యెహోవాకు సన్నిహితమయ్యేందుకు ప్రజలకు సహాయం చేయటం
“నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”—యోహాను 14:6.
1. పునరుత్థానుడైన యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞను ఇచ్చాడు, యెహోవాసాక్షులు దానికి విధేయత చూపినందుకు ఏ ఫలితాలు లభించాయి?
“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమి[య్యుడి]” అని యేసుక్రీస్తు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19) గత పది సంవత్సరాల్లో, యెహోవాసాక్షులు ముప్పై లక్షలకంటే ఎక్కువమంది ప్రజలు దేవుని దగ్గరకు వచ్చేందుకు సహాయపడుతూ, ఆ కాలంలో తమను తాము ఆయనకు సమర్పించుకున్నారన్న దానికి సూచనగా వారికి బాప్తిస్మమిచ్చారు. వారు దేవునికి సన్నిహితమయ్యేందుకు సహాయపడినందుకు మనం ఎంత ఉల్లసించాము!—యాకోబు 4:8.
2. అనేకమంది క్రొత్తవారికి బాప్తిస్మం ఇవ్వబడుతున్నప్పటికీ, ఏమి సంభవించింది?
2 అయితే, అనేకమంది క్రొత్త శిష్యులకు బాప్తిస్మం ఇవ్వబడిన కొన్ని దేశాల్లో రాజ్య ప్రచారకుల సంఖ్యలో తత్సమానమైన అభివృద్ధి జరగలేదు. నిజమే, చనిపోయినవారి సంఖ్యను లెక్కలోనికి తీసుకోవాలి, వార్షిక మరణాల రేటు 1 శాతం ఉంది. అయినప్పటికీ, గత కొద్ది సంవత్సరాల్లో ఏదోక కారణంచేత చాలామంది పడిపోయారు. ఎందుకిలా జరిగింది? ఈ శీర్షిక, తరువాతి శీర్షిక ప్రజలు యెహోవావైపుకి ఎలా ఆకర్షించబడతారు, కొందరు ఎందుకు పడిపోతారు అన్న విషయాల్ని పరిశీలిస్తాయి.
మన ప్రకటనా పని సంకల్పం
3. (ఎ) యేసు శిష్యులకు అప్పగించబడిన నియామకం ప్రకటన 14:6లో పేర్కొనబడిన దూత నియామకంతో ఎలా కలుస్తుంది? (బి) రాజ్య సందేశంలో ప్రజల ఆసక్తిని రేకెత్తించడానికి ఏది ఒక ప్రభావవంతమైన పద్ధతి అని నిరూపించబడింది, కానీ ఏ సమస్య ఎదురౌతుంది?
3 ఈ “అంత్యకాలము”లో యేసు శిష్యులు “ఈ రాజ్యసువార్త”ను గురించిన “[నిజమైన] తెలివి”ని వ్యాప్తిచేయాలనే నియామకాన్ని కలిగివున్నారు. (దానియేలు 12:4; మత్తయి 24:14) వారి నియామకం, “భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త” కలిగివున్న దూత నియామకంతో కలుస్తుంది. (ప్రకటన 14:6) ఐహిక విచారాల్లో మునిగిపోయిన ఈ లోకపు ప్రజలకు దేవుని రాజ్యమంటే ఆసక్తిని రేకెత్తించడానికీ, వారు యెహోవాకు సన్నిహితమయ్యేందుకు సహాయం చేయడానికీ సాధారణంగా అతి ప్రభావవంతమైన పద్ధతి ఏమిటంటే వారికి పరదైసు భూమిపై నిత్యజీవమనే నిరీక్షణ గురించి చెప్పడమే. ఇది అర్థంచేసుకోదగినదే అయినప్పటికీ, కేవలం పరదైసులోకి ప్రవేశాన్ని పొందాలన్న ఉద్దేశంతో దేవుని ప్రజలతో సహవసించేవారు, జీవానికి నడిపించే ఇరుకైన దారిపై ఆధ్యాత్మికంగా స్థిరత్వంతో నడుస్తున్నట్లు కాదు.—మత్తయి 7:13, 14.
4. యేసు చెప్పినదాని ప్రకారం, మధ్యాకాశంలో ఎగురుతున్న దూత చెప్పినదాని ప్రకారం మన ప్రకటనా పని సంకల్పం ఏమిటి?
4 యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) మధ్యాకాశంలో ఎగురుతున్న దేవదూత “నిత్యసువార్త”ను ప్రకటిస్తూ భూమ్మీదనున్న వారికి ఇలా చెబుతున్నాడు: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” (ప్రకటన 14:7) అందుకని, మనం సువార్త ప్రకటించటం యొక్క అసలు సంకల్పం, క్రీస్తు యేసు ద్వారా యెహోవాకు సన్నిహితమయ్యేందుకు ప్రజలకు సహాయపడటమే.
యెహోవా పనిలో మన పాత్ర
5. పౌలు, యేసు చెప్పిన ఏ మాటలు మనం యెహోవా పనిని చేస్తున్నామనీ మన స్వంత పని కాదనీ చూపిస్తున్నాయి?
5 తోటి అభిషిక్త క్రైస్తవులకు వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు “సమాధానపరచు పరిచర్యను” గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు చెల్లించిన విమోచన క్రయధన బలి ఆధారంగా దేవుడు మనుష్యుల్ని తనతో సమాధాన పరుచుకుంటాడని కూడా ఆయన చెబుతున్నాడు. ఇది “దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు” ఉన్నదనీ, “దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము” అనీ పౌలు చెబుతున్నాడు. హృదయాలకు ఎంతటి ఊరటను కలుగజేసే తలంపో కదా! మనం ‘క్రీస్తుకు రాయబారులమైన’ అభిషిక్తులమైనా లేదా భూ నిరీక్షణగల దూతలమైనా, ఈ పని మనది కాదుగానీ యెహోవాదని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. (2 కొరింథీయులు 5:18-20) క్రీస్తు దగ్గరికి వచ్చేవారిని ఆకర్షించి బోధించేది నిజానికి దేవుడే. యేసు ఇలా అన్నాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును—వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.”—యోహాను 6:44, 45.
6. యెహోవా జనాంగాల్లో ప్రాథమిక కదిలింపును ఎలా చేస్తున్నాడు, అదే సమయంలో ఆయన ఆరాధనా “మందిరం”లో ఎవరు భద్రతను కనుగొంటున్నారు?
6 ఈ అంత్య దినములలో, యెహోవా ప్రజల్ని ఎలా ఆకర్షిస్తాడు, వారు ‘విశ్వసించుటకు ద్వారమును ఎలా తెరుస్తాడు’? (అపొస్తలుల కార్యములు 14:27; 2 తిమోతి 3:1) ఒక కీలకమైన విధానం ఏమిటంటే ఆయన తన సాక్షులచే తన రక్షణ సందేశాన్ని, ఈ దుష్ట విధానానికి తీర్పును ప్రకటింపజేయడం. (యెషయా 43:12; 61:1, 2) త్వరలో రాబోయే సమూల నాశన తీర్పుకు ముందుసూచనగా ఈ ప్రపంచవ్యాప్త ప్రకటన దేశాలన్నింట్లో కంపనాలు కలుగజేస్తోంది. అదే సమయంలో దేవుని దృష్టిలో “అమూల్యమైన”వారిగా ఉన్న ప్రజలు ఈ విధానం వెలుపలికి వచ్చేందుకు ఆకర్షించబడుతూ ఆయన సత్యారాధనా “మందిరము”లో భద్రతను కనుగొంటున్నారు. ఈ విధంగా యెహోవా హగ్గయి నమోదు చేసిన తన ఈ ప్రవచనాత్మక మాటల్ని నెరవేరుస్తున్నాడు: “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును.”—హగ్గయి 2:6, 7; ప్రకటన 7:9, 15.
7. యెహోవా ఏ విధంగా ప్రజల హృదయాల్ని తెరిచి, వ్యక్తుల్ని తనవైపుకీ తన కుమారునివైపుకీ ఆకర్షించుకుంటున్నాడు?
7 తన సాక్షులు ‘చెప్పిన మాటలయందు లక్ష్యముంచేలా’ “జనాంగముల అత్యుత్తమ వస్తువులు” అయిన ఈ దైవభయంగల వారందరి హృదయాలను యెహోవా తెరుస్తాడు. (హగ్గయి 2:7, జూయిష్ పబ్లికేషన్ సొసైటీ; అపొస్తలుల కార్యములు 16:14) మొదటి శతాబ్దంలోలానే, యెహోవా కొన్నిసార్లు సహాయం కోసం తనకు మొరపెట్టిన యథార్థహృదయులైన ప్రజల దగ్గరకు తన సాక్షులు వెళ్లేలా చేసేందుకు తన దూతలను ఉపయోగిస్తాడు. (అపొస్తలుల కార్యములు 8:26-31) తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు తమకోసం చేసిన అద్భుతమైన ఏర్పాట్లను గురించి ప్రజలు నేర్చుకుంటుండగా వారు ఆ యెహోవా దేవునికున్న ప్రేమను బట్టి ఆయన వైపుకి ఆకర్షితులౌతారు. (1 యోహాను 4:9, 10) అవును, దేవుడు ప్రజల్ని తన “కృప”ద్వారా లేదా తన “యథార్థ ప్రేమ” ద్వారా తనవైపుకీ తన కుమారుని వైపుకీ ఆకర్షించుకుంటాడు.—యిర్మీయా 31:3, NW అధఃసూచి.
యెహోవా ఎవరిని ఆకర్షిస్తాడు?
8. యెహోవా ఎటువంటి ప్రజల్ని ఆకర్షిస్తాడు?
8 యెహోవా తనను వెదికేవారిని తనవైపుకీ తన కుమారుని వైపుకీ ఆకర్షించుకుంటాడు. (అపొస్తలుల కార్యములు 17:26, 27) వారిలో క్రైస్తవమత సామ్రాజ్యంలోనూ, నిజానికి మొత్తం ప్రపంచంలోనూ “[జరుగుతున్న] హేయకృత్యములను గూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్న” ప్రజలు ఉన్నారు. (యెహెజ్కేలు 9:4) వారు తమ “ఆధ్యాత్మిక అవసరాలందు శ్రద్ధగలవారు.” (మత్తయి 5:3, NW) నిజానికి వారు పరదైసు భూమిపై నిరంతరమూ నివసించే “భూమిమీది సాత్వికులు [“నమ్రతగలవారు,” అధఃసూచి].”—జెఫన్యా 2:3, NW.
9. ‘నిత్యజీవమునకు నిర్ణయింపబడిన’ వారో కాదో యెహోవా ఎలా చూడగలడు, నిర్ణయింపబడినవారిని ఆయన ఎలా ఆకర్షిస్తాడు?
9 యెహోవా ఒక మనిషి హృదయాన్ని చదువగలడు. రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఇలా చెప్పాడు: “యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. . . . ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును.” (1 దినవృత్తాంతములు 28:9) ఒక వ్యక్తి హృదయస్థితి ఆధారంగా, ఆయన ఆత్మ అంటే ఆయనలో ప్రబలంగా ఉన్న వైఖరి ఆధారంగా పాప క్షమాపణ కోసరమైన దైవిక ఏర్పాట్లకూ, దేవుని నీతియుక్త నూతన విధానంలో నిత్యజీవ నిరీక్షణకూ ప్రతిస్పందించే అవకాశం ఉందో లేదో యెహోవా చూడగలడు. (2 పేతురు 3:13) తన సాక్షులు ప్రకటిస్తున్న బోధిస్తున్న తన వాక్యం ద్వారా యెహోవా, ‘నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరినీ’ తనవైపుకీ తన కుమారునివైపుకీ ఆకర్షించగా వారందరు ‘విశ్వసిస్తారు.’—అపొస్తలుల కార్యములు 13:48.
10. యెహోవా కొందర్ని ఆకర్షించి కొందర్ని ఆకర్షించకపోవడం పూర్వనిర్ధారితం చేయడం కాదని ఏది చూపిస్తుంది?
10 యెహోవా కొందర్ని ఆకర్షించి, కొందర్ని ఆకర్షించకపోవడంలో ఒక రకమైన పూర్వనిర్ధారితం చేయడం ఇమిడివుందా? ఎంతమాత్రం కాదు! దేవుడు ప్రజల్ని ఆకర్షించడం వారి స్వంత అభ్యుదయేచ్ఛలపైనే ఆధారపడివుంటుంది. ఆయన వారి స్వేచ్ఛాచిత్తాన్ని గౌరవిస్తాడు. “నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను. . . . భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. . . . యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకునట్లు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి” అని మోషే చెప్పినప్పుడు, యెహోవా 3,000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల ఎదుట ఏ ఎంపికనైతే ఉంచాడో అదే ఎంపికను నేటి భూనివాసుల ఎదుట ఉంచుతున్నాడు.—ద్వితీయోపదేశకాండము 30:15-20.
11. ఇశ్రాయేలీయులు ఏ విధంగా జీవాన్ని ఎంపిక చేసుకోవలసివున్నారు?
11 ఇశ్రాయేలీయులు ‘యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనడం’ ద్వారా జీవాన్ని ఎంపిక చేసుకోవాలన్న విషయాన్ని గమనించండి. ఆ మాటలు చెప్పబడినప్పుడు ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. వారు యొర్దాను నదిని దాటి కనానులోనికి ప్రవేశించడానికి తమను తాము సంసిద్ధులను చేసుకుంటూ మోయాబు మైదానాల్లో కార్యోన్ముఖులైయున్నారు. వారి తలంపులు తాము త్వరలోనే పొందనైయున్న “విశాలమైన మంచి దేశము” వైపుకూ, “పాలు తేనెలు ప్రవహించు దేశము” వైపుకూ మరలడం సహజమే అయినప్పటికీ, వారి కలలు నిజం కావడమన్నది యెహోవాపట్ల వారికున్న ప్రేమపైనా, ఆయన స్వరాన్ని వారు వినడంపైనా, ఆయన్ను హత్తుకోవడంపైనా ఆధారపడివుంది. (నిర్గమకాండము 3:8) “నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును” అని చెబుతూ మోషే దాన్ని స్పష్టంచేశాడు. (ఇటాలిక్కులు మావి.)—ద్వితీయోపదేశకాండము 30:16.
12. ఇశ్రాయేలీయుల మాదిరి మనకు మన ప్రకటనా పని, బోధనా పని గురించి ఏ పాఠాల్ని బోధించాలి?
12 ఇప్పటివరకు చర్చించిన విషయాలు ఈ అంత్యకాలంలో మనం చేస్తున్న ప్రకటనా పని గురించి బోధనా పని గురించి మనకు కొన్ని పాఠాలు బోధించవద్దా? మనం రాబోతున్న పరదైసు భూమి గురించి ఆలోచిస్తాము, దాని గురించి మన పరిచర్యలో మాట్లాడుతాము. కానీ మనంగానీ మనం తయారుచేసే శిష్యులుగానీ దేవుణ్ణి స్వార్థపర కారణాలను బట్టి సేవిస్తుంటే ఆ వాగ్దాన నెరవేర్పును మనమూ చూడం, వాళ్ళూ చూడరు. ఇశ్రాయేలీయులకు వలెనే మనమూ, మనం బోధిస్తున్నవారూ, ‘యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనడం’ నేర్చుకోవాలి. మనం మన పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు దీన్ని గుర్తుంచుకుంటే, అప్పుడు దేవుని దగ్గరికి ప్రజల్ని ఆకర్షించడంలో మనం దేవునితో కలిసి పనిచేస్తున్న వారమౌతాము.
దేవుని జతపనివారు
13, 14. (ఎ) మొదటి కొరింథీయులు 3:5-9 ప్రకారం మనం దేవుని జతపనివారముగా ఎలా కాగలం? (బి) ఏ అభివృద్ధి జరిగినా అందుకు ఘనత ఎవరికి చెందాలి, ఎందుకు?
13 దేవునితో కలిసిపనిచేయడాన్ని పౌలు ఒక పొలాన్ని సాగుచేయడంతో పోలుస్తూ దృష్టాంతపరుస్తున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధికలుగజేసినవాడు దేవుడే. కాబట్టి వృద్ధికలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే ప్రతి వాడును తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.”—1 కొరింథీయులు 3:5-9.
14 దేవుని జతపనివారముగా, విశ్వసనీయంగా మనం “రాజ్యమును గూర్చిన వాక్యము”ను ప్రజల హృదయాల్లో నాటాలి, అటుతర్వాత ఏమైనా ఆసక్తి చూపించబడినప్పుడు చక్కగా సిద్ధపడిన పునర్దర్శనాల ద్వారా బైబిలు పఠనాల ద్వారా ఆ ఆసక్తికి నీరుపోయాలి. హృదయమనే నేల మంచిదైతే బైబిలు సత్య విత్తనం ఒక ఫలభరితమైన చెట్టుగా ఎదిగేలా యెహోవా తన వంతును తాను నిర్వర్తిస్తాడు. (మత్తయి 13:19, 23) ఆయన ఆ వ్యక్తిని తనవైపుకీ తన కుమారునివైపుకీ ఆకర్షించుకుంటాడు. కాబట్టి విశ్లేషణలో చివరికి తేలినదేమిటంటే రాజ్య ప్రచారకుల సంఖ్యలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ప్రజల హృదయాలపై యెహోవా పనిచేయడం మూలంగానే, సత్య విత్తనం పెరిగేలా చేస్తూ అటువంటివారిని తనవైపుకీ తన కుమారునివైపుకీ ఆకర్షించడం మూలంగానే.
నిలిచివుండే నిర్మాణపని
15. ఇతరులు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ఎలా సహాయపడగలమో చూపించడానికి పౌలు ఏ దృష్టాంతాన్ని ఉపయోగించాడు?
15 మనం అభివృద్ధి జరిగినప్పుడు చూసి ఆనందిస్తాము, అదే సమయంలో ఆ ప్రజలు యెహోవాను ప్రేమిస్తుండాలనీ, ఆయన స్వరాన్ని వింటుండాలనీ, ఆయనకు హత్తుకునే ఉండాలనీ మనం హృదయపూర్వకంగా కోరుకుంటాము. ఎవరైనా చల్లారిపోయి, పడిపోయినప్పుడు మనకు ఎంతో విచారం కలుగుతుంది. దీన్ని నివారించడానికి మనం ఏమైనా చేయవచ్చా? మరో దృష్టాంతంలో, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చో పౌలు చూపిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.”—1 కొరింథీయులు 3:11-13.
16. (ఎ) పౌలు ఉపయోగించిన రెండు దృష్టాంతాల లక్ష్యాలు ఎలా వేరుగా ఉన్నాయి? (బి) మన నిర్మాణ పని అసంతృప్తికరంగా ఎలా తయారుకాగలదు, అగ్నికి తాళుకోలేనిదిగా ఎలా తయారుకాగలదు?
16 పొలాన్ని గురించిన పౌలు దృష్టాంతములో, అభివృద్ధి అనేది మనస్సాక్షిపూర్వకంగా నాటడంపైన, క్రమంగా నీరుపోయడంపైన, దేవుడు ఆశీర్వదించడంపైన ఆధారపడివుంటుంది. అపొస్తలుని మరో దృష్టాంతము, తాను నిర్మించిన కట్టడానికి ఏమి అవుతుందన్న విషయంలో క్రైస్తవ పరిచారకునికున్న బాధ్యతను ఉన్నతపరుస్తుంది. ఆయన కచ్చితమైన పునాదిమీదే నాణ్యతగల వస్తువులతో నిర్మించాడా? పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు: “ప్రతివాడు . . . ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 3:10) ఒక వ్యక్తికి పరదైసులోని నిత్యజీవ నిరీక్షణలో ఆసక్తిని రేకెత్తించిన తర్వాత, మనం మన బోధను లేఖనాధార జ్ఞానపు ప్రాథమిక విషయాలపైనే కేంద్రీకరిస్తూ నిత్య జీవాన్ని పొందడానికి ఆయన లేదా ఆమె ఏమి చెయ్యాలన్న దాన్నే ప్రాముఖ్యంగా నొక్కిచెబుతామా? మన బోధలో కేవలం, ‘మీరు పరదైసులో నిరంతరం జీవించాలంటే పఠనం చేయాలి, కూటాలకు వెళ్లాలి, ప్రకటనా పనిలో భాగంవహించాలి’ అన్నవే ఉంటున్నాయా? అలా చేస్తున్నట్లైతే, మనం ఆ వ్యక్తి విశ్వాసాన్ని స్థిరమైన పునాదిపైన నిర్మించడంలేదు, అంతేకాదు మనం నిర్మిస్తున్న నిర్మాణం శ్రమల అగ్నిని తాళుకోలేకపోవచ్చు లేదా కాలపరీక్షకు నిలువలేకపోవచ్చు. యెహోవాను సేవిస్తూ గడిపిన ఏవో కొద్ది సంవత్సరాలకు ప్రతిగా పరదైసులో జీవితమనే నిరీక్షణ ద్వారా మనం ప్రజల్ని యెహోవావైపుకి ఆకర్షించడానికి ప్రయత్నించడం “కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు” వంటివాటితో నిర్మించడం వంటిదే.
దేవునిపట్ల క్రీస్తుపట్ల ప్రేమను పెంపొందింపజేయడం
17, 18. (ఎ) ఒకరి విశ్వాసం నిలిచేదిగా ఉండాలంటే ఏది అత్యావశ్యకమైనది? (బి) క్రీస్తు ఒకరి హృదయంలో నివసించేలా చేయడానికి మనం అతనికి లేదా ఆమెకు ఎలా సహాయం చేయగలము?
17 విశ్వాసం నిలవాలంటే అది యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవునితో మనకు ఉన్న వ్యక్తిగత సంబంధంపై ఆధారపడివుండాలి. అపరిపూర్ణ మానవులుగా మనం దేవునితో అటువంటి శాంతియుతమైన సంబంధాన్ని కేవలం ఆయన కుమారుని ద్వారానే ఏర్పరచుకోవడం సాధ్యమౌతుంది. (రోమీయులు 5:10) గుర్తుంచుకోండి, యేసు ఇలా చెప్పాడు: “నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇతరులకు సహాయపడటానికి “వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.” ఇందులో ఏమి ఇమిడివుంది?—యోహాను 14:6; 1 కొరింథీయులు 3:11.
18 క్రీస్తు పునాదిగాగల కట్టడాన్ని నిర్మించడం అంటే, విమోచకునిగా, సంఘ శిరస్సుగా, ప్రేమపూర్ణుడైన ప్రధాన యాజకునిగా, ఏలుతున్న రాజుగా యేసు యొక్క పాత్రను గురించిన పూర్ణ జ్ఞానము పొందడం ద్వారా బైబిలు విద్యార్థి యేసుపట్ల ప్రగాఢమైన ప్రేమను పెంపొందించుకునే విధంగా బోధించడం అని అర్థం. (దానియేలు 7:13, 14; మత్తయి 20:28; కొలొస్సయులు 1:18-20; హెబ్రీయులు 4:14-16) నిజానికి యేసు వారి హృదయాల్లోనే నివసించేంతగా ఆయనను వారికి వాస్తవికమైన వ్యక్తిగా చేయాలనే దానర్థం. వారి నిమిత్తం మనం చేసే ప్రార్థన పౌలు ఎఫెసులోని క్రైస్తవుల పక్షంగా చేసిన విజ్ఞాపనవలే ఉండాలి. ఆయనిలా వ్రాశాడు: “తండ్రియెదుట నేను మోకాళ్లూని . . . క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగా . . . మీకు దయచేయవలెనని . . . ప్రేమయందు వేరుపారి స్థిరపడి [యుండవలెనని] ప్రార్థించుచున్నాను.”—ఎఫెసీయులు 4:14-19.
19. మన బైబిలు విద్యార్థుల హృదయాల్లో క్రీస్తుపట్ల ప్రేమను పెంపొందింపజేయడం యొక్క ఫలితం ఏమైవుండాలి, కానీ ఏమి నేర్పించబడాలి?
19 మన విద్యార్థుల హృదయాల్లో క్రీస్తుపట్ల ప్రేమ పెంపొందే విధంగా మనం నిర్మిస్తే, ఇది సహేతుకంగానే యెహోవా దేవునిపట్ల ప్రేమ పెంపొందడంగా పరిణమిస్తుంది. యేసు కనబరిచిన ప్రేమ, అనుభూతి, వాత్సల్యం అనేవి యెహోవా లక్షణాల విశ్వసనీయమైన ప్రతిబింబమే. (మత్తయి 11:28-30; మార్కు 6:30-34; యోహాను 15:13, 14; కొలొస్సయులు 1:15; హెబ్రీయులు 1:3) కాబట్టి ప్రజలు యేసు గురించి తెలుసుకుని ఆయన్ను ప్రేమించడం ప్రారంభిస్తుండగా, వారు యెహోవాను తెలుసుకుని ఆయన్ను ప్రేమించడం ప్రారంభిస్తారు.a (1 యోహాను 4:14, 16, 19) మానవజాతికోసం క్రీస్తు చేసినదానంతటి వెనుక యెహోవా ఉన్నాడనీ, అందుకని “దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు” గనుక మనం దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, ఆరాధన చెల్లించవలసి ఉన్నామని మనం మన బైబిలు విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉంది.—కీర్తన 68:19, 20; యెషయా 12:2-5; యోహాను 3:16; 5:19.
20. (ఎ) ప్రజలు దేవునికీ ఆయన కుమారునికీ సన్నిహితులు కావడానికి మనం వారికి ఎలా సహాయపడగలము? (బి) తర్వాతి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?
20 దేవుని జతపనివారముగా మనం, ప్రజలు తమ హృదయాల్లో ప్రేమనూ విశ్వాసాన్నీ పెంపొందించుకోవడానికి సహాయపడుతూ దేవునికీ ఆయన కుమారునికీ వాళ్లు సన్నిహితులు కావడానికి సహాయపడదాము. ఆ విధంగా యెహోవా వారికి వాస్తవికమైన వ్యక్తిగా అవుతాడు. (యోహాను 7:28) క్రీస్తు ద్వారా వారు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని స్థాపించుకోగలుగుతారు, ఆయన్ను ప్రేమించి ఆయన్ను హత్తుకుంటారు. యెహోవా చేసిన అద్భుతమైన వాగ్దానాలు ఆయన నిర్ణీత కాలంలోనే నెరవేరుతాయని విశ్వసిస్తూ వారు తాము ప్రేమతో చేసే సేవకు ఏ కాలపరిమితినీ పెట్టరు. (విలాపవాక్యములు 3:24-26; హెబ్రీయులు 11:6) అయితే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమలను పెంపొందించుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తూ, ప్రచండమైన తుపానులను తాళుకుని నిలువగల దృఢమైన ఓడలా ఉండేట్లు మనం మన స్వంత విశ్వాసాన్ని నిర్మించుకోవాలి. ఇది తర్వాతి శీర్షికలో చర్చించబడుతుంది.
[అధస్సూచీలు]
a యేసును మరింత బాగా తెలుసుకోవడానికీ, ఆయన ద్వారా ఆయన తండ్రి అయిన యెహోవాను మరింత శ్రేష్ఠంగా తెలుసుకోవడానికీ ఉత్తమ సహాయకం వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించిన జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకం.
పునస్సమీక్షగా
◻ రాజ్య సందేశంలో మనం ప్రజల ఆసక్తిని సాధారణంగా ఎలా రేకెత్తిస్తాము, అయితే ఏ ప్రమాదం జరిగే అవకాశముంది?
◻ యెహోవా తనవైపుకీ తన కుమారునివైపుకీ ఎటువంటి ప్రజల్ని ఆకర్షిస్తాడు?
◻ ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించడం దేనిమీద ఆధారపడివుంది, మనం దీన్నుండి ఏమి నేర్చుకోగలము?
◻ ప్రజలు యెహోవాకూ ఆయన కుమారునికీ సన్నిహితులయ్యేలా చేయడంలో మనం ఏ పాత్ర నిర్వహిస్తాము?
[10వ పేజీలోని చిత్రం]
మనం ప్రజలకు పరదైసులో నిత్యజీవ నిరీక్షణను అందించినప్పటికీ, మన ప్రధాన లక్ష్యం వారిని యెహోవా వైపుకు ఆకర్షింపజేయడమే
[13వ పేజీలోని చిత్రం]
మనం చక్కగా సిద్ధపడితే మన పునర్దర్శనాలు ప్రభావవంతంగా ఉండగలవు