యెహోవా నా ఆశ్రయంగా ఉన్నాడు
పనెలపీ మాక్రీస్ చెప్పినట్లు
“నీ భర్తను వదిలిపెట్టు, నీ సహోదరులు నీకోసం ఇంకా మంచి వాడిని చూసి పెడ్తారు” అని ఎడతెగక మా అమ్మ నన్ను అభ్యర్థించింది. నా వివాహ బంధాన్ని తెంచుకోమని మా ప్రియమైన అమ్మ నన్నెందుకు కోరుతుంది? ఆమెను మరీ అంతగా కలతపరచినదేమిటి?
నేను 1897లో సేమాస్ అనే గ్రీక్ దీవిలోని ఆమ్‌బీలోస్ అనే చిన్న గ్రామంలో జన్మించాను. గ్రీక్ ఆర్థడాక్స్ చర్చియొక్క నిష్ఠగల సభ్యులు మా కుటుంబం వారు. నాన్న నా జననానికి కొంచెం ముందు మరణించారు, నేను, మా అమ్మ, నా ముగ్గురు అన్నయ్యలు కడు పేద సమయాల్లో మనుగడ సాగించేందుకు చాలా కష్టపడి పనిచేయవలసి ఉండింది.
1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యింది, ఆ తర్వాత వెంటనే సైన్యంలో చేరాలని నా పెద్దన్నయ్యలిద్దరూ ఆజ్ఞాపించబడ్డారు. అయితే అలా చేయడాన్ని తప్పించుకునేందుకు మా అమ్మతోపాటు నన్ను, మా చిన్నన్నయ్యను, ఇంట్లో వదిలిపెట్టి వారు అమెరికాకు మకాం మార్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 1920లో మా గ్రామంలోని యువ ఉపాధ్యాయుడైన దీమీట్రీస్‌ను వివాహం చేసుకున్నాను.
అతి ప్రాముఖ్యమైన దర్శనం
నేను వివాహం చేసుకున్న కొద్ది కాలంలోనే మా మేనమామ మమ్మల్ని సందర్శించడానికి అమెరికా నుండి వచ్చారు. చార్ల్స్ టేజ్ రస్సెల్ వ్రాసిన లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం) సంపుటుల్లో ఒకదాన్ని ఆయన తనతోపాటు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యెహోవాసాక్షులు అని తెలియబడుతున్న బైబిలు విద్యార్థుల ప్రచురణ అది.
దీమీట్రీస్ ఆ పుస్తకాన్ని తెరిచినప్పుడు, “మనిషి చనిపోయినప్పుడు అతనికి ఏమి సంభవిస్తుంది?” అని తాను చిన్నప్పటి నుండి ఆలోచించే విషయం ఉండడాన్ని గమనించాడు. తాను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు అదే విషయాన్ని గూర్చి గ్రీకు ఆర్థడాక్స్ వేదాంతిని ప్రశ్నించాడు, కాని సంతృప్తికరమైన జవాబును పొందలేకపోయాడు. ఆ ప్రచురణలో ఇవ్వబడిన స్పష్టమైన మరియు హేతుబద్ధమైన వివరణ దీమీట్రీస్‌ను ఎంత సంతోషపరచిందంటే, నేరుగా గ్రీస్‌లోని పురుషులు అలవాటుగా కలుసుకునే గ్రామంలో ఉండే టీ కొట్టుకు ఆయన వెళ్ళాడు. ఆయన తాను నేర్చుకున్న విషయాలను అక్కడ బైబిలు నుండి చెప్పాడు.
బైబిలు సత్యం పక్షాన మా స్థానం
ఆ సమయంలో—1920ల తొలిభాగంలో—గ్రీస్ మరో యుద్ధంలో ఉంది. దీమీట్రీస్ బలవంతంగా సైన్యంలో చేర్చబడి, ఆసియా మైనర్‌లోని టర్కీ మధ్యభాగానికి పంపబడ్డాడు. ఆయన గాయపరచబడి, ఇంటికి తిరిగి పంపబడ్డాడు. ఆయన కోలుకున్న తర్వాత, నేను ఆయనతోపాటు, ఆసియా మైనర్ (ఇప్పుడు టర్కీలోని ఇజ్‌మిర్)కు వెళ్ళాను. అకస్మాత్తుగా 1922లో యుద్ధం ముగిసినప్పుడు మేము పారిపోవలసి వచ్చింది. నిజానికి, సేమాస్‌కు ఎంతో పాడైపోయిన పడవలో మేము కొంచెంలో పారిపోగలిగాము. ఇంటికి చేరుకున్న తర్వాత, ఏ దేవుని గూర్చి అయితే మాకు అల్ప జ్ఞానమే ఉందో ఆ దేవునికి మేము మోకాళ్ళూని, కృతజ్ఞతలు తెలిపాము.
ద్వీపం రాజధానియైన వాతీలోని పాఠశాలలో బోధించేందుకు దీమీట్రీస్ త్వరలోనే నియమించబడ్డాడు. ఆయన బైబిలు విద్యార్థుల సాహిత్యాన్ని చదవడాన్ని కొనసాగించాడు, మరి వర్షం కురుస్తున్న ఒక రాత్రి చియోస్ దీవి నుండి ఇద్దరు బైబిలు విద్యార్థులు వచ్చి మమ్మల్ని సందర్శించారు. కల్‌పోర్టర్లని పిలువబడే పూర్తికాల సువార్తికులుగా సేవచేసేందుకు వాళ్ళు అమెరికా నుండి తిరిగి వచ్చారు. రాత్రి వాళ్ళకు మా ఇంట్లో వసతిని కల్పించాము, వాళ్ళు దేవుని సంకల్పాలను గూర్చిన అనేక విషయాలను మాతో చెప్పారు.
“పనెలపీ, ఇదే సత్యమని నేను గ్రహిస్తున్నాను, నేను దీనిని అవలంబించాలి. దానర్థం, నేను గ్రీకు ఆర్థడాక్స్ చర్చిలో పాడడం ఆపివేయాలి, పాఠశాల విద్యార్థులతో నేను చర్చికి హాజరు కాలేను” అని దీమీట్రీ తరువాత నాతో అన్నాడు. యెహోవాను గూర్చిన మా జ్ఞానం పరిమితమైనప్పటికీ, ఆయనను సేవించాలనే మా కోరిక మాత్రం బలీయమైనది. నేను ఈ విధంగా బదులిచ్చాను: “నేను మీకొక ఆటంకంగా ఉండను. ముందుకు వెళ్ళండి.”
ఆయన కాస్త తడబాటుగా ఇలా అన్నాడు: “అవును, కానీ మన పద్ధతి బయటపడితే నేను నా ఉద్యోగాన్ని కోల్పోతాను.”
“బాధపడకండి. ప్రజలందరూ బోధనా వృత్తివల్లనే జీవిస్తున్నారా? మనం యౌవనులము, ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని సహాయంతో మనకు వేరే పని దొరుకుతుంది” అని నేనన్నాను.
ఈ సమయంలో మరో బైబిలు విద్యార్థి—కల్‌పోర్టర్ కూడా—సేమాస్‌కు వచ్చాడని తెలుసుకున్నాం. బహిరంగ బైబిలు ప్రసంగం ఇచ్చేందుకు పోలీసులు ఆయనకు అనుమతినివ్వలేదని మేము తెలుసుకుని మేము ఆయన కోసం వెదుక్కుంటూ వెళ్ళాం. ఒక దుకాణంలో ఇద్దరు గ్రీకు ఆర్థడాక్స్ వేదాంతులతో మాట్లాడుతూ ఆయన మాకు కనిపించాడు. తమ బైబిలు విశ్వాసాలను సమర్థించుకోలేనందువల్ల సిగ్గుపడిన ఆ వేదాంతులు అక్కడ నుండి త్వరగా వెళ్ళిపోయారు. కల్‌పోర్టర్ జ్ఞానానికి ముగ్ధుడైన నా భర్త “మీరు బైబిలును అంత సులభంగా ఎలా ఉపయోగించగలిగారు?” అని అడిగాడు.
“మేము బైబిలును క్రమబద్ధంగా పఠిస్తాం” అని ఆయన జవాబిచ్చాడు. తన సంచీని తెరచి, ఆయన దేవుని వీణె (ఆంగ్లం) అనే పఠన పుస్తకాన్ని తీసి, అలాంటి పఠనానికి ఆ పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలో మాకు చూపించాడు. మేము దానిని పఠించాలని ఎంతో ఆతురతతో ఉన్నాం గనుక, నేను, నా భర్త, ఆ కల్‌పోర్టర్, మరో ఇద్దరు పురుషులు ఆ దుకాణదారుని ఇంటికి వెంటనే ఆయన వెంట వెళ్ళాం. ఆ కల్‌పోర్టర్ మాలో ప్రతి ఒక్కరికి దేవుని వీణె అనే పుస్తకం యొక్క ఒక్కో ప్రతిని ఇచ్చాడు, మేము అప్పుడే పఠించనారంభించాం. మధ్యరాత్రి దాటే వరకు మేము మా పఠనాన్ని కొనసాగించాం, తరువాత తెల్లవారుతుండగా మేము బైబిలు విద్యార్థులు పాడే పాటలను నేర్చుకోనారంభించాం.
ఆ సమయం నుండి, నేను రోజుకనేక గంటలు బైబిలు పఠించనారంభించాను. విదేశాల్లోని బైబిలు విద్యార్థులు మాకు బైబిలు పఠన సహాయకాలను సరఫరా చేస్తూ ఉండేవారు. 1926 జనవరిలో నేను ప్రార్థనలో దేవునికి నన్ను నేను సమర్పించుకుని, నిర్నిబంధంగా ఆయన ఇష్టాన్ని చేస్తానని మ్రొక్కుకున్నాను. తర్వాత, ఆ వేసవిలో నేను నా భర్త నీటి బాప్తిస్మం ద్వారా మా సమర్పణను తెలియజేశాము. మేము నేర్చుకుంటున్న విషయాలను ఇతరులకు తెలపాలని మాకు బలమైన కోరిక ఉండేది, అలా నిరీక్షణా సందేశం (ఆంగ్లం) అనే కరపత్రంతో మేము ఇంటింటి పరిచర్యను ఆరంభించాం.
తీవ్రమైన వ్యతిరేకతను సహించడం
ఒకరోజు ఒక యువతి నన్ను జపమాల ప్రార్థన కొరకు చిన్న గ్రీక్ ఆర్థడాక్స్ చాపల్‌కు రమ్మని ఆహ్వానించింది. “నేను దేవున్ని ఆ విధంగా ప్రార్థించడం మానేశాను. బైబిలు బోధిస్తున్నట్లు నేను ఇప్పుడు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తున్నాను” అని వివరించాను. (యోహాను 4:23, 24) ఆమె ఆశ్చర్యపడి, నా భర్త విషయంతో సహా జరిగిన విషయాన్నంతటినీ అందరికీ చెప్పింది.
దాదాపు అందరూ వ్యతిరేకించనారంభించారు. ఇంట్లోనూ లేదా దీవిలో ఆసక్తిగలవారితో కూటాలు జరిపే చోటా, ఎక్కడా మాకు శాంతి లేకుండా పోయింది. ఆర్థడాక్స్ ప్రీస్ట్‌ల ప్రేరణతో మా కూటమి స్థలానికి వెలుపల గుంపులు సమకూడి, రాళ్ళను విసిరి, అవమానపరచే మాటలను గట్టిగా పలికారు.
నిరీక్షణా సందేశం అనే కరపత్రాన్ని మేము పంపకం చేసినప్పుడు, “వెయ్యేండ్ల విశ్వాసులు” అని అంటూ మరియు అవమానపరచే ఇతర మాటలను పలుకుతూ పిల్లలు మా చుట్టూ గుమిగూడారు. నా భర్త సహోద్యోగులు కూడా ఆయనను వేధించనారంభించారు. 1926 తుది భాగంలో ఆయన విచారణకు పిలువబడ్డాడు, పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయునిగా ఉండే యోగ్యతలేదని నేరారోపణ చేయబడి, 15 రోజులు జైలులో ఉంచబడ్డాడు.
మా అమ్మ ఇది తెలుసుకుని, నా భర్తను వదిలిపెట్టమని నాకు సలహా ఇచ్చింది. “చూడమ్మా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తాను, గౌరవిస్తాను అన్న విషయం నీకు తెలిసిందే. కాని, సత్య దేవునిని మేము ఆరాధించే విషయంలో మాత్రం నిన్ను జోక్యం చేసుకోనివ్వలేను” అని నేను జవాబిచ్చాను. ఆమె ఎంతో నిరాశచెంది తన గ్రామానికి వెళ్ళిపోయింది.
1927లో ఏథెన్సులో బైబిలు విద్యార్థుల సమావేశం జరిగింది, దానికి హాజరయ్యేందుకు యెహోవా మాకు మార్గాన్ని చూపించాడు. తోటి విశ్వాసులను అనేకులను కలవడం వల్ల మేము ఉత్తేజపరచబడి, ఆత్మీయంగా బలపరచబడ్డాం. మేము సేమాస్‌కు తిరిగి వచ్చినప్పుడు లోక పరిపాలకులకు ఒక సాక్ష్యం (ఆంగ్లం) అనే కరపత్రం యొక్క 5,000 ప్రతులను మా దీవిలోని గ్రామాల్లోను పట్టణాల్లోను పంచిపెట్టాము.
దాదాపు అదే సమయంలో దీమీట్రీస్ తన బోధనా పదవి నుండి తొలగించబడ్డాడు, మాకు వ్యతిరేకమైన అభిప్రాయమున్నందు వల్ల, పని దొరకడం చాలా వరకు అసాధ్యంగా ఉండేది. అయితే నాకు కుట్టడం వచ్చు గనుక, దీమీట్రీస్ నిపుణత గల పెయింటరు గనుక, మా నిత్యావసరాలను తీర్చుకునేందుకు సరిపడా సంపాదించుకోగలిగాము. 1928లో నా భర్త, అలాగే సేమాస్‌లోని మరో నలుగురు క్రైస్తవ సహోదరులు సువార్తను ప్రకటించినందుకు రెండు నెలలు జైలులో వేయబడ్డారు. జైలుకు వెలుపలవున్న ఒకే ఒక్క బైబిలు విద్యార్థినిగా, జైలులో ఉన్న వారికి నేను ఆహారం సరఫరా చేయగలిగాను.
తీవ్రమైన అనారోగ్యంతో పోరాడడం
ఒకసారి నేను క్షయరోగ సంబంధిత వెన్నుపూస నొప్పితో బాధపడ్డాను, అది అప్పుడు తెలియని దీర్ఘకాలిక రోగం. నా ఆకలి చచ్చిపోయింది, ఎడతెగక పెద్ద జ్వరము వచ్చేది. చికిత్సలో నాకు మెడనుండి తొడల వరకు ప్లాస్టర్ వేశారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, నాకు థెరపీ కొనసాగించేందుకు నా భర్త మా భూమిలోని ఒక ప్లాట్ అమ్మివేశాడు. నిరాశచెందిన నేను ప్రతిదినము బలము కోసం యెహోవాను ప్రార్థించేదానిని.
నా బంధువులు నన్ను సందర్శించేటప్పుడు ఎడతెగక వ్యతిరేకతను ఎక్కువగా చూపేవారు. మేము మా మతాన్ని మార్చుకున్నందుకే ఈ సమస్యలన్నీ కలిగాయని మా అమ్మ అనింది. కదలలేని నేను సహించేందుకు నాకు ఓరిమిని మరియు ధైర్యాన్ని ఇవ్వమని మన పరలోక తండ్రిని బతిమాలుకుంటూ కన్నీటితో నా దిండును తడిపేసేదాన్ని.
నా ప్రక్కనున్న బల్లపై సందర్శకుల కొరకు బైబిలును చిన్నపుస్తకాలను కరపత్రాలను ఉంచేదాన్ని. మా చిన్న సంఘపు కూటాలను మా ఇంట్లోనే జరపడం ఒక ఆశీర్వాదం; నేను క్రమం తప్పకుండా ఆత్మీయ ప్రోత్సాహాన్ని పొందగలిగేదాన్ని. ఏథెన్సు నుండి వచ్చిన వైద్యునికి చికిత్సకు డబ్బు చెల్లించేందుకుగాను మేము మరో ప్లాట్ అమ్మివేయవలసివచ్చింది.
త్వరలోనే, ప్రయాణ కాపరి మమ్మల్ని సందర్శించారు. నేను ఈ పరిస్థితిలో ఉండడాన్ని, దీమీట్రీస్‌కు పనిలేకుండడాన్ని చూసి ఆయన చాలా బాధపడ్డాడు. లెస్‌బాస్ దీవిలోని మిటలీనీలో నివసించే ఏర్పాట్లను చేసుకునేందుకు ఆయన మాకు సహాయం చేశాడు. 1934లో మేమక్కడికి తరలి వెళ్ళాం, దీమీట్రీస్ ఒక ఉద్యోగం సంపాదించుకోగలిగాడు. నా అనారోగ్యంలో నన్ను చూసుకునే చక్కని క్రైస్తవ సహోదర సహోదరీలను కూడా మేం కనుగొన్నాం. క్రమేణా, ఐదు సంవత్సరాల చికిత్స తరువాత నేను పూర్తిగా కోలుకున్నాను.
అయినప్పటికీ, 1946లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, నేను మళ్ళీ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను, ఈసారి నాకు క్షయరోగ సంబంధిత ఉదరకుహర వాపు వచ్చింది. తీవ్రమైన జ్వరము మరియు తీవ్రమైన నొప్పులతో నేను ఐదు నెలలు పక్కమీదే ఉండిపోయాను. అయితే ముందటిలాగే, నన్ను సందర్శించడానికి వచ్చేవారితో యెహోవాను గూర్చి మాట్లాడడాన్ని నేను ఆపనేలేదు. త్వరలోనే నేను కోలుకున్నాను.
వ్యతిరేకత ఉన్నప్పటికీ పయినీరింగ్ చేయడం
గ్రీసులో యుద్ధం తరువాతి సంవత్సరాల్లో యెహోవాసాక్షుల పరిస్థితి అవిరామమైన వ్యతిరేకతతో ఉండేది. మేము ఇంటింటి పరిచర్యలో ఉన్నప్పుడు అనేక సార్లు అరెస్ట్ చేయబడ్డాము. నా భర్త మొత్తం మీద 12 నెలలైనా జైలులో ఉంచబడివుంటాడు. మేము పరిచర్య ఆరంభించేటప్పుడు, సాధారణంగా అరెస్టయి రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఉండడానికి మానసికంగా సిద్ధపడివుంటాం. అయినప్పటికీ యెహోవా మమ్మల్నెన్నడూ విడనాడలేదు. సహించేందుకు కావలసిన ధైర్యాన్ని, బలాన్ని ఆయన ఎల్లప్పుడూ ఇచ్చేవాడు.
1940లలో నేను వెకేషన్ పయినీరింగ్ చేయడానికి గల ఏర్పాటును గురించి ఇన్‌ఫర్మాన్‌ట్ (ఇప్పుడు మన రాజ్య పరిచర్య)లో చదివాను. ఒక నెల పరిచర్యలో 75 గంటలు ప్రాంతీయ సేవ చేయవలసిన అవసరమున్న ఈ విధమైన సేవలో పాల్గొనడానికి ప్రయత్నించాలని నేను నిర్ణయించుకున్నాను. దాని ఫలితంగా, నేను నిర్వహించే పునర్దర్శనాల సంఖ్య మరియు బైబిలు పఠనాల సంఖ్య పెరిగింది—ఒక సమయంలో నేను వారానికి 17 పఠనాలను నిర్వహించే దానిని. అలాగే నేను ఒక పత్రికా మార్గాన్ని మిటలీనీ వ్యాపార ప్రాంతంలో ఏర్పరచుకోగలిగాను. అక్కడ నేను క్రమంగా దుకాణాల్లోను కార్యాలయాల్లోను బ్యాంకుల్లోను కావలికోట, తేజరిల్లు! పత్రికల దాదాపు 300 ప్రతులను క్రమంగా ఇచ్చేదాన్ని.
1964లో ప్రయాణకాపరి మా సంఘంలో సేవచేసినప్పుడు, “సహోదరీ పనెలపీ, మీ పరిచర్యలో మీరు పొందిన అద్భుతమైన ఫలితాలను నేను మీ పబ్లిషర్ రికార్డ్ కార్డులో చూశాను. మీరు క్రమ పయినీరు కోసం ఎందుకు దరఖాస్తు వేయకూడదు?” అని అడిగారు. నేను ఎల్లవేళలా ఆయనకు కృతజ్ఞురాలినైయుంటాను; మూడు దశాబ్దాలుగా పూర్తికాల పరిచర్య నాకు ఆనందదాయకంగా ఉంది.
ప్రతిఫలదాయకమైన అనుభవం
మిటలీనీలో గ్రీకు శరణార్థులు నివసించే లాన్గాడా అనే పొరుగు ప్రాంతంలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండేది. మతపిచ్చిగలవారి వ్యతిరేకత మాకు ఎదురవ్వడంవల్ల మేము ఇంటింటికి వెళ్ళడాన్ని మానేశాము. అయినప్పటికీ, నా భర్త జైలులో ఉన్నప్పుడు, నేను ఆయనను సందర్శించేందుకు ఈ ప్రాంతంగుండా వెళ్ళవలసి వచ్చింది. వర్షం కురుస్తున్న ఒక రోజు, నా భర్త జైలులో ఎందుకు వేయబడ్డాడో తెలుసుకునేందుకు ఒక స్త్రీ నన్ను లోపలికి ఆహ్వానించింది. దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించినందుకేనని, ఆయన క్రీస్తు కష్టమనుభవించినట్లే కష్టమనుభవిస్తున్నాడని నేను వివరించాను.
ఇంతలో, మరో స్త్రీ నన్ను తన ఇంటి దగ్గర ఆపేందుకు సిద్ధమై ఉంది. ఆమె మొత్తం 12 మంది స్త్రీలను ఆహ్వానించిందని నేను అక్కడికి చేరుకున్నప్పుడు కనుగొన్నాను. వ్యతిరేకత వస్తుందని నేను ఎదురుచూశాను, కనుక, ఏది సంభవించినా ఎదుర్కోవడానికి నాకు జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇవ్వమని నేను యెహోవాకు ప్రార్థన చేశాను. ఆ స్త్రీకి అనేక ప్రశ్నలుండినవి, మరి కొందరు అభ్యంతరం కలిగించారు, కాని నేను లేఖనాధారిత జవాబులను ఇవ్వగలిగాను. నేను బయలుదేరడానికి లేచి నిలబడినప్పుడు, ఆ ఇంటి మహిళ మరుసటి రోజు మళ్ళీ రమ్మని నన్ను కోరింది. నేను సంతోషంగా ఆ ఆహ్వానాన్ని అంగీకరించాను. నేను, ఒక సహచరురాలు మరుసటి రోజు వెళ్ళినప్పుడు, ఆ స్త్రీలు అప్పటికే వేచివున్నారని మేము కనుగొన్నాం.
ఆ తర్వాత మా లేఖనాధార చర్చలు క్రమబద్ధంగా కొనసాగాయి, మరి అనేక బైబిలు పఠనాలు ఆరంభించబడ్డాయి. చాలా మంది స్త్రీలు, అలాగే వారి కుటుంబపువారు కచ్చితమైన జ్ఞానంలో అభివృద్ధిని సాధించారు. తరువాత, ఈ గుంపు మీటలీనీలో యెహోవాసాక్షుల క్రొత్త సంఘానికి కేంద్రంగా రూపొందింది.
యెహోవా నాకు మేలు చేస్తూ ఉన్నాడు
సంవత్సరాలుగా యెహోవాను సేవించాలనే నా భర్త ప్రయత్నాలకు, నా ప్రయత్నాలకు ఆయన ప్రతిఫలమిస్తున్నాడు. 1920లలో సేమాస్‌లో ఒకప్పుడు గుప్పెడు మందిగా ఉండిన యెహోవాసాక్షుల సంఖ్య ఇప్పుడు రెండు సంఘాలుగాను, 130 మంది ప్రచారకులున్న ఒక గుంపుగాను పెరిగింది. లెస్‌బోస్ దీవిలో నాలుగు సంఘాలు, 430 మంది రాజ్య ప్రచారకులున్న ఐదు గుంపులు ఉన్నాయి. నా భర్త 1977లో మరణించే వరకు దేవుని రాజ్యాన్ని క్రియాశీలంగా ప్రకటించాడు. మేము సహాయపడినవారు ఇప్పటికి పరిచర్యలో ఆసక్తిగా ఉండడాన్ని చూడడం ఎంతటి ఆధిక్యత! అవును, వారి పిల్లలు, మనమళ్ళు, మునిమనమళ్ళు అందరూ కలిసి యెహోవాను ఐక్యంగా ఆరాధిస్తున్న గొప్ప సమూహమయ్యారు!
70 కంటే ఎక్కువ సంవత్సరాలుగా క్రైస్తవ సేవలో కొనసాగుతున్న నా జీవితం అంత సులభమైనదేమీ కాదు. అయినప్పటికీ, యెహోవా సాటిలేని కోటయై ఉన్నాడు. వయస్సు మీద పడడంవల్ల, ఆరోగ్యం క్షీణించడం వల్ల, నేను పక్క మీదే ఉంటున్నాను. నేను ప్రకటన పనిలో చాలా కొంచెమే చేయగలుగుతున్నాను. కాని, ‘నీవే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడవు’ అని కీర్తనల రచయిత చెప్పినట్లుగా నేను కూడా యెహోవాతో చెప్పగలను.—కీర్తన 91:2.
(ఈ శీర్షిక సిద్ధం చేస్తున్న సమయంలో సహోదరి మాక్రీస్ చనిపోయారు. ఆమెకు పరలోక నిరీక్షణ ఉంది.)
[26వ పేజీలోని చిత్రం]
1955లో తన భర్తతో
[26వ పేజీలోని చిత్రం]
1997 జనవరికల్లా సహోదరి మాక్రీస్‌కు 100 సంవత్సరాలు వచ్చివుండేవి