మీరు మనస్ఫూర్తిగా చేసే సేవను యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడు
“మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:23, 24.
1, 2. (ఎ) మనం కల్గివుండగలవాటిలోకెల్లా అత్యంత గొప్ప ఆధిక్యత ఏది? (బి) దేవున్ని సేవించడంలో మనం చేయాలని అనుకున్నదంతా కొన్నిసార్లు ఎందుకు చేయలేకపోతాము?
యెహోవాకు సేవ చేయడం అనేది మనం కల్గివుండగల వాటిలోకెల్లా అత్యంత గొప్ప ఆధిక్యత. కారణయుక్తంగానే, ఈ పత్రిక ఎంతోకాలంగా పరిచర్యలో తమను తాము వినియోగించుకోవాలని, సాధ్యమైనట్లైతే అందులో “అంతకంతకు అభివృద్ధి” చెందాలని కూడా క్రైస్తవులను ప్రోత్సహించింది. (1 థెస్సలొనీకయులు 4:1) అయితే, దేవుని సేవలో చేయాలని మన హృదయం ఆకాంక్షించినదంతా ఎల్లప్పుడూ మనం చేయలేకపోవచ్చు. “నేనున్న పరిస్థితులు ఎలాంటివంటే, నేను పూర్తికాల ఉద్యోగం చేయాల్సి వస్తుంది” అని 40 ఏళ్ల క్రితం బాప్తిస్మం పొందిన ఒక ఒంటరి సహోదరి వివరిస్తుంది. “నేను ఉద్యోగం చేయడానికి కారణం, బీరువాల నిండా ఖరీదైన బట్టలు నింపాలనుకోవడమో లేకపోతే హాయిగా సెలవులు గడుపుతూ ఓడలో దేశదేశాలు తిరగాలనుకోవడమో కాదు. కానీ సాధారణ వైద్య ఖర్చులు, దంతవైద్య ఖర్చుల వంటివాటితోసహా ఇతర భౌతిక అవసరాలను తీర్చుకోవడానికే. నేను యెహోవాకు మిగిలిపోయిన దానినే ఇస్తున్నానని భావిస్తుంటాను.”
2 దేవునిపట్ల మనకున్న ప్రేమ, ప్రకటన పనిలో మనం చేయగల్గినంత చేయాలని కోరుకోవడానికి మనల్ని కదిలిస్తుంది. కానీ జీవిత పరిస్థితులు మనం చేయగలదాన్ని తరచూ పరిమితం చేస్తుంటాయి. లేఖనాధార బాధ్యతలపట్ల శ్రద్ధవహించడం, వాటి క్రిందికే వచ్చే కుటుంబ బాధ్యతల నిర్వహణ వంటివి మన సమయంలోనూ, శక్తిలోను చాలామొత్తాన్ని హరించివేయవచ్చు. (1 తిమోతి 5:4, 8) ఈ “అపాయకరమైన కాలములు” జీవితాన్ని మునుపెన్నడూ లేనన్ని సవాళ్లతో కూడినదానిగా చేస్తాయి. (2 తిమోతి 3:1) పరిచర్యలో మనం చేయాలనుకున్నంత చేయలేకపోయినప్పుడు మన హృదయం మనల్ని బాగా కలవరపెట్టవచ్చు. మన ఆరాధనపట్ల దేవుడు అసలు సంతృప్తిచెందుతున్నాడా అని మనం ఆలోచిస్తుండవచ్చు.
మనస్ఫూర్తిగా చేసే సేవ యొక్క అందం
3. యెహోవా మనందరి నుండి ఎమి అపేక్షిస్తాడు?
3 “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు” అని కీర్తన 103:14లో బైబిలు మనకు ఉత్సాహపూరిత అభయాన్నిస్తుంది. వేరెవరికన్నా ఎక్కువగా ఆయన మన పరిమితులను అర్థం చేసుకుంటాడు. మనం ఇవ్వగలిగిన దానికన్నా ఆయన ఎక్కువ కోరడు. ఆయనేమి అపేక్షిస్తాడు? ప్రతి ఒక్కరూ ఇవ్వగలిగేదాన్నే, జీవిత పరిస్థితులతో సంబంధంలేకుండా ఇవ్వగలిగేదాన్నే: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” (కొలొస్సయులు 3:23, 24) అవును, మనం—మనందరం—తనను మనస్ఫూర్తిగా సేవించాలని యెహోవా అపేక్షిస్తాడు.
4. యెహోవాకు మనస్ఫూర్తిగా సేవచేయడం అంటే ఏమిటి?
4 యెహోవాకు మనస్ఫూర్తిగా సేవచేయడం అంటే ఏమిటి? “మనస్ఫూర్తిగా” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “ప్రాణం నుండి” అని అర్థం. “ప్రాణము” ఒక వ్యక్తి యొక్క భౌతిక, మానసిక సామర్థ్యాలతోపాటు ఆ పూర్తి వ్యక్తిని సూచిస్తుంది. అందుకని మనస్ఫూర్తిగా సేవచేయడం అంటే దేవుని సేవలో మన సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తూ, మన శక్తులను సాధ్యమైనంత పూర్తి మొత్తంలో ఉపయోగిస్తూ మనలను మనం అర్పించుకోవడం అని అర్థం. సరళంగా చెప్పాలంటే, మన ప్రాణం చేయగల్గిందంతా చేయడం అని దానర్థం.—మార్కు 12:29, 30.
5. మనమందరం పరిచర్యలో సమానమైన మొత్తాన్ని చేయనవసరం లేదని అపొస్తలుల ఉదాహరణ ఎలా చూపిస్తుంది?
5 మనస్ఫూర్తిగా చేయడం అంటే మనమందరం పరిచర్యలో సమానమైన మొత్తాన్ని చేయడమని అర్థమా? అది అసంభవం, ఎందుకంటే పరిస్థితులూ, సామర్థ్యాలు వ్యక్తి వ్యక్తికీ మారుతుంటాయి. విశ్వసనీయులైన యేసు అపొస్తలులను పరిగణనలోనికి తీసుకోండి. వారందరికీ సమానమైన మొత్తాన్ని చేసే సామర్థ్యం లేదు. ఉదాహరణకు, కొంతమంది అపొస్తలుల గురించి మనకు ఎక్కువగా తెలియదు. అటువంటి వారిలో కనానీయుడైన సీమోను, అల్ఫయి కుమారుడైన యాకోబు ఉన్నారు. బహుశ అపొస్తలులుగా వారి కార్యకాలాపాలు బాగా పరిమితమై ఉండివుండవచ్చు. (మత్తయి 10:2-4) అందుకు భిన్నంగా, పేతురు బరువైన బాధ్యతల్ని ఎన్నింటినో చేపట్టగలిగాడు—అంతెందుకు, యేసు ఆయనకు “పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు” ఇచ్చాడు కూడా! (మత్తయి 16:19) అయినా, పేతురు ఇతరులకు పైగా ఉన్నతపర్చబడలేదు. యోహాను ప్రకటనలో నూతన యెరూషలేము యొక్క దర్శనాన్ని పొందినప్పుడు (దాదాపు సా.శ. 96లో), ఆయన 12 పునాదులను చూశాడు, వాటిపైన “పన్నిద్దరు అపొస్తలుల పేళ్లు” చెక్కబడివున్నాయి.a (ప్రకటన 21:14) యెహోవా, అపొస్తలులందరి సేవను విలువైందిగా ఎంచాడు, చివరికి వారిలో కొందరు స్పష్టంగానే ఇతరుల కన్నా ఎక్కువ చేయగల్గినప్పటికీ కూడా.
6. యేసు చెప్పిన విత్తువాని ఉపమానంలో, “మంచినేలను విత్తబడిన” విత్తనానికి ఏమి సంభవిస్తుంది, మరి ఏ ప్రశ్నలు ఉదయిస్తాయి?
6 అదేవిధంగా, మనందరం ప్రకటన పనిని సమానమైన మొత్తంలో చేయాలని యెహోవా కోరడు. యేసు దీన్ని విత్తువాని ఉపమానంలో సూచించాడు, ఆ ఉపమానం ప్రకటన పనిని విత్తనాలు విత్తడంతో పోల్చింది. విత్తనాలు వివిధ రకాల నేలలపైన పడ్డాయి, ఇది సందేశాన్ని వినేవారు ప్రదర్శించే వివిధ రకాల హృదయ స్థితులను వర్ణిస్తుంది. యేసు దాన్ని వివరిస్తూ, “మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.” (మత్తయి 13:3-8, 18-23) ఈ ఫలము ఏమిటి, మరి అది వేర్వేరు మొత్తాల్లో ఎందుకు ఉత్పత్తి అయ్యింది?
7. విత్తబడిన విత్తనం యొక్క ఫలము ఏమిటి, మరి అది వేర్వేరు మొత్తాల్లో ఎందుకు ఉత్పత్తి అవుతుంది?
7 విత్తబడిన విత్తనం అనేది “రాజ్యమును గూర్చిన వాక్యము” గనుక, ఫలాల్ని ఫలించడం అనేది ఆ వాక్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడుతూ దాన్ని వ్యాప్తిచేయడాన్ని సూచిస్తుంది. (మత్తయి 13:19) ఉత్పత్తి చేయబడిన ఫలము—ముప్పదంతల నుండి నూరంతల వరకు—వేర్వేరు మొత్తాల్లో ఉంటుంది, ఎందుకంటే జీవితంలో సామర్థ్యాలూ, పరిస్థితులూ వేర్వేరుగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధి మూలానో లేక వయస్సు పెరుగుతుండడం మూలానో సత్తువ కోల్పోయిన వ్యక్తికన్నా, మంచి ఆరోగ్యమూ శారీరక బలమూ ఉన్న ఒక వ్యక్తి ప్రకటనా పనిలో ఎక్కువ చేయవచ్చు. కుటుంబాన్ని పోషించడానికి పూర్తికాలం ఉద్యోగం చేయాల్సివచ్చే వ్యక్తికన్నా, కుటుంబ బాధ్యతలు లేని ఒక యౌవన ఒంటరి వ్యక్తి ఎక్కువ చేయవచ్చు.—సామెతలు 20:29 పోల్చండి.
8. తమ ప్రాణము ఇవ్వగల్గినదానంతటిలో అత్యంత శ్రేష్ఠమైనది ఇచ్చేవారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు?
8 మనస్ఫూర్తిగానే ముప్పదంతలు ఉత్పత్తి చేసే వ్యక్తి, దేవుని దృష్టిలో నూరంతలు ఉత్పత్తి చేసే వ్యక్తికన్నా తక్కువ విశ్వాసపాత్రుడా? ఎంతమాత్రం కాదు! ఫలము వేర్వేరు మొత్తాల్లో ఉండవచ్చు, కానీ చేసిన సేవ మన ప్రాణము ఇవ్వగల్గేదానంతటిలో అత్యంత శ్రేష్ఠమైనదైనంత వరకూ యెహోవా ఆనందిస్తాడు. గుర్తుంచుకోండి, వేర్వేరు మొత్తాల్లోని ఫలము అంతా కూడా “మంచి నేల” అనే హృదయాల నుండి ఉత్పన్నమైనదే. “మంచి” అని అనువదించబడిన గ్రీకు పదం (కాలోస్), “అందమైన”దాన్ని, “హృదయాన్ని ఆహ్లాదపరచేదాన్ని, నయనానందకరంగా” ఉన్నదాన్ని వర్ణిస్తుంది. మనకు చేతనైనంత మనం చేసినప్పుడు దేవుని కళ్లకు మన హృదయం అందంగా ఉన్నట్లు కనబడుతుందని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంది!
వేరేవారితో పోల్చబడదు
9, 10. (ఎ) మన హృదయం ఏ విధమైన ప్రతికూల తర్కం చేసేందుకు మనల్ని నడిపించగలదు? (బి) మొదటి కొరింథీయులు 12:14-26 నందు ఇవ్వబడిన దృష్టాంతం, యెహోవా మనం చేసేదాన్ని ఇతరులతో పోల్చడని ఎలా చూపిస్తుంది?
9 అయితే, మన అపరిపూర్ణ హృదయం విషయాల్ని వేరే విధంగా తీర్మానించవచ్చు. అది మన సేవను ఇతరుల సేవతో పోల్చవచ్చు. అదిలా తర్కించవచ్చు, ‘వేరేవాళ్లు పరిచర్యలో నేను చేస్తున్నదానికన్నా ఎంతో ఎక్కువ చేస్తున్నారు. యెహోవా నా సేవను బట్టి అసలు ఎలా ఆనందిస్తాడు?’—1 యోహాను 3:19, 20 పోల్చండి.
10 యెహోవా తలంపులూ మార్గాలు, మన తలంపులూ మార్గాలకన్నా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. (యెషయా 55:9) మన వ్యక్తిగత ప్రయత్నాలను యెహోవా ఎలా దృష్టిస్తాడన్న దాని గురించి, 1 కొరింథీయులు 12:14-26 నుండి మనకు కొంత అంతర్దృష్టి లభిస్తుంది. అక్కడ సంఘం కళ్లు, చేతులు, కాళ్లు, చెవుల వంటి ఇతరత్రా అనేక అవయవాలతో కూడిన శరీరంతో పోల్చబడింది. ఒక్క క్షణం మీ అక్షరార్థ శరీరాన్ని పరిశీలించుకోండి. మీ కళ్లను మీ చేతులతోనో లేక మీ కాళ్లను మీ చెవులతోనో పోల్చడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది! ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకమైన విధిని నిర్వర్తిస్తుంది, అయినా అన్ని అవయవాలు ఉపయోగకరమైనవే విలువైనవే. అదేవిధంగా, మీరు మనస్ఫూర్తిగా చేసే సేవను యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడు, ఇతరులు మీకన్నా ఎక్కువ చేసినా సరే లేక తక్కువ చేసినా సరే.—గలతీయులు 6:4.
11, 12. (ఎ) తాము ‘మరి బలహీనులమని’ లేక “ఘనతలేని”వారమని కొందరు ఎందుకు భావించవచ్చు? (బి) యెహోవా మన సేవను ఎలా దృష్టిస్తాడు?
11 ఆరోగ్యం బాగా లేకపోవడం, వయస్సు పెరుగుతుండడం, లేక మరితర పరిస్థితులు విధించే పరిమితుల వలన తాము ‘మరి బలహీనులము’ అని లేక “ఘనతలేని”వారము అని మనలో కొందరం కొన్నిసార్లు భావించవచ్చు. కానీ యెహోవా విషయాలను దృష్టించే విధానం అది కాదు. బైబిలు మనకు ఇలా చెబుతుంది: “శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే . . . ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము . . . [అయితే,] దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.” (1 కొరింథీయులు 12:22-25) అందుకని ప్రతి ఒక్కరూ యెహోవాకు ప్రియమైనవారిగా ఉండగలరు. ఆయన మన పరిమితుల పరిధిలోనే మనం చేసే సేవను అమూల్యమైనదిగా ఎంచుతాడు. అటువంటి అర్థంచేసుకునే, ప్రేమామయుడైన దేవున్ని యథాశక్తితో సేవించాలని కోరుకోవడానికి మీ హృదయం మిమ్మల్ని కదిలించడం లేదా?
12 అందుకని, యెహోవాకు ప్రాముఖ్యమైనది, వేరే ఎవరో చేస్తున్నంతగా మీరూ చేయడం కాదు గానీ, మీరు—మీ ప్రాణము—వ్యక్తిగతంగా చేయగలిగినదే. మన వ్యక్తిగత ప్రయత్నాల్ని యెహోవా విలువైనవిగా పరిగణిస్తాడన్న విషయం, యేసు భూమిపై తన చివరి రోజుల్లో ఇద్దరు పూర్తిగా భిన్నమైన స్త్రీలతో వ్యవహరించిన పద్ధతిద్వారా హృదయాన్ని స్పృశించే రీతిలో ప్రదర్శితమైంది.
మెప్పుదలగల ఒక స్త్రీయొక్క “మిక్కిలి విలువగల” బహుమానం
13. (ఎ) సుగంధభరితమైన అత్తరును యేసు తలపైనా ఆయన పాదాలపైన పోసిన సంఘటనకు ముందున్న పరిస్థితులు ఏమిటి? (బి) మరియ పోసిన అత్తరు విలువ డబ్బుపరంగా చూస్తే ఎంత?
13 శుక్రవారం సాయంత్రం, నీసాను 8న యేసు బేతనియకు చేరుకున్నాడు, ఇది ఒలీవల కొండకు తూర్పువాలున, యెరూషలేముకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కుగ్రామం. ఈ గ్రామంలో యేసుకు ప్రియమైన స్నేహితులు ఉన్నారు—మరియ, మార్త, వీరి సోదరుడు లాజరు. యేసు వీరి ఇంట్లో అతిథిగా ఉండేవాడు, బహుశ ఆయన ఈ ఇంటికి తరచుగానే వచ్చేవాడు. శనివారం సాయంత్రం మాత్రం, యేసు తన స్నేహితులతోపాటు సీమోను ఇంట్లో భోజనం చేశాడు. ఈ సీమోను మునుపు ఒక కుష్ఠరోగి, యేసే ఈయనను బాగుచేసి ఉండవచ్చు. యేసు బల్లవద్ద కూర్చుంటుండగా, మరియ ఒక వినమ్రతతో కూడిన క్రియను చేసింది, దీని ద్వారా ఆమె తన సోదరున్ని పునరుత్థానం చేసిన వ్యక్తిపట్ల తనకుగల ప్రగాఢమైన ప్రేమను ప్రదర్శించింది. ఆమె “మిక్కిలి విలువగల” అత్తరు ఉన్న ఒక బుడ్డిని పగులగొట్టింది. నిజంగా మిక్కిలి విలువగలదే! దాని విలువ 300 దేనారములు, దాదాపు ఒక సంవత్సర జీతానికి సమానం. ఆమె ఈ సుగంధభరితమైన అత్తరును యేసు తలపైనా ఆయన పాదాలపైనా పోసింది. ఆమె ఆయన పాదాలను తన వెండ్రుకలతో తడి ఆరేలా తుడిచింది కూడా.—మార్కు 14:3; లూకా 10:38-42; యోహాను 11:38-44; 12:1-3.
14. (ఎ) మరియ చేసిన క్రియకు శిష్యులు ఎలా ప్రతిస్పందించారు? (బి) యేసు మరియను ఎలా సమర్థించాడు?
14 శిష్యులకు ఆగ్రహం కలిగింది! “ఈలాగు నష్టపరచనేల?” అని అడిగారు వారు. యూదా తన దొంగ బుద్ధిని, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయవచ్చనే సలహా ముసుగులో కప్పిపుచ్చుతూ, “యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.” మరియ ఏమీ మాట్లాడలేదు. అయితే యేసు శిష్యులతో, “ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి [కాలోస్ యొక్క ఒక రూపం] కార్యము చేసెను. . . . ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” యేసు యొక్క ఈ ఉత్సాహపూరిత మాటలు మరియ హృదయాన్ని ఎంతగా నిమ్మళపర్చి ఉండవచ్చు!—మార్కు 14:4-9; యోహాను 12:4-8.
15. మరియ చేసినదాన్ని బట్టి యేసు ఎందుకు బాగా చలించిపోయాడు, మరి దీనిద్వారా మనం మనస్ఫూర్తిగా చేసే సేవను గూర్చి ఏమి నేర్చుకుంటాము?
15 మరియ చేసినదాన్ని బట్టి యేసు బాగా చలించిపోయాడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆమె ఒక ప్రశంసనీయమైన పనిని చేసింది. యేసుకు ప్రాముఖ్యమైనది ఆ బహుమానం యొక్క విలువ కాదు గానీ, “[ఆమె] తన శక్తికొలది” చేసిందన్న వాస్తవమే. ఆమె అవకాశాన్ని అందుకుని తాను ఇవ్వగలిగింది ఇచ్చింది. ఇతర అనువాదాలు ఈ మాటల్ని, “ఆమె తాను చేయగల్గినదంతా చేసింది,” అనీ లేక, “ఆమె తన శక్తిమేరకు చేసింది” అని అనువదించాయి. (యాన్ అమెరికన్ ట్రాన్స్లేషన్; ద జెరూసలేమ్ బైబిల్) మరియ మనస్ఫూర్తిగా ఇచ్చింది, ఎందుకంటే ఆమె తాను ఇవ్వగల్గినదానంతటిలో అత్యంత శ్రేష్ఠమైనది ఇచ్చింది. మనస్ఫూర్తిగా సేవ చేయడం అంటే అర్థం అదే.
ఒక విధవరాలి “రెండు [చిన్న] కాసులు”
16. (ఎ) యేసు ఒక బీద విధవరాలి చందాను గమనించడానికి ఏమి నడిపించింది? (బి) విధవరాలి కాసుల విలువ ఎంత?
16 కొద్ది రోజుల తర్వాత, నీసాను 11న, యేసు దేవాలయంలో చాలాసేపు గడిపాడు, అక్కడ ఆయన అధికారం ప్రశ్నించబడింది, పన్ను గురించిన, పునరుత్థానాన్ని గురించిన, మరితర విషయాల గురించిన సమస్యాపూరితమైన ప్రశ్నలకు ఆయన అప్పటికప్పుడు సమాధానాలిచ్చాడు. ఆయన శాస్త్రుల్ని పరిసయ్యుల్ని నిందించాడు, ఎందుకంటే వారు “విధవరాండ్ర యిండ్లు దిగమ్రింగుచు,” అటువంటి మరితర పనులు చేసేవారు. (మార్కు 12:40) అటుతర్వాత యేసు కూర్చున్నాడు, అది స్త్రీల ఆవరణలోనన్నది స్పష్టమౌతుంది. అక్కడ యూదా సాంప్రదాయం చెప్పేదాని ప్రకారం 13 కానుక పెట్టెలు ఉండేవి. ప్రజలు చందాలు వేస్తుండగా జాగ్రత్తగా చూస్తూ ఆయన అక్కడ కొంచెంసేపు కూర్చున్నాడు. ధనికులు చాలామంది వచ్చారు, కొందరు బహుశ స్వనీతిని ప్రదర్శిస్తూ, చివరికి ఆడంబరంగా కూడా వచ్చివుండవచ్చు. (మత్తయి 6:2 పోల్చండి.) యేసు చూపులు ఒక స్త్రీమీద నిలిచాయి. మామూలు కళ్లకు ఆమెలోనూ, ఆమె చందాలోను అంత గమనార్హమైనదేమీ కనిపించి ఉండకపోవచ్చు. కానీ ఇతరుల హృదయాలను తెలుసుకోగలిగే యేసుకు ఆమె “ఒక బీద విధవరాలు” అని తెలిసిపోయింది. ఆమె ఇచ్చిన కానుక విలువ ఎంతో కూడా ఆయనకు కచ్చితంగా తెలుసు—“రెండు కాసులు.”b—మార్కు 12:41, 42.
17. విధవరాలి చందాను యేసు ఎలా ఉన్నతంగా ఎంచాడు, దేవునికి ఇవ్వడం గురించి మనం దీనిద్వారా ఏమి నేర్చుకుంటాము?
17 యేసు తన శిష్యుల్ని తన దగ్గరికి పిలిచాడు, తాను బోధించబోయే పాఠాన్ని వాళ్లు ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నాడు. “కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె [ఆమె] . . . ఎక్కువ వేసెనని” యేసు అన్నాడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆమె ఇతరులందరు కలిసి వేసిన దానంతటికన్నా ఎక్కువగా వేసింది. ఆమె “తనకు కలిగినదంతయు”—చివరికి ఉన్న రెండే రెండు కాసుల్ని కూడా వేసేసింది. ఆ విధంగా చేయడంలో, ఆమె తనను తాను యెహోవా యొక్క శ్రద్ధాపూర్వకమైన చేతుల్లో ఉంచుకుంది. ఆ విధంగా దేవునికి ఇవ్వడంలో మాదిరికరమని ప్రత్యేకించబడిన వ్యక్తి ఇచ్చిన కానుక, డబ్బుపరంగా చూస్తే దాదాపు ఏమాత్రం విలువ లేనిది. అయితే, దేవుని దృష్టికి మాత్రం అది అమూల్యమైనది!—మార్కు 12:43, 44; యాకోబు 1:27.
మనస్ఫూర్తిగా చేసే సేవను గురించిన యెహోవా దృష్టికోణం నుండి నేర్చుకోవడం
18. ఈ ఇద్దరు స్త్రీలతో యేసు వ్యవహరించిన పద్ధతి ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము?
18 ఈ ఇద్దరు స్త్రీలతో యేసు వ్యవహరించిన పద్ధతి ద్వారా, మనస్ఫూర్తిగా చేసే సేవను యెహోవా ఎలా దృష్టిస్తాడన్నదాని గురించి హృదయాన్ని స్పృశించే పాఠాలను మనం నేర్చుకోవచ్చు. (యోహాను 5:19) యేసు విధవరాలిని మరియతో పోల్చలేదు. ఆయన విధవరాలి రెండు కాసులు, మరియ యొక్క “మిక్కిలి విలువగల” అత్తరుకన్నా తక్కువ విలువగలవని ఏమాత్రం దృష్టించలేదు. ఇద్దరు స్త్రీలూ తాము ఇవ్వగల్గినదానంతటిలో అత్యంత శ్రేష్ఠమైనది ఇచ్చారు గనుక, దేవుని దృష్టిలో రెండు కానుకలూ విలువగలవే. అందుకని దేవుని సేవలో మీరు చేయాలనుకున్నదంతా మీరు చేయలేకపోతుండడం మూలాన మీరు పనికిరానివారనే భావనలు మిమ్మల్ని బాధపెడుతున్నట్లైతే నిరాశచెందకండి. మీరు ఇవ్వగలదానిలో అత్యంత శ్రేష్ఠమైనది ఇచ్చినప్పుడు స్వీకరించడానికి యెహోవా సంతోషిస్తున్నాడు. గుర్తుంచుకోండి, యెహోవా “హృదయమును లక్ష్యపెట్టును,” అందుకని ఆయనకు మీ హృదయ ఆకాంక్షలు పూర్తిగా తెలుసు.—1 సమూయేలు 16:7.
19. దేవున్ని సేవించడంలో ఇతరులు ఏమి చేస్తున్నారన్న విషయంలో మనం ఎందుకు తీర్పరులుగా ఉండకూడదు?
19 మనస్ఫూర్తిగా చేసే సేవను గురించిన యెహోవా దృష్టికోణం, మనం ఒకరినొకరం ఎలా దృష్టిస్తాము, ఒకరితో ఒకరం ఎలా వ్యవహరిస్తాము అన్న విషయాల్ని ప్రభావితం చేయాలి. ఇతరులు చేసే ప్రయత్నాల్ని విమర్శించడం, లేకపోతే ఒకరు చేసే సేవను ఇతరులతో పోల్చడం ఎంత ప్రేమరాహిత్యంగా ఉంటుంది! విషాదకరంగా, ఒక క్రైస్తవ స్త్రీ ఇలా వ్రాసింది: “అయితే నీవు పయినీరువి లేకపోతే ఏమీ కావు అన్న భావనను అప్పుడప్పుడు కొంతమంది కలిగిస్తుంటారు. ‘కేవలం’ క్రమమైన ప్రచారకులుగా కొనసాగడానికే కష్టపడుతున్న మేము కూడా, మేము మెచ్చుకోబడుతున్నామని భావించాల్సిన అవసరం ఉంది.” ఒక తోటి క్రైస్తవుని విషయంలో మనస్ఫూర్తిగా చేసే సేవ అంటే ఎంత అనేది తీర్మానించే అధికారం మనకు లేదని మనం గుర్తుంచుకుందాము. (రోమీయులు 14:10-12) విశ్వసనీయులైన లక్షలాదిమంది రాజ్య ప్రచారకుల్లో, మనస్ఫూర్తిగా చేసే ప్రతి ఒక్కరి సేవను యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడు, మనం కూడా అలాగే ఎంచాలి.
20. మన తోటి ఆరాధికుల గురించి ఏమని భావించుకోవడం సామాన్యంగా ఉత్తమం?
20 అయితే, పరిచర్యలో తాము చేయగల్గినదానికన్నా తక్కువ చేస్తున్నట్లు కొంతమందికి అనిపిస్తే అప్పుడేమిటి? ఒక తోటి విశ్వాసి కార్యకలాపాల్లో తగ్గుదల సంభవిస్తే అది, వారికి సహాయం చేయాల్సిన లేక వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారిపట్ల చింతగల పెద్దలకు స్పష్టంగానే సూచిస్తుంది. అదే సమయంలో, కొంతమంది విషయంలో మనస్ఫూర్తిగా చేసే సేవ మరియ యొక్క విలువైన అత్తరును పోలివుండడానికి బదులు విధవరాలి చిన్న కాసులను దగ్గరగా పోలివుండవచ్చని మనం మర్చిపోకూడదు. మన సహోదర సహోదరీలు యెహోవాను ప్రేమిస్తారనీ, మరి అటువంటి ప్రేమ—ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా కాదుగానీ—ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా చేయడానికి వారిని కదిలిస్తుందనీ భావించుకోవడం సామాన్యంగా ఉత్తమం. నిశ్చయంగానే మనస్సాక్షిగల ఏ యెహోవా సేవకుడూ దేవున్ని సేవించడంలో తాను చేయగల దానికన్నా తక్కువ చేయడానికి ఎంపిక చేసుకోడు!—1 కొరింథీయులు 13:4, 7.
21. ప్రతిఫలదాయకమైన ఏ పనిని చాలామంది చేపడుతున్నారు, మరి ఏ ప్రశ్నలు ఉదయిస్తాయి?
21 ఎలాగైతేనేమి, అత్యంత ప్రతిఫలదాయకమైన పని అయిన పయినీరు పరిచర్యను చేపట్టడం దేవుని ప్రజల్లో అనేకమంది విషయంలో మనస్ఫూర్తిగా చేసే సేవ అయ్యింది. వారు ఏ ఆశీర్వాదాలను పొందుతున్నారు? అంతేగాక, ఇంకా పయినీరు సేవ చేయలేకపోయిన మనలో కొంతమంది విషయమేమిటి—మనం పయినీరు స్ఫూర్తిని ఎలా చూపగలం? ఈ ప్రశ్నలు తర్వాతి శీర్షికలో చర్చించబడతాయి.
[అధస్సూచీలు]
a యూదా స్థానాన్ని మత్తీయ భర్తీ చేసినందున, ఆయన పేరు—పౌలు పేరు కాదు—12 పునాదులమీదనున్న పేర్లలో ఒకటిగా కనబడివుండాలి. పౌలు అపొస్తలుడైనప్పటికీ ఆయన 12 మందిలో ఒకడు కాదు.
b ఒక కాసు ఒక లెప్టన్. ఇది యూదుల్లో అప్పట్లో చలామణిలో ఉన్న నాణేల్లో అతి చిన్నది. రెండు లెప్టన్లు ఒక దిన వేతనంలో 1/64వ వంతు. మత్తయి 10:29 ప్రకారం ఒక్క అస్సారియోన్ (ఎనిమిది లెప్టన్లకు సమానం) నాణెంతో రెండు పిచ్చుకల్ని కొనవచ్చు, ఇవి బీదవారు ఆహారం కొరకు ఉపయోగించే పక్షుల్లో అత్యంత చవకైనవి. కాబట్టి ఈ విధవరాలు నిజంగానే బీదరాలు, ఎందుకంటే ఆమె దగ్గర ఒక్క పిచ్చుక కొనుక్కోవడానికి సగం డబ్బే ఉంది, అంటే ఒక్క పూట తిండికి కూడా సరిపోదన్నమాట.
మీరెలా జవాబిస్తారు?
◻ యెహోవాకు మనస్ఫూర్తిగా సేవచేయడం అంటే అర్థమేమిటి?
◻ మొదటి కొరింథీయులు 12:14-26 వద్ద ఇవ్వబడిన దృష్టాంతం, యెహోవా మనల్ని ఇతరులతో పోల్చడని ఎలా చూపిస్తుంది?
◻ మరియ యొక్క ఖరీదైన అత్తరు గురించి, విధవరాలి రెండు చిన్న కాసుల గురించి యేసు చేసిన వ్యాఖ్యానాల నుండి మనస్ఫూర్తిగా ఇవ్వడం గురించి ఏమి నేర్చుకుంటాము?
◻ మనస్ఫూర్తిగా చేసే సేవను గురించిన యెహోవా దృష్టికోణం, మనం ఒకరినొకరం ఎలా దృష్టిస్తామన్న విషయాన్ని ఎలా ప్రభావితం చేయాలి?
[15వ పేజీలోని చిత్రం]
మరియ, యేసు శరీరాన్ని “మిక్కిలి విలువగల” అత్తరుతో సుగంధభరితం చేస్తూ తాను ఇవ్వగల్గినదానంతటిలో అత్యంత శ్రేష్ఠమైనది ఇచ్చింది
[16వ పేజీలోని చిత్రం]
విధవరాలి కాసులు—డబ్బుపరంగా చూస్తే దాదాపు ఏమాత్రం విలువ లేనివే, కానీ యెహోవా దృష్టికి మాత్రం అమూల్యమైనవి