దేవుడు, కైసరు
“ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.”—లూకా 20:25.
1. (ఎ) యెహోవా ఉన్నతపర్చబడిన స్థానం ఏమిటి? (బి) కైసరుకు ఎన్నటికీ చెల్లించకూడని దేనిని యెహోవాకు మనం రుణపడి ఉన్నాం?
యేసుక్రీస్తు ఆ ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు, తన సేవకుల నుండి దేవుడు కోరేవి, కైసరు లేక ప్రభుత్వం కోరేవాటికన్నా ముందుండాలనే విషయం ఆయన మనస్సులో ఉందనడంలో ఏవిధమైన సందేహమూలేదు. “నీ రాజ్యము శాశ్వతరాజ్యము, నీ రాజ్యపరిపాలన [సర్వాధిపత్యం]a తరతరములుండును” అని కీర్తనల గ్రంథకర్త యెహోవాకు చేసిన ప్రార్థనలోని సత్యసంధతను గూర్చి యేసుకు అందరికన్నా ఎక్కువగా తెలుసు. (కీర్తన 145:13) భూనివాసుల రాజ్యములన్నింటిపై యేసుకు అధికారాన్ని అపవాది ఇవ్వజూపినప్పుడు, “నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి యున్నదని” యేసు ప్రత్యుత్తరమిచ్చాడు. (లూకా 4:5-8) కైసరు రోమా చక్రవర్తియైనా మరో మానవ పరిపాలకుడైనా లేక ప్రభుత్వమే అయినా ఆరాధన మాత్రం ఎన్నటికీ కైసరుకు చెల్లించకూడదు.
2. (ఎ) ఈ ప్రపంచానికి సంబంధించి సాతాను స్థానం ఏమిటి? (బి) ఎవరి అనుమతితో సాతాను తన స్థానాన్ని స్వాధీన పర్చుకున్నాడు?
2 ప్రపంచ రాజ్యాలు సాతానుకు చెందినవి కావని యేసు అనలేదు. అటుతరువాత ఆయన సాతానును “ఈ లోకాధికారి” అని పిలిచాడు. (యోహాను 12:31; 16:11) సా.శ. మొదటి శతాబ్దాంతానికి, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టునియందున్నదనియు ఎరుగుదుము.” (1 యోహాను 5:19) యెహోవా తన సర్వాధిపత్యాన్ని భూమిపై వదులుకున్నాడని దీని భావంకాదు. రాజకీయ ప్రభుత్వాలపై యేసుకు పరిపాలనాధిపత్యాన్ని ఇవ్వజూపినప్పుడు సాతాను ఇలా చెప్పడాన్ని జ్ఞాపకం ఉంచుకోండి: ‘ఈ అధికారమంతయు నేను నీకిచ్చెదను . . . ఎందుకంటే ఇది నాకు అప్పగించబడింది.’ (లూకా 4:6) దేవుని అనుమతితో మాత్రమే ప్రపంచ రాజ్యాలపై సాతాను అధికారాన్ని కల్గివున్నాడు.
3. (ఎ) ప్రపంచ ప్రభుత్వాలు యెహోవా ఎదుట ఏ స్థానాన్ని కల్గివున్నాయి? (బి) ఈ ప్రపంచ ప్రభుత్వాలకు విధేయత చూపించడం ఈ ప్రపంచానికి దేవుడైన సాతానుకు మనంతట మనం విధేయత చూపించడం కాదని మనం ఎలా చెప్పగలం?
3 అదేవిధంగా, సర్వోన్నత పరిపాలకునిగా దేవుడు ప్రభుత్వాన్ని అనుమతించినందునే అధికారం చేయగల్గుతుంది. (యోహాను 19:11) అందుకే, “ఉనికియందున్న అధికారములు,” ‘తమ సాపేక్ష స్థానంలో దేవునిచే ఉంచబడ్డాయని’ చెప్పబడింది. యెహోవా సర్వోన్నత సర్వాధికారానికి సంబంధించినంత వరకు వారి అధికారం నిశ్చయంగా తక్కువైనదే. అయినా వారు “దేవుని పరిచారకులు” అంటే “దేవుని ప్రజాసేవకులు” గనుక వారు అవసరమైన సేవలను అందిస్తారు, శాంతి భద్రతలు కాపాడతారు మరియు దుర్మార్గులను శిక్షిస్తారు. (రోమీయులు 13:1, 4, 6) కాబట్టి సాతాను ఈ ప్రపంచపు లేక విధానపు అదృశ్య పరిపాలకుడైనప్పటికీ, ప్రభుత్వానికి చూపించే తమ సాపేక్ష విధేయతను క్రైస్తవులు గుర్తించినప్పుడు, సాతానుకు తమ్మునుతాము లోబర్చుకోవడం లేదని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు దేవునికే విధేయత చూపిస్తున్నారు. ఈ 1996వ సంవత్సరంలో రాజకీయ ప్రభుత్వం, ఉనికిలో ఉండడానికి దేవుడు అనుమతిస్తున్న ఓ తాత్కాలిక ఏర్పాటైన “దేవుని ఏర్పాటు”లో ఇప్పటికీ ఒక భాగంగానే ఉంది, యెహోవా భూసంబంధమైన సేవకులు అలాగనే దీనిని గుర్తించాలి.—రోమీయులు 13:2.
ప్రాచీనకాల యెహోవా సేవకులు, ప్రభుత్వం
4. యోసేపు ఐగుప్తు ప్రభుత్వంలో ప్రముఖుడయ్యేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడు?
4 క్రైస్తవ కాలానికి పూర్వం, తన సేవకులలో కొందరిని రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రముఖ స్థానాన్ని పొందేందుకు యెహోవా అనుమతించాడు. ఉదాహరణకు, సా.శ.పూ. 18వ శతాబ్దంలో, యోసేపు రాజైన ఫరోకు ద్వితీయ స్థానంలో ఐగుప్తు ప్రధాన మంత్రి అయ్యాడు. (ఆదికాండము 41:39-43) తన సంకల్పాలను నెరవేర్చేందుకు ‘అబ్రాహాము సంతానాన్ని,’ అతని వారసులను భద్రపర్చడంలో యెహోవా యోసేపును ఒక ఉపకరణముగా ఉపయోగించుకున్నాడని అటుతర్వాత జరిగిన సంఘటనలు స్పష్టపర్చాయి. అయినా, యోసేపు ఐగుప్తులో దాసత్వానికి అమ్మివేయబడ్డాడని, దేవుని సేవకులకు ‘మోషే ధర్మశాస్త్రం లేదా క్రీస్తు ధర్మశాస్త్రం’ లేని కాలంలో అతడు జీవించాడని గుర్తుంచుకోవాలి.—ఆదికాండము 15:5-7; 50:19-21; గలతీయులు 6:2.
5. బబులోను ‘క్షేమాన్ని కోరమని’ చెరపట్టబడిన యూదులు ఎందుకు ఆజ్ఞాపించబడ్డారు?
5 బబులోను చెరలో ఉన్నప్పుడు పరిపాలకులకు లోబడాలని, ఆ పట్టణపు క్షేమం కోసం ప్రార్థన చేయాలని కూడా చెరపట్టబడిన యూదులకు తెలియజేయడానికి అనేక శతాబ్దాల తర్వాత నమ్మకమైన ప్రవక్తయగు యిర్మీయాను యెహోవా ప్రేరేపించాడు. తాను వారికి పంపిన ఉత్తరంలో, ఆయన ఇలా వ్రాశాడు: “ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా . . . చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు . . . నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.” (యిర్మీయా 29:4, 7) యెహోవాను ఆరాధించేందుకు స్వేచ్ఛను కల్గివుండడానికి తాము జీవిస్తున్న దేశం కోసం, తమకోసం ‘క్షేమముకోరే’ కారణాన్ని యెహోవా ప్రజలు ఎల్లప్పుడూ కల్గివున్నారు.—1 పేతురు 3:11.
6. ప్రభుత్వములకు ఉన్నత స్థానాలు ఇవ్వబడినా, ఏయే రీతుల్లో దానియేలు మరతని ముగ్గురు సహవాసులు యెహోవా చట్టం విషయంలో రాజీపడడానికి తిరస్కరించారు?
6 బబులోను చెరలోవున్న కాలంలో, బబులోను దాసత్వానికి చెరగొనిపోబడిన దానియేలు మరి ముగ్గురు నమ్మకమైన యూదులు ప్రభుత్వ శిక్షణకు లోబడి, బబులోనులో ఉన్నత శ్రేణి ప్రభుత్వోద్యోగులు అయ్యారు. (దానియేలు 1:3-7; 2:48, 49) అయినా, వారి శిక్షణాకాలంలో కూడా వారు తమ దేవుడైన యెహోవా మోషేద్వారా ఇచ్చిన చట్టాన్ని ఉల్లంఘించేలా తమను నడపగల ఆహార విషయాలపై స్థిరమైన స్థానాన్ని తీసుకున్నారు. ఇందునుబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. (దానియేలు 1:8-17) రాజైన నెబుకద్నెజరు ఓ ప్రభుత్వ ప్రతిమను నెలకొల్పినప్పుడు, దానియేలు ముగ్గురు హీబ్రూ స్నేహితులు తమతోటి ప్రభుత్వ అధికారులతోపాటు ఆ ఉత్సవానికి హాజరు కావాలని బలవంతం చేయబడ్డారు. అయినా, వారు ప్రభుత్వం నిలబెట్టిన ఆ ప్రతిమకు ‘సాగిలపడి నమస్కరించడానికి’ తిరస్కరించారు. మరలా, వారి యథార్థతకు యెహోవా ప్రతిఫలాన్ని ఇచ్చాడు. (దానియేలు 3:1-6, 13-28) అదేవిధంగా నేడు, యెహోవాసాక్షులు తాము నివసించే దేశపు జాతీయపతాకాన్ని గౌరవిస్తారు. కాని వారు దాన్ని ఆరాధించరు.—నిర్గమకాండము 20:4, 5; 1 యోహాను 5:21.
7. (ఎ) బబులోను ప్రభుత్వ వ్యవస్థలో ఓ ఉన్నత స్థానాన్ని కల్గివున్నా దానియేలు ఏ శ్రేష్ఠమైన స్థానాన్ని తీసుకున్నాడు? (బి) క్రైస్తవ కాలాల్లో ఏ మార్పులు వచ్చాయి?
7 నియో-బబులోను సామ్రాజ్యం పతనమైన తర్వాత, బబులోనులో దాని స్థానాన వచ్చిన క్రొత్త మాదీయ-పారశీక పరిపాలనా విధానంలో ఓ ఉన్నత శ్రేణి ప్రభుత్వ పదవి దానియేలుకు ఇవ్వబడింది. (దానియేలు 5:30, 31; 6:1-3) కాని తన యథార్థత విషయంలో రాజీపడేలా తనను నడిపించేందుకు తన ఉన్నత అధికారాన్ని ఆయన అనుమతించలేదు. యెహోవానుగాక రాజైన దర్యావేషునే ఆరాధించాలని ప్రభుత్వ చట్టం కోరినప్పుడు ఆయన తిరస్కరించాడు. ఇందునుబట్టి ఆయన సింహాల మధ్యకు త్రోయబడ్డాడు కాని యెహోవా ఆయనను విడిపించాడు. (దానియేలు 6:4-24) ఇది క్రైస్తవ కాలానికి పూర్వం జరిగిందనుకోండి. క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత, దేవుని సేవకులు ‘క్రీస్తు ధర్మశాస్త్రం’ క్రిందకు వచ్చారు. యూదా విధానంలో అనుమతింపబడిన అనేక విషయాలను, యెహోవా తన ప్రజలతో ఇప్పుడు వ్యవహరిస్తున్న విధానంపై ఆధారపడి, భిన్నంగా దృష్టించవలసి ఉండెను.—1 కొరింథీయులు 9:21; మత్తయి 5:31, 32; 19:3-9.
ప్రభుత్వం విషయంలో యేసు వైఖరి
8. యేసు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా తప్పించుకునేందుకు నిశ్చయించుకున్నాడని ఏ సంఘటన చూపుతోంది?
8 యేసు భూమిపై ఉన్నప్పుడు, ఆయన తన అనుచరులకు ఉన్నత ప్రమాణాలను ఏర్పాటు చేశాడు మరియు ఆయన రాజకీయ లేక సైనిక వ్యవహారాల్లో దేనిలోనూ జోక్యం చేసుకోకుండా తిరస్కరించాడు. కొన్ని రొట్టెలు, రెండు చిన్న చేపలతో అనేక వేలమందికి యేసు అద్భుతంగా ఆహారం పెట్టిన తర్వాత, యూదులు ఆయనను పట్టుకొని ఓ రాజకీయ ప్రభువుగా చేయాలని అనుకున్నారు. కాని యేసు వారిని విడిచి త్వరగా కొండలకు వెళ్లిపోయాడు. (యోహాను 6:5-15) ఈ సంఘటనను గురించి, ది న్యూ ఇంటర్నేషనల్ కామెంటరీ ఆన్ ది న్యూ టెస్ట్‌మెంట్ ఇలా చెబుతోంది: “ఆ కాలంలోని యూదుల మధ్య తీవ్రమైన జాతీయ ఆకాంక్షలు ఉండేవి, ఆ అద్భుతాన్ని చూసిన అనేకులు, రోమీయులకు వ్యతిరేకంగా తమ్మును నడిపించే ఆదర్శప్రాయుడైన దైవ నియుక్త నేత ఇక్కడ ఉన్నాడని నిస్సందేహంగా భావించారు. కాబట్టి వారు ఆయనను రాజుగా చేయడానికి నిశ్చయించుకున్నారు.” రాజకీయ నాయకత్వం యొక్క ఈ ప్రతిపాదనను యేసు “నిష్కర్షగా త్రోసిపుచ్చాడ”ని కూడా అది తెలియజేస్తుంది. క్రీస్తు రోమా ప్రభుత్వాధికారానికి వ్యతిరేకంగా చేసిన ఏ యూదా తిరుగుబాటుకు మద్దతును ఇవ్వలేదు. నిజానికి, తాను మరణించిన తర్వాత జరగబోయే తిరుగుబాటు ఫలితాన్ని గూర్చి అంటే, యెరూషలేము నివాసులకు చెప్పనలవికాని శ్రమలు మరియు ఆ పట్టణ వినాశనాన్ని గూర్చి ఆయన ప్రవచించాడు.—లూకా 21:20-24.
9. (ఎ) లోకంతో తన రాజ్యానికిగల సంబంధాన్ని యేసు ఎలా వర్ణించాడు? (బి) ప్రపంచ ప్రభుత్వాలతో తన అనుచరుల వ్యవహారాలకు సంబంధించి ఏ మార్గదర్శక సూత్రాల్ని యేసు వారికి ఇచ్చాడు?
9 తన మరణానికి ముందు, యూదయలోని రోమా చక్రవర్తి ప్రత్యేక ప్రతినిధితో యేసు ఇలా చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.” (యోహాను 18:36) ఆయన రాజ్యం రాజకీయ ప్రభుత్వాల పరిపాలనకు అంతం తెచ్చేంతవరకు, క్రీస్తు శిష్యులు ఆయన మాదిరిని అనుసరిస్తారు. స్థాపించబడిన ఆ అధికారాలకు వారు విధేయత చూపిస్తారు కాని వాటి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. (దానియేలు 2:44; మత్తయి 4:8-10) “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని” తెలియజేస్తూ యేసు తన శిష్యులకు మార్గదర్శక సూత్రాలను ఇచ్చాడు. (మత్తయి 22:21) అంతకుముందు, కొండమీద తన ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “అధికారంలోవున్న ఒక వ్యక్తి ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతంచేస్తే, అతనితో రెండు మైళ్లు వెళ్లండి.” (మత్తయి 5:41, NW) ఈ ప్రసంగంలో యేసు, మానవ సంబంధాల్లోనైనా లేక ప్రభుత్వం కోరేవైనా దేవుని చట్టానికి అనుగుణంగానున్న, శాసనబద్ధమైన డిమాండ్లకు ఇష్టపూర్వకమైన విధేయతను చూపించే సూత్రాన్ని ఉదహరిస్తున్నాడు.—లూకా 6:27-31; యోహాను 17:14, 15.
క్రైస్తవులు, కైసరు
10. ఒక చరిత్రకారుడు చెప్పిన ప్రకారంగా, కైసరుకు సంబంధించినంతవరకు తొలి క్రైస్తవులు మనస్సాక్షితో కూడిన ఏ స్థానాన్ని కల్గివున్నారు?
10 ఈ క్లుప్త మార్గదర్శక సూత్రాలు, క్రైస్తవులకు, ప్రభుత్వానికి మధ్యనున్న సంబంధాన్ని నడిపించనై ఉండెను. ది రైజ్ ఆఫ్ క్రిష్టియానిటి అనే స్వీయ రచనలో చరిత్రకారుడైన ఇ. డబ్ల్యు. బార్న్స్ ఇలా వ్రాశాడు: “రాబోయే శతాబ్దాల్లో ఎప్పుడైనా ఒక క్రైస్తవునికి ప్రభుత్వం ఎడలగల తన కర్తవ్యం విషయంలో సందేహం ఉంటే, అతడు క్రీస్తు అధికారిక బోధవైపు మరలేవాడు. అతడు పన్నులు చెల్లించేవాడు: చెల్లింపులు భారమైనవై ఉండవచ్చు—పశ్చిమ సామ్రాజ్యం పతనం కావడానికి ముందు అవి భరించలేనివిగా తయారయ్యాయి—అయినా క్రైస్తవుడు వాటిని భరించేవాడు. అదేవిధంగా దేవునికి చెందిన వాటిని కైసరుకు చెల్లించాలని కోరబడనంతవరకూ, అతడు ఇతర ప్రభుత్వ బాధ్యతలన్నింటినీ అంగీకరిస్తాడు.”
11. ప్రపంచ పరిపాలకులతో వ్యవహరించే విషయాన్ని గూర్చి పౌలు క్రైస్తవులకు ఏవిధమైన సలహా ఇచ్చాడు?
11 దీనితో ఏకీభవిస్తూ, క్రీస్తు మరణించిన తర్వాత 20 సంవత్సరాలు పైగా గడిచాక, అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “ప్రతి వాడు ఉన్నత అధికారులకు లోబడాలి.” (రోమీయులు 13:1) పది సంవత్సరాల తర్వాత అంటే ఆయన రెండవసారి చెరపట్టబడి, రోములో శిక్షించబడడానికి కొద్దికాలం ముందు, పౌలు తీతుకు ఇలా వ్రాశాడు: “పరిపాలకులుగా ప్రభుత్వాలకు, అధికారులకు లోబడి, విధేయులుగా ఉండమని ప్రతి సత్కార్యమునకు సంసిద్ధంగా ఉండమని ఎవరికీ బాధ కల్గించేలా మాట్లాడవద్దని జగడమాడవద్దని సహేతుకంగా ఉండమని మనష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికాన్ని చూపించమని వారికి [క్రేతులోని క్రైస్తవులకు] జ్ఞాపకంచేస్తూ ఉండుము.”—తీతు 3:1, 2, NW.
“సర్వోన్నత అధికారులను” గురించి ప్రగతిశీల అవగాహన
12. (ఎ) ప్రభుత్వ అధికారులకు సంబంధించినంతవరకు క్రైస్తవుని సరియైన స్థానం ఏదని చార్లెస్ తేజ్ రస్సెల్ దృష్టించాడు? (బి) సైన్యంలో పనిచేయడాన్ని గురించి, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అభిషిక్త క్రైస్తవులు ఏ భిన్నమైన దృక్పథాలు కల్గివుండిరి?
12 చార్లస్ తేజ్ రస్సెల్, 1886 ప్రారంభమందు ది ప్లాన్ ఆఫ్ ది ఏజెస్ అనే పుస్తకంలో ఇలా వ్రాశాడు: “యేసుగాని, అపొస్తలులుగాని ఏవిధంగానూ భూ పరిపాలకుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. . . . చట్టాలకు లోబడమని, వారి అధికారాన్నిబట్టి అధికారంలోవున్న వారికి గౌరవం చూపించమని, . . . తమ నియమిత పన్నులను చెల్లించమని, దేవుని చట్టాలతో పొసగనిచోట మినహా (అపొస్తలుల కార్యములు 4:19; 5:29) నియమించబడిన ఏ చట్టాన్ని ఎదిరించకూడదని వారు చర్చికి బోధించారు.” (రోమా. 13:1-7; మత్త. 22:21) యేసు, అపొస్తలులు మరియు ప్రారంభంలోని చర్చి ఈ ప్రపంచ ప్రభుత్వాలకు వేరుగావుండి, వాటిలో ఏవిధమైన భాగం వహించకపోయినా, చట్టాన్ని గౌరవించేదిగా ఉండెను.” అపొస్తలుడైన పౌలు తెలియజేసిన “పై అధికారులు” లేక “ఉన్నత అధికారులను” ఈ పుస్తకం మానవ ప్రభుత్వ అధికారులని సరియైన రీతిగానే గుర్తించింది. (రోమీయులు 13:1, కింగ్జేమ్స్ వర్షన్) 1904లో ది న్యూ క్రియేషన్ అనే పుస్తకం నిజ క్రైస్తవులు “ప్రస్తుత కాలంలోని చట్టాన్నిగౌరవించే ప్రజలలో అంటే ఆందోళనకారులుకాని, కలహకారులుకాని, తప్పులెన్ననివారిలో కనుగొనబడాలి.” ప్రభుత్వ అధికారులకు పూర్తి విధేయత చూపించడమని, మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికదళాల్లో సేవచేయడానికి అంగీకరించే స్థాయివరకూ అని, కొందరు దీనిని అర్థం చేసుకున్నారు. అయితే ఇతరులు దానిని “కత్తిపట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అనే యేసు వ్యాఖ్యానానికి విరుద్ధంగా ఉన్నట్లు దృష్టించారు. (మత్తయి 26:52) నిజానికి, ఉన్నత అధికారులకు చూపించే క్రైస్తవ విధేయతను గూర్చి ఓ స్పష్టమైన అవగాహన అవసరమైయుండెను.
13. ఉన్నత అధికారాల గుర్తింపును గూర్చిన అవగాహనలో 1929లో ఏ మార్పు చేయబడింది మరియు ఇది ప్రయోజనకరమైందని ఎలా రుజువు చేయబడింది?
13 విభిన్న ప్రభుత్వాల చట్టాలు 1929లో, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని నిషేధించడం లేదా దేవుని చట్టాలు నిషేధించిన వాటిని డిమాండ్ చేయడం ఆరంభించినప్పుడు, ఆ ఉన్నత అధికారులు యెహోవా దేవుడు, యేసుక్రీస్తని భావించబడింది.b రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, ఆ యుద్ధకాలంలోను మరియు సమతుల్యమైన భయంకల్గి, సైనిక సిద్ధబాటుతో ప్రచ్ఛన్న యుద్ధంలోనికి వెళ్లిన విపత్కరమైన కాలంలోనూ యెహోవా సేవకులు ఈ అవగాహననే కల్గివుండిరి. వెనుకకు తిరిగి చూస్తే, విషయాలను ఇలా దృష్టించడమే అంటే యెహోవా మరియు ఆయన క్రీస్తు యొక్క సర్వోన్నతత్వాన్ని ఉన్నతపర్చడం, దేవుని ప్రజలు ఈ క్లిష్టమైన కాలమంతటిలో రాజీపడని తటస్థ స్థానాన్ని అనుసరించడానికి సహయపడింది.
సాపేక్ష విధేయత
14. 1962లో రోమీయులు 13:1, 2 మరి దాని సంబంధిత లేఖనాలపై ఎలా మరింత వెలుగు ప్రసరించింది?
14 పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం) 1961లో పూర్తయింది. దాని సిద్ధబాటుకు లేఖనాల మూల పాఠ్యపు భాషను గూర్చిన లోతైన అధ్యయనం అవసరమైంది. రోమీయులు 13వ అధ్యాయంలో మాత్రమేగాక తీతు 3:1, 2 మరియు 1 పేతురు 2:13, 17 వంటి ప్రకరణాల్లో కూడా ఉపయోగించిన పదముల కచ్చితమైన అనువాదం, ఈ “ఉన్నత అధికారులు” అనే పదం సర్వోన్నత అధికారియైన యెహోవాను, ఆయన కుమారుడైన యేసునుగాక మానవ ప్రభుత్వ అధికారులను సూచిస్తుంది. 1962 తరువాయి భాగంలో, కావలికోటలో (ఆంగ్లం) ప్రచురింపబడిన శీర్షికలు, రోమీయులు 13వ అధ్యాయంపై కచ్చితమైన వివరణను ఇచ్చాయి మరియు సి. టి. రస్సెల్ కాలంనాటికన్నా స్పష్టమైన అభిప్రాయాన్ని ఇచ్చాయి. అధికారాలకు క్రైస్తవులు చూపే విధేయత సంపూర్ణమైనది కాదని ఈ శీర్షికలు సూచించాయి. అది సాపేక్షికమైనది ఉండాలి, దానికి లోబడడం దేవుని చట్టాలకు భిన్నమైనస్థితికి దేవుని సేవకులను తీసుకురాకూడదు. కావలికోటలోని ఆ తరువాతి శీర్షికలు ఈ ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పాయి.c
15, 16. (ఎ) రోమీయులు 13వ అధ్యాయాన్ని గూర్చిన క్రొత్త అవగాహన ఏ సమతూకమైన దృష్టికి నడిపింది? (బి) ఇంకా జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు ఏవి?
15 రోమీయులు 13వ అధ్యాయాన్ని గూర్చిన ఈ సరియైన అవగాహనా కీలకం, యెహోవా ప్రజలు ప్రాముఖ్యమైన లేఖనాధార సూత్రాలపై రాజీపడని స్థానంలో రాజకీయ అధికారులకు చెల్లించాల్సిన గౌరవాన్ని సమతూకంలో ఉంచుకునేలా చేసింది. (కీర్తన 97:11; యిర్మీయా 3:15) దేవునితో తమకున్న సంబంధం విషయంలోను, ప్రభుత్వంతో తమ వ్యవహారాల విషయంలోను సరియైన దృష్టిని కల్గివుండేందుకు అది వారిని అనుమతించింది. వారు కైసరువి కైసరుకి చెల్లించినప్పుడు, వారు దేవునివి దేవునికి తిరిగి చెల్లించడానికి నిర్లక్ష్యం చేయరని అది నిశ్చయపర్చింది.
16 అయితే కచ్చితంగా కైసరువి ఏమైవున్నాయి? ఓ క్రైస్తవునిపై ప్రభుత్వం న్యాయబద్ధంగా వేటిని అడుగగలదు? ఈ ప్రశ్నలు తరువాతి శీర్షికలో పరిశీలించబడతాయి.
[అధస్సూచీలు]
a కీర్తన 103:22 అథఃస్సూచిని (NW) చూడండి.
b కావలికోట జూన్ 1 మరియు 15, 1929. (ఆంగ్లం)
c కావలికోట (ఆంగ్లం) నవంబరు 1 మరియు 15, డిశంబరు 1, 1962; కావలికోట నవంబరు 1, 1990; ఫిబ్రవరి 1, 1993; జూలై 1, 1994.
ఆసక్తిదాయకంగా, రోమీయులు 13వ అధ్యాయంపై చేసిన తన వ్యాఖ్యానంలో, ప్రొఫెసర్ ఎఫ్. ఎఫ్. బ్రూస్ ఇలా వ్రాస్తున్నాడు: “ఆ సందర్భాన్నిబట్టి, అపొస్తలుల వ్రాతలలోని సాధారణ సందర్భాన్నిబట్టి అర్థమయ్యేదేమంటే, దైవికంగా ప్రభుత్వానికి నియమింపబడిన సంకల్పాల పరిధుల్లోనే అది న్యాయంగా విధేయతను కోరగలదు—ప్రత్యేకంగా చెప్పాలంటే, ప్రభుత్వం దేవునికే చెందవలసిన వాటిని కోరితే దాన్ని ఎదిరించవచ్చు, ఎదిరించాలి కూడా.”
మీరు వివరించగలరా?
◻ ఉన్నత అధికారులకు విధేయత చూపించడం అంటే సాతానుకు విధేయత చూపించడమనే భావం ఎందుకు కాదు?
◻ తన కాలంలోని రాజకీయాల విషయంలో యేసు వైఖరి ఏమైవుంది?
◻ కైసరుతో తన అనుచరుల వ్యవహారాలను గూర్చి యేసు వారికి ఏ సలహాను ఇచ్చాడు?
◻ లోక పరిపాలకులతో వ్యవహరించే విషయాన్ని గూర్చి పౌలు క్రైస్తవులకు ఏవిధమైన సలహా ఇచ్చాడు?
◻ సంవత్సరాలు గడుస్తుండగా ఉన్నత అధికారుల గుర్తింపును గూర్చిన అవగాహన ఎలా పెరిగింది?
[10వ పేజీలోని చిత్రం]
యేసుకు రాజకీయాధికారాన్ని సాతాను ఇవ్వజూపినప్పుడు ఆయన దానిని తిరస్కరించాడు
[13వ పేజీలోని చిత్రం]
నిజ క్రైస్తవులు “ప్రస్తుత కాలంలోని చట్టాన్ని గౌరవించే ప్రజలలో . . . ఉండాల”ని రస్సెల్ వ్రాశాడు