మీ సొంత రక్షణను కొనసాగించుడి!
“ప్రియులారా, . . . భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.”—ఫిలిప్పీయులు 2:12.
1, 2. తమ జీవితాలెలా మార్పు చెందుతాయనేది తమ అదుపులో లేదని అనేకమంది ప్రజలు భావించేలా జనాదరణ పొందిన ఏ సిద్ధాంతాలు నడిపించాయి?
“మీరు ఆ విధంగానే జన్మించారా?” జనాదరణ పొందిన ఒక పత్రిక కవరుపై ఇటీవల ముద్దక్షరాల్లో ఆ ప్రశ్న వేయబడింది. ఆ వార్తా శీర్షిక క్రింద “వ్యక్తిత్వం, స్వభావం, జీవితంలో చేసుకునే ఎంపికలు. అవి ప్రధానంగా మీ జన్యుకణాల్లోనే ఉన్నాయని క్రొత్త అధ్యయనాలు చూపిస్తున్నాయి” అనే మాటలు ఉన్నాయి. అలాంటి మాటలు తమ సొంత జీవితాన్ని అదుపులో పెట్టుకోవడం తమ చేతుల్లో లేదని కొందరు భావించేలా చేయవచ్చు.
2 తల్లిదండ్రుల పెంపకం సరిగ్గాలేకపోవడం, టీచర్లు సరిగ్గా బోధించకపోవడం తాము అసంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేశాయని ఇతరులు ఆందోళనపడతారు. తమ తల్లిదండ్రులు చేసిన తప్పుల్నే మరలా చేయడానికీ, వాళ్లెలా చెడుగా ప్రవర్తించారో అలాగే ప్రవర్తించేలా, యెహోవాపట్ల అవిశ్వాసులమని నిరూపించుకునేలా—క్లుప్తంగా చెప్పాలంటే చెడ్డ ఎంపికల్ని చేసుకునేలా నిర్దేశించబడ్డామని వాళ్లు భావించవచ్చు. బైబిలు బోధిస్తున్నదదేనా? నిజమే, పూర్వ నిర్ధారిత సిద్ధాంతం వంటి దాన్నొకదాన్ని బైబిలు బోధిస్తున్నదని నొక్కిచెప్పే మత చాంధస వాదులు ఉన్నారు. ఈ సిద్ధాంతం ప్రకారంగా, మీ జీవితంలో జరగబోయే ప్రతీ సంఘటననీ దేవుడు ఎంతో కాలం ముందుగానే నిర్ధారించాడు.
3. మన భవిష్యత్తు విషయంలో బాధ్యతను తీసుకునే మన సామర్థ్యాన్ని గురించి బైబిలు ఏ ప్రోత్సాహకరమైన సందేశాన్ని కల్గివుంది?
3 విభిన్నమైన ఈ సిద్ధాంతాలన్నీ ఇస్తున్న సందేశమొక్కటే: మీ జీవితం మారే విధానాన్ని ఎంపికచేసుకోవడానికీ, అదుపులో పెట్టుకోవడానికీ మీకున్న అవకాశాలు చాలా తక్కువ. అదొక నిరుత్సాహపూరితమైన సందేశం, కాదంటారా, మరి ఆ నిరుత్సాహం సమస్యను అధికం చేస్తుంది. సామెతలు 24:10 ఇలా చెబుతోంది: “శ్రమదినమున నీవు క్రుంగియెడల నీవు చేతకాని వాడవగుదువు.” అయితే బైబిలు చెబుతున్న దాని ప్రకారం, మనం ‘మన సొంతరక్షణను కొనసాగించడాన్ని’ నేర్చుకోవడానికి మనం ప్రోత్సహించబడుతున్నాం. (ఫిలిప్పీయులు 2:12) ఈ అనుకూలమైన లేఖనాధార బోధనందు మన నమ్మకాన్ని మనమెలా పెంపొందించుకొనగలం?
మనలో మనం ‘కట్టుకునే’ పని
4. మొదటి కొరింథీయులు 3:10-15 వచనాలు అగ్నినిరోధక వస్తువులతో కట్టబడిన గృహాన్ని గురించి మాట్లాడుతున్నా, ఇది దేన్ని సూచించడం లేదు?
4 మొదటి కొరింథీయులు 3:10-15 వచనాల్లో ఉన్న అపొస్తలుడైన పౌలు ఉపమానాన్ని పరిశీలించండి. అక్కడ, ఆయన క్రైస్తవుడిని కట్టడం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఉపమానంలో ఇమిడివున్న సూత్రాన్ని అంతర్గత పరిచర్యకూ, బాహ్య పరిచర్యకూ అన్వయించవచ్చు. ఒకరు యెహోవా సేవ చేయడానికి తుదకు ఎంపికచేసుకొని, నమ్మకంగా దాన్ని హత్తుకొని ఉంటారా ఉండరా అనే విషయంలో బాధ్యత పూర్తిగా ఆయనకు ఎవరైతే బోధించి, తర్ఫీదునిచ్చారో వారిదేనని ఆయన సూచిస్తున్నాడా? లేదు. శిష్యుడిని కట్టే పనిని బోధకుడు సాధ్యమైనంత చక్కగా చేయాల్సిన ప్రాముఖ్యతను పౌలు నొక్కి చెబుతున్నాడు. కానీ దీనికి ముందున్న శీర్షికలో మనం తెలుసుకున్నట్టుగా, ఆ విషయంలో విద్యార్థికి లేదా శిష్యునికి ఎంపికచేసుకోడానికి ఎలాంటి అవకాశంలేదని ఆయన చెప్పడంలేదు. నిజమే, పౌలు ఉపమానం మనలో మనం కట్టుకునే పనిపైగాక మనం ఇతరుల్లో నిర్మించాల్సిన దానిపైనే కేంద్రీకరిస్తోంది. కట్టినవాడు అగ్నిలో నుండి తప్పించుకున్నా నిర్లక్ష్యంగా కట్టబడినది మాత్రం కాలి బూడిదై పోవడాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు గనుక, ఆ విషయం సుస్పష్టమైంది. అయినప్పటికీ, మనలో మనం కట్టుకునే పనికి సంబంధించి కూడా బైబిలు అలాంటి అలంకారిక భాషనే కొన్నిసార్లు అన్వయిస్తోంది.
5. క్రైస్తవులు తమ్మును తాము ‘కట్టుకునే’ పనిని చేయాలని ఏ లేఖనాలు చూపిస్తున్నాయి?
5 ఉదాహరణకు, యూదా 20, 21 వచనాల్ని పరిశీలించండి: “ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, . . . దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో పౌలు ఉపయోగించిన గ్రీకు పదాన్నే యూదా ఇక్కడ ఉపయోగిస్తున్నా, మన విశ్వాసమనే పునాదిపై మనలో మనం కట్టుకోవడాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్టు అన్పిస్తోంది. క్రైస్తవ గృహాన్ని కట్టడాన్ని గూర్చిన తన ఉపమానంలో పౌలు “పునాది” కోసం ఏ గ్రీకు పదాన్ని ఉపయోగించాడో, లూకా కూడా తన ఇంటి పునాదిని బండమీద వేసుకున్న మనుష్యుని గూర్చి యేసు చెప్పిన ఉపమానాన్ని రాస్తున్నప్పుడు అదే పదాన్ని ఉపయోగించాడు. (లూకా 6:48, 49) అంతేగాక, ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించమని తన తోటి క్రైస్తవులకు ఉద్బోధిస్తున్నప్పుడు, పౌలు “పునాది”పై స్థిరంగా ఉన్నట్టున్న స్థాపించబడడాన్ని గూర్చిన అలంకారిక దృష్టాంతాన్ని ఉపయోగిస్తున్నాడు. అవును, మనలో మనం ‘కట్టుకునే’ పని మనం చేయాలని దేవుని వాక్యం బోధిస్తోంది.—ఎఫెసీయులు 3:15-19; కొలొస్సయులు 1:23; 2:7.
6. (ఎ) సమష్టిగా కట్టడం మూలంగానే ప్రతీ క్రైస్తవ శిష్యుడూ ఎలా తయారౌతాడో ఉదహరించండి. (బి) ప్రతీ శిష్యునికీ ఏ బాధ్యత ఉంది?
6 క్రైస్తవుడ్ని కట్టడమనే పని, ఒక్క వ్యక్తిచేసే పనేనా? ఒక ఇంటిని కట్టాలని మీరు నిర్ణయించుకున్నారని అనుకుందాం. ఇంటి ప్లాన్లు గీసేవాని దగ్గరకు మీరు వెళతారు. ఇంటిని కట్టే పనిలో చాలా వరకూ మీరే చేసుకోవాలని అనుకున్నా, మీతోపాటూ పనిచేయడానికీ, శ్రేష్ఠమైన నిర్మాణపు పద్ధతుల్ని గురించి మీకు సలహా ఇవ్వడానికీ మీరొక కాంట్రాక్టర్ని కుదుర్చుకుంటారు. అతడు పటిష్టమైన పునాదినివేసి, ఇంటి ప్లాన్లు అర్థంచేసుకోడానికి మీకు సహాయంచేసి, కొనాల్సిన నాణ్యమైన వస్తువుల్ని గురించి సలహాల్ని ఇచ్చి, కట్టడాన్ని గురించి మీకు తెలియని వివరాలను గురించి మీకు చెబితే, అతడు తన పనిని చాలా బాగా చేశాడని బహుశా మీరు ఒప్పుకుంటారు. కానీ మీరు అతని సలహాల్ని తోసిరాజని, చౌకబారు వస్తువుల్నో లేక త్వరగా పాడైపోయే వస్తువుల్నో కొని, ఇంటి ప్లాన్‌లో మీకు తోచిన మార్పుల్ని చేస్తే అప్పుడేమిటి? ఆ ఇల్లే గనుక కుప్పకూలిపోతే మీరు ఆ కాంట్రాక్టర్నో లేక ఇంటి ప్లాన్‌గీసిన వ్యక్తినో నిశ్చయంగా తప్పుపట్టలేరు గదా! అదే విధంగా, సమష్టిగా చేసిన గృహ నిర్మాణ ప్రాజెక్టు ఫలితంగానే ప్రతీ క్రైస్తవ శిష్యుడూ తయారౌతాడు. యెహోవాయే ప్రధాన శిల్పి. విద్యార్థికి బోధించి, అతడ్ని కడుతున్న నమ్మకమైన క్రైస్తవునికి, తన “జతపనివార”లలో ఒకనిగా దేవుడు మద్దతునిస్తాడు. (1 కొరింథీయులు 3:9) అయినప్పటికీ విద్యార్థి కూడా అందులో చేరివున్నాడు. తుది విశ్లేషణలో, తన సొంత జీవిత విధానానికి అతడే బాధ్యుడు. (రోమీయులు 14:11బి) తాను చక్కని క్రైస్తవ లక్షణాల్ని కల్గివుండాలని అతడు కోరుకుంటే, వాటిని సంపాదించుకునేందుకూ, తనలో వాటిని కట్టుకునేందుకూ అతడు బాగా కృషిచేయాలి.—2 పేతురు 1:5-8.
7. కొంతమంది క్రైస్తవులు ఏ సవాళ్లను ఎదుర్కుంటారు, మరి ఏది వారు ఓదార్పుపొందేలా చేయవచ్చు?
7 జన్యుశాస్త్రమూ, మన చుట్టూ ఉన్న పరిసరాలూ, మన బోధకుల బోధనా నాణ్యతా అనేవి అర్థరహితమైనవని దీని భావమా? నిశ్చయంగా దాని భావమదికాదు. వాటిలో ప్రతీదీ ప్రాముఖ్యమైనదనీ, ప్రభావితంచేసేదనీ దేవుని వాక్యం గుర్తిస్తోంది. పాపభరితమైన, ప్రతికూలమైన ప్రవృత్తులలో అనేకం జన్మతః వచ్చినవే, మరి వాటితో పోరాడడం కష్టతరమైన విషయమవ్వవచ్చు. (కీర్తన 51:5; రోమీయులు 5:12; 7:21-23) తల్లిదండ్రులు ఇచ్చే శిక్షణా, గృహ వాతావరణమూ పిల్లలపై చెప్పుకోదగినంత ప్రభావాన్ని అంటే, అది మంచిదైనాగానీ, చెడ్డదైనాగానీ చూపించవచ్చు. (సామెతలు 22:6; కొలొస్సయులు 3:21) యూదా మతనాయకులు చేసిన బోధ ఇతరులపై చూపించిన చెడ్డ ప్రభావాల్నిబట్టి ఆ మత నాయకుల్ని యేసు అభిశంసించాడు. (మత్తయి 23:13, 15) నేడు, అలాంటి కారకాలు మనందరిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉదాహరణకు, బాల్యంలో ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితుల మూలంగా కొంతమంది దేవుని ప్రజలు సవాళ్లను ఎదుర్కొంటారు. అలాంటి వారిపట్ల మనం దయనూ, తదానుభూతినీ చూపించడం అవసరం. తమ తల్లిదండ్రులు చేసిన తప్పుల్నే మరలా చేయడానికో లేక అవిశ్వాసులని నిరూపించబడడానికో వాళ్లు ముందుగానే శాసించబడలేదనే బైబిలు సందేశాన్నుండి ఓదార్పును పొందవచ్చు. ప్రాచీన కాలంలోని యూదా రాజుల్లో కొందరు ఈ విషయాన్ని ఎలా ఉదహరిస్తారో పరిశీలించండి.
తమ సొంత ఎంపికల్ని తామే చేసుకున్న యూదా రాజులు
8. యోతాము తండ్రి ఆయన ఎదుట ఏ చెడ్డ మాదిరిని ఉంచాడు, అయినప్పటికీ ఆయన ఏ ఎంపికను చేసుకున్నాడు?
8 ఉజ్జియా పదహారేళ్ల లేత ప్రాయంలో యూదా రాజ్యానికి రాజై, 52 ఏళ్లు పరిపాలించాడు. ఈ పరిపాలనా కాలమందంతటిలో అధికంగా అతడు “తన తండ్రియైన అమజ్యా చర్య యంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.” (2 రాజులు 15:3) దిగ్భ్రాంతిని కల్గించే సైనిక విజయ పరంపరలతో యెహోవా ఆయన్ని ఆశీర్వదించాడు. విచారకరంగా, విజయం ఉజ్జియా తలకెక్కి అహంకారిగా తయారయ్యాడు. గర్విష్టుడై, ఆలయంలో ధూపపీఠంపై యాజకులు మాత్రమే వేయాల్సిన ధూపాన్ని తాను వేయడం ద్వారా యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశాడు. ఉజ్జియాను గద్దిస్తే దానికి ప్రతిస్పందనగా ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. ఆపై అతడు అవమానానికి గురయ్యాడు అంటే, కుష్ఠురోగంతో మొత్తబడినవాడై, శేష జీవితమంతా ఏకాంతవాసాన్ని అనుభవించాల్సి వచ్చింది. (2 దినవృత్తాంతములు 26:16-23) అతని కుమారుడైన యోతాము దీనికంతటికీ ఎలా ప్రతిస్పందించాడు? ఆ చిన్నవాడు తన తండ్రిచే సులభంగా ప్రభావితుడై, యెహోవా దిద్దుబాటుకు ఆగ్రహాన్ని చెందివుండేవాడు. జనులు తప్పుడు మత ఆచరణల్ని ఆచరించారు గనుక ఆయనపై వాళ్లు కూడా హానికరమైన ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు. (2 రాజులు 15:4) కానీ యోతాము తన సొంత ఎంపికను తాను చేసుకున్నాడు. ఆయన “యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను.”—2 దినవృత్తాంతములు 27:2.
9. ఆహాజుపై ప్రభావాన్ని చూపించిన కొన్ని చక్కని మాదిరులు ఏవి, అయినా అతని జీవితమెలా మార్పుచెందింది?
9 యోతాము 16 ఏళ్లపాటు పరిపాలించాడు, ఆ కాలమంతటిలో యెహోవాపట్ల నమ్మకంగానే ఉన్నాడు. ఆ విధంగా ఆయన తన కుమారుడైన ఆహాజు ఎదుట నమ్మకమైన తండ్రిగా ఒక చక్కని మాదిరిని ఉంచాడు. ఇతరుల్ని ప్రభావితుల్ని చేయగలిగే చక్కని మాదిరులు కూడా ఆహాజు ఎదుట ఉన్నాయి. నమ్మకమైన ప్రవక్తలగు యెషయా, హోషేయ, మీకాలు ఆ దేశంలో చురుకుగా ప్రవచిస్తున్న కాలంలో జీవించే ఆశీర్వాదం ఆయనకు లభించింది. అయినప్పటికీ, అతడు చెడ్డ ఎంపికనే చేసుకున్నాడు. “అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.” బయలు దేవత విగ్రహాల్ని చేసి, వాటిని ఆరాధించాడు. తన కుమారుల్లో కొందరిని అగ్నిగుండంలో వేసి అన్యదేవతలకు అర్పించాడు కూడా. ప్రభావాన్ని చూపించగలిగిన చక్కని మాదిరులు ఎన్నివున్నా, అతడు రాజుగానూ, యెహోవా సేవకునిగానూ పూర్తిగా విఫలమయ్యాడు.—2 దినవృత్తాంతములు 28:1-4.
10. ఆహాజు ఎలాంటి తండ్రి, అయినా అతని కుమారుడైన హిజ్కియా ఎలాంటి ఎంపికను చేసుకున్నాడు?
10 పవిత్రారాధనా దృక్కోణంలోనుండి చూస్తే, ఆహాజుకన్నా నికృష్టుడైన తండ్రంటూ ఎవ్వరూ ఉండరు. అయినా ఆహాజు కుమారుడైన హిజ్కియాకు తాను ఎవరికి జన్మించాలనే దాన్ని ఎంపిక చేసుకునే అవకాశంలేదు! బయలుకు ఆహాజు బలిచ్చిన చిన్నపిల్లలు బహుశా హిజ్కియా సొంత సహోదరులే అయివుండొచ్చు. ఈ భయానకమైన పూర్వచరిత్ర హిజ్కియా, యెహోవాపట్ల అవిశ్వాసపూరితమైన జీవితాన్ని గడిపేలా నిర్దేశించిందా? దానికి బదులుగా, హిజ్కియా యూదా రాజ్యాన్ని ఏలిన కొద్దిమంది గొప్ప ఏలికల్లో ఒకనిగా అంటే విశ్వాసీ, జ్ఞానవంతుడూ, ప్రియమైనవాడూ అయిన ఏలికగా అయ్యాడు. “యెహోవా అతనికి తోడుగా ఉండెను.” (2 రాజులు 18:3-7) నిజం చెప్పాలంటే, హిజ్కియా తానింకా చిన్నవయస్సులో ఉండగానే 119వ కీర్తనను రచించాడని నమ్మడానికి తగినంత కారణముంది. అదే గనుక నిజమైతే, “వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను” అని ఆయన ఎందుకు రాశాడో గ్రహించడం అంత కష్టమైన విషయమేమీ కాదు. (కీర్తన 119:28) తీవ్రమైన బాధలు ఎన్నివున్నా హిజ్కియా, జీవితంలో తనను యెహోవా వాక్యం నడిపించేలా అనుమతించాడు. కీర్తన 119:105 ఇలా చెబుతోంది: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” అవును, హిజ్కియా తనదైన సొంత ఎంపికను, సరియైన ఎంపికను చేసుకున్నాడు.
11. (ఎ) తన తండ్రి మంచి ప్రభావాన్ని చూపించినా, యెహోవాకు విరుద్ధంగా మనష్షే చేసిన తిరుగుబాటు ఎంత తీవ్రమైనది? (బి) తన జీవితపు చివర దశలో మనష్షే ఎలాంటి ఎంపికను చేసుకున్నాడు, దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?
11 దానికి భిన్నంగా, శ్రేష్ఠులైన యూదా రాజుల్లో ఒకని నుండి ఎంతో చెడ్డ రాజు వచ్చాడు. హిజ్కియా కుమారుడైన మనష్షే విగ్రహారాధననూ, అభిచారాన్నీ, ఇంతకు ముందెన్నడూ సంభవించనంతటి విస్తృతమైన హింసనూ పెంపొందింపచేశాడు. “యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు” పంపుతూ వచ్చాడని నివేదిక తెలియజేస్తోంది. బహుశా వాటిని ఆయన తన ప్రవక్తల ద్వారా పంపించి ఉంటాడు. (2 దినవృత్తాంతములు 33:10) యూదా పారంపర్యాచారం తెలియజేస్తున్నట్టుగా, దానికి ప్రతిస్పందనగా మనష్షే యెషయాను రంపాలతో కోయించాడు. (పోల్చండి హెబ్రీయులు 11:37.) అది నిజమైనా కాకపోయినా, మనష్షే దైవిక హెచ్చరికల్లో వేటినీ చెవినబెట్టలేదు. నిజం చెప్పాలంటే, అతడు తన తాతయైన ఆహాజు చేసినట్టుగానే తన సొంత కొడుకుల్లో కొంతమందిని అగ్నిగుండంలో బలిగా అర్పించాడు. అయినప్పటికీ, ఈ దుష్టుడు అటు తర్వాత జీవితంలో తానెదుర్కొన్న తీవ్రమైన శ్రమల్నిబట్టి పశ్చాత్తాపపడి, తన మార్గాల్ని మార్చుకున్నాడు. (2 దినవృత్తాంతములు 33:1-6, 11-20) భయానకమైన ఎంపికల్ని చేసుకొన్న ఒక వ్యక్తి, ఇకెంత మాత్రం బాగుపడడనే నిర్ధారణకు రానవసరంలేదని అతని మాదిరి మనకు బోధిస్తోంది. అతడు మారగలడు.
12. యెహోవాకు చేసే సేవ విషయంలో ఆమోను, అతని కుమారుడైన యోషీయాలు ఏ విభిన్నమైన ఎంపికల్ని చేసుకున్నారు?
12 మనష్షే కుమారుడైన ఆమోను తన తండ్రి కనుపర్చిన పశ్చాత్తాపాన్నుండి ఎంతో నేర్చుకొనగలిగే వాడే. కానీ అతడు కూడా తప్పుడు ఎంపికను చేసుకున్నాడు. నిజానికి ఆమోను తాను హత్యచేయబడేంతవరకూ “అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.” అతని కుమారుడైన యోషీయా దీనికి భిన్నంగా ఉన్నాడు. యోషీయా తన తాతగారికి సంభవించినదాన్నుండి నేర్చుకోవడానికి ఎంపికచేసుకున్నట్టుగా కనబడుతుంది. అతడు ఎనిమిదేళ్ల ప్రాయంలో పరిపాలనారంభించాడు. అతనికి 16 ఏళ్లు వచ్చేటప్పటికి, యెహోవాను వెదకనారంభించాడు, మరి అటు తర్వాత తననుతాను ఒక మాదిరికరమైన, నమ్మకమైన రాజుగా రుజువు చేసుకున్నాడు. (2 దినవృత్తాంతములు 33:20–34:5) అతడొక ఎంపికను, సరియైన ఎంపికను చేసుకున్నాడు.
13. (ఎ) మనమిప్పుడు పరిశీలించిన యూదా రాజుల నుండి మనమేం నేర్చుకుంటాం? (బి) తల్లిదండ్రులు ఇచ్చే శిక్షణ ఎంత ప్రాముఖ్యమైంది?
13 యూదాను పరిపాలించిన ఏడుగురు రాజుల్ని గూర్చిన ఈ క్లుప్త పరిశీలన ఒక శక్తివంతమైన గుణపాఠాన్ని బోధిస్తోంది. కొన్ని సందర్భాల్లో, చెడ్డ రాజులకు మంచి కుమారులు పుట్టారు, దానికి భిన్నంగా, శ్రేష్ఠమైన రాజులకు నీచులైన కొడుకులు పుట్టారు. (పోల్చండి ప్రసంగి 2:18-21.) తల్లిదండ్రులు ఇచ్చే తర్ఫీదు యొక్క ప్రాముఖ్యతను ఇది తగ్గించివేయదు. యెహోవా మార్గానికి అనుగుణంగా తమ పిల్లలకు శిక్షణనిచ్చే తల్లిదండ్రులు, యెహోవా దేవుని నమ్మకమైన సేవకులుగా తయారయ్యేందుకు తమ సంతానానికి సాధ్యమైన సదవకాశాన్ని నిశ్చయంగా ఇస్తారు. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) అయినప్పటికీ, నమ్మకమైన తల్లిదండ్రులు ఎంత బాగా ప్రయత్నించినప్పటికీ, కొంతమంది పిల్లలు చెడు నడవడిని అనుసరించడానికే ఎంపికచేసుకుంటారు. మరి కొందరైతే, తల్లిదండ్రుల ప్రభావం ఎంత చెడ్డదైనా సరే, యెహోవాను ప్రేమించి, ఆయన సేవచేయడానికే ఎంపిక చేసుకుంటారు. ఆయన ఆశీర్వాదంతో, తమ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారు. వాటిలో ఏది మీదౌతుందా అని అప్పుడప్పుడూ మీరు అనుకుంటారా? అయితే, మీరు సరియైన ఎంపికను చేసుకోగలరని యెహోవాయే స్వయంగా ఇస్తున్న కొన్ని అభయాల్ని పరిశీలించండి!
యెహోవాకు మీపై నమ్మకముంది!
14. యెహోవా మన పరిమితుల్ని అర్థంచేసుకుంటాడని మనకెలా తెలుసు?
14 యెహోవా సమస్తాన్ని చూస్తున్నాడు. సామెతలు 15:3 ఇలా చెబుతోంది: “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.” యెహోవాను గురించి రాజైన దావీదు ఇలా తెలియజేశాడు: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను.” (కీర్తన 139:16) మీ అదుపులోలేని ఇతర ప్రభావాల ఫలితంగా సంప్రాప్తించినవైనప్పటికీ లేదా స్వాభావికంగా వచ్చినవైనప్పటికీ మీరెలాంటి ప్రతికూల ప్రవృత్తులకు విరుద్ధంగా పోరాడుతున్నారో యెహోవాకు తెలుసు. ఇవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశాయనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా అర్థంచేసుకుంటాడు. ఆయన మీకున్న పరిమితుల్ని మీకన్నా బాగా అర్థంచేసుకుంటాడు. ఆయన కనికరంగలవాడు. మనం సహేతుకంగా చేయగలదానికన్నా ఎక్కువగా ఆయన మననుండి ఎన్నడూ కోరడు.—కీర్తన 103:13, 14.
15. (ఎ) ఇతరులచే ఉద్దేశపూర్వకంగా గాయపర్చబడిన వారు స్వాంతన పొందడానికున్న ఒక మూలమేమిటి? (బి) మనకే బాధ్యతను ఇవ్వడం ద్వారా మనలో ప్రతీ ఒక్కర్నీ యెహోవా గౌరవిస్తున్నాడు?
15 మరో వైపున, యెహోవా మనల్ని పరిస్థితులకు బలైపోయిన నిస్సహాయులుగా దృష్టించడు. గతంలో మనకు చెడు అనుభవాలు ఎదురైవుంటే, ఉద్దేశపూర్వకమైన అలాంటి హానికరమైన ప్రవర్తనను యెహోవా అసహ్యించుకుంటాడనే నిశ్చయతనుబట్టి మనం స్వాంతన పొందవచ్చు. (కీర్తన 11:5; రోమీయులు 12:19) అయితే, మనం ప్రక్కకు తొలగి, తెలిసీ తప్పుడు ఎంపికల్ని చేసుకుంటే ఆయన వాటి పర్యవసానాలనుండి మనల్ని మినహాయిస్తాడా? మినహాయించడు. “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను” అని ఆయన వాక్యం చెబుతోంది. (గలతీయులు 6:5) తన తెలివైన ప్రాణుల్లో ప్రతీ ప్రాణికీ సరియైన దాన్ని చేసే బాధ్యతనూ, తన సేవచేసే బాధ్యతనూ ఇచ్చి ఆయన వారిని గౌరవిస్తున్నాడు. అది, మోషే ఇశ్రాయేలు జనాంగానికి చెప్పినదానివలే ఉంది: “నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. . . . నీవును నీ సంతానమును బ్రదుకుచు, . . . జీవమును కోరుకొనుడి.” (ద్వితీయోపదేశకాండము 30:19, 20) మనం కూడా సరియైన ఎంపికను చేసుకోగలమని యెహోవాకు నమ్మకముంది. అది మనకెలా తెలుసు?
16. ‘మన సొంత రక్షణ కోసం కొనసాగిస్తుండడం’లో మనమెలా సఫలులంకాగలం?
16 అపొస్తలుడైన పౌలు రాసిన దాన్ని గమనించండి: “కాగా నా ప్రియులారా, . . . భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయంచుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” (ఫిలిప్పీయులు 2:12, 13) ‘కొనసాగించడం’ అనే పదం కోసం ఉపయోగించబడిన మూల గ్రీకు పదం, ఇక్కడ పరిపూర్ణతకు తీసుకురావడమనే భావాన్ని స్ఫురింపచేస్తుంది. కాబట్టి విఫలులమవ్వడానికీ లేక విడిచిపెట్టబడడానికీ మనలో ఏ ఒక్కరూ ముందుగా నిర్దేశించబడలేదు. తాను మనకు అనుగ్రహించిన పనిని, అదే మన సొంత రక్షణకు నడిపించే పనిని మనం పూర్తిచేయగలమనే నిశ్చయత యెహోవా దేవునికి ఉండివుంటుంది. లేకపోతే, ఆయన ఆ లేఖనాన్ని ప్రేరేపించి రాయించి ఉండేవాడు కాడు. అయితే మనమెలా సఫలమౌతాం? మన సొంత శక్తినిబట్టి మాత్రం కాదు. మనలో తగినంత శక్తివుంటే, మనం తగినంత శక్తిమంతులమైతే, ‘భయపడాల్సిన, వణకాల్సిన’ అవసరమేమీ ఉండదు. దానికి భిన్నంగా, యెహోవా ‘మనలో కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు.’ మనం ‘ఇచ్ఛయంచి, కార్యసిద్ధి కలుగజేసుకొనేలా’ మనకు సహాయపడుతూ, ఆయన పరిశుద్ధాత్మ మన మనస్సుల్లోనూ, హృదయాల్లోనూ పనిచేస్తోంది. ఆ ప్రేమపూర్వకమైన సహాయంతో, జీవితంలో సరియైన ఎంపికల్ని చేసుకొని, వాటికి అనుగుణంగా జీవించకుండా ఉండడానికి తగ్గ కారణమేదైనా ఉందా? లేనేలేదు!—లూకా 11:13.
17. మనలో మనం ఎలాంటి మార్పుల్ని చేసుకోగలం, అలా చేసుకునేలా యెహోవా మనకెలా సహాయపడతాడు?
17 మనం అధిగమించాల్సిన ఆటంకాలు ఉంటాయి అంటే బహుశా మన ఆలోచనా సరళిని వక్రీకరించే దీర్ఘకాలిక చెడ్డ అలవాట్లూ, హానికరమైన ప్రభావాలూ ఉంటాయి. అయినప్పటికీ, యెహోవా ఆత్మ సహాయంతో, వాటిని మనం అధిగమించగలం! కొరింథులో ఉన్న క్రైస్తవులకు పౌలు రాసినట్లుగా, దేవుని వాక్యం “దుర్గములను పడద్రోయజాలినంత” శక్తివంతమైనది. (2 కొరింథీయులు 10:4) నిజం చెప్పాలంటే యెహోవా, విస్తృతమైన మార్పులు చేసుకోవడానికి మనకు సహాయం చేయగలడు. “పాచీనస్వభావమును వదులుకొ[నమనీ],” “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలె[ననీ]” ఆయన వాక్యం మనకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 4:22-24) అలాంటి మార్పుల్ని చేసుకునేందుకు యెహోవా ఆత్మ మనకు నిజంగా సహాయం చేయగలదా? నిశ్చయంగా! దేవుని ఆత్మ, మనమంతా అలవర్చుకోవాలని కోరుకునే రమ్యమైన, అమూల్యమైన లక్షణాల్ని మనలో ఉత్పన్నం చేస్తుంది. వాటిలో మొదటిది ప్రేమ.—గలతీయులు 5:22, 23.
18. సహేతుకంగా ఆలోచించే ప్రతీ మానవుడూ ఏ ఎంపికను చేసుకునే అవకాశం సంపూర్ణంగా ఉంది, ఏం చేయాలని నిశ్చయించుకునేలా మనకిది సహాయపడాలి?
18 స్వేచ్ఛననుగ్రహించే గొప్ప సత్యం అందులోనే ఉంది. ప్రేమను చూపించడంలో యెహోవా దేవునికి అపరిమితమైన సామర్థ్యం ఉంది, మరి మనమాయన స్వరూపంలోనే సృజించబడ్డాం. (ఆదికాండము 1:26; 1 యోహాను 4:8) కాబట్టి యెహోవాను ప్రేమించాలని మనం ఎంపికచేసుకోగలం. మన భవిష్యత్తుకు కీలకం—మన మునుపటి జీవితమో, వారసత్వంగా వచ్చిన లోపాలో, తప్పుచేయాలనే ప్రవృత్తో కాదుగానీ ఆ ప్రేమే. ఏదెను వనంలో నమ్మకంగా ఉండడానికి ఆదాము హవ్వలకు అవసరమైంది యెహోవా దేవునిపట్ల ప్రేమే. అర్మగిద్దోనును తప్పించుకుని, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతంలో చివరి పరీక్షలో విజయం సాధించేందుకూ మనలో ప్రతీ ఒక్కరికీ కావాల్సింది ఆ ప్రేమే. (ప్రకటన 7:14; 20:5, 7-10) మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మనలో ప్రతీ ఒక్కరమూ అలాంటి ప్రేమను అలవర్చుకోగలం. (మత్తయి 22:37; 1 కొరింథీయులు 13:13) యెహోవాను ప్రేమించేందుకు, నిరంతరమూ ఆ ప్రేమపై కట్టబడేందుకూ మనం నిశ్చయించుకుందాం.
మీరేం ఆలోచిస్తారు?
◻ వ్యక్తిగత బాధ్యతను గూర్చిన బైబిల్లోని అనుకూల బోధను ఏ జనాదరణ పొందిన సిద్ధాంతాలు విభేదిస్తాయి?
◻ ప్రతీ క్రైస్తవుడూ తనను తాను కట్టుకునే ఏ పనిని చేపట్టాలి?
◻ ప్రతీ వ్యక్తీ తన సొంత ఎంపికల్ని చేసుకుంటాడని యూదా రాజుల మాదిరిలు ఏ విధంగా చూపిస్తున్నాయి?
◻ మనచుట్టూ ప్రతికూల ప్రభావాలు ఉన్నా, జీవితంలో మనం సరియైన ఎంపికల్ని చేసుకోగలమని యెహోవా మనకెలా అభయమిస్తున్నాడు?
[15వ పేజీలోని చిత్రం]
మీ భవిష్యత్తు జన్యుకణాలచే నిర్ధారించబడుతుందా?
[17వ పేజీలోని చిత్రం]
తన తండ్రి తన ఎదుట చెడ్డ మాదిరిని ఉంచినా, రాజైన యోషీయా దేవుడ్ని సేవించాలనే ఎంపికచేసుకున్నాడు