తీర్పుతీర్చు లోయలో అమలుపర్చబడిన తీర్పు
“నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను.”—యోవేలు 3:12.
1. ‘తీర్పుతీర్చు లోయలో’ జనములు గుంపులు గుంపులుగా ఎందుకు కూడడాన్ని యోవేలు చూశాడు?
“తీర్పు తీర్చు లోయలో . . . జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు”! ప్రేరణాత్మకమైన ఈ మాటల్ని మనం యోవేలు 3:14లో చదువుతాం. గుంపులు గుంపులుగా ఈ జనులు ఎందుకు కూడి ఉన్నారు? యోవేలు ఇలా జవాబిస్తున్నాడు: “యెహోవా దినము వచ్చేయున్నది.” అది యెహోవా తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకొనే మహాదినం అంటే, క్రీస్తుయేసు ఆధ్వర్యాన స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని తిరస్కరించిన సమూహాలపై తీర్పు తీర్చే దినం. చిట్టచివరకు, ప్రకటన 7వ అధ్యాయంలోని “నలుగురు దేవదూతలు” తాము గట్టిగా పట్టుకొనివున్న “భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను” విడిచిపెడతారు. తత్ఫలితంగా “లోకారంభంనుండి ఇప్పటి వరకు [కలుగని]. . . ఇక ఎప్పుడును కలుగబో[ని]” శ్రమ కలుగుతుంది.—ప్రకటన 7:1; మత్తయి 24:21.
2. (ఎ) యెహోవా తీర్పు అమలు జరిగే స్థలం “యెహోషాపాతు లోయ” అని తగిన విధంగానే ఎందుకు పిలువబడింది? (బి) యెహోషాపాతు మీదికి యుద్ధదాడి జరిగినప్పుడు ఆయన సరియైన విధంగానే ఎలా ప్రతిస్పందించాడు?
2 యోవేలు 3:12లో ఈ తీర్పు అమలు జరిగే స్థలం “యెహోషాపాతు లోయ” అని పిలువబడింది. యూదా చరిత్రనందలి ఒక సంక్షోభ కాలంలో, “యెహోవాయే న్యాయాధిపతి” అనే అర్థాన్నిచ్చే యెహోషాపాతు అనే పేరుగల మంచిరాజు పక్షాన యెహోవా అక్కడ తీర్పు తీర్చినట్లు కనబడుతోంది. మన కాలంలో జరుగబోయే దాన్ని మరింత చక్కగా గుణగ్రహించడానికి ఆ కాలంలో జరిగినదాన్ని పరిశీలించడం మనకు సహాయకరంగా ఉంటుంది. దాన్ని గూర్చిన నివేదిక 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఉంది. ఆ అధ్యాయంలో 1వ వచనంలో “మోయాబీయులును అమ్మోనీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి” అని మనం చదువుతాం. యెహోషాపాతు ఎలా ప్రతిస్పందించాడు? విపత్కర పరిస్థితిలో విశ్వాసులైన యెహోవా సేవకులు ఎల్లప్పుడూ చేసేదాన్నే ఆయనా చేశాడు. నడిపింపు కొరకు ఆయన యెహోవావైపు తిరిగి, హృదయ పూర్వకంగా ఇలా ప్రార్థించాడు: “మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యములో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు.”—2 దినవృత్తాంతములు 20:12.
యెహోవా ఒక ప్రార్థనకు జవాబిచ్చాడు
3. యూదా దేశాన్ని పొరుగునున్న దేశాలు ముట్టడి వేసినప్పుడు, యెహోవా వారికి ఏ నిర్దేశాల్ని ఇచ్చాడు?
3 “యూదా వారందరును తమ శిశువులతోను, భార్యలతోను, పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడి” ఉండగా, యెహోవా తన ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. (2 దినవృత్తాంతములు 20:13) నేడాయన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ఉపయోగిస్తున్నట్లుగానే, ప్రార్థన ఆలకించు మహోన్నతుడు అక్కడ సమకూడిన వారికి తన జవాబును ఇచ్చేందుకు లేవీయుడైన ప్రవక్తయైన యహజీయేలును బలపర్చాడు. (మత్తయి 24:45) మనమిలా చదువుతాం: “యెహోవా సెలవిచ్చునదేమనగా—ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. . . . యీ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; . . . మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి, జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును.”—2 దినవృత్తాంతములు 20:15-17.
4. శత్రువు సవాల్‌ని తన ప్రజలు ఎదుర్కొన్నప్పుడు, ఏ విధంగా వాళ్లు నిష్క్రియులుగాక క్రియాశీలురుగా ఉండాలని యెహోవా కోరాడు?
4 రాజైన యెహోషాపాతూ, ఆయన ప్రజలూ ఊరకనే కూర్చొని తమకు అద్భుతరీతిలో కలుగబోయే విడుదల కొరకు ఎదురుచూస్తూ ఉండడంకన్నా ఎక్కువే చేయాలని వారి నుండి యెహోవా కోరాడు. శత్రువు సవాలును ఎదుర్కొనడంలో వాళ్లు చొరవ తీసుకోవాలి. రాజుతోపాటు ‘యూదా వారందరు తమ శిశువులతోనూ, తమ భార్యలతోనూ పిల్లలతోనూ కలిసి,’ దాడికి వస్తున్న సైన్యాలను ఎదుర్కోవడానికి విధేయతతో ఉదయాన్నే లేచి దాడికి వెళ్లడం ద్వారా వాళ్లు బలమైన విశ్వాసం వ్యక్తపర్చారు. “మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని” రాజు వారికి చెబుతూ దారి పొడవునా దైవపరిపాలనా ఉపదేశాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇచ్చాడు. (2 దినవృత్తాంతములు 20:20) యెహోవాను నమ్ముకోవడం! ఆయన ప్రవక్తలను నమ్ముకోవడం! విజయానికి కీలకం అందులోనే ఉంది. అదేరీతిలో నేడుకూడా, యెహోవా సేవలో మనం క్రియాశీలంగా కొనసాగుతుండగా, మన విశ్వాసాన్ని ఆయన విజయవంతం చేస్తాడనే విషయాన్ని మనమెన్నడూ సందేహించకుండా ఉందాం!
5. నేడు యెహోవా సాక్షులు యెహోవాను స్తుతిస్తుండగా, ఎలా క్రియాశీలంగా ఉన్నారు?
5 యెహోషాపాతు కాలమందలి యూదులవలెనే, మనమూ “యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము” చేయాలి. మనమీ స్తోత్రమెలా చేస్తాము? ఆసక్తిగా మనం రాజ్యాన్ని ప్రకటించడం ద్వారానే! ఆ యూదులు “పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టిన” విధముగానే, మనమూ మన విశ్వాసానికి క్రియలను జోడిస్తాం. (2 దినవృత్తాంతములు 20:21, 22) అవును, యెహోవా తన శత్రువుల మీద చర్య తీసుకోవడానికి సిద్ధమౌతుండగా, మనం కూడా అలాంటి యథార్థమైన విశ్వాసాన్నే ప్రదర్శిద్దాం! నేడు భూమ్మీద విపత్కరమైన పరిస్థితుల మూలంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఆయన అజేయులైన ప్రజలవలెనే, రహదారి ఎంతో దూరం ఉన్నట్టుగా కన్పించినా, మనం కూడా సహనాన్ని చూపించాలనీ, విశ్వాసంలో క్రియాశీలంగా ఉండాలనీ నిశ్చయించుకుందాం. హింసా, బలాత్కారమూ, కరవులూ, తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల మూలంగా తీవ్రంగా ప్రభావితం చెందిన కొన్ని దేశాల్లో సహితం, యెహోవాసాక్షుల 1998 వార్షికపుస్తకము నివేదిస్తున్నట్లుగా దేవుని సేవకులు గుర్తించదగిన ఫలితాల్ని సాధిస్తున్నారు.
యెహోవా తన ప్రజల్ని రక్షిస్తాడు
6. బలమైన విశ్వాసం మనం నేడు యథార్థంగా ఉండేందుకు ఎలా సహాయపడుతుంది?
6 యూదా చుట్టుప్రక్కలనున్న ముట్టడించిన భక్తిహీన జనాంగాలు దేవుని ప్రజల్ని కబళించివేయడానికి ప్రయత్నించాయి. అయితే మాదిరికరమైన విశ్వాసంతో, యెహోవాకు స్తుతిగీతాలను పాడుతూ యెహోవా సేవకులు ప్రతిస్పందించారు. నేడు మనం కూడా అలాంటి విశ్వాసాన్నే వ్యక్తపర్చగలం. యెహోవాకు స్తుతిని తీసుకువచ్చే క్రియలతో మన జీవితాల్ని నింపుకోవడం ద్వారా, సాతాను యొక్క కుయుక్తితో కూడిన పన్నాగాలు చొరబడ్డానికి తావివ్వకుండా మన ఆధ్యాత్మిక సర్వాంగకవచాన్ని పటిష్ఠపర్చుకుంటాం. (ఎఫెసీయులు 6:11) మన చుట్టూ ఉన్న మృతతుల్య లోకాన్ని తెలియజేసే దిగజారిపోయిన వినోదమూ, ఐశ్వర్యాసక్తీ, ఉదాసీనతల ద్వారా అవధానాన్ని మళ్లించే శోధనను బలమైన విశ్వాసం త్రిప్పికొడుతుంది. “తగిన వేళ” అందజేయబడుతున్న ఆధ్యాత్మికాహారం మూలంగా మనం నిర్విరామంగా పోషించబడుతుండగా ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో’ పాటు మనమూ యథార్థంగా సేవచేసేలా ఈ అజేయమైన విశ్వాసం మనకు తోడ్పడుతుంది.—మత్తయి 24:45.
7. తమపై జరిగిన వేర్వేరు దాడులకు యెహోవాసాక్షులు ఎలా ప్రతిస్పందిచారు?
7 మత్తయి 24:48-51 వచనాల్లోని ‘దుష్టుడైన దాసు’ని స్వభావాన్ని చూపించే వారిచే పురికొల్పబడే ద్వేషపూరిత ప్రచారాలకు భిన్నంగా స్థిరంగా నిలబడేందుకు మన బైబిలు-ఆధార విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. విశిష్టమైన రీతిలో ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తూ, నేడనేక దేశాల్లో మతభ్రష్టులు క్రియాశీలంగా అబద్ధాలు చెబుతున్నారు, దుష్ప్రచారాన్నీ చేస్తున్నారు. అలా చేస్తూ, దేశాల్లో అధికార స్థానమందున్న కొందరితో కూడబలుక్కున్నారు. యుక్తమైన చోటల్లా ఫిలిప్పీయులు 1:7లో వివరించబడినట్లుగా ‘న్యాయబద్ధంగా సువార్త పక్షాన వాదిస్తూ దాన్ని స్థిరపరుస్తూ’ యెహోవాసాక్షులు ప్రతిస్పందించారు. ఉదాహరణకు, సెప్టెంబరు 26, 1996లో గ్రీసునుండి వచ్చిన ఒక కేసులో, మానవ హక్కుల యూరోపియన్ న్యాయస్థానానికి చెందిన తొమ్మిదిమంది న్యాయమూర్తులు ఏకగ్రీవంగా “యెహోవాసాక్షులు ‘అంగీకృత మతం’ అనే నిర్వచనానికి సరిపోతారు” అనీ, వారికి ఆలోచనా, అంతరాత్మా, తమ విశ్వాసం విషయాల్లో స్వాతంత్ర్యముందనీ, తమ విశ్వాసాన్ని వ్యక్తపరచే హక్కు ఉందనీ ధృవీకరించారు. మతభ్రష్టుల విషయానికొస్తే, దేవుని తీర్పు ఇలా తెలియజేయబడివుంది: “కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.”—2 పేతురు 2:22.
8. యెహోషాపాతు కాలంలో, యెహోవా తన జనముల శత్రువులపై తీర్పును ఎలా అమలుచేశాడు?
8 వెనుకటికి యెహోషాపాతు కాలంలో, యెహోవా తన ప్రజలకు హాని తలపెట్టాలనుకున్న ప్రజలకు వ్యతిరేకంగా తీర్పును అమలుపర్చాడు. మనమిలా చదువుతాం: “యెహోవా యూదా వారిమీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.” (2 దినవృత్తాంతములు 20:22, 23) యూదులు ఆ ప్రదేశానికి బెరాకాలోయ అని పేరు పెట్టారు, బెరాకా అనే పదానికి “ఆశీర్వాదము” అని భావం. ఆధునిక కాలాల్లో సహితం, తన శత్రువులమీద యెహోవా అమలుపర్చే తీర్పు ఆయన ప్రజలకు గొప్ప ఆశీర్వాదాల్ని తెచ్చిపెడుతుంది.
9, 10. యెహోవా దేవుని ప్రతికూల తీర్పులకు తాము పాత్రులమేనని ఎవరు చూపించుకున్నారు?
9 యెహోవా నుండి వచ్చే ఆ ప్రతికూల తీర్పును ఈ ఆధునిక కాలంలో ఎవరు పొందుతారు? అని మనం అడుగవచ్చు. దానికి జవాబు పొందేందుకు, మనం యోవేలు ప్రవచనం దగ్గరకు వెళ్లాలి. ‘వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని యిచ్చే’ ఆయన ప్రజల శత్రువులను గూర్చి యోవేలు 3:3 మాట్లాడుతోంది. అవును, వాళ్లు దేవుని సేవకుల్ని అల్పులుగానూ, వారి పిల్లల్ని వ్యభిచారికి చెల్లించే లేక ఒక ముంత ద్రాక్షారసానికి చెల్లించే ధరనుమించి మరే విలువాలేని వారిగానూ దృష్టించేవారు. దానికి వాళ్లు జవాబు చెప్పాల్సివుంది.
10 ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని చేసేవాళ్లకు కూడా అదే విధమైన తీర్పు తగినదైవుంది. (ప్రకటన 17:3-6) ఇటీవల కాలాల్లో తూర్పు యూరప్‌లో అల్లరిమూకను రెచ్చగొట్టే కొంతమంది మతనాయకులు చేస్తున్నట్లుగానే, యెహోవాసాక్షులను హింసించేలా, వారి కార్యకలాపాలకు ఆటంకాన్ని కల్గించేలా రాజకీయ అధికారుల్ని రెచ్చగొట్టే వాళ్లు విశేషంగా నిందార్హులై ఉన్నారు. అలాంటి దురన్యాయాలకు పాల్పడేవారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలన్న తన కృతనిశ్చయాన్ని యెహోవా వ్యక్తపరుస్తున్నాడు.—యోవేలు 3:4-8.
“యుద్ధము ప్రతిష్ఠించుడి”!
11. యెహోవా తన శత్రువుల్ని యుద్ధానికి రమ్మని ఎలా సవాలు చేస్తున్నాడు?
11 జనాంగాల మధ్య ఈ సవాలును ప్రకటించాలని యెహోవా తన ప్రజలకు పిలుపునిస్తున్నాడు: “యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.” (యోవేలు 3:9) ఇదొక భిన్నమైన యుద్ధం—నీతియుక్తమైన యుద్ధం. యెహోవా దేవుని యథార్థవంతులైన సాక్షులు అబద్ధ ప్రచారాలకు ప్రతిస్పందించి, సత్యంతో అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉండగా వాళ్లు ఆధ్యాత్మిక ఆయుధాలపై ఆధారపడతారు. (2 కొరింథీయులు 10:4; ఎఫెసీయులు 6:17) “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”ను దేవుడు త్వరలోనే ప్రతిష్ఠిస్తాడు. అది దేవుని సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించే వారందర్నీ భూమ్మీద లేకుండా చేస్తుంది. భూమ్మీదనున్న ఆయన ప్రజలు దానిలో భౌతికంగా ఏ విధమైన భాగాన్ని వహించరు. అక్షరార్థంగానూ, అలంకారికంగానూ ‘వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టేశారు.’ (యెషయా 2:4) దీనికి భిన్నంగా, యెహోవా తనను ఎదిరించే జనాంగాల్ని ఇందుకు విరుద్ధంగా చేయండని సవాలు చేస్తున్నాడు: “మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి.” (యోవేలు 3:10) వారి ఆయుధాగారాల్లో ఉన్న యుద్ధాయుధాలన్నింటితో, ఆధునిక ఆయుధాలన్నింటితో యుద్ధబరిలోకి దిగండని ఆయన ఆహ్వానిస్తున్నాడు. అయితే వాళ్లు విజయాన్ని సాధించలేరు, ఎందుకంటే యుద్ధమూ, విజయమూ యెహోవావే!
12, 13. (ఎ) ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినప్పటికీ, తామింకా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నామని అనేక దేశాలు ఎలా చూపించుకున్నాయి? (బి) దేశాలు దేనికి సిద్ధంగా ఉన్నాయి?
12 పందొమ్మిదివందల తొంభైల తొలిభాగంలో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయిందని ప్రకటించబడింది. దాని దృష్ట్యా, ఐక్యరాజ్య సమితి ప్రాథమిక ధ్యేయమైన శాంతిభద్రతల పరిరక్షణ సాధించబడిందా? ఎంతమాత్రం సాధించబడ లేదు! ఇరాక్, ది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బురుండి, రువాండా, లైబీరియా, సొమాలియా, మునుపటి యుగోస్లావియాలలో జరిగిన సంఘటనలు మనకేమి చెబుతున్నాయి? యిర్మీయా 6:14వ వచనంలోని మాటల్లో “సమాధానములేని సమయమున—సమాధానము, సమాధానమని” వాళ్ళు చెబుతున్నారు!
13 కొన్నిచోట్ల యుద్ధం పూర్తిగా నిలిచిపోయినా, ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు అత్యాధునిక యుద్ధాయుధాల్ని అంతకంతకు ఎక్కువగా తయారుచేయడంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. కొన్ని దేశాలు ఇంకా అణ్వాయుధాల్ని సమకూర్చుకుంటున్నాయి. ఇతర దేశాలు గొప్పవినాశనాన్ని తెచ్చే రసాయనిక ఆయుధాల్నీ, సూక్ష్మక్రిమి ఆయుధాల్నీ అభివృద్ధి చేస్తున్నాయి. అర్మగిద్దోనని పిలువబడిన సూచనార్థక స్థలం దగ్గర ఆ దేశాలు సమకూడుతుండగా, ఆయన వారిని ఇలా సవాలు చేస్తున్నాడు: “బలహీనుడు—నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి.” యోవేలు మధ్యలో కలుగజేసుకొని తన సొంత విన్నపాన్ని ఇలా చేస్తున్నాడు: “యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.” (ఇటాలిక్కులు మావి.)—యోవేలు 3:10, 11.
యెహోవా తన వారిని కాపాడుతాడు
14. యెహోవా దేవుని పరాక్రమశాలులెవరు?
14 యెహోవా పరాక్రమశాలులెవరు? బైబిలులో దాదాపు 283 సార్లు సత్యదేవుడు “సైన్యములకధిపతియగు యెహోవా” అని పిలువబడ్డాడు. (2 రాజులు 3:14, NW) ఈ సైన్యాలు, యెహోవా ఆజ్ఞమేరకు చేయడానికి సదా సిద్ధంగా ఉండే పరలోకంలోని దేవదూతలే. సిరియనులు ఎలీషాను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, వాళ్లు విజయం ఎందుకు సాధించబోరన్నదానికి గల కారణాన్ని చూడగలిగేలా యెహోవా ఎలీషా పనివాని కళ్లను చివరకు తెరిచాడు: “వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథముల చేతను నిండియుండుట చూచెను.” (2 రాజులు 6:17) “పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతల”ను పంపించమని తన తండ్రిని వేడుకొనగలిగి ఉండేవాడనని యేసు చెప్పాడు. (మత్తయి 26:53) అర్మగిద్దోనులో తీర్పు తీర్చేందుకై యేసు బయలువెళ్లడాన్ని వర్ణిస్తూ ప్రకటన గ్రంథమిలా చెబుతోంది: “పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.” (ప్రకటన 19:14, 15) ఆ సూచనార్థక మద్యపుతొట్టి “దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టి” అని స్పష్టమైన పదాల్లో వర్ణించబడింది.—ప్రకటన 14:17-20.
15. జనాంగాలకు వ్యతిరేకంగా యెహోవా చేపట్టే యుద్ధ చర్యల్ని యోవేలు ఎలా వర్ణిస్తున్నాడు?
15 అయితే, దేవుని సొంత పరాక్రమశాలురను తోడుకు రమ్మని యోవేలు చేసిన విన్నపానికి యెహోవా ఎలా జవాబిస్తాడు? ఆ జవాబు ఈ మాటల్లో తేటతెల్లమైంది: “నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పుతీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లిపారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయెను, మీరు దిగిరండి. తీర్పుతీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి; నక్షత్రములు కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి.”—యోవేలు 3:12-16.
16. యెహోవా తీర్పును అమలు చేయబోవునప్పుడు ఆ తీర్పుకు గురి కాబోయే వారిలో ఎవరు కూడా చేర్చబడతారు?
16 యెహోషాపాతు అనే పేరుకు “యెహోవాయే న్యాయాధిపతి” అనే అర్థం ఎంత ఖచ్చితమో, అంతే ఖచ్చితంగా దేవుడైన యెహోవా తీర్పును అమలు పర్చినప్పుడు తన సర్వాధిపత్యాన్ని పూర్తిగా నిరూపించుకుంటాడు. ప్రతికూల తీర్పుననుభవించే వాళ్లు, ‘తీర్పుతీర్చు లోయలో గుంపులు, గుంపులుగా’ ఉన్నారని ఆ ప్రవచనం వర్ణిస్తోంది. అబద్ధమతాన్ని ప్రచారం చేసే వాళ్లెవరైనా మిగిలివుంటే, వాళ్లు ఆ గుంపుల్లో ఉంటారు. వీరిలో రెండవ కీర్తనలో వర్ణంచబడిన వాళ్లు కూడా అంటే ‘భయభక్తులు కలిగి యెహోవాను సేవించడాని’కి బదులు ఈ లోకపు కుళ్లిన విధానాన్ని కోరుకొనే అన్యజనులూ, జనాంగాలూ, భూరాజులూ, ఉన్నతాధికారులూ ఉంటారు. వీళ్లు ‘కుమారుని ముద్దు పెట్టుకొనుటకు’ నిరాకరిస్తారు. (కీర్తన 2:1, 2, 11, 12) వాళ్లు యేసును యెహోవా దేవుని సహరాజుగా గుర్తించరు. అంతేగాక, మహిమగల ఆ రాజు ఎవరిని ‘మేకలని’ తీర్పుతీరుస్తాడో ఆ ప్రజలంతా కూడా నాశనానికి గుర్తించబడిన ఆ గుంపుల్లో చేర్చబడతారు. (మత్తయి 25:33, 41) యెహోవా పరలోక యెరూషలేము నుండి గర్జించే నిర్ణీత సమయం వచ్చినప్పుడు, ఆయన నియమించిన రాజాధిరాజు ఆ తీర్పును అమలు చేయడానికి బయలుదేరుతాడు. భూమ్యాకాశములు నిశ్చయంగా వణకుతాయి! అయినా, “యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును” అని మనకు హామీ ఇవ్వబడింది.—యోవేలు 3:16.
17, 18. మహా శ్రమలనుండి తప్పించుకొన్న వారిగా ఎవరు గుర్తించబడ్డారు, మరి వాళ్లు ఏ పరిస్థితుల్ని అనుభవిస్తారు?
17 మహాశ్రమలనుండి తప్పించుకొన్న వారిని, యేసు రక్తం యొక్క విమోచనా శక్తినందు విశ్వాసాన్నుంచిన వారితో రూపొందించబడిన “గొప్పసమూహము”గా ప్రకటన 7:9-17 గుర్తిస్తోంది. యోవేలు ప్రవచనంలో ప్రస్తావించబడిన గుంపులు యెహోవా దినాన ప్రతికూలమైన తీర్పును పొందినపుడు వీళ్ళు రక్షించబడతారు. తప్పించుకొన్న వారితో యోవేలు ఇలా చెబుతున్నాడు: “మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు [యెహోవా పరలోక నివాసమందు] నివసించుచున్నానని మీరు తెలిసికొందురు.”—యోవేలు 3:17బి.
18 దేవుని పరలోక రాజ్య పరిపాలన క్రిందనున్న స్థలము “అన్యజనులికమీదట . . . సంచరింపకుండా . . . పరిశుద్ధపట్టణముగా ఉండును” అని ఆ ప్రవచనం మనకు తెలియజేస్తోంది. (యోవేలు 3:17ఎ) ఆ పరలోక రాజ్యపు పరలోక పరిధిలోగానీ, భూపరిధిలోగానీ ఇక అన్యులెవరూ ఉండరు, ఎందుకంటే అందరూ స్వచ్ఛమైన ఆరాధనలో ఐక్యపర్చబడి ఉంటారు.
19. నేడు దేవుని ప్రజలు అనుభవిస్తున్న పరదైసులోలాంటి సంతోషాన్ని యోవేలు ఎలా వర్ణించాడు?
19 నేడు కూడా, భూమిపై యెహోవా ప్రజల మధ్య సమాధానం సమృద్ధిగా ఉంది. వాళ్లు 230 కంటే ఎక్కువ దేశాల్లో దాదాపు 300 విభిన్న భాషల్లో ఆయన తీర్పుల్ని సమైక్యంగా ప్రకటిస్తున్నారు. వాళ్లు వర్థిల్లడాన్ని యోవేలు రమ్యంగా వర్ణించాడు: “ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నింటిలో నీళ్లు పారును.” (యోవేలు 3:18) అవును, భూమిపైనున్న తన స్తుతికర్తలపై యెహోవా ఎడతెగక విస్తారంగా ఆనందమయ ఆశీర్వాదాల్నీ, సుభిక్షితనూ కుమ్మరిస్తాడు, అమూల్యమైన సత్యాన్ని అంతకంతకూ అధికంగా అందిస్తాడు. యెహోవా సర్వాధిపత్యం తీర్పుతీర్చు లోయలో సంపూర్ణంగా నిరూపించబడుతుంది, విడిపించబడిన తన ప్రజల మధ్య ఆయన నిత్యమూ నివసిస్తుండగా ఆనందం వెల్లివిరుస్తుంది.—ప్రకటన 21:3, 4.
మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటారా?
◻ యెహోషాపాతు కాలంలో యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడాడు?
◻ ‘తీర్పుతీర్చు లోయలో’ యెహోవా ఎవరిని నాశనానికి పాత్రులని తీర్పు తీరుస్తాడు?
◻ దేవుని పరాక్రమశాలులు ఎవరు, చివరి పోరాటంలో వాళ్లే భాగాన్ని నిర్వహిస్తారు?
◻ విశ్వాసులైన ఆరాధకులు ఏ సంతోషాన్ని అనుభవిస్తున్నారు?
[21వ పేజీలోని చిత్రం]
‘భయపడకండి యుద్ధం మీది కాదు దేవునిదే’ అని యూదాకు చెప్పబడింది
[23వ పేజీలోని చిత్రం]
‘కఱ్ఱుల్ని చెడగొట్టి ఖడ్గాలుగా’ చేసుకోమని యెహోవా తన శత్రువుల్ని సవాలు చేస్తున్నాడు
[24వ పేజీలోని చిత్రం]
మహా శ్రమలనుండి తప్పించుకొన్న గొప్పసమూహాన్ని బైబిలు గుర్తిస్తోంది