కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 5/1 పేజీలు 26-29
  • 80 ఏళ్లప్పుడు నియామకంలో మార్పు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 80 ఏళ్లప్పుడు నియామకంలో మార్పు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సత్యం మా జీవితాలను మార్చడం
  • మమ్మల్ని బలపర్చిన ఉదాహరణలు
  • ఈస్ట్‌ ఆంగ్లియాలో పయినీరు సేవ
  • యుద్ధకాలం, కుటుంబం
  • స్పెయిన్‌కు వెళ్లాలనే మా నిర్ణయం
  • “మాకు ఈ పరిచర్య ఉన్నందువల్ల . . . , మేము విడువము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • తల్లులారా, యునీకే ఆదర్శం నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • పయినీర్లు అర్పించి, ఆశీర్వాదాలను పొందుతారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 5/1 పేజీలు 26-29

80 ఏళ్లప్పుడు నియామకంలో మార్పు

గ్వెండొలిన్‌ మాథ్యూస్‌ చెప్పినది

నాకు 80 ఏళ్లు వచ్చినప్పుడు, నేనూ నా భర్తా మా వస్తువులన్నీ ఒక అద్దె వ్యానులో సర్దుకుని ఇంగ్లాండు నుండి స్పెయిన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. మాకు స్పానిష్‌ భాష రాదు, ఆంగ్ల భాష మాట్లాడే పర్యాటకులు తరచూ వచ్చే స్థలానికి ఎంతో దూరంగా, అంటే స్పెయిన్‌ నైరృతి వైపుకు మేము వెళ్తున్నాము. మేము చేస్తున్నది ఆచరణాత్మకమైన పని కాదని మా హితులు చాలామంది భావించారు, కాని అబ్రాహాము ఊరును విడిచి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 75 ఏళ్లని నాకు నేను ఉత్సాహంగా జ్ఞాపకం చేసుకున్నాను.

మేము 1992 ఏప్రిల్‌లో స్పెయిన్‌కు వచ్చినప్పటి నుండి ఇక్కడ మేము గడిపిన సంవత్సరాలు, మా జీవితాల్లో ఎంతో ప్రతిఫలదాయకమైనవయ్యాయి. కాని మేము ఎందుకలా తరలి వెళ్లామనేది వివరించడానికి ముందు, యెహోవా సేవలో గడిచిన మా జీవితకాలం, అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి మమ్మల్నెలా నడిపించిందనేది మీకు చెప్పనివ్వండి.

బైబిలు సత్యం మా జీవితాలను మార్చడం

నేను ఇంగ్లాండ్‌ నందలి నైరృతి లండన్‌లో మతనిష్ట గల కుటుంబంలో పెరిగాను. మా అమ్మ ఆధ్యాత్మిక సంతృప్తి కోసం వెదుకుతూ నన్నూ మా చెల్లినీ వివిధ ఆరాధనా స్థలాలకు తీసుకువెళ్లేది. దీర్ఘకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్న మా నాన్న మాతోపాటు వచ్చేవాడు కాదు. కాని ఆయన బైబిలును శ్రద్ధగా చదివేవాడు, తనకు జ్ఞానోదయం కలిగించే వాక్యాలను కనుగొన్న ప్రతిసారి ఆయన వాటి క్రింద గీత గీసేవాడు. ఆయనకు ఎంతో విలువైనదైన ఆ పాతబడిన బైబిలు నాకున్న అత్యంత విలువైన సంపదల్లో ఒకటి.

1925లో, నాకు 14 ఏండ్లున్నప్పుడు, వెస్ట్‌ హామ్‌ టౌన్‌ హాల్లో ఒక బహిరంగ ప్రసంగానికి రమ్మని ఆహ్వానించే ఒక కరపత్రం మా తలుపు క్రిందుగా వేయబడింది. మా అమ్మా, పొరుగింటావిడా ఆ ప్రసంగం వినడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు, నేనూ మా చెల్లీ వాళ్లతోపాటు వెళ్లాము. “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరెన్నడూ మరణించరు” అనే ఆ ప్రసంగం, అమ్మ హృదయంలో బైబిలు సత్యపు విత్తనాలను నాటింది.

కొన్ని నెలల తర్వాత, 38 ఏళ్ల వయస్సులో నాన్న మరణించారు. ఆయన మరణం మాకు పెద్ద దెబ్బ, ఎందుకంటే అది మా హృదయాలను బ్రద్దలు చేసి, మమ్మల్ని దిక్కులేని వాళ్లను చేసింది. స్థానిక చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వద్ద జరిగిన అంత్య క్రియల సమయంలో, నాన్న ఆత్మ పరలోకంలో ఉందని ప్రీస్టు చెప్పడం విని అమ్మ దిగ్భ్రాంతి చెందింది. మృతులు సమాధిలో నిద్రిస్తున్నారని ఆమెకు బైబిలు ద్వారా తెలుసు, నాన్న ఒకరోజు భూమిపై నిత్యజీవానికి పునరుత్థానం చేయబడతాడని ఆమె దృఢంగా విశ్వసించింది. (కీర్తన 37:9-11, 29; 146:3, 4; ప్రసంగి 9:5; అపొస్తలుల కార్యములు 24:14; ప్రకటన 21:3, 4) దేవుని వాక్యాన్ని బోధించే ప్రజలతో తాను సహవసించడం అవసరమని పూర్తిగా ఒప్పింపబడి, ఆమె అంతర్జాతీయ బైబిలు విద్యార్థులతో తన పరిచయాన్ని పెంపొందించుకోవాలని నిశ్చయించుకుంది, యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు.

ప్రయాణానికి మా దగ్గర డబ్బు ఉండేది కాదు కాబట్టి, మా ఇంటి నుండి యెహోవా సాక్షుల కూటాలకు వెళ్లడానికి మేము ప్రతి వారం రెండు గంటలపాటు నడిచేవాళ్లం. తర్వాత, మళ్లీ ఇంటికి తిరిగి రావడానికి మరో రెండు గంటలు నడిచేవాళ్లము. కాని ఆ కూటాలను మేము ఎంతో విలువైనవిగా ఎంచేవాళ్లం, లండన్‌ నగరాన్ని పొగమంచు కప్పేసినా, మేము ఒక్క కూటాన్ని కూడా మానుకునే వాళ్లం కాదు. అమ్మ త్వరలోనే తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి నిర్ణయించుకుంది, 1927లో నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను.

మాకు ఆర్థికపరమైన కష్టాలున్నప్పటికీ, అమ్మ ఎప్పుడూ నాకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతల ప్రాముఖ్యతను బోధించింది. మత్తయి 6:33 ఆమెకిష్టమైన లేఖనాల్లో ఒకటి, ఆమె నిజంగానే ‘మొదట రాజ్యాన్ని వెదికింది.’ ఆమె 1935లో క్యాన్సరుతో అకాలంగా మరణించే సమయానికి, ఫ్రాన్సులో సేవ చేయడానికి పూర్తికాల పరిచారకుల కోసం వచ్చిన పిలుపుకు జవాబివ్వడం కోసం ఆమె ప్లానులు వేసుకుంటోంది.

మమ్మల్ని బలపర్చిన ఉదాహరణలు

ఆ తొలి సంవత్సరాల్లో, లండన్‌లో కూటాలకు హాజరయ్యే కొంతమంది తమ సొంత ఉద్దేశాలను ప్రకటించాలనుకున్నారు, వాళ్లు కలహాలను కఠినమైన భావోద్రేకాలను రేపేవారు. అయినప్పటికీ, యెహోవా సంస్థ నుండి మనం ఇదంతా నేర్చుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టడం విశ్వాస భ్రష్టత అవుతుందని అమ్మ ఎప్పుడు చెప్పేది. వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆనాటి అధ్యక్షుడైన జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ చేసిన సందర్శనాలు, యథార్థంగా సేవ చేయడంలో కొనసాగడానికి మమ్మల్ని పురికొల్పాయి.

బ్రదర్‌ రూథర్‌ఫోర్డ్‌ దయగలవానిగా, సమీపించదగినవానిగా ఉండడం నాకు జ్ఞాపకముంది. నేను ఇంకా యౌవనస్థురాలిగా ఉన్నప్పుడే, లండన్‌ సంఘం పిక్నిక్‌కు వెళ్లింది, అప్పుడు ఆయన కూడా వచ్చాడు. ఆయన బిడియస్థురాలిగా ఉన్న యౌవనస్థురాలినైన నా దగ్గరికి వచ్చి, కెమెరా పట్టుకుని ఉన్న నన్ను చూసి నా ఫోటో తీసుకుంటావా అని నన్ను అడిగాడు. ఆ ఫోటో ఆనందదాయకమైన స్మృతి చిహ్నమయ్యింది.

ఆ తర్వాత, క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహిస్తున్నవారికీ, లోకంలోని ప్రముఖ వ్యక్తులకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని తెల్పిన ఒక అనుభవం నాపై చాలా ప్రభావాన్ని చూపించింది. నేను లండన్‌లో ఒక సంపన్నుల ఇంట్లో పని చేస్తున్నాను, అక్కడికి హిట్లర్‌ దూతలలో ఒకరైన ఫ్రాంట్స్‌ ఫాన్‌ పాపెన్‌ భోజనానికి ఆహ్వానించబడ్డాడు. భోజనం చేసేటప్పుడు ఆయన తన యూనిఫామ్‌కున్న ఖడ్గాన్ని తీసివేయడానికి నిరాకరించాడు, నా కాళ్లు దానికి తట్టుకోవడంతో నా చేతుల్లో ఉన్న సూప్‌ ఒలికిపోయింది. జర్మనీలో అయితే అలాంటి అజాగ్రత్తను బట్టి నేను కాల్చివేయబడి ఉండేదాన్నని ఆయన కోపంగా అన్నాడు. తర్వాత భోజన సమయమంతటిలో నేను ఆయనకు దూరంగానే ఉండిపోయాను!

బ్రదర్‌ రూథర్‌ఫోర్డ్‌ ప్రసంగించడాన్ని నేను విన్న విశేషమైన సమావేశం 1931లో అలెక్సాండ్రా పాలస్‌లో జరిగింది. అక్కడ మేము యెహోవాసాక్షులు అనే మన క్రొత్త పేరును ఉత్సాహంగా స్వీకరించాము. (యెషయా 43:10, 12) రెండు సంవత్సరాల తర్వాత, 1933లో, నేను పయినీరు సేవ ప్రారంభించాను, పూర్తికాల పరిచర్య అలా పిలువబడుతుంది. ఆ సంవత్సరాల్లో నాకు జ్ఞాపకమున్న మరో ఆశీర్వాదం, భూమి నలుదిశలకు మిషనరీలుగా ఆ తర్వాత పంపబడిన చక్కని యౌవన పురుషులతో సహవసించ గలిగిన అవకాశం. వీరిలో క్లాడ్‌ గుడ్‌మన్‌, హెరాల్డ్‌ కింగ్‌, జాన్‌ కూక్‌, ఎడ్విన్‌ స్కిన్నర్‌ ఉన్నారు. అలాంటి విశ్వసనీయులైనవారి ఉదాహరణలు, విదేశీ ప్రాంతంలో సేవ చేయాలనే కోరికను నాలో రగిలించాయి.

ఈస్ట్‌ ఆంగ్లియాలో పయినీరు సేవ

నా పయినీరు నియామకం ఈస్ట్‌ ఆంగ్లియాలో (తూర్పు ఇంగ్లాండ్‌). అక్కడ ప్రకటన పని చేయడానికి ఉత్సాహం, ఆసక్తి అవసరం. మా పెద్ద పరిచర్య ప్రాంతాన్ని పూర్తి చేయడానికి, మేము పట్టణం నుండి పట్టణానికీ, గ్రామ గ్రామానికీ సైకిళ్ల మీద ప్రయాణించి, అద్దె గదుల్లో ఉండేవాళ్లం. ఆ ప్రాంతంలో చాలా తక్కువ సంఘాలుండేవి, కాబట్టి నేను నా భాగస్వామి క్రమమైన వారపు కూటాల కొరకు అందులోని భాగాలన్నింటినీ మేమిద్దరం మా అంతట మేమే కలిసి చర్చించుకునే వాళ్లం. మా పరిచర్యలో, దేవుని సంకల్పాలను గురించి వివరించే వందలాది పుస్తకాలను, బుక్‌లెట్‌లను మేము అందించాము.

మేము ఒక పాదిరి ఇంట్లో చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ యొక్క స్థానిక మతాధికారితో మాట్లాడడం, జ్ఞాపకముంచుకోదగిన ఒక సందర్శనం. అనేక ప్రాంతాల్లో, ఆంగ్లికన్‌ మతాధికారిని సందర్శించడాన్ని చివరి వరకు వాయిదా వేసేవాళ్లము, ఎందుకంటే మేము ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నామని ఆయనకు తెలిసినప్పుడు ఆ మతాధికారి తరచు మాకు సమస్యలు సృష్టించేవాడు. కాని ఈ గ్రామంలో అందరూ ఈ మతాధికారి గురించి మంచిగా మాట్లాడారు. ఆయన రోగులను దర్శించేవాడు, చదవడం ఇష్టమైనవారికి పుస్తకాలిచ్చేవాడు, తన సంఘస్థులకు బైబిలు గురించి వివరించడానికి ఆయన వారి ఇళ్ళకు వెళ్లేవాడు కూడా.

అనుకున్నట్లుగానే, మేము ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉండి, ఎన్నో పుస్తకాలు తీసుకున్నాడు. గ్రామంలో ఎవరైనా మా పుస్తకాలు కొన్ని కావాలనుకున్నా వారి దగ్గర డబ్బు లేకపోతే వారికి బదులు తాను ఆ డబ్బును చెల్లిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయన ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను బట్టి ఆయన తన సంఘ ప్రాంతంలో శాంతి సంక్షేమాలను పెంపొందింపజేయాలని నిశ్చయించుకున్నాడని మాకు తెలిసింది. మేము వెళ్లేముందు ఆయన మమ్మల్ని ఆశీర్వదించి, మేము మా మంచి పనిని కొనసాగించమని ప్రోత్సహించాడు. సంఖ్యాకాండము 6:24 నందలి ఈ మాటలతో ఆయన మాకు వీడ్కోలు చెప్పాడు: ‘ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక.’

నేను పయినీరు సేవ ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత అమ్మ మరణించింది. డబ్బూ, కుటుంబమూ లేకుండా నేను లండన్‌కు తిరిగి వచ్చాను. స్కాట్‌లాండ్‌కు చెందిన ఒక సాక్షి నన్ను ఆదరించి, మా అమ్మ మరణాన్ని తట్టుకునేందుకు నాకు సహాయం చేసి పూర్తికాల పరిచర్యలో కొనసాగేందుకు నన్ను ప్రోత్సహించింది. కాబట్టి నేను నా క్రొత్త పయినీరు భాగస్వామి అయిన జూల్యా ఫెయిర్‌ఫాక్స్‌తో ఈస్ట్‌ ఆంగ్లియాకు తిరిగి వచ్చాను. మాకు సంచార గృహంగా ఉండేలా మేము ఒక పాత ట్రెయిలర్‌ను సిద్ధం చేసుకున్నాము; దాన్ని ఒక స్థలం నుండి మరో స్థలానికి తీసుకు వెళ్లడానికి మేము ట్రాక్టర్‌ను గానీ ట్రక్కును గానీ ఉపయోగించేవాళ్లం. ఒక వృద్ధ జంట అయిన ఆల్బర్ట్‌ మరియు ఎతెల్‌ అబ్బోట్‌లతో కలిసి మేము ప్రకటనా పనిని కొనసాగించాము, వాళ్లకు కూడా ఒక చిన్న సంచార గృహం ఉండేది. ఆల్బర్ట్‌, ఎతెల్‌లు నన్ను తలిదండ్రుల్లా చూసుకున్నారు.

కేంబ్రిడ్జ్‌షైర్‌లో పయినీరు సేవ చేస్తున్నప్పుడు, నేను ఒక చక్కని క్రైస్తవ సహోదరుడైన జాన్‌ మాథ్యూస్‌ను కలిశాను, ఆయన కష్టతరమైన పరిస్థితుల్లో యెహోవాకు తన యథార్థతను అప్పటికే ప్రదర్శించాడు. మేము 1940లో పెళ్లి చేసుకున్నాము, అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై ఎంతో కాలం కాలేదు.

యుద్ధకాలం, కుటుంబం

మాకు పెళ్లైన క్రొత్తలో మేము ఒక చిన్న గది అంత పరిమాణంలో ఉండే సంచార గృహంలో ఉండేవాళ్లం, మేము ఒక నమ్మకమైన మోటార్‌ బైక్‌ మీద పరిచర్యకు వెళ్లేవాళ్లం. మాకు పెళ్లైన ఒక సంవత్సరం తర్వాత, జాన్‌ బైబిలు ఆధారిత తన నమ్మకాలను బట్టి సైనిక సేవలో పాల్గొనడానికి నిరాకరించినందుకు, ఆయనకు పొలంలో పని చేయమని శిక్ష విధించబడింది. (యెషయా 2:4) దీని మూలంగా మేము పయినీరు సేవ మానుకోవలసి వచ్చినప్పటికీ, జాన్‌కు విధించబడిన శిక్ష దైవదత్తమైనదయ్యింది, ఎందుకంటే అప్పటికి నేను గర్భవతిగా ఉన్నాను, ఆయన మాకు ఆర్థిక మద్దతు ఇవ్వగల్గుతాడు.

యుద్ధ సంవత్సరాలు కష్టకాలాలుగా ఉన్నప్పటికీ అప్పట్లో నిర్వహించబడిన ప్రత్యేక కూటాలను మేము ఆస్వాదించాము. మొదటిసారి గర్భంతో ఉన్న నేను, జాన్‌తోపాటు 1941లో, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంచెస్టర్‌కు మోటార్‌ బైక్‌ మీద వెళ్లాను. దారిలో మేము, బాంబులతో ధ్వంసమైన పట్టణాలను దాటి వచ్చాము, అలాంటి పరిస్థితుల్లో కూటం జరుపుకోవడం సాధ్యమౌతుందా అని అనుకున్నాము. కానీ సాధ్యమయ్యింది. మాంచెస్టర్‌ నగర నడిబొడ్డున ఉన్న ఫ్రీ ట్రేడ్‌ హాల్‌ ఇంగ్లాండ్‌ యొక్క అనేక భాగాల నుండి వచ్చిన సాక్షులతో నిండిపోయింది, పూర్తి కార్యక్రమం నిర్వహించబడింది.

సమావేశ చివరి ప్రసంగీకుడు తన ప్రసంగం ముగింపులో, విమాన దాడి జరుగబోతుంది గనుక వెంటనే ఆ ప్రదేశాన్నుండి వెళ్లిపోవాలని ప్రేక్షకులతో చెప్పాడు. ఆ హెచ్చరిక సమయోచితమైనది. మాకు సైరన్‌లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌ల శబ్దాలు వినిపించే సమయానికి మేము హాలు నుండి ఎంతో దూరం వెళ్లలేదు. వెనక్కి చూసినప్పుడు, నగరం మధ్యలో అనేక విమానాలు బాంబులు వేస్తుండడాన్ని మేము చూడగలిగాము. దూరంలో, మేము అంతసేపు కూర్చునివున్న హాలు మంటలూ పొగ మధ్య ఉండడాన్ని మేము చూశాము; అది పూర్తిగా నేలమట్టమై పోయింది! మన క్రైస్తవ సహోదర సహోదరీల్లో ఎవరూ మరణించలేదన్నది సంతోషకరమైన విషయం.

మేము మా పిల్లలను పెంచుతుండగా, పయినీరు సేవ చేయలేక పోయాము, కానీ ప్రయాణ పైవిచారణ కర్తలకూ, ఇళ్లు లేని పయినీర్లకూ మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఒకసారి, ఆరుగురు పయినీర్లు కొన్ని నెలలపాటు మా ఇంట్లో ఉన్నారు. నిస్సందేహంగా, మా కుమార్తె యూనీస్‌ 1961లో, కేవలం 15 ఏళ్ల వయస్సులో పయినీరు సేవ ప్రారంభించేందుకు ఎంపిక చేసుకోవడానికిగల కారణాల్లో అలాంటివారి సహవాసం ఒకటి. మా కుమారుడు డేవిడ్‌ తాను పెద్దవాడైనప్పుడు యెహోవా సేవలో కొనసాగడానికి ఎంపిక చేసుకోకపోవడం, మా మరో కుమార్తె లిండా యుద్ధ కాలంలో దుఃఖకరమైన పరిస్థితుల్లో మరణించడం విచారకరమైన విషయాలు.

స్పెయిన్‌కు వెళ్లాలనే మా నిర్ణయం

అమ్మ మాదిరీ, ఆమె ప్రోత్సాహమూ నాలో మిషనరీని కావాలనే కోరికను కలిగించాయి, నేనా లక్ష్యాన్ని ఎన్నడూ పూర్తిగా మరిచిపోలేదు. అందుకే 1973లో యూనీస్‌ ఇంగ్లాండ్‌ నుండి, రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న స్పెయిన్‌కు వెళ్లినప్పుడు మేము ఆనందించాము. నిజమే, ఆమె వెళ్తున్నప్పుడు మాకు బాధ కలిగింది కాని ఆమె విదేశీ ప్రాంతంలో సేవ చేయలని కోరుకుందని మేము గర్వించాము కూడా.

గడిచిన సంవత్సరాల్లో మేము యూనీస్‌ను దర్శించాము, దాంతో మాకు స్పెయిన్‌తో బాగానే పరిచయం ఏర్పడింది. వాస్తవానికి, నేనూ జాన్‌ ఆమె నాలుగు వేర్వేరు నియామకాల్లో ఆమెను దర్శించాము. సంవత్సరాలు గడుస్తుండగా, మా బలం క్షీణించ సాగింది. జాన్‌ క్రింద పడిపోవడంతో, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది, నాకు గుండె సంబంధిత థైరాయిడ్‌ సంబంధిత సమస్యలున్నాయి. అంతేగాక, మేమిద్దరం కీళ్లవాపుతో బాధపడ్డాము. మాకు యూనీస్‌ సహాయం ఎంతో అవసరమైనప్పటికీ, మాకోసం ఆమె తన నియామకాన్ని వదులు కోవడం మాకిష్టం లేదు.

మాకున్న అవకాశాలను యూనీస్‌తో చర్చించి, నడిపింపు కొరకు ప్రార్థించాము. మాకు సహాయం చేయడానికి ఆమె ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. కాని నేనూ జాన్‌ ఆమెతోపాటు స్పెయిన్‌లో నివసించడమే సమస్యకు సరైన పరిష్కారమని నిర్ణయించుకున్నాము. నేను మిషనరీని కాలేకపోయినా, కనీసం నేను నా కుమార్తెకూ ఆమె ఇద్దరు పయినీరు సహవాసులకూ పూర్తికాల సేవలో మద్దతునివ్వగలుగుతున్నాను. అప్పటి నుండి నేనూ జాన్‌, 15 సంవత్సరాలుగా యూనీస్‌కు పయినీరు భాగస్వాములుగా ఉన్న నూర్య మరియు అనాలను మా సొంత కుమార్తెలుగా భావిస్తున్నాము. వాళ్లకు ఎక్కడ నియామకం లభించినప్పటికీ అక్కడ వాళ్లతోపాటు నివసించడానికి మేము వెంట వెళ్తున్నందుకు వాళ్లు సంతోషిస్తున్నారు.

మేమా నిర్ణయం తీసుకుని ఇప్పటికి ఆరేళ్ల పైనే అయ్యింది. ఆ తర్వాత ఇక మా ఆరోగ్యం క్షీణించిపోలేదు, మా జీవితాలు కచ్చితంగా మరింత ఆసక్తికరమైనవయ్యాయి. ఇప్పటికీ నేను స్పానిష్‌ భాష అంత బాగా మాట్లాడలేను, అయినా ప్రకటించకుండా అది నన్ను ఆపలేదు. నైరృతి స్పెయిన్‌ నందలి ఎక్స్‌ట్రమడూరాలోని మా చిన్న సంఘంలో నేనూ జాన్‌ ఎంతో సంతోషంగా ఉన్నాము.

స్పెయిన్‌లో నివసించడం, మన రాజ్యప్రకటన పని యొక్క అంతర్జాతీయ విస్తృతి గురించి నాకు ఎంతో తెల్పింది, యేసుక్రీస్తు చెప్పినట్లుగా, “పొలము లోకము” ఎలా అయ్యుందో నేను ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థం చేసుకోగల్గుతున్నాను.—మత్తయి 13:38.

[28వ పేజీలోని చిత్రం]

1930లలో పయినీరు సేవ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి