కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 10/15 పేజీలు 24-27
  • టహీటీలో పరదైసును గూర్చిన సువార్త

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • టహీటీలో పరదైసును గూర్చిన సువార్త
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • చిన్న ఆరంభం
  • పని పురోభివృద్ధిచెందింది
  • టహీటీ ఒక బ్రాంచ్‌ కావడం
  • ఇంకా ఎంతో చేయవలసి ఉంది
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 10/15 పేజీలు 24-27

టహీటీలో పరదైసును గూర్చిన సువార్త

టహీటీ! ఈ పేరు అసాధారణమైన ఆకర్షణను కలిగివుంది. పాల్‌ గాగ్విన్‌, రాబర్ట్‌ లూయిస్‌ స్టీవన్‌సన్‌, హెర్‌మన్‌ మెల్‌విలె వంటి చిత్రకారులూ రచయితల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఉష్ణమండల సౌందర్యాన్ని, దక్షిణ సముద్ర దీవుల ప్రశాంతతను గురించిన వాళ్ళ వర్ణన అనేకుల ఆసక్తిని చూరగొనింది.

దక్షిణ పసిఫిక్‌లోని ఫ్రెంచ్‌ పోలనీజియాలోని 120 కన్నా ఎక్కువ దీవుల్లో టహీటీ అతి పెద్దది. ఈ దక్షిణ సముద్ర దీవి చాలా మంది ప్రజల మనస్సుల్లో దాదాపు పరదైసుకు సమానంగా ఉన్నప్పటికీ, త్వరలో రానున్న మరో పరదైసును గురించి వినవలసిన ప్రజలు టహీటీలో ఇప్పటికీ ఉన్నారు. (లూకా 23:43) నేడు టహీటీలో మొత్తం 1,918 మంది యెహోవాసాక్షులున్నారు. దేవుని రాజ్యం త్వరలో నిజమైన పరదైసు పరిస్థితులను టహీటీలోనే కాక, యావత్భూమిపైనా తెస్తుందనే సువార్తను 2,20,000 మంది ప్రజలకు చెప్పడంలో వారు నిమగ్నమై ఉన్నారు.—మత్తయి 24:14; ప్రకటన 21:3, 4.

టహీటీలో ప్రకటనా పని దాదాపు 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీలోని వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచ్‌ ఆఫీస్‌ పర్యవేక్షణలో అనేక సంవత్సరాలు జరిగింది. అంత పెద్ద దూరం కార్యాలను కష్టతరం చేసింది. అభివృద్ధి మందగతిలో ఉండేది. కనుక, 1975 ఏప్రిల్‌ 1న టహీటీలో బ్రాంచ్‌ ఆఫీస్‌ స్థాపించబడింది. ఆ ప్రాంతంలోని నిజ క్రైస్తవుల కార్యక్రమంలో ఒక మలుపది. ఈ మలుపుకు ఏది కారణమయ్యింది, టహీటీలో ప్రకటనా పని ఎలా మొదలయ్యింది?

చిన్న ఆరంభం

టహీటీలో రాజ్య సువార్త మొదటిగా 1930లలో వినిపించబడింది. బైబిలు ఎడల ఎంతో గౌరవం గల ద్వీపవాసులు అధికాసక్తితో ప్రతిస్పందించారు. అయినప్పటికీ, ప్రభుత్వ నిషేధమూ, మరితర ప్రతిబంధాల కారణంగా 1950ల చివరి వరకూ ఈ దీవిలో సాక్షులు లేనే లేరు. టహీటీలో జన్మించిన, ఆ సమయంలో అమెరికాలో నివసిస్తున్న ఆన్యెస్‌ షెన్క్‌ తానూ, భర్తా, కుమారుడూ టహీటీకి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇదంతా ఎలా సంభవించిందో ఆమె వివరిస్తుంది.

“టహీటీలో రాజ్య ప్రచారకుల గొప్ప అవసరం ఉందని లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన 1957 జిల్లా సమావేశంలో సహోదరుడు నార్‌ [అప్పట్లో వాచ్‌టవర్‌ సొసైటీ అధ్యక్షుడు] వివరించాడు. అప్పటికి నేను బాప్తిస్మం పొంది ఒక సంవత్సరమయ్యింది. ‘మనం టహీటీకి వెళ్దాం!’ అని బిగ్గరగా అనేశాను. మా మంచి స్నేహితులైన నీల్స్‌ మరియు కారానోస్‌ అనే రెండు కుటుంబాలకు నేనన్నది వినపడింది. మాతో రావడానికి ఇష్టపడుతున్నామని వాళ్ళు మాకు చెప్పారు. కాని మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. చాలా కాలంగా నా భర్త అనారోగ్యంగా ఉన్నారు. నా కుమారుడు చాలా చిన్నవాడు. మేము బయలుదేరడమంటే చాలా కష్టం. పొరుగు సంఘాల్లోని స్నేహితులు మా లక్ష్యాన్ని గురించి విన్నారు. వాళ్ళు మాకు విరాళాలను, ఇంట్లో వాడుకోడానికి అవసరమైన వస్తువులను పంపారు. 1958, మేలో టహీటీకి ప్రయాణం కట్టుకున్నాం. ఇతర వస్తువులతోపాటు 36 దుప్పట్లను తీసుకు వెళ్ళాం!

“మేము టహీటీకి చేరుకున్నప్పుడు, అది బొత్తిగా పరిచయంలేని ప్రదేశంలా నాకనిపించింది. ఎందుకంటే నేను ఆ దీవిని వదిలిపెట్టి 20 సంవత్సరాలయ్యింది మరి. మేము ప్రకటించనారంభించాం. మా క్రైస్తవ పరిచర్య నిషేధించబడింది కనుక మేము జాగ్రత్తగా ఉండవలసి ఉండింది. మేము పత్రికలను దాచి ఉంచుకోవలసి వచ్చేది, మేము బైబిలును మాత్రమే ఉపయోగించాం. అప్పటికే కావలికోట, తేజరిల్లు! పత్రికల చందాదారులైనవారికి మాత్రమే మొదట్లో మేము సాక్ష్యమిచ్చేవాళ్ళం.

“1958లో న్యూయార్క్‌ సిటీలో జరిగిన అంతర్జాతీయ సమావేశం తర్వాత క్లైడ్‌ నీల్‌ మరియు డేవిడ్‌ కారానో తమ కుటుంబాలతోపాటు వచ్చి మాతో కలిశారు. మేము కలిసి ప్రకటించాం. సహోదరుల ఇండ్లకు వచ్చి అక్కడ ఇవ్వబడే ప్రసంగాలను వినడానికి రమ్మని మేము ప్రజలను ఆహ్వానించాం. నెమ్మదిగా, కార్యాలన్నీ సంస్థీకరించబడ్డాయి. 15 మందితో మేము బైబిలు పఠన గుంపును ఆరంభించాం. మూడు నెలల తర్వాత నీల్స్‌ మరియు కారానోస్‌ తమ టూరిస్ట్‌ వీసాలు అయిపోయినందువల్ల తిరిగి వెళ్ళ వలసి వచ్చింది. కనుక, తాము తిరిగి వెళ్ళకముందు యోగ్యులైన ఆసక్తిగలవారికందరికీ బాప్తిస్మమివ్వాలని సహోదరులు నిర్ణయించుకున్నారు. మొదటి బాప్తిస్మ ప్రసంగాన్ని తర్జుమా చేసే ఆధిక్యత నాకు లభించింది. ఈ తరుణంలో ఎనిమిది మంది ద్వీపవాసులు తమ సమర్పణను తెలియజేసుకున్నారు. తర్వాత నీల్స్‌, కారానోస్‌ అమెరికాకు తిరిగివెళ్ళారు.

“ప్రకటనా పని కొనసాగింది. మేము చిన్న గుంపులుగా సమకూడి, సాయంకాలాల్లో ప్రజలను సందర్శించేవాళ్ళం. తరచూ అర్థరాత్రి వరకూ ఆసక్తిగలవారితో చర్చలు జరిగేవి. ఒక్కోసారి ప్రొటెస్టెంట్‌ పరిచారకులు కూడా చర్చల్లో పాల్గొనేవారు. 1959 అయ్యేసరికి మొదటి సంఘం రూపొందించబడింది. తర్వాత, 1960లో ప్రభుత్వం యెహోవాసాక్షుల సమూహానికి ఆధికారికంగా గుర్తింపునివ్వడం మాకు గొప్ప సంతోషాన్నిచ్చింది. ఆ తొలి సంవత్సరాలు ఆనందభరితమైనవై ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను చేరుకున్నాయి. గొప్ప అవసరత ఉన్న చోటికి తరలి వెళ్ళాలన్న మా నిర్ణయాన్ని యెహావా నిజంగా ఆశీర్వదించాడు.” సహోదరి షెన్క్‌కు ఇప్పుడు 87 ఏండ్లు. ఆమె ఇప్పటికీ తన సంఘంలో యెహోవాకు నమ్మకంగా సేవచేస్తోంది.

పని పురోభివృద్ధిచెందింది

1969లో ఫ్రాన్స్‌లోని సాక్‌, పాలట్‌ ఈనోడీ అనే ఇద్దరు సాక్షులు టహీటీకి ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డారు. సాక్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “మేము టహీటీకి చేరుకున్నప్పుడు, అక్కడ కేవలం 124 ప్రచారకులు మాత్రమే ఉన్నారు. పపేటీలో ఒక సంఘం ఉండేది, ఆ ద్వీపకల్పంలోని వాయీరావోలో ఇద్దరు ప్రత్యేక పయినీర్లు ఉండేవారు.” ఒక భూసంధి ద్వారా టహీటీతో ఆ ద్వీపకల్పం కలపబడి ఉంది. “భూమిపై సమాధానం” అనే అంతర్జాతీయ సమావేశం త్వరలోనే జరగవలసి ఉంది. “సమావేశాన్ని సంస్థీకరించడంలో అది నా మొదటి అనుభవం” అని అంటూ సాక్‌ ఇలా కొనసాగిస్తున్నాడు: “దర్శకుల కొరకు మేము ఒక ఇంగ్లీష్‌ కార్యక్రమాన్ని పథకం వేయవలసి ఉండింది, రాజ్యగీతాల కొరకు వాద్యబృందాన్ని ఏర్పాటు చేయవలసి ఉండింది. రెండు నాటకాల కొరకు రిహార్సల్‌ చేయవలసి ఉండింది. ఈ పనంతా కేవలం 126 ప్రచారకులతో పూర్తి చేయబడింది. ఇందులో అతి పెద్ద భాగం యెహోవాయే నిర్వహించాడనే నమ్మకం నాకుంది.” 488 మంది హాజరవ్వడం ద్వీపవాసులకు థ్రిల్‌గా ఉంది. వారిలో చాలా మంది ఇతర దీవుల్లోని తోటి సాక్షులను కలవడం ఇదే మొదటిసారి.

తర్వాత త్వరలోనే సాక్‌ ఈనోడీ ప్రయాణ పైవిచారణకర్తగా నియమించబడ్డాడు. ఆసక్తిగలవారు చాలా మంది ఉన్నారు కానీ వారి ఆసక్తిని పెంపొందింపజేసేందుకు రాజ్య ప్రచారకులు చాలా తక్కువగా ఉన్నారన్న విషయం ఆయన వివిధ దీవులను సందర్శించినప్పుడు గ్రహించాడు. “అందుకే గొప్ప అవసరత ఉన్న ఈ దీవులకు తరలివెళ్ళి సేవ చేయాలని నేను అనేక కుటుంబాలను ప్రోత్సహించాను. అలా నెమ్మదిగా, ఆ ద్వీపపుంజములలో సువార్త వ్యాపించింది” అని సాక్‌ వివరిస్తున్నాడు. సహోదరుడు ఈనోడీ 1969 నుండి 1974 వరకు ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేశాడు. నేడు ఆయన టహీటీలోని ఒక సంఘంలో సంఘపెద్దగా సేవ చేస్తున్నాడు.

సహోదరుడు ఈనోడీ ప్రోత్సాహానికి ప్రతిస్పందించినవారిలో ఆగ్యుస్ట్‌ టమానాహే ఒకరు. 1958లో బాప్తిస్మం పొందిన ఎనిమిది మందిలో ఆయన ఒకరు. జరిగిన విషయాలను ఆయనిలా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. “1972లో సొసైటీ దీవుల్లోని లీవార్డ్‌ దీవుల్లో ఒకటైన వాహీనీలో సేవ చేసేందుకు తరలి వెళ్ళే విషయం ఆలోచించమని ప్రయాణ పైవిచారణకర్తయైన సాక్‌ ఈనోడీ మమ్మల్ని ప్రోత్సహించాడు. నేను సంఘంలో చదవవలసిన బైబిలు భాగం నియామకాన్ని మాత్రమే నిర్వహించాను. అందుకే అంత పెద్ద బాధ్యత అప్పజెప్పబడడానికి యోగ్యుడనని నేను భావించలేదు. అయినప్పటికీ, ‘చింతించవద్దు. నువ్వు చేయగలవు!’ అని సహోదరుడు ఈనోడీ నాతో పదే పదే చెప్పాడు. కొంత కాలం తర్వాత మేము వెళ్ళాలనే నిర్ణయించుకున్నాం. అలా, 1973లో అన్నీ అమ్మేసుకుని మా ముగ్గురు పిల్లలతోపాటు వాహీనీకి తరలి వెళ్ళాం.

“మేము తిరిగి వెళ్ళినప్పుడు, నేను ప్రతిదీ—కావలికోట పఠనాన్నీ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను, మరితర కూటాలను ఆరంభించవలసి వచ్చింది. అది అంత సులభమేమీ కాదు. కాని యెహోవా సంరక్షణా సహాయాలను మేము అనుభవించాం. అనేక సందర్భాల్లో మేము వసతిని కనుగొనేందుకు ఆయన సహాయం చేశాడు. అయితే, దీవి నుండి సాక్షులను గెంటేయాలని వ్యతిరేకుల ఒక గుంపు ప్రయత్నించినప్పుడు, స్థానిక రాజకీయవేత్త ఒకరు మమ్మల్ని సమర్థించడానికి వచ్చాడు. నిజంగా, యెహోవా అన్నివేళలా మాకు తోడుగా ఉన్నాడు.” ఇప్పుడు వాహీనీలో రెండు సంఘాలున్నాయి. 23 మంది ప్రచారకులు గల ఫ్రెంచ్‌ సంఘం ఒకటి. 55 మంది ప్రచారకులున్న టహీటీ సంఘమొకటి.

1969లో, హేలన్‌ మాపూ ఆ ద్వీపకల్పంలో పరిచర్య చేసేందుకు ప్రత్యేక పయినీరుగా నియమించబడింది. “ఆ ద్వీపకల్పంలో గొప్ప ఆసక్తి కనబడింది. కొంత కాలంలోనే నేను అనేక బైబిలు పఠనాలను ఆరంభించాను” అని హేలన్‌ చెబుతుంది. వాయీరావోలో ఒక చిన్న సంఘం త్వరలోనే స్థాపించబడింది. అయితే అక్కడ ఒక పెద్ద అవసరముంది. ఆ సమయంలో 35 కిలోమీటర్ల దూరంలో పాపారాలో నివసిస్తున్న కాల్‌సోన్‌ డీన్‌ సహాయం చేయగలిగాడు. “వాయీరావోలో సేవ చేసేందుకు మేము బాగా సంస్థీకరించుకోవలసి ఉండింది. వాయీరావోకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీవికి ఆవల వైపునున్న ఫా నగరంలో నేను పని చేసేవాడ్ని. పని అయిపోయిన తర్వాత, నేను ఇంటికి పరుగెత్తాలి. ఇంట్లో వాళ్ళను తీసుకుని వాయీరావోకు వెళ్ళాలి. తర్వాత నేను చేసే పని కోసం ఫాకు తిరిగి వెళ్ళాలి. అయినప్పటికీ మేము వాయీరావో సంఘానికి మద్దతునివ్వగలమా? అక్కడున్న సహోదరులకు సహాయం చేయాలని మేము నిజంగా కోరుకున్నాం. కనుక అలాగే కొనసాగుదామని నిర్ణయించుకున్నాం. కూటాలున్న రాత్రుల్లో మేము అర్థరాత్రికి ముందే ఇంటికి చేరుకోవడం అరుదు. కార్లు లేని వాళ్ళను ఇండ్లకు చేర్చేందుకు మేము అనేక ట్రిప్పులు కొట్టవలసి వచ్చేదన్నదే కారణం. మేమిలా ఐదు సంవత్సరాలు చేశాం. దీవిలోని ఈ భాగంలో ఇప్పుడు నాలుగు సంఘాలుండడాన్ని చూడడం గొప్ప ఆనందంగా ఉంది. ఆ రోజులను గురించిన తీపి జ్ఞాపకాలు మాకున్నాయి” అని సహోదరుడు డీన్‌ వివరిస్తున్నాడు.

టహీటీ ఒక బ్రాంచ్‌ కావడం

1974 అయ్యేసరికి, టహీటీలో రాజ్య ప్రచారకుల సంఖ్య 199కి పెరిగింది. ఆ మరుసటి సంవత్సరం, వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రెసిడెంటూ వైస్‌ ప్రెసిడెంటూ అయిన ఎన్‌. హెచ్‌. నార్‌ మరియు ఎఫ్‌. డబ్ల్యు. ఫ్రాన్స్‌ ఫ్రెంచ్‌ పోలనీజియాను సందర్శించినప్పుడు, ఫ్రెంచ్‌ పోలనీజియాలోని ప్రకటనా పనిని 3,500 కన్నా ఎక్కువ కిలోమీటర్ల దూరంలోనున్న ఫిజీ నుండి కాక, టహీటీ నుండి పర్యవేక్షించడమే మరి కాస్త ఆచరణాత్మకంగా ఉంటుందని గ్రహించారు. అలా, 1975, ఏప్రిల్‌ 1న టహీటీ బ్రాంచ్‌ ప్రారంభించబడింది. అలన్‌ సామే అనే ప్రాంతీయ కాపరి బ్రాంచ్‌ పైవిచారణకర్తగా నియమించబడ్డాడు.

రెండు సంవత్సరాల క్రితం, సహోదరుడు సామె యెహోవా నుండి వచ్చిన అద్భుతమైన దీవెనలను వివరించగలిగాడు. “1975 నుండి మా ప్రాంతంలోని అన్ని దీవుల్లోనూ, దీవి పుంజాల్లోను సువార్తను అందజేసేందుకు ఎంతో శ్రమ తీసుకోబడింది. పశ్చిమ యూరప్‌ అంత పెద్ద ప్రాంతంలో సువార్త చేరుకుంది. ఫలితాలు సంతోషపరచేవిగా ఉన్నాయి. 1983 అయ్యేసరికి ప్రచారకుల సంఖ్య 538కి పెరిగింది. ఆ సంవత్సరం, పాయీయాలో బేతేలు భవనం కోసమూ బ్రాంచ్‌ ఆఫీస్‌ కోసమూ ఒక కట్టడం నిర్మించబడింది. ఇప్పుడు దాదాపు 1,900 ప్రచారకులు సొసైటీ దీవుల్లోని 30 సంఘాల్లోనూ, ఆస్ట్రల్‌ దీవుల్లోని ఒక సంఘంలోనూ, ఒక విడి గుంపులోనూ, మార్క్విసాన్లోని ఒక సంఘంలోను, రెండు విడి గుంపుల్లోనూ, టుమోటు మరియు గామ్‌బియర్‌ ద్వీపములోను ఉన్నారు. కూటాలకు క్రొత్తగా వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడం వల్ల అనేక రాజ్య మందిరాలు—మూడు మార్క్విసాన్‌లోనూ ఏడు టహీటీలోను నిర్మించబడ్డాయి. గత 20 సంవత్సరాల్లో, టహీటీ ప్రాంతంలో సేవ చేసేందుకు మేము చేసిన ప్రయత్నాలను యెహోవా నిజంగా ఆశీర్వదించాడు.”

ఇంకా ఎంతో చేయవలసి ఉంది

ఫ్రెంచ్‌ పోలనీజియాలో అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1997 మార్చ్‌ 23న యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి ఫ్రెంచ్‌ పోలనీజియా మొత్తం మీద దాదాపు 5,376 మంది ప్రజలు యెహోవాసాక్షులతోపాటు సమావేశమయ్యారు. ఆసక్తిగల ఈ ప్రజల ఆధ్యాత్మిక అవసరతను తీర్చేందుకు, అనేక స్థానిక భాషలలో మన బైబిలు ప్రచురణలు లభ్యం చేయబడ్డాయి. టహీటీ భాషలోనే కాక పావుమోటూ భాషలోనూ సాహిత్యం తయారు చేయబడుతుంది. టుమొటు ద్వీపపుంజంలోనూ, ఉత్తర మరియు దక్షిణ మార్క్విసాన్‌ ద్వీపాల్లోనూ పువామాటు భాష మాట్లాడబడుతుంది.

“మనుష్యులందరూ” దక్షిణ సముద్రంలోని సుదూరాన ఉన్న దీవుల్లోనివారు కూడా “రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్న” యెహోవా ప్రేమనూ సహనాన్నీ పూర్తిగా గుణగ్రహించేందుకు స్థిరమైన పెరుగుదలా మరియు మంచి అనుభవాలు టహీటీలోని రాజ్యప్రచారకులకు సహాయపడ్డాయి. (1 తిమోతి 2:4) “ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు” అన్న యెహోవా వాగ్దానంలో టహీటీలోని, అలాగే ఫ్రెంచ్‌ పోలనీజియాలోని ఇతర దీవుల్లోని యెహోవాసాక్షులకు పూర్తి నమ్మకముంది.—యెషయా 51:5.

[26వ పేజీలోని చిత్రం]

టహీటీ బ్రాంచ్‌ ఫ్రెంచ్‌ పోలనీజియా అవసరాలను చూసుకుంటుంది

ఆస్ట్రేలియా

[25వ పేజీలోని చిత్రం]

ఎడమ నుండి కుడికి: అలన్‌ సామే, మరీయాన్‌ సామే, ఆన్యెస్‌ షెన్క్‌, పాలట్‌ ఈనోడీ మరియు సాక్‌ ఈనోడీ

[27వ పేజీలోని చిత్రం]

టహీటీ బ్రాంచ్‌ ఆఫీస్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి