కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 6/1 పేజీలు 21-26
  • పైఅధికారులకు మన పరిమితమైన విధేయత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పైఅధికారులకు మన పరిమితమైన విధేయత
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు?”
  • “అందరికి వారి వారి రుణములు తీర్చుడి”
  • “భయము” మరియు “సన్మానము”
  • పరిమితమైన విధేయత
  • “పరిపాలకునిగా దేవునికి లోబడవలెను”
  • “సాత్వికము మరియు ప్రగాఢ గౌరవము”
  • అధికారాన్ని గూర్చి క్రైస్తవ దృక్పథము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మీరు పన్నులు కట్టాలా?
    కావలికోట: మీరు పన్నులు కట్టాలా?
  • పై అధికారుల విషయములో క్రైస్తవుల దృష్టి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • అధికారం పట్ల గౌరవం ఉండడం—ఎందుకంత ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 6/1 పేజీలు 21-26

పైఅధికారులకు మన పరిమితమైన విధేయత

“కాబట్టి . . . లోబడియుండుటకు బలమైన కారణము కలదు..”—రోమీయులు 13:5.

1. నాజీ అధికారులనుండి యెహోవా సాక్షులు ఎటువంటి కఠినమైన అనుభవములను కలిగియుండిరి, మరియు ఇది వారు “చెడ్డపని చేసినందుకా”?

1940 జనవరి 7వ తారీఖున ఫ్రాన్జ్‌ రెయిటర్‌ ఇంకా ఐదుగురు ఆస్ట్రియాదేశ యౌవనస్థులు శిరచ్ఛేధము చేయబడిరి. వారు బైబెల్‌ఫోర్‌షెర్‌, యెహోవా సాక్షులై యుండిరి, మరియు వారు ఎందుకు మరణించిరంటే వారు మనస్సాక్షిపూర్వకముగా హిట్లరు పరిపాలన కొరకు ఆయుధములు ధరించలేదు. రెండవ ప్రపంచయుద్ధ కాలములో చనిపోయిన వేలాదిమంది సాక్షులలో రెయిటర్‌ ఒకరు మాత్రమే. అనేక మంది కాన్‌సెంట్రేషన్‌ క్యాంపులలో అనేక సంవత్సరములు సహించిరి. వీరందరు “చెడ్డది చేసినందుననే” నాజీ పైఅధికారముయొక్క “ఖడ్గమును” అనుభవించిరా? (రోమీయులు 13:4) ఖచ్ఛితముగా కాదు! వారు అధికారులనుండి బాధననుభవించినను, రోమీయులు 13వ అధ్యాయములో ఉన్న దేవుని ఆజ్ఞలకు లోబడిరని పౌలు మాటలు చూపించుచున్నవి.

2. పైఅధికారులకు లోబడియుండుటకు ఏ బలమైన కారణము కలదు?

2 రోమీయులు 13:5లో (NW) అపొస్తలుడు ఇట్లు వ్రాసెను: “కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షినిబట్టియు లోబడియుండుటకు బలమైన కారణము కలదు.” అంతకుముందు పౌలు, లోబడియుండుటకు మంచి కారణముతో అధికారులు “ఖడ్గము” ధరించియున్నారని చెప్పెను. అయితే ఇప్పుడు, ఆయన మరియెక్కువ బలమైన కారణమును: మనస్సాక్షినిగూర్చి చెప్పుచున్నాడు. మనము“నిర్మలమైన మనస్సాక్షితో” దేవుని సేవించుటకు కృషిచేయుదము. (2 తిమోతి 1:3) పైఅధికారులకు లోబడియుండుమని బైబిలు మనకు చెప్పుచున్నది, కాగా మనము లోబడుదుము ఎందుకంటే మనము దేవుని కన్నులకు సరియైన దానిని చేయుటకు కోరుకొందుము. (హెబ్రీయులు 5:14) నిజముగా, బైబిలుచే శిక్షణ ఇవ్వబడిన మన మనస్సాక్షి, మనలను పరిశీలించుటకు ఏ మానవుడును అక్కడ లేకపోయినను అధికారమునకు లోబడుటకు మనలను కదిలించును.—ప్రసంగి 10:20 పోల్చుము.

“ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు?”

3, 4. యెహోవా సాక్షులు ఎటువంటి పేరును కలిగియున్నారు, మరియు క్రైస్తవులు పన్నులు ఎందుకు చెల్లించవలెను?

3 కొన్ని సంవత్సరముల క్రితం నైజీరియాలో, పన్నులు చెల్లించుట సంబంధముగా అల్లర్లు చెలరేగినవి. అనేకమంది తమ ప్రాణాలను కోల్పోయారు, అధికారులు సైన్యాన్ని పిలిపించారు. సైనికులు కూటములు జరుగుచున్న రాజ్యమందిరములోనికి ప్రవేశించి, అక్కడ సమావేశమగుటలోని ఆంతర్యమేమిటో తెలియజేయుమని అడిగిరి. అది యెహోవా సాక్షుల బైబిలు పఠన కూటమని తెలిసికొనినమీదట, వారిపై అధికారి “యెహోవా సాక్షులు పన్నుల విషయములో ఆందోళన చేయువారు కారని” చెప్పుచు సైనికులను వెళ్లుమని చెప్పెను.

4 నైజీరియాలో ఆ సాక్షులు పౌలుయొక్క ఈ మాటల కనుగుణ్యముగా జీవించుచున్నారను పేరును కలిగియుండిరి: “ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.” (రోమీయులు 13:6) ‘కైసరువి కైసరుకు చెల్లించుడను’ నియమమును యేసు ఇచ్చినప్పుడు, ఆయన పన్నులు కట్టుటనుగూర్చి మాట్లాడుచుండెను. (మత్తయి 22:21) లౌకిక అధికారములు రహదారులను, పోలీసు రక్షణను, గ్రంథాలయములను, ప్రయాణ సౌకర్యములను, పాఠశాలలను, తపాలా సేవలను, ఇంకా ఎన్నో పనులను చేయుదురు. మనము తరుచు ఈ ఏర్పాట్లను ఉపయోగించుకొందుము. కావున వారికి పన్నుల రూపమున చెల్లించుట కేవలము సరియైన పనియైయున్నది.

“అందరికి వారి వారి రుణములు తీర్చుడి”

5. “అందరికి వారి వారి రుణములను తీర్చుడి” అనుమాటల భావమేమైయున్నది?

5 పౌలు ఇంకను ఇట్లనుచున్నాడు: “కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని యెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి రుణములను తీర్చుడి.” (రోమీయులు 13:7) “అందరు” అను పదములో దేవుని ప్రజాసేవకుడైన ప్రతి లౌకిక అధికారముకూడ చేరియున్నది. మినహాయింపులు లేవు. మనము వ్యక్తిగతముగా ఇష్టపడని రాజకీయ విధానముక్రింద మనము జీవించుచున్నను, మనము పన్నులు చెల్లింతుము. మనము జీవించుచోట మతములు పన్నునుండి మినహాయింపబడినట్లయిన, సంఘములు దీనినుండి ప్రయోజనము పొందవచ్చును. ఇతర పౌరులవలెనే, తాము చెల్లించు పన్నులను పరిమితము చేయుటకు తయారుచేయబడిన ఏ చట్టబద్ధమైన ఏర్పాట్లనైనను ఉపయోగించుకొనవచ్చును. అయితే క్రైస్తవుడనబడిన ఏ వ్యక్తియు చట్టవిరుద్ధముగా పన్నులను ఎగవేయకూడదు.—మత్తయి 5:41; 17:24-27 పోల్చుము.

6, 7. మనమంగీకరించని దానికొరకు ద్రవ్యసహాయము చేయుటకై డబ్బు ఇవ్వబడినను లేక అధికారులు మనను హింసించినను మనమెందుకు పన్నులు చెల్లింపవలెను?

6 ఉదాహరణకు, పన్ను అన్యాయముగా కన్పించవచ్చును. లేక ఉచిత గర్భస్రావములు, రక్త నిధులు, లేక మన తటస్థ అభిప్రాయములకు భిన్నమైన కార్యక్రమములకు డబ్బు సహాయము చేయుటకు పన్నుగావచ్చిన సొమ్ములో కొంత భాగము ఉపయోగింపబడుచున్నట్లయిన అప్పుడు సంగతేమి? మనమింకను పన్నులు చెల్లింతుము. పన్నుల రూపమున వచ్చు ధనమును ఉపయోగించు విధానమునకు అధికారులు బాధ్యతవహించవలెను. అధికారమునకు తీర్పుతీర్చుటకు మనకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. దేవుడు ‘భూలోకమునకు న్యాయాధిపతియై’ యున్నాడు, మరియు ఆయన స్వంత సమయములో ప్రభుత్వములు తమ అధికారమును ఎట్లు ఉపయోగించిరో లెక్క అప్పగించుకొనును. (కీర్తన 94:2; యిర్మీయా 25:31) అది జరుగు పర్యంతము మనము పన్నులు చెల్లింతుము.

7 అధికారము మనలను హింసించినట్లయిన అప్పుడేమి? మనమింకను పన్నులు చెల్లింతుము ఎందుకనగా ప్రతిదినము చేయబడుచున్న సేవల కొరకు. ఒకానొక ఆఫ్రికా దేశములో సాక్షులు అనుభవించుచున్న హింసనుగూర్చి, సాన్‌ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్‌ ఇట్లు చెప్పినది: “మీరు వారిని మాదిరికరమైన పౌరులుగా పరిగణించవచ్చును. వారు పన్నులు చెల్లింతురు, రోగులను ఆదరింతురు, నిరక్ష్యరాస్యతను తొలగించుటకు పోరాడుదురు.” అవును, హింసింపబడిన ఆ సాక్షులు తమ పన్నులు చెల్లించిరి.

“భయము” మరియు “సన్మానము”

8. అధికారముయెడల మనము కలిగియుండవలసిన “భయము” ఏమైయున్నది?

8 రోమీయులు 13:7 లో చెప్పబడిన “భయము” పిరికి తనముతో కూడినది కాదు, బదులుగా లౌకిక అధికారముయెడల గౌరవము, దాని శాసనమును ఉల్లంఘించుటకు భయపడుటయై యున్నది. ఈ గౌరవము అది చేరియున్న స్థానమును బట్టియే గాని, అన్నిసమయములలో ఒకానొక వ్యక్తి ఆ స్థానమునకు వచ్చినందువలన కాదు. రోమా చక్రవర్తియైన తిబెరినిగూర్చి బైబిలు ప్రవచనార్థకముగా మాట్లాడుచు, అతనిని “నీచుడని” పిలిచెను. (దానియేలు 11:21) అయితే అతడు చక్రవర్తియైనందున, ఒక క్రైస్తవుడు అతనికి భయపడి, అతని సన్మానించియుండవచ్చును.

9. మానవ అధికారములను సన్మానముచూపు మార్గములు కొన్నిఏమైయున్నవి?

9 సన్మానము విషయములో, మనము మతసంబంధమైన స్థానముమీద ఆధారపడిన బిరుదులు ఇవ్వకూడదను యేసు ఆజ్ఞను అనుసరింతుము. (మత్తయి 23:8-10) అయితే లౌకిక అధికారుల విషయము వచ్చినప్పుడు, వారిని సన్మానించుటకు కావలసిన ఎటువంటి బిరుదునైనను ఉపయోగించుటకు మనము సంతోషింతుము. రోమా రాజపరిపాలకులతో మాట్లాడినప్పుడు, పౌలు “మహాఘనత వహించిన” అను పదమును ఉపయోగించెను. (అపొ.కార్యములు 26:25) దానియేలు నెబుకద్నెజరును “నా ప్రభువా” అని పిలిచెను. (దానియేలు 4:19 NW) ఈనాడు, క్రైస్తవులు “తమరు” (Your Lordship) “గౌరవనీయులైన” (Your Majesty) అను పదములను ఉపయోగించవచ్చును. న్యాయాధిపతి సభలో ప్రవేశించినప్పుడు లేచి నిలువబడవచ్చును లేక అది ఆచారమైనట్లయిన ఒక పరిపాలకునియెదుట గౌరవపూర్వకముగా తలవంచవచ్చును.

పరిమితమైన విధేయత

10. మానవ అధికారము ఒక క్రైస్తవునినుండి అడుగగల దానికి పరిమితి కలదని యేసు ఎట్లు చూపించెను?

10 యెహోవా సాక్షులు మానవ అధికారమునకు లోబడియుండవలెను గదా, మరి ఫ్రాన్జ్‌ రెయిటర్‌ మరియు ఇతరులనేకులు ఎందుకు అటువంటి శిక్షననుభవించిరి? ఎందుకనగా మన విధేయత పరిమితమైనది, మరియు అది అడుగగల సంగతులకు బైబిలు నియమించిన పరిమితులు కలవను విషయమును అధికారము అన్ని సమయములలో గుర్తించదు. శిక్షణ ఇవ్వబడిన ఒక క్రైస్తవుని మనస్సాక్షిని అభ్యంతరపరచు ఒకసంగతిని అధికారము అడిగినప్పుడు, అది దేవుడిచ్చిన పరిమితిని దాటివెళ్లుచున్నది. దీనిని సూచించుచు యేసు ఇట్లుచెప్పెను: “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.” (మత్తయి 22:21) కైసరు దేవునికి చెందినవాటిని అడిగినట్లయిన, ఎక్కువ అడిగే అధికారము దేవునికే కలదని మనము గుర్తించవలెను.

11. మానవ అధికారము అడుగగల దానికి పరిమితులుగలవని ప్రదర్శించుచున్న ఏ సూత్రము బహుగా అంగీకరింపబడినది?

11 ఈ వైఖరి వినాశకమైనది లేక విశ్వాసఘాతుకమైనదై యున్నదా? ఎంతమాత్రము కాదు. వాస్తవానికి, ఇది బహుగా నాగరికత చెందిన దేశములు గుర్తించిన సూత్రముయొక్క విస్తరణయైయున్నది. 15వ శతాబ్దములో, యూరపునందు తన ఆధిపత్యముగల ప్రాంతమందు భయానక పరిస్థితి చెలరేగుటకు మూలకారకుడైన పీటర్‌ ఓన్‌ హాగన్‌బాక్‌ న్యాయవిచారణకు పిలువబడినప్పుడు, తాను కేవలము తన పైఅధికారియగు, బర్‌గండి సంస్థానాధిపతి ఆజ్ఞలను పాటించుచుంటినని అతడు చేసిన వాదన కొట్టివేయబడెను. అప్పటినుండి పైఅధికారుల ఆజ్ఞలను పాటించుచు, ఒక వ్యక్తి కౄరమైన పాశవిక చర్యలు చేసినను,—నాజీ యుద్ధ నేరస్థులు బహుగా అట్లు చేసిరి—దానికి అతడు జవాబుదారుడు కాదు అను విషయము అనేకమార్లు, న్యూరంబెర్గ్‌లోని అంతర్జాతీయ అధికరణస్థానంలో (కోర్టు) ప్రస్తావనకు వచ్చెను. ఆ వాదన సాధారణముగా నిరాకరింపబడెను. ఆ అంతర్జాతీయ అధికరణము తన తీర్పులో ఇట్లుచెప్పెను: “ఆయా దేశములు విధించిన జాతీయ బాధ్యతలను అధిగమించు అంతర్జాతీయ విధులను ఆయావ్యక్తులు కలిగియున్నారు.”

12. అధికారము కారణరహితముగా అడిగిన విషయములను దేవుని సేవకులు నిరాకరించిన లేఖననానుసారమైన ఉదాహరణలు కొన్ని ఏమైయున్నవి?

12 దేవుని సేవకులు అన్ని సమయములలో తాము మనస్సాక్షిపూర్వకముగా రుణపడియున్న విధేయతకు పరిమితులున్నవని గుర్తించిరి. మోషే ఐగుప్తులో జన్మించు సమయమున, క్రొత్తగా జన్మించిన హెబ్రీ మగశిశువులనందరిని చంపవలెనని, ఫరో హెబ్రీయులైన ఇద్దరు మంత్రసానులకు ఆజ్ఞాపించెను. అయితే ఆ మంత్రసానులు, అట్లు చేయక మగపిల్లలను బ్రదుకనిచ్చిరి. ఫరోకు లోబడకుండుట వారి విషయమై తప్పుకాదా? లేదు, వారు దేవుడు తమకిచ్చిన మనస్సాక్షినిబట్టి నడచుకొనిరి, కాగా దేవుడు దానికొరకు వారిని ఆశీర్వదించెను. (నిర్గమకాండము 1:15-20) ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనుండగా, నెబుకద్నెజరు హెబ్రీ యువకులైన షద్రకు, మేషాకు, అబెద్నెగోలతోసహా తన అధిపతులందరు, దూరాయను మైదానములో తాను నిలువబెట్టించిన ప్రతిమకు సాగిలపడి నమస్కరించవలెనని ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు హెబ్రీయులు నిరాకరించిరి. మరి వారు తప్పిదస్థులా? రాజాజ్ఞకు లోబడుట దేవుని నియమమును ఉల్లంఘించినట్లగును గనుక అది తప్పు కాదు.—నిర్గమకాండము 20:4, 5; దానియేలు 3:1-18.

“పరిపాలకునిగా దేవునికి లోబడవలెను”

13. పైఅధికారులకు పరిమితమైన విధేయతనుచూపు విషయములో తొలి క్రైస్తవులు ఎటువంటి మాదిరినుంచిరి?

13 అదేప్రకారము, యూదా అధికారులు పేతురు యోహానులను యేసునుగూర్చి ప్రకటించుటను ఆపుజేయుమని ఆజ్ఞాపించినప్పుడు, వారిట్లు సమాధానమిచ్చిరి: “దేవునిమాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి.” (అపొ.కార్యములు 4:19; 5:29) వారు మౌనముగా ఉండలేకపోయిరి. పత్రికయగు ది క్రిస్టియన్‌ సెంచురి తొలి క్రైస్తవులు మనస్సాక్షిపూర్వకముగా ధృఢముగా నిలిచిన మరొక సంఘటనవైపు దృష్టిమళ్లించుచు, యిట్లు చెప్పుచున్నది: “తొలి క్రైస్తవులు సైన్యమందు పనిచేయలేదు. ‘క్రొత్తనిబంధన ముగిసిన కాలమునుండి ఎ.డి. 170-180 దశాబ్దము వరకు ఏ క్రైస్తవుడైనను సైన్యమందు ఉండెననుటకు ఎటువంటి రుజువు లేదని’ రొలాండ్‌ బెయింటన్‌ వ్రాయుచున్నాడు. (క్రిస్టియన్‌ ఆటిట్యూడ్స్‌ టువార్డ్‌ వార్‌ అండ్‌ పీస్‌ [అబింగ్‌డన్‌, 1960], పు. 67-8). . . . జస్టిన్‌ మార్టిర్‌ ‘హింసాయుత కార్యములనుండి వైదొలగుట క్రైస్తవులు గైకొనవలసిన మార్గముగా తీసుకొనెనని’ స్విఫ్ట్‌ చెప్పుచున్నాడు.”

14, 15. మానవ అధికారములయెడల పరిమితమైన విధేయత చూపుటలో క్రైస్తవులకు నడిపింపునిచ్చిన బైబిలు సూత్రములు కొన్ని ఏమైయున్నవి?

14 తొలి క్రైస్తవులు సైనికులుగా ఎందుకు సేవచేయలేదు? నిస్సందేహముగా ప్రతిఒక్కరు జాగ్రత్తగా దేవుని వాక్యమును నియమములను పఠించి, బైబిలు శిక్షణయివ్వబడిన మనస్సాక్షిమీద ఆధారపడి వ్యక్తిగత నిర్ణయము చేసుకొనిరి. వారు “లోకసంబంధులు కాదు” గనుక తటస్థముగా ఉండిరి, మరియు వారి ఈ తటస్థ వైఖరి ఈ లోక సంఘర్షణలలో వారు ఒక పక్షము వహించుటను నిషేధించినది. (యోహాను 17:16; 18:36) అంతేకాకుండ, వారు దేవునికి చెందినవారైయుండిరి. (2 తిమోతి 2:19) దేశముకొరకు వారు తమ ప్రాణములనర్పించుట, దేవునికి చెందినవాటిని కైసరుకు చెల్లించినట్లయ్యెడిది. మరియు, వారు పరస్పరము ప్రేమించుకొను బంధముగల అంతర్జాతీయ సహోదరత్వమందు భాగమైయుండిరి. (యోహాను 13:34, 35; కొలొస్సయులు 3:14; 1 పేతురు 4:8; 5:9) తోటి క్రైస్తవుని చంపు సాధ్యమున్నందున వారు మంచి మనస్సాక్షితో ఆయుధములు చేపట్టలేకపోయిరి.

15 దీనికి తోడు, క్రైస్తవులు చక్రవర్తి ఆరాధనవంటి జనసమ్మతమైన మత ఆచరణలలో పాల్గొనలేరు. తత్ఫలితముగా వారు, “విపరీతమైన మరియు ప్రమాదకరమైన వారిగా” దృష్టింపబడిరి, “కాగా మిగతా ప్రజలు సహజముగానే వారిని సందేహించిరి.” (డబ్ల్యు. ఎ. స్మార్ట్‌ వ్రాసిన, స్టిల్‌ ది బైబిల్‌ స్పీక్స్‌) ‘ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయము కలిగియుండవలెనని’ పౌలు క్రైస్తవులకు వ్రాసినను, వారు మరిగొప్పదైన భయము మరియు గౌరవమునివ్వవలసిన యెహోవాను వారు మరచిపోలేదు. (రోమీయులు 13:7; కీర్తన 86:11) యేసు తానుగా ఇట్లనెను: “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ గెహెన్నాలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.”—మత్తయి 10:28 NW.

16. (ఎ) పైఅధికారులకు విధేయత చూపు విషయములో ఏ రంగములయందు క్రైస్తవులు జాగ్రత్తగా ఆలోచించవలెను? (బి) పుట 25లోని బాక్సు దేనిని దృష్టాంతపరచుచున్నది?

16 క్రైస్తవులుగా, మనము ఈనాడు అటువంటి సవాలులనే ఎదుర్కొందుము. విగ్రహారాధనయొక్క ఏ ఆధునిక రూపాంతరణయందైనను మనము భాగము వహించలేము—బహుశ అది ఒక ప్రతిమ లేక చిహ్నముయెడల, లేక రక్షణార్థముగా ఒక వ్యక్తి లేక సంస్థయెడల ఆరాధనాపూర్వక అభినయమైయుండవచ్చును. (1 కొరింథీయులు 10:14; 1 యోహాను 5:21) తొలి క్రైస్తవులవలెనే, మనముకూడ మన క్రైస్తవ తటస్థత విషయములో రాజీపడలేము.—2 కొరింథీయులు 10:4 పోల్చుము.

“సాత్వికము మరియు ప్రగాఢ గౌరవము”

17. మనస్సాక్షి కారణముగా బాధనొందుచున్న వారికి పేతురు ఏ సలహానిచ్చెను?

17 మనస్సాక్షి పూర్వకమైన స్థానమునుగూర్చి వ్రాయుచు అపొస్తలుడైన పేతురు ఇట్లు చెప్పుచున్నాడు: “ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి దుఃఖము సహించినయెడల అది హితమగును.” (1 పేతురు 2:19) అవును, హింస కలిగినను స్థిరముగా నిలిచియుండు క్రైస్తవులు దేవునికి అంగీకృతముగా యుందురు, మరియు మరొక ప్రయోజనముకూడ కలదు, అదేదనగా క్రైస్తవుని విశ్వాసము బలపరచబడి శుద్ధపరచబడును. (యాకోబు 1:2-4; 1 పేతురు 1:6, 7; 5:8-10) పేతురు ఇంకను ఇలా వ్రాసెను: “మీరొకవేళ నీతినిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే; వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి; నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను ప్రగాఢ గౌరవముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగాయుండి, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతురు 3:14, 15 NW) నిజముగా సహాయకరమైన సలహాయైయున్నది!

18, 19. మన ఆరాధనా స్వాతంత్ర్యము పైఅధికారము పరిమితులను విధించినట్లయిన ప్రగాఢగౌరవ దృక్పధము మరియు కారణయుక్తముగా ఉండుట ఎట్లు సహాయపడగలదు?

18 క్రైస్తవ స్థానమును అధికారులు తప్పుగా అర్థము చేసికొనినందున లేక క్రీస్తుమత సామ్రాజ్య మతనాయకులు యెహోవా సాక్షులనుగూర్చి అధికారులకు తప్పుగా చెప్పినందున హింస చెలరేగినప్పుడు, అధికారులకు వాస్తవములను తెలియజేయుటవలన ఒత్తిడి తగ్గవచ్చును. సాత్వికము మరియు ప్రగాఢ గౌరవము గలవాడై ఒక క్రైస్తవుడు హింసించువారికి వ్యతిరేకముగా శరీరకముగా పోరాడడు. అయితే తన విశ్వాసమును కాపాడుకొనుటకు అందుబాటులోయున్న చట్టబద్ధమైన ప్రతి దానిని ఆయన ఉపయోగించును. ఆ పిమ్మట విషయములను యెహోవా చేతులలో విడిచిపెట్టును.—ఫిలిప్పీయులు 1:7; కొలొస్సయులు 4:5, 6.

19 అధికారమునకు విధేయత చూపుటకు, తన మనస్సాక్షికి ఆటంకము కలుగకుండ, ఒక క్రైస్తవుడు తాను వెళ్లగలిగినంత దూరము వెళ్లునట్లుకూడ ప్రగాఢ గౌరవము నడిపించును. ఉదాహరణకు, సంఘకూటములు నిషేధింపబడినట్లయిన, యెహోవాబల్లయొద్ద భోజనము చేయుటను కొనసాగించునట్లు క్రైస్తవులు, ఇతరులు అంత సులభముగా కనుగొనలేని మార్గమును చూచెదరు. సర్వోన్నత అధికారియగు, యెహోవా దేవుడు, పౌలుద్వారా మనకిట్లు తెల్పుచున్నాడు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, . . . ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) అయితే ఆ విధముగా కూడుకొనుటను వివేకముతో చేయవలెను. కేవలము కొద్దిమంది మాత్రమే హాజరైయున్నను, అటువంటి ఏర్పాట్లను దేవుడు ఆశీర్వదించునను నమ్మకమును మనము కలిగియుండగలము.—మత్తయి 18:20 పోల్చుము.

20. బహిరంగముగా సువార్త ప్రకటించుట నిషేధింపబడినట్లయిన, క్రైస్తవులు ఆ పరిస్థితితో ఎట్లు వ్యవహరించవచ్చును?

20 ఆ ప్రకారము, కొన్ని అధికారములు సువార్తను బహిరంగముగా ప్రకటించుటను నిషేధించినవి? అటువంటి వాటిక్రింద జీవించు క్రైస్తవులు యేసుద్వారా సర్వోన్నత అధికారి చెప్పినదానిని గుర్తుతెచ్చుకొందురు: “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపవలెను.” (మార్కు 13:10) కాబట్టి, అది తమయెడల ఎంతటి మూల్యమైనను వారు సర్వోన్నత అధికారమునకు లోబడుదురు. సాధ్యమైన చోటాల్ల, అపొస్తలులు బహిరంగముగాను ఇంటింటను ప్రకటించిరి, అయితే ప్రజలను చేరుటకు తటస్థసాక్ష్యమువంటి మార్గములును కలవు. (యోహాను 4:7-15; అపొ.కార్యములు 5:42; 20:20) కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించినట్లయిన తరచుగా అధికారులు ప్రకటించుపనిలో కలుగజేసుకొనరు—ఇది సాక్షులందరు లేఖనములలోనుండి తర్కించుటకు మంచి శిక్షణ పొందినవారైయుండవలసిన అవసరతను నొక్కి తెలియజేయుచున్నది. (అపొ.కార్యములు 17:2, 17 పోల్చుము.) ధైర్యముగా, అయితే గౌరవపూర్వకముగా, క్రైస్తవులు తరచు పైఅధికారులకు కోపము రప్పించకుండానే యెహోవాకు లోబడు మార్గమును కనుగొనవచ్చును.—తీతు 3:1, 2.

21. కైసరు నిర్దాక్షిణ్యముగా హింసించుచున్నట్లయిన, క్రైస్తవులు ఏ విధానమును ఎంపికచేసుకొనవలెను?

21 కొన్నిసార్లు, అధికారము క్రైస్తవులను నిర్దాక్షిణ్యముగా హింసించవచ్చును. అలాంటప్పుడు, మంచి మనస్సాక్షితో, మంచిని చేయుచు మనము కేవలము సహించవలెను. యౌవనుడైన ఫ్రాన్జ్‌ రెయిటర్‌ దేనినో ఒకదానినిమాత్రమే ఎంపికచేసుకొనుటను ఎదుర్కొనెను: విశ్వాసములో రాజీపడుట లేక మరణించుట. ఆయన దేవుని సేవించుటను ఆపుజేయలేడు గనుక, ఆయన ధైర్యముగా మరణించుటకు నడిచెను. చనిపోవుటకు ముందురాత్రి, ఫ్రాన్జ్‌ తన తల్లికి ఇలా ఉత్తరము వ్రాసెను: “రేపు ఉదయం నాకు మరణశిక్ష అమలు జరుపబడుతుంది. గతకాలమంతటిలో నిజమైన క్రైస్తవులందరి విషయములో నిజమైయున్నట్లుగానే, నేను దేవునియందు నా బలమును కలిగియున్నాను. . . . మీరు మరణమువరకు స్థిరముగా నిలువబడినట్లయిన, మనము పునరుత్థానమందు మరలా కలుసుకుంటాము.”

22. మనకే నిరీక్షణ కలదు, మరియు అదే సమయములో మనమేమి చేయుటకు ఆరంభించవలెను?

22 ఒకరోజు మానవజాతియావత్తు కేవలము ఒకేఒక శాసనము, యెహోవా దేవుని శాసనము క్రింద ఉండును. అప్పటివరకు, యెహోవా దేవుని ఏర్పాటును గమనించి పైఅధికారులయెడల మన పరిమితమైన విధేయతను కాపాడుకొనుచు, అదేసమయములో అన్నివిషయములలో మన విశ్వసార్వభౌమాధిపతియైన యెహోవాకు లోబడుచు మనము మంచి మనస్సాక్షితో ఉండవలెను.—ఫిలిప్పీయులు 4:5-7. (w90 11/1)

మీకు జ్ఞాపకమున్నవా?

◻ పైఅధికారులకు విధేయతచూపుటకు ఏ బలమైన కారణము కలదు?

◻ కైసరు విధించిన పన్నులు చెల్లించుటకు మనమెందుకు వెనుదీయకూడదు?

◻ అధికారమునకు మనమెటువంటి గౌరవము చూపవలెను?

◻ కైసరుకు మన విధేయత కేవలము ఎందుకు పరిమితమై యున్నది?

◻ దేవునికి చెల్లించవలసినవి కైసరు అడిగినందున మనము హింసింపబడినట్లయిన, మనమెట్లు ప్రతిస్పందించవలెను?

[21వ పేజీలోని చిత్రసౌజన్యం]

French Embassy Press & Information Division

USSR Mission to the UN

[25వ పేజీలోని బాక్సు]

గౌరవము, ఆరాధన కాదు

ఒక రోజు ఉదయం తరగతి జరుగుచున్న సమయములో, కెనడాదేశపు యువ యెహోవా సాక్షియైన టెర్రా, తన ఉపాధ్యాయుడు కొద్ది సమయము కొరకు తన తోటి విద్యార్థినిని బయటకు తీసుకువెళ్లుటను గమనించెను. ఆ తర్వాత కొద్దిసమయమునకు, ఉపాధ్యాయుడు నెమ్మదిగా టెర్రానుకూడ తనతో ప్రధానోపాధ్యాయుని గదికిరమ్మని తీసుకువెళ్లాడు.

అక్కడకు వెళ్లిన టెర్రా, ప్రధానోపాధ్యాయుని బల్లపై అడ్డముగా కెనడాదేశపు జాతీయ పతాకము పరచబడియుండుటను గమనించెను. ఉపాధ్యాయుడు టెర్రాను దానిమీద ఉమ్మివేయుమని అడిగాడు. టెర్రా జాతీయగీతము పాడదు లేక జెండావందనము చేయదు గనుక, దానిమీద ఆమె అలాచేయకుండుటకు ఆమెకు కారణమేమియు లేదని ఆయన అనెను. యెహోవా సాక్షులు పతాకమును ఆరాధించకపోయినను, దానిని వారు గౌరవింతురని వివరించుచు, టెర్రా అట్లు చేయుటకు నిరాకరించెను.

తిరిగివచ్చి తరగతిగదిలో ఉపాధ్యాయుడు తానొక ప్రయోగము చేసితినని ప్రకటించెను. ఇద్దరు విద్యార్థినులను ఒకరిని ఒకసారి చొప్పున ప్రధానోపాధ్యాయుని గదికి తీసుకువెళ్లి పతాకముపై ఉమ్మివేయమని అడిగెను. మొదటి విద్యార్థిని దేశభక్తి ఆచరణలలో పాలుపంచుకొనినను, ఉమ్మివేయుమని తనతో చెప్పినప్పుడు ఆమె అట్లేచేసెను. అయితే దానికి భిన్నముగా, టెర్రా జాతీయగీతము పాడకపోయినను లేక పతాక వందనము చేయకపోయినను, ఈ విధముగా పతాకమును అవమానపరచుటకు తిరస్కరించెను. టెర్రా సరియైన గౌరవము చూపెనని ఉపాధ్యాయుడు సూచించెను.—యెహోవా సాక్షుల 1990 వార్షిక పుస్తకము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి