అంతము వరకూ మీ విశ్వాసాన్ని దృఢంగా కాపాడుకోండి
క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఓ చిన్న విమానం ప్రయాణించడాన్ని ఊహించుకోండి. ఇక పైలట్ ఏ సరిహద్దులనూ గుర్తించలేడు. దట్టమైన మేఘాలు అతన్ని చుట్టుముడతాయి. తన కిటికీ అద్దాన్ని మించి అతనేమీ చూడలేడు, అయినప్పటికీ తన ప్రయాణాన్ని సురక్షితంగా ముగించగలడన్న నమ్మకం ఆయనకుంది. అతని విశ్వాసానికి గల కారణమేమిటి?
చీకటిలో మేఘాలగుండా, భూమిపైనా అతను ప్రయాణించేలా సహాయపడేందుకు అతనికి నిర్దిష్టమైన పరికరాలున్నాయి. తాను వెళ్ళే మార్గంలో, ముఖ్యంగా విమానాశ్రయం దగ్గరి మార్గదర్శకాలు విద్యుత్ పరికరాలు అతన్ని నడిపిస్తాయి, మరి నేల మీద ఉన్న ఎయిర్-ట్రాఫిక్ కంట్రోలర్లతో అతను రేడియో ద్వారా సంబంధాన్ని కల్గివుంటాడు.
అదే విధంగా, రోజు రోజుకూ ప్రపంచ పరిస్థితులు అంతకంతకూ అంధకార బంధురమౌతున్నప్పటికీ మనం భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కొనవచ్చు. ఈ దుష్ట విధానం గుండా మన ప్రయాణం కొందరనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు, అయితే మనం సరైన మార్గంలోనూ, సరైన సమయంలోనూ ఉన్నాము. మనం ఎందుకంత నమ్మకాన్ని కల్గివుండగలం? ఎందుకంటే మానవ దృష్టి కనిపెట్టలేని వాటిని కనిపెట్టేందుకు సహాయపడగల నడిపింపు మనకుంది.
దేవుని వాక్యము మన ‘త్రోవకు వెలుగు,’ మరి అది “నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.” (కీర్తన 19:7; 119:105) పైలట్ ప్రయాణించాల్సిన మార్గాన్ని సూచించే మార్గదర్శకాల్లా, బైబిలు భవిష్యత్ సంఘటనలను కచ్చితంగా తెలియజేస్తుంది, మరియు మనం మన గమ్యానికి సురక్షితంగా చేరుకునేలా చూచేందుకు మనకు స్పష్టమైన ఉపదేశాలను ఇస్తుంది. అయితే దైవిక నడిపింపునుండి ప్రయోజనం పొందేందుకు మనం దాన్ని విశ్వసించాలి.
హెబ్రీయులకు వ్రాసిన తన పత్రికలో, పౌలు యూదా క్రైస్తవులతో ‘మొదటినుండి తమకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టమని’ చెప్పాడు. (హెబ్రీయులు 3:14) దాన్ని ‘గట్టిగా చేపట్టక’పోయినట్లయితే విశ్వాసం కదిల్చివేయబడగలదు. కనుక, అంతము వరకు యెహోవాయందు మన విశ్వాసాన్ని ఎలా దృఢంగా నిలుపుకోగలము అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది.
విశ్వాసాన్ని కల్గివుండండి
తన ఉపకరణాలూ భూమిపైనున్న కంట్రోల్మీద మాత్రమే ఆధారపడుతూ ఓ పైలట్ గ్రుడ్డిగా ప్రయాణించకముందు అతనికి తగు శిక్షణ కావాలి, మరి ఎన్నో గంటలు దాన్ని నడిపించివుండాలి. అదేవిధంగా, ప్రత్యేకంగా కష్టతరమైన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఓ క్రైస్తవుడు యెహోవా నడిపింపునందు తన నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఎడతెగని విశ్వాసాన్ని కల్గివుండాలి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారము. . . . మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము.’ (2 కొరింథీయులు 4:13) ఆ విధంగా, దేవుని సువార్తను గూర్చి మాట్లాడినప్పుడు మనము మన విశ్వాసాన్ని కల్గివుంటూ దాన్ని కాపాడుకుంటున్నామన్నమాట.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఓ నిర్బంధ శిబిరంలో నాలుగు సంవత్సరాలు గడిపిన మాగ్దలీనా ప్రకటన పని యొక్క విలువను ఇలా వివరిస్తోంది: “దృఢమైన విశ్వాసాన్ని కల్గివుండేందుకు ఇతరుల ఆత్మీయ బాగోగుల విషయంలో శ్రద్ధకల్గి ఉండడం ప్రాముఖ్యమని మా అమ్మ నాకు నేర్పింది. మేము ఎలా భావించామో చూపించే ఓ సంఘటన నాకు జ్ఞాపకముంది. రావేన్స్బ్రూక్ నిర్బంధ శిబిరంనుండి విడుదలైన తర్వాత నేనూ అమ్మా శుక్రవారంనాడు మా ఇల్లు చేరుకున్నాము. అయితే రెండు రోజుల తర్వాత, ఆదివారం నాడు సహోదరులతో కలిసి మేము ఇంటింటి పరిచర్యలో పాల్గొన్నాము. దేవుని వాగ్దానాల్లో నమ్మకం ఉంచేలా ఇతరులకు సహాయపడడంపై మనం అవధానం నిలిపినట్లయితే, ఆ వాగ్దానాలే మనకు మరింత వాస్తవమౌతాయి అని నేను కచ్చితంగా నమ్ముతున్నాను.”—అపొస్తలుల కార్యములు 5:42 పోల్చండి.
మన విశ్వాసాన్ని అంతంవరకూ దృఢంగా కాపాడుకునేందుకు ఇతర రంగాల్లో ఆత్మీయ కార్యక్రమాన్ని కల్గివుండడం ఆవశ్యకం. వ్యక్తిగత పఠనం విశ్వాసాన్ని బలపర్చే మరో చక్కని వ్యాయామం. బెరయ వారిని మనం అనుకరించి, ప్రతిదినమూ లేఖనాలను బాగా పరిశీలించినట్లయితే, మనం “నిరీక్షణ యొక్క సంపూర్ణ అభయాన్ని చివరివరకూ కల్గివుండేలా” సహాయపడుతుంది. (హెబ్రీయులు 6:11, NW; అపొస్తలుల కార్యములు 17:11) నిజమే, వ్యక్తిగత పఠనానికి సమయమూ, పట్టుదలా అవసరం. బహుశ, అందుకనే అలాంటి విషయాల్లో “మందులు” లేక బద్ధకస్తులు అయ్యే అపాయాన్ని గూర్చి పౌలు హెబ్రీయులను హెచ్చరించాడు.—హెబ్రీయులు 6:12.
సోమరితనపు దృక్పథం వల్ల మన జీవితంలోని అనేక రంగాల్లో తీవ్ర పరిణామాలు కలగవచ్చు. “చేతుల బద్ధకముచేత ఇల్లు కురియును,” అని సొలొమోను చెప్పాడు. (ప్రసంగి 10:18) జాగ్రత్తచూపని పైకప్పునుండి ఈ రోజు కాకపోతే రేపు వాన కురుస్తుంది. ఆత్మీయంగా మనం బద్ధకించి మన విశ్వాసాన్ని కాపాడుకోవడంలో విఫలులమైతే, అనుమానాలు చొరబడతాయి. మరో వైపు, దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించడమూ, దాన్ని పఠించడమూ మనల్ని పోషించి మన విశ్వాసాన్ని కాపాడుతుంది.—కీర్తన 1:2, 3.
అనుభవం ద్వారా విశ్వాసాన్ని నిర్మించుకోవడం
పైలట్ అనుభవం ద్వారా, అలాగే పఠనం ద్వారా తన పరికరాలు నమ్మదగినవని తెలుసుకుంటాడు. అదేవిధంగా, మనం మన జీవితంలో యెహోవా ప్రేమపూర్వకమైన శ్రద్ధకు నిదర్శనాన్ని చూసినప్పుడు ఆయన యెడల మన విశ్వాసం పెరుగుతుంది. యెహోషువ దాన్ని అనుభవించాడు, మరి ఆయన తన తోటి ఇశ్రాయేలీయులకు ఇలా జ్ఞాపకం చేశాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవ పూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”—యెహోషువ 23:14.
ఫిలిప్పీన్స్లోనున్న ఓ వివాహిత సహోదరి జోసిఫీనా అదే పాఠాన్ని నేర్చుకుంది. తనకు సత్యం తెలియకముందు జీవితం ఎలా ఉండేదో ఆమె ఇలా వివరిస్తోంది: “మా ఆయన బాగా త్రాగేవారు, ఇక త్రాగిన తర్వాత కోపమొచ్చి నన్ను కొట్టేవారు. మా విషాదకరమైన వైవాహికబంధం మా కొడుకును కూడా ప్రభావితం చేసేది. నేనూ మావారు ఇద్దరం పని చేస్తూ బాగా డబ్బు సంపాదించే వాళ్ళం, కానీ మా జీతాల్లో చాలా మొత్తం జూదానికే పోయేది. మా వారికి అనేకమంది స్నేహితులుండేవారు, అయినప్పటికీ ఆయనతో స్నేహంచేసేవారు, ఆయన త్రాగుడుకు డబ్బుపెడతాడనే స్నేహం చేసేవారు, మరికొందరైతే ఊరికే ఆయన్ను చూసి నవ్వేందుకే ఆయనను త్రాగించేందుకు ప్రయత్నించేవారు.
“యెహోవాను తెలుసుకుని ఆయన సలహాలను గంభీరంగా ఎంచినప్పుడు పరిస్థితులు మారాయి. మా ఆయన ఇక త్రాగడంలేదు, మేము జూదమాడడం మానేశాం, మరి మమ్మల్ని ప్రేమించి సహాయం చేసే నిజమైన స్నేహితులను మేము కల్గివున్నాము. మా వైవాహిక బంధం ఆనందమయంగా ఉంది, మరి మా కొడుకు మంచి యౌవనస్థునిగా తయారౌతున్నాడు. మేము తక్కువ సమయం పని చేస్తున్నాము, కానీ మాకు ఎక్కువ డబ్బుంది. యెహోవా, ఎల్లప్పుడూ మనలను సరైన త్రోవలో నడిపే ప్రేమపూర్వక తండ్రివంటివాడని మా అనుభవం మాకు నేర్పింది.”
రేడియో ద్వారా వచ్చిన సంకేతాలు లేదా ఓ పరికరాన్ని పరిశీలించడం ఫలితంగా తమ మార్గాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని పైలట్లు కొన్నిసార్లు గ్రహిస్తారు. అదేవిధంగా యెహోవా సూచన ప్రకారం మనం మన మార్గాన్ని మార్చుకోవల్సి ఉండవచ్చు. “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:21) ఆయన వాక్యం ద్వారా ఆయన సంస్థ ద్వారా, మనల్ని ఆత్మీయ అపాయాల నుండి అప్రమత్తులను చేసే సలహాలను మనం పొందుతాము. వీటిలో ఒకటి సహవాసానికి సంబంధించింది.
సహవాసాలు మనలను ప్రక్కదారి పట్టించవచ్చు
అవసరమైన మార్పులు చేసుకోకపోతే ఓ చిన్న విమానం సులభంగా ప్రక్కదారి పట్టవచ్చు. అదేవిధంగా, వెలుపలి ప్రభావాలు క్రైస్తవులపై ఎడతెగక దాడిచేస్తుంటాయి. డబ్బుకూ సుఖానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, ఆత్మీయ విలువలను వెక్కిరించే అనేకమంది ఉన్న ప్రాపంచికాలోచన గల లోకంలో మనం జీవిస్తున్నాము. అంత్యదినాలు “అపాయకరమైన కాలములు” అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. (2 తిమోతి 3:1-5) పేరుప్రతిష్ఠలకొరకూ పాటుపడే యౌవనులే ప్రత్యేకంగా చెడు సహవాసాలకు గురౌతారు.—2 తిమోతి 2:22.
అమండ అనే 17 సంవత్సరాల అమ్మాయి ఇలా వివరిస్తోంది: “నా తోటి విద్యార్థుల కారణంగా కొంతకాలం వరకూ నా విశ్వాసం కొంతమట్టుకు బలహీనపడింది. నా మతం నిర్బంధమైనదనీ, సహేతుకమైనది కాదని వాళ్ళు చెబుతూవుండేవారు, ఇది నన్ను నిరుత్సాహపర్చసాగింది. అయితే, క్రైస్తవ సూచనలు నిర్బంధించడానికి బదులు రక్షణకరంగా పని చేస్తాయని నేనర్థం చేసుకునేందుకు అమ్మానాన్నలు సహాయపడ్డారు. మునుపటి నా సహచరులకన్నా నేను మరింత తృప్తికరమైన జీవితాన్ని జీవించేందుకు ఈ సూత్రాలు నాకు సహాయపడుతున్నాయని నేనిప్పుడు గ్రహిస్తున్నాను. నాయెడల నిజంగా శ్రద్ధ కనపర్చేవారిని అంటే అమ్మానాన్నలనూ మరియు యెహోవాను విశ్వసించడం ఎలాగో నేను నేర్చుకున్నాను—మరి నేను పయనీరు సేవలో ఆనందిస్తున్నాను.”
మనం ఏ వయస్కులమైనా, మన విశ్వాసాన్ని కించపర్చే వ్యాఖ్యానాలను చేసే ప్రజలను మనం ఎదుర్కొంటాం. వాళ్ళు ప్రాపంచికంగా తెలివిగల వారిలా కనిపిస్తారు, కానీ దేవునికి వారు లౌకికులూ ఆత్మీయత లేనివారు. (1 కొరింథీయులు 2:14) పౌలు దినాల్లోని ఓ పలుకుబడిగల గుంపు, కొరింథులో లౌకిక జ్ఞానంగల శంకితులు. ఈ తత్వశాస్త్రవేత్తల బోధలు కొందరు కొరింథు క్రైస్తవులు పునరుత్థానంలో విశ్వాసాన్ని పోగొట్టుకునేందుకు బహుశ నడిపాయి. (1 కొరింథీయులు 15:12) “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచినడవడిని చెరుపును” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు.—1 కొరింథీయులు 15:33.
మరోవైపున, మంచి సహవాసం మనలను ఆత్మీయంగా దృఢపరుస్తుంది. క్రైస్తవ సంఘంలో, విశ్వాస జీవితాన్ని జీవించే ప్రజలను మనం కలిసే అవకాశముంది. 1939లో సత్యం నేర్చుకున్న సహోదరుడు నార్మన్ నేటికీ అందరికీ గొప్ప ప్రోత్సాహానికి మూలం. ఆయన చక్కటి ఆత్మీయ దృక్పథాన్ని కల్గివుండేందుకు అతనికి ఏది సహాయపడింది? “కూటాలూ నమ్మకమైన సహోదరులతో సన్నిహిత సంబంధమూ ప్రాముఖ్యమని, ఇలాంటి సహవాసం దేవుని సంస్థకు సాతాను సంస్థకు మధ్య ఉన్న తేడాను నేను చూసేందుకు నాకు సహాయపడింది.
సంపదల మోసపూరితమైన శక్తి
“కేవలం తన సహజచోదన తన పరికరాలతో ఏకీభవించడంలేదని, ఓ పైలట్ కొన్నిసార్లు తన పరికరాలను తానే నమ్మలేకపోవచ్చు. తమ పరికరాలు వారి ఆలోచనకు విరుద్ధమైన విధంగా చూపించినప్పటికీ భూమ్మీది లైట్లు అచ్చంగా నక్షత్రాల్లా కనిపించాయి కనుక అనుభవజ్ఞులైన సైనిక పైలట్లు సహితం తలక్రిందులుగా ప్రయాణించారని తెలిసింది” అని అనుభవజ్ఞుడైన పైలట్ బ్రయన్ వివరిస్తున్నాడు.
అదేవిధంగా, మన స్వార్థపూరిత సహజచోదనం ఆత్మీయ భావంలో మనలను తప్పుదోవ పట్టించగలదు. సంపదలకు ‘మోసగించే శక్తి’ ఉంటుందని యేసు చెప్పాడు, అంతేకాకుండా ‘అనేకులు ధనమును ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయారు’ అని పౌలు చెప్పాడు.—మార్కు 4:19; 1 తిమోతి 6:10.
మిరుమిట్లుగొల్పే లైట్లలా మెరిసే ధనం యొక్క గమ్యాలు మనలను తప్పుదోవలో నడిపించవచ్చు. “నిరీక్షింపబడువాటి” యందు ఆనందించేబదులు, మనం గతించిపోతున్న ఈ లోకపు జీవపుడంబము వల్ల ప్రక్కదోవపడతాము. (హెబ్రీయులు 11:1; 1 యోహాను 2:16, 17) మనం సంపన్న జీవిత విధానాన్ని పొందేందుకు ‘తీర్మానించుకున్నట్లయితే’ మన ఆత్మీయ పెరుగుదలకు సమయం సరిపోకపోవచ్చు.—1 తిమోతి 6:9, NW; మత్తయి 6:24; హెబ్రీయులు 13:5.
పాట్రిక్ అనే ఓ యౌవన వివాహితుడు, అతనూ అతని భార్య, ఓ మంచి జీవన విధానాన్ని అనుభవించేందుకు ఆత్మీయ గురులను త్యజించారని అంగీకరించాడు. ఆయన ఇలా వివరించాడు: “సంఘంలో పెద్ద పెద్ద కార్లూ విలాసవంతమైన ఇళ్ళు ఉన్న వారి ప్రభావానికి మేము గురయ్యాము. రాజ్య నిరీక్షణను పోగొట్టుకోనప్పటికీ, మేము కూడా విలాసవంతమైన జీవితాన్ని కల్గివుండాలని భావించాము. అయినా, ఈ మధ్యలో నిజమైన ఆనందం యెహోవానుండి, ఆత్మీయ పెరుగుదలనుండి వస్తుందని మేము సకాలంలో గ్రహించాము. ఇప్పుడు మరలా మా జీవితాలు మామూలుగానే ఉన్నాయి. మేము పని చేసే గంటలను తగ్గించుకున్నాము, మరి మేము క్రమ పయినీర్లమయ్యాము.”
విశ్వాసం గ్రహించే హృదయంపై ఆధారపడివుంటుంది
యెహోవాయందు నమ్మకం పెంచుకునేందుకు ఓ గ్రహించే హృదయం ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. నిజమే, “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై [లేక, “ఒప్పింపజేసే రుజువు,” అథఃస్సూచి, NW] యున్నది.” (హెబ్రీయులు 11:1) అయితే మనకు గ్రహించే హృదయం లేకపోతే, మనం నమ్మించబడడం సాధ్యంకాకపోవచ్చు. (సామెతలు 18:15; మత్తయి 5:6) ఈ కారణంగానే అపొస్తలుడైన పౌలు, “విశ్వాసము అందరికీ లేదు” అని చెప్పాడు.—2 థెస్సలొనీకయులు 3:2.
మరి, అందుబాటులో ఉన్న నమ్మించే రుజువులకు మన హృదయాలు ప్రతిస్పందించేలా ఎలా చేసుకోగలం? దైవిక లక్షణాలను, అంటే విశ్వాసాన్ని కలిగించి దాన్ని అధికంచేసే లక్షణాలను అలవర్చుకోవడంద్వారా అలా చేయవచ్చు. ‘మన విశ్వాసానికి సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయను అమర్చుకోండి’ అని పేతురు మనకు ఉద్బోధిస్తున్నాడు. (2 పేతురు 1:5-7; గలతీయులు 5:22, 23) అయితే, మనం స్వయం జీవనాన్ని జీవిస్తుంటే లేక యెహోవాకు నామకార్థ సేవను మాత్రమే అందిస్తూంటే మన విశ్వాసం పెరుగుతుందని సహేతుకంగా మనం అపేక్షించలేము.
యెహోవా వాక్యాన్ని చదివి ఆచరణలో పెట్టేందుకు ఎజ్రా “దృఢనిశ్చయము చేసికొనెను.” (ఎజ్రా 7:10) అలాగే మీకాకు గ్రహించే హృదయం ఉండేది. “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.”—మీకా 7:7.
అంతకుముందు చెప్పిన మాగ్దలీనా కూడా యెహోవాకొరకు ఎదురు చూస్తోంది. (హబక్కూకు 2:3) ఆమె ఇలా చెబుతుంది: “మనకు ఆత్మీయ పరదైసు ఇప్పుడే ఉంది. రెండవది, భౌతిక పరదైసు, త్వరలోనే వస్తోంది. ఈ మధ్య కాలంలో లక్షలాది మంది గొప్పసమూహంలోకి చేరుతున్నారు. దేవుని సంస్థలోకి అనేకులు రావడాన్ని చూడడం నన్ను ఉప్పొంగజేస్తుంది.”
మన రక్షణకుడైన దేవునివైపు చూడడం
మన విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకునేందుకు, మనం విశ్వాసాన్ని కల్గివుండడమూ, యెహోవా మరియు ఆయన సంస్థ నుండి వచ్చే నడిపింపును జాగ్రత్తగా వినడం అవసరం. నిశ్చయంగా అది అంత కృషి చేయదగినదే. ఓ పైలట్, ఎంతో కష్టతరమైన పెద్ద ప్రయాణం తర్వాత క్రిందికి దిగి చివరికి దట్టమైన మేఘాలను ఛేదించుకుని వచ్చినప్పుడు గొప్ప సంతృప్తిని పొందుతాడు. అదిగో అతని ముందు భూమి పచ్చగా స్వాగతం పలుకుతూ కనిపిస్తుంది. క్రిందనున్న విమానాశ్రయం రన్వే అతన్ని ఆహ్వానించేందుకు వేచి ఉంది.
మిమ్మల్ని ఉత్కంఠపరిచే ఓ అనుభూతి మీ కొరకుకూడా వేచివుంది. ఈ మబ్బుకమ్మిన దుష్టలోకం నీతియుక్తమైన నూతన భూమికి త్రోవనిస్తుంది. ఓ దైవిక ఆహ్వానం మీకొరకు వేచివుంది. మనం కీర్తనల గ్రంథకర్త మాటలను గైకొన్నట్లయితే మనం అక్కడికి చేరుకోగలం: “నా ప్రభువా, యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. . . . నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.”—కీర్తన 71:5, 6.