కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 5/1 పేజీలు 5-8
  • తొలి క్రైస్తవత్వం మరియు ప్రభుత్వం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తొలి క్రైస్తవత్వం మరియు ప్రభుత్వం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లోక సంబంధులు కారు, అయితే శత్రువులూ కారు
  • గౌరవించాలి, ఆరాధించకూడదు
  • “సమాజం ఒడ్డున”
  • కైసరుకు ‘చెల్లించవలసినవి’ చెల్లించడం
  • అడుగబడిన పోటీపడే రెండు విషయాల్లో జాగ్రత్తతో కూడిన సమతుల్యత
  • ప్రభుత్వంతో రాజీపడడం
  • తొలి క్రైస్తవులు, లోకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • దేవుడు, కైసరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • రాజీపడే తలంపే లేదు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఒక మంచి పౌరునిగా చేసేదేమిటి?
    తేజరిల్లు!—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 5/1 పేజీలు 5-8

తొలి క్రైస్తవత్వం మరియు ప్రభుత్వం

యేసు తన మరణానికి కొన్ని గంటల ముందు, తన అనుచరులతో “మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” అని చెప్పాడు. (యోహాను 15:19) అయితే, క్రైస్తవులు ఈ లోక ప్రభుత్వాల ఎడల శత్రు భావాన్ని కలిగివుండాలని దీని భావమా?

లోక సంబంధులు కారు, అయితే శత్రువులూ కారు

“ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను” అని అపొస్తలుడైన పౌలు రోమాలో నివసిస్తున్న క్రైస్తవులతో చెప్పాడు. (రోమీయులు 13:1) అలాగే, “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 2:13, 14) ప్రభుత్వానికి, దాని సరైన నియమిత ప్రతినిధులకు లోబడడం అనేది తొలి క్రైస్తవుల మధ్య అంగీకరించబడిన సూత్రమన్నది స్పష్టం. వారు చట్టానికి కట్టుబడి ఉండే పౌరులుగా ఉండేందుకు, సమస్త మనుష్యులతో సమాధానంగా జీవించేందుకు కృషిచేశారు.—రోమీయులు 12:18.

“చర్చి మరియు ప్రభుత్వం” అనే అంశం క్రింద ది ఎన్‌సైక్లోపీడియా అఫ్‌ రిలిజియన్‌ “సా.శ. మొదటి మూడు శతాబ్దాల్లో అధికారిక రోమా సమాజం నుండి క్రైస్తవ చర్చి చాలా ఒంటరిదయ్యింది . . . అయినప్పటికీ క్రైస్తవ నాయకులు . . . క్రైస్తవ విశ్వాసం పెట్టిన పరిమితుల్లో రోమా చట్టానికి విధేయులవ్వాలని, చక్రవర్తి ఎడల విశ్వాసాన్ని కలిగివుండాలని నేర్పించింది” అని ప్రకటిస్తుంది.

గౌరవించాలి, ఆరాధించకూడదు

క్రైస్తవులు రోమా చక్రవర్తికి శత్రువులు కారు. వారు ఆయన అధికారాన్ని గౌరవించారు, ఆయన స్థానానికి తగ్గట్లు ఆయనను సన్మానించారు. “అందరిని సన్మానించుడి, . . . రాజును సన్మానించుడి” అని నీరో చక్రవర్తి కాలంలో రోమా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో జీవిస్తున్న క్రైస్తవులకు అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 2:17) “రాజు” అనే పదాన్ని గ్రీకు మాట్లాడే ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల రాజులకే కాక రోమా చక్రవర్తికి కూడా ఉపయోగించారు. “ఎవనియెడల సన్మానముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికి వారి వారి ఋణములను తీర్చుడి” అని అపొస్తలుడైన పౌలు రోమా సామ్రాజ్య రాజధానిలో నివసిస్తున్న క్రైస్తవులకు ఉపదేశించాడు. (రోమీయులు 13:7) రోమా చక్రవర్తి కచ్చితంగా సన్మానాన్ని కోరాడు. కాలక్రమేణా ఆరాధనను కూడా ఆయన కోరాడు. అయితే, క్రైస్తవులు ఈ విషయంలో పరిధులను ఏర్పరచుకున్నారు.

సా.శ. రెండవ శతాబ్దంలో పోలీకార్ప్‌ రోమా గవర్నరు ముందు విచారణ చేయబడినప్పుడు “నేను క్రైస్తవుడను. . . . దేవుడు నియమించిన అధికారాలకు, అధికారులకు చెందవలసిన సన్మానాన్నంతా ఇవ్వాలని మాకు నేర్పబడింది” అని చెప్పినట్లు నివేదించబడింది. అయినప్పటికీ, పోలీకార్ప్‌, చక్రవర్తిని ఆరాధించడం కన్నా చనిపోవడాన్నే ఎన్నుకున్నాడు. “నేను నిజానికి చక్రవర్తిని ఆరాధించను, కాని ఆయనను సన్మానిస్తాను, ఆయన కోసం ప్రార్థిస్తాను. అయితే దేవుడ్ని, సజీవుడైన సత్య దేవుడ్ని ఆరాధిస్తాను” అని రెండవ శతాబ్దంలో క్రైస్తవత్వాన్ని సమర్థించిన అంతియొకయలోని థీయోఫలస్‌ వ్రాశాడు.

చక్రవర్తిని గూర్చిన సరైన ప్రార్థనలకు చక్రవర్తి ఆరాధనతోనో లేక జాతీయతతోనో ఏ మాత్రం సంబంధం లేదు. “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును, అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను” అని వాటి ఉద్దేశాన్ని అపొస్తలుడైన పౌలు వివరించాడు.—1 తిమోతి 2:1, 2.

“సమాజం ఒడ్డున”

తొలి క్రైస్తవుల గౌరవపూర్వకమైన ఈ ప్రవర్తన వారు నివసించిన లోకము యొక్క స్నేహాన్ని తెచ్చిపెట్టలేదు. తొలి క్రైస్తవులు “సమాజం ఒడ్డున జీవించారు” అని ఫ్రెంచ్‌ చరిత్రకారుడైన ఎ. హామన్‌ చెబుతున్నాడు. నిజానికి వాళ్ళు యూదా మరియు రోమా అనే రెండు సమాజాల ఒడ్డున జీవించారు, రెండింటి నుండి విపరీతమైన దురభిమానాన్ని, అపార్థాన్ని ఎదుర్కొన్నారు.

ఉదాహరణకు, యూదా నాయకులు తనపై అబద్ధ నేరారోపణను చేసినప్పుడు, అపొస్తలుడైన పౌలు రోమా గవర్నరు ముందు ఈ విధంగా ప్రతివాదన చేశాడు: ‘యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని. . . . కైసరు ఎదుటనే చెప్పుకొందును.’ (అపొస్తలుల కార్యములు 25:8, 11) యూదులు తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఎరిగిన పౌలు నీరోకు మనవి చేసుకున్నాడు, తద్వారా రోమా చక్రవర్తి అధికారాన్ని గుర్తించాడు. తరువాత, రోమ్‌లో తన మొదటి న్యాయవిచారణలో పౌలు నిర్దోషిగా విడుదల చేయబడినట్లు అనిపిస్తుంది. కాని తరువాత ఆయన చెరసాలలో మళ్ళీ వేయబడ్డాడు, మరి నీరో ఆజ్ఞ ప్రకారం ఆయనకు మరణశిక్ష వేయబడిందని తరతరాలుగా చెప్పుకోబడుతుంది.

రోమా సమాజంలో, తొలి క్రైస్తవుల క్లిష్టమైన స్థానాన్ని గురించి సమాజ శాస్త్రజ్ఞుడును, వేదాంత పండితుడునైన ఎర్న్‌స్ట్‌ ట్రోల్చ్‌ ఇలా వ్రాశాడు: “విగ్రహారాధనతో లేదా చక్రవర్తి ఆరాధనతో, లేదా రక్తాపరాధంతో లేదా మరణశిక్షతో సంబంధమున్న వాటితో, లేదా క్రైస్తవులను అన్యదేవతారాధికుల అనైతికతలోనికి తెచ్చే వాటితోను ఏదైనా సంబంధం గల అన్ని అధికారాలు మరియు ఉద్యోగాలు మినహాయించబడ్డాయి.” ఈ స్థానం క్రైస్తవులకు ప్రభుత్వానికి మధ్య శాంతియుతమైన, పరస్పర గౌరవం గల సంబంధానికి తావివ్వలేదా?

కైసరుకు ‘చెల్లించవలసినవి’ చెల్లించడం

“కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని” యేసు ప్రకటించినప్పుడు రోమా ప్రభుత్వం ఎడల క్రైస్తవుని ప్రవర్తనను లేదా, మరే ప్రభుత్వమైనా ఆ విషయంలో ఒక క్రైస్తవున్ని నడపవలసిన సూత్రాన్ని ఇచ్చాడు. (మత్తయి 22:21) యేసు అనుచరులకు ఇవ్వబడిన ఈ ఉపదేశం రోమా ఆధిపత్యాన్ని ధిక్కరించి, విదేశీ అధికారానికి పన్ను కట్టడం న్యాయం కాదన్న జాతీయవాదులైన అనేకమంది యూదుల దృక్పథానికి ఎంతో భిన్నమైనది.

“కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఏలయనగా వారు [ప్రభుత్వ “ఉన్నతాధికారులు”] దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు. కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. . . . అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.” (రోమీయులు 13:5-7) క్రైస్తవులు ఈ లోక సంబంధులు కానప్పటికీ, ప్రభుత్వ సేవలకు ప్రతిగా చెల్లించవలసినది చెల్లిస్తూ నిజాయితీగలవారిగాను పన్ను చెల్లించే పౌరులుగాను ఉండవలసిన బాధ్యత వారికి ఉండింది.—యోహాను 17:16.

కాని యేసు మాటలు పన్ను చెల్లించడం వరకే పరిమితమయ్యాయా? కైసరువి ఏమిటో దేవునివి ఏమిటో యేసు కచ్చితంగా నిర్వచించలేదు కనుక, సందర్భాన్నిబట్టి లేదా మొత్తం బైబిలును గూర్చి మనకున్న అవగాహననుబట్టి నిర్ణయించవలసిన అవ్యక్తమైన విషయాలున్నాయి. మరో మాటలో చెబితే, కైసరుకు వేటిని చెల్లించవచ్చు అని తీర్మానించడంలో, బైబిలు సూత్రాలు ఉన్నతపరచినట్లు, కొన్నిసార్లు క్రైస్తవుని మనస్సాక్షి చేరి ఉంటుంది.

అడుగబడిన పోటీపడే రెండు విషయాల్లో జాగ్రత్తతో కూడిన సమతుల్యత

కైసరువి కైసరుకు ఇవ్వమని చెప్పిన తరువాత, “దేవునివి దేవునికివ్వమని” కూడా యేసు చెప్పాడన్న విషయాన్ని చాలా మంది ప్రజలు మరిచిపోతారు. క్రైస్తవులు దేనికి ప్రాధాన్యతనివ్వాలో అపొస్తలుడైన పేతురు చూపించాడు. “రాజు”కు లేదా చక్రవర్తికి, ఆయన “అధిపతులకు” లోబడాలని పేతురు చెప్పిన వెంటనే “స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి” అని కూడా వ్రాశాడు. (1 పేతురు 2:16, 17) క్రైస్తవులు దేవుని సేవకులేగాని, మానవ పరిపాలకుని సేవకులు కారని అపొస్తలుడు చూపించాడు. వారు ప్రభుత్వ ప్రతినిధులకు సరైన గౌరవాన్ని, మర్యాదను చూపించేటప్పుడు, ఉన్నత నియమాలను పెట్టిన దేవుని ఎడల భయంతో వారలా చేయాలి.

మానవ నియమం కన్నా దేవుని నియమం ఉన్నతమైనదన్న విషయంలో సంవత్సరాల క్రితం పేతురు ఏ మాత్రం సందేహాన్ని మిగల్చలేదు. ఒక పరిపాలక సభగానున్న యూదా మహాసభకు రోమా ప్రభుత్వం పౌర అధికారాన్ని, మత సంబంధమైన అధికారాన్ని ఇచ్చింది. క్రీస్తు పేరట బోధించడాన్ని ఆపివేయాలని అది యేసు అనుచరులను ఆజ్ఞాపించినప్పుడు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అని పేతురు, మరితర అపొస్తలులు గౌరవపూర్వకంగానే దృఢంగా చెప్పారు. (అపొస్తలుల కార్యములు 5:29) స్పష్టంగా, దేవునికి విధేయతను చూపించడంలోను అలాగే మానవ అధికారులకు సరైన విధంగా లోబడడంలోను తొలి క్రైస్తవులు జాగ్రత్తపూర్వకంగా సమతుల్యతను చూపించవలసి ఉండింది. “అన్నీ కైసరువే అయితే, దేవుని కొరకు ఏమి మిగులుతుంది?” అని సా.శ. మూడవ శతాబ్దం తొలి భాగంలో టెర్టూలియన్‌ వ్రాశాడు.

ప్రభుత్వంతో రాజీపడడం

సమయం గడిచిన కొలది, ప్రభుత్వం విషయంలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు స్వీకరించిన స్థానం క్రమేణా బలహీనమైంది. యేసు మరియు అపొస్తలులు ప్రవచించిన మతభ్రష్టత్వం సా.శ. రెండు, మూడు శతాబ్దాలలో వృద్ధిచెందింది. (మత్తయి 13:37, 38; అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 థెస్సలొనీకయులు 2:3-12; 2 పేతురు 2:1-3) మతభ్రష్ట క్రైస్తవత్వం రోమా ప్రపంచంతో రాజీపడి, అన్యమతమైన దాని పండుగలను, తత్త్వశాస్త్రాన్ని అనుసరించి, పౌర సేవనే కాక, సైనిక సేవను కూడా స్వీకరించింది.

ప్రొఫెసర్‌ ట్రోల్చ్‌ ఈ విధంగా వ్రాశాడు: “మూడవ శతాబ్దం మొదలుకొని, సమాజంలోని ఉన్నత తరగతిలోను, మరింత ప్రముఖ వృత్తుల్లోను, సైన్యంలోను, అధికార పరిధుల్లోను క్రైస్తవులు అధిక సంఖ్యగా మారడంతో పరిస్థితి మరింత క్లిష్టమైపోయింది. [బైబిలేతర] క్రైస్తవ రచనల్లోని అనేక భాగాల్లో ఈ కార్యాల్లో భాగం వహించడానికి వ్యతిరేకంగా ఉద్రేకంతో వెలిబుచ్చిన అనేక అభిప్రాయాలున్నాయి; మరొకవైపు, రాజీపడే ప్రయత్నాలు అంటే, కలత చెందుతున్న మనస్సాక్షిని శాంతింపజేసేందుకు ఉద్దేశించబడిన వాదాలు కూడా మాకు కనిపించాయి . . . కాన్‌స్టన్‌టైన్‌ కాలం నుండి ఈ క్లిష్ట పరిస్థితులు అదృశ్యమయ్యాయి; క్రైస్తవులకు అన్య మతస్థులకు మధ్య ఘర్షణలు ఆగిపోయాయి, ప్రభుత్వంలోని అన్ని అధికార స్థానాలు అందుబాటులో ఉంచబడ్డాయి.”

సా.శ. నాలుగవ శతాబ్దాంతంలో కలుషితమైన, రాజీపడుతున్న రీతిలోవున్న ఈ క్రైస్తవత్వం రోమా సామ్రాజ్య ప్రభుత్వ మతంగా మారింది.

కాథోలిక్‌, ఆర్థడాక్స్‌ మరియు ప్రొటెస్టెంట్‌ చర్చీలు ప్రాతినిధ్యం వహించిన క్రైస్తవమత సామ్రాజ్యం దాని చరిత్రంతటా, ప్రభుత్వంతో రాజీపడడంలో కొనసాగుతూ, దాని రాజకీయంలో లోతుగా భాగం వహిస్తూ, దాని యుద్ధాల్లో మద్దతునిస్తూనే వచ్చింది. దీన్ని తెలుసుకుని విస్మయమొందే యథార్థపరులైన చాలామంది చర్చి సభ్యులు ప్రభుత్వం విషయంలో తొలిక్రైస్తవులు కలిగివున్న అదే వైఖరిగల క్రైస్తవులు నేడూ ఉన్నారని తెలుసుకున్నప్పుడు సంతోషిస్తారనడంలో సందేహం లేదు. తరువాతి రెండు శీర్షికలు ఈ విషయాన్ని మరింత విశదంగా చర్చిస్తాయి.

[5వ పేజీలోని చిత్రం]

“రాజును సన్మానించుడి” అని పేతురు వ్రాసిన కైసరు నీరో

[క్రెడిట్‌ లైను]

Musei Capitolini, Roma

[6వ పేజీలోని చిత్రం]

పోలికార్ప్‌ చక్రవర్తిని ఆరాధించే బదులు చనిపోవడాన్నే ఎన్నుకున్నాడు

[7వ పేజీలోని చిత్రం]

తొలి క్రైస్తవులు నెమ్మదిగలవారు, నిజాయితీగలవారు, పన్నుకట్టే పౌరులు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి