సమస్యలను శాంతియుతంగా ఎలా పరిష్కరించుకోవచ్చంటే
మానవజాతికి ఎంత వయస్సుందో మానవుల హింసాప్రవృత్తికి కూడా దాదాపు అంతే వయస్సు ఉంది. హింసాప్రవృత్తి జాడలను చూపిస్తూ బైబిలు మనలను కయీను దగ్గరకు తీసుకువెళ్తుంది. కయీను మొదటి మానవ జత యొక్క పెద్ద కుమారుడు, హేబెలుకు అన్న. తన బలులకన్నా హేబెలు బలులనే దేవుడు ఆమోదించగా, కయీనుకు “మిక్కిలి కోపము వచ్చిం[ది].” ఆ పరిస్థితిలో అతడు ఎలా వ్యవహరించాడు? ‘కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతడిని చంపాడు.’ ఆ తర్వాత, దేవుడితో తనకున్న సంబంధం తీవ్రంగా దెబ్బతిందని గ్రహించాడు. (ఆదికాండము 4:5, 8-12) తను హింసకు పాల్పడడం తనను గురించి తన సృష్టికర్తకున్న చెడు అభిప్రాయాన్ని మార్చలేకపోయింది.
సమస్యలను పరిష్కరించుకునేందుకు శారీరక బలాన్ని ఉపయోగించిన కయీను పద్ధతిని అనుసరించకుండా ఉండడానికి మనం ఎలా జాగ్రత్తవహించవచ్చు?
హింసించే బదులు సహించడం
మొదటి క్రైస్తవ హతసాక్షియైన స్తెఫను హత్యను ఆమోదిస్తూ చూస్తూ నిలబడిన మనిషినే తీసుకోండి. (అపొస్తలుల కార్యములు 7:58, 60) తార్సు వాడైన సౌలు స్తెఫను యొక్క మతపరమైన దృక్పథంతో ఏకీభవించలేదు. కనుక, స్తెఫను క్రియాశీలతలను ఆపేందుకు ఆయనను చిత్రవధ చేసి చంపేయడమే సమర్థనీయమైన మార్గమన్న తలంపుకు సౌలు మద్దతునిచ్చాడు. నిజమే, సౌలు తన జీవితంలోని ప్రతి అంకంలోను హింసాయుతంగా ఉండి ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఆయన సమస్యా పరిష్కారంగా హింసను అంగీకరించేందుకు సుముఖత చూపించాడు. స్తెఫను హత్య జరిగిన వెంటనే, సౌలు “ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయ, చెరసాలలో వేయంచి [క్రైస్తవ] సంఘమును పాడుచేయ”డం మొదలుపెట్టాడు.—అపొస్తలుల కార్యములు 8:3.
బైబిలు పండితుడైన ఆల్బర్ట్ బార్న్స్ అభిప్రాయం ప్రకారం, “పాడుచేయుచు” అని అనువదించబడిన గ్రీకు పదబంధం సింహాలు, నక్కలు వంటి వన్య మృగాలు చేసే నాశనాన్ని సూచిస్తుంది. “సౌలు వన్య మృగంలాగా క్రైస్తవ సభ మీద విరుచుకుపడ్డాడు—ఈ వ్యక్తీకరణ పీడించడంలో నిమగ్నమైనప్పుడు ఆయనకున్న ఆవేశాన్ని ఆగ్రహాన్ని సూచిస్తుంది” అని బార్న్స్ వివరిస్తున్నారు. సౌలు క్రీస్తు అనుచరులను మరెక్కువ మందిని గుంపుగా పట్టుకు వచ్చేందుకు దమస్కుకు బయల్దేరినప్పుడు, ఆయన “[క్రీస్తు] ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు” భావించాడు. మధ్య దారిలో, పునరుత్థానం చెందిన యేసు ఆయనతో మాట్లాడాడు. అది సౌలును క్రైస్తవత్వంలోకి మార్చింది.—అపొస్తలుల కార్యములు 9:1-19.
ఆ మతమార్పిడి తర్వాత, సౌలు ఇతరులతో వ్యవహరించే విధానం మారిపోయింది. 16 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక సంఘటన ఆ మార్పును తెలియజేస్తుంది. అంతియొకయలో ఆయన మొదటినుండి సహవసిస్తున్న క్రైస్తవ సంఘానికి ఒక గుంపు ప్రజలు వచ్చి, మోషే ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా నడుచుకోమని క్రైస్తవులను బలవంతం చేశారు. ఫలితంగా “విశేష వివాదము” జరిగింది. ఈ సమయానికెల్లా సౌలు పౌలు అని పిలువబడుతున్నాడు. ఆయన ఈ వివాదంలో పాల్గొన్నాడు. తీవ్రమైన వాగ్వివాదం కలిగిందన్నది స్పష్టం. కాని పౌలు హింసకు పాల్పడలేదు. కాని ఆ వివాదం విషయమై అపౌస్తలులనూ, యెరూషలేము సంఘ పెద్దలనూ సంప్రదించుదామన్న సంఘ నిర్ణయాన్ని ఆయన అంగీకరించాడు.—అపొస్తలుల కార్యములు 15:1, 2.
యెరూషలేములో, పెద్దల సమావేశంలో మళ్ళీ “బహు తర్కము” జరిగింది. పౌలు ‘ఆ సమూహమంతా ఊరకుండే’ వరకు ఎదురు చూసి ఆ తర్వాత, సున్నతిపొందని విశ్వాసుల మధ్య దేవుడి పరిశుద్ధాత్మ చేసిన అద్భుత కార్యాలను వివరించాడు. లేఖనసహితమైన చర్చ తర్వాత, సున్నతిపొందని విశ్వాసులపై అనవసరమైన భారము మోపకూడదని, అయితే, “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను” అని వాళ్ళకు బోధించాలనే ‘ఏకాభిప్రాయము’నకు అపొస్తలులూ, యెరూషలేము పెద్దలూ వచ్చారు. (అపొస్తలుల కార్యములు 15:3-29) వాస్తవంగానే, పౌలు మారిపోయాడు. వివాదాలను హింసారహితంగా పరిష్కరించడమెలాగో ఆయన నేర్చుకున్నాడు.
హింసాయుత ధోరణులను అధిగమించడం
“ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని [ఎదురాడువారిని] సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను” అని తర్వాత పౌలు ఉద్బోధించాడు. (2 తిమోతి 2:24-26) క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా వ్యవహరించమని వయస్సులో చిన్నవాడైన, పైవిచారణకర్తయైన తిమోతికి పౌలు బోధించాడు. పౌలు వాస్తవిక దృష్టిగలవాడు. క్రైస్తవుల మధ్యన కూడా భావోద్వేగాలు చెలరేగగలవని ఆయనకు తెలుసు. (అపొస్తలుల కార్యములు 15:37-41) “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు” అని ఆయన సహేతుకంగానే ఉపదేశించాడు. (ఎఫెసీయులు 4:26) ఆగ్రహావేశాలు అదుపు తప్పి పెల్లుబికకుండా, కోపాన్ని నిగ్రహించుకోవడమే భావోద్వేగాలను సంభాళించుకునే చక్కని మార్గం. కాని అదెలా సాధ్యం?
నేడు కోపాన్ని అణుచుకోవడం సులభం కాదు. “చిర్రుబుర్రులాడడం సర్వసాధారణమైపోయింది. వాస్తవానికి, సత్సంబంధాలు కలిగి ఉండడం—సర్దుకుపోవడం, రాజీపడడం, సానుభూతి కలిగివుండడం, క్షమించడం—అనేవి సాధారణంగా చేతకానితనంగా చెప్పుకోబడుతున్నాయి” అని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ అధికారి అయిన డా. డెబ్ర ప్రుత్రో స్టిత్ అంటున్నారు. అయితే, అవే అసలైన పురుష లక్షణాలు. మన అంతరంగంలో ఉవ్వెత్తున లేచే హింసా ధోరణులను అదుపు చేసుకునేందుకు అవే కీలకాలు.
క్రైస్తవుడైనప్పుడు, పౌలు అభిప్రాయ వ్యత్యాసాలతో వ్యవహరించే మేలైన విధానాన్ని నేర్చుకున్నాడు. అది బైబిలు బోధలపై ఆధారపడింది. విద్యాధికుడైన యూదా మత పండితుడిగా పౌలుకు హెబ్రీలేఖనాలు బాగా పరిచయమే. “బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు.” “పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు.” “ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే” వంటి లేఖనాలను గురించి ఆయన బాగా ఎరిగి ఉంటాడు. (సామెతలు 3:31; 16:32; 25:28) అయితే ఆ జ్ఞానము, మతం మార్చుకోక ముందు, క్రైస్తవులను హింసించడం నుండి పౌలును మళ్ళించలేదు. (గలతీయులు 1:13, 14) హింసకు బదులు సహేతుకతనూ, ఒప్పించే కళనూ ఉపయోగిస్తూ భావోద్వేగ వ్యత్యాసాలు ఇమిడివున్న వివాదాలను పరిష్కరించడంలో క్రైస్తవుడిగా పౌలుకు సహాయపడినదేమిటి?
పౌలు “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని చెప్పినప్పుడు మనకొక సంకేతాన్నిచ్చాడు. (1 కొరింథీయులు 11:1) యేసుక్రీస్తు తన కోసం చేసినదాని విషయమై ఆయన చాలా గొప్ప మెప్పుదల కలిగివున్నాడు. (1 తిమోతి 1:13, 14) అతడు వెంబడించడానికి క్రీస్తే ఆయనకు మాదిరి అయ్యాడు. యేసు పాపభరితమైన మానవజాతి కోసం కష్టాలను ఎలా అనుభవించాడో ఆయనకు తెలుసు. (హెబ్రీయులు 2:18; 5:8-10) “అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు” అని మెస్సీయాను గూర్చిన యెషయా ప్రవచనం యేసులో నెరవేరడాన్ని పౌలు పరిశీలించగలిగాడు. (యెషయా 53:7) “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.—1 పేతురు 2:23, 24.
క్లిష్టమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు వ్యవహరించిన విధానం విషయమై పౌలుకు కలిగిన మెప్పుదల తన పద్ధతిని మార్చుకునేందుకు ఆయనను కదిలించింది. “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి” అని ఆయన తన తోటి విశ్వాసులకు సలహా ఇవ్వగలిగాడు. (కొలొస్సయులు 3:13) హింసాత్మక ప్రవృత్తితో ఉండకూడదని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. మన కోసం యెహోవా, యేసుక్రీస్తూ చేసినవాటిని గుణగ్రహించడం హింసా ప్రవృత్తులను అధిగమించేందుకు అవసరమైన ప్రేరణను మనం పొందడానికి సహాయపడుతుంది.
అది సాధ్యమేనా?
జపాన్లోని ఒక వ్యక్తికి అలాంటి బలమైన ప్రేరణ అవసరమయ్యింది. ఆయన తండ్రి సైనికుడు. ఆయన ఒక ముక్కోపి. ఆయన తన కుటుంబాన్ని హింసిస్తూ కుటుంబంపై అధికారం చెలాయించేవాడు. తను హింసా బాధితుడవ్వడం వల్లా, తన తల్లి కూడా అలాగే హింసకు గురై బాధపడుతుండడాన్ని చూడడం వల్లా, ఈ వ్యక్తి కూడా హింసా ప్రవృత్తినే అలవరచుకున్నాడు. ఆయన వేర్వేరు సైజుల రెండు సమురా కత్తులను పట్టుకుని తిరిగేవాడు. అతడు సమస్యలను పరిష్కరించేందుకూ, అలాగే ప్రజలను బెదిరించేందుకూ వాటిని ఉపయోగించేవాడు.
ఆయన భార్య బైబిలు పఠనాన్ని ఆరంభించినప్పుడు, ఆయన కూడా అంత గంభీరంగా తీసుకోకుండానే తనూ ఆ పఠనానికి కూర్చున్నాడు. అయితే, ఈ రాజ్య సువార్తa అనే చిన్న పుస్తకాన్ని చదివినప్పుడు, ఆయన మారాడు. ఎందుకని? “‘క్రీస్తు యేసు’ ‘క్రయధనం’ అనే సబ్హెడ్డింగ్ల క్రింద ఉన్న సమాచారాన్ని చదివినప్పుడు నాకు సిగ్గేసింది. నేను విచ్చలవిడి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, నేను సర్దుకుపోగల వ్యక్తులతో దయాపూర్వకంగా ఉండడానికే ఇష్టపడేవాడ్ని. నేను నా స్నేహితులను సంతోషపరచడంలో ఆహ్లాదించేవాడ్ని. అయితే అదీ నా సొంత జీవితాన్ని బాధించనంత వరకే. అయితే, దేవుడి కుమారుడైన యేసు మానవజాతి కోసం, నాలాంటి వాళ్ళతో సహా అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. నన్ను ఎవరో కొయ్య సుత్తెతో కొట్టినట్లు ఖంగు తిన్నాను” అని ఆయన వివరిస్తున్నాడు.
ఆయన తన మునుపటి సహవాసులతో సహవసించడం మానేశాడు. ఆయన త్వరలోనే యెహోవా సాక్షుల సంఘంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో తన పేరు చేర్పించుకున్నాడు. ఈ పాఠశాలలో చేరేవారికి బైబిలును ఇతరులకు బోధించే కళను సంపాదించుకోవడానికి ఈ పాఠశాల సహాయపడుతుంది. ఈ క్లాసు ఆయనకు అదనపు ప్రయోజనాన్నిచ్చింది. “నా చిన్నప్పుడు నేను నా అనుభూతులను ఇతరులతో తెలపడం రాక, బెదిరించడాన్నీ హింసనూ ఆయుధాలుగా ఎంచుకున్నాను. నేను నా తలంపులను ఇతరులకు తెలపడాన్ని నేర్చుకున్నాక, హింసకు పాల్పడే బదులు వాళ్ళతో సహేతుకంగా తర్కించడం మొదలుపెట్టాను” ఆని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు.
పౌలులాగే, ఆయన కూడా క్రీస్తు జీవన విధానాన్ని తన సొంతం చేసుకున్నాడా? మునుపు, ఆయనా ఆయన స్నేహితుడు సహచరులుగా ఉందామని పరస్పరం మౌఖిక వాగ్దానం చేసుకున్నారు. ఆ స్నేహితుడు తను క్రైస్తవుడుగా మారకుండా అడ్డగించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన విశ్వాసం పరీక్షకు గురైంది. ఆయన “స్నేహితుడు” ఆయనను కొట్టాడు, ఆయన దేవుడైన యెహోవాను ఆ స్నేహితుడు దూషించాడు. మునుపు ఇతరులను హింసించే ఈ మనిషి తనను తాను నియంత్రించుకుంటూ, తన మాట నిలబెట్టుకోలేనందుకు క్షమాపణ కోరాడు. నిరాశపడిన ఈయన “సహవాసి” ఈయనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
తన హింసా ప్రవృత్తులను అధిగమించడం ద్వారా, మునుపు కోపిష్టిగా ఉండే ఈ మనిషి దేవుడి ఎడలా, పొరుగువారి ఎడలా గల ప్రేమతో ఐక్యమైన అనేక ఆధ్యాత్మిక సహోదర సహోదరీలను పొందాడు. (కొలొస్సయులు 3:14) ఇంకా చెప్పాలంటే, ఈయన సమర్పించుకున్న క్రైస్తవుడై 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇప్పుడు యెహోవా సాక్షుల ప్రయాణ పైవిచారణకర్తల్లో ఒకరిగా సేవ చేస్తున్నాడు. జంతు ప్రవృత్తిగల మనుష్యులు, తనలాగే, హింసకు పాల్పడకుండానే సమస్యలను పరిష్కరించుకోవడాన్ని నేర్చుకోగలరని బైబిలు నుండి తను చూపించగల్గడం ఈయనకు ఎంత ఆనందంగా ఉందో! “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును” అనే ప్రవచనార్థక మాటల గొప్ప నెరవేర్పును సూచించగల్గే ఎంతటి ఆధిక్యత ఆయనది !—యెషయా 11:9.
అపొస్తలుడైన పౌలులా, అలాగే మునుపు హింసా ప్రవృత్తితో ఉండిన ఈ మనిషిలా, మీరు కూడా రెచ్చగొట్టే పరిస్థితులతో వ్యవహరించడాన్నీ, సమస్యలను సమాధానంగా పరిష్కరించడాన్నీ నేర్చుకోగలరు. మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులు మీకు సహాయపడడంలో సంతోషిస్తారు.
[అధస్సూచి]
a వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
[5వ పేజీలోని చిత్రం]
పౌలు వాస్తవిక దృష్టిగలవాడు. క్రైస్తవుల మధ్యన కూడా భావోద్వేగాలు చెలరేగగలవని ఆయనకు తెలుసు
[7వ పేజీలోని చిత్రం]
దేవుడు మన కోసం చేసినవాటి విషయమైన మెప్పుదల సమాధానకరమైన సంబంధాలను పెంపొందిస్తాయి