కైసరువి కైసరుకి చెల్లించడం
“అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.”—రోమీయులు 13:7.
1, 2. (ఎ) యేసు చెప్పిన ప్రకారంగా, దేవునికి మరియు కైసరుకి సంబంధించిన తమ కర్తవ్యాల విషయంలో క్రైస్తవులు ఎలా సమతూకంగా ఉండాలి? (బి) యెహోవాసాక్షుల మొదటి శ్రద్ధ ఏమిటి?
యేసు చెప్పిన ప్రకారంగా, మనం దేవునికి రుణపడినవి, కైసరుకి లేక ప్రభుత్వానికి రుణపడినవి ఉన్నాయి. యేసు ఇలా చెప్పాడు: “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.” ఈ కొద్ది మాటలతోనే ఆయన తన శత్రువుల్ని కలవరపర్చి, దేవునితో మన బాంధవ్యం విషయంలోనూ మరియు ప్రభుత్వంతో మన వ్యవహారాల విషయంలోనూ మనం కల్గివుండాల్సిన సమతూక దృక్పథాన్ని క్లుప్తీకరించాడు. ఆయన చెప్పిన దానిని విన్నవారు ఆయనను “గూర్చి ఆశ్చర్యపడిరి.”!—మార్కు 12:17.
2 నిజమే, యెహోవా సేవకులు దేవునివి దేవునికి చెల్లించడమే వారి మొట్టమొదటి శ్రద్ధయైవుంది. (కీర్తన 116:12-14) అయినా, అలా చేయడంలో కైసరుకు కొన్ని నిర్ణీతమైనవి చెల్లించాలని యేసు చెప్పిన దానిని వారు మర్చిపోరు. కైసరు కోరేది ఎంతమేరకు చెల్లించాలి అని ప్రార్థనాపూర్వకంగా పరిశీలించాల్సిన అవసరం బైబిలు తర్ఫీదు పొందినవారి మనస్సాక్షికి ఉంది. (రోమీయులు 13:7) ఆధునిక కాలాల్లో, ప్రభుత్వ అధికారానికి పరిమితులున్నాయని, అన్నిచోట్లనున్న ప్రజలు, ప్రభుత్వాలు స్వాభావిక నియమానికి కట్టుబడి ఉన్నాయని అనేకమంది న్యాయనిర్ణయవేత్తలు గుర్తించారు.
3, 4. స్వాభావిక నియమం, బయల్పర్చబడిన నియమం మరియు మానవ నియమం గురించి ఏ ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేయబడ్డాయి?
3 “దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది వారిమధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు” అని ప్రపంచ ప్రజలను గురించి అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు ఈ స్వాభావిక నియమాన్ని ఆయన సూచించాడు. వారు దీనికి ప్రతిస్పందించినట్లయితే, స్వాభావిక నియమం ఈ అవిశ్వాసుల మనస్సాక్షిని సహితం ప్రేరేపిస్తుంది. అందుకే పౌలు ఇంకా ఇలా తెలియజేశాడు: “ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రములేని వారైనను, తమకుతామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షికూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పుమోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.”—రోమీయులు 1:19, 20; 2:14, 15.
4 18వ శతాబ్దంలో ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల న్యాయవేత్త విలియమ్ బ్లాక్‌స్టోన్ ఇలా వ్రాశాడు: “మానవజాతి [వయస్సుకు సరిసమానమైన వయస్సు]తో సమకాలీనమైనదిగా ఉండి, దేవునిచే మాత్రమే ఆదేశించబడిన ఈ స్వాభావిక నియమం [ప్రకృతి నియమం], ఏ ఇతర నియమంకన్నా బాధ్యతలో ఎంతో ఉన్నతమైంది. అది భూగోళమంతటినీ, దేశాలన్నింటినీ, కాలాలన్నింటినీ కర్తవ్యబద్ధుల్ని చేస్తుంది. దీనికి విరుద్ధంగావుంటే, ఏ మానవ నియమాలూ విలువైనవిగా ఉండవు.” బ్లాక్‌స్టోన్ బైబిలులోవున్న “బయల్పర్చబడిన నియమాన్ని” గురించి మాట్లాడుతూ, ఇలా వ్యాఖ్యానించాడు: “స్వాభావిక నియమం, బయల్పర్చబడిన నియమం అనే ఈ రెండు పునాదులపై మానవ నియమాలన్నీ ఆధారపడి ఉన్నాయి. అంటే వీటికి విరుద్ధంగా ఏ మానవ నియమాలూ అనుమతింబడవు [సమ్మతించబడవు].” మార్కు 12:17లో వ్రాయబడినట్లుగా, దేవుడు మరియు కైసరును గురించి యేసు చెప్పినదానితో ఇది ఏకీభవిస్తుంది. ఒక క్రైస్తవుడి నుండి కైసరు కోరగల వాటికి దేవుడు పరిమితులుంచే ప్రాంతాలు ఉన్నాయని స్పష్టమౌతుంది. యూదుల మహాసభ, యేసును గురించి ప్రకటించడం ఆపివేయాలని అపొస్తలులను ఆజ్ఞాపించినప్పుడు వారు త్రోవతప్పి అటువంటి మార్గంలోనికి ప్రవేశించారు. అందుకే అపొస్తలులు సరియైన రీతిలో ఇలా ప్రతిస్పందించారు: “మనుష్యులకు కాదు [పరిపాలకునిగా] మేము దేవునికి లోబడవలెను గదా.”—అపొస్తలుల కార్యములు 5:28, 29.
“దేవునివి”
5, 6. (ఎ) 1914లో దేవుని రాజ్య ఆవిర్భావం దృష్ట్యా, క్రైస్తవులు దేనిని మరింత ఎక్కువగా కనిపెట్టుకొని ఉండాలి? (బి) తానో పరిచారకుడని క్రైస్తవుడు ఎలా రుజువు పర్చుకుంటాడు?
5 విశేషంగా 1914 నుండి, సర్వశక్తిగల యెహోవా దేవుడు, క్రీస్తు యొక్క మెస్సీయా రాజ్యంద్వారా రాజుగా పరిపాలించడం ఆరంభించినప్పుడు, దేవునివి కైసరునకు ఇవ్వకుండా క్రైస్తవులు నిశ్చయపర్చుకోవాలి. (ప్రకటన 11:15, 17) ఇంతకు మునుపెన్నటికన్నా, దేవుని నియమం “లోకసంబంధులు” కాకుండా ఉండేందుకు క్రైస్తవులను ఇప్పుడు కోరుతున్నది. (యోహాను 17:16) తమ జీవదాతయైన దేవునికి సమర్పించుకున్న వారిగా, ఇక తాము తమకు చెందినవారంకామని వారు స్పష్టంగా చూపించుకోవాలి. (కీర్తన 100:2, 3) పౌలు వ్రాసినట్లుగా, మనము “ప్రభువువారమై యున్నాము.” (రోమీయులు 14:8) అంతేకాకుండా, క్రైస్తవ బాప్తిస్మ సమయంలో, అతడు దేవుని పరిచారకునిగా నియమించబడ్డాడు, గనుక పౌలుతోపాటు అతడు ఇలా చెప్పగలడు: “ఆయనే [దేవుడు] . . . పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కల్గించియున్నాడు.”—2 కొరింథీయులు 3:5, 6.
6 అపొస్తలుడైన పౌలు ఇంకా ఇలా వ్రాశాడు: “నా పరిచర్యను ఘనపర్చుచున్నాను.” (రోమీయులు 11:13) కచ్చితంగా మనము అలాగే చెయ్యాలి. మనం పూర్తికాల పరిచర్యలోవున్నా లేదా కొంతమేరకే చేస్తున్నా, మన పరిచర్యకు మనల్ని నియమించింది యెహోవాయేనని మనం మనస్సులో ఉంచుకోవాలి. (2 కొరింథీయులు 2:17) కొందరు మన స్థానాన్ని ప్రశ్నిస్తారు గనుక సమర్పించుకొని బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడూ నిజంగా సువార్త ప్రచారకుడేనని స్పష్టమైన, నిశ్చయమైన రుజువును ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. (1 పేతురు 3:15) అతని పరిచర్య అతని ప్రవర్తనయందు కూడా రుజువుచేయబడాలి. దేవుని పరిచారకునిగా, క్రైస్తవుడు పరిశుభ్రమైన నైతిక లక్షణాలను సిఫారసు చెయ్యాలి, పాటించాలి, కుటుంబ ఐక్యతకు మద్దతును ఇవ్వాలి, నిజాయితీగావుండాలి, చట్టం ఎడల గౌరవాన్ని చూపించాలి. (రోమీయులు 12:17, 18; 1 థెస్సలొనీకయులు 5:15) దేవునితోను, దైవికంగా నియమింపబడిన తన పరిచర్యతోను ఒక క్రైస్తవుని సంబంధమే అతని జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం. అతడు వీటిని కైసరు అదుపాజ్ఞలకు వదులుకోడు. స్పష్టంగా, అవి “దేవునివి”గా లెక్కింపబడాలి.
“కైసరువి”
7. పన్నులు చెల్లించడంలో యెహోవాసాక్షులకున్న ఖ్యాతి ఏమిటి?
7 తాము ‘ఉన్నత అధికారులైన’ ప్రభుత్వ పాలకులకు ‘విధేయత చూపించాల్సి ఉందని యెహోవాసాక్షులు ఎరుగుదురు. (రోమీయులు 13:1) అందుకే, కైసరు అంటే ప్రభుత్వం న్యాయబద్ధమైన డిమాండ్లను చేసినప్పుడు, బైబిలు తర్ఫీదు పొందిన వారి మనస్సాక్షి ఈ డిమాండ్లను తీర్చడానికి వారిని అనుమతించింది. ఉదాహరణకు, భూమిపై పన్నులను చెల్లించే మంచి మాదిరికరమైన వారిలో నిజ క్రైస్తవులు ఉన్నారు. జర్మనీలో మ్యున్‌కనర్ మర్కర్ అనే వార్తాపత్రిక యెహోవాసాక్షులను గురించి ఇలా చెప్పింది: “ఫెడరల్ రిపబ్లిక్‌లో వారు అత్యంత నిజాయితీ పరులు, సరిగ్గా నిర్ణీతకాలంలో పన్నులను చెల్లించేవారిగా ఉన్నారు.” ఇటలీలో లా స్టాంపా అనే వార్తాపత్రిక ఇలా అభిప్రాయపడింది: “వారు [యెహోవాసాక్షులు] పన్నులు చెల్లించే బాధ్యతను విస్మరించరు లేక తమ స్వలాభం కోసం అనుకూలించని చట్టాల్ని ఉల్లంఘించడానికి వెదకరు, అందునుబట్టి వారు ఎవరైనా మెచ్చుకొనగల్గే అతి నమ్మకమైన పౌరులు.” యెహోవా సేవకులు తమ ‘మనస్సాక్షినిబట్టి’ దీనిని చేస్తారు.—రోమీయులు 13:5, 6.
8. మనం కైసరుకు రుణపడి ఉన్నది ధనరూపంలో పన్నులను చెల్లించడానికే పరిమితమా?
8 “కైసరువి” పన్నులు చెల్లించడానికే పరిమితమా? ఎంతమాత్రం లేదు. భయం, ఘనత వంటి ఇతర విషయాలను పౌలు చేర్చాడు. క్రిటికల్ అండ్ ఎక్సెజెటికల్ హ్యాండ్-బుక్ టు ది గాస్పల్ ఆఫ్ మాథ్యూ అనే తన పుస్తకంలో జర్మనీ పండితుడు హిన్‌రిక్ మేయర్ ఇలా వ్రాశాడు: “[కైసరువి] . . . పౌరసంబంధమైన పన్నులు మాత్రమేనని మనం అర్థం చేసుకోకూడదు, కాని కైసరు తన న్యాయబద్ధమైన పరిపాలనా అధికారం పేరిట చేసిన ప్రతిదీ.” చరిత్రకారుడు ఇ. డబ్ల్యు. బాన్స్, ది రైజ్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే తన పుస్తకంలో, క్రైస్తవుడు పన్నులు చెల్లించాల్సి ఉంటే అతడు చెల్లిస్తాడు “అలాగే ఇతర ప్రభుత్వపరమైన బాధ్యతలన్నింటినీ అంగీకరిస్తాడు, అయినా దేవునికి చెందిన వాటిని కైసరుకి చెల్లించాల్సిన అవసరం అతనికి లేదని రుజువుచేస్తాడు” అని అభిప్రాయపడ్డాడు.
9, 10. కైసరువి కైసరుకు చెల్లించే విషయాన్ని గురించి ఓ క్రైస్తవుడు ఏ సంకోచాన్ని కల్గివుండవచ్చు, అయితే వేటిని మనస్సునందుంచుకోవాలి?
9 న్యాయసమ్మతంగా దేవునికే చెందాల్సిన వాటిని అధిగమించకుండా ప్రభుత్వం వేటిని అడగవచ్చు? పన్నుల రూపంలో డబ్బును కైసరుకి న్యాయబద్ధంగా చెల్లించవచ్చు కాని ఇంకేదీ చెల్లించకూడదని కొందరు భావిస్తారు. దైవపరిపాలనా కార్యక్రమాల కొరకు ఉపయోగించగలిగే సమయాన్ని హరించే దేనినైనా కైసరుకు చెల్లించడం మంచిదని వారు కచ్చితంగా భావించరు. అయినా, మనం ‘మన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను, ప్రాణముతోను, మనస్సుతోను, బలంతోను ప్రేమించాలి’ అనేది వాస్తవం గనుక, మన పవిత్ర సేవయేగాక ఇతర విషయాల్లోనూ సమయాన్ని వెచ్చించాలని మన నుండి యెహోవా ఎదురు చూస్తాడు. (మార్కు 12:30; ఫిలిప్పీయులు 3:3) ఉదాహరణకు, ఓ వివాహిత క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు తన వివాహ జతను ప్రీతిపర్చడానికి సమయాన్ని వినియోగించాలని సలహా ఇవ్వబడింది. అటువంటి కార్యకలాపములు చెడ్డవేమీకాదుగాని, అవి “లోక విషయమైన”వని, “ప్రభువు విషయమైన కార్యములు” కావని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు.—1 కొరింథీయులు 7:32-34; 1 తిమోతి 5:8ని పోల్చండి.
10 అంతేకాకుండా, తన అనుచరులను పన్నులు ‘చెల్లించడానికి’ యేసు అధికారమిచ్చాడు మరియు మన జీవితాలన్నీ యెహోవాకు సమర్పించబడ్డాయి గనుక ఆయనకు సమర్పించుకున్న సమయాన్ని వినియోగించడం ఇందులో చేరివుంది. ఒక దేశంలో సగటు పన్ను, ఆదాయంలో 33 శాతమైతే (ఇది కొన్ని దేశాల్లో అధికం), సగటు పనివాడు ప్రతి సంవత్సరం తన సంపాదనలో నాల్గు నెలల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు చెల్లిస్తున్నాడని దీని భావం. మరో విధంగా చెప్పాలంటే, తాను ఉద్యోగం చేసిన కాలమంతటిలో, సగటు పనివాడు ‘కైసరు’ కోరుతున్న పన్నును చెల్లించడానికవసరమైన డబ్బును సంపాదించడానికి సుమారు 15 సంవత్సరాలు వెచ్చించాల్సి ఉంటుంది. విద్యాభ్యాస విషయాన్ని కూడా ఆలోచించండి. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు కనీసం కొన్ని సంవత్సరాలైనా పంపించాలని అనేక దేశాల్లో చట్టం కోరుతుంది. ఈ విద్యాభ్యాస సంవత్సరాలు ఒక దేశానికి మరో దేశానికి వేరువేరుగా ఉంటాయి. అనేక దేశాల్లో అది ఓ ప్రామాణిక కాలముగా ఉంటుంది. నిజమే, అటువంటి విద్యాభ్యాసం సాధారణంగా లాభదాయకమైనదే, కాని ఒక పిల్లవాని జీవితంలో ఎంత భాగం ఈ విధంగా వెచ్చించాలో నిర్ణయించేది కైసరే, ఆ కైసరు నిర్ణయాన్ని క్రైస్తవ తల్లిదండ్రుల ఒప్పుకుంటారు.
నిర్భంధ సైనిక సేవ
11, 12. (ఎ) అనేక దేశాల్లో కైసరు ఏ డిమాండును చేస్తాడు? (బి) తొలి క్రైస్తవులు సైనిక సేవను ఎలా దృష్టించారు?
11 కొన్ని దేశాల్లో కైసరుచేసిన మరో డిమాండు ఏమంటే, నిర్భంధ సైనిక సేవ. ఈ 20వ శతాబ్దంలో ఈ ఏర్పాటును అనేక దేశాలు యుద్ధకాలంలో ఆరంభించాయి, కొన్ని దేశాలు శాంతి కాలంలోనూ ఏర్పాటు చేశాయి. ఫ్రాన్స్‌లో ఈ కర్తవ్యం, అనేక సంవత్సరాలుగా రక్తపుపన్ను అని పిలువబడింది, అంటే ప్రతి యౌవనుడూ దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టేందుకు సుముఖుడై ఉండాలి. యెహోవాకు సమర్పించుకొనిన వారు మనస్సాక్షి పూర్వకంగా ఇది చేయగలడా? మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఈ విషయాన్ని ఎలా దృష్టించారు?
12 తొలి క్రైస్తవులు మంచి పౌరులుగా ఉండేందుకు ప్రయత్నించినా, వారి విశ్వాసం మరొకరి ప్రాణం తీయకుండా లేక దేశం కోసం తమ ప్రాణాల్ని బలి పెట్టకుండా వారిని నిలిపివేసింది. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ ఇలా చెబుతోంది: “టెర్టూలియన్, ఆరజన్‌లతోపాటు తొలి చర్చి ఫాదర్లు, మానవ ప్రాణాల్ని తీయకుండా క్రైస్తవులు నిర్బంధింపబడ్డారని, ఆ సూత్రమే రోమా సైన్యంలో పనిచేయకుండా వారిని నిలిపివేసిందని ధృవపర్చారు.” ది ఎర్లీ చర్చ్ అండ్ ది వరల్డ్ అనే తన పుస్తకంలో పండితుడైన సి. జె. కాడూ ఇలా వ్రాస్తున్నాడు: “కనీసం మార్కస్ ఆరియలస్ పరిపాలన వరకు [సా. శ. 161-180], బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏ క్రైస్తవుడూ సైనికుడు కాలేదు.”
13. సైనిక సేవను గూర్చి తొలి క్రైస్తవులు దృష్టించినట్లుగా క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకులు ఎందుకు దృష్టించరు?
13 క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల సభ్యులు విషయాల్ని నేడు ఇలా ఎందుకు చూడరు? నాల్గవ శతాబ్దంలో జరిగిన పెద్ద మార్పునుబట్టి వారు అలా చూడరు. ఎ హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే ప్రచురణ ఇలా వివరిస్తుంది: “అన్య చక్రవర్తుల క్రిందనున్న . . . అనేకమంది క్రైస్తవులు, సైనిక సేవకు సంబంధించి మతపరమైన సంకోచాన్ని కల్గివుండి, ఆయుధాలను తీసుకోవడాన్ని నిస్సంశయంగా తిరస్కరించేవారు లేక విడిచి పారిపోయారు. కాన్‌స్టన్‌టైన్ ప్రవేశపెట్టిన మార్పులకు సంబంధించిన [సా. శ. 314లో జరిగిన ఆరల్] మతసభ, క్రైస్తవులు యుద్ధంలో పనిచేయాలనే బాధ్యతను ఉంచింది, . . . ఎందుకంటే క్రైస్తవులకు స్నేహితుడైన అధిపతి పాలనలో చర్చి సమాధానంగా (పాస్‌లో) ఉంది.” ఆ కాలంనుండి ఇప్పటి వరకూ, క్రీస్తు బోధలను ఇలా విడనాడిన ఫలితంగా, తమ మందను లోక సైన్యాలలో పని చేయమని క్రైస్తవమత సామ్రాజ్య మత గురువులు ప్రోత్సహించారు, అయినా కొంతమంది వ్యక్తులు మాత్రం తమ మనస్సాక్షి నిమిత్తం అలా చేయలేదు.
14, 15. (ఎ) కొన్ని దేశాల్లో క్రైస్తవులు దేని ఆధారంగా సైనిక సేవ నుండి మినహాయింపును అర్థిస్తారు? (బి) మినహాయింపు లభ్యంకానిచోట, సైనిక సేవ విషయంలో సరియైన నిర్ణయం తీసుకోవడానికి ఒక క్రైస్తవునికి ఏ లేఖనాధార సూత్రాలు సహయపడతాయి?
14 నేడున్న క్రైస్తవులు, ఈ విషయంలో అత్యధికులను అనుసరించ బద్ధులై ఉన్నారా? లేదు. మత పరిచారకులకు సైనిక సేవనుండి మినహాయింపు ఇవ్వబడిన దేశంలో సమర్పించుకొని బాప్తిస్మం పొందిన ఒక క్రైస్తవుడు నివసిస్తుంటే, అతడు నిజానికి దేవుని పరిచారకుడు గనుక అతడు ఈ ఏర్పాటును ఉపయోగించుకోవచ్చు. (2 తిమోతి 4:5) అమెరికా, ఆస్ట్రేలియాలతోపాటు అనేక దేశాలు యుద్ధ సమయంలో కూడా అలాంటి మినహాయింపునిచ్చాయి. మరియు శాంతికాలంలో, నిర్భంధ సైనిక సేవ అమల్లోవున్న అనేక దేశాల్లో మత పరిచారకులుగా యెహోవాసాక్షులకు మినహాయింపు ఇవ్వబడింది. ఆవిధంగా, వారు తమ ప్రజా సేవ చేయడం ద్వారా ప్రజలకు సహయపడగలరు.
15 అయినా, మత పరిచారకులకు మినహాయింపు ఇవ్వని దేశాల్లో క్రైస్తవుడు జీవిస్తున్నట్లయితే, అప్పుడేమిటి? అప్పుడు అతడు బైబిలుచే తర్ఫీదుపొందిన తన మనస్సాక్షిని అనుసరించి వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. (గలతీయులు 6:5) కైసరు అధికారాన్ని పరిగణలోనికి తీసుకుంటే అతడు యెహోవాకు రుణపడి ఉన్నదానిని జాగ్రత్తగా సరిచూచుకుంటాడు. (కీర్తన 36:9; 116:12-14; అపొస్తలుల కార్యములు 17:28) ఇతర దేశాల్లో జీవించేవారు లేక ఇతర జాతులకు చెందిన వారితోపాటు, తన తోటి విశ్వాసులందరిని ప్రేమించడమే నిజ క్రైస్తవుని గుర్తు అని క్రైస్తవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. (యోహాను 13:34, 35; 1 పేతురు 2:17) అంతేకాకుండా, యెషయా 2:2-4; మత్తయి 26:52; రోమీయులు 12:18; 14:19; 2 కొరింథీయులు 10:4; మరియు హెబ్రీయులు 12:14 వచనాల్లోని లేఖనాధార సూత్రాలను అతడు మర్చిపోడు.
పౌర సేవ
16. కొన్ని దేశాల్లో, సైనిక సేవను అంగీకరించని వారు సైనిక సంబంధంకాని ఏ సేవను చేయాలని కైసరు డిమాండు చేస్తాడు?
16 అయితే, మత పరిచారకులను మినహాయించక పోయినా కొంతమంది వ్యక్తులు సైనిక సేవకు అడ్డు చెప్పవచ్చని గుర్తించే ప్రభుత్వమున్న దేశాల విషయం ఏమిటి? ఈ దేశాల్లో అనేకం, అలాంటి మనస్సాక్షిగల వ్యక్తులను సైనిక సేవకు బలవంతం చేయకుండా ఉండడానికి ఏర్పాటు చేశాయి. కొన్ని దేశాల్లో సమాజానికి ఉపయోగకరమైన సేవ వంటి, అవసరమైన పౌరసంబంధ సేవ, సైనిక సంబంధంలేని జాతీయ సేవగా ఎంచబడింది. సమర్పిత క్రైస్తవుడొకడు అలాంటి సేవను చేపట్టవచ్చునా? ఇక్కడ మరలా సమర్పించుకొని బాప్తిస్మం తీసుకొనిన క్రైస్తవుడు, బైబిలుచే తర్ఫీదు పొందిన తన మనస్సాక్షి ఆధారంగా తన స్వంత నిర్ణయాన్ని తీసుకోవాలి.
17. ప్రభుత్వ సేవకు సంబంధించి సైనికేతర పౌరసంబంధ సేవ ఏదైనా బైబిలులో ముందు జరిగిందా?
17 బైబిలు కాలాల్లో అలాంటి నిర్భంధ సేవ చేసినట్టు కనబడుతుంది. చరిత్ర పుస్తకం ఒకటి ఇలా చెబుతుంది: “యూదా నివాసుల నుండి రాబట్టిన పన్నులు మరియు రుణాలకు అదనంగా, వెట్టిచాకిరీ [ప్రజా అధికారులు డబ్బు చెల్లించకుండా శ్రమను రాబట్టుకోవడం] కూడా ఉండేది. ఇది, హెల్లేనీయ మరియు రోమా అధికారాలు కొనసాగించిన . . .మధ్య ప్రాచ్యమందలి ఓ ప్రాచీన వ్యవస్థ. క్రొత్త నిబంధన కూడా, యూదయలో వెట్టిచాకిరీ ఉదాహరణలను ఉల్లేఖించి, అది ఎంత విస్తృతంగా ఉందో చూపించింది. ఈ పద్ధతి ప్రకారంగానే, యేసు సిలువను [హింసా కొయ్యను] మోయడానికి కురేనీయుడైన సీమోనును సైనికులు బలవంతం చేశారు (మత్తయి 5:41; 27:32; మార్కు 15:21; లూకా 23:26).”
18. సైనిక సంబంధంకాని, మతపరంకాని ఏ సామాజిక సేవలకు యెహోవాసాక్షులు తరచూ సహకరిస్తారు?
18 అదేవిధంగా, ప్రభుత్వం లేక స్థానిక అధికారాలు కొన్ని దేశాల్లోని పౌరులను వివిధ రకాలైన సామాజిక సేవల్లో భాగం వహించమని నేడు కోరుతున్నాయి. కొన్నిసార్లు ఇది బావులను త్రవ్వడం లేక రహదారులను నిర్మించడం వంటి ఓ ప్రత్యేకమైన పని కోసమై ఉంటుంది; కొన్నిసార్లిది రహదార్లను, పాఠశాలలను లేక వైద్యశాలలను శుభ్రపర్చడంలో ప్రతి వారం భాగం వహించడం లాంటి క్రమబద్ధమైన పనియై ఉంటుంది. సమాజ శ్రేయస్సు కొరకు, అబద్ధ మతంతో సంబంధంలేకుండా లేక యెహోవాసాక్షుల మనస్సాక్షికి ఇతరత్రా ఆక్షేపణలేని అటువంటి పౌరసంబంధ సేవను తరచూ వారు చేశారు. (1 పేతురు 2:13-15) దీని మూలంగా సహజంగానే ఓ మంచి సాక్ష్యం ఇవ్వబడింది, ప్రభుత్వ వ్యతిరేకులని తప్పుడు నేరంమోపే వారి నోళ్లను కొన్నిసార్లు మూయించింది.—మత్తయి 10:18 పోల్చండి.
19. నిర్ణీతకాలం కోసం సైనిక సంబంధంకాని జాతీయ సేవను చేయమని కైసరు ఓ క్రైస్తవున్ని అడిగితే, ఆ విషయాన్ని అతడు ఎలా ఆలోచిస్తాడు?
19 అయితే, పౌరసంబంధ పరిపాలన క్రింద పౌరసంబంధ సేవను అంటే జాతీయ సేవ యొక్క ఓ భాగాన్ని, ఓ నిర్ణీతకాలం కొరకు చేయడానికి ప్రభుత్వం ఒక క్రైస్తవున్ని కోరితే, ఏమి చెయ్యాలి? ఇక్కడ మరలా, జ్ఞానముగల మనస్సాక్షిపై ఆధారపడి, క్రైస్తవులు తమ స్వంత నిర్ణయాన్ని చేసుకోవాలి. “మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము.” (రోమీయులు 14:10) క్రైస్తవుడు కైసరుకు చెల్లించవలసివచ్చినప్పుడు, ఆ విషయాన్ని ప్రార్థనా పూర్వకంగా అధ్యయనంచేసి దానిపై ధ్యానించాలి.a సంఘంలోని పరిపక్వతగల క్రైస్తవులతో ఆ విషయాన్ని మాట్లాడడం తెలివైందిగా కూడ ఉండవచ్చు. అటు తర్వాత ఓ వ్యక్తిగత నిర్ణయం తప్పక తీసుకోవాలి.—సామెతలు 2:1-5; ఫిలిప్పీయులు 4:5.
20. సైనిక సంబంధంకాని జాతీయ పౌరసంబంధ సేవ విషయంపై తర్కించడానికి ఓ క్రైస్తవునికి ఏ ప్రశ్నలు, లేఖనాధార సూత్రాలు సహాయపడతాయి?
20 అటువంటి పరిశోధనలో మునిగి ఉన్నప్పుడు, క్రైస్తవులు అనేక బైబిలు సూత్రాలను పరిశీలిస్తారు. మనం “పరిపాలకులుగా ప్రభుత్వాలకు, అధికారులకు లోబడి విధేయత చూపించాలని, ప్రతి మంచి పనికి సిద్ధంగా ఉండాలని . . . సహేతుకంగా ఉండాలని, మనుష్యులందరి ఎడల సాత్వికాన్ని చూపించాలని” పౌలు తెలియజేశాడు. (తీతు 3:1, 2, NW) అదే సమయంలో ప్రతిపాదించబడిన పౌరసంబంధ పనిని క్రైస్తవులు బాగా పరిశీలించాలి. వారు దానిని అంగీకరిస్తే, వారు క్రైస్తవ తటస్థతను కాపాడుకోగలరా? (మీకా 4:3, 5; యోహాను 17:16) అది వారిని ఏదొక అబద్ధ మతంతో ముడిపెడుతుందా? (ప్రకటన 18:4, 20, 21) దానిని చేయడం, వారి క్రైస్తవ బాధ్యతలను నెరవేర్చకుండా వారిని నిలిపి వేస్తుందా లేక నిర్హేతుకంగా పరిమితం చేస్తుందా? (మత్తయి 24:14; హెబ్రీయులు 10:24, 25) మరో విధంగా చెప్పాలంటే, వారు ఆత్మీయ పురోభివృద్ధిని చేసుకోవడంలోను, బహుశా కోరబడిన సేవను చేస్తుండగా పూర్తికాల పరిచర్యలో భాగం వహించగలరా?—హెబ్రీయులు 6:11, 12.
21. సైనిక సంబంధంకాని జాతీయ పౌరసంబంధ సేవ చేసే విషయంలో ఒక సహోదరుని నిర్ణయమేదైనా, అతనిని సంఘం ఎలా దృష్టించాలి?
21 అలాంటి ప్రశ్నలకు క్రైస్తవుని యథార్థమైన జవాబులు, జాతీయ సైనికేతర పౌరసంబంధ సేవ, అధికారులకు విధేయత చూపించడంలో తాను చేయగల ఓ “మంచి పని” అనే నిర్ధారణకు అతనిని నడిపిస్తే, అప్పుడేమిటి? అది, యెహోవా ఎదుట అతని నిర్ణయమే. సహోదరుని మనస్సాక్షిని నియమిత పెద్దలు, ఇతరులు పూర్తిగా గౌరవించాలి మరియు మంచి స్థానంలోవున్న ఓ క్రైస్తవునిగా అతన్ని ఎంచాలి. అయినా, ఈ సైనికేతర పౌరసంబంధ సేవను తాను చేయలేడని ఓ క్రైస్తవుడు భావించినట్లయితే అతని స్థానం కూడా గౌరవించబడాలి. అతడు కూడా మంచి స్థానంలోనే ఉన్నాడు మరియు ప్రేమపూర్వకమైన మద్దతును పొందాలి.—1 కొరింథీయులు 10:29; 2 కొరింథీయులు 1:24; 1 పేతురు 3:16.
22. మనం ఏ పరిస్థితిని ఎదుర్కున్నా దేనిని చేయడంలో కొనసాగాలి?
22 క్రైస్తవులుగా మనం “ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానము” చూపించడానికి మానుకోము. (రోమీయులు 13:7) మనం మంచి ఉత్తరువును గౌరవిస్తాం మరియు శాంతియుతంగా ఉండేందుకు చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. (కీర్తన 34:14) ‘రాజులు, అధిపతులు,’ మన క్రైస్తవ జీవితం మరియు పరిచర్యపై ప్రభావం చూపే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరబబడినప్పుడు, వీరి కొరకు మనం ప్రార్థన కూడా చేయవచ్చు. కైసరువి కైసరుకి తిరిగి చెల్లించడం ద్వారా, “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు”తామని మనం నిరీక్షిస్తాం. (1 తిమోతి 2:1, 2) అన్నింటికన్నా మిన్నగా, మనస్సాక్షి పూర్వకంగా దేవునివి దేవునికి తిరిగి చెల్లించడం ద్వారా, మానవజాతి ఏకైక నిరీక్షణగా రాజ్యసువార్తను ప్రకటించడంలో మనం కొనసాగుదాం.
[అధస్సూచీలు]
a కావలికోట (ఆంగ్లం) మే 15, 1964 పేజీ 308, పేరా 21 చూడండి.
మీరు వివరించగలరా?
◻ కైసరు మరియు యెహోవాతో తనకుగల సంబంధాన్ని సమతూకం చేసుకోవడంలో, ఒక క్రైస్తవుని మొదటి శ్రద్ధ ఏమిటి?
◻ మనం కైసరుకు ఎన్నటికీ ఇవ్వకూడని దేనిని మనం యెహోవాకు రుణపడి ఉన్నాం?
◻ మనం కైసరుకు సరిగా తిరిగి ఇవ్వాల్సిన వాటిలో కొన్ని ఏవి?
◻ నిర్భంధ సైనిక సేవ విషయంలో సరియైన నిర్ణయం చేసుకోవడానికి ఏ లేఖనాలు మనకు సహాయపడతాయి?
◻ సైనిక సంబంధంకాని జాతీయ పౌరసంబంధ సేవ కొరకు మనం పిలవబడితే మనస్సులో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏవి?
◻ యెహోవా మరియు కైసరుకు సంబంధించి దేనిని మనం చేస్తూ ఉండాలి?
[16, 17వ పేజీలోని చిత్రం]
అపొస్తలులు యూదా మహా సభకు ఇలా చెప్పారు: “[“పరిపాలకునిగా,” NW] మనుష్యులకుకాదు దేవునికే మేము లోబడవలెను”