పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
1, 2. పయినీరు పరిచర్యకు ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి, ఎందుకు?
1 “సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం వలన కలిగే సంతృప్తి వేరే ఏ పనిలోనూ లేదని నాకు తెలుసు” అని ఒక పయినీరు అన్నాడు. మరొక పయినీరు ఇలా వ్యాఖ్యానించింది: “ప్రతిరోజు ముగిసిన తర్వాత నేను హాయిగా నిద్రపోతాను, నా హృదయం ఆనందంతో నిండివుంటుంది.” ఈ పయినీర్ల వ్యాఖ్యానాలు, అన్ని ప్రాంతాల్లోను పయినీరు పరిచర్యలో ఆశీర్వాదాలు చవిచూసిన సహోదర సహోదరీల మాటలకు అద్దంపడుతున్నాయి.—సామె. 10:22.
2 ప్రాణాలను కాపాడే దేవుని వాక్య పరిజ్ఞానం పొందడంలో ఇతరులకు సహాయం చేయడం నిజమైన తృప్తినిస్తుంది. (అపొ. 20:35; 1 థెస్స. 2:19, 20) “యెహోవాను సంతోషపరిచే విధంగా ప్రజలు తమ జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి ప్రేరేపించడంలో దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో చూడడం ఉత్తేజకరంగానూ, విశ్వాసాన్ని బలపరిచేదిగాను ఉంది” అని ఒక దీర్ఘకాలిక పయినీరు వ్రాశాడు. అవును పయినీర్లు ఇతరులకు సహాయం చేయడానికి, బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి అందుబాటులో ఉండడం ద్వారా ఇలాంటి ఆశీర్వాదాలను పొందుతారు.
3, 4. పయినీరు పరిచర్య ఒకరు యెహోవా మీద ఆధారపడి ఉండడాన్ని ఎలా నేర్పిస్తుంది, అది ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎలా దోహదపడుతుంది?
3 యెహోవా మీద ఆధారపడడం: పయినీర్లు తమ పరిచర్యలో కొనసాగుతూ ప్రతిదినం దేవుని ఆత్మ మీద ఆధారపడడం, ‘ఆత్మఫలాన్ని’ వృద్ధిచేసుకునేందుకు దోహదపడడమేగాక వారికి రక్షణగా ఉంటుంది. (గల. 5:16, 22) అంతేకాదు, పయినీర్లు దేవుని నామమును నిరంతరం ఉపయోగిస్తారు కాబట్టి, వారు సత్యాన్ని సమర్థించేందుకు లేఖనాలు ఉపయోగించడంలో, ఇతరులను బలపరచడంలో ప్రవీణులవుతారు. (2 తిమో. 2:15) దశాబ్దాలపాటు పయినీరుగా ఉన్న ఒక సహోదరుడు ఇలా వ్యాఖ్యానించాడు: “బైబిలులో లోతైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పయినీరు పరిచర్య నాకు సహాయపడింది, అనేకమంది యెహోవానూ ఆయన సంకల్పాలనూ తెలుసుకోవడంలో సహాయం చేయడానికి నేను ఈ జ్ఞానాన్ని ఉపయోగించాను.” ఎంతటి ప్రతిఫలమో కదా!
4 క్రమ పయినీర్లు ఇంకా అనేక విధాలుగా యెహోవా మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉంది. వారు తమ భౌతికావసరాల కోసం చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తుండగా వారి విశ్వాసం బలోపేతమవుతుంది. 55 సంవత్సరాలు పయినీరు పరిచర్య సాగించిన 72 ఏండ్ల ఒక పయినీరు ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎన్నడూ నిరాశపరచలేదు.” అంతేకాదు పయినీర్లు తమ జీవితాలను నిరాడంబరంగా ఉంచుకోవడం ద్వారా, జీవితంలోని అనేక చింతల నుండి తమను కాపాడుకుంటారు. ఇది మిమ్మల్ని ఆకట్టుకుంటోందా?—మత్త. 6:22; హెబ్రీ. 13:5, 6.
5. ఒక వ్యక్తి యెహోవాకు సన్నిహితుడయ్యేందుకు పయినీరు పరిచర్య ఎలా తోడ్పడుతుంది?
5 దేవునికి సన్నిహితులవడం: యెహోవాతో మనకున్న సంబంధం అత్యంత అమూల్యమైన సంపద. (కీర్త. 63:3) యెహోవా మీది ప్రేమతో మనం పరిచర్యలో సంపూర్ణంగా పాల్గొన్నప్పుడు, ఆ సంబంధం మరింత సన్నిహితమవుతుంది. (యాకో. 4:8) 18 సంవత్సరాలకు పైగా పూర్తికాల పరిచర్యలో గడిపిన ఒక పయినీరు ఇలా అంటున్నాడు: “పయినీరు పరిచర్య ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి’ తెలుసుకొనేలా చేస్తుంది, అది మన సృష్టికర్తతో రోజురోజుకు మరింత శక్తివంతమైన సంబంధాన్ని నిర్మించుకొనేలా చేస్తుంది.”—కీర్త. 34:8.
6. పయినీర్లలో తప్పకుండా ఉండాల్సింది ఏమిటి, పయినీర్లతోపాటు ఇంకా ఎవరు కూడా ప్రయోజనం పొందుతారు?
6 పయినీర్లకు పయినీరు పరిచర్య చేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారిలో దృఢమైన విశ్వాసం, దేవుని పట్ల పొరుగువారి పట్ల నిజమైన ప్రేమ, త్యాగాలు చేయడానికి సంసిద్ధత కూడా తప్పకుండా ఉండాలి. (మత్త. 16:24; 17:20; 22:37-39) అయినప్పటికీ, పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు వాటికంటే మిన్న అని అన్ని ప్రాంతాల్లోనూ నవ్వుతూ కనబడే పయినీర్ల ముఖాలే నిరూపిస్తున్నాయి. (మలా. 3:10) ఈ ఆశీర్వాదాలు కేవలం పయినీర్లకు మాత్రమే పరిమితం కాదు, వారు చూపించే పయినీరు స్ఫూర్తి నుండి వారి కుటుంబాలు, సంఘస్థులు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు.—ఫిలి. 4:23.