“మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారం”
ఇటీవలి సంవత్సరాల్లో మత దురభిమానం, వర్గీయత భూమ్యంతటా వ్యాపించాయి. జాతి విభేదాలు హత్యలకు హింసకు మరితర అవమానకరమైన దారుణ కృత్యాలకు ఆజ్యం పోశాయి. ఆమ్నెస్టీ ఇన్టర్నేషనల్ నివేదిక ప్రకారం, మానవ హక్కుల ఉల్లంఘనాలు 1994లో ప్రపంచ వ్యాప్తంగా 2.3 కోట్ల మంది ప్రజలు తమ గృహాల నుండి పారిపోవడానికి నిర్బంధితులను చేశాయి.
కేవలం రువాండాలోనే దాదాపు 5,00,000 మంది ప్రజలు హతమార్చబడ్డారు, టుట్సీలకు, హుటూలకు మధ్య హింసాకాండ ప్రారంభమైన తర్వాత మరో 20,00,000 కన్నా ఎక్కువ మంది శరణార్ధులయ్యారు. “ఆయుధాలను పట్టుకొని నడవడానికి నిరాకరించినందున మరి ముఖ్యంగా యెహోవాసాక్షులు పీడించబడ్డారు” అని బెల్జియన్ వార్తాపత్రికయైన లా స్వార్ నివేదిస్తుంది. యెహోవాసాక్షులు సాయుధ పోరాటాల్లో పాల్గొనరు. అయినప్పటికీ, వారిలో వందలాది మంది ఆ హింసాకాండలో చంపబడ్డారు. ఇది “మీరు లోక సంబంధులు కారు . . . అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” అని యేసు తన శిష్యులకు చెప్పిన మాటలను మనకు గుర్తు చేస్తుంది.—యోహాను 15:19.
ఒక సాక్షి కుటుంబం—యూగన్ టాబ్నానా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు రాజధానియైన కిగాలిలో నివసించేవారు. యూగన్ తన పొరుగువారికి క్రైస్తవ నిష్పక్షతను గురించి వివరించేటప్పుడు వెచ్చని వాతావరణాల్లో బాగా పైకి పెరిగే మొక్కయైన బోగన్విల్లా గురించి తరచూ మాట్లాడేవాడు.—మత్తయి 22:21.
“ఇక్కడ కిగాలిలో బోగన్విల్లా ఎర్రని, పింక్, కొన్నిసార్లు తెల్లని పువ్వులు పూస్తాయి. అయినప్పటికీ, అవన్నీ ఒకే కుటుంబానికి చెందినవే. మానవుల విషయంలో కూడా అంతే. మనం విభిన్న జాతుల వారమైనప్పటికీ, చర్మ వర్ణం, లేదా జాతి పూర్వ చరిత్ర వేరైనప్పటికీ మనమందరం ఒకే కుటుంబానికి, ఒకే మానవ కుటుంబానికి చెందినవారం” అని యూగన్ వివరించేవాడు.
విషాదకరంగా, టాబ్నానా కుటుంబంలోని వారు శాంతియుతమైన స్వభావం గలవారైనప్పటికీ నిష్పక్ష స్థానాన్ని వహించేవారైనప్పటికీ రక్తదాహం గల గుంపుచేత చంపబడ్డారు. అయినప్పటికీ వారు నమ్మకస్థులుగా మరణించారు. యెహోవా దేవుడు అలాంటివారికి తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని, దురభిమానం ఇక ఏ మాత్రం ఉండని లోకాన్ని స్వతంత్రించుకునేందకు వారు పునరుత్థానం పొందుతారని మనం నిశ్చయత కలిగి ఉండగలం. (అపొస్తలుల కార్యములు 24:15) అప్పుడు ఇతరులతోపాటు టాబ్నానా కుటుంబంవారు “బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.