ఈ 101వ గిలియడ్ తరగతి—సత్‌క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నారు
మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు సత్‌క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాగే ఆసక్తి కలిగి ఉన్నాడు. మన మాదిరికర్తగా, తనకు దేవుడిచ్చిన నియామకాన్ని నెరవేర్చుట ద్వారా యేసు ఆసక్తిని చూపాడు, అందులో “సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించు”కోవడం కూడా ఇమిడివుంది. (తీతు 2:14) వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 101వ తరగతికి చెందిన 48 మంది విద్యార్థులు సత్‌క్రియలందు తమకుగల ఆసక్తిని నిశ్చయంగా ప్రదర్శించారు. ఈ మిషనరీల కొరకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం న్యూయార్క్‌నందలి పాటర్సన్లోని వాచ్‌టవర్ విద్యా కేంద్రంలో, 1996 సెప్టెంబరు 7న జరుపబడింది.
ఆసక్తితో ఉండేందుకు ఆచరణాత్మకమైన సలహాలు
పూర్తికాల పరిచర్యలో దాదాపు 70 సంవత్సరాలు గడిపిన, పరిపాలక సభ సభ్యుల్లో ఒకరైన కేరీ బార్బర్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు. తన ప్రారంభ వ్యాఖ్యానాల్లో, సహోదరుడు బార్బర్ “లోకమునకు వెలు”గైయున్న యేసు యొక్క ప్రకటన మరియు బోధన కార్యక్రమం వైపుకు అవధానాన్ని మళ్లించాడు. (యోహాను 8:12) యేసు ఆ ఘనమైన పాత్రను తనకు మాత్రమే ఉంచుకోలేదు గానీ తన శిష్యులు కూడా తమ వెలుగును ప్రకాశింపజేయాలని యేసు వారిని పురికొల్పాడని ఆయన సూచించాడు. (మత్తయి 5:14-16) ఈ సేవాధిక్యత ఒక క్రైస్తవుని జీవితానికి అర్థాన్ని చేకూర్చుతుంది మరియు “వెలుగు సంబంధులవలె నడుచుకొ”నే వారందరి భుజస్కంధాలపై ఒక బరువైన బాధ్యతను అది ఉంచుతుంది.—ఎఫెసీయులు 5:10.
ఆ ప్రారంభ వ్యాఖ్యానాల తర్వాత, బ్రూక్లిన్ ముఖ్య కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ కార్యాలయానికి చెందిన డాన్ ఆడమ్స్ వేదికపైకి ఆహ్వానింపబడ్డాడు. “ముందుకే గానీ వెనక్కి వెళ్లడం లేదు” అనే అంశంపై ఆయన ప్రసంగించాడు. విదేశీ ప్రాంతాల్లో సువార్త ప్రకటనాపని కొరకు ఉద్దేశించబడిన గిలియడ్ పాఠశాలపై, దాని సంకల్పంపై సహోదరుడు ఆడమ్స్ అవధానాన్ని మళ్లించాడు. ప్రపంచమంతటా 300 కంటే ఎక్కువ భాషల్లో బైబిలు సాహిత్యాలను ప్రచురించిన దేవుని సంస్థ యొక్క పురోభివృద్ధిని గురించి ఆయన మాట్లాడాడు. 1995లో ప్రచురించబడిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం 111 భాషల్లో లభ్యం చేయబడింది, ఇంకా ఎక్కువ భాషల్లో ప్రచురింపబడేందుకు ఏర్పాటు చేయబడింది. యేసు క్రొత్త శిష్యులు కేవలం కొన్ని నెలల్లోనే సమర్పించుకుని బాప్తిస్మం తీసుకునే స్థాయికి చేరుకునేందుకు సహాయం చేయడంలో అదెంతో కీలకపాత్ర వహించింది. కావున క్రొత్త మిషనరీలు తమ పని కొరకు ఇటీవలి బైబిలు అధ్యయన సహాయకాలను కలిగి ఉంటారు.
తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన లైమన్ స్వింగిల్, ప్రకటన 7:15పై ఆధారపడి “యెహోవాకు మీ పవిత్ర ఆరాధనను చెల్లిస్తూ ఉండండి” అనే అంశంపై మాట్లాడాడు. యెహోవా తానే సంతోషంగల దేవుడు గనుక, ఆయన్ను ఎడతెగక సేవించడమే ఒకన్ని సంతోషభరితున్ని చేస్తుంది. (1 తిమోతి 1:11, NW) ఈ ఆనందమయమైన సేవ మూలంగా, భూమి నలుమూలల ఉన్న గొప్పసమూహపు సభ్యులు ఆయన ఆరాధికులు అవుతున్నారు. గతించిన సంవత్సరాల్లో, గిలియడ్ పాఠశాలలో తర్ఫీదు పొందిన వారు, ఈ గొప్పసమూహంలోని అనేకులు సత్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందేందుకు సహాయం చేయడంలో భాగంవహించారు. కాబట్టి, విస్తరిస్తున్న గొప్పసమూహంలోని అనేకమంది సభ్యులను సమకూర్చేందుకు ఇప్పుడు పంపబడుతున్న వారిని కూడా యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడని విశ్వసించేందుకు మనకు ప్రతి కారణమూ ఉంది.
“యెహోవా ఆనందాన్ని ప్రతిబింబించడం” అనేది డేనియల్ సిడ్లిక్ ఉన్నతపర్చిన ముఖ్యాంశం, ఆయన కూడా పరిపాలక సభ సభ్యుడే. క్రొత్త మిషనరీలతో సహా, దేవుని సేవకులందరు కూడా, నిత్యజీవానికి మార్గాన్ని మరియు ఇప్పుడు జీవితంలో శ్రేష్ఠమైన దాన్ని కనుగొనే మార్గాన్ని ప్రజలకు బోధించే ఆధిక్యతను కలిగివున్నారు. “బోధించడం అనేది మనకు మనమే ప్రయోజనాన్ని కలిగించుకునే వృత్తి” అని సహోదరుడు సిడ్లిక్ పేర్కొన్నాడు. “అది బోధించే ప్రజల ముఖాల్లో అలాగే నేర్చుకునే ప్రజల ముఖాల్లో ప్రతిబింబించబడుతుంది.” (కీర్తన 16:8-11) “భూమ్మీద అత్యంత గొప్ప వర్తమానాన్ని మనం కలిగి ఉన్నాము, దాన్ని చూపేది మన ముఖమే” అని చెప్పిన ఎస్టోనియా నందలి ఒక మిషనరీ గురించి ఆయన ఉదాహరించాడు. మన ముఖ కవళిక అనేక అవకాశాలను కలిగించగలదు, ఆసక్తిని రేకెత్తించగలదు. యెహోవా సేవకులు ఎందుకంత సంతోషంగా ఉంటారో ప్రజలు తెలుసుకొనగోరతారు. “కాబట్టి మీ ముఖకవళికకు అవధానమివ్వండి” అని సహోదరుడు సిడ్లిక్ సలహా ఇచ్చాడు. “సంతోషంగా ఉన్న వారిని చూసి ప్రజలు ఆనందిస్తారు.”
“మీ ప్రాణాలను సహనముతో కాపాడుకోండి” అని సభికులనుద్దేశించి ఉలిసీజ్ గ్లాస్ ప్రసంగించాడు. 1949లో 12వ తరగతి నుండి గిలియడ్ విద్యార్థులకు ఉపదేశాన్ని ఇవ్వడంలో ఆయన భాగంవహించాడు. సహనం అంటే ఏమిటి? దేని కొరకైనా శాంతంగా వేచి ఉండడం, రెచ్చగొట్టబడినప్పుడు లేక ఒత్తిడి తలెత్తినప్పుడు సంయమాన్ని చూపడం అనే భావాన్ని కలిగివుంది. సహనంగల వ్యక్తి శాంతంగా ఉంటాడు; అసహనంగల వ్యక్తి తొందరపడతాడు, విసుగుచెందుతాడు. “సహనం బలహీనతను లేక అస్థిరతను సూచిస్తుందని అనేకులు భావిస్తారు అయితే యెహోవా దృష్టిలో అది బలానికి మరియు సంకల్పానికి సూచన” అని సహోదరుడు గ్లాస్ పేర్కొన్నాడు. (సామెతలు 16:32) సహనం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? “కోపం వచ్చిన క్షణంలో సహనాన్ని చూపడం వంద రోజులు అనుభవించే దుఃఖం నుండి మిమ్మల్ని కాపాడుతుంది” అని ఒక చైనీస్ సామెత చెబుతుంది. “సహనం ఒకరి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. వాస్తవానికి, అది ఇతర మంచి లక్షణాలకు శాశ్వతంగా ఉండే మెరుగును పెడుతుంది. అది విశ్వాసాన్ని కోరదగినదిగా, శాంతిని దీర్ఘకాలం ఉండగల్గేదిగా మరియు ప్రేమను స్థిరమైన దానిగా చేస్తుంది” అని సహోదరుడు గ్లాస్ వ్యాఖ్యానించాడు.
“యెహోవా దేవుని నుండి ఆయన సంస్థ ద్వారా ఒక నియామకాన్ని అందుకోవడం అంటే ఒక ఆధిక్యతే” అని మార్క్ నూమర్ పేర్కొన్నాడు. ఆయన కెన్యాలో 11 సంవత్సరాలు మిషనరీగా సేవ చేసి, ఇప్పుడు గిలియడ్ ఉపదేశకునిగా ఉన్నాడు. “మీకు విశ్వాసం లేకపోతే ఎంతోకాలం కొనసాగలేరు” అనే తన మూలాంశాన్ని గురించి మాట్లాడుతూ సహోదరుడు నూమర్ యూదాకు చెందిన రాజైన ఆహాజు మాదిరి వైపుకు అవధానాన్ని మళ్లించాడు. రాజుకు అతని నియామకం విషయంలో యెహోవా మద్దతునిస్తాడని యెషయా అభయమిచ్చాడు, అయినప్పటికీ ఆహాజు ఆయనయందు నమ్మికయుంచడంలో విఫలమయ్యాడు. (యెషయా 7:2-9) అటు పిమ్మట సహోదరుడు నూమర్ మిషనరీలు మాత్రమే కాకుండా మనందరం కూడా మన దైవపరిపాలనా నియామకాల్లో చిరకాలం కొనసాగేందుకు యెహోవాయందు నమ్మికయుంచాలనే విషయాన్ని సూచించాడు. మిషనరీ నియామకంలోని కొన్ని నిర్దిష్టమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు దృఢమైన విశ్వాసం అవసరం. “ఈ ప్రస్తుత విధానంలో ఎక్కడా కూడా పరిపూర్ణమైన పరిస్థితి లేదనే విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి” అని సహోదరుడు నూమర్ పేర్కొన్నాడు.
ఆసక్తితో కూడిన కార్యాన్ని ప్రోత్సహించే అనుభవాలు
తమ గిలియడ్ తర్ఫీదు సమయంలో విద్యార్థులు ప్రతి వారాంతమందు బహిరంగ పరిచర్యలో సమయాన్ని గడిపారు, అది కూడా తమ మిషనరీ నియామకంలో ముఖ్య విషయంగా ఉంటుంది. గిలియడ్ విభాగం సభ్యుడైన వాలేస్ లివరన్స్ 15 మంది విద్యార్థులను పరిచయం చేశాడు, వారు తమ అనుభవాలను చెప్పారు. అటు పిమ్మట సేవా శాఖ కమిటీకి చెందిన లీయన్ వీవర్ మరియు బేతేలు కార్యకలాపాల కమిటీకి చెందిన లాన్ స్టిల్లింగ్ ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాల బ్రాంచి కమిటీ సభ్యులను పరిచయం చేశారు, వారు మిషనరీ క్షేత్రం నుండి వచ్చిన కొన్ని అనుభవాలను చెప్పారు, అలాగే పట్టభద్రులౌతున్న మిషనరీలకు చక్కని సలహాలను కూడా ఇచ్చారు. సియరా లియోన్నందు, 1995 సేవా సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది మిషనరీలద్వారా మద్దతు పొందిన వారేనన్న విషయం పేర్కొనబడింది. ఆసక్తితో కూడిన కార్యకలాపానికి ఎంత చక్కని రికార్డో కదా!
చివరలో, సొసైటీ అధ్యక్షుడైన మిల్టన్ హెన్షెల్ 2,734 మంది ప్రేక్షకులతో “యెహోవా యొక్క దృశ్య సంస్థ ఎంతో అపూర్వమైనది” అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. దేవుని సంస్థను సాటిలేని దానిగా ఏది చేస్తుంది? దాని పరిమాణం కాదు, దాని శక్తి కాదు గానీ అది దేవుని నీతియుక్తమైన కట్టడలనుబట్టి, న్యాయ విధులనుబట్టి నడిపింపబడుతుందన్న వాస్తవమే. ప్రాచీన కాలాల్లో యెహోవా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఆయన పవిత్ర ఉపదేశాలు అప్పగింపబడ్డాయి, అవే ఆ జనాంగాన్ని ప్రత్యేకమైనదిగా చేశాయి. (రోమీయులు 3:1, 2) నేడు, యెహోవా సంస్థ యేసుక్రీస్తు నడిపింపు క్రింద పని చేస్తుండగా అది ఐక్యమైవుంది. (మత్తయి 28:19, 20) అది వర్ధిల్లుతోంది, పెరుగుతోంది. ప్రాముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు దేవుని వాక్యమైన బైబిలును సంప్రదించే పరిపాలకసభను కలిగి ఉన్న సంస్థ మరొకటి ఏదైనా ఈ భూమిపై ఉందా? వీటిలోను మరితర విషయాల్లో యెహోవా దృశ్య సంస్థ నిజంగా ప్రత్యేకంగా ఉంది.
పట్టాలు ఇవ్వడంతోను ఈ ప్రత్యేక తర్ఫీదు విషయమై తరగతి అందించిన ప్రశంసాలేఖను చదవడంతోను ఆ ఉత్సాహవంతమైన కార్యక్రమం ముగిసింది.
[22వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించిన దేశాలు: 9
నియమించబడిన దేశాలు: 12
విద్యార్థుల సంఖ్య: 48
సగటు వయస్సు: 31.7
సత్యమందు సగటు సంవత్సరాలు: 13.8
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 9.8
[23వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 101వ పట్టభద్రుల తరగతి
ఈ క్రింది లిస్టులో, వరుసలు ముందు నుండి వెనక్కి లెక్కించబడుతున్నాయి మరియు ప్రతి వరుసలోను పేర్లు ఎడమ నుండి కుడికి పేర్కొనబడ్డాయి.
(1) స్విన్ట్, హెచ్.; జజిన్స్కీ, ఎ.; హైఫీల్డ్, ఎల్.; మేర్కాడో, ఎస్.; డీల్, ఎ.; ఛావేజ్, వి.; స్మిత్, జె.; సలీనియస్, ఎస్. (2) కర్ట్జ్, డి.; క్లార్క్, సి.; లీస్బార్న్, జె.; మార్టన్సన్, డబ్ల్యు.; బ్రమాలీ, ఎ.; టాయ్కా, ఎల్.; మార్టన్, ఎ.; స్మిత్, డి. (3) జజిన్స్కీ, డి.; బ్యెర్గార్, ఎల్.; గారఫలో, బి.; కల్దల్, ఎల్.; ఛావేజ్, ఈ.; ఫ్రూడింగ్, ఎస్.; ఖాన్, ఆర్.; సలీనియస్, ఆర్. (4) స్విన్ట్, బి.; బ్యెర్గార్, ఎమ్.; గారఫలో, పి.; హామ్బ్లాడ్, ఎల్.; కైసర్, ఎమ్.; ఫ్రూడింగ్, టి.; పాల్ఫ్రీమాన్, జె.; పాల్ఫ్రీమాన్, డి. (5) మింగ్వేస్, ఎల్.; లీస్బార్న్, ఎమ్.; మేర్కాడో, ఎమ్.; కర్ట్జ్, ఎమ్.; డీల్, హెచ్.; టాయ్కా, జె.; క్లార్క్, ఎస్.; ఖాన్, ఎ. (6) మింగ్వేస్, ఎఫ్.; మార్టన్, బి.; హైఫీల్డ్, ఎల్.; హామ్బ్లాడ్, బి.; బ్రమాలీ, కె.; కల్దల్, హెచ్.; మార్టన్సన్, పి.; కైసర్, ఆర్.