యెహోవాకు అంగీకృతమైన బలులను అర్పించడం
చరిత్రలోని ఒక సమయంలో, ఏదెను తోటకు తూర్పున ఉన్న ద్వారం వద్ద ఒక అసాధారణమైన అద్భుతాన్ని చూసే అవకాశముండేది.a అక్కడ, శక్తిమంతమైన కెరూబులు కాపలా కాస్తుండేవారు, వారి గంభీరమైన రూపం, దాంట్లోకి అడుగుపెట్టడానికి ఎవరూ సాహసించకూడదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాల కూడా అడుగు ముందుకు పడకుండా చేస్తుంది. రాత్రి సమయంలో చుట్టుప్రక్కల ఉన్న చెట్ల మీద పడే దాని అసాధారణమైన వెలుగు భయాన్ని పుట్టించవచ్చు. (ఆదికాండము 3:24) ఇది ఎంతో ఆసక్తికరంగానే ఉన్నా, చూపరులను చెప్పుకోదగినంత దూరంలో నిలబెట్టేది.
కయీను, హేబెలు ఆ ప్రాంతాన్ని చాలాసార్లు సందర్శించివుండవచ్చు. ఏదెను తోటకు వెలుపల ఆదాము హవ్వలకు జన్మించిన వీళ్లు, ఒకప్పుడు తమ తల్లిదండ్రులు చక్కని నీటి సదుపాయంతో పచ్చని పచ్చిక బయళ్లతో విస్తారమైన పళ్లూ కూరగాయలతో ఉన్న పరదైసులో అనుభవించిన ఆ జీవితం ఎలా ఉండేదనేది వారు కేవలం ఊహించగలరంతే. ఇప్పుడు బయటకు కనిపించే ఏదెను తోటలోని ఆ కాస్త భాగమూ సాగుచేయకుండా కలుపు మొక్కలన్నీ పిచ్చిగా పెరిగినట్లు కనిపించవచ్చు.
ఆ తోట ఆలనా పాలనా లేకుండా అలా ఎందుకు విడిచిపెట్టబడిందో, తాము ఎందుకు దాని నుండి వెళ్లగొట్టబడ్డారో ఆదాము హవ్వలు తప్పకుండా తమ పిల్లలకు వివరించి ఉండవచ్చు. (ఆదికాండము 2:17; 3:6, 23) కయీను హేబేలు ఎంత ఆశాభంగం చెందివుంటారో కదా! వాళ్లు తోటను చూడగలరు కాని దానిలోకి ప్రవేశించలేరు. వాళ్లు పరదైసుకు ఎంత దగ్గరగా ఉన్నారో అంత దూరంగానూ ఉన్నారు. అపరిపూర్ణత వారిని కలుషితం చేసేసింది, దాని గురించి కయీను లేక హేబెలు చేయగలిగింది ఏమీ లేదు.
వారి తల్లిదండ్రుల మధ్యనున్న సంబంధం పరిస్థితులను నిశ్చయంగా మెరుగుపర్చి ఉండకపోవచ్చు. హవ్వకు శిక్ష విధించేటప్పుడు, దేవుడు ఇలా చెప్పాడు: ‘నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.’ (ఆదికాండము 3:16) ప్రవచించబడినట్లుగానే, ఆదాము బహుశ తన భార్యను ఇక సహచరిగా, సహాయకురాలిగా చూడకుండా, ఆమెపై ఇప్పుడు అధికారం చెలాయించి ఉండవచ్చు. హవ్వ ఈ వ్యక్తి మీద ఆధారపడదగిన దానికన్నా ఎక్కువగా ఆధారపడి ఉండవచ్చు. ఒక వ్యాఖ్యానం ఆమె “వాంఛ”ను “జాడ్యంలాంటి ఒక కోరిక” అన్నంతగా కూడా వర్ణిస్తుంది.
వైవాహిక సంబంధమైన ఈ పరిస్థితి, తమ తల్లిదండ్రుల పట్ల ఆ పిల్లలు కల్గివుండవల్సిన గౌరవాన్ని ఎంతమేరకు ప్రభావితం చేసిందో బైబిలు చెప్పడం లేదు. అయితే, ఆదాము హవ్వలు తమ పిల్లల ఎదుట కలవరపర్చే మాదిరి ఉంచారన్నది మాత్రం సుస్పష్టం.
వేర్వేరు మార్గాలను ఎన్నుకోవడం
చివరికి, హేబెలు గొర్రెలకాపరి అయ్యాడు, కయీను వ్యవసాయాన్ని చేపట్టాడు. (ఆదికాండము 4:2) హేబెలు తన గొర్రెలను కాస్తుండగా, తన తల్లిదండ్రులు ఏదెనులో నుండి వెళ్లగొట్టబడక మునుపు ప్రవచించబడిన ఈ విశేషమైన ప్రవచనాన్ని గురించి ఆలోచించడానికి ఆయనకు తప్పకుండా ఎంతో సమయం లభించి ఉంటుందనడంలో సందేహం లేదు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదు[వు].” (ఆదికాండము 3:15) ‘సర్పము తలను చితకగొట్టబోయే సంతానాన్ని గురించిన దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది, ఆ సంతానం మడిమె మీద కొట్టడం ఎలా జరుగుతుంది?’ అని హేబెలు ఆలోచించి ఉండవచ్చు.
కొంతకాలం తర్వాత, బహుశా వాళ్లు పెద్దవాళ్లయిన తర్వాత, కయీను హేబెలు ఇద్దరూ యెహోవాకు బలి అర్పించారు. హేబెలు గొర్రెలకాపరి గనుక, ఆయన ‘తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నింటిని అర్పించడంలో’ ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. దానికి భిన్నంగా, కయీను “పొలము పంటలో కొంత” అర్పించాడు. యెహోవా హేబెలు అర్పణను లక్ష్యపెట్టాడు, కాని “కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు.” (ఆదికాండము 4:3-5) ఎందుకని?
హేబెలు “తన మందలో తొలుచూలున పుట్టిన” వాటిని అర్పించాడు గాని కయీను “పొలము పంటలో కొంత” మాత్రమే అర్పించాడు అనే వాస్తవాన్ని కొందరు ఎత్తి చూపిస్తారు. అయితే సమస్య కయీను అర్పించిన దాని నాణ్యతకు సంబంధించినది కాదు, ఎందుకంటే యెహోవా “హేబెలును అతని యర్పణను” లక్ష్యపెట్టాడు కాని “కయీనును అతని యర్పణను లక్ష్యపెట్టలేదు అని ఆ వృత్తాంతం చెబుతుంది. (ఇటాలిక్కులు మావి.) కాబట్టి యెహోవా ప్రాథమికంగా ఆరాధకుని హృదయపరిస్థితిని చూశాడు. అలా చేయడంలో, ఆయనేమి గమనించాడు? “విశ్వాసమునుబట్టి” హేబెలు తన బలి అర్పించాడని హెబ్రీయులు 11:4 చెబుతుంది. కాబట్టి హేబెలు అర్పణను అంగీకారయోగ్యమైనదిగా చేసిన విశ్వాసం కయీనుకు కొరవడిందని స్పష్టమౌతుంది.
ఈ విషయంలో, హేబెలు అర్పణలో రక్తాన్ని చిందించడం ఇమిడి ఉందన్నది గమనించదగిన విషయం. మడిమె మీద కొట్టబడే సంతానానికి సంబంధించిన దేవుని వాగ్దానానికి, జీవాన్ని బలి ఇవ్వడం అవసరమై ఉండవచ్చునని ఆయన సరిగ్గానే ఊహించివుంటాడు. ఆ విధంగా హేబెలు అర్పణ ప్రాయశ్చిత్తం కోసం చేసే ఒక విన్నపమై ఉండవచ్చు, తగిన సమయంలో దేవుడు ప్రాయశ్చిత్త బలిని అర్పిస్తాడనే నమ్మకాన్ని అది వ్యక్తపర్చింది.
దానికి భిన్నంగా, కయీను తాను అర్పించిన దాని గురించి పెద్దగా ఆలోచించి ఉండకపోవచ్చు. “అతని అర్పణ దేవుణ్ని కేవలం లబ్దిదారుగా గుర్తించడం మాత్రమే” అని 19వ శతాబ్దానికి చెందిన ఒక బైబిలు వ్యాఖ్యానకర్త సూచించాడు. “తనకూ తన సృష్టికర్తకూ మధ్యన వాస్తవంగా ఏ అవాంతరమైనా ఉన్నట్లు గానీ లేక పాపాన్ని ఒప్పుకోవలసిన అవసరత ఉన్నట్లు గానీ లేదా ప్రాయశ్చిత్తంపై ఆధారపడవలసిన అవసరత ఉన్నట్లు గానీ ఆయన గుర్తించలేదని అది స్పష్టంగా చూపించింది.”
అంతేగాక, మొదటి సంతానంగా తానే, సర్పాన్ని అంటే సాతానును నాశనం చేసే వాగ్దాన సంతానాన్నని కయీను దురహంకారంగా భావించివుండవచ్చు. తన మొదటి కుమారుని విషయంలో హవ్వకు కూడా అలాంటి ప్రగాఢమైన అభిలాషే ఉండి ఉండవచ్చు. (ఆదికాండము 4:1) అయితే, కయీనూ హవ్వా ఆశించినది అదే అయితే, వాళ్లు ఎంతో పొరపాటు పడినట్లే.
యెహోవా తాను హేబెలు అర్పణను అంగీకరించినట్టు ఎలా సూచించాడో బైబిలు చెప్పడం లేదు. పరలోకం నుండి వచ్చిన అగ్ని చేత అది కాల్చబడిందని కొందరంటారు. విషయమేదైనప్పటికీ, తన అర్పణ నిరాకరించబడిందని గుర్తించిన ‘కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు.’ (ఆదికాండము 4:5) కయీను నాశనం వైపు సాగిపోయాడు.
యెహోవా ఉపదేశము కయీను ప్రతిస్పందన
యెహోవా కయీనుతో తర్కించాడు. “నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?” అని ఆయన ప్రశ్నించాడు. తన భావాలనూ దృక్పథాలనూ పరిశీలించుకోవడానికి కయీనుకు ఇది తగినంత అవకాశాన్నిచ్చింది. యెహోవా ఇంకా ఇలా తర్కించాడు: “నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదు[వు].”—ఆదికాండము 4:6, 7. (23వ పేజీలోని బాక్సును చూడండి.)
కయీను వినలేదు. బదులుగా, ఆయన హేబెలును పొలంలోకి తీసుకువెళ్లి అతడిని చంపేశాడు. తర్వాత, హేబెలు ఎక్కడ ఉన్నాడని యెహోవా అడిగినప్పుడు, అబద్ధం చెప్పి కయీను తన పాపాన్ని అధికం చేసుకున్నాడు. “నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా” అంటూ అతడు ఎదురు జవాబిచ్చాడు.—ఆదికాండము 4:8, 9.
హేబెలు హత్యకు ముందూ ఆ తర్వాతా కూడా కయీను “సత్క్రియ” చేయడానికి నిరాకరించాడు. పాపం తన మీద ఆధిపత్యం వహించడానికే ఆయన ఎన్నుకున్నాడు, తత్ఫలితంగా, మానవ కుటుంబం నివసిస్తున్న ప్రాంతం నుండి కయీను వెళ్లగొట్టబడ్డాడు. కయీనును చంపడం ద్వారా ఎవరూ హేబెలు మరణానికి పగ తీర్చుకోకూడదని ఒక “గురుతు,” బహుశ కేవలం ఒక గంభీరమైన శాసనం స్థాపించబడింది.—ఆదికాండము 4:15.
తర్వాత కయీను ఒక నగరాన్ని కట్టించి దానికి తన కుమారుని పేరు పెట్టాడు. ఆయన వారసులు దౌర్జన్యానికి మారుపేరంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. చివరికి, నోవహు కాలంనాటి జలప్రళయం అనీతిమంతులనందరినీ నిర్మూలించినప్పుడు కయీను వంశావళి అంతమయ్యింది.—ఆదికాండము 4:17-24; 7:21-24.
కయీను హేబెలుల బైబిలు వృత్తాంతం కేవలం తీరిక వేళల్లో చదువుకోవడానికి భద్రపరచబడలేదు. బదులుగా అది “మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడిం[ది]” అంతేగాక అది “ఉపదేశించుటకును, ఖండించుటకును . . . ప్రయోజనకరమై” ఉంది. (రోమీయులు 15:4; 2 తిమోతి 3:16) ఈ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
మనకొక పాఠం
కయీను హేబెలుల వలే క్రైస్తవులు నేడు దేవునికి బలి అర్పించేందుకు ఆహ్వానించబడ్డారు—అక్షరార్థమైన దహన బలి కాదుగాని ‘దేవునికి స్తుతియాగము అంటే ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించడానికి’ ఆహ్వానించబడ్డారు. (హెబ్రీయులు 13:15) యెహోవాసాక్షులు 230 కంటే ఎక్కువ దేశాల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా, ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెరవేర్చబడుతోంది. (మత్తయి 24:14) మీరు ఆ పనిలో భాగం వహిస్తున్నారా? అలాగయితే, “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు” అని మీరు నిశ్చయత కల్గివుండవచ్చు.—హెబ్రీయులు 6:10.
కయీను హేబెలుల అర్పణలలాగే, మీ అర్పణ బాహ్య రూపాన్ని బట్టి తీర్పుతీర్చబడదు—ఉదాహరణకు, మీరు పరిచర్యలో గడిపే గంటల సంఖ్యను బట్టి తీర్పుతీర్చబడదు. యెహోవా ఇంకా లోతుగా చూస్తాడు. ఆయన “హృదయమును పరిశోధించు”చున్నాడని, చివరికి “అంతరింద్రియములను” అంటే అంతరంగ తలంపులను, భావాలను, ఒకరి వ్యక్తిత్వంలోని దృక్పథాలను “పరీక్షించు”చున్నాడని యిర్మీయా 17:10 చెబుతుంది. కాబట్టి అసలైన అంశం దృక్పథమే గాని, పరిచర్యలో గడిపే గంటల సంఖ్య కాదు. నిజంగా, ఒక అర్పణ పెద్దదైనా చిన్నదైనా అది ప్రేమచేత పురికొల్పబడిన హృదయంతో అర్పించబడినప్పుడే దాన్ని దేవుడు విలువైనదిగా దృష్టిస్తాడు.—మార్కు 12:41-44ను 14:3-9తో పోల్చండి.
అదే సమయంలో, యెహోవా కయీను అర్ధహృదయంతో అర్పించినదాన్ని లక్ష్యపెట్టనట్లే లోపంగల అర్పణలను లక్ష్యపెట్టడని మనం తెలుసుకోవాలి. (మలాకీ 1:8, 13) మీరు తనకు శ్రేష్ఠమైనది ఇవ్వాలని అంటే, మీరు మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో తన సేవ చేయాలని యెహోవా కోరుతున్నాడు. (మార్కు 12:30) మీరలా చేస్తున్నారా? అలాగైతే మీరు మీ అర్పణను సంతృప్తిగా దృష్టించేందుకు మీకు తగినంత కారణం ఉంటుంది. పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”—గలతీయులు 6:4.
కయీను హేబెలు ఒకేలా పెంచబడ్డారు. అయితే ఇద్దరూ విశేషమైన లక్షణాలు వృద్ధి చేసుకోవడానికి కాలమూ, పరిస్థితులూ అవకాశాన్నిచ్చాయి. కయీను దృక్పథం, అసూయ, పోటీ, ఆగ్రహం వంటివాటిచే ప్రభావితం చేయబడింది.
దానికి భిన్నంగా, దేవుడు హేబెలును నీతిమంతునిగా జ్ఞాపకం ఉంచుకున్నాడు. (మత్తయి 23:35) ఏదేమైనా సరే దేవుణ్ని ప్రీతిపర్చాలన్న ఆయన కృతనిశ్చయం, కృతఘ్నులైన తన కుటుంబ సభ్యులకు అంటే ఆదాము, హవ్వ, కయీనులకు ఎంతో భిన్నంగా ఉండే వ్యక్తిలా చేసింది. హేబెలు మరణించినప్పటికీ, ఆయన “మాటలాడుచున్నాడు” అని బైబిలు చెబుతుంది. దేవునికి ఆయన చేసిన నమ్మకమైన సేవ, బైబిలు నందున్న శాశ్వతమైన చారిత్రక వృత్తాంతంలో భాగమైయుంది. దేవునికి అంగీకృతమైన అర్పణలను ఎడతెగక అర్పించడం ద్వారా మనం హేబెలు మాదిరిని అనుసరిద్దాము.—హెబ్రీయులు 11:4.
[అధస్సూచీలు]
a ఏదెను తోట ఆధునిక దిన టర్కీలో తూర్పునున్న పర్వతప్రాంతాల్లో ఉండి ఉండేదని కొందరు భావిస్తున్నారు.
[23వ పేజీలోని బాక్సు]
క్రైస్తవ ఉపదేశకులకు ఒక మాదిరి
“నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?” ఈ ప్రశ్నలతో, యెహోవా కయీనుతో కనికరపూర్వకంగా తర్కించాడు. మారమని ఆయన కయీనును బలవంతం చేయలేదు ఎందుకంటే కయీను స్వేచ్ఛా చిత్తంగల ప్రాణి. (ద్వితీయోపదేశకాండము 30:19 పోల్చండి.) అయినప్పటికీ, కయీను తన తప్పుడు ప్రవర్తనను బట్టి ఎదుర్కొనవలసి వచ్చే పర్యవసానాలను సూచించడానికి యెహోవా వెనుకాడలేదు. ఆయన కయీనును ఇలా హెచ్చరించాడు: “సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదు[వు.]”—ఆదికాండము 4:6, 7.
యెహోవా కయీనును ఎంత గట్టిగా గద్దించినప్పటికీ, కయీను ఇక ‘బాగు చేయబడలేని వాడు’ అన్నట్లు యెహోవా ఆయనతో వ్యవ హరించలేదన్నది గమనించదగిన విషయం. బదులుగా, కయీను తన మార్గాలను మార్చుకుంటే ఆయన కోసం వేచివుండే ఆశీర్వాదాల గురించి ఆయన కయీనుకు చెప్పాడు, అలా చేయడానికి కయీను ఎన్నుకుంటే అతడు ఆ సమస్యను అధిగమించగలడని ఆయన విశ్వాసాన్ని కనపర్చాడు. యెహోవా ఇలా అన్నాడు, “నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా?” కయీనుకున్న హత్యా దృక్పథాన్ని గురించి కూడా ఆయన అతడినిలా అడిగాడు: ‘నీవు దానిని ఏలుదువా?’
నేడు, క్రైస్తవ సంఘంలోని పెద్దలు యెహోవా ఉదాహరణను అనుసరించాలి. తప్పు చేసిన వ్యక్తి తప్పుడు ప్రవర్తన వల్ల వచ్చే పర్యవసానాల గురించి సూటిగా చెబుతూ, 2 తిమోతి 4:2 నందు పేర్కొనబడినట్లుగా, వాళ్లు కొన్నిసార్లు ‘ఖండించాలి,’ మరియు ‘గద్దించాలి.’ అదే సమయంలో, పెద్దలు ‘బుద్ధి చెప్పాలి.’ ‘బుద్ధి చెప్పడం’ అనేదానికి ఉపయోగించబడిన పారకలేయో అనే గ్రీకు పదానికి “ప్రోత్సహించడం” అని అర్థం. “ఆ మందలింపు తీక్షణమైనది, ఖండితమైనది, లేక విమర్శనాత్మకమైనది కాదు” అని థియోలాజికల్ డిక్షనరి ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ పేర్కొన్నది. “ఓదార్పు అన్నది దానికి మరో భావం కాగలదనే విషయం అదే తలంపును సూచిస్తుంది.”
విశేషంగా, పారక్లేటోస్ అనే సంబంధిత గ్రీకు పదం చట్టసంబంధమైన విషయాల్లో ఒక సహాయకుడిని లేక న్యాయవాదిని సూచించవచ్చు. కాబట్టి, పెద్దలు సూటిగా గద్దించేటప్పుడు కూడా, ఉపదేశం అవసరమైన వ్యక్తికి తాము కేవలం సహాయకులమే గాని శత్రువులము కాదని గుర్తుంచుకోవాలి. యెహోవా వలె, పెద్దలు అనుకూల దృక్పథం కల్గివుండి, ఉపదేశం పొందుతున్న వ్యక్తి సమస్యపై ఆధిపత్యం పొందగలడన్న విశ్వాసాన్ని కనబర్చాలి.—గలతీయులు 6:1 పోల్చండి.
అయితే చివరి విశ్లేషణలో, ఆ ఉపదేశాన్ని అన్వయించుకోవడమనేది ఆ వ్యక్తి బాధ్యతే. (గలతీయులు 6:5; ఫిలిప్పీయులు 2:12) కయీను తన సృష్టికర్త ఇచ్చిన గద్దింపును అలక్ష్యం చేయడానికి ఎంపికచేసుకున్నట్లుగానే, తాము ఇచ్చే ఉపదేశాన్ని కొందరు తీసుకోరని ఉపదేశకులు కనుగొనవచ్చు. అయినప్పటికీ, పెద్దలు క్రైస్తవ ఉపదేశకులకు పరిపూర్ణ మాదిరికర్తయైన యెహోవాను అనుకరించినప్పుడు, తాము చేయవలసిన దానిని తాము చేశామనే నిశ్చయత కలిగివుండవచ్చు.