మహాగొప్ప కుమ్మరి, ఆయన పనులు
“ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్ర[గా తయారవ్వండి].”—2 తిమోతి 2:21.
1, 2. (ఎ) దేవుని స్త్రీ పురుషుల సృష్టి ఏ విధంగా ఒక విశిష్టమైన పనియై ఉంది? (బి) మహాగొప్ప కుమ్మరి ఆదాము హవ్వలను ఏ సంకల్పం నిమిత్తం తయారుచేశాడు?
యెహోవా మహా గొప్ప కుమ్మరి. ఆయన సృష్టిలో తలమానికం మన ఆదిమ తండ్రియైన ఆదామే. బైబిలు మనకిలా చెబుతోంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను,” అంటే “ఊపిరి పీల్చే ప్రాణి ఆయెను.” (ఆదికాండము 2:7, ఆదికాండము 2:7 NW అథఃస్సూచి) మొదటి మానవ సృష్టి పరిపూర్ణమైనది, దేవుని పోలికచొప్పున సృజించబడింది, ఆయన దైవిక జ్ఞానానికీ, నీతితోకూడిన నిజమైన ప్రేమకూ, న్యాయానికీ నిదర్శనంగా నిలిచింది.
2 ఆదాము ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి, దానినుంచి మానవుని కోసం సాటియైన సహకారిని అంటే స్త్రీని దేవుడు తయారుచేశాడు. నేటి అత్యంత సౌందర్యరాశుల అందాల్ని సహితం తలదన్నేంత మిన్నయైన అందం హవ్వది. (ఆదికాండము 2:21-23) అంతేగాక, ఈ పుడమిని పరదైసుగా మార్చే తమ నియమిత ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగినరీతిలో పరిపూర్ణంగా రూపొందించబడిన శరీరాలూ, శక్తిసామర్థ్యాలూ ఆది దంపతులకు ఇవ్వబడ్డాయి. “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని” ఆదికాండము 1:28లో తెలియజేయబడిన దేవుని ఆజ్ఞను నెరవేర్చే శక్తి వారికి ఇవ్వబడింది కూడా. “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ”లో సమైక్యపర్చబడే ఆనందభరితులైన కోట్లాది మంది మానవులు, చిట్టచివరకు ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దబడే ఆ తోటలో నివసించి ఉండేవారు.—కొలొస్సయులు 3:14.
3. మన ఆది తల్లిదండ్రులు ఘనహీనమైన పాత్రలుగా ఎలా తయారయ్యారు, ఏ ఫలితంతో?
3 మహాగొప్ప కుమ్మరియైన తమ సర్వోన్నత సృష్టికర్త అధికారాన్ని ఎదిరించేందుకు మన ఆది తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఎంపికచేసుకోవడం విచారించదగ్గ విషయం. వారు చేసిన తిరుగుబాటు, యెషయా 29:15, 16లలో వివరించినట్టుగా ఇలా ఉంది: “తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జాచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ. . . . కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి—ఇతడు నన్ను చేయలేదనచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి—ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?” వారి చపలచిత్తం విపత్తును—నిత్య మరణశిక్షను తెచ్చింది. అంతేగాక, వారి నుండి ఉద్భవించిన యావత్ మానవజాతికీ పాప మరణాలు సంక్రమించాయి. (రోమీయులు 5:12, 18) మహాగొప్ప కుమ్మరి సృష్టి అందాలు, పూర్తిగా వన్నెను కోల్పోయాయి.
4. మనం ఏ ఘనమైన సంకల్పం కోసం ఉపయోగపడవచ్చు?
4 అయితే, ప్రస్తుతం మనమున్న అపరిపూర్ణ స్థితిలో సహితం, పాపియైన ఆదాము సంతానమైన మనం కీర్తన 139:14లోని మాటల్లో యెహోవాను ఇలా స్తుతించగలం: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” మహాగొప్ప కుమ్మరి మొదటి కృతి పూర్తిగా లోపభూయిష్టమైనదిగా మారిపోవడం ఎంత విచారకరమైన విషయమో గదా!
కుమ్మరి తన పనిని విస్తృతపరుస్తున్నాడు
5. మహాగొప్ప కుమ్మరి నైపుణ్యం ఏ విధంగా ఉపయోగించబడింది?
5 కుమ్మరిగా మన సృష్టికర్త నైపుణ్యం తన తొలి మానవ సృష్టిని మలచడంకన్నా విస్తృతంగా ఉపయోగించబడడం సంతోషకరమైన విషయం. అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?”—రోమీయులు 9:20, 21.
6, 7. (ఎ) ఘనహీనత కోసం మల్చబడేందుకు నేడు అనేకమంది ఏ విధంగా ఎంపిక చేసుకుంటారు? (బి) ఘనత కోసం ఉపయోగపడేందుకు నీతిమంతులు ఎలా మల్చబడుతున్నారు?
6 అవును, మహాగొప్ప కుమ్మరి చేతిపనుల్లో కొన్ని ఘనతకూ, మరి కొన్ని ఘనహీనతకూ మలచబడతాయి. భక్తిహీనత అనే మురికి కూపంలో అంతకంతకూ కూరుకుపోతున్న లోకంతోపాటు నడవడానికి ఎంపికచేసుకునే వాళ్లు, తమను నాశనానికి పాత్రులుగా గుర్తించే రీతిలో మలచబడతారు. మహిమగల రాజైన క్రీస్తుయేసు తీర్పుతీర్చడానికి వచ్చినప్పుడు అలాంటి ఘనహీనమైన పాత్రల్లో, మత్తయి 25:46లో చెబుతున్నట్లుగా ‘నిత్యశిక్షకు . . . పోబోయే’ పెడసర స్వభావంగల మేకల్లాంటి వ్యక్తులు చేరివుంటారు. కానీ “ఘనత” కోసం ఉపయోగించేందుకు మలచబడిన గొఱ్ఱెల్లాంటి ‘నీతిమంతులు నిత్యజీవాన్ని’ స్వతంత్రించుకుంటారు.
7 ఆ నీతిమంతులు దైవికంగా మలచబడేందుకు విధేయతాపూర్వకంగా అంగీకరిస్తారు. వాళ్లు దైవిక జీవిత మార్గంలోకి ప్రవేశించారు. “అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని” 1 తిమోతి 6:17-19లలో ఉన్న సలహాను వాళ్లు అంగీకరించారు. “వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై” ఉండేందుకు తమను తాము అన్వయించుకున్నారు. వారు దైవిక సత్యం ద్వారా మలచబడి, ఆదాము పాపం మూలంగా కోల్పోయిన సమస్తాన్నీ పునరుద్ధరించేందుకు “[“తత్సమానమైన,” NW] విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించు”కున్న క్రీస్తుయేసు ద్వారా యెహోవా చేసిన ఏర్పాటునందు అచంచలమైన విశ్వాసముంచుతున్నారు. (1 తిమోతి 2:6) కాబట్టి “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న [మలచబడిన] నవీనస్వభావమును ధరించుకొ”నమని పౌలు ఇచ్చిన సలహాకు మనమెంత ఇష్టపూర్వకంగా లోబడవలెనో గదా!—కొలొస్సయులు 3:9.
మీరెలాంటి పాత్రయై ఉంటారు?
8. (ఎ) ఒక వ్యక్తి ఎలాంటి పాత్ర అవుతాడో ఏది నిర్ధారిస్తుంది? (బి) ఏ రెండు కారకాలు ఒకరిని తీర్చిదిద్దుతాయి?
8 ఒక వ్యక్తి ఎలాంటి పాత్ర అవుతాడో నిర్ధారించేది ఏమిటి? అతని దృక్పథం, ప్రవర్తన. అవి హృదయపు కోరికలచే, ఆలోచనలచే మొదట తీర్చిదిద్దబడతాయి. జ్ఞానియైన సొలొమోను ఇలా అన్నాడు: “ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును.” (సామెతలు 16:9) తర్వాత అవి విన్నవాటినిబట్టీ, చూసినవాటినిబట్టీ, సహవాసాలనుబట్టీ, అనుభవాల్నిబట్టీ తీర్చిదిద్దబడతాయి. కాబట్టి “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అన్న సలహాను మనం లక్ష్యపెట్టడం ఎంత ప్రాముఖ్యం! (సామెతలు 13:20) 2 పేతురు 1:16 మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా, మనం “చమత్కారముగా కల్పించిన కథలను” లేదా నాక్స్ రోమన్ క్యాథలిక్ అనువాదం ప్రకారంగా “మనుష్యులు కల్పించిన కట్టు కథలను” అనుసరించకుండా జాగ్రత్త వహించాలి. వాటిలో, భ్రష్ట క్రైస్తవ మత సామ్రాజ్యపు బోధలూ, పండుగలూ చేరివుంటాయి.
9. మహాగొప్ప కుమ్మరిచే మల్చబడడానికి అనుకూలంగా మనమెలా ప్రతిస్పందించగలం?
9 అయితే, మన ప్రతిస్పందనకు అనుగుణంగానే దేవుడు మనల్ని మలచగలడు. దావీదు చేసిన ఈ ప్రార్థనను మనం యెహోవా ఎదుట సవినయంగా పునరుశ్చరించగలం: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము, నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్యమార్గమున నన్ను నడిపింపుము.” (కీర్తన 139:23, 24) యెహోవా, రాజ్య సందేశం ప్రకటించబడేలా చేస్తున్నాడు. మన హృదయాలు సువార్తకూ, ఆయన ఇచ్చిన మరిన్ని నిర్దేశకాలకూ ప్రశంసాపూర్వకంగా ప్రతిస్పందించాయి. సువార్త ప్రకటనా పనికి సంబంధించిన వేర్వేరు ఆధిక్యతలను తన సంస్థ ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు; వాటిని మనం గట్టిగా అంటిపెట్టుకొని, అమూల్యవైనవిగా ఎంచుదాం.—ఫిలిప్పీయులు 1:9-11.
10. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని అనుసరించే విషయంలో మనమెలా శ్రమించాలి?
10 అనుదిన బైబిలు పఠన కార్యక్రమాన్ని అనుసరిస్తూ, లేఖనాలనూ, యెహోవా సేవనూ మన కుటుంబాల్లో, స్నేహితుల మధ్యా చర్చించడానికి ఒక ఆధారంగా చేసుకుంటూ మనం దేవుని వాక్యానికి ఎడతెగని అవధానాన్ని ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యం. యెహోవాసాక్షుల ప్రతీ బేతేలు కుటుంబంలోనూ, మిషనరీ గృహాల్లోనూ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉదయకాల ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాధారణంగా ఆ కార్యక్రమంలో ఒక వారం బైబిల్లో నుండి, మరో వారం ప్రస్తుత వార్షిక పుస్తకములో నుండి కొంత భాగం చదవబడుతుంది. మీ కుటుంబం కూడా అలాంటి ఏర్పాటునే చేసుకోగలదా? క్రైస్తవ సంఘంలో, మన కూటాల్లో మన సహవాసం ద్వారా, ముఖ్యంగా వారం వారం జరిగే కావలికోట పఠనంలో భాగంవహించడం ద్వారా మనమంతా ఎంతగా ప్రయోజనాన్ని పొందుతామో గదా!
శ్రమల్ని తాళుకునేందుకు మల్చబడడం
11, 12. (ఎ) మన అనుదిన జీవితాల్లో వచ్చే శోధనల్ని గురించి యాకోబు ఇచ్చిన సలహాను మనమెలా అన్వయించుకోవచ్చు? (బి) యథార్థతను కాపాడుకునేందుకు యోబు అనుభవం మనకెలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది?
11 మన అనుదిన జీవితాల్లో, కొన్ని పరిస్థితులు తలెత్తడానికి దేవుడు అనుమతిస్తాడు. వాటిలో కొన్ని కష్టంగా ఉన్నట్టు మనకు అనిపించవచ్చు. వాటిని మనమెలా దృష్టించాలి? యాకోబు 4:8 సలహా ఇస్తున్నట్టుగా, మనం ఎన్నడూ కోపించక, మనం ‘దేవుని దగ్గరకు వచ్చే కొలదీ, ఆయన మన దగ్గరకు వస్తాడనే’ నమ్మకంతో ఆయనపై హృదయపూర్వకంగా విశ్వాసాన్నుంచి దేవునికి సన్నిహితమౌతాం. నిజమే, మనం కష్టాల్నీ, శోధనల్నీ సహించుకోవాల్సి ఉంటుంది, కానీ అవి మనం మలచబడడానికి దోహదపడేవిగా అనుమతించబడుతున్నాయి, చివరకు సంతోషకరమైన ప్రతిఫలం పొందుతాం. యాకోబు 1:2, 3లు మనకిలా అభయమిస్తున్నాయి: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.”
12 యాకోబు ఇంకా ఇలా చెబుతున్నాడు: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.” (యాకోబు 1:13, 14) మనకు అనేక శోధనలు రావచ్చు, అవి రకరకాలుగా ఉండవచ్చు. కానీ యోబు విషయంలోలానే, మనల్ని మలచడంలో అవన్నీ ఓ పాత్రను నిర్వహిస్తాయి. అయితే, యాకోబు 5:11 (పరిశుద్ధ బైబిల్)లో లేఖనాలు మనకు గొప్ప అభయాన్ని ఇస్తున్నాయి: “సహించినవారు ధన్యులని భావిస్తున్నాం. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. చివరిగా ప్రభువు అతనికి ఏం జరిగించాడో అది కూడా చూశారు. ప్రభువు జాలీ, కనికరమూ నిండినవాడు.” మహాగొప్ప కుమ్మరి చేతిలోని పాత్రలుగా, ప్రతిఫలం విషయంలో యోబు చూపించిన నమ్మకంలాంటి నమ్మకాన్ని కల్గివుండి, అన్ని వేళలా మనం యథార్థతను కాపాడుకుందాం!—యోబు 2:3, 9, 10; 27:5; 31:1-6; 42:12-15.
మన యువతను మలచడం
13, 14. (ఎ) తమ పిల్లల్ని మలచడం తల్లిదండ్రులు ఎప్పుడు మొదలుపెట్టాలి, ఏ ప్రతిఫలాన్ని దృష్టిలో ఉంచుకుని అలా చేయాలి? (బి) ఏ సంతోషకరమైన ఫలితాల్ని మీరు ప్రస్తావించగలరు?
13 శిశుప్రాయ దశనుండీ తమ పిల్లల్ని మలచడంలో తల్లిదండ్రులు భాగంవహించగల్గితే, అప్పుడు మన యువత యథార్థతను కాపాడుకునే వ్యక్తులుగా ఎంత చక్కగా తయారవ్వగలరో గదా! (2 తిమోతి 3:14, 15) శోధనలు ఎక్కువైనప్పుడు కూడా ఆ విషయం నిజమని రుజువైంది. కొన్నేళ్ల క్రిందట, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంలో హింస తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు, ఒక షెడ్ వెనుక ది వాచ్‌టవర్ పత్రికను రహస్యంగా ముద్రించడానికి సంబంధించిన వ్యవహారాల్ని ఒక నమ్మకమైన కుటుంబం చూసుకునేది. ఒక రోజున సైనికులు, సైన్యంలో బలవంతంగా చేర్చుకునేందుకు యువకుల కోసం ఇంటి ఇంటినీ గాలిస్తూ వీధి చివర నుండి వస్తున్నారు. ఆ కుటుంబంలోని ఇద్దరు యువకులకు దాక్కోడానికి తగినంత సమయం ఉంది, కానీ ఆ సైనికులు వచ్చి యువకుల కోసం వెదికితే ప్రింటింగ్ ప్రెస్ కచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అది ఆ కుటుంబమంతా హింసించబడడానికిగానీ లేదా సామూహికంగా చంపబడడానికిగానీ దారితీయవచ్చు. మరి ఏం చేయాలి? “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అని యోహాను 15:13లో ఉన్న లేఖనాన్ని ధైర్యంగా ఎత్తిచెబుతూ, ఆ ఇద్దరు యువకులూ మాట్లాడారు. వాళ్లు వరండాలోనే ఉంటామని పట్టుపట్టారు. సైనికులు వాళ్లను చూసి, సైన్యంలో చేరడానికి వాళ్లు తిరస్కరించినప్పుడు క్రూరంగా హింసిస్తారనడంలోగానీ, చివరికి చంపుతారనడంలోగానీ సందేహమేలేదు. అయితే సైనికుల సోదా అంతకుమించి ముందుకు సాగదు. ప్రింటింగ్ ప్రెస్సూ, మిగిలిన కుటుంబ సభ్యుల ప్రాణాలూ దక్కుతాయి. అయితే, అనూహ్యమైనదొకటి జరిగింది. వాస్తవానికి సైనికులు ఆ ఇంటిని విడిచిపెట్టి మిగిలిన ఇళ్లను సోదా చేశారు! ఘనత కోసం ఉపయోగించేందుకు మలచబడిన ఆ మానవ పాత్రలు, ప్రింటింగ్ ప్రెస్సుతోపాటుగా తప్పించబడ్డారు, సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారం నిర్విరామంగా ప్రచురించబడుతూనే ఉంది. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరూ, వాళ్లక్కా ఇప్పుడు బేతేలులో సేవచేస్తున్నారు; ఆ యువకుడు ఇప్పటికీ ఆ పాత ప్రింటింగ్ మిషన్‌ను ఆపరేట్ చేస్తున్నాడు.
14 ఎలా ప్రార్థించాలో పిల్లలకు నేర్పించవచ్చు, దేవుడు వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. రువాండాలో సామూహిక వధ జరుగుతున్న కాలంలో అలాంటి అనూహ్యమైన సంఘటనే ఒకటి జరిగింది. ఒక ఆరేళ్ల పాపనూ, ఆమె అమ్మానాన్నల్నీ తిరుగుబాటుదారులు చేతి బాంబులను ఉపయోగించి చంపడానికి సిద్ధపడినప్పుడు, యెహోవాకు మరింత సేవ చేయడం కోసం తమ్మును ప్రాణాపాయం నుండి తప్పించమని ఆ పాప బిగ్గరగానూ, పట్టుదలతోనూ ప్రార్థించింది. “ఈ చిన్నారి ముఖం చూసి మిమ్మల్ని చంపకుండా విడిచిపెడుతున్నాం” అని చెబుతూ హంతకులుగా మారబోయే వాళ్లు, వారిని ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్లిపోయారు.—1 పేతురు 3:12.
15. భ్రష్టుపట్టించే ఏ ప్రభావాలను గురించి పౌలు హెచ్చరించాడు?
15 మన పిల్లల్లో అనేకమందికి పైన ప్రస్తావించిన పరిస్థితివంటి క్లిష్టమైన పరిస్థితుల్ని తాళుకోవాల్సిన స్థితి రాకపోవచ్చుగానీ, వాళ్లు నేటి స్కూళ్లలోనూ, భ్రష్టుపట్టిన సమాజాల్లోనూ అనేక శోధనల్ని ఎదుర్కుంటారు: బూతు మాటల్ని మాట్లాడడం, అశ్లీల చిత్రాలు, దిగజారిన వినోదం, చెడు అభ్యాసాల్లో పాల్గొనమని స్నేహితులు చేసే ఒత్తిడి వంటివి అనేక స్థలాల్లో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అలాంటి ప్రభావాలను గురించి అపొస్తలుడైన పౌలు పదే పదే హెచ్చరించాడు.—1 కొరింథీయులు 5:6; 15:33, 34; ఎఫెసీయులు 5:3-7.
16. ఘనత నిమిత్తం ఉపయోగించే ఒక పాత్రగా ఒకరెలా తయారవ్వవచ్చు?
16 “కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప”బడే పాత్రల గురించి చెప్పిన తర్వాత, పౌలు ఇలా అంటున్నాడు: “ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును.” కాబట్టి తమ సహవాసుల విషయంలో జాగ్రత్త వహించమని మన యువతను ప్రోత్సహిద్దాం. వాళ్లు ‘యౌవనేచ్ఛలనుండి పారిపోయి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, సమాధానాన్నీ వెంటాడనివ్వండి.’ (2 తిమోతి 2:20-22) ‘ఒకరికొకరు క్షేమాభివృద్ధిని కలుగచేసుకునేందుకైన’ కుటుంబ కార్యక్రమం, మన యువతను మలచడంలో ఎంతో అమూల్యమైనది కాగలదు. (1 థెస్సలొనీకయులు 5:11; సామెతలు 22:6) తగిన సొసైటీ ప్రచురణలను ఉపయోగిస్తూ చేసే అనుదిన బైబిలు పఠనమూ, అధ్యయనమూ చక్కని సహాయకరంగా ఉండగలవు.
అందరి కోసం మలచడం
17. శిక్షణ మనల్నెలా మలుస్తుంది, ఏ ఆనందదాయకమైన ప్రతిఫలంతో?
17 మనల్ని మలచేందుకు, యెహోవా తన వాక్యం ద్వారానూ, తన సంస్థ ద్వారానూ సలహా ఇస్తున్నాడు. అలాంటి దైవిక సలహాను ఎదిరించకండి! దానికి జ్ఞానయుక్తంగా ప్రతిస్పందించండి, ఘనత నిమిత్తం యెహోవా ఉపయోగించుకునేలా ఆ సలహా మిమ్మల్ని తీర్చిదిద్దనివ్వండి. సామెతలు 3:11, 12లు ఇలా సలహా ఇస్తున్నాయి: “నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.” హెబ్రీయులు 12:5-11లలో తండ్రి కుమారునికిచ్చే సలహా ఇలా ఇవ్వబడింది: “ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షిం[చును] . . . ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయనను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” అలాంటి శిక్షణకు ప్రధానమైన మాధ్యమం, దేవుని ప్రేరేపిత వాక్యమై ఉండాలి.—2 తిమోతి 3:16, 17.
18. పశ్చాత్తాపం విషయానికి వస్తే, లూకా 15వ అధ్యాయం నుండి మనమేం నేర్చుకుంటాం?
18 యెహోవా కనికరంగలవాడు కూడా. (నిర్గమకాండము 34:6) హృదయపూర్వకమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తే, అది అత్యంత గంభీరమైన పాపమైనా సరే, ఆయన క్షమిస్తాడు. ఆధునిక కాలానికి చెందిన ‘తప్పిపోయిన కుమారులు’ సహితం, ఘనత నిమిత్తం ఉపయోగపడే పాత్రలుగా మలచబడగలరు. (లూకా 15:22-24, 32) మన పాపాలు, ఆ తప్పిపోయిన కుమారులంత గంభీరమైనవికాక పోవచ్చు. కానీ లేఖనాధార సలహాకు మనం వినయపూర్వకంగా చూపించే ప్రతిస్పందన, ఘనత నిమిత్తం ఉపయోగించబడే పాత్రలుగా తయారయ్యేలా మనం మలచబడడానికి ఎల్లవేళలా నడిపిస్తాయి.
19. యెహోవా చేతుల్లో ఘనతనుతెచ్చే పాత్రలుగా సేవచేయడం విషయంలో మనమెలా కొనసాగవచ్చు?
19 మనం సత్యాన్ని మొదట నేర్చుకున్నప్పుడు, యెహోవాచే మలచబడేందుకు మనం సుముఖతను చూపించాం. మనం లోకపు పోకడలను విడనాడి, నవీన స్వభావాన్ని ధరించనారంభించాం, సమర్పించుకొని బాప్తస్మంపొందిన క్రైస్తవులం అయ్యాం. ఎఫెసీయులు 4:20-24లలో ఉన్న సలహాకు మనం విధేయత చూపించాం: ‘మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మన ప్రాచీనస్వభావమును వదులుకొని, నీతియు యథార్థమైన భక్తియుగలవారమై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకున్నాం.’ ఆయనకు ఘనతను తెచ్చేలా ఉపయోగపడే పాత్రలుగా ఎల్లప్పుడూ సేవచేస్తూ, మహాగొప్ప కుమ్మరియైన యెహోవా చేతుల్లో సులభంగా మలచబడేలా ఉండడం విషయంలో మనం వ్యక్తిగతంగా కొనసాగుదాం!
పునః సమీక్ష
◻ మన భూమి విషయంలో మహాగొప్ప కుమ్మరి సంకల్పం ఏమిటి?
◻ ఘనత నిమిత్తం ఉపయోగపడేలా మీరు ఎలా మలచబడవచ్చు?
◻ ఏ విధంగా మన పిల్లలు మలచబడవచ్చు?
◻ శిక్షణ విషయంలో మనమే దృక్పథాన్ని తీసుకోవాలి?
[10వ పేజీలోని చిత్రం]
ఘనత నిమిత్తం ఉపయోగపడేలా మీరు మలచబడతారా లేక తిరస్కరించబడతారా?
[12వ పేజీలోని చిత్రం]
పిల్లలు శిశుప్రాయం నుండీ మలచబడవచ్చు