కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/1 పేజీలు 8-13
  • మీ పని అగ్నికి తాళుకొని నిలబడుతుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ పని అగ్నికి తాళుకొని నిలబడుతుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరియైన పునాదిని వేయడం
  • సరియైన వస్తువులతో కట్టడం
  • మీ పని అగ్నికి తాళుకొని నిలబడుతుందా?
  • ఎవరు బాధ్యులు?
  • మన పిల్లలలో క్రైస్తవ వ్యక్తిత్వములను నిర్మించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవాకు సన్నిహితమయ్యేందుకు ప్రజలకు సహాయం చేయటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మీ సొంత రక్షణను కొనసాగించుడి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/1 పేజీలు 8-13

మీ పని అగ్నికి తాళుకొని నిలబడుతుందా?

“ప్రతివాడు [పునాది] మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.”—1 కొరింథీయులు 3:10.

1. భావి శిష్యుల విషయంలో నమ్మకమైన క్రైస్తవులు ఏ నిరీక్షణను కల్గివుంటారు?

ఒక క్రైస్తవ జంట తమ నవజాత శిశువువంక తేరి చూస్తుంది. ఒక బైబిలు రాజ్య ప్రచారకుడొకరు విద్యార్థి ముఖంలో ఆతురతనీ, ఆసక్తినీ చూస్తారు. వేదికపైనుండి బోధిస్తున్న ఒక క్రైస్తవ పెద్ద, శ్రోతల్లో ఉన్న క్రొత్త వ్యక్తొకరు తన బైబిల్లో నుండి ఎంతో ఆత్రంగా లేఖనాల్ని చూడడాన్ని గమనిస్తాడు. యెహోవా నమ్మకమైన ఆ సేవకులు నిరీక్షణతో నిండిపోయిన హృదయాల్ని కల్గివున్నారు. ‘ఈ వ్యక్తి యెహోవాను ప్రేమించి, సేవిస్తాడా—మరి నమ్మకంగా ఉంటాడా?’ అని వాళ్లు అనుకోవడం సహజమే. అలాంటి ప్రతిఫలం దానంతటదే రాదనుకోండి. దానికి ఎంతో కృషి అవసరం.

2. అపొస్తలుడైన పౌలు బోధనాపని ప్రాముఖ్యతను గూర్చి హెబ్రీ క్రైస్తవులకు ఏ విధంగా జ్ఞాపకం చేశాడు, ఏ స్వయం పరిశీలనను చేసుకునేలా ఇది మనల్ని ప్రేరేపిస్తుంది?

2 “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యు[న్నారు]” అని అపొస్తలుడైన పౌలు రాసినప్పుడు నిపుణుడైన ఒక బోధకునిగా ఆయన, బోధించి శిష్యుల్నిచేసే పనికున్న ప్రాముఖ్యతను గూర్చి నొక్కి చెప్పాడు. (హెబ్రీయులు 5:12) ఆ మాటల్ని ఆయన ఎవరికైతే రాశాడో ఆ క్రైస్తవులు విశ్వాసులుగా ఉన్న కాలం దృష్ట్యా చూస్తే, వాళ్లు సాధించిన పురోభివృద్ధి అంతంత మాత్రమే. వాళ్లు ఇతరులకు బోధించే స్థితిలో లేకపోవడమేకాదుగానీ, సత్యాన్ని గూర్చిన ప్రాథమిక సంగతుల్ని వాళ్లకు జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు, బోధకులుగా మన సామర్థ్యాల్నీ, వాటిని మనమెలా మెరుగుపర్చుకోవచ్చుననే విషయాన్ని అప్పుడప్పుడూ మనమంతా మదింపుచేసుకోవడం మంచిది. ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. మనమేం చేయగలం?

3. (ఎ) క్రైస్తవ శిష్యుల్ని చేసే ప్రక్రియను అపొస్తలుడైన పౌలు దేనితో పోల్చాడు? (బి) క్రైస్తవ నిర్మాణకులుగా, మనకు ఏ గొప్ప ఆధిక్యత ఉంది?

3 విస్తృతార్థంగల ఒక దృష్టాంతంలో, పౌలు శిష్యుల్నిచేసే పనిని గృహ నిర్మాణ ప్రక్రియకు పోల్చాడు. “మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు” అని చెబుతూ ఆయన ప్రారంభించాడు. (1 కొరింథీయులు 3:9) కాబట్టి ప్రజలు చేరివున్న కట్టే పనిలో మనం భాగం వహిస్తాం; క్రీస్తు శిష్యులుగా తయారయ్యేలా వారికి మనం సహాయం చేస్తాం. “సమస్తమును కట్టిన”వాని జతపనివారిగా మనమలా చేస్తాం. (హెబ్రీయులు 3:3) ఎంతటి ఆధిక్యతో కదా! కొరింథీయులకు పౌలు ఇచ్చిన ప్రేరేపిత సలహా, మన పనిలో మరింత నిపుణులుగా అయ్యేందుకు మనకు ఎలా సహాయపడగలదో చూద్దాం. మరి విశేషంగా మనం మన ‘బోధనా కళ’పై కేంద్రీకరిద్దాం.—2 తిమోతి 4:2, NW.

సరియైన పునాదిని వేయడం

4. (ఎ) క్రైస్తవ పనిలో పౌలు పాత్ర ఏమిటి? (బి) మంచి పునాదులకున్న ప్రాముఖ్యత గురించి యేసుకీ, ఆయన కాలంనాటి ప్రజలకూ తెలుసని ఎందుకు చెప్పవచ్చు?

4 ఒక ఇల్లు పదికాలాలపాటు పటిష్టంగా ఉండాలంటే, దానికి మంచి పునాది అవసరం. అందుకే, పౌలు ఇలా రాశాడు: “దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని.” (1 కొరింథీయులు 3:10) అలాంటి దృష్టాంతాన్నే ఉపయోగిస్తూ, పెను తుఫాను తాకిడికి తట్టుకొని నిలబడిన ఒక ఇంటిని గురించి యేసుక్రీస్తు చెప్పాడు, ఎందుకంటే దాన్ని నిర్మించిన వ్యక్తి ఎంతో బలమైన పునాదిని వేశాడు. (లూకా 6:47-49) పునాదులకున్న ప్రాముఖ్యత గురించి యేసుకు బాగా తెలుసు. యెహోవా భూమికి పునాదుల్ని వేసినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు.a (సామెతలు 8:29-31) మంచి పునాదులకు ఉన్న ప్రాముఖ్యతను గురించి యేసు కాలం నాటి ప్రజలకు కూడా తెలుసు. పటిష్టమైన పునాదులున్న ఇళ్లు మాత్రమే, పాలస్తీనాలో అప్పుడప్పుడూ వచ్చే ఉద్దృతమైన వరదల్నీ, భూకంపాల్నీ తట్టుకొని నిలబడగలిగేవి. అయితే, పౌలు మనస్సులో ఉన్న పునాది ఏమిటి?

5. క్రైస్తవ సంఘానికి పునాది ఎవరు, మరి ఇదెలా ప్రవచించబడింది?

5 పౌలు ఇలా రాశాడు: “వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.” (1 కొరింథీయులు 3:11) ఇలా యేసును పునాదికి పోల్చి చెప్పడం ఇది మొదటిసారేమీకాదు. నిజానికి, యెషయా 28:16 ఇలా ప్రవచించింది: “ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు—సీయోనులో పునాదిగా రాతిని వేసిననాడను నేనే అది పరిశోధింపబడిన రాయ అమూల్యమైన తలరాయ బహు స్థిరమైన పునాదియైన మూలరాయయైయున్నది.” తన కుమారుడు క్రైస్తవ సంఘానికి పునాది కావాలని యెహోవా ఎంతో కాలం క్రిందటే సంకల్పించాడు.—కీర్తన 118:22; ఎఫెసీయులు 2:19-22; 1 పేతురు 2:4-6.

6. కొరింథులోని క్రైస్తవుల్లో పౌలు సరియైన పునాదిని ఎలా వేశాడు?

6 క్రైస్తవ సంఘంలోని ఆయా వ్యక్తులకు ఉన్న పునాది ఏమిటి? పౌలు చెప్పినట్టుగా, నిజ క్రైస్తవులకు దేవుని వాక్యంలో వేయబడిన పునాది తప్ప అంటే, యేసుక్రీస్తు తప్ప మరొక పునాది ఏదీ లేదు. పౌలు నిశ్చయంగా అలాంటి పునాదినే వేశాడు. తత్త్వజ్ఞానాన్ని ఎంతగానో శ్లాఘించే కొరింథులో, లౌకిక జ్ఞానంతో ప్రజల్ని ముగ్దుల్ని చేయడానికి ఆయన ప్రయత్నించలేదు. దానికి బదులుగా, అన్యజనులు దేన్నైతే “వెఱ్ఱితనముగా” త్రోసిపుచ్చారో దాన్నే అంటే “సిలువవేయబడిన క్రీస్తును” పౌలు ప్రకటించాడు. (1 కొరింథీయులు 1:23) యెహోవా సంకల్పాల్లో యేసు కీలకమైనవాడని పౌలు బోధించాడు.—2 కొరింథీయులు 1:20; కొలొస్సయులు 2:1-3.

7. ‘నేర్పరియైన శిల్పి’గా తనను తాను పౌలు పేర్కొనడం నుండి మనమేం నేర్చుకోగలం?

7 పౌలు తాను అలాంటి బోధను ‘నేర్పరియైన శిల్పిలా’ బోధించానని పేర్కొన్నాడు. ఇలా చెప్పుకోవడం అహంకారంతో కూడినదేమీ కాదు. యెహోవా తనకు అనుగ్రహించిన అద్భుతమైన కృపావరాన్ని అంటే పనిని సంస్థీకరించే లేదా నిర్దేశించే కృపావరాన్ని కేవలం గుర్తించడం మాత్రమే. (1 కొరింథీయులు 12:28) నిజమే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు అనుగ్రహించబడిన అద్భుతమైన కృపావరాలు ఈనాడు మనకు లేవు. మనల్ని మనం సహజసిద్ధమైన బోధకులుగా తలంచుకోకపోవచ్చు. కానీ ఒక ప్రాముఖ్యమైన భావంలో, మనమూ అంతే. ఆలోచించండి: మనకు సహాయం చేసేందుకు యెహోవా తన పరిశుద్ధాత్మను మనకు ఇస్తున్నాడు. (పోల్చండి లూకా 12:11, 12.) మనకు యెహోవాపట్ల ప్రేమ ఉంది, ఆయన వాక్యంలోని ప్రాథమిక బోధలను గూర్చిన పరిజ్ఞానముంది. ఇతరులకు బోధించడంలో ఉపయోగించడానికివి నిజంగా అద్భుతమైన కృపావరాలు. సరియైన పునాదిని వేయడానికి వాటిని ఉపయోగిద్దామని మనం తీర్మానించుకుందాం.

8. భావి శిష్యుల్లో క్రీస్తును ఒక పునాదిగా మనమెలా వేస్తాం?

8 మనం క్రీస్తును పునాదిగా వేసినప్పుడు, ఆయన్ని మనం పశువుల తొట్టిలో ఉన్న నిస్సహాయుడైన పసిబిడ్డగానో, త్రిత్వంలో యెహోవాతో సమానునిగానో పరిచయం చేయము. అలాంటి లేఖనవిరుద్ధమైన సిద్ధాంతాలు నకిలీ క్రైస్తవులకు ఒక పునాదిని రూపొందిస్తాయి. దానికి బదులుగా, ఆయన జీవించినవారిలోకెల్లా మహా గొప్ప మనిషనీ, మనకోసం తన పరిపూర్ణ జీవితాన్ని అర్పించాడనీ, మరి ఆయన నేడు యెహోవా నియమిత రాజుగా పరలోకంలో ఏలుతున్నాడనీ బోధిస్తాం. (రోమీయులు 5:8; ప్రకటన 11:15) యేసు అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన లక్షణాల్ని అనుకరించమని మన విద్యార్థుల్ని ప్రేరేపించేందుకు కూడా మనం ప్రయత్నిస్తాం. (1 పేతురు 2:21) పరిచర్య విషయంలో యేసు చూపించిన ఆసక్తినిబట్టీ, దీనులపట్లా పీడిత ప్రజలపట్లా ఆయన చూపించిన కరుణనుబట్టీ, తమ అపరాధాల మూలంగా విరిగి నలిగిన పాపులపట్ల ఆయన చూపించిన కనికరాన్నిబట్టీ, శ్రమల్ని ఎదుర్కోవడంలో మొక్కవోని ఆయన ధైర్యాన్నిబట్టీ వాళ్లు తమ హృదయాంతరాల్లో నుండి కదిలించబడాలని మనం కోరుకుంటాం. నిజమే, యేసు ఒక దివ్యమైన పునాదియై ఉన్నాడు. అయితే తదుపరి కార్యక్రమమేంటి?

సరియైన వస్తువులతో కట్టడం

9. ప్రధానంగా చెప్పుకోవాలంటే పౌలు పని పునాదివేయడమే అయినా, తాను బోధించిన సత్యాన్ని అంగీకరించిన వారిపట్ల ఆయనకు ఎలాంటి శ్రద్ధ ఉంది?

9 “ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును” అని పౌలు రాశాడు. (1 కొరింథీయులు 3:12, 13) ఇక్కడ పౌలు భావమేమైవుంది? పూర్వాపరాల్ని పరిశీలించండి. పౌలు పని ప్రధానంగా పునాదిని వేయడమే. తన మిషనరీ పర్యటనలలో, ఆయన నగరనగరానికీ ప్రయాణిస్తూ క్రీస్తును గూర్చి ఇంతకుమునుపెన్నడూ వినని అనేకమందికి ప్రకటించాడు. (రోమీయులు 15:20) ఆయన బోధించిన సత్యాన్ని ప్రజలు అంగీకరించినప్పుడు, సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. పౌలు ఈ విశ్వాసులపై ఎంతో శ్రద్ధను చూపించాడు. (2 కొరింథీయులు 11:28, 29) అయితే, ఆయన తానుచేసే పనినిబట్టి ప్రయాణిస్తూ ఉండాల్సిందే. అందుకనే, పునాదిని వేయడంలో 18 నెలలు కొరింథులో గడిపిన తర్వాత, ఆయన ఇతర నగరాల్లో కూడా ప్రకటించడానికి ఆ నగరాన్ని విడిచి వెళ్లాల్సివచ్చింది. అయినా, తానక్కడ వేసిన పునాదిపై ఇతరులెలా కడుతున్నారనే విషయంలో ఆయనకెంతో ఆసక్తివుండేది.—అపొస్తలుల కార్యములు 18:8-11; 1 కొరింథీయులు 3:6.

10, 11. (ఎ) నిర్మాణ వస్తువులలోని వివిధ రకాల్ని పౌలు ఎలా పోల్చాడు? (బి) ప్రాచీన కొరింథులో బహుశా ఎలాంటి ఇళ్లు ఉండివుండవచ్చు? (సి) ఏ రకమైన ఇళ్లు బహుశా అగ్నిదాడికి తట్టుకొని నిలబడతాయి, క్రైస్తవ శిష్యుల్ని తయారుచేసే వారికి అది ఏ వస్తు పాఠాన్ని నేర్పిస్తుంది?

10 కొరింథులో పౌలు వేసిన పునాదిపై కొంతమంది సరిగా కడుతున్నట్టు కన్పించడంలేదు. ఆ విషయాన్ని బయల్పర్చడానికి, పౌలు రెండు విభిన్నమైన నిర్మాణ వస్తువులను ఒకదానితో మరొకటి పోలుస్తున్నాడు: బంగారం, వెండి, వెలగలరాళ్లు అనేవి ఒక రకానికి చెందినవి; కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు అనేవి మరో రకానికి చెందినవి. ఒక ఇంటిని శ్రేష్ఠమైన, మన్నికయైన అగ్ని నిరోధక వస్తువులతో కట్టవచ్చు; లేదా సులభంగా పాడయ్యే, తాత్కాలికమైన, అగ్నికి ఆహుతయ్యే వస్తువుల్ని ఉపయోగిస్తూ త్వరత్వరగానూ నిర్మించవచ్చు. కొరింథులాంటి మహానగరంలో ఆ రెండు రకాలకు చెందిన ఇళ్లూ కోకొల్లలుగా ఉండి ఉంటాయనడంలో సందేహమేమీలేదు. అక్కడ బహుశా కొంతమేరకు బంగారంతోనూ, వెండితోనూ తాపడంచేయబడిన లేక అలంకరించబడిన, ఖరీదైన గండు శిలలతో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవి.b కఱ్ఱలతో కట్టి, గడ్డితో వేయబడ్డ పూరి గుడిసెలకూ, పాకలకూ, మార్కెట్‌ స్టాళ్లకూ సమీపాన దృఢమైన ఆ పెద్ద పెద్ద భవనాలు బహుశా ఆకాశ హార్మ్యాల్లా ఉండివుండవచ్చు.

11 అగ్నిప్రమాదం సంభవిస్తే ఈ ఇళ్లకు ఏం జరుగుతుంది? దానికి జవాబు, మనకాలంలో ఎంత స్పష్టంగా ఉందో, పౌలు దినాల్లోనూ అంతే స్పష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే, సా.శ.పూ. 146లో రోమన్‌ జనరల్‌ మమ్మ్యిస్‌ కొరింథు నగరాన్ని జయించి, దాన్ని తగులబెట్టాడు. కఱ్ఱలతోనూ, గడ్డితోనూ లేక దుబ్బగడ్డితోనూ నిర్మించిన అనేక ఇళ్లు నిశ్చయంగా అగ్నికి ఆహుతైపోయాయి. వెండి బంగారాలతో అలంకరించబడిన పటిష్టమైన భవనాల సంగతేమిటి? అవి అగ్నికి తట్టుకొని నిలబడ్డాయనడంలో సందేహమేమీలేదు. అగ్ని తమ చుట్టుప్రక్కలనున్న పూరి గుడిసెల్ని స్వాహాచేసెయ్యగా దాని తాకిడికి తట్టుకొని ఠీవిగా తమ మోరల్ని ఎత్తిపెట్టుకొని నిలబడ్డట్టున్న రాతి భవంతుల ముందునుండి కొరింథులోని పౌలు విద్యార్థులు బహుశా ప్రతీరోజూ వెళ్తూ ఉండివుంటారు. పౌలు తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతచక్కగా నొక్కిచెప్పాడో గదా! బోధించేటప్పుడు, మనల్ని మనం నిర్మాణకులుగా పరిగణించుకోవాల్సిన అవసరముంది. వీలైనంత శ్రేష్ఠమైన, ఎంతో నాణ్యమైన వస్తువులతో మనం కట్టాలని కోరుకుంటాం. ఆ విధంగానైతేనే మన కట్టడం పదికాలాలపాటు నిలబడగల్గుతుంది. నాణ్యమైన ఆ వస్తువులు ఏవి, వాటిని ఉపయోగించడం ఎందుకంత ప్రాముఖ్యం?

మీ పని అగ్నికి తాళుకొని నిలబడుతుందా?

12. కొరింథులోని కొంతమంది క్రైస్తవులు నిర్లక్ష్యంతోకూడిన నిర్మాణపు పనిని ఏ యే రీతుల్లో చేస్తున్నారు?

12 కొరింథులోని కొంతమంది క్రైస్తవుల నిర్మాణ పని అంతంత మాత్రంగానే ఉన్నట్టు పౌలు భావించాడని స్పష్టమౌతుంది. లోపం ఏమిటి? పూర్వాపరాలు చూపిస్తున్నట్టుగా, సంఘ ఐక్యతకు ముప్పువాటిల్లే ప్రమాదమున్నప్పటికీ విభజనలూ, వ్యక్తులను అభిమానించడమూ సంఘాన్ని పట్టి పీడించాయి. కొంతమంది “నేను పౌలు వాడను” అని అంటే మరికొందరు “నేను అపొల్లోవాడను” అని అంటున్నారు. కొందరైతే తమ సొంత జ్ఞానాన్ని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనబడింది. దాని ఫలితమేంటంటే శరీర సంబంధమైన ఆలోచనా సరళీ, ఆధ్యాత్మిక అపరిపక్వతా, అంతకంతకూ పెరిగిపోతున్న ‘అసూయా, కలహాలు’ వంటివాటితో కూడిన వాతావరణమేర్పడడమని అనడంలో ఆశ్చర్యమేమీలేదు. (1 కొరింథీయులు 1:12; 3:1-4, 18) సంఘంలోనూ, పరిచర్యలోనూ బోధించే విధానమందు ఆ వైఖరి స్పష్టంగా ప్రతిబింబించింది. ఫలితంగా వాళ్లు, చౌకబారు వస్తువులతో ఇంటిని నిర్మించినట్టుగా శిష్యుల్ని చేసే పనిని ఎంతో నిర్ల్యక్షంగా చేశారు. అది ‘అగ్ని’కి తట్టుకొని నిలబడలేదు. పౌలు ఇక్కడ ఏ అగ్నిని గురించి మాట్లాడుతున్నాడు?

13. పౌలు ఉపమానంలోని అగ్ని దేనికి ప్రాతినిథ్యం వహిస్తోంది, మరి క్రైస్తవులంతా దేని విషయమై జాగరూకలై ఉండాలి?

13 మన జీవితాల్లో మనమంతా ఎదుర్కోవాల్సిన అగ్ని పరీక్షలున్నాయి—అవే మన విశ్వాసానికి కలిగే పరీక్షలు. (యోహాను 15:20; యాకోబు 1:2, 3) మన దగ్గర నుండి సత్యాన్ని నేర్చుకున్న ప్రతీ వ్యక్తీ పరీక్షించబడతారని తెలిసికోవాల్సిన అవసరం నేడు మనకున్నట్టుగానే కొరింథులోని క్రైస్తవులూ తెలుసుకోవాల్సిన అవసరమేర్పడింది. మనం సరిగా బోధించకపోతే, వచ్చేవి విచారకరమైన పర్యవసానాలే అయివుండొచ్చు. పౌలు ఇలా హెచ్చరించాడు: “పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును. ఒకని పని కాల్చి వేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.”c—1 కొరింథీయులు 3:14, 15.

14. (ఎ) క్రైస్తవ శిష్యుల్ని తయారుచేసే వారికి ‘నష్టం’ ఎలా ‘వాటిల్లవచ్చు,’ అయినా అగ్నిలోనుండి తప్పించబడినట్టుగా వాళ్లు రక్షణను ఎలా పొందవచ్చు? (బి) నష్టంవాటిల్లే ప్రమాదాన్ని మనమెలా తగ్గించగలం?

14 నిశ్చయంగా అవి ఒకడ్ని ఆలోచించుకునేలా చేసే మాటలు! శిష్యుడయ్యేలా ఒకరికి సహాయపడేందుకు పాటుపడడమనేది కేవలం అతడు శోధనల్లోనో, హింసల్లోనో చిక్కుకొని చివరకు సత్యమార్గాన్ని విడనాడడాన్ని చూసేందుకే అయితే అది ఎంతో బాధాకరమైన విషయంకాగలదు. అలాంటి సందర్భాల్లో మనకు నష్టం వాటిల్లుతుందని పౌలు చెబుతున్నప్పుడు ఆయన గుర్తిస్తున్నదదే. ఆ అనుభవం ఎంత బాధాకరమైనదిగా ఉంటుందంటే, మన రక్షణ “అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు”గా అని వర్ణించబడింది అంటే అగ్ని ప్రమాదంలో సమస్తాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో తప్పించుకున్న వ్యక్తిలా వర్ణించబడింది. మన వంతుగా, నష్టంవాటిల్లే అవకాశాల్ని మనమెలా తగ్గించగలం? మన్నికగల వస్తువులతో కట్టండి ! మన విద్యార్థులు జ్ఞానమూ, వివేచనా, యెహోవాపట్ల భయమూ, యథార్థమైన విశ్వాసమూ వంటి అమూల్యమైన క్రైస్తవ లక్షణాల్ని విలువైనవాటిగా ఎంచేలా వారిని ప్రేరేపిస్తూ, వారి హృదయాల్ని చేరుకునేలా మనం వారికి బోధిస్తే, అప్పుడు మనం మన్నికగల అగ్నినిరోధక వస్తువులతో నిర్మిస్తున్నామన్నమాట. (కీర్తన 19:9, 10; సామెతలు 3:13-15; 1 పేతురు 1:6, 7) ఈ లక్షణాల్ని సంపాదించుకున్న వ్యక్తులు దేవుని చిత్తాన్ని చేయడంలో కొనసాగుతారు; నిరంతరమూ జీవించే నిశ్చయమైన నిరీక్షణ వాళ్లదే. (1 యోహాను 2:17) అయితే, పౌలు ఉపమానాన్ని మనమెలా ఆచరణీయమైన రీతిలో ఉపయోగించగలం? కొన్ని ఉదాహరణల్ని పరిశీలించండి.

15. మన బైబిలు విద్యార్థులకు సంబంధించి నిర్లక్ష్యంతోకూడిన నిర్మాణపు పనిని చేయకుండా జాగ్రత్త వహిస్తున్నామని మనమే రీతుల్లో నిశ్చయపర్చుకోవచ్చు?

15 బైబిలు విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు, మనం యెహోవా దేవునికన్నా ఏ మానవుడ్నీ ఎన్నడూ ఉన్నతపర్చకూడదు. జ్ఞానానికి ప్రథమ మూలంగా మనల్ని దృష్టించాలని వారికి బోధించడం మన లక్ష్యంకాదు. నడిపింపు కోసం యెహోవావైపూ, ఆయన వాక్యంవైపూ, ఆయన సంస్థవైపూ వాళ్లు చూడాలని మనం కోరుకుంటాం. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు, వాళ్లడిగే ప్రశ్నలకు జవాబులుగా మన సొంత అభిప్రాయాల్ని తెలియచేయం. బదులుగా, బైబిల్నీ, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందించిన సాహిత్యాల్నీ ఉపయోగిస్తూ జవాబుల్ని కనుగొనేందుకు వారికి బోధిస్తాం. (మత్తయి 24:45-47) పైన ప్రస్తావించిన కారణాల్నిబట్టే, మన బైబిలు విద్యార్థులేదో మనకు చెందిన సొంత ఆస్తన్నట్టుగా ఉండకుండా జాగ్రత్త వహిస్తాం. వారిపై ఇతరులు ఆసక్తిని కనుపర్చినప్పుడు దాన్ని చూసి బాధపడడానికి బదులు, సంఘంలో ఉన్న అనేకమందిని గురించి వీలైనంతమేరకు తెలుసుకొని వారిని ప్రశంసిస్తూ తమ అంతఃకరణాల్ని “విశాలపరచుకొను”మని మన బైబిలు విద్యార్థులను మనం ప్రోత్సహించాలి.—2 కొరింథీయులు 6:12, 13.

16. పెద్దలు అగ్నినిరోధక వస్తువులతో ఎలా కట్టవచ్చు?

16 శిష్యులను నిర్మించడంలో క్రైస్తవ పెద్దలు కూడా ఒక ప్రముఖమైన పాత్రను నిర్వహిస్తారు. వాళ్లు సంఘం ఎదుట బోధించేటప్పుడు, అగ్నినిరోధక వస్తువులతో కట్టేందుకు వాళ్లు ప్రయత్నిస్తారు. వాళ్ల బోధనా సామర్థ్యమూ, అనుభవమూ, వ్యక్తిత్వమూ వేర్వేరుగా ఉండవచ్చు, అయినా వాళ్లు శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకుపోవడానికి వాటిని పెట్టుబడిగా ఉపయోగించరు. (పోల్చండి అపొస్తలుల కార్యములు 20:29, 30.) కొరింథులోని కొందరు ‘నేను పౌలు వాడను’ లేదా ‘నేను అపొల్లో వాడను’ అని ఎందుకన్నారో మనకు ఖచ్చితంగా తెలియదు. అయితే నమ్మకమైన ఈ పెద్దలిద్దరిలో ఏ ఒక్కరూ అలాంటి విభాజిత ఆలోచనా సరళిని పెంపొందించలేదని మాత్రం మనం నిశ్చయత కలిగివుండవచ్చు. పౌలు అలాంటి సెంటిమెంట్లకు తబ్బిబ్బైపోలేదు; ఆయన వాటిని తీవ్రంగా ఖండించాడు. (1 కొరింథీయులు 3:5-7) అదే విధంగా నేడు, పెద్దలు తాము “దేవుని మందను” కాస్తున్నామని మనస్సులో ఉంచుకుంటారు. (ఇటాలిక్కులు మావి.) (1 పేతురు 5:2) అది ఏ మానవునిదీ కాదు. కాబట్టి మందపైగానీ లేక పెద్దల సభపైగానీ ఒక వ్యక్తి అజమాయిషీ చేసే ఎటువంటి ధోరణికైనా విరుద్ధంగా పెద్దలు స్థిరంగా నిలబడాలి. సంఘానికి సేవ చేయాలనే, హృదయాల్ని చేరాలనే, పూర్ణ ఆత్మతో యెహోవా సేవ చేసేలా మందకు సహాయపడాలనే వినయంతోకూడిన కోరిక పెద్దల్ని ప్రేరేపించినంత వరకూ, వాళ్లు అగ్నినిరోధక వస్తువులతో నిర్మిస్తారు.

17. అగ్నినిరోధక వస్తువులతో కట్టడానికి క్రైస్తవ తల్లిదండ్రులెలా కృషి చేస్తారు?

17 ఈ విషయంలో క్రైస్తవ తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధను వహిస్తారు. తమ పిల్లలు నిరంతరం జీవించడాన్ని చూడాలని వాళ్లెంత ప్రేమతో ఎదురుచూస్తారో గదా! అందుకే వాళ్లు తమ పిల్లల హృదయాల్లో దేవుని వాక్య సూత్రాలు ‘నాటుకునేలా’ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) తమ పిల్లలు సత్యాన్ని, కొన్ని రూల్సుగానో లేక కొన్ని వాస్తవాలగానో తెలుసుకోవడానికి బదులు దాన్ని సంపూర్ణమైన, ప్రతిఫలదాయకమైన, సంతోషకరమైన జీవిత మార్గంగా తెలుసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. (1 తిమోతి 1:8) తమ పిల్లల్ని క్రీస్తు నమ్మకమైన శిష్యులుగా కట్టడంలో, ప్రేమగల తల్లిదండ్రులు అగ్నినిరోధక వస్తువుల్ని ఉపయోగించడానికి కృషి చేస్తారు. యెహోవా ద్వేషిస్తున్న లక్షణాల్ని తొలగించుకొని, ఆయన ప్రేమిస్తున్న సద్గుణాల్ని అలవర్చుకునేలా పిల్లలకు సహాయపడుతూ వారితో కలిసి తల్లిదండ్రులు ఎంతో ఓపికతో పనిచేస్తారు.—గలతీయులు 5:22, 23.

ఎవరు బాధ్యులు?

18. ఒక శిష్యుడు హితకరమైన బోధను తిరస్కరిస్తే, బహుశా అది అతనికి బోధించడానికీ, తర్ఫీదునివ్వడానికీ కృషిచేస్తున్న వ్యక్తి లోపమే ఎందుకు కానక్కర్లేదు?

18 ఈ చర్చ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవదీస్తోంది. మనం సహాయం చేయడానికి ఎంతగానో కృషిచేసిన ఒకరు సత్యాన్నుండి తొలగిపోతే, మనం బోధకులుగా విఫలమయ్యామని అంటే మనం చౌకబారు వస్తువులతో నిర్మించి ఉంటామని దానర్థమా? అలా అయ్యుండాల్సిన అవసరమేమీలేదు. పౌలు మాటలు, శిష్యుల్ని తయారుచేసే పనిలో భాగంవహించడం ఎంతో బాధ్యతాయుతమైనదని మనకు నిశ్చయంగా గుర్తుచేస్తున్నాయి. చక్కగా కట్టేందుకు మన శక్తికొద్దీ చేయగల్గినంతా చేయాలని మనం కోరుకుంటాం. కానీ మొత్తం బాధ్యతనంతా భుజాన వేసుకొని, సత్యాన్ని నేర్చుకోడానికి మనం సహాయం చేసినవాళ్లు దాన్నుండి తొలగిపోయినప్పుడు అపరాధ భావంతో కృంగిపోమని దేవుని వాక్యం మనకు చెప్పడంలేదు. నిర్మాణకులుగా మనం నిర్వహించే పాత్రతోపాటూ ఇందులో ఇతర కారకాలు కూడా చేరివున్నాయి. ఉదాహరణకు, ఈ గృహ నిర్మాణపనిలో సరిగా పనిచేయని బోధకుని గురించి పౌలు ఏమి చెబుతున్నాడో గమనించండి: “వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును.” (1 కొరింథీయులు 3:15) తన విద్యార్థినందు తాను నిర్మించడానికి కృషిచేసిన క్రైస్తవ వ్యక్తిత్వం అగ్నిలాంటి శోధనలో ‘కాలిపోయినట్టుగా’ చిత్రీకరించబడినా, ఆ బోధకుడు మాత్రం రక్షించబడినట్లైతే, మనమే నిర్ధారణకు రావచ్చు? నిశ్చయంగా, ఆ విద్యార్థి విశ్వసనీయమైన మార్గాన్ని అనుసరిస్తాడా లేదా అనే విషయంలో అతడు తీసుకున్న సొంత నిర్ణయాలకు యెహోవా అతడినే ప్రధానంగా బాధ్యుడిగా పరిగణిస్తాడు.

19. తర్వాతి శీర్షికలో మనమేం చర్చించబోతున్నాం?

19 వ్యక్తిగతంగా మనకున్న బాధ్యతయైనా లేదా ఆయా వ్యక్తులకున్న బాధ్యతయైనా చాలా ప్రాముఖ్యం. అది మనలో ప్రతి ఒక్కర్నీ ప్రభావితం చేస్తుంది. విశేషంగా, ఆ విషయంపై బైబిలు ఏం బోధిస్తోంది? తర్వాతి శీర్షిక దాన్ని చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

a ‘భూమి యొక్క పునాది,’ భూమినీ అలాగే అంతరిక్ష దేహాల్నీ వాటి స్థానంలోనే స్థిరంగా ఉంచే ప్రకృతి శక్తులను—సూచించవచ్చు. అంతేగాక, భూమి ఎప్పటికీ “కదలకుండునట్లు” లేదా నాశనంకాకుండునట్లు నిర్మించబడింది.—కీర్తన 104:5.

b పౌలు తెలియజేసిన “వెలగల రాళ్లు” వజ్రాలూ, కెంపులూ వంటి రత్నాలే అయివుండాల్సిన అవసరమేమీలేదు. అవి మార్బుల్‌, ఆల్బాస్టర్‌ లేదా గ్రానైట్‌ వంటి వెలగల నిర్మాణపు రాళ్లు అయివుండవచ్చు.

c పౌలు కట్టినవాని రక్షణనుకాదుగానీ, ఆ “పని” అంటే ఆ కట్టడం నిలుస్తుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ ఈ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: “ఒక వ్యక్తి నిర్మించింది నిలిస్తే, అతడు ప్రతిఫలాన్ని పొందుతాడు; అది కాలిపోతే, ఆ నష్టాన్ని భరించాల్సింది అతడే; కాని మంటలనుండి అతడొక్కడే తన ప్రాణాన్ని తప్పించుకొన్నట్టుగా రక్షించబడతాడు.”

మీరెలా జవాబిస్తారు?

◻ నిజ క్రైస్తవునిలో వేయబడ్డ “పునాది” ఏది, మరి అదెలా వేయబడుతుంది?

◻ వివిధ రకాల నిర్మాణ వస్తువుల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

◻ “అగ్ని” దేనికి ప్రాతినిధ్యం వహిస్తోంది, అది ఒకరు ‘నష్టపోడానికి’ ఎలా కారణమవ్వవచ్చు?

◻ బైబిలు బోధకులూ, పెద్దలూ, తల్లితండ్రులూ అగ్ని నిరోధక వస్తువులతో ఎలా కట్టవచ్చు?

[9వ పేజీలోని చిత్రం]

అనేక ప్రాచీన నగరాల్లో, సులభంగా నాశనమయ్యే కట్టడాలూ, అగ్నినిరోధక వస్తువులతో నిర్మితమైన రాతి భవనాలూ ప్రక్కప్రక్కనే ఉన్నాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి