వారికి పంచిపెట్టేందుకు ఆహార పంపిణీని వ్యవస్థీకరించారు, అలాగే ఆసక్తిగల వ్యక్తుల్ని గూర్చి సమరయ నుండి వచ్చిన నివేదికలనుబట్టి, వారిని సందర్శించడానికి పేతురు యోహానులను పంపించారు. (అపొస్తలుల కార్యములు 6:1-6; 8:6-8, 14-17) మునుపటి హింసకుడైన పౌలు ఇప్పుడు యేసు అనుచరుడని రూఢిపర్చేందుకు, బర్నబా ఆయన్ని వారి దగ్గరకు తీసుకెళ్లాడు. (అపొస్తలుల కార్యములు 9:27; గలతీయులు 1:18, 19) కొర్నేలికీ అతడి ఇంటివారికీ పేతురు బోధించిన తర్వాత, ఆయన యెరూషలేముకు తిరిగివెళ్లి, ఈ విషయంలో దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ సూచించిన వైనాన్ని అపొస్తలులకూ యూదయలోవున్న ఇతర సహోదరులకూ ఆయన వివరించాడు.—అపొస్తలుల కార్యములు 11:1-18.
4. పేతురును చంపేందుకు ఏ ప్రయత్నాలు చేయబడ్డాయి, కానీ ఆయన ప్రాణం ఎలా దక్కింది?
4 అటు తర్వాత పరిపాలక సభ క్రూరమైన దాడికి గురైంది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు, మరి దేవదూత జోక్యం చేసుకోవడం మూలంగానే ఆయన ప్రాణం దక్కింది. (అపొస్తలుల కార్యములు 12:3-11) మరి 12 మంది అపొస్తలుల్లో ఒకడుకాని మరో వ్యక్తి, యెరూషలేములో ప్రముఖ స్థానంలో మొదటిసారిగా ఇప్పుడు కన్పించాడు. పేతురు చెరసాలలో నుండి విడుదల చేయబడిన తర్వాత, మార్కు అను మారు పేరుగల యోహాను తల్లి ఇంటిలో సమకూడిన గుంపుతో ఆయనిలా చెప్పాడు: “యాకోబుకును [యేసు సహోదరుడు] సహోదరులకును ఈ సంగతులు తెలియజేయు[డి].”—అపొస్తలుల కార్యములు 12:17.
5. యాకోబు చంపబడిన తర్వాత, పరిపాలక సభ స్వరూపం ఎలా మార్చబడింది?
5 మునుపు అంటే నమ్మకద్రోహియైన అపొస్తలుడగు ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్న తర్వాత, యేసు పరిచర్యచేసిన కాలంలో ఆయనతోపాటు ఉండీ ఆయన మరణ పునరుత్థానాలను చూసిన వారిలో ఎవరో ఒకరికి అపొస్తలునిగా “అతని యుద్యోగము”ను ఇచ్చే అవసరత ఏర్పడింది. అయితే, యోహాను సహోదరుడైన యాకోబు చంపబడినప్పుడు, 12 మంది సభ్యుల్లో ఒకనిగా అతని స్థానాన్ని ఎవ్వరూ భర్తీచెయ్యలేదు. (అపొస్తలుల కార్యములు 1:20-26; 12:1, 2) ఆ విధమైన భర్తీ జరగకపోయినప్పటికీ, పరిపాలక సభకు సంబంధించిన ఇతర లేఖనాలు, ఆ సభ విస్తరించబడిందని చూపిస్తున్నాయి. యేసును అనుసరించిన అన్యులు మోషే ధర్మశాస్త్రానికి లోబడాలా వద్దా అనే వివాదం ఏర్పడినప్పుడు, దానిపై నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆ విషయాన్ని ‘యెరూషలేములోవున్న అపొస్తలుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ’ తీసుకెళ్లడం జరిగింది. (అపొస్తలుల కార్యములు 15:2, 6, 20, 22, 23; 16:4) పరిపాలక సభలో ఇప్పుడు “పెద్దలు” ఎందుకున్నారు? బైబిలు దాన్ని గురించేమీ ప్రస్తావించడంలేదు, గానీ స్పష్టమైన ప్రయోజనం ఒకటుంది. అపొస్తలులు ఒకనాటికి ఖైదు చేయబడవచ్చు లేక చంపబడవచ్చు అనే విషయాన్ని యాకోబు మరణమూ, పేతురు చెరసాలలో వేయబడ్డమూ చూపించాయి. అలాంటి అనుకొనని సంఘటనలు జరిగే సాధ్యతవుంది గనుక పరిపాలక సభ పద్ధతుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించిన అర్హులైన ఇతర పెద్దల ఉనికి, పర్యవేక్షణ నిరాటంకంగానూ ఓ క్రమంలోనూ జరుగుతుందనే విషయాన్ని రూఢిపరుస్తుంది.
6. పరిపాలక సభ అసలైన సభ్యులు యెరూషలేములో లేకపోయినప్పటికీ, ఆ పట్టణంలో ఆ సభ ఎలా కొనసాగింది?
6 దాదాపు సా.శ. 56లో పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు, ఆయన యాకోబుకు నివేదించాడు మరియు ‘పెద్దలందరూ అక్కడికి వచ్చియున్నారు’ అని బైబిలు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 21:18) ఈ కూటంలో అపొస్తలుల్ని గూర్చిన ప్రస్తావన ఎందుకు లేదు? మరలా, బైబిలేమీ చెప్పడం లేదు. సా.శ. 66కు కొంతకాలం ముందు, “హత్యోన్మాదపు కుట్రల మూలంగా ఏర్పడిన ఎడతెరిపిలేని అపాయాల్నిబట్టి, మిగిలివున్న అపొస్తలులు యూదయనుండి పారిపోయారు. కానీ వాళ్లు తమ సందేశాన్ని బోధించేందుకు, క్రీస్తు శక్తినిబట్టి దేశదేశాలకూ ప్రయాణించారు” అని చరిత్రకారుడైన యోసిబస్ అటు తర్వాత నివేదించాడు. (యోసిబస్, పుస్తకం III, V, v. 2) యోసిబస్ మాటలు ప్రేరేపిత గ్రంథంలో ఓ భాగంకావు అనే విషయం వాస్తవమే అయినప్పటికీ, అవి దానితో ఏకీభవిస్తున్నాయి. ఉదాహరణకు, సా.శ. 62 నాటికి, పేతురు యెరూషలేముకు దూరంగా బబులోనులో ఉన్నాడు. (1 పేతురు 5:13) అయినప్పటికీ, సా.శ. 56లోనూ మరి బహుశా సా.శ. 66 వరకూ పరిపాలక సభ, యెరూషలేమునందు కార్యనిర్వహణలో చురుకుగానే ఉందనే విషయం సుస్పష్టం.
ఆధునిక కాలాల్లో నిర్వహణ
7. మొదటి శతాబ్దపు పరిపాలక సభతో పోల్చితే, నేటి పరిపాలక సభ స్వరూపంలో ఏ విశిష్టమైన వైవిధ్యముంది?
7 సా.శ. 33 నుండి యెరూషలేములో శ్రమ సంభవించేంత వరకూ, పరిపాలక సభ యూదా క్రైస్తవులతోనే రూపొందించబడింది అనే విషయం సుస్పష్టం. సా.శ. 56లో పౌలు యెరూషలేమును దర్శించిన కాలంలో, అక్కడున్న యూదా క్రైస్తవుల్లో అనేకమంది “మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన” విశ్వాసాన్ని హత్తుకోవడానికి బదులుగా ఇంకా “[మోషే] ధర్మశాస్త్రమందు ఆసక్తి” కల్గివున్నారని ఆయన గ్రహించాడు.c (యాకోబు 2:1, 2; అపొస్తలుల కార్యములు 21:20-25) అలాంటి యూదులకు, పరిపాలక సభలో ఓ అన్యున్ని ఊహించుకోవడం ఎంతో కష్టమైన విషయమై ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ, ఆధునిక కాలంలో ఈ సభ రూప నిర్మాణం విషయంలో మరో మార్పు వచ్చింది. నేడిది పూర్తిగా అభిషిక్తులైన అన్య క్రైస్తవులతోనే రూపొందించబడింది, మరి యెహోవా వారి పర్యవేక్షణను ఎంతగానో ఆశీర్వదించాడు.—ఎఫెసీయులు 2:11-15.
8, 9. ఆధునిక కాలంలో పరిపాలక సభనందు ఏ పురోభివృద్ధులు జరిగాయి?
8 1884లో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా చట్టబద్ధమైన సంస్థగా స్థాపించబడినప్పటి నుండి 1972 వరకూ, సొసైటీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరక్టర్లతో పరిపాలక సభ సన్నిహితంగా సహవసించినప్పుడు, యెహోవా సంస్థలో సొసైటీ అధ్యక్షుడే గొప్ప అధికారాన్ని కల్గివుండేవాడు. యెహోవా ఆ ఏర్పాటును అంగీకరించాడని ఆ సంవత్సరాల్లో అనుభవించిన ఆశీర్వాదాలు రుజువు చేశాయి. 1972 నుండి 1975 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలక సభ సభ్యుల సంఖ్య 18 మంది వరకూ విస్తరించబడింది. విస్తరించబడిన ఈ సభకు గొప్ప అధికారాన్ని అందించినప్పుడు, ఇది మొదటి శతాబ్దంలోని ఏర్పాటుకు అతి సన్నిహితంగా ఉందని రుజువైంది. వీరిలో కొందరు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా డైరక్టర్లు కూడా.
9 1975 నుండీ ఈ 18 మంది సభ్యుల్లో అనేకమంది తమ భూ జీవితాన్ని ముగించారు. వాళ్లు లోకాన్ని జయించి, ‘యేసుతోపాటు ఆయన సింహాసనంపై కూర్చున్నారు.’ (ప్రకటన 3:21) ఈ కారణాన్నిబట్టీ, మరితర కారణాల్నిబట్టీ, పరిపాలకసభలో—1994లో చేర్చబడిన ఒకరితోపాటు కలిపి—ఇప్పుడు పదిమంది సభ్యులు ఉన్నారు. వాళ్లలో అనేకులు వయోవృద్ధులు. అయినప్పటికీ, ఈ అభిషిక్త సహోదరులు తమ బరువైన కర్తవ్యాల్ని నెరవేరుస్తుండగా, వారికి శ్రేష్ఠమైన మద్దతు ఇవ్వబడుతుంది. అలాంటి మద్దతును వాళ్లు ఎక్కడనుండి పొందారు? దేవుని ప్రజల్లో జరిగిన ఆధునిక పురోభివృద్ధిని ఓ సారి తిరగేస్తే చాలు, అవే ఆ ప్రశ్నకు జవాబుల్ని ఇవ్వగలవు.
దేవుని ఇశ్రాయేలుకు మద్దతునివ్వడం
10. ఈ అంత్యదినాల్లో యెహోవా సేవలో అభిషిక్తులతో ఎవరు చేరారు, మరి ఇదెలా ప్రవచించబడింది?
10 వెనుకటికి 1884లో దేవుని ఇశ్రాయేలుతో సహవసించిన వాళ్లంతా దాదాపుగా అభిషిక్త క్రైస్తవులే. అయినప్పటికీ క్రమేణా, మరో గుంపు కన్పించనారంభించింది, ఈ గుంపు 1935లో, ప్రకటన 7వ అధ్యాయంలోవున్న “గొప్ప సమూహము”గా గుర్తించబడింది. భూ సంబంధమైన నిరీక్షణను కల్గివున్న వీరు, క్రీస్తునందు యెహోవా సమకూర్చాలని సంకల్పించిన ‘భూమిమీద ఉన్న’ వాటికి ప్రాతినిథ్యం వహించారు. (ఎఫెసీయులు 1:10) వీళ్లు, గొఱ్ఱెల దొడ్డిని గూర్చిన యేసు ఉపమానంలోని ‘వేరే గొఱ్ఱెలకు’ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (యోహాను 10:16) 1935 నుండీ, వేరే గొఱ్ఱెలు యెహోవా సంస్థలోనికి సమకూర్చబడ్డాయి. వాళ్లు “మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి” వస్తున్నారు. (యెషయా 60:8) గొప్ప సమూహంలోని పెరుగుదలనుబట్టీ, అభిషిక్త తరగతికి చెందిన అనేకమంది తమ భూ సంబంధమైన జీవితాన్ని మరణమందు ముగించడం మూలంగా ఏర్పడిన తరుగుదలనుబట్టీ గొప్ప సమూహంలో అర్హులైనవారు క్రైస్తవ కార్యక్రమాల్లో అత్యధికమైన పాత్రను నిర్వహించడం ప్రారంభించారు. ఏయే రీతుల్లో?
11. మొదట అభిషిక్తులకు మాత్రమే పరిమితమైన ఏ ఆధిక్యతలు వేరే గొఱ్ఱెలకు ఇవ్వబడ్డాయి?
11 యెహోవా గుణాతిశయాలను ప్రచురించడం దేవుని ‘పరిశుద్ధ జనాంగానికి’ ఎల్లప్పుడూ ఓ ప్రత్యేకమైన కర్తవ్యంగా ఉంది. ఈ కర్తవ్యం ఆలయంలో అర్పించే యాగమని పౌలు అన్నాడు, ‘రాజులైన యాజకసమూహంగా’ ఉండబోయే వారికి ప్రకటించి బోధించే నియామకాన్ని యేసు అప్పగించాడు. (నిర్గమకాండము 19:5, 6; 1 పేతురు 2:4, 9; మత్తయి 24:14; 28:19, 20; హెబ్రీయులు 13:15, 16) అయినప్పటికీ, కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 1, 1932 సంచిక, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని యెహోనాదాబు ద్వారా సూచించబడిన వారిని ప్రత్యేకంగా ప్రోత్సహించింది. నిజానికి, అలాంటి వేరే గొఱ్ఱెల్లోని అనేకమంది అప్పటికే అలా చేస్తున్నారు. నేడు, ‘రాత్రింబగళ్లు దేవుని ఆలయములో ఆయనకు చెల్లిస్తున్న’ తమ పవిత్రమైన సేవలో ఓ ప్రముఖమైన భాగంగా, దాదాపు ప్రచారపు పని యావత్తూ వేరే గొఱ్ఱెలచే చేయబడుతూ ఉంది. (ప్రకటన 7:15) అదే విధంగా, యెహోవా ప్రజల ఆధునిక చరిత్ర యొక్క తొలి కాలాల్లో, యేసు కుడిచేతిలో ఉన్న ‘నక్షత్రాలైన’ అభిషిక్త క్రైస్తవులే సంఘ పెద్దలుగా ఉండేవారు. (ప్రకటన 1:16, 20) కానీ వేరే గొఱ్ఱెలకు చెందినవారిలో అర్హులైనవారు, కంపెనీ సేవకులుగా (సంఘ పైవిచారణకర్తలుగా) ఉండగలరని కావలికోట (ఆంగ్లం) మే 1, 1937 సంచిక ప్రకటించింది. అభిషిక్త పురుషులు అందుబాటులో ఉన్నప్పటికీ, వారొకవేళ ఈ బాధ్యతను నిర్వర్తించలేనట్లయితే, వేరే గొఱ్ఱెల్ని ఉపయోగించవచ్చు. నేడు, దాదాపు అన్ని సంఘాలకు చెందిన పెద్దలు, వేరేగొఱ్ఱెలకు చెందినవారే.
12. వేరే గొఱ్ఱెల్లో అర్హులైనవారు బరువైన సంస్థీకరణ బాధ్యతల్ని స్వీకరించేందుకు ఏ లేఖనాధారిత గత సంఘటనలు ఉన్నాయి?
12 వేరే గొఱ్ఱెలకు అలాంటి బరువైన బాధ్యతల్ని ఇవ్వడం అనుచితమైన విషయమా? కాదు, ఇది చారిత్రక సంఘటనల్ని పోలివుంది. ప్రాచీన ఇశ్రాయేలులో విదేశీయులైన యూదామత ప్రవిష్టులు కొందరు (కాందిశీకులు) ప్రముఖ స్థానాల్లో ఉంచబడ్డారు. (2 సమూయేలు 23:37, 39; యిర్మీయా 38:7-9) బబులోను చెరనుండి విడుదలైన తర్వాత, ఇంతకు మునుపు లేవీయులకు మాత్రమే పరిమితమైన ఆలయ సేవాధిక్యతలు, నెతీనీయుల్లో అర్హులైనవారికి (ఇశ్రాయేలీయులుకాని ఆలయ సేవకులకు) అప్పగించబడ్డాయి. (ఎజ్రా 8:15-20; నెహెమ్యా 7:60) అంతేగాకుండా, యేసుతోపాటు రూపాంతర దర్శనంలోవున్న మోషే, మిద్యానీయుడైన యిత్రో ఇచ్చిన శ్రేష్ఠమైన సలహాను అంగీకరించాడు. తర్వాత అరణ్యంగుండా వెళ్లడానికి తమకు మార్గనిర్దేశాన్ని ఇవ్వమని యిత్రో కుమారుడైన హోబాబును ఆయన అడిగాడు.—నిర్గమకాండము 18:5, 17-24; సంఖ్యాకాండము 10:29.
13. వేరే గొఱ్ఱెల్లో అర్హులైనవారికి బాధ్యతల్ని వినమ్రపూర్వకంగా అప్పగించడంలో అభిషిక్తులు ఎవరి శ్రేష్ఠమైన స్ఫూర్తిని అనుకరిస్తున్నారు?
13 మోషే అరణ్యంలో గడిపిన 40 ఏళ్ల చివరలో, తాను వాగ్దాన దేశంలోనికి వెళ్లనని ఎరిగినవాడై, వారసున్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాడు. (సంఖ్యాకాండము 27:15-17) ప్రజలు అందరి ఎదుటా యెహోషువను నియమించమని యెహోవా మోషేతో చెప్పినప్పుడు, ఆయనప్పటికింకా శారీరకంగా దృఢంగానేవుండి, ఇశ్రాయేలీయుల్ని సేవించడం నుండి వెనువెంటనే వైదొలగకపోయినప్పటికీ అలాగే చేశాడు. (ద్వితీయోపదేశకాండము 3:28; 34:5-7, 9) అలాంటి వినమ్రపూర్వకమైన స్ఫూర్తితోనే అభిషిక్తులు, వేరేగొఱ్ఱెల్లో అర్హులైన పురుషులకు అత్యధికమైన ఆధిక్యతల్ని ఇప్పటికే అప్పగించారు.
14. వేరే గొఱ్ఱెల పెరుగుతున్న సంస్థీకరణ పాత్రను ఏ ప్రవచనాలు సూచిస్తున్నాయి?
14 సంస్థాగతంగా పెరుగుతున్న వేరే గొఱ్ఱెలపాత్ర, ప్రవచనాత్మక విషయాంశం కూడా. ఇశ్రాయేలీయుడుకాని ఫిలిష్తీయుడు “యూదా వారిలో ఓ షేక్‌వలె” ఉంటాడని జెకర్యా ప్రవచించాడు. (జెకర్యా 9:6, 7, NW) షేక్‌లు గోత్ర నాయకులు గనుకనే, ఇశ్రాయేలీయుల మునుపటి శత్రువు సత్యారాధనను హత్తుకొని వాగ్దాన దేశంలో గోత్ర నాయకునివలె అవుతాడని జెకర్యా తెలియజేస్తున్నాడు. అంతేగాకుండా, దేవుని ఇశ్రాయేలును సంబోధించినప్పుడు, యెహోవా ఇలా తెలియజేశాడు: “అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు మీరు యెహోవాకు యాజకులనబడుదురు—వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు.” (యెషయా 61:5, 6) ‘అన్యులూ,’ ‘పరదేశులూ’ వేరే గొఱ్ఱెలైవున్నారు. వీళ్లకు, వయోవృద్ధులైన అభిషిక్త శేషం తమ భూ సంబంధమైన జీవితాన్ని ముగించి ‘దేవుని పరిచారకులుగా’ సింహాసనాసీనుడైన యెహోవా చుట్టూవుండి పూర్ణ భావంలో “యెహోవా”ను పరలోక ‘యాజకులుగా’ సేవించేందుకు వెళ్లినప్పుడు, మరింత పనిని చేపట్టేగల్గేలా బాధ్యతల్ని అప్పగించడమైంది.—1 కొరింథీయులు 15:50-57; ప్రకటన 4:4, 9-11; 5:9, 10.
“పుట్టబోవు . . . తరము”
15. ఈ కాలాంతంలో, క్రైస్తవుల ఏ గుంపు ‘వృద్ధాప్యానికి’ చేరుకుంది, మరి ఏ గుంపు ‘పుట్టబోవు తరానికి’ ప్రాతినిధ్యం వహిస్తుంది?
15 విస్తరించబడిన బాధ్యతల్నిబట్టి వేరే గొఱ్ఱెలకు తర్ఫీదును ఇచ్చేందుకు అభిషిక్త శేషం ఆతృతగావుంది. కీర్తన 71:18 ఇలా చెబుతోంది: “దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.” ఈ వచనంపై వ్యాఖ్యానిస్తూ, డిశంబరు 15, 1948 కావలికోట (ఆంగ్లం) అభిషిక్త క్రైస్తవుల సంఘం నిశ్చయంగా వృద్ధాప్యానికి చేరుకుందని సూచించింది. అభిషిక్తులు “బైబిలు ప్రవచనపు వెలుగులో ఓ క్రొత్త తరాన్ని చూడ్డానికి” సంతోషదాయకంగా “ఎదురు చూస్తున్నారని” తెలియజేసింది. ఇది, ప్రత్యేకంగా ఎవరిని సూచిస్తోంది? కావలికోట ఇలా తెలియజేసింది: “యేసు వారిని తన ‘వేరే గొఱ్ఱెలని’ తెలియజేశాడు.” ‘పుట్టబోవు తరం,’ పరలోక రాజ్యంచే పరిపాలించబడే భూసంబంధమైన నూతన నిర్వహణ క్రింద జీవించే మానవులను సూచిస్తోంది.
16. ‘పుట్టబోవు తరం’లోని వారు ఏ ఆశీర్వాదాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు?
16 ఈ ‘వచ్చు తరమైన’ తమ సహోదరుల్ని అభిషిక్త క్రైస్తవులు అందరూ విడిచి, యేసుక్రీస్తుతోపాటు మహిమపర్చబడేందుకు వెళ్లే సమయాన్ని గూర్చి బైబిలు స్పష్టంగా తెలియజేయడం లేదు. కానీ ఈ అభిషిక్తులు, దీనికి సమయం సమీపిస్తోందని నమ్మకంగా ఉన్నారు. ‘కాలాంతాన్ని’ గూర్చిన యేసు గొప్ప ప్రవచనంలో ప్రవచించబడిన సంఘటనలు 1914 నుండి నెరవేరుతూనే ఉండి, ఈ లోక వినాశనం సమీపంలోనే ఉందని చూపిస్తున్నాయి. (దానియేలు 12:4, NW; మత్తయి 24:3-14; మార్కు 13:4-20; లూకా 21:7-24) త్వరలోనే, యెహోవా ఓ క్రొత్త లోకాన్ని స్థాపిస్తాడు. అందులో ‘పుట్టబోవు తరం’ ‘లోకం పుట్టినది మొదలుకొని తమ కొరకు సిద్ధపర్చబడిన రాజ్యాన్ని [భూ పరిధిని] స్వతంత్రించుకుంటుంది.’ (మత్తయి 25:34) పరదైసు పునరుద్ధరణనూ, హేడిస్‌నుండి పునరుత్థానులవుతున్న కోట్లాదిమందినీ చూసేందుకు వాళ్లు కుతూహలంగా ఉన్నారు. (ప్రకటన 20:13) పునరుత్థానులైన వీరిని ఆహ్వానించేందుకు అభిషిక్తులైనవారు అక్కడ ఉంటారా? వెనుకటికి 1925లో, మే 1, కావలికోట (ఆంగ్లం) ఇలా తెలియజేసింది: “దేవుడు ఏమి చేస్తాడో లేక ఏమి చేయడో అనే విషయాన్ని మనం మనకు తోచినవిధంగా చెప్పకూడదు . . . [కానీ] ప్రాచీనకాలంలో యోగ్యులైనవారి [విశ్వాసులైన క్రైస్తవ సాక్షులకు ముందున్న వారి] పునరుత్థానానికి ముందు, చర్చి సభ్యులు [అభిషిక్త క్రైస్తవులు] మహిమపర్చబడతారనే నిర్ధారణకు మనం నడిపించబడ్డాం.” అదే విధంగా, పునరుత్థానులైన వారిని ఆహ్వానించడానికి అభిషిక్తుల్లో కొందరు అక్కడ ఉంటారా అనే విషయాన్ని చర్చిస్తూ, సెప్టెంబరు 1, 1989 కావలికోట (ఆంగ్లం) ఇలా తెలియజేసింది: “అలా ఉండాల్సిన అవసరమేమీ లేదు.”d
17. ఓ గుంపుగా అభిషిక్తులు, సింహాసనాసీనుడైన రాజగు యేసుక్రీస్తుతో ఏ అద్భుతకరమైన ఆశీర్వాదాల్లో భాగం వహిస్తారు?
17 నిజమే, అభిషిక్త క్రైస్తవుల్లో ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ యేసు తీర్పుతీర్చి దాన్ని అమలు చేసినందున ‘ప్రతివానికి వాని వాని క్రియలనుబట్టి ప్రతిఫలం ఇచ్చేందుకు’ ఆయన తన మహిమతో వచ్చినప్పుడు, ఆయనతోపాటు పునరుత్థానులైన అభిషిక్త క్రైస్తవులు ఉంటారని అపేక్షించడాన్ని రూపాంతర దర్శనంలో యేసుతోపాటు మోషే ఏలీయాలు ఉండడం సూచిస్తోంది. అంతేకాకుండా, ‘జయించిన’ అభిషిక్త క్రైస్తవులు అర్మగిద్దోనులో ఆయనతోపాటు ‘ఇనుపదండముతో వారిని [జనాంగాల్ని] ఏలడంలో’ భాగం వహిస్తారని యేసు వాగ్దానం చేయడం మనకు గుర్తుంది. యేసు మహిమతో వచ్చినప్పుడు, వాళ్లు ఆయనతోపాటు ‘ఇశ్రాయేలీయులు పండ్రెండు గోత్రాల్ని తీర్పుతీర్చడానికి’ కూర్చుంటారు. యేసుతోపాటు వాళ్లు ‘సాతాన్ని తమ పాదాలక్రింద త్రొక్కుతారు.’—మత్తయి 16:27–17:9; 19:28; ప్రకటన 2:26, 27; 16:14, 16; రోమీయులు 16:20; ఆదికాండము 3:15; కీర్తన 2:9; 2 థెస్సలొనీకయులు 1:9, 10.
18. (ఎ) ‘క్రీస్తునందు పరలోకంలో సమకూర్చబడిన వాటిని’ గూర్చిన పరిస్థితి ఏమిటి? (బి) ‘క్రీస్తునందు సమకూర్చబడిన భూమిమీద ఉన్నవాటిని’ గూర్చి మనం ఏమి చెప్పగలం?
18 యెహోవా తన నిర్వహణాపరమైన విషయాల్ని భద్రపర్చడంలో ఆయన ‘సమస్తమును క్రీస్తునందు [మరలా] ఏకముగా సమకూర్చడంలో’ పురోభివృద్ధిదాయకంగా ముందుకు నడిపిస్తున్నాడు. ‘పరలోకమందున్న వాటి’ విషయానికొస్తే, ఆయన సంకల్పం సంపూర్ణం కావడానికి దగ్గరపడుతోంది. పరలోకంలో 1,44,000 మందిలోని అందరూ యేసుతోపాటు ఐక్యమయ్యేందుకు ‘గొఱ్ఱెపిల్ల వివాహం’ దగ్గర పడుతోంది. కాబట్టి, తమ అభిషిక్త సహోదరులకు మద్దతును ఇవ్వడంలో బరువైన బాధ్యతలు ‘భూమిమీద ఉన్నవియైన’ వేరే గొఱ్ఱెల్లో ఎంతో కాలం నుండి ఉన్న పరిపక్వతకు ఎదిగిన సహోదరులకు అప్పగించబడ్డాయి. ఎంతటి ఉత్తేజపూరితమైన కాలంలో మనం జీవిస్తున్నామో కదా! యెహోవా సంకల్పం దాని నెరవేర్పుదిశగా కదులుతుండడాన్ని చూడ్డం ఎంతటి ఉద్వేగభరితమైన విషయమో కదా! (ఎఫెసీయులు 1:8-10; 3:8-12; ప్రకటన 14:1; 19:6, 9) రాజైన యేసుక్రీస్తుకు విధేయత చూపించడంలోనూ, మహోన్నత విశ్వాధిపతియైన యెహోవా దేవున్ని మహిమపర్చేందుకూ ‘ఒకే కాపరి’ ఆధ్వర్యంలో ‘ఒకే మందగా’ ఈ రెండు గుంపులూ కలిసి సేవిస్తుండగా, తమ అభిషిక్త సహోదరులకు మద్దతును ఇచ్చేందుకు వేరే గొఱ్ఱెలు ఎంతగా ఆనందిస్తారో కదా!—యోహాను 10:16; ఫిలిప్పీయులు 2:9-11.
[అధస్సూచీలు]
a కావలికోట ఆగస్టు 1, 1981 (ఆంగ్లం) సంచికలో 16-26 పేజీలను చూడండి.
b ఉదాహరణకు, 1914 నుండీ, పాశ్చాత్య ప్రపంచమందంతటా, నాల్గు భాగాలుగల దృశ్య శ్రావ్య చిత్రంగా “సృష్టిని గూర్చిన ఫొటో డ్రామా” (ఆంగ్లం) ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోయిన థియోటర్లలో చూపించబడింది.
c ఎందుకు కొంతమంది యూదా క్రైస్తవులు ధర్మశాస్త్రమందు ఆసక్తి కల్గివున్నారో అనడానికిగల సంభవనీయమైన కారణాల కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 2, 1163-4 పేజీలను చూడండి.
d కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1990 30-1 పేజీలను; డిశంబరు 15, 1990 30వ పేజీని చూడండి.
మీరు వివరించగలరా?
◻ దేవుని సంస్థ మొదటి శతాబ్దంలో ఏ విధంగా ముందుకు సాగింది?
◻ యెహోవాసాక్షుల ఆధునిక చరిత్రలో పరిపాలక సభ ఏ విధంగా పురోభివృద్ధి చెందింది?
◻ ఏ లేఖనాలు యెహోవా సంస్థలో వేరే గొఱ్ఱెలకు అధికారాన్ని ఇవ్వడానికి అనుమతిస్తున్నాయి?
◻ ‘పరలోకంలో ఉన్నవీ,’ ‘భూమిమీద ఉన్నవీ’ క్రీస్తునందు ఏ విధంగా సమకూర్చబడ్డాయి?
[16వ పేజీలోని చిత్రం]
పరిపాలక సభలోని అసలైన సభ్యులు యెరూషలేములో లేకపోయినప్పటికీ, అక్కడ ఆ సభ కార్య నిర్వహణ చేయడంలో కొనసాగింది
[18వ పేజీలోని చిత్రం]
పరిపక్వతకు ఎదిగిన అభిషిక్త క్రైస్తవులు యెహోవా ప్రజలకో ఆశీర్వాదమై ఉన్నారు
సి. టి. రస్సెల్ 1884-1916
జె. ఎఫ్. రూథర్‌ఫర్డ్ 1916-42
ఎన్. ఎచ్. నార్ 1942-77
ఎఫ్. డబ్ల్యు. ప్రాన్జ్ 1977-92
ఎమ్. జి. హెన్‌షెల్ 1992-