“పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి”—ఎందుకు?
“పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.” అపొస్తలుడైన పౌలిచ్చిన ఈ ఉద్బోధ దాదాపు సా.శ. 61లో వ్రాయబడి, యూదయలోని హెబ్రీ క్రైస్తవులకు పంపబడింది. (హెబ్రీయులు 10:32) ఇలా చెప్పడానికి ఏది ప్రేరణనిచ్చింది? యెహోవా యొక్క మొదటి శతాబ్దపు ఆరాధికులు తమ గతాన్ని మరువకుండా ఉండవలసిన అవసరం ఎందుకు ఉంది? మనం కూడా నేడు అలాంటి జ్ఞాపికను అనుసరించడంవల్ల ప్రయోజనం పొందగలమా?
శతాబ్దాలుగా, గతాన్ని నిర్లక్ష్యం చేయడం లేదా దానికి శ్రద్ధ ఇవ్వకపోవడానికి వ్యతిరేకంగా బైబిలు రచయితలు మళ్ళీమళ్ళీ హెచ్చరించారు. మునుపటి కాలాలను, సంఘటనలను మనస్సులో ఉంచుకుని, వాటిని గూర్చి తలంచాలి. “చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు” అని యెహోవా కూడా చెప్పాడు. (యెషయా 46:9) ఈ ఉద్బోధను అనుసరించవలసిన మూడు బలీయమైన కారణాలను మనం పరిశీలిద్దాం.
ప్రేరణ మరియు ప్రోత్సాహం
మొదటిగా, ఇది ప్రేరణకు ప్రోత్సాహానికి ఆధారం కాగలదు. పౌలు హెబ్రీ సంఘానికి ఉత్తరం వ్రాసినప్పుడు, యూదుల నుండి వస్తున్న వ్యతిరేకత వల్ల ప్రతిరోజు తమ విశ్వాసం పరీక్షకు గురౌతున్న తోటి క్రైస్తవులకు వ్రాస్తున్నాడు. సహనాన్ని పెంపొందించుకోవలసిన వారి అవసరతను గుర్తించిన పౌలు ఈ విధంగా వ్రాశాడు: “మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.” (హెబ్రీయులు 10:32) ఆత్మీయ యుద్ధంలో తమ నమ్మకత్వాన్ని గూర్చిన పూర్వపు చర్యలను జ్ఞాపకం చేసుకోవడం తమ పరుగును పూర్తి చేసేందుకు కావలసిన ధైర్యాన్ని వారికిస్తుంది. అదే విధంగా, “దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి” అని ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. (యెషయా 46:8) “నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది [మొదట నీకుండిన ప్రేమ] జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము” అని యేసుక్రీస్తు ఎఫెసులోని సంఘానికి చెప్పినప్పుడు సాదృశ్యమైన కోరదగిన ఫలితం మనస్సులో ఉండింది.—ప్రకటన 2:4, 5.
యెహోవా ఎడల భయరహితమైన యథార్థతను చూపించమని ఆ జనాంగాన్ని మోషే కోరినప్పుడు తన ప్రసంగాల్లో తరచూ “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము” అనే ఉద్బోధ పునరావృతమయ్యే విషయంగా ఉండేది. (ద్వితీయోపదేశకాండము 32:7) ద్వితీయోపదేశకాండము 7:17,19 నందు “వారికి [కనానీయులకు] భయపడకుము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని . . . జ్ఞాపకము చేసికొనుము” అని వ్రాయబడిన ఆయన మాటలను గమనించండి. తన ప్రజల పక్షాన యెహోవా గైకొనిన రక్షణ చర్యలను గుర్తు చేసుకోవడం దేవుని నియమాలను నమ్మకంగా పాటించడంలో కొనసాగేందుకు ప్రేరణగా ఉండగలదు.—ద్వితీయోపదేశకాండము 5:15; 15:15.
విచారకరంగా, ఇశ్రాయేలీయులు తరచూ మరవడమనే పాపానికి లొంగిపోయారు. ఏ ఫలితంతో? “మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.” (కీర్తన 78:41, 42) చివరికి యెహోవా ఆజ్ఞలను వాళ్ళు మరిచిపోవడం ఆయనచేత నిరాకరించబడడానికి కారణమైంది.—మత్తయి 21:42, 43.
“యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును” అని వ్రాసిన కీర్తనల రచయిత మంచి మాదిరినుంచాడు. (కీర్తన 77:11, 12) గతంలో చేసిన రాజసేవ మరియు యెహోవా ప్రేమపూర్వక చర్యలను జ్ఞాపకం చేసుకుని, ధ్యానించడం మనకు కావలసిన, పేర్రణను, ప్రోత్సాహాన్ని, మెప్పుదలను ఇస్తుంది. అలాగే, “పూర్వపు దినాలను గుర్తుచేసుకోవడం” అలసటను పారద్రోలేందుకు అలాగే, నమ్మకంగా సహించేందుకు మనం చేయగల్గేదంతా చేసేందుకు సహాయపడుతుంది.
గతకాల తప్పులనుండి నేర్చుకోవడం
రెండవది, మరిచిపోకపోవడం అనేది గత కాల తప్పులనుండి, వాటి పర్యవసానాల నుండి నేర్చుకొనే మార్గం కాగలదు. దీనిని మనస్సులో పెట్టుకుని మోషే ఇశ్రాయేలీయులకు ఈ విధంగా ఉపదేశించాడు: “అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.” (ద్వితీయోపదేశకాండము 9:7) ఇశ్రాయేలీయుల అవిధేయత ఫలితంగా, మోషే సూచించినట్లు ‘వారి దేవుడైన యెహోవా వారిని నలువది సంవత్సరములు అరణ్యములో నడిపించాడు.’ వారు దానిని గుర్తు చేసుకోవాలని ఎందుకు ప్రోత్సహించబడ్డారు? వారు ‘ఆయన మార్గములలో నడుచుకొనేలా ఆయనకు భయపడేలా వారి దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనేలా’ వారిని సాత్వికులనుగా చేసేందుకు, వారి తిరుగుబాటు ప్రవర్తనలను సరిదిద్దుకునేలా సహాయపడేందుకే అలా ప్రోత్సహించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 8:2-6) వారు తమ గత తప్పులను పునరావృతం చెయ్యకూడదనే భావంలో వారు నేర్చుకోవలసి ఉండింది.
“సూక్ష్మబుద్ధిగల వ్యక్తి వ్యక్తిగత అనుభవం నుండి, బుద్ధిగల వ్యక్తి ఇతరుల అనుభవం నుండి ప్రయోజనం పొందుతాడు” అని ఒక రచయిత అభిప్రాయపడ్డాడు. తమ సొంత తప్పులను పరిశీలించడం ద్వారా ప్రయోజనం పొందమని ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే ఆహ్వానించగా, అపొస్తలుడైన పౌలు ఇతరులను అంటే, తొలి శతాబ్దపు కొరింథీ సంఘాన్ని, అలాగే నేడు మనలను అదే చారిత్రాత్మక వృత్తాంతం నుండి పాఠం నేర్చుకోమని ఉద్బోధించాడు. ఆయన ఈ విధంగా వ్రాశాడు: “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.” (1 కొరింథీయులు 10:11, ఇటాలిక్కులు మావి.) “లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి” అని చెప్పినప్పుడు మరో బైబిలు సంఘటన మరియు దాని నుండి నేర్చుకోవలసిన అవసరత యేసుక్రీస్తు మనస్సులో ఉండింది. (లూకా 17:32; ఆదికాండము 19:1-26) “మనుష్యులు చరిత్ర నుండి నేర్చుకోగలిగితే అది మనకు ఎంత చక్కని పాఠాలను నేర్పిస్తుందో!” అని ఆంగ్ల కవి మరియు మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడునైన సామ్యేల్ టైలర్ కోల్రిజ్డ్ వ్రాశాడు.
నమ్రత, కృతజ్ఞత
మూడవదిగా, జ్ఞాపకం చేసుకోవడం అనేది దేవునిని ప్రీతిపరచే నమ్రత, కృతజ్ఞత అనే గుణాలను మనలో కలుగజేస్తుంది. ప్రపంచవ్యాప్త ఆత్మీయ పరదైసులోని అనేక కారకాల్లో మనం ఆనందిస్తుండగా అవి కొన్ని నిర్మాణాత్మక అవరోధాలపై ఆధారపడివున్నాయని మనమెన్నడూ మరువకూడదు. వీటిలో దశాబ్దాల క్రితం అనేక దేశాల్లో పనిని ఆరంభించిన మన క్రైస్తవ సహోదర సహోదరీలు చూపించిన యథార్థత, ప్రేమ, స్వయం త్యాగం, ప్రతికూల సమయాల్లో ధైర్యం, దీర్ఘశాంతము మరియు విశ్వాసం అనే గుణాలు ఇమిడి ఉన్నాయి. మెక్సికోలోని దేవుని ప్రజల ఆధునిక దిన చరిత్రపై వ్యాఖ్యానాన్ని ముగిస్తూ యెహోవాసాక్షుల 1995 వార్షిక పుస్తకం (ఆంగ్లం) ఈ విధంగా చెప్పింది: “యెహోవాసాక్షులతో ఇటీవల సహవసిస్తున్న వ్యక్తులకు మాత్రమే మెక్సికోలో పని ఆరంభించడంలో పాల్గొన్నవారికి కలిగిన శోధనలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆత్మీయ ఆహారం సమృద్ధిగా ఉన్న, దైవభయంగల లక్షలాది మంది సహవాసులు ఉన్న దేవుని సేవ చక్కగా సంస్థీకరించబడిన పద్ధతిలో జరుగుతున్న ఆత్మీయ పరదైసుకు వారు అలవాటుపడ్డారు.”
ఆ మొదటి కార్యదర్శకులు తరచూ ఒంటరిగా లేదా చిన్న ఒంటరి గుంపుల్లో పని చేసేవారు. వారు రాజ్య వర్తమానాన్ని ప్రకటించడంలో నిలకడగా ఉండగా వారు ఒంటరితనాన్ని, నిస్సత్తువను, యథార్థతా సంబంధమైన మరితర తీవ్రమైన శోధనలను ఎదుర్కున్నారు. ఈ పూర్వపు కాలాల్లోని ఈ సేవకుల్లో చాలా మంది భౌమిక రంగం నుండి వీడుకోలు తీసుకున్నప్పటికీ, యెహోవా ఆ నమ్మకమైనవారి సేవను మరిచిపోడని తెలుసుకోవడం ఎంత హృదయానందకరమైన విషయం! “మీరు చేసిన కార్యమును . . . తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని వ్రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు దీనిని రూఢి చేశాడు. (హెబ్రీయులు 6:10) యెహోవా దేవుడు మెప్పుదలతో జ్ఞాపకం చేసుకునేటట్లయితే, మనం కూడా కృతజ్ఞతా స్ఫూర్తితో గుర్తుంచుకోవద్దా?
సత్యాన్ని క్రొత్తగా తెలుసుకున్నవారు ఈ చారిత్రాత్మక సంభవాలను యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకం ద్వారా తెలుసుకోగలరు.a ఇంకా, ఎంతో కాలంగా సేవ చేస్తున్న వృద్ధ సహోదర సహోదరీలు సభ్యులుగా ఉన్న ఒక కుటుంబానికి లేదా క్రైస్తవ సంఘానికి చెందినవారమయ్యేందుకు మనం ఆధిక్యత పొందినట్లయితే, “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు” అనే ద్వితీయోపదేశకాండము 32:7 స్ఫూర్తిలో మనం ఉద్బోధించబడతాము.
అవును, మునుపటి దైవిక భక్తి క్రియలను గుర్తు చేసుకోవడం మన క్రైస్తవ సేవలో ఆనందంగా సహించడంలో కొనసాగేందుకు మనలను పురికొల్పగలదు. అంతేకాకుండా, మనం నేర్చుకోవలసిన పాఠాలు చరిత్రలో ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించిన ఆత్మీయ పరదైసుపై ధ్యానించడం గౌరవం మరియు కృతజ్ఞత అనే గుణాలు కలగడాన్ని వృద్ధిచేస్తుంది. నిజంగా, “పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.”
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారు ప్రచురించినది.