కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 10/15 పేజీలు 18-23
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రగాఢమైన సంతృప్తి, ఆనందాల భావనలు
  • యెహోవా యొక్క శ్రద్ధకు నిదర్శనం
  • “యెహోవాకు సన్నిహితమయ్యేందుకు ఒక శ్రేష్ఠమైన మార్గం”
  • మరింత ఎక్కువగా చేయడానికి మీ హృదయం ఆకాంక్షిస్తుందా?
  • పయినీరు స్ఫూర్తిని అందరూ ప్రదర్శించగలరు
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    మన రాజ్య పరిచర్య—2003
  • పయినీర్లు అర్పించి, ఆశీర్వాదాలను పొందుతారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • పయినీరు సేవ దేవునితో మనకున్న బంధాన్ని బలపరుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • పయినీర్లకు మద్దతు చూపుట
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 10/15 పేజీలు 18-23

పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు

“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.”—సామెతలు 10:22.

1, 2. (ఎ) పూర్తికాల పరిచర్యను గురించి ఒక పయినీరు తన భావాలను ఎలా వ్యక్తం చేశాడు? (బి) పయినీర్లు శిష్యుల్ని చేసే పనిలో మరి ఎక్కువ ఆనందాన్ని అనుభవించే స్థానంలో ఎందుకు ఉన్నారు?

“మీతో పఠనం చేస్తున్నవారెవరైనా యెహోవాకు క్రియాశీలక సేవకునిగా తయారవ్వడం చూడడంకన్నా మీకు ఎక్కువ ఆనందకరమైన విషయం ఏమైనా ఉంటుందా? యెహోవాను ప్రీతిపర్చే విధంగా ప్రజలు తమ జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి ప్రేరేపించడంలో దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో చూడడం ఉత్తేజకరంగానూ, విశ్వాసాన్ని బలపర్చేదిగాను ఉంటుంది.” కెనడాలో 32 సంవత్సరాలకు పైగా పూర్తికాల పరిచర్యలో గడిపిన ఒక పయినీరు అలా వ్రాశాడు. తన పయినీరు పరిచర్యను గురించి ఆయన ఇలా వ్రాస్తున్నాడు: “నేను వేరే పని చేయడాన్ని ఊహించలేను. దీనికి సమానమైన ఆనందాన్ని తీసుకువచ్చే వేరే ఏ పనిని గురించి కూడా నేను నిశ్చయంగా ఊహించలేను.”

2 జీవ మార్గంలోకి వచ్చేలా ఎవరికైనా సహాయం చేయడంలో కొంత పాలు కలిగివుండడంలో గొప్ప ఆనందం ఉందని మీరు ఒప్పుకుంటారా? నిజమే, అటువంటి ఆనందాన్ని అనుభవించేది పయినీర్లు మాత్రమే కాదు. యెహోవా సేవకులందరూ, “జనులను శిష్యులనుగా చేయుడి” అన్న ఆదేశం క్రింద ఉన్నారు, మరి వారు ఆ విధంగా చేయడానికి కృషిచేస్తారు. (మత్తయి 28:19) అయితే, పయినీర్లు ప్రాంతీయ పరిచర్యలో ఎక్కువ గంటలు గడుపుతారు గనుక, వారు శిష్యుల్ని చేసే పనిలోని ఆనందాన్ని మరి ఎక్కువగా అనుభవించే స్థానంలో ఉంటారు. కానీ పయినీరు సేవలో ఇతర ప్రతిఫలాలు కూడా ఉన్నాయి. పయినీర్లతో మాట్లాడి చూడండి, ‘ఐశ్వర్యమిచ్చే యెహోవా ఆశీర్వాదాన్ని’ అనుభవించడానికి పయినీరు సేవ ఒక అద్భుతమైన మార్గమని వారు మీకు చెబుతారు.—సామెతలు 10:22.

3. మనం యెహోవాకు సేవ చేయడంలో కొనసాగుతుండగా మనల్ని ఏది పురికొల్పవచ్చు?

3 ఇటీవలనే, పూర్తికాల పరిచర్యలో తాము అనుభవించిన ఆశీర్వాదాలను గురించి వర్ణించమని ప్రపంచంలోని వివిధ భాగాల్లోని పయినీర్లను అడగడం జరిగింది. మనకు వారేమి చెబుతారో మనం పరిశీలిద్దాము. అయితే, ఆరోగ్యం బాగా లేకపోవడం, వయస్సు పైబడడం, లేక మరితర పరిస్థితుల వలన మీ సేవ పరిమితమైనట్లైతే నిరుత్సాహం చెందవద్దు. గుర్తుంచుకోండి, ప్రాముఖ్యమైన విషయం యెహోవాకు మనస్ఫూర్తిగా సేవ చేయడమే, దాని పరిమాణం ఎంతైనా సరే. అయినా, కొంతమంది పయినీర్ల వ్యాఖ్యానాలను వినడం, మీరు ఈ ప్రతిఫలదాయకమైన కార్యకలాపాన్ని సాధ్యమైతే చేపట్టడానికి బహుశ మీ ఆసక్తిని పెంచవచ్చు.

ప్రగాఢమైన సంతృప్తి, ఆనందాల భావనలు

4, 5. (ఎ) ఇతరులతో సువార్తను పంచుకోవడం అంత ప్రతిఫలదాయకమైన అనుభవంగా ఎందుకు ఉంటుంది? (బి) పరిచర్యలో పూర్తికాలం భాగం వహించడం గురించి పయినీర్లు ఎలా భావిస్తారు?

4 “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అన్నాడు యేసు. (అపొస్తలుల కార్యములు 20:35) అవును, నిస్వార్థంగా ఇవ్వడం ప్రతిఫలాల్ని తెస్తుంది. (సామెతలు 11:25) సువార్తను ఇతరులతో పంచుకునే విషయానికొస్తే ఇది మరి ప్రాముఖ్యంగా వాస్తవం. నిజంగా, నిత్య జీవానికి నడిపించే దేవుని జ్ఞానాన్ని సంపాదించడంలో తోటి మానవునికి మనం సహాయం చేయడంకన్నా గొప్ప బహుమతి మనం అతనికి ఇంకా ఏమి ఇవ్వగలము?—యోహాను 17:3.

5 ఆశ్చర్యకరం కాని రీతిలోనే, పూర్తికాల పరిచర్యలో భాగం వహించేవారు తమ పరిచర్య నుండి తాము పొందే ఆనందాన్ని గురించీ, ప్రగాఢమైన సంతృప్తిని గురించీ తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. “సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం వలన కలిగే సంతృప్తి వేరే ఏ పనిలోనూ లేదని నాకు తెలుసు” అని బ్రిటన్‌లోని 64 ఏండ్ల ఒక పయినీరు అంటున్నాడు. జైరీలోని ఒక విధవరాలు తన విషయంలో పయినీరు సేవ అంటే ఏమిటో ఇలా వ్యక్తం చేసింది: “నా ప్రియమైన భర్త చనిపోయిన తర్వాత పయినీరు సేవ నాకు నిజమైన ఆదరణనిచ్చింది. నేను ఇతరులకు సహాయం చేయడానికి సేవలో ఎంత ఎక్కువగా వెళ్తానో, నేను విషాదభరితమైన ఆయన లోటును అంత తక్కువగా అనుభవిస్తుంటాను. నేను యెహోవా వాగ్దానాలపై నా విశ్వాసాన్ని ఉంచుతాను, అంతేగాక నాతో పఠనం చేస్తున్నవారు తమ జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి వారికి నేనెలా సహాయం చేయగలనా అని ఎక్కువగా ఆలోచిస్తుంటాను. రోజు ముగిసిన తర్వాత నేను హాయిగా నిద్రపోతాను, నా హృదయం ఆనందంతో నిండివుంటుంది.”

6. కొంతమంది పయినీర్లు ఏ ప్రత్యేకమైన ఆధిక్యతను అనుభవించారు?

6 ఎన్నో దశాబ్దాలపాటు పయినీరు సేవ చేసిన కొంతమందికి మారుమూల ప్రాంతాల్లో సేవచేసి, సంఘాల్ని స్థాపించే ప్రత్యేక ఆధిక్యత లభించింది—చివరికి ఇవి సర్క్యూట్‌లుగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు, హొక్కైడోలోని (జపాన్‌కు చెందిన పూర్తి ఉత్తరంగా ఉన్న ద్వీపం) ఆబాషిరీలో, 33 సంవత్సరాలపాటు పయినీరు సేవ చేసిన ఒక సహోదరి ఉంది. తన మొట్టమొదటి సర్క్యూట్‌ సమావేశానికి—హొక్కైడో అంతట్లో—కేవలం 70 మంది మాత్రమే హాజరయ్యారని ఆమె గుర్తుచేసుకుంటుంది. మరి ఇప్పుడు? ఆ ద్వీపంలో ఇప్పుడు 12 సర్క్యూట్‌లు ఉన్నాయి, 12,000కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. ఆ ద్వీపంపైనున్న తోటి రాజ్య ప్రచారకుల గొప్ప గుంపులతోపాటు ఆమె అక్కడి అసెంబ్లీలకు, సమావేశాలకు హాజరైనప్పుడు ఆమె హృదయం ఆనందంతో ఎంతగా ఉప్పొంగిపోతుందో ఊహించుకోండి!

7, 8. దీర్ఘకాలంగా పయినీరు సేవ చేస్తున్న అనేకమంది, ఏ ఆనందాన్ని అనుభవించారు?

7 దీర్ఘకాలంగా పయినీరు సేవ చేస్తున్న ఇతరులు, బాప్తిస్మంపొంది అటుతర్వాత సేవలో మరిన్ని గొప్ప ఆధిక్యతలు చేపట్టడానికి ముందుకు సాగిపోతున్న తమ బైబిలు విద్యార్థులను చూసి ఆనందిస్తున్నారు. జపాన్‌లో, 1957 మొదలుకొని తొమ్మిది వేర్వేరు పయినీరు నియామకాలలో సేవచేసిన ఒక సహోదరి బ్యాంకులో పనిచేస్తున్న ఒక యువతికి తేజరిల్లు! పత్రికను అందించడాన్ని గుర్తుచేసుకుంటుంది. తొమ్మిది నెలల్లోపలే ఆ యువతి బాప్తిస్మం పొందింది. తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది, భార్యాభర్తలిద్దరూ ప్రత్యేక పయినీర్లయ్యారు. ఆ పయినీరు సహోదరి తన మూడవ నియామకంలో ఉన్నప్పుడు, తానున్న సంఘానికి ఒక క్రొత్త సర్క్యూట్‌ పైవిచారణకర్త తన భార్యతోపాటు సందర్శించినప్పుడు ఎంతగా ఆనందించిందో—ఆయన భార్య ఎవరోకాదు, పూర్వం తన బైబిలు విద్యార్థే!

8 పయినీరు పరిచర్యను తమ జీవిత విధానంగా చేసుకున్నవారు, 22 సంవత్సరాలుగా పయినీరు సేవ చేస్తున్న ఒక సహోదరుడు వ్యక్తం చేసినట్లుగా, దాన్ని “విలువైనదిగా ఎంచాల్సిన ఒక అమూల్యమైన ఆధిక్యత”గా దృష్టిస్తారనడంలో ఆశ్చర్యంలేదు మరి!

యెహోవా యొక్క శ్రద్ధకు నిదర్శనం

9. గొప్ప సంరక్షకునిగా యెహోవా, తన సేవకులకు ఏమని వాగ్దానం చేస్తున్నాడు, మరి మన విషయంలో దీని భావమేమిటి?

9 గొప్ప సంరక్షకుడైన యెహోవా, తన సేవకులపట్ల ఆత్మీయంగానూ వస్తుపరంగాను శ్రద్ధవహిస్తూ వారిని పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రాచీన కాలంలోని రాజైన దావీదు ఇలా యుక్తంగానే చెప్పగలిగాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్తన 37:25) అయితే ఈ దైవిక హామీ, మన కుటుంబాల్ని వస్తుపరంగా పోషించే బాధ్యత నుండి మనల్ని విముక్తులను చేయదు, లేక మన క్రైస్తవ సహోదరులు ఔదార్యాన్ని ప్రదర్శిస్తారని పూర్వభావన చేయడానికి అధికారాన్నీ ఇవ్వదు. (1 థెస్సలొనీకయులు 4:10-12; 1 తిమోతి 5:8) అయితే, మనం యెహోవాకు మరి పూర్తిగా సేవచేసేందుకు మన జీవితాల్లో ఇష్టపూర్వకంగా త్యాగాలు చేసినప్పుడు ఆయన ఎన్నడూ మనల్ని ఎడబాయడు.—మత్తయి 6:33.

10, 11. సంరక్షించడంలో యెహోవాకున్న సామర్థ్యం గురించి అనేకమంది పయినీర్లకు అనుభవపూర్వకంగా ఏమి తెలుసు?

10 తమను తాము యెహోవా యొక్క శ్రద్ధాపూర్వక చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆయన తమను సంరక్షిస్తాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పయినీర్లకు అనుభవపూర్వకంగా తెలుసు. రాజ్య ప్రచారకుల అవసరత మరింత ఎక్కువగా ఉన్న ఒక చిన్న పట్టణానికి తరలివెళ్లిన ఒక పయినీరు జంట విషయంలో ఏమి జరిగిందో చూడండి. కొన్ని నెలలు గడిచిన తర్వాత, ఉద్యోగం దొరకడం దుర్లభమైపోయింది, వారు దాచుకున్న డబ్బంతా ఖర్చైపోయింది. అప్పుడు వారికి 81 అమెరికా డాలర్లు చెల్లించమని కారు భీమా బిల్లు వచ్చింది. “మాకు దాన్ని చెల్లించే దారి లేదు” అని ఆ సహోదరుడు వివరిస్తున్నాడు. “ఆ రాత్రి మేము చాలా తీవ్రంగా ప్రార్థన చేశాము.” ఆ తర్వాతి రోజు, వారికి ఒక కుటుంబం పంపిన కార్డు వచ్చింది, వీరు కూడా ఆర్థికంగా చాలా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. తాము కట్టిన ఒక పన్ను డబ్బు వాపసు వచ్చిందనీ, ఆ మొత్తం తాము ఊహించినదానికన్నా ఎక్కువగా ఉంది గనుక దాన్ని ఈ పయినీరు జంటతో పంచుకోవాలని అనుకున్నట్లు ఆ కార్డులో ఉంది. ఆ కార్డుతోపాటు 81 అమెరికా డాలర్ల చెక్కు జోడించి ఉంది! “ఆ రోజును నేనెన్నడూ మరువను—నా జుట్టు నిక్కబొడుచుకుంది!” అని అంటున్నాడా పయినీరు సహోదరుడు. “ఆ కుటుంబం చూపించిన ఔదార్యాన్ని మేమెంతో మెచ్చుకున్నాము.” అటువంటి దయను యెహోవా కూడా మెచ్చుకుంటాడు, తన సేవకులు కలిగివుండవల్సిన ఔదార్య స్వభావం ఇటువంటిదేనని ఆయన ప్రోత్సహిస్తున్నాడు.—సామెతలు 19:17; హెబ్రీయులు 13:16.

11 చాలామంది పయినీర్లు అటువంటి అనుభవాల్నే చెప్పగలరు. వారిని అడిగి చూడండి, తామెన్నడూ పూర్తిగా “విడువబడ”లేదని వారు మీకు చెబుతారు. 55 సంవత్సరాల పూర్తికాల పరిచర్యను పునరావలోకనం చేసుకుంటూ 72 ఏండ్ల ఒక పయినీరు ఇలా అంటున్నాడు, “యెహోవా నన్ను ఎన్నడూ ఎడబాయలేదు.”—హెబ్రీయులు 13:5, 6.

“యెహోవాకు సన్నిహితమయ్యేందుకు ఒక శ్రేష్ఠమైన మార్గం”

12. సువార్తను ప్రకటించే పని ఎందుకంత విశిష్టమైన ఆధిక్యత?

12 యెహోవా మనల్ని తన రాజ్య సువార్తను ప్రకటించమని అడగడమే ఒక ఆధిక్యత. ఈ జీవరక్షక పనిలో మనము—అపరిపూర్ణులమైన మనము—తన “జతపనివార”మని ఆయన దృష్టిస్తున్నాడు. (1 కొరింథీయులు 3:9; 1 తిమోతి 4:16) మనం ఇతరులకు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తుండగా, దుష్టత్వానికి అంతాన్ని ప్రకటిస్తుండగా, ఒక విమోచన క్రయధనాన్ని అందించడంలోని అద్భుతమైన ప్రేమను ప్రజలకు మనం వివరిస్తుండగా, జీవంగల ఆయన వాక్యాన్ని మనం తెరిచి అందులోని అమూల్యమైన విషయాల్ని సహృదయులకు బోధిస్తుండగా, సహజంగానే మన సృష్టికర్తయైన యెహోవాకు మనం మరింత దగ్గరౌతాము.—కీర్తన 145:11; యోహాను 3:16; హెబ్రీయులు 4:12.

13. యెహోవాతో తమ సంబంధంపై తమ పయినీరు పరిచర్య చూపించిన ప్రభావం గురించి కొంతమంది ఏమని చెబుతున్నారు?

13 పయినీర్లు ప్రతినెలా యెహోవాను గురించి నేర్చుకోవడంలోనూ, ఆయన గురించి బోధించడంలోనూ ఎంతో సమయాన్ని గడపగల్గుతున్నారు. ఇది దేవునితో తమ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నట్లు వారు భావిస్తున్నారు? “పయినీరు సేవ చేయడం యెహోవాకు సన్నిహితం అయ్యేందుకు ఒక శ్రేష్ఠమైన మార్గం” అని జవాబిస్తున్నాడు ఫ్రాన్స్‌కు చెందిన, పది సంవత్సరాలకు పైగా పయినీరుగా ఉన్న ఒక పెద్ద. 18 సంవత్సరాలు పూర్తికాల పరిచర్యలో గడిపిన ఆ దేశంలోని మరొక పయినీరు ఇలా అంటున్నాడు: “‘యెహోవా ఉత్తముడని రుచి చూచి’ తెలుసుకోవడానికి పయినీరు సేవ అనుమతిస్తుంది, మన సృష్టికర్తతో రోజురోజుకీ మరి శక్తివంతమైన సంబంధాన్ని నిర్మించుకుంటూ పోవడానికి అవకాశమిస్తుంది.” (కీర్తన 34:8) 30 సంవత్సరాలపాటు పయినీరుగా ఉన్న బ్రిటన్‌లోని ఒక సహోదరి అదే విధంగా భావిస్తుంది. “నా పరిచర్యలో నడిపింపు కొరకు యెహోవా ఆత్మపై ఆధారపడడం నన్ను ఆయనకు మరింత దగ్గరగా తెస్తుంది” అంటుందామె. “అనేక సందర్భాల్లో యెహోవా ఆత్మ ఫలాని ఇంటికి సరైన సమయంలో నన్ను నడిపించిందని నేను నిజంగా భావించాను.”—అపొస్తలుల కార్యములు 16:6-10 పోల్చండి.

14. ఇతరులకు బోధించడానికి అనుదినమూ బైబిలునూ, బైబిలు ఆధారిత ప్రచురణలను ఉపయోగించడం నుండి పయినీర్లు ఎలా ప్రయోజనం పొందుతున్నారు?

14 లేఖనాధార సత్యాల్ని వివరించడానికీ, బోధించడానికీ అనుదినమూ బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను ఉపయోగించడం, దేవుని వాక్య జ్ఞానంలో అభివృద్ధి చెందడానికి తమకు సహాయపడుతుందని అనేకమంది పయినీర్లు కనుగొంటారు. 31 సంవత్సరాలపాటు పయినీరుగా ఉన్న, స్పెయిన్‌కు చెందిన 85 ఏండ్ల సహోదరుడు ఇలా వివరిస్తున్నాడు: “బైబిలులో లోతైన జ్ఞానాన్ని సంపాదించడానికి పయినీరు సేవ నాకు సహాయపడింది, అనేకమంది ప్రజలు యెహోవానూ ఆయన సంకల్పాలనూ తెలుసుకోవడంలో సహాయం చేయడానికి నేను ఈ జ్ఞానాన్ని ఉపయోగించాను.” 23 సంవత్సరాలుగా పయినీరు సేవ చేస్తున్న, బ్రిటన్‌కు చెందిన ఒక సహోదరి ఇలా అంటుంది: “పూర్తికాల పరిచర్య నేను ఆత్మీయ ఆహారంపట్ల గొప్ప ఆకలిని పెంపొందించుకోవడానికి సహాయపడింది.” “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు” వారికి వివరించడం, మీరు ప్రియంగా ఎంచే నమ్మకాల గురించిన మీ స్వంత దృఢవిశ్వాసాలను బలపర్చగలదు. (1 పేతురు 3:15, 16) ఆస్ట్రేలియాలోని ఒక పయినీరు ఇలా అంటున్నాడు: “నన్ను నేను ఇతరులకు వ్యక్తం చేసుకుంటుండగా పయినీరు సేవ నా విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది.”

15. పయినీరు పరిచర్యలోకి ప్రవేశించేందుకూ, అందులో కొనసాగేందుకు అనేకులు ఏమి చేయడానికి సుముఖంగా ఉన్నారు, ఎందుకు?

15 స్పష్టంగానే, ఈ పయినీరు పరిచారకులు యెహోవా నుండి అసంఖ్యాకమైన ఆశీర్వాదాలను తెచ్చే సేవను తాము ఎన్నుకున్నామని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అనేకమంది పయినీరు పరిచర్యలోకి ప్రవేశించేందుకూ, అందులో కొనసాగేందుకూ తమ జీవితాల్లో మార్పుల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చివరికి లౌకిక ఉద్యోగాన్నీ భౌతిక ధనసంపదల్నీ త్యాగం చేయడానికి కూడా ఇష్టపడుతుండడంలో ఆశ్చర్యంలేదు మరి!—సామెతలు 28:20.

మరింత ఎక్కువగా చేయడానికి మీ హృదయం ఆకాంక్షిస్తుందా?

16, 17. (ఎ) పయినీరు సేవ మీకు సాధ్యమో కాదోనని మీరు ఆలోచిస్తున్నట్లైతే, మీరేమి చేయవచ్చు? (బి) పయినీరు సేవ చేయలేని కొంతమంది ఎలా భావిస్తున్నారు?

16 పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలను గురించి పయినీర్లు చెప్పినది పరిశీలించిన తర్వాత, బహుశ మీకు పయినీరు సేవ ఆచరణయోగ్యమైనదేనా అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఆలాగైతే, పూర్తికాల పరిచర్యలో విజయాన్ని సాధించిన ఒక పయినీరుతో మీరు ఎందుకు మాట్లాడకూడదు? సంఘంలోని పెద్దల్లో ఒకరితో మాట్లాడడం సహాయకరంగా ఉన్నట్లు కూడా మీరు కనుగొనవచ్చు. మీ గురించి—మీ ఆరోగ్యస్థితి, మీ పరిమితులు, మీ కుటుంబ బాధ్యతలు వంటివాటి గురించి—తెలిసిన ఒక పెద్దతో మాట్లాడాలనుకోవచ్చు. (సామెతలు 15:22) ఇతరుల వాస్తవిక వ్యాఖ్యానాలు, పయినీరు సేవ మీకు సాధ్యమో కాదో జాగ్రత్తగా అంచనా వేసుకోవడానికి మీకు సహాయపడగలవు. (లూకా 14:28 పోల్చండి.) మీరు పయినీరు సేవ చేయగలిగినట్లైతే మీకు వచ్చే ఆశీర్వాదాలు నిజంగానే గొప్పగా ఉంటాయి.—మలాకి 3:10.

17 అయితే, పరిచర్యలో మరింత ఎక్కువ చేయాలని ఎంతగానో అపేక్షించినప్పటికీ పయినీరు సేవ చేసే స్థితిలో లేని అనేకమంది విశ్వసనీయులైన రాజ్య ప్రచారకుల సంగతేమిటి? ఉదాహరణకు, తన నలుగురు పిల్లల్ని తనంతట తానుగా పెంచడానికి ఎంతో కష్టపడుతున్న ఒక క్రైస్తవ సహోదరి భావాల్ని పరిశీలించండి. “నేను చాలా దుఃఖపడుతుంటాను, ఎందుకంటే నేను మునుపు క్రమ పయినీరుగా సేవచేసేదాన్ని, కానీ ఇప్పుడు నా పరిస్థితుల మూలాన ప్రాంతీయ సేవలోకి ఇంతకుముందు వెళ్లినంతగా ఇప్పుడు వెళ్లలేకపోతున్నాను” అని అంటుందామె. ఈ సహోదరి తన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తుంది, వారిని సంరక్షించాలని కోరుకుంటుంది. అదే సమయంలో ఆమె ప్రకటన పనిలో మరింత ఎక్కువగా చేయాలని ఆకాంక్షిస్తుంది. “నాకు పరిచర్య అంటే ఎంతో ఇష్టం” అని వివరిస్తుందామె. ఇతర సమర్పిత క్రైస్తవులు కూడా అటువంటి భావాల్నే కలిగివున్నారు. దేవునిపట్ల వారికి ఉన్న ప్రేమ, ‘తమ పూర్ణహృదయముతో’ యెహోవాకు సేవ చేయాలని కోరుకోవడానికి వారిని కదిలిస్తుంది.—కీర్తన 86:12.

18. (ఎ) యెహోవా మన నుండి ఏమి అపేక్షిస్తాడు? (బి) మనం చేయగల్గేదాన్ని పరిస్థితులు పరిమితం చేస్తున్నట్లైతే మనం ఎందుకు నిరుత్సాహం చెందకూడదు?

18 యెహోవా మన నుండి అపేక్షించేది మనస్ఫూర్తిగా చేసే సేవ అని గుర్తుంచుకోండి. ఇది ఎంత అనేది వ్యక్తి వ్యక్తికీ తేడా ఉండవచ్చు. కొంతమంది క్రమ పయినీర్లుగా సేవ చేసేందుకు తమ కార్యకలాపాల్లో సర్దుబాట్లు చేసుకోగల్గుతారు. అనేకమంది ఇతరులు పరిచర్యలో ప్రతినెలా 60 గంటలు గడుపుతూ అప్పుడప్పుడో లేక క్రమంగానో సహాయ పయినీర్లుగా పేర్లు నమోదు చేసుకుంటారు. అయితే, యెహోవాసాక్షుల్లో అధిక సంఖ్యాకులు సంఘ ప్రచారకులుగా మనస్ఫూర్తిగా ప్రకటనాపనికి బోధించే పనికి తమను తాము అంకితం చేసుకుంటారు. అందుకని మీరు నిజంగా అనారోగ్యంతో, వయస్సు పైబడడంతో, కుటుంబ బాధ్యతలతో, లేక మరితర పరిస్థితులతో మీ సేవ పరిమితమైనట్లైతే నిరుత్సాహం చెందవద్దు. మీరు చేసిన సేవ మీరు ఇవ్వగల్గినదానంతటిలో అత్యంత శ్రేష్ఠమైనదైనంత వరకూ—పూర్తికాల పరిచర్యలో ఉన్నవారి విషయంలో లాగానే అది యెహోవా దృష్టిలో విలువైనదే!

పయినీరు స్ఫూర్తిని అందరూ ప్రదర్శించగలరు

19. పయినీరు స్ఫూర్తి అంటే ఏమిటి?

19 మీరు పయినీరుగా పేరును నమోదు చేసుకోలేకపోయినప్పటికీ, మీరు పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించగలరు. పయినీరు స్ఫూర్తి అంటే ఏమిటి? మన రాజ్య పరిచర్య జూలై 1988 (ఆంగ్లం) సంచిక ఇలా పేర్కొంది: “దాన్నిలా నిర్వచించవచ్చు, ప్రకటించి శిష్యుల్ని చేయాలనే ఆజ్ఞ ఎడల ఒక అనుకూల దృక్పధాన్ని కలిగివుండడం, ప్రజలంటే ప్రేమా శ్రద్ధా చూపించడంలో పూర్తిగా నిబద్ధులై ఉండడం, స్వయంత్యాగపూరిత స్వభావం కల్గివుండడం, యజమానిని సన్నిహితంగా అనుసరించడంలో ఆనందాన్ని కనుగొనడం, వీటితోబాటు వస్తుదాయక విషయాల్లో కాదుగానీ ఆధ్యాత్మిక విషయాల్లో ఆహ్లాదాన్ని అనుభవించడం.” పయినీరు స్ఫూర్తిని మీరు ఎలా ప్రదర్శించగలరు?

20. తలిదండ్రులు పయినీరు స్ఫూర్తిని ఎలా ప్రదర్శించగలరు?

20 మీకు యౌవనులైన పిల్లలు ఉంటే, పయినీరు సేవను జీవిత విధానంగా చేపట్టమని మీరు వారికి హృదయపూర్వకంగా సిఫారసు చేయవచ్చు. పరిచర్యపట్ల మీ అనుకూల దృక్పధం, యెహోవా సేవను తమ జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనదిగా చేసుకోవాల్సిన అవసరతను వారి మనస్సుల్లో నాటుకుపోయేలా చేయగలదు. మీరు మీ ఇంటికి పయినీర్లను, ప్రయాణ పైవిచారణకర్తలను వారి భార్యలను ఆహ్వానించవచ్చు, ఆ విధంగా మీ పిల్లలు పూర్తికాల పరిచర్యలో ఆనందాన్ని కనుగొన్నవారి మాదిరుల నుండి ప్రయోజనం పొందగలరు. (హెబ్రీయులు 13:7 పోల్చండి.) మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లో కూడా, విశ్వాసులైన తలిదండ్రులు తమ మాట ద్వారా మాదిరి ద్వారా, పూర్తికాల పరిచర్యను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవడంలో తమ పిల్లలకు సహాయం చేయగలరు.—2 తిమోతి 1:3-5; 3:15.

21. (ఎ) పయినీరు సేవ చేస్తున్నవారికి మనందరం ఎలా మద్దతునివ్వగలము? (బి) పయినీర్లను ప్రోత్సహించడానికి పెద్దలు ఏమి చేయగలరు?

21 సంఘంలో, పయినీరు సేవ చేయగల్గుతున్నవారికి మనమందరం హృదయపూర్వక మద్దతును ఇవ్వగలము. ఉదాహరణకు, మీరు పరిచర్యలో ఒక పయినీరుతో పనిచేయడానికి అదనపు ప్రయత్నం చేయగలరా, ప్రత్యేకంగా ఆ పయినీరు ఒంటరిగా పనిచేయాల్సివచ్చే పరిస్థితుల్లో మీరు అలాంటి ప్రత్యేక ప్రయత్నం చేయగలరా? ఆ విధంగా ‘ఒకరిచేత ఒకరు ఆదరణపొందినట్లు’ మీరు గ్రహిస్తుండవచ్చు. (రోమీయులు 1:11, 12) మీరు ఒక పెద్ద అయినట్లైతే, పయినీర్లను ప్రోత్సహించడానికి మీరు ఇంకా ఎక్కువే చేయగలరు. పెద్దల సభ సమావేశమైనప్పుడు వారు పయినీర్ల అవసరతలను క్రమంగా పరిశీలిస్తూ ఉండాలి. ఒక పయినీరు నిరుత్సాహం చెందినప్పుడో లేక కొన్ని కష్టాల్ని అనుభవిస్తున్నప్పుడో ఆయన లేక ఆమె పయినీరు సేవను నిలిపివేయాలని సిఫారసు చేయడంలో తొందరపడవద్దు. కొన్ని సందర్భాల్లో అటువంటి సిఫారసు చేయడం అవసరమైనప్పటికీ, పయినీరు సేవ ఒక విలువైన ఆధిక్యత అనీ, ఆ పూర్తికాల సేవకుడు దాన్ని ఎంతో అమూల్యంగా ఎంచుతుండవచ్చనీ మర్చిపోవద్దు. కావల్సిందల్లా కాస్తంత ప్రోత్సాహమూ, కొంత ఆచరణయోగ్యమైన సలహా లేక సహాయమూ మాత్రమే అయివుండవచ్చు. స్పెయిన్‌లోని బ్రాంచి కార్యాలయం ఇలా వ్రాస్తుంది: “పెద్దలు పయినీరు సేవను చేయమని ప్రోత్సహించినప్పుడు, ప్రాంతీయ పరిచర్యలో పయినీర్లకు మద్దతునిచ్చినప్పుడు, క్రమంగా కాపరి సందర్శనాలు చేసినప్పుడు, పయినీర్లు మరింత ఎక్కువ ఆనందాన్ని కనుగొంటారు, తాము ఉపయోగకరమైనవారని భావిస్తారు, అవరోధాలు తలెత్తుతున్నప్పటికీ ముందుకు సాగాలని కోరుకుంటారు.”

22. మానవ చరిత్రలోని ఈ క్లిష్టమైన సమయంలో మనం ఏమి చేయడానికి నిర్ధారించుకోవాలి?

22 మనం మానవ చరిత్రలో క్లిష్టమైన కాలంలో జీవిస్తున్నాము. యెహోవా మనల్ని జీవరక్షక పని చేయమన్నాడు. (రోమీయులు 10:13, 14) ఈ పనిలో మనం పూర్తికాలం పయినీర్లుగా భాగంవహిస్తున్నా లేకపోయినా మనం పయినీరు స్ఫూర్తి చూపిద్దాం. మనం అత్యవసరతా భావాన్నీ, స్వయంత్యాగపూరిత స్వభావాన్నీ కలిగివుందాము. మనం యెహోవా మన నుండి కోరేదాన్ని—మనస్ఫూర్తిగా చేసే సేవను ఆయనకు ఇద్దామని నిర్ధారించుకుందాము. మనం ఇచ్చినది విధవరాలి రెండు చిన్న కాసులను పోలినా లేక మరియ ఇచ్చిన విలువైన అత్తరును పోలినా, మనం ఇవ్వగల్గినదంతా మనం ఇచ్చినప్పుడు మన సేవ మనస్ఫూర్తితో కూడినదౌతుందనీ, మరి యెహోవా మనం మనస్ఫూర్తిగా చేసే ఆ సేవను అమూల్యమైనదిగా ఎంచుతాడనీ గుర్తుంచుకుందాము!

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ పూర్తికాల పరిచర్య సంతృప్తి, ఆనందాల భావనల్ని ఎందుకు తెస్తుంది?

◻ తన సేవకుల ఎడల శ్రద్ధవహించడంలో యెహోవాకున్న సామర్థ్యం గురించి అనేకమంది పయినీర్లకు అనుభవపూర్వకంగా ఏమి తెలుసు?

◻ యెహోవాతో తమ సంబంధంపై తమ పయినీరు పరిచర్య ఎటువంటి ప్రభావాల్ని చూపించిందని పయినీర్లు భావిస్తారు?

◻ మీరు పయినీరు స్ఫూర్తిని ఎలా ప్రదర్శించగలరు?

[23వ పేజీలోని చిత్రం]

శిష్యుల్ని చేసే పని నుండి పయినీర్లు గొప్ప ఆనందాన్ని పొందుతారు

[23వ పేజీలోని చిత్రం]

పూర్తికాల రాజ్య ప్రచారకుల సహవాసం నుండి మీ పిల్లలు ప్రయోజనం పొందగలరు

[23వ పేజీలోని చిత్రం]

ప్రాంతీయ సేవలో పెద్దలు పయినీర్లను ప్రోత్సహించగలరు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి