కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 2/1 పేజీలు 20-25
  • “మాకు ఈ పరిచర్య ఉన్నందువల్ల . . . , మేము విడువము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మాకు ఈ పరిచర్య ఉన్నందువల్ల . . . , మేము విడువము”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఓ స్పెయిన్‌ వధువు ఓ స్పెయిన్‌ నియామకం
  • బహిష్కరణ
  • కృంగుదలను జయించడం
  • ఎంతో అమూల్యమైన ఒక ముత్యము మాకు ఇవ్వబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా సేవలో ఆశ్చర్యాలతో నిండిన జీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • 80 ఏళ్లప్పుడు నియామకంలో మార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 2/1 పేజీలు 20-25

“మాకు ఈ పరిచర్య ఉన్నందువల్ల . . . , మేము విడువము”

రెనాల్డ్‌ టైలర్‌ చెప్పిన ప్రకారంగా

వేసవి కాలం 1963లో నేను నా జీవితం కొరకు పోరాడాను. నేను తీరంలో మెల్లిగా నడుస్తుండగా, నేను ఒక అపాయకరమైన గుండంపై అడుగు వేశాను. అప్పుడు అకస్మాత్తుగా చాలా లోతైన నీళ్లలోకి నెట్టివేయబడ్డాను. ఈతరాని నేను, తీరం నుండి కేవలం కొన్ని మీటర్ల దూరంలో మునిగిపోయే స్థితికి చేరుకున్నాను. నా స్నేహితుడొకడు నా పాట్లు చూసి నన్ను తీరంవైపుకు లాక్కుని వచ్చేలోపు నేను మూడు సార్లు మునిగిపోయాను, సముద్రపు నీటిని ఎంతో తాగేశాను. కృత్రిమ ఊపిరి పుణ్యాన నేను బ్రతికి బయటపడ్డాను.

పరిస్థితులు చాలా నిరాశాజనకంగా ఉన్నప్పటికీ—ఎన్నడూ విడవకూడదన్న దాని ప్రాముఖ్యతను నేను గుణగ్రహించడం యిది మొట్ట మొదటిసారి కాదు. చిన్నతనం నుండే, నేను నా ఆత్మీయజీవితం కొరకు పోరాడవల్సివచ్చింది.

రెండవ ప్రపంచ యుద్ధకాలమందలి విషాదకరమైన రోజుల్లో క్రైస్తవ సత్యాన్ని గూర్చి నేను మొదటి సారిగా తెలుసుకున్నాను. బాంబుల దాడిని తప్పించుకునేందుకు లండన్‌ నుండి పంపివేయబడిన వేల మంది పిల్లల్లో నేను ఒకడిని. నేను కేవలం 12 ఏండ్ల వాణ్ణి కనుక, యుద్ధాన్ని నేనంతగా పట్టించుకోలేదు; అది పూర్తిగా సాహసంలా తోచింది.

నైరుతి ఇంగ్లాండ్‌ నందు, వెస్టన్‌-సూపర్‌-మేర్‌ నందున్న వృద్ధ దంపతులు నన్ను చూసుకునేవారు. దంపతుల యింటికి నేను చేరుకున్న వెంటనే, కొందరు పయినీరు పరిచారకులు మమ్మల్ని సందర్శించడం ప్రారంభించారు. అది హర్గీవ్‌ల కుటుంబం; ఆ నలుగురూ—రెజ్‌, మాబ్స్‌ పమెల, వలెరి—ప్రత్యేక పయినీర్లే. నన్ను పెంచిన తలిదండ్రులు సత్యాన్ని అంగీకరించారు, మరి దేవుని బూర (ఆంగ్లం) అనే పుస్తకాన్ని పఠించిన తర్వాత నేను కూడా యెహోవాను సేవించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. కేవలం ఆరు వారాల తర్వాత ప్రకటన పనిలో భాగం వహించేందుకు నన్ను ఆహ్వానించారు.

మొట్ట మొదటి సారి ప్రాంతీయసేవను చేసిన రోజు నాకు యింకా జ్ఞాపకముంది. ఏ సిద్ధపాటూ లేకుండానే నాకు కొన్ని చిన్నపుస్తకాలను యిచ్చి, “వీధి చివర్లో ఆ ప్రక్క పనిచేయి” అని నాతో చెప్పారు. నా మొదటి ప్రచారదినాన్ని నేను అలా గడిపాను. ఆ కాలం, మేము తరచూ శక్తివంతమైన ప్రసంగాలున్న ఫోనోగ్రాఫ్‌ రికార్డులు ఉపయోగించి ప్రకటించేవాళ్లం. నేను రికార్డుచేసిన ప్రసంగాలను ప్లే చేస్తూ ఫోనోగ్రాఫ్‌ను యింటింటికీ తీసుకువెళ్లినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ విధంగా నన్ను ఉపయోగించుకోవడం నిజంగా ఒక ఆధిక్యతగా నేను పరిగణించాను.

పాఠశాలలో నేను సాక్ష్యమిచ్చే పనిని చాలా చేశాను. అంతేకాకుండ బైబిలు అంశాలపై ఆధారితమైన ఒక సెట్టు పుస్తకాలను మా ప్రధానోపాధ్యాయకునికి అందించడం నాకు జ్ఞాపకం ఉంది. నాకు 13 ఏండ్లున్నప్పుడు అతి సమీపంలోనున్న బాత్‌నందు జరిగిన సమావేశంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. యుద్ధ సమయంలో జరిగిన నేను ఎన్నడూ మర్చిపోలేని మరో సమావేశం లిచెస్టర్‌ నందు 1941లో డిమెన్‌ఫోర్ట్‌ హాలు నందు జరిగింది. అప్పటి వాచ్‌టవర్‌ సొసైటీ అధ్యక్షుడైన సహోదరుడు రూథర్‌ఫోర్డ్‌ స్వయంగా యిచ్చిన సమాచారం గల పిల్లలు (ఆంగ్లం) అనే పుస్తకం ప్రతిని అందుకునేందుకు నేను వేదిక వరకు వెళ్లాను. అక్కడ హాజరైన యౌవనులందరికొరకు యిచ్చిన పురికొల్పే ప్రసంగం, నిరంతరం యెహోవాను సేవించాలన్న నా కోరికను పునరుద్ధరించింది.

ఆ విధంగా నన్ను పెంచిన తలిదండ్రులతో సత్యంలో పెరగడంలో రెండు ఆనందమయ సంవత్సరాలను నేను గడిపాను. అయితే, 14 ఏళ్ల వయస్సప్పుడు, నేను లండన్‌కు తిరిగి వచ్చి నా జీవనాని కొరకు పనిచేయవల్సి వచ్చింది. నన్ను కన్న తలిదండ్రులతో నేను మరలా కలవగల్గినప్పటికీ, యింట్లో ఎవ్వరూ నా విశ్వాసాన్ని పంచుకోలేదు కనుక ఆత్మీయంగా నేను నా కాళ్లమీద నిలబడవల్సివచ్చింది. నాకు అవసరమైన సహాయాన్ని యెహోవా నాకు వెంటనే అందించాడు. నేను లండన్‌ చేరుకున్న కేవలం మూడు వారాల తర్వాత ఒక సహోదరుడు నన్ను స్థానిక రాజ్య మందిరానికి తీసుకెళ్లేందుకు మా నాన్నగారి అనుమతి తీసుకోడానికి మా యింటికి వచ్చాడు. ఆ సహోదరుడు, యిప్పుడు యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యుడైన జాన్‌ బార్‌. కష్టతరమైన నా కౌమార దశలో నా ఆత్మీయ “తండ్రుల్లో” ఆయన ఒకడయ్యాడు.—మత్తయి 19:29.

లండన్‌ బేతేలు గృహం ప్రక్కనున్న క్రావన్‌ టెర్రేస్‌ నందు కూడుకునే పడింగ్టన్‌ సంఘానికి నేను హాజరవ్వడం ప్రారంభించాను. నేను ఆత్మీయ అనాధను కనుక ఓ వయస్సుమళ్లిన అభిషక్త సహోదరుడైన హమ్‌ఫెరిస్‌ “పప్పాను” నా యెడల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేందుకు నియమించారు. ఆ సంఘంలో సేవచేసిన అనేకమంది అభిషక్త సహోదర సహోదరీలతో సహవసించడం నిశ్చయంగా ఒక గొప్ప ఆశీర్వాదమే. భూ నిరీక్షణగల—యెహోనాదాబు అని పిలవబడే మేము—చాలా చిన్న సంఖ్యలో ఉండేవారం. వాస్తవానికి, నేను హాజరయ్యే సంఘ పుస్తక పఠనమంతటిలో నేను ఒక్కడినే ‘యెహోనాదాబును.’ నా సమ వయస్కులతో నాకు ఎక్కువ సహవాసం లేకపోయినప్పటికీ, పరిపక్వతగల సహోదరులతో కల్గివున్న ఆ అమూల్యమైన సహవాసం నాకు ఎన్నో ఉపయుక్తమైన పాఠాలను నేర్పింది. బహుశ అన్నింటికంటే ప్రాముఖ్యమైంది యెహోవా సేవను ఎన్నడు ఎడబాయకుండా ఉండడం.

ఆ దినాల్లో, పూర్తి వారాంతాన్ని ప్రకటన కార్యక్రమానికి అంకితం చేసే వాళ్లం. నన్ను “సౌండ్‌ కారును” చూసుకోమని నియమించారు. శబ్ద పరికరాలు ఒక కారు బాట్రీ పట్టేందుకు అనువుగా మల్చబడిన మూడు చక్రాల సైకిల్‌ అది. ప్రతి శనివారం నేను ఆ మూడు చక్రాల సైకిలు మీద బయలుదేరి, వివిధ వీధి చివర్లకు వెళ్ళేవాన్ని, అక్కడ కొంత సంగీతాన్నీ ఆ తర్వాత సహోదరుడైన రూథర్‌ఫోర్డ్‌ ప్రసంగాలను వినిపించేవాళ్లం. మా పత్రిక బ్యాగులతో మేము వీధి సాక్ష్యపు పనిచేసేందుకు శనివారాలు కూడా ఉపయోగించేవాళ్లం. ఆదివారాలు చిన్న పుస్తకాలను బౌండు పుస్తకాలను అందిస్తూ మేము యింటింటి సేవకొరకు కేటాయించేవాళ్లం.

ఉత్సాహం గల వృద్ధ సహోదరులతో నా సహవాసం పయినీరు సేవ చేయాలన్న నా కోరికను మరి రేకెత్తించింది. జిల్లా సమావేశాల్లో పయినీర్ల కొరకు యిచ్చే ప్రసంగాలను విన్నప్పుడు ఈ కోరిక మరింత బలపడింది. నా జీవితంపై ఎంతో ప్రభావం చూపిన ఒక సమావేశం 1947లో ఎర్ల్స్‌ కోర్ట్‌ లండన్‌ నందు జరిగింది. రెండు నెల్ల తర్వాత, నేను పయినీరు సేవలో చేరి, ఆ నాటినుండి పయినీరు స్ఫూర్తిని నిలుపుకునేందుకు ప్రయత్నించాను. వృద్ధి చెందే బైబిలు పఠనాలను నిర్వహించడం నుండి నేను పొందిన ఆనందం, ఇది నిజంగా సరైన నిర్ణయమని కచ్చితంగా తెలపడానికి సహాయపడింది.

ఓ స్పెయిన్‌ వధువు ఓ స్పెయిన్‌ నియామకం

పడింగ్టన్‌ సంఘంలో ఇంకా పయినీరు సేవను చేస్తుండగా 1957వ సంవత్సరంలో, రాఫేలా అనే ఒక అందమైన స్పెయిన్‌ సహోదరిని కలిశాను. కొన్ని నెల్ల తర్వాత మేము వివాహం చేసుకున్నాం. పయినీరుగా ఉండాలన్నది మా గురి. అయితే నేను రాఫేలా తలిదండ్రులను కలిసేందుకు మొదట మేము మాడ్రిడ్‌కు వెళ్లాం. ఆ సందర్శనం మా జీవితాన్నే మార్చేసింది. మేము మాడ్రిడ్‌లో ఉన్నప్పుడు, స్పెయిన్‌ బ్రాంచి అధ్యక్షుడైన సహోదరుడు రె డుసిన్‌బెరె, అనుభవజ్ఞులైన సహోదరుల అవసరత తీవ్రంగా ఉన్న స్పెయిన్‌లో సేవచేసే విషయాన్ని గూర్చి మేము ఏమి తలస్తాము అని నన్ను అడిగాడు.

అలాంటి ఆహ్వానాన్ని మేమెలా నిరాకరించగలం? ఆ విధంగా, 1958లో మేము కలిసి స్పెయిన్‌లో పూర్తికాల సేవను ప్రారంభించాము. ఆ సమయంలో ఆ దేశం, ఫ్రాంకో పాలన క్రింద ఉంది, మరి మన పని చట్టబద్ధంగా గుర్తించబడలేదు, అది ప్రకటన పనిని చాలా కష్టతరం చేసింది. అంతేకాకుండ, మొదటి రెండు సంవత్సరాలు నేను స్పెయిన్‌ భాషను నేర్చుకోడానికి కష్టపడవలసి వచ్చింది. సంఘంలోని సహోదరులతో సంభాషించలేకపోవడంవల్ల వచ్చిన నిరాశ మూలంగా నేను అనేక సార్లు ఏడ్చినప్పటికీ, మరోసారి విడనాడకుండా ఉండవల్సిన విషయమే అది.

పర్యవేక్షకుల అవసరం అక్కడ ఎంతగా ఉందంటే, నేను స్పెయిన్‌ భాషను మాట్లాడలేకపోయినప్పటికీ, ఒక్క నెలలోనే నేను ఒక చిన్న గుంపును పర్యవేక్షించాను. మా రహస్యమైన పనివల్ల, మమ్మల్ని 15 నుండి 20 మంది ప్రచారకులున్న చిన్న చిన్న గుంపులుగా చేశారు, అది కొద్దోగొప్పో ఒక సంఘంలా పనిచేసేది. మొదట్లో, ప్రేక్షకులు యిచ్చే జవాబులనన్నింటినీ నేను అర్థంచేసుకోలేను కనుక కూటాలను నిర్వహించడం నరాలను కంపింపజేసేది. అయినప్పటికీ, నా భార్య వెనక కూర్చుని, నాకు అర్థంకాలేదు అని గ్రహిస్తే, ఆ జవాబు సరేనని వివేకయుక్తంగా తలాడించేది.

భాషలు నేర్చుకునే విషయంలో నాకు సహజ కళలేదు, నేను మరింత సులభంగా ప్రతీదీ చేయగల్గే ఇంగ్లాండుకు తిరిగి వచ్చేయాలని నాకు ఎన్నోసార్లు అనిపించింది. అయినప్పటికీ, మొదటినుండి మన ప్రియమైన స్పెయిన్‌ సహోదర సహోదరీల ప్రేమ, స్నేహం, భాష విషయంలో నాకు కలిగే నిరాశను పరిహరించింది. అంతేకాకుండ ఇదంతా తగినదేనని చూపించిన ప్రత్యేక ఆధిక్యతలతో యెహోవా నన్ను ఆశీర్వదించాడు. న్యూయార్క్‌నందు 1958లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి నన్ను స్పెయిన్‌ నుండి ప్రతినిధిగా పంపించారు. ఆ తర్వాత 1962లో, మోరాకో నందలి టాన్‌జీర్‌ నందు ఏర్పాటు చేయబడిన రాజ్య పరిచర్య పాఠశాలలో అమూల్యమైన శిక్షణను నేను పొందాను.

భాషకాకుండ నేను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటంటే పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో అన్న ఎడతెగని భయం. ఒక విదేశీయునిగా, అరెస్టు అయితే ఇక దేశ బహిష్కరణే అని నాకు తెలుసు. ఈ అపాయాన్ని తగ్గించేందుకు మేము ఇద్దరిద్దరంగా పనిచేసేవాళ్లం. ఒకరు సాక్ష్యమిస్తుండగా, మరొకరు అపాయపు సూచనలకొరకు గమనిస్తూ ఉంటారు. అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌పైన తరచూ ఒకటి రెండు యిళ్లను సందర్శించిన తర్వాత, రెండు లేక మూడు బ్లాకులను విడిచి, రెండు మూడు గృహాలను సందర్శిస్తాము. మేము బైబిలును తరచూ ఉపయోగించేవాళ్లం, అంతేకాకుండ ఆసక్తిగలవారికి అందించేందుకుగాను కేవలం మా పైకోటులలో కొన్ని చిన్నపుస్తకాలను మాత్రం మేము దాచుకొని తీసుకువెళ్లేవాళ్లం.

మాడ్రిడ్‌ నందు ఒక సంవత్సరం తర్వాత, అసలు సాక్షులే లేని వాయవ్య స్పెయిన్‌ నందలి పెద్ద పట్టణమైన విగొకు మమ్మల్ని నియమించారు. బహుశ మొదటి నెలవరకు—మేము సందర్శించడానికి వచ్చిన పర్యాటకులనే అభిప్రాయాన్ని కల్గించేందుకు—నా భార్యనే ఎక్కువగా సాక్ష్యమిచ్చే పనిని చెయ్యాలనే సలహాను సంస్థ యిచ్చింది. ఎక్కువ అవధానాన్ని ఆకర్షించని పద్ధతి ఉపయోగించినప్పటికీ, మా పరిచర్య అవధానాన్ని ఆకర్షించింది. ఒక నెల కల్లా కాథోలిక్కు ప్రీస్టులు రేడియో ద్వారా మమ్మల్ని నిందించడం ప్రారంభించారు. ఒక వివాహిత దంపతులు బైబిలును గూర్చి—అప్పట్లో సుమారు పూర్తిగా నిషేధించబడ్డ పుస్తకం గూర్చి—మాట్లాడుతూ యింటింటికీ వెళుతున్నారని వారి చర్చికి హాజరయ్యేవారిని హెచ్చరించారు. “అనుమానించబడ్డ దంపతుల్లో” ఒక విదేశీయుడూ మరియు స్పెయిన్‌ దేశీయురాలైన ఆయన భార్య ఉన్నారు. ఆమే ఎక్కువగా సాక్ష్యమిచ్చేది.’

ఈ అపాయకరమైన దంపతులతో ఊరికే మాట్లాడ్డమే పాపమని, ప్రీస్టుకు వెంటనే విన్నవించుకుంటే మాత్రమే అది క్షమించబడుతుందని ప్రీస్టులు ఉత్తరువిచ్చారు. అనుకున్నట్లుగానే, ఓ స్త్రీతో చక్కగా మాట్లాడిన తర్వాత ఆమె చింతిస్తూ తాను వెళ్లి పాపనివేదన చేయాలని మాతో చెప్పింది. మేము ఆమె యింటిని విడిచి వెళ్తుండగా ఆమె చర్చి వైపుకు పరిగెట్టడం మేము చూశాము.

బహిష్కరణ

విగొకు మేము చేరుకున్న కేవలం రెండు నెల్లకే, పోలీసులు అకస్మాత్తుగా మమ్మల్ని పట్టుకున్నారు. మమ్మల్ని చెరపట్టిన పోలీసు కనికరంగలవాడు, మరి మమ్మల్ని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లేటప్పుడు మాకు సంకెళ్లు వేయలేదు. స్టేషన్‌ వద్ద, ఒక సుపరిచిత వ్యక్తిని చూశాము, ఆ వ్యక్తి, మేము యిటీవల సాక్ష్యమిచ్చిన టైపిస్టు. నేరస్థుల్లా మాతో వ్యవహరించడం చూచి బాధపడింది, ఆమె మామీద నేరారోపణ చేయలేదని మాకు హామీ ఇచ్చేందుకు త్వరపడింది. అయినప్పటికీ, “స్పెయిన్‌ ఆత్మీయ ఐక్యతకు” మేము అపాయంగా ఉన్నామని నిందించారు, మరి ఆరువారాల తర్వాత మమ్మల్ని బహిష్కరించారు.

అది ఒక ఆటంకం, కానీ విడిచిపెట్టే ఉద్దేశం మాకు లేనే లేదు. ఐబిరియన్‌ పెనిన్‌సులాలో చేయవల్సిన పని ఇంకా చాలా ఉంది. టాంజీర్‌లో మూడు నెల్లు గడిపిన తర్వాత, మమ్మల్ని గిబ్రాల్టర్‌కు నియమించారు, అది కూడా కొత్త ప్రాంతమే. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనం మన పరిచర్యను అమూల్యమైందిగా ఎంచుకుంటే, మనం దాన్ని చేస్తూనే ఉంటాం మరి దానికి ప్రతిఫలం లభిస్తుంది. (2 కొరింథీయులు 4:1, 7, 8) మా విషయంలో అది నిజం అని తేలింది. గిబ్రాల్టర్‌లో మేము సందర్శించిన మొట్టమొదటి యింట్లోనే ఆ కుటుంబమంతటితో బైబిలు పఠనాన్ని ప్రారంభించాము. చాలా త్వరగా మేము ఒకొక్కరం 17 పఠనాలను నిర్వహించేవారము. మేము పఠించినవారిలో అనేకులు సాక్షులయ్యారు. అంతేకాకుండ రెండు సంవత్సరాల్లో 25 మంది ప్రచారకులతో ఒక సంఘం తయారైంది.

అయితే విగొలో జరిగినట్లుగా, మతాధికారులు మాకు విరుద్ధంగా చాటించడం ప్రారంభించారు. గిబ్రాల్టర్‌ యొక్క ఆంగ్లికన్‌ బిషప్పు, మేము “అప్రీతికరమైనవాళ్లం” అని పోలీసు చీఫ్‌కు హెచ్చరించాడు, అంతేకాకుండ ఈ ప్రచారం చివరికి ఫలితాలను తెచ్చింది. జనవరి 1962లో మమ్మల్ని గిబ్రాల్టార్‌నుండి బహిష్కరించారు. తర్వాత యిక మేము ఎక్కడికి వెళ్తాం? స్పెయిన్‌ నందు యింకా గొప్ప అవసరత ఉంది, కనుక గత పోలీసు రికార్డు ఫైళ్లలోకి వెంటనే ఎక్కి ఉండదని అపేక్షిస్తూ మేము మరలా వెళ్లాం.

బాగా ఎండగా ఉండే సెవిలె పట్టణం మా కొత్త ఇల్లయింది. అక్కడ మరో పయినీరు దంపతులైన రె పాట్‌ కిర్కప్‌లతో సన్నిహితంగా పనిచేసే ఆనందం లభించింది. సెవిలెలో కేవలం 5 లక్షలమంది ఉన్నప్పటికీ, 21 ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు, కనుక చేయవల్సిన పని ఎంతో ఉంది. ఇప్పుడు అక్కడ 1,500 ప్రచారకులుతో 15 సంఘాలున్నాయి, ఒక సంవత్సరం తర్వాత మాకు సంభ్రమాశ్చర్యం కలిగింది; బార్సిలోనా ప్రాంతంలో మమ్మల్ని ప్రాంతీయ సేవకొరకు ఆహ్వానించారు.

మన పని అధికారికంగా గుర్తించబడని దేశంలో ప్రాంతీయ సేవ కొంత వేరుగా ఉంటుంది. ప్రతి వారం మేము చిన్న గుంపులను సందర్శించేవాళ్లం, వాటిలో సామర్థ్యంగల సహోదరులు లేరు. కష్టపడిపనిచేసే ఈ సహోదరులకు మనం యివ్వగల శిక్షణ మరియు మద్దతు చాలా అవసరమైంది. ఈ పనిని మేము ఎంతో ఇష్టపడ్డాం! సాక్షులంటూ ఉంటే, అలా కొద్దివారున్న ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలు గడిపిన తర్వాత, అనేకమంది వివిధ సహోదర సహోదరీలను సందర్శించేందుకు మేము ఎంతో ఆనందించాము. అంతేకాకుండ, బార్సిలోనా నందలి ప్రకటన పని చాలా సులభంగా ఉంది, మరియు అనేకులు బైబిలును పఠించడానికి యిష్టపడ్డారు.

కృంగుదలను జయించడం

అయితే, కేవలం ఆరు నెల్ల తర్వాత నా జీవితం అకస్మాత్తుగా మారింది. సముద్రపు ఒడ్డున జరుపుకున్న మా మొదటి సెలవుదినం, నేను ముందు వివరించిన ప్రమాదం సంభవించినప్పుడు అది దాదాపు విషాద సంఘటనలా అయ్యింది. మునిగిపోయే స్థితి వల్ల కలిగిన తీవ్రమైన అఘాతమునుండి నేను శారీరకంగా త్వరగా కోలుకున్నప్పటికీ, ఆ సంఘటన నా నాడీ వ్యవస్థ చెరగని ముద్రను వేసింది.

కొన్ని నెల్లవరకు, నేను ప్రాంతీయసేవలో కొనసాగేందుకు ఎంతో కష్టపడ్డాను, కానీ చివరికి వైద్య చికిత్సకొరకు నేను ఇంగ్లాండ్‌కు తిరిగి రావల్సివచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత నేను తిరిగి స్పెయిన్‌ నందు పని చేయడానికి వీలుపడేంతగా కోలుకున్నాను, అక్కడ మేము ప్రాంతీయసేవను మరోసారి చేపట్టాము. కానీ, అది కేవలం చాలా తక్కువ సమయంవరకే. నా భార్య తల్లిదండ్రులు చాలా రోగులయ్యారు, మరియు వాళ్లను చూసుకునేందుకు మేము పూర్తికాలసేవను విడిచిపెట్టాము.

నాకు నరాలు పూర్తిగా బ్రేక్‌డౌన్‌ అయినప్పుడు 1968లో నా జీవితం మరి కష్టతరమైపోయింది. నేను యిక ఎన్నడూ కోలుకోనని నేను రాఫెలా ఇరువురమూ భావించిన చాలా సమయాలున్నాయి. మరలా నేను మునిగిపోతున్నాననిపించింది, కానీ మరో విధంగా! ప్రతికూల భావాలతో నన్ను కలతపర్చడమే కాకుండా, కృంగుదల నా శక్తినంతటినీ హరించివేసింది. నేను తీవ్రమైన అలసటను దాడులను అనుభవించేవాణ్ణి అవి నేను ఎల్లప్పుడూ దాదాపు బాగా నిద్రపోయేలా చేస్తాయి. ఆ సమయంలో ఈ విధమైన సమస్యను సహోదరులందరూ అర్థంచేసుకోలేదు; యెహోవా అర్థంచేసుకున్నాడని నాకు తెలుసు. కృంగినవారి కొరకు సహాయకరమైన మరియు ఎంతో అర్థంచేసుకునే కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని అద్భుతమైన శీర్షికలను నేను చదవడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

ఈ కష్టతరమైన సమయమంతటిలో, నా భార్య నాకు ఎల్లప్పుడు ప్రోత్సాహాన్ని యిచ్చేది. సమస్యలను కలిసి ఎదుర్కోవడం నిజంగా వివాహ బంధాన్ని బలపరుస్తుంది. రాఫెలా తలిదండ్రులు చనిపోయారు, మరి 12 సంవత్సరాల తర్వాత, మరలా పూర్తికాల సేవకు తిరిగి రావచ్చని మేము అనుకునే స్థితికి నా ఆరోగ్యం మెరుగుపడింది. మాకు సంభ్రమాశ్చర్యం కల్గేలా 1981 నందు, ప్రాంతీయ పనిలో మరలా పాల్గొనేందుకు మమ్మల్ని ఆహ్వానించారు.

గతంలోని మా ప్రయాణ పరిచర్య అనుభవం నుండి, స్పెయిన్‌ నందు ఎంతో విస్తృతమైన దైవపరిపాలనా మార్పులు వచ్చాయి. ప్రకటించడం యిప్పుడు బహిరంగంగా జరుగుతుంది, కనుక నన్ను నేను అనుకూలంగా మార్చుకోవల్సి వచ్చింది. అయినప్పటికీ, మరోసారి ప్రాంతీయ కాపరిగా పనిచేయడం గొప్ప ఆధిక్యత. కష్టతరమైన పరిస్థితులున్నప్పటికీ పయినీరు సేవలో కొనసాగగల్గడం, సమస్యల్లోవున్న పయినీర్లను ప్రోత్సహించేందుకు సహాయపడింది. అంతేకాకుండ ఇతరులు పయినీరు జాబితాలో చేరేందుకు తరచూ సహాయపడగల్గాము.

పదకొండు సంవత్సరాలపాటు మాడ్రిడ్‌ మరియు బార్సిలోనా నందు ప్రయాణ పని తర్వాత ఆరోగ్యం క్షీణించడం వల్ల మరోసారి మా పనిని మారాల్సిన అవసరమేర్పడింది. సమాన్‌కా పట్టణంలో మమ్మల్ని ప్రత్యేక పయినీర్లుగా నియమించారు, అక్కడ నేను ఒక పెద్దగా సేవచేశాను. వెంటనే సమాన్‌కా సహోదరులు చక్కగా స్వాగతమిచ్చారు. ఒక సంవత్సరం తర్వాత, మా సహనాన్ని పరీక్షించింది.

రాఫెలా చాలా ఎనిమిక్‌ అయిపోయింది, అంతేకాకుండ ఆమెకు ప్రేగులో కాన్సర్‌ ఉందని పరీక్షలవల్ల తేలింది. ఇప్పుడు నేను బలంగా ఉండి నా భార్యకు నేను ఇవ్వగల్గినంత మద్దతు ఇవ్వవల్సివచ్చింది. అపనమ్మకం వెంట వచ్చిన భయమే మా మొదటి ప్రతిస్పందన. రాఫెలా దీన్నుండి కోలుకోగలదా? ఇలాంటి పరిస్థితుల్లో, యెహోవాయందు పూర్ణ విశ్వాసమే మేము కొనసాగేందుకు మాకు సహాయపడింది. రాఫెలాకు జయప్రదంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పేందుకు నేను ఆనందిస్తున్నాను, మరి ఆ కాన్సర్‌ తిరిగిరాకూడదని మేము నిరీక్షిస్తున్నాము.

స్పెయిన్‌ నందు మేము గడిపిన 36 సంవత్సరాల్లో మాకు మా సుఖదుఃఖాలున్నా ఆత్మీయ పెరుగుదల గల ఈ సమయంలో జీవించడం చాలా హృదయానందకరంగా ఉంది. మేము 1958లో 800 మంది ప్రచారకులున్న చిన్న గుంపును నేడు 1,00,000ల కంటే ఎక్కువ మంది ప్రచారకులుగల సైన్యంగా చూశాము. మా ఆనందాలనేకం—యితరులు సత్యాన్ని అంగీకరించి ఆత్మీయంగా పరిపక్వతను సాధించేందుకు సహాయపడడం, భార్యాభర్తలుగా కలిసి పనిచేయడం, మరియు మా జీవితాలను వీలున్నంతమేరకు శ్రేష్ఠమైనరీతిలో ఉపయోగించుకున్నామన్న భావన—మా కష్టాలను కప్పిపుచ్చాయి.

కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో తన ఉత్తరంలో పౌలు యిలా అంటున్నాడు: “ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.” (2 కొరింథీయులు 4:1) వెనక్కి తిరిగి చూస్తే, నేను విడనాడకుండా ఉండేందుకు ఎన్నో విషయాలున్నాయని విశ్వసిస్తున్నాను. నా మొదటి సంవత్సరాల్లో నా యెడల శ్రద్ధ వహించిన నమ్మకమైన అభిషక్త సహోదరుల మాదిరి నాకు మంచి పునాదైంది. ఒకే ఆత్మీయ గమ్యాన్ని కల్గివున్న సహధర్మచారి ఉండడం ఒక అద్భుతమైన సహాయంకాగలదు; నేను కృంగిపోయినప్పుడు రాఫెలా నన్ను ప్రోత్సహించేది, మరి నేను ఆమెకు అదే చేశాను. హాస్యదృక్పథం కల్గివుండడం కూడా చాలా గొప్ప సహాయకం. సహోదరులతో నవ్వగల్గడం—మరియు మనలను చూసుకొని మనం నవ్వగల్గడం—సమస్యలను ఎలాగో ఎక్కువగా కలతపర్చకుండా ఉండేటట్లు చేస్తాయి.

అయితే అన్నింటికంటే, శ్రమల సమయంలో సహనానికి యెహోవా బలము అవసరము. నేను ఎల్లప్పుడు పౌలు మాటలను జ్ఞాపకం చేసుకుంటాను: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” యెహోవా మనకు అండగా ఉన్నప్పుడు మనం విడవవల్సిన అవసరమే లేదు.—ఫిలిప్పీయులు 4:13.

[23వ పేజీలోని చిత్రాలు]

రేనాల్డ్‌ మరియు రాఫెలా టైలర్‌, 1958లో

[24, 25వ పేజీలోని చిత్రాలు]

నిషేధమున్న స్పెయిన్‌ నందు కూడుకోవడం (1969)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి