పయినీర్లు అర్పించి, ఆశీర్వాదాలను పొందుతారు
“పయినీరు సేవ మరే యితర విజయవంతమైన వృత్తి కన్నా ఎంతో విలువగలది. ప్రజలకు యెహోవాను గూర్చి తెలుసుకోవడానికి సహాయపడడంకన్నా ఎక్కువ తృప్తినిచ్చేది మరొకటి లేదు.” పూర్తికాల రాజ్యప్రకటన పనియైన పయినీరు సేవను తన వృత్తిగా ఎన్నుకున్న ఒక క్రైస్తవ స్త్రీ అలా చెప్పింది. ఎన్ని యితర ఉద్యోగాలు అంతటి సంతోషాన్ని యివ్వగలవు?
పయినీరు సేవ ఒక గొప్ప గమ్యం, ప్రశస్తమైన ఆధిక్యత. ఒక వ్యక్తి అటువంటి జీవితాన్ని ఎలా ఎన్నుకోగలడు? పయినీరు సేవ అందించే ఆశీర్వాదాలను పొందటానికిగాను దానిలో ఎక్కువకాలం గడపడానికి దాన్ని అంటిపెట్టుకోవడానికి ఏమి అవసరం?
రెండు విషయాలు ప్రాముఖ్యం. మొదటిది, సరైన పరిస్థితులు. అనేకులు పయినీరు సేవ అసాధ్యమైన పరిస్థితుల్లో జీవిస్తుంటారు. రెండొవది, సరైన ఆత్మీయ అర్హతలు, అటువంటి దృక్పథం నిస్సందేహంగా, ప్రస్తుత పరిస్థితులు ఒక వ్యక్తిని పయినీరు సేవ చేయడానికి అనుమతించినా అనుమతించకపోయిన, అందరూ పరిపక్వ క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకోడానికి కృషిచేయవచ్చు.
ఎందుకు కొందరు పయినీరు సేవ చేస్తారు
పయినీరు సేవను విజయవంతంగా చేయడానికి కావలసిన అర్హతలేమిటి? ప్రకటించే నేర్పు ప్రధానం. క్రొత్తవారికి సువార్తను ఎలా ప్రకటించాలో, పునర్దర్శనాలు ఎలా చేయాలో, బైబిలు పఠనాలు ఎలా నిర్వహించాలో పయినీర్లకు తెలిసివుండాలి. ఈ నేర్పు లేనప్పుడు, అది పయినీరు సేవను నిరుత్సాహపరుస్తుంది. అయినప్పటికి, యితర విషయాలు కూడా ప్రాముఖ్యమే.
ఉదాహరణకు, మన ఆరాధనకు సంబంధించి మనం చేసే ప్రతిదీ యెహోవాతో ఆయన సంస్థతో మనకున్న సంబంధంతో ముడిపడివుంది. దీనిలో పయినీరు సేవ యిమిడివుంది. రాడొ అనే ఒక యువ పయినీరు యిలా వివరించాడు: “యెహోవాను జ్ఞాపకం చేసుకుని సత్యమార్గంలో నడవడం కంటే శ్రేష్ఠమైంది మరొకటి యౌవనులకు లేదు.” అవును, యౌవనులు యెహోవా యెడల తమ ప్రేమను, సన్నిహిత సంబంధాన్ని ప్రదర్శించడానికి పయినీరు సేవ ఒక చక్కటి మార్గం.—ప్రసంగి 12:1.
జ్ఞానం, అర్థంచేసుకునే సామర్థ్యం కూడా త్రోసిపుచ్చరానివే. (ఫిలిప్పీయులు 1:9-11) అంటే, ఆత్మీయ యంత్రాన్ని నడిపించే యింధనాలు యివే. మనం ఆత్మీయంగా అలసిపోకుండా, మన ఉత్సాహాన్ని విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే క్రమమైన వ్యక్తిగత పఠనం తప్పనిసరిగా అవసరం. అయితే, మనం పొందే జ్ఞానం మన మనస్సునేకాక మన హృదయాన్ని కూడా ప్రభావితం చేయాలి. (సామెతలు 2:2) కాబట్టి, మన వ్యక్తిగత పఠనానికి తోడు మనం పొందిన జ్ఞానం మన హృదయాన్ని తాకడానికి, మనం ప్రార్థించడానికి, ధ్యానించడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడు, మన పరిస్థితులు అనుమతిస్తే, మనం పయినీరు సేవను చేయగోరవచ్చు.—ఎజ్రా 7:10 పోల్చండి.
పయినీరు సేవ చేపట్టడానికి స్వయం త్యాగ స్ఫూర్తి కూడా అవసరమే. రాన్ అనే యువకుడు తాను పయినీరు సేవ చేయడానికి పథకాలన్నీ వేసుకున్నాడు. ఆయన ముందుకు సాగడానికి సరైన పరిస్థితి కొరకు ఎదురుచూస్తున్నాడు. ప్రత్యేకంగా, పయినీరు సేవకు సమయాన్నిచ్చి అదే సమయంలో జీవితంలోని కొన్ని సుఖాలను అనుభవించదగు ఒక ఉద్యోగం అతనికి అవసరమని అనుకున్నాడు. ఈ విషయాన్ని పరిపక్వతగల ఒక సహోదరితో అన్నప్పుడు, ఆమె జవాబు అతన్ని కదిలించింది. ఆమె యిలా అంది: “యెహోవా క్రియలను ఆశీర్వదిస్తాడు గానీ, వాగ్దానాలను కాదు.” తక్కువ జీతమైనా, పయినీరు సేవకు సమయాన్ని కేటాయించే ఒక ఉద్యోగాన్ని ఆయన కనుగొన్నాడు. మత్తయి 6:25-34ను అన్వయించడం ఒక వ్యక్తి తక్కువ జీతంతో సర్దుకోవడానికి సహాయపడుతుంది.
మంచి సలహాలను అనుసరించాలనే సాత్వికంతో కూడిన కోరిక పయినీరు సేవలో చేరడానికి ఎంతో దోహదపడగలదు. హన్నా, క్రైస్తవురాలిగా తన జీవితంలోని తొలి దశలో పయినీరు సేవ చేయాలనే కోరికను పెంచుకుంది. కుటుంబాన్ని పెంచే పనిలోవుండి, ఆ తర్వాత ఆమె వ్యాపారంలో నిమగ్నమైపోయినందున పయినీరు సేవ చేయలేదు. మెలకువగా ఉన్న పెద్దల సలహాను గైకొని, ఆమెకున్న ఆసక్తిదాయకమైన లౌకిక వృత్తిని విడిచి పయినీరు సేవను చేపట్టింది. ఇప్పుడు హన్నా, యితరులను సమర్పించుకునే స్థితికి నడిపిస్తూ నిష్క్రియులైనవారికి సహాయం చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందుతోంది.
సత్యం ఒకరి జీవితంలో చేసిన వాటికి కృతజ్ఞత కూడా పయినీరు సేవ చేయడానికి ప్రోత్సాహకారి కావచ్చు. తన వివాహం విడిపోతున్నందుకుగాను ఎంతగానో కృంగిపోయిన ఓ స్త్రీ విషయాన్ని పరిశీలించండి. ఆమె దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకుని, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఈ పరిస్థితంతా వెంటనే మారిపోయింది. సత్యము తన కొరకు చేసిన దాన్నిబట్టి పులకరించి, పయినీరు సేవ చేసి యితరులకు సహాయం చేయడమే తన మెప్పును కనపర్చడానికి శ్రేష్ఠమైన మార్గమని నిర్ణయించుకుంది. తర్వాత ఆమె అలా చేసింది, మరి యిప్పుడు ఆమె ఎన్నో బైబిలు పఠనాలనూ సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదాలుగా అనుభవిస్తోంది.
ఇతరులు సహాయం చేయగలరు
పయినీర్లు తరచూ పయినీర్లను తయారుచేస్తారు. ముందు ప్రస్తావించిన రాడో, తమ తలిదండ్రులు యిద్దరు పయినీర్ల సహాయంతో బైబిలు పఠిస్తున్నప్పుడు ఆయన ఆరేళ్లవాడు. ఆయన యింకా చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఈ పూర్తికాల సేవకులతో ప్రాంతీయ సేవలో పాల్గొనేవాడు. రాడో కూడా 17 సంవత్సరాలకే క్రమ పయినీరు అయ్యాడు. మరో యౌవనుడు అర్నో క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాడు కానీ ఆత్మీయంగా బలహీనుడు. తర్వాత, తన ఆత్మీయ బలాన్ని పునరుద్ధరించుకోడానికి పూనుకుని, యిప్పుడు ఆయన యిలా చెబుతున్నాడు: “పయినీర్ల నుండి ఎంతో ప్రోత్సాహాన్ని పొందాను. ప్రత్యేకంగా స్కూలు సెలవుల్లో నేను వారితో సహవసించాను, కొన్నిసార్లు ప్రాంతీయ సేవలో దాదాపు 60 గంటలు రిపోర్టు చేశాను. ఆ తర్వాత, క్రమ పయినీరు సేవ [నెలకు 90 గంటలు] చేయడం అంత కష్టమనిపించలేదు.” లోకాన్ని అమితంగా అనుభవించకూడదని 1 కొరింథీయులు 7:29-31 నందివ్వబడిన సలహా, అటువంటి యౌవనులకు నిజంగా సహాయపడింది.
ఆత్మీయ ఆసక్తి మొదటి స్థానాన్ని పొంది, తలిదండ్రులు తమ పిల్లలను పూర్తికాల సేవలో చేరమని ప్రోత్సహించే యిళ్లలో పయినీరు స్ఫూర్తి సులభంగా నాటుకుపోతుంది. అటువంటి యింట్లో పెరిగిన ఫిలో, యిలా వ్యాఖ్యానిస్తున్నాడు: “లౌకిక భవిష్యత్తుకొరకు పని చేయమని నా చదువు కొనసాగించమని నాకెందరో సలహాయిచ్చారు. అయితే, వివేకయుక్త ఎంపికను చేసుకోడానికి మా తలిదండ్రులు నాకు సహాయపడ్డారు. నేను నిజంగానే నా భవిష్యత్తుకొరకు పనిచేయాలనుకుంటే, మొదటి మెట్టుగా యెహోవాతో సంబంధాన్ని ఏర్పర్చుకోవడం అవసరం అని వారు నాతో చెప్పారు.”
థామర్ అనే ఒక యువతి కూడా తాను పయినీరు సేవను చేపట్టగల్గడానికి తన తలిదండ్రుల మాదిరి, వారి ప్రయత్నాలే కారణమని చెబుతోంది. ఆమె యిలా అన్నది: “నేను జీవితంపై ఆత్మీయ దృష్టిని ఎప్పుడు పెంచుకున్నానో నేను నిజంగా చెప్పలేనుగానీ, నాకలాంటి దృష్టి పుట్టుకతోనే రాలేదని మాత్రం తెలుసు. క్రమంగా ప్రాంతీయ సేవలో పాల్గొనడం, కూటాలకు హాజరుకావడం వంటి మా తలిదండ్రుల అలవాట్లు, అలాగే సత్యం యెడల వారికున్న గాఢమైన ప్రేమ, నా ఆత్మీయ దృక్పథాన్ని పెంపొందించుకోడానికి ఎంతగానో సహాయపడింది.”
మీ నిర్ణయానికి హత్తుకొని ఉండడం
ఒక వ్యక్తి పయినీరు సేవలో ప్రవేశించిన తర్వాత, దాన్ని కాపాడుకోవడం ఆమెకు గానీ, ఆయనకు గానీ ఆ వివేకయుక్త నిర్ణయం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఈ విషయంలో ఆచరణయుక్తమైన ఎన్నో సలహాలున్నాయి. ఉదాహరణకు, తమ సమయం వీలైనంత ఫలభరితంగా ఉండడానికిగాను, పయినీర్లు తమ సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడానికి వారు చాలా కృషి చేస్తారు. అయితే, యెహోవాతో, ఆయన సంస్థతో ఒక వ్యక్తికి గల సంబంధం అన్నదే ప్రాముఖ్యమైన విషయము.
దీనికి సంబంధించిందే ప్రార్థనా పూర్వక వైఖరి. “నేను సత్యంలోకి వచ్చినప్పుడు, నేను పయినీరు కావాలనే కోరిక నన్ను దహించివేసేది.” అని కార్ అంటున్నాడు. అయితే, వాళ్ల నాన్నగారు, మొదట తన అగ్రికల్చరల్ యూనివర్శిటీ కోర్సును పూర్తి చేయమని గట్టి పట్టుపట్టాడు. ఆ తర్వాత, కార్ పయినీరు సేవ ప్రారంభించాడు. తర్వాత తగిన సమయంలో ఆయన వివాహం చేసుకున్నప్పుడు, ఆయన భార్యకూడా అతనితో పాటు పయినీరు సేవలో చేరింది. ఆమె గర్భిణి అయినప్పుడు, పయినీరు సేవ విడిచిపెట్టే పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. “నేను తరచూ యెహోవాకు ప్రార్థించి, పయినీరు సేవను కొనసాగించాలనే నా హృదయ వాంఛను ఆయన ముందుంచాను” అన్నాడు కార్. చివరికి కార్ పయినీరు సేవ చేస్తూ కుటుంబాన్ని పోషించగల ఒక ఉద్యోగాన్ని కనుగొన్నాడు.
ఒక వ్యక్తి పయినీరు సేవలో ఉండేందుకు తోడ్పడే మరో విషయం, వస్తుసంబంధ కనీస అవసరతలతో తృప్తిపడడం. అపొస్తలుడైన పౌలు యిలా రాశాడు: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.—‘నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.’” (హెబ్రీయులు 13:5) ఉన్నవాటితో తృప్తిచెందడం హారి ఈరాన్లు పయినీరు సేవలో కొనసాగడానికి సహాయపడింది. కనుచూపులేని ఈరాన ఎనిమిదేళ్లుగా పయినీరుగా ఉంది. “మేమెన్నడూ మా ఆర్థిక పరిస్థితులను ఒక సమస్యగా పరిగణించలేదు” అని ఆమె అంటోంది. “అనవసర ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టుకోకుండా మేము జాగ్రత్తపడ్డాము. మేము అన్నివేళలా మూల్యాన్ని లెక్కించేవాళ్లం. మా జీవితాలు ఎల్లప్పుడూ ఆడంబరం లేకుండా, మనోహరంగా ఉండి, ఎన్నో ఆశీర్వాదాలను పొందాయి.”
అనేక సంతోషాలు, ఆశీర్వాదాలు
తొమ్మిది సంవత్సరాల పయినీరు సేవలోకి వెనుదిరిగి చూస్తూ థామర్ యిలా అంటోంది: “యెహోవాయే నీ చేయిపట్టుకున్నట్లుగా, నీవు యెహోవాతో చాలా దగ్గరౌతావు.” (కీర్తన 73:23) కొన్ని శోధనలు కూడా మనస్సులోకి వస్తాయి. “నా స్వంత అసంపూర్ణతలూ, అలాగే యితరులవి కూడా నన్ను ఎప్పుడూ బాధించేవి” అని థామర్ పేర్కొంది. “అంతేకాకుండా, వస్తుసంబంధంగా ఫలవంతమైన జీవనాన్ని ఎన్నుకున్న కొందరు సహోదర సహోదరీలను నేను గమనించేదాన్ని, మరి నేను వానలో చలిలో బయట యింటింటికీ తిరగడం కంటే వారి ఎంపికే మరింత ఆకర్షణీయంగా అన్పించింది. అయితే, నా హృదయాంతరాల్లో నేనెన్నడూ నా స్థానాన్ని మార్చుకోవాలనుకోలేదు. పయినీరు సేవకంటే కూడా ఎక్కువ సంతోషాన్ని, అంతటి ఆత్మీయ సంతృప్తినీ, అంతటి ఆశీర్వాదాలను ఏది తేగలదు?” అటువంటి సంతోషాలను ఆశీర్వాదాలను మీరు ఉన్నతంగా దృష్టిస్తారా?
పయినీర్లు ఎక్కువ సమయాన్ని క్రైస్తవ పరిచర్యలో గడుపుతారు గనుక, ఎంతోమంది వ్యక్తులు బైబిలు సత్యంలోని జ్ఞానాన్ని పొందడానికి సహాయపడే స్థితిలో వారున్నారు. ముందు పేర్కొన్న హారి, ఈరాన్లు యిలా అంటున్నారు: “యెహోవా సంస్థలో పొందదగు ఆధిక్యతలు అనేకం ఉన్నాయి. అయితే క్రొత్తవారు యెహోవా సేవకులయ్యేంతంగా వారికి సహాయం చేయడం అన్నిటికంటే గొప్పది.”
“సామెతలు 10:22 నందున్న మాటలు నా విషయంలో నిజమనిపించుకున్నాయి: ‘యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.’ నేను యెహోవాను సేవించిన కాలంలో ఎన్నోసార్లు ఈ లేఖనం నా విషయంలో నెరవేరింది” అని అంటూ మరొక పయినీరు తన విషయాన్ని చక్కగా వ్యక్తపర్చాడు.
తలిదండ్రులారా, మీ పిల్లల్లో పయినీరు కావాలనే కోరికను మీరు నాటుతున్నారా? పయినీరులారా, యితరుల్లో ఈ కోరికను రేపడానికి మీరు ప్రయత్నించారా? పెద్దలారా, మీ సంఘంలోని పయినీర్లకు మీరు మద్దతునిచ్చి, యితరుల్లో పయినీరు స్ఫూర్తిని వృద్ధిచేస్తున్నారా? యెహోవా ప్రజల్లో యింకా ఎంతోమంది పయినీరు సేవలో పాల్గొని అటువంటి గొప్ప ఆశీర్వాదాలను పొందడానికి ముందుకు రావాలని ఆశిద్దాము.