కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 11/1 పేజీలు 28-31
  • యెహోవాకు ఎందుకివ్వాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు ఎందుకివ్వాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యారాధనలో ముఖ్య భాగం
  • మనమెందుకు ఇస్తాం
  • ఇచ్చే స్ఫూర్తిని చూపించడం ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి
  • రాజ్య ప్రచారసేవకు కొందరెలా విరాళాలిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “మీ విలువైనవాటితో యెహోవాను ఘనపరచండి”—ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “ప్రతి శ్రేష్ఠమైన యీవియు” యిచ్చేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • “డబ్బు ఎక్కడనుండి వస్తుంది?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 11/1 పేజీలు 28-31

యెహోవాకు ఎందుకివ్వాలి?

సీదోను పట్టణమైన సారెపతు మీదకు సూర్యుడు ఉదయించినప్పుడు ఒక విధవరాలు వంగి కట్టెలు ఏరుకుంటోంది. తను, చిన్నవాడైన తన కుమారుడు తినబోయే కొద్దిపాటి ఆహారాన్ని—బహుశా చివరి భోజనాన్ని తయారు చేసేందుకు ఆమె పొయ్యి వెలిగించవలసి ఉంది. సుదీర్ఘంగా ఉన్న కరువు కాలంలో ఆమె తనను తన కుమారున్ని కాపాడుకునేందుకు చాలా శ్రమపడింది, చివరికి ఈ దుస్థితి వచ్చింది. వాళ్ళు పస్తులు ఉంటున్నారు.

ఒక మనిషి దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు ఏలీయా, మరి వెంటనే ఆ స్త్రీ ఆయన యెహోవా ప్రవక్త అని గ్రహించింది. ఆమె ఈ దేవుని గురించి విన్నట్లు అనిపిస్తుంది. తన దేశమైన సీదోనులో ప్రబలివున్న దుష్టమైన, కుటిలమైన ఆరాధనను పొందే బయలు నుండి యెహోవా భిన్నమైనవాడు. కనుక త్రాగడానికి నీళ్ళు ఇవ్వమని ఏలీయా అడిగినప్పుడు సహాయం చేసేందుకు ఆమె చాలా ఆతురపడింది. బహుశా అలా చేయడంవల్ల తాను యెహోవా అనుగ్రహాన్ని పొందగలదని ఆమె భావించి ఉండవచ్చు. (మత్తయి 10:41, 42) అయితే ఏలీయా ఎక్కువే అడిగాడు—అంటే కొంచెం ఆహారం ఇవ్వమని కూడా అడిగాడు. చివరి భోజనానికి కావలసినంత ఆహారపదార్థమే ఉందని ఆమె వివరించి చెప్పింది. అయినప్పటికీ, కరువు తీరే వరకు యెహోవా ఆమెకు అద్భుతంగా ఆహారాన్నిస్తాడని అభయమిస్తూ ఏలీయా పట్టుపట్టాడు. ఆమె ఏమి చేసింది? ‘ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేసింది’ అని బైబిలు చెబుతుంది. (1 రాజులు 17:10-15) ఈ సరళమైన మాటలు ఒక గొప్ప విశ్వాసపు పనిని—చాలా గొప్ప పనిని వర్ణించాయి, నిజానికి దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ఆ విధవరాలిని ప్రశంసించాడు!—లూకా 4:25, 26.

అలాగైనప్పటికీ, ఎంతో లేమిగల స్త్రీ నుండి ఎంతో ఎక్కువగా యెహోవా అడగడం వింతగా అనిపించవచ్చు. అత్యంత ప్రముఖుడైన ఒక మనిషి చేసిన ప్రార్థనను మనం పరిశీలించినప్పుడు అది ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆలయ నిర్మాణంలో తన కుమారుడైన సొలొమోను ఉపయోగించేందుకు దావీదు రాజు విరాళాలను సేకరించడం గొప్ప దాతృత్వాన్ని పురికొల్పింది. ఆధునిక లెక్కల ప్రకారం ఆ కానుకలు కోట్లకొలది డాలర్ల విలువైనవి! అయినప్పటికీ, “మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము” అని దావీదు యెహోవాకు చేసిన ప్రార్థనలో అన్నాడు. (1 దినవృత్తాంతములు 29:14) దావీదు చెప్పినట్లు ప్రతిదీ యెహోవాకు చెందినదే. కనుక స్వచ్ఛారాధన పురోగతి చెందేందుకు మనం ఇవ్వవలసి వచ్చినప్పుడెల్లా మనం అప్పటికే యెహోవాదైన దానినే మనం తిరిగి ఇస్తున్నాం అంతే. (కీర్తన 50:10) అలా, ఇవ్వడానికి మొదటి స్థానాన్నివ్వాలని యెహోవా ఎందుకు మనలను కోరుకుంటున్నాడు? అనే ప్రశ్న తలెత్తుతుంది.

సత్యారాధనలో ముఖ్య భాగం

సరళమైన జవాబేమంటే, ఆదిమ కాలాల నుండి ఇవ్వడమనేది స్వచ్ఛారాధన యొక్క ముఖ్య భాగంగా యెహోవా చేశాడు. నమ్మకస్థుడైన మనిషియైన హేబెలు తన పశు సంపద నుండి కొంత యెహోవాకు బలియర్పించాడు. పితరులైన నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మరియు యోబు అలాంటి బలులను అర్పించారు.—ఆదికాండము 4:4; 8:20; 12:7; 26:25; 31:54; యోబు 1:5.

మోషే ధర్మశాస్త్రం యెహోవాకు ప్రతిష్ఠార్పణం చేయాలని ఆజ్ఞాపించడమూ దాన్ని చట్టం చేయడమూ కూడా చేసింది. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులందరూ దశమభాగాన్ని లేదా భూమి ఇచ్చిన పంటలోని అలాగే తమ పశుసంపద సమృద్ధిలోను పదవ భాగాన్ని విరాళంగా ఇవ్వాలని ఆజ్ఞాపించబడింది. (సంఖ్యాకాండము 18:25-28) వేరే ప్రతిష్ఠార్పణలను గూర్చి అంత కచ్చితంగా చట్టం చేయబడలేదు. ఉదాహరణకు, ప్రతి ఇశ్రాయేలీయుడు తన పశుసంపదలోని పంటలోని ప్రథమ ఫలాన్ని యెహోవాకివ్వాలని చెప్పబడింది. (నిర్గమకాండము 22:29, 30; 23:19) అయినప్పటికీ, ఒక వ్యక్తి తనకున్న శ్రేష్ఠమైనదానిని అర్పించినంత మేరకు, అతడు ప్రథమ ఫలాన్ని ఎంత ఇవ్వవాలని నిశ్చయించుకునే విషయం ధర్మశాస్త్రం వ్యక్తులకే విడిచిపెట్టింది. కృతజ్ఞతా స్తుతులను మ్రొక్కుబడులను చెల్లించే విషయాలను కూడా ధర్మశాస్త్రం నిర్దేశించింది, అయితే అవి పూర్తిగా స్వచ్ఛందంగా చేసే విషయాలు. (లేవీయకాండము 7:15, 16) యెహోవా తాను ఆశీర్వదించిన దానిని బట్టి ఇవ్వమని ప్రజలను పురికొల్పాడు. (ద్వితీయోపదేశకాండము 16:17) గుడార నిర్మాణ సమయంలోను దాని తర్వాత ఆలయ నిర్మాణ సమయంలోనూ ప్రతి ఒక్కరు తమ హృదయాలు పురికొల్పిన మేరకు ఇచ్చారు. (నిర్గమకాండము 35:21; 1 దినవృత్తాంతములు 29:9) నిశ్చయంగా, అలాంటి స్వచ్ఛంద విరాళాలు యెహోవాకు అత్యంత ప్రీతికరం!

“క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద” ఇచ్చే ప్రతిదీ స్వచ్ఛందమే. (గలతీయులు 6:2; 2 కొరింథీయులు 9:7) దానర్థం క్రీస్తు అనుచరులు ఇవ్వడాన్ని మానివేశారని, లేదా తక్కువగా ఇచ్చారని కాదు. వాస్తవానికి దానికి భిన్నంగానే జరిగింది! యేసు మరియు ఆయన అపొస్తలులు ఇశ్రాయేలులో బోధించారు, స్త్రీల ఒక గుంపు వారిని వెంబడించి తమకున్న వాటన్నింటితో వారికి పరిచర్య చేశారు. (లూకా 8:1-3) అలాగే అపొస్తలుడైన పౌలు కానుకలను పొందాడు, అవి ఆయన మిషనరీ పనికి మద్దతునిచ్చాయి, అలా ఆయన అవసరతలో ఉన్న ఇతరులకు చందాలివ్వమని కొన్ని సంఘాలను ప్రోత్సహించాడు. (2 కొరింథీయులు 8:14; ఫిలిప్పీయులు 1:3-5) అందిన విరాళాలు అవసరతలో ఉన్నవారికి పంచబడుతున్నాయా అని నిశ్చయపరచుకునేందుకు బాధ్యతగల పురుషులను యెరూషలేములోని పరిపాలక సభ నియమించింది. (అపొస్తలుల కార్యములు 6:2-4) స్పష్టంగా, అలాంటి మార్గాల్లో స్వచ్ఛారాధనకు మద్దతునివ్వడమంటే అది ఒక ఆధిక్యతయని తొలి క్రైస్తవులు గ్రహించారు.

అయినప్పటికీ, ఇవ్వడమనేది తన ఆరాధనలో ఒక భాగంగా యెహోవా ఎందుకు చేశాడా అని మనం ఆశ్చర్యపోవచ్చు. నాలుగు కారణాలను పరిశీలించండి.

మనమెందుకు ఇస్తాం

మొదటిగా, ఇవ్వడమనేది సత్యారాధన భాగంగా యెహోవా చేస్తున్నాడు, ఎందుకంటే అలా చేయడం మనకు మంచిది. అది దేవుని మంచితనము ఎడల మనకున్న మెప్పుదలను తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఒక బిడ్డ తల్లి/తండ్రికి ఒక బహుమతిని కొనడమో తయారు చేయడమో చేస్తే ఆ తల్లి/తండ్రి ఎందుకు సంతోషంగా నవ్వుతారు? ఆ బహుమతి ఆ తల్లి/తండ్రి అత్యవసరతను తీరుస్తుందా, లేకపోతే వారి ఆ అవసరత తీరదా? చాలా మట్టుకు అలా కాదు. బదులు, తన బిడ్డ ప్రశంసించే స్ఫూర్తిని, ఇచ్చే స్ఫూర్తిని వృద్ధిచేసుకోవడాన్ని చూసి ఆనందిస్తారు. అలాంటి కారణాలవల్లే ఇవ్వమని యెహోవా మనలను ప్రోత్సహిస్తున్నాడు, మనమలా చేసినప్పుడు ఆయన ఆనందిస్తాడు. మనం ఆయన అపారమైన దయ మరియు మన ఎడల ఉన్న ఉదారతల ఎడల నిజమైన మెప్పుదలను చూపించేది ఇలాగే. ఆయన “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చేవాడు కనుక, ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు కారణాలు లేనివారం కాము. (యాకోబు 1:17) అంతేకాక, యెహోవా తన ఏకైక స్వకుమారుని ఇచ్చి, మనం నిరంతరం జీవించేందుకు చనిపోవడానికి ఆయనను అనుమతించాడు. (యోహాను 3:16) మనమెప్పుడైనా తగినంత కృతజ్ఞతలు ఆయనకు తెలిపామా?

రెండవది, మనం ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకుంటే, మనమలా ఒక ముఖ్యమైన విషయంలో యెహోవాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుకరించడానికి నేర్చుకుంటాము. యెహోవా ఎడతెగక ఇస్తున్నాడు, ఎడతెగని ఉదారతగలవాడు. బైబిలు చెబుతున్నట్లు ఆయన “జీవమును ఊపిరిని సమస్తమును” మనకు దయచేయువాడు. (అపొస్తలుల కార్యములు 17:25) మనం తీసుకునే ప్రతి ఊపిరికి, మనం ఆస్వాదించే ప్రతి ఆహారపు ముద్దకు, జీవితంలోని సంతోషకరమైన, సార్థకమైన ప్రతి నిమిషానికి మనం సరైన విధంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపవచ్చు. (అపొస్తలుల కార్యములు 14:17) యేసు తన తండ్రిలాగే ఇచ్చే స్ఫూర్తిని చూపించాడు. ఆయన సణుగుకోకుండా తనను తాను సమర్పించుకున్నాడు. యేసు తాను అద్భుతాలను చేసినప్పుడు తానే కొంత కోల్పోయాడని మీకు తెలుసా? ఆయన రోగగ్రస్థులను స్వస్థపరచినప్పుడు శక్తి ‘ఆయన నుండి వెడలిపోయింది’ అని లేఖనాలు ఒకటి కన్నా ఎక్కువ సార్లు చెబుతున్నాయి. (లూకా 6:19; 8:45, 46) యేసు ఎంతో ఔదార్యము గలవాడు గనుక ఆయన తన స్వంత ప్రాణమును, తన జీవితాన్ని కూడా మరణం వరకు ధారపోశాడు.—యెషయా 53:12.

కనుక మనం మన సమయాన్నైనా, మన శక్తినైనా లేదా మనకున్న వస్తువులనైనా ఇచ్చేటప్పుడు మనం యెహోవాను అనుకరించి, ఆయన హృదయాన్ని సంతోషింపజేసే వారమౌతాము. (సామెతలు 27:11; ఎఫెసీయులు 5:1) మానవ ప్రవర్తనకు యేసుక్రీస్తు వదిలిపెట్టిన పరిపూర్ణ మాదిరిని కూడా మనం అనుకరిస్తాము.—1 పేతురు 2:21.

మూడవది, ఇవ్వడం అనేది నిజమైన మరియు ప్రాముఖ్యమైన అవసరాలను తీరుస్తుంది. నిజమే, వాక్యాన్ని బోధించేందుకు మనల్ని ఉపయోగించే బదులు రాళ్ళు కేకలు వేసే విధంగా యెహోవా ఏర్పాటు చేయగల్గేటట్లే మన సహాయం లేకుండానే రాజ్యాసక్తులకు సంబంధమైన అవసరాలను తాను తీర్చుకోగలడు. (లూకా 19:40) కాని ఈ ఆధిక్యతలతో మనలను సన్మానించేందుకు ఆయన ఎన్నుకున్నాడు. కనుక, మనం మన వనరులను రాజ్యాసక్తుల పురోగతి కొరకు ఇచ్చినప్పుడు, ఈ లోకంలో జరుగుతున్న అతి ప్రధాన పనిలో మనం నిజమైన భాగాన్ని వహిస్తున్నామని తెలుసుకోవడంలో గొప్ప తృప్తిని పొందుతాం.—మత్తయి 24:14.

యెహోవాసాక్షుల ప్రపంచ వ్యాప్త పని ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పనవసరం లేదు. 1995 సేవా సంవత్సరంలో సొసైటీ దాదాపు 6 కోట్ల డాలర్లను ప్రత్యేక పయినీర్లకు, మిషనరీలకు, మరియు ప్రయాణ కాపరులకు వారి ప్రాంతీయ పరిచర్యా నియామకాల కొరకు ఖర్చుపెట్టింది. అయినప్పటికీ, అవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌ కార్యాలయాల మరియు ముద్రణా వసతుల నిర్మాణం మరియు నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోల్చి చూస్తే చాలా తక్కువే. అయినప్పటికీ, ఇదంతా స్వచ్ఛంద విరాళాల సహాయంతోనే సాధ్యమవుతోంది మరి!

యెహోవా ప్రజలు తమకు సమృద్ధిగా లేకపోతే ఆ భారాన్ని ఇతరులు మోయడానికి వదిలిపెట్టవచ్చని సాధారణంగా అనుకోరు. అలాంటి దృక్పథం మన ఆరాధనలో ఒక భాగమైన దీనిని మనం కోల్పోవడానికి కారణం కాగలదు. అపొస్తలుడైన పౌలు అభిప్రాయం ప్రకారం, మాసిదోనియాలోని క్రైస్తవులు ‘నిరుపేదరికాన్ని’ అనుభవించారు. అయినప్పటికీ, వారు ఇచ్చే ఆధిక్యత కోసం వేడుకొన్నారు. వారిచ్చినది ‘వారి సామర్థ్యము కంటే ఎక్కువే’ అని పౌలు సాక్ష్యమిచ్చాడు!—2 కొరింథీయులు 8:1-4.

నాల్గవదిగా, యెహోవా ఇవ్వడాన్ని సత్యారాధనలో భాగంగా చేశాడు, ఎందుకంటే ఇవ్వడం మనం సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు తానే చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:35) యెహోవా మనలను అలాగే రూపకల్పన చేశాడు. అయితే ఇంకొక కారణమేమిటంటే, మనమెంత ఇచ్చినా మనం ఆయన ఎడల మన హృదయాల్లో భావించే మెప్పుదలకు అది సరితూగదని భావిస్తాం. అయితే, సంతోషకరంగా, మనం ఇవ్వగలిగే దానికన్నా అధికంగా యెహోవా మన నుండి నిరీక్షించడు. మనమివ్వగలిగినంత మనం సంతోషంగా ఇస్తే ఆయన సంతోషిస్తాడని మనం నమ్మకం కలిగి ఉండగలం!—2 కొరింథీయులు 8:12; 9:7.

ఇచ్చే స్ఫూర్తిని చూపించడం ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి

ముందు పేర్కొన్న ఉదాహరణను పునరాలోచించేందుకు, సారెపతులోని విధవరాలు ఏలీయా భోజన అవసరతను వేరెవరైనా తీర్చగలరని అనుకుందని ఊహించుకోండి. ఆమె ఎంతటి ఆశీర్వాదాన్ని కోల్పోయి ఉండేది!

ఇచ్చే స్ఫూర్తిని చూపించే వారిని యెహోవా ఆశీర్వదిస్తాడన్న దానికి సందేహమే లేదు. (సామెతలు 11:25) సారెపతులోని విధవరాలు తన చివరి భోజనం అనుకున్న దానిని త్యాగం చేసినందుకు కష్టపడవలసిన పరిస్థితి రాలేదు. యెహోవా ఒక అద్భుతంతో ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. ఏలీయా వాగ్దానం చేసినట్లు, ఆమె పిండి పాత్రలు, నూనె పాత్రలు ఆ కరువు గడిచి పోయేంత వరకు ఖాళీ అవ్వలేదు. అయితే ఆమె ఇంకా పెద్ద ప్రతిఫలాన్నే పొందింది. ఆమె సొంత కుమారుడు రోగగ్రస్థుడై చనిపోయినప్పుడు సత్య దేవుని మనిషి అయిన ఏలీయా అతడిని ఆమెకు ప్రాణాలతో తిరిగి ఇచ్చాడు. అది ఆమెను ఆత్మీయంగా ఎంతగా నిర్మించి ఉంటుందో!—1 రాజులు 17:16-24.

నేడు మనం అద్భుతాలతో ఆశీర్వదించబడతామని నిరీక్షించం. (1 కొరింథీయులు 13:8) కాని పూర్ణ ప్రాణంతో తనను సేవించేవారిని కాపాడుతానని యెహోవా మనకు అభయమిస్తున్నాడు. (మత్తయి 6:33) యెహోవా మనలను సంరక్షిస్తాడనే నమ్మకంతో ఉదారంగా ఇచ్చే విషయంలో మనం సారెపతులోని విధవరాలిని పోలి ఉండగలం. అలాగే, మనం గొప్ప ఆత్మీయ ఫలితాలను ఆస్వాదించగలం. అరుదుగా ఇవ్వడమో, అప్పటికప్పుడు అనుకుని ఇవ్వడమో కాకుండా మనం ఇచ్చేది క్రమమైన అలవాట్లలో ఒకటైతే మనం మన కంటిని తేటగా ఉంచుకుని, యేసు ఆజ్ఞాపించినట్లు రాజ్యాసక్తులపై కేంద్రీకరించేందుకు అది మనకు సహాయపడుతుంది. (లూకా 11:34; 1 కొరింథీయులు 16:1, 2 పోల్చండి.) యెహోవాకు మరియు యేసుకు వారి జతపనివారిగా మరింత సన్నిహితులమైనట్లు భావించేందుకు అది మనకు సహాయపడుతుంది. (1 కొరింథీయులు 3:9) అది ఇప్పటికే ఉన్న యెహోవా యొక్క ప్రపంచవ్యాప్త యెహోవా ఆరాధికుల చిహ్నమైన ఉదారతను, ఇచ్చే స్ఫూర్తిని అధికం చేస్తుంది.

[31వ పేజీలోని బాక్సు]

రాజ్య ప్రచారపనికి కొందరెలా విరాళాలిస్తారు

ప్రపంచవ్యాప్త పనికి చందాలు

“సొసైటీ యొక్క ప్రపంచవ్యాప్త పనికొరకు చందాలు—మత్తయి 24:14” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్టులో దాన్ని చేరుస్తారు. ప్రతినెలా ఈ మొత్తాలను సంఘాలు తమ దగ్గరలోని వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.

స్వచ్ఛంద విరాళాలను డబ్బు రూపంలో నేరుగా Watch Tower Bible and Tract Society of India, H-58, Old Khandala Road, Lonavla, 410 401, Mah.,కి లేదా మీ దేశంలో సేవ చేస్తున్న సొసైటీ కార్యాలయానికి పంపించవచ్చు. ఆభరణాలను ఇతర విలువగల నగలను సహితం విరాళంగా ఇవ్వవచ్చు. ఈ విరాళాలతో పాటు అది కచ్చితంగా ఒక బహుమతియని తెలియజేసే ఒక క్లుప్త లేఖను కూడ పంపాలి.

షరతుపై విరాళమిచ్చే ఏర్పాటు

వ్యక్తిగత అవసర కలిగినప్పుడు దాతకు ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటుతో, దాత మరణపర్యంతం వాచ్‌టవర్‌ సొసైటీ ట్రస్టుకు డబ్బు ఇవ్వవచ్చు. మరింత సమాచారం కొరకు దయచేసి పైన పేర్కొనబడిన చిరునామాలో సొసైటీని సంప్రదించండి.

పథకం వేసి ఇవ్వడం

నేరుగా డబ్బు రూపంలో కానుకగా ఇవ్వడం మరియు షరతు మీద ఆధారపడి ఇచ్చే విరాళాలే కాక, ప్రపంచవ్యాప్తంగా సువార్త పరిచర్యకు ఇచ్చే వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథకం యొక్క లబ్దిదారుగా వాచ్‌టవర్‌ సొసైటీ పేరును సూచించవచ్చు. అలాంటి ఏర్పాట్లేవైనా ఉంటే సొసైటీకి తెలియజేయాలి.

బ్యాంకు ఖాతాలు: బ్యాంకు ఖాతాలను డిపాజిట్‌ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలను స్థానిక బ్యాంకు నియమాలను అనుసరించి వాచ్‌టవర్‌ సొసైటీ ట్రస్టు కొరకు లేదా మరణానంతరం వాటిని ఆ సొసైటీకే చెల్లించే ఏర్పాటును చేయవచ్చు. అలాంటి ఏ ఏర్పాటునైనా సొసైటీకి తెలియజేయాలి.

స్టాక్‌లు మరియు బాండ్లు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించు ఏర్పాటుతో స్టాక్‌లను మరియు బాండ్లను వాచ్‌టవర్‌ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు.

ఇళ్లస్థలాలు: పూర్తిగా ఒక బహుమతిగా లేక ఆమె లేదా అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో పూర్తిగా అమ్మదగిన ఇళ్లస్థలాలను వాచ్‌టవర్‌ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటివాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు సొసైటీని సంప్రదించాలి.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా వాట్‌టవర్‌ సొసైటీ పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు ఏర్పాటుయొక్క లబ్దిదారుగా సొసైటీ పేరు వ్రాయవచ్చు. ఒక మత సంస్థకు లాభం సమకూర్చే ట్రస్టుకు పన్నులు చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వవచ్చు. వీలునామా లేదా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన ఒక కాపీని సొసైటీకి పంపాలి.

పథకం వేసి ఇచ్చే ఈ ఏర్పాట్లలో ఏ ఒక్క దానిలోనైనా ఆసక్తిగలవారు పైన ఇవ్వబడిన సొసైటీ చిరునామాలో లేదా మీ దేశంలో సేవ చేస్తున్న సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించండి. ఈ ఏర్పాట్లో దేనికైనా సంబంధించిన అధికారపత్ర ప్రతి సొసైటీకి అందాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి