యెహోవా ప్రేమగల హస్తం క్రింద సేవచేయడం
లాంప్రోస్ జూంపోస్ చెప్పినది
ధనవంతుడైన మా బాబాయికి చెందిన అపారమైన ఆస్థిపాస్తులను చూసుకునే పనిని చేపట్టి, తద్వారా మా కుటుంబ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడమా లేక యెహోవా దేవునికి పూర్తికాల సేవకున్ని కావడమా అనేది ఎంపిక చేసుకోవలసిన క్లిష్టమైన పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. చివరికి నేను తీసుకున్న నిర్ణయాన్ని ఏ కారణాలు ప్రభావితం చేశాయో వివరించనివ్వండి.
నేను 1919లో, గ్రీస్‌లోని వొలోస్ పట్టణంలో జన్మించాను. మా నాన్న మగవారి దుస్తులు అమ్మేవాడు మరియు మేము వస్తుపరంగా సమృద్ధి కలిగివుండేవాళ్లం. కాని 1920వ దశాబ్ద చివరి భాగంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా, మా నాన్న దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది, దానితో ఆయన తన వ్యాపారాన్ని కోల్పోయాడు. మా నాన్న దిగాలు ముఖాన్ని చూసినప్పుడల్లా నేను బాధపడేవాడిని.
కొంతకాలం మా కుటుంబం పూర్తి పేదరికంలో జీవించింది. ప్రతిరోజు నేను ఆహార సామాగ్రి తీసుకొనేందుకు పంక్తిలో నిలబడ్డానికి పాఠశాల నుండి ఒక గంట ముందుగా వచ్చేవాడిని. అయినప్పటికీ, మేము మా పేదరికంలోనే ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని ఆనందించేవాళ్లం. వైద్యున్ని కావాలన్న బలమైన కోరిక నాకు ఉండేది, కాని నేను యౌవన దశలోనే పాఠశాలకు వెళ్లడం మానుకుని, మా కుటుంబ పోషణ కొరకు పని చేయడం ప్రారంభించవలసి వచ్చింది.
తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, జర్మన్ దేశస్థులూ ఇటలీ దేశస్థులు గ్రీస్‌ను ఆక్రమించారు మరియు తీవ్రమైన కరవు ఏర్పడింది. స్నేహితులు, పరిచయస్థులూ ఆకలితో వీధుల్లో చనిపోవడం నేను తరచూ చూశాను—ఆ ఘోరమైన దృశ్యాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను! ఒకసారి మా కుటుంబం, గ్రీస్ ముఖ్య ఆహారమైన రొట్టె లేకుండా 40 రోజులు గడిపింది. బ్రతికి బయటపడడానికి నేను, మా అన్నయ్య సమీప గ్రామాలకు వెళ్లి స్నేహితులూ బంధువుల వద్ద నుండి బంగాళా దుంపలు తెచ్చాము.
అనారోగ్యం ఆశీర్వాదం కావడం
1944 తొలిభాగంలో, ఒక రకమైన శ్వాసకోశ వ్యాధివంటిది రావడంతో నేను తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. నేను మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, మా బంధువు ఒకతను నా కొరకు రెండు చిన్న పుస్తకాలు తెచ్చి ఇలా అన్నాడు: “ఇవి చదువు; నీకు తప్పకుండా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను.” దేవుడెవరు? మరియు భద్రత అనే ఆ చిన్న పుస్తకాలు వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినవి. వాటిని చదివిన తర్వాత, వాటిలో ఉన్న విషయాల గురించి నేను తోటి రోగులతో చెప్పాను.
ఆసుపత్రి నుండి బయటికి వచ్చాక, నేను యెహోవాసాక్షులకు చెందిన వొలోస్ సంఘంతో సహవసించడం మొదలుపెట్టాను. అయితే ఒక నెలపాటు నేను రోగిగా ఇంట్లోనే ఉండేవాడిని, రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటల చొప్పున నేను కావలికోట (ఆంగ్లం) పాత సంచికలను అలాగే వాచ్ టవర్ సొసైటీ ప్రచురించిన ఇతర ప్రచురణలను చదివేవాడిని. ఫలితంగా, నా ఆత్మీయ అభివృద్ధి చాలా త్వరితంగా జరిగింది.
తృటిలో తప్పించుకోవడం
1944 మధ్యభాగంలో ఒకరోజు నేను వొలోస్లో ఒక పార్కు బెంచీ మీద కూర్చుని ఉన్నాను. జర్మన్‌ను ఆక్రమించిన సైన్యానికి మద్దతునిచ్చిన సహాయ సైనిక గుంపు హఠాత్తుగా ఆ స్థలాన్ని చుట్టుముట్టి, అక్కడున్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసింది. దాదాపు ఇరవై నలుగురుగా ఉన్న మమ్మల్ని, పొగాకు నిల్వచేసే ఇంట్లోవున్న గెస్టాపొ ప్రధాన కార్యాలయానికి వీధుల వెంబడి తీసుకువెళ్లారు.
కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత, ఎవరో నా పేరూ, పార్కులో నేను మాట్లాడుతున్న వ్యక్తి పేరు పిలవడం నాకు వినిపించింది. ఒక గ్రీక్ సైనికాధికారి మమ్మల్ని పిలిపించి, సైనికులు మమ్మల్ని వీధుల్లో తీసుకు వెళుతుండగా చూసిన మా బంధువు ఒకరు మేము యెహోవాసాక్షులమని చెప్పాడని ఆయన తెలియజేశాడు. ఆ గ్రీక్ అధికారి మేము ఇంటికి వెళ్లవచ్చునని చెప్పి, ఒక వేళ మేము మళ్లీ అరెస్టు చేయబడితే ఉపయోగించుకోవడానికి తన అధికారిక కార్డు మాకిచ్చాడు.
గ్రీక్ వ్యతిరేక పోరాటవాదులు ఇద్దరు జర్మన్ సైనికులను చంపినందుకు ప్రతీకారంగా, అరెస్టయిన వారిలో చాలామందిని జర్మన్లు చంపారని మాకు ఆ తర్వాతి రోజు తెలిసింది. బహుశా మరణం నుండి తప్పింపబడడమేగాక, క్రైస్తవ తటస్థత యొక్క విలువను కూడా నేను ఆ సందర్భంలో తెలుసుకున్నాను.
1944 శరదృతువులో, నేను నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు సమర్పించుకున్నాను. ఆ తర్వాతి వేసవి కాలంలో, నేను మళ్లీ సంపూర్ణ ఆరోగ్యం పొందగలిగేలా పర్వతాలపైనున్న స్ల్కీత్రో సంఘంతో నేను సహవసించడానికి సాక్షులు ఏర్పాట్లు చేశారు. జర్మన్ల ఆక్రమణ ముగింపుతో ఆరంభమైన అంతఃకలహము అప్పుడు గ్రీస్‌లో తీవ్రతరమౌతోంది. నేను ఉంటున్న గ్రామం గెరిల్లా శక్తులకు కేంద్ర స్థానంగా ఉండేది. స్థానిక ప్రీస్టు, మరో దుర్మార్గుడు నేను ప్రభుత్వ సైనిక గూఢచారిగా ఉన్నానని నన్ను నిందించి, స్వయం నియమిత గెరిల్లా సైనిక కోర్టు నన్ను ప్రశ్నించేలా చేశారు.
కోర్టు విచారణను పోలిన ఆ విచారణకు ఆ ప్రాంతానికి చెందిన గెరిల్లా సైనిక నాయకుడు ఉన్నాడు. నేను గ్రామంలో ఎందుకు ఉన్నాననేదానికి కారణాన్ని వివరించడం మరియు ఒక క్రైస్తవునిగా నేను అంతఃకలహాల్లో పూర్తిగా తటస్థంగా ఉన్నానని చూపించడం ముగించిన తర్వాత, ఆ నాయకుడు ఇతరులతో ఇలా చెప్పాడు: “ఎవరైనా ఈ వ్యక్తికి హాని కలిగిస్తే, నాకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది!”
ఆ తర్వాత నేను, భౌతిక ఆరోగ్యం విషయంలో కంటే నా విశ్వాసం విషయంలో మరింత బలపడి నా స్వగ్రామమైన వొలోస్కు తిరిగి వచ్చాను.
ఆత్మీయ అభివృద్ధి
ఆ తర్వాత వెంటనే నేను స్థానిక సంఘంలో అకౌంట్స్ సేవకునిగా నియమింపబడ్డాను. మతనాయకులు చేసిన మత మార్పిడి నేరారోపణ మూలంగా జరిగిన అనేక అరెస్టులతో సహా, అంతఃకలహం సృష్టించిన కష్టాలున్నప్పటికీ, క్రైస్తవ పరిచర్యలో భాగం వహించడం నాకు, మా సంఘంలోని ఇతరులకు గొప్ప ఆనందాన్ని కలుగజేసింది.
తర్వాత, 1947 తొలిభాగంలో, యెహోవాసాక్షుల ప్రయాణ కాపరి మమ్మల్ని సందర్శించాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అలాంటి సందర్శనం అదే మొదటి సారి. ఆ సమయంలో వొలోస్ నందు వర్ధిల్లుతున్న మా సంఘాన్ని రెండు సంఘాలుగా విభజించడం జరిగింది, ఆ సంఘాల్లో ఒకదానికి నేను సంఘాధ్యక్షునిగా నియమింపబడ్డాను. అప్పుడు సహాయక సైన్యాలు, జాతీయ సంబంధ సంస్థలు ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. మతనాయకులు ఆ పరిస్థితి నుండి ప్రయోజనం పొందారు. యెహోవాసాక్షులు కమ్యూనిస్టులని లేక లెఫ్టిస్టుల మద్దతుదారులని ఒక అబద్ధ వార్తను వారు వ్యాపింపజేసి, అధికారులు మాకు వ్యతిరేకంగా తిరిగేలా చేశారు.
అరెస్టులు, జైళ్లలో వేయబడటం
1947లో, నేను దాదాపు పదిసార్లు అరెస్టయ్యాను, మూడుసార్లు కోర్టు విచారణకు వెళ్లాను. ప్రతిసారి నేను నిర్దోషిగా విడుదలయ్యాను. 1948 వసంతకాలంలో, మతమార్పిడి చేశానన్న ఆరోపణతో నాకు నాలుగు నెలల జైలు శిక్ష పడింది. నేను వొలోస్ జైలులో శిక్ష అనుభవించాను. ఈ మధ్య కాలంలో, మా సంఘంలోని రాజ్య ప్రచారకుల సంఖ్య రెండింతలయ్యింది, సహోదరుల హృదయాలు సంతోషానందాలతో నిండిపోయాయి.
1948 అక్టోబరులో, మా సంఘంలో నాయకత్వం వహిస్తున్న ఆరుమంది ఇతరులతో నేను సమావేశమై ఉన్నప్పుడు, ఐదుగురు పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి, తుపాకీ గురిపెట్టి మమ్మల్ని అరెస్టు చేశారు. అరెస్టు చేయడానికి కారణమేమిటో వివరించకుండా వాళ్లు మమ్మల్ని పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లి, అక్కడ మమ్మల్ని కొట్టారు. ఒకప్పుడు బాక్సర్‌గా ఉండిన ఒక పోలీసు నన్ను ముఖం మీద కొట్టాడు. ఆ తర్వాత మమ్మల్ని ఒక గదిలో పడేశారు.
ఆ తర్వాత, డ్యూటీలోవున్న అధికారి నన్ను తన కార్యాలయంలోకి పిలిచాడు. నేను తలుపు తెరిచినప్పుడు, అతడు నా మీదికి సిరాబుడ్డి విసిరాడు, అది గురితప్పి వెళ్లి గోడకు కొట్టుకుని పగిలిపోయింది. నన్ను భయపెట్టాలని అతడలా చేశాడు. ఆతర్వాత, అతడు నాకొక కాగితం, కలం ఇచ్చి ఇలా ఆజ్ఞాపించాడు: “వొలోస్లో ఉన్న యెహోవాసాక్షులందరి పేర్లు వ్రాసి, ఉదయాన్నే ఆ పట్టిక నాకు తెచ్చివ్వు. అలా చేయకపోతే, నీకేమి జరుగుతుందో నీకు తెలుసు!”
నేను సమాధానం చెప్పలేదు కాని, గదిలోకి తిరిగి వచ్చిన తర్వాత నేనూ ఇతర సహోదరులందరం కలిసి యెహోవాకు ప్రార్థించాము. కాగితం మీద నేను నా స్వంత పేరు మాత్రం వ్రాసి, అధికారి పిలుస్తాడేమోనని ఎదురుచూశాను. కానీ ఆ అధికారి నుండి నాకు ఇక ఏ సమాచారం రాలేదు. రాత్రి సమయంలో, వ్యతిరేకిస్తున్న సైనిక బలగాలు వచ్చాయి, ఆ అధికారి తన మనుష్యులను వారి మీదికి పంపించాడు. ఆ తర్వాత జరిగిన పోరాటంలో, అతడు తీవ్రంగా గాయపడ్డాడు, అతని కాళ్లలో ఒకటి తీసేయాల్సి వచ్చింది. చివరికి, మా కేసు విచారణకు వచ్చింది, మేము చట్టవ్యతిరేకమైన కూటమి జరుపుకుంటున్నామని ఆరోపించబడింది. మా ఏడుగురికీ ఐదేళ్ల ఖైదు విధించబడింది.
నేను జైలులో ఆదివారం మాస్కు హాజరవ్వడానికి నిరాకరించి నందున నేను ఏకాంత కారాగార వాసానికి పంపబడ్డాను. మూడవ రోజున జైలు అధికారితో మాట్లాడతానని కోరాను. ఆయనతో నేనిలా చెప్పాను: “దయచేసి నన్ను మాట్లాడనివ్వండి, తన విశ్వాసం కొరకు ఐదు సంవత్సరాలు జైలులో గడపడానికి ఇష్టపడుతున్న వ్యక్తిని శిక్షించడం మూర్ఖత్వంలా అనిపిస్తుంది.” ఆయన దాని గురించి గంభీరంగా తలంచి, చివరికిలా చెప్పాడు: “రేపటికల్లా, నీవు నా కార్యాలయంలో నాతో పాటు ఇక్కడ పనిచేస్తుంటావు.”
చివరికి, జైలులో నాకు వైద్యుని సహాయకునిగా పని ఇవ్వబడింది. ఫలితంగా, నేను ఆరోగ్య జాగ్రత్తల గురించి ఎంతో నేర్చుకున్నాను, అది ఆ తర్వాతి సంవత్సరాల్లో ఎంతో ప్రయోజనకరమైనదిగా నిరూపించబడింది. జైలులో ఉన్నప్పుడు, ప్రకటించడానికి నాకు అనేక అవకాశాలు లభించాయి, ముగ్గురు వ్యక్తులు ప్రతిస్పందించి యెహోవాసాక్షులయ్యారు.
దాదాపు నాలుగు సంవత్సరాలు జైలులో పని చేసిన తర్వాత, చివరికి 1952లో నేను పరివీక్ష మీద విడుదలయ్యాను. ఆ తర్వాత, తటస్థత విషయాన్ని బట్టి నేను కొరింథులోని కోర్టులో హాజరు కావలసి వచ్చింది. (యెషయా 2:4) అక్కడ నేను కొంతకాలం వరకు సైనిక జైలులో ఉండవలసి వచ్చింది, మరో విడత వేధించడం మొదలయ్యింది. కొంతమంది అధికారులు క్రొత్త క్రొత్త పద్ధతులలో బెదిరించేవారు, వారు ఇలా చెప్పేవారు: “నేను బాకుతో నీ గుండెను ముక్కలు చేసి తీస్తాను,” లేక, “కేవలం ఆరు గుళ్లతో వెంటనే చనిపోతానని ఎదురు చూడకు.”
వేరే రకమైన పరీక్ష
అయితే, నేను త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చి, మళ్లీ వొలోస్ సంఘంతో కలిసి పనిచేస్తూ, స్వల్పకాల ఉద్యోగం చేసేవాడిని. రెండు వారాలపాటు తర్ఫీదుపొంది ప్రయాణ కాపరిగా యెహోవాసాక్షుల సంఘాలను దర్శించే పని మొదలుపెట్టమని నన్ను ఆహ్వానిస్తూ ఒకరోజు ఏథెన్సులోని వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయం నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. అదే సమయంలో, పిల్లలు లేని, ఎంతో ధనవంతుడైన మా బాబాయి తన ఆస్థిపాస్తులను చూసుకోమని నన్ను కోరాడు. నా కుటుంబం ఇంకా పేదరికంలోనే ఉంది, ఈ ఉద్యోగం వారి ఆర్థిక సమస్యలను తీర్చి ఉండేది.
ఆయన ప్రతిపాదనను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు నేను మా బాబాయిని దర్శించాను, కాని క్రైస్తవ పరిచర్యలో ఒక ప్రత్యేకమైన బాధ్యతను చేపట్టడానికి నిర్ణయించుకున్నానని నేను ఆయనకు తెలియజేశాను. దానితో ఆయన లేచి నా వైపు గంభీరంగా చూసి, హఠాత్తుగా గదిలో నుండి వెళ్లిపోయాడు. మా కుటుంబానికి కొన్ని నెలలపాటు మద్దతు నివ్వగలంత డబ్బుతోకూడిన ఉదారమైన బహుమతితో ఆయన తిరిగి వచ్చాడు. ఆయనిలా చెప్పాడు: “ఇది తీసుకుని, నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో.” ఈనాటి వరకు, ఆ క్షణంలో నాకు కలిగిన భావాలను నేను వివరించలేను. ‘నీవు సరైన ఎంపిక చేసుకున్నావు, నేను నీతో ఉన్నాను’ అని యెహోవా స్వరం నాతో చెప్పినట్లే అనిపించింది.
నా కుటుంబం యొక్క ఆశీర్వాదంతో, 1953 డిశంబరులో నేను ఏథెన్సుకు బయలుదేరాను. మా అమ్మ మాత్రమే సాక్షి అయినప్పటికీ, నా కుటుంబంలోని ఇతర సభ్యులు నా క్రైస్తవ పరిచర్యను వ్యతిరేకించలేదు. నేను ఏథెన్సులోని బ్రాంచి కార్యాలయానికి వెళ్లేసరికి, నాకొరకు మరో ఆశ్చర్యకరమైన విషయం వేచివుంది. సంక్షేమ పింఛను కొరకు నాన్న చేసిన రెండేళ్ల పోరాటం ఆ రోజున విజయవంతమైందని తెలియజేస్తూ నా చెల్లెలి వద్ద నుండి టెలిగ్రామ్ వచ్చింది. నాకు మరింకేమి కావాలి? యెహోవా సేవలో ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు నాకు రెక్కలొచ్చినట్లు అనిపించింది!
జాగ్రత్త కలిగివుండడం
ప్రయాణపనిలోని నా తొలి సంవత్సరాల్లో, నేను ఎంతో జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది, ఎందుకంటే మతసంబంధ మరియు రాజకీయ అధికారులు యెహోవాసాక్షులను తీవ్రంగా హింసించేవారు. మన క్రైస్తవ సహోదరులను దర్శించడానికి, ప్రాముఖ్యంగా చిన్న పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ నివసించేవారిని దర్శించడానికి నేను రాత్రిపూట ఎన్నో గంటలు నడిచేవాడిని. అరెస్టు కావడానికి కూడా వెనుకాడని సహోదరులు, ఒక ఇంట్లో సమకూడి ఓర్పుగా నా రాక కోసం ఎదురుచూసేవారు. ఆ దర్శనాలు మాకందరికీ పరస్పరం ఎంత చక్కని ప్రోత్సాహాన్నిచ్చాయో!—రోమీయులు 1:11, 12.
దొరికిపోకుండా ఉండడానికి కొన్నిసార్లు నేను మారు వేషం వేసుకునేవాడిని. ఒకసారి, ఆత్మీయ కాపుదల ఎంతో అవసరమైయున్న సహోదరుల గుంపును చేరడానికి దారిలో ఒక అవరోధాన్ని దాటడానికి నేను గొర్రెల కాపరిలా వేషం వేసుకున్నాను. మరో సందర్భంలో, 1955లో, పోలీసులకు అనుమానం రాకుండా చేయడానికి నేను, నా తోటి సాక్షి వెల్లుల్లి అమ్మేవారిలా నటించాము. ఆర్గాస్ ఆరెస్టికాన్ అనే చిన్న పట్టణంలో నిష్క్రియులుగా తయారైన క్రైస్తవ సహోదరులను కలిసే పని మాకు అప్పగించబడింది.
పట్టణంలోని బహిరంగ అంగడిలో మేము మా సరుకులను పెట్టాము. అయితే, ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న ఒక యువ పోలీసుకు అనుమానం కలిగింది, అతడు ఆ వైపుగా వెళ్లినప్పుడల్లా మావైపు అనుమానంగా చూసేవాడు. చివరికి, అతడు నాతో ఇలా అన్నాడు: “నీవు వెల్లుల్లి అమ్మేవాడిలా కనిపించడం లేదే.” అదే క్షణంలో, ముగ్గురు స్త్రీలు వచ్చి కొంత వెల్లుల్లి కొనడానికి ఆసక్తి కనపర్చారు. నేను నా సరుకుల వైపు చూపిస్తూ, ఇలా అన్నాను: “ఈ యువ పోలీసు ఇలాంటి వెల్లుల్లినే తింటాడు, ఇతడు ఎంత బలంగా, అందంగా ఉన్నాడో చూడండి!” ఆ స్త్రీలు పోలీసు వైపు చూసి నవ్వారు. అతడు కూడా చిరునవ్వు నవ్వి, వెళ్లిపోయాడు.
అతడు వెళ్లిన వెంటనే, మన ఆత్మీయ సహోదరులు దర్జీవారిగా పనిచేస్తున్న దుకాణానికి వెళ్లడానికి నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. నేను నా కోటునుండి ఊడతీసిన ఒక గుండీని కుట్టమని నేను వారిలో ఒకరిని అడిగాను. ఆయన కుడుతుండగా నేను ముందుకు వంగి, మెల్లిగా ఇలా చెప్పాను: “మిమ్మల్ని చూడడానికి నేను బ్రాంచి కార్యాలయం నుండి వచ్చాను.” సహోదరులకు తోటి సాక్షులతో సంవత్సరాల నుండి సంప్రదింపులు లేవు కాబట్టి వాళ్లు మొదట భయపడ్డారు. నేను నాకు చేతనైనంతగా వారిని ప్రోత్సహించి ఇంకా మాట్లాడడానికి, పట్టణంలోని శ్మశానంలో తర్వాత కలవడానికి ఏర్పాట్లు చేశాను. సంతోషకరంగా, ఆ సందర్శనం ప్రోత్సాహకరంగా ఉంది, వాళ్లు క్రైస్తవ పరిచర్యలో మళ్లీ ఆసక్తి పుంజుకున్నారు.
నమ్మకమైన భాగస్వామిని సంపాదించుకోవడం
ప్రయాణ పనిని ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, 1956లో, ప్రకటన పని ఎడల ఎంతో ప్రేమకల్గి, తన జీవితాన్నంతటినీ పూర్తికాల పరిచర్యలో గడపాలన్న కోరికగల క్రైస్తవ యౌవనస్థురాలైన నికిని నేను కలిశాను. మేము ప్రేమించుకుని, 1957 జూన్‌లో వివాహం చేసుకున్నాము. అప్పుడు గ్రీస్‌లో యెహోవాసాక్షులకున్న ప్రతికూల పరిస్థితుల మూలంగా ప్రయాణపనిలో ఎదుర్కోవలసి వచ్చే కష్టాలను నికి తట్టుకోగలదా అని నేను అనుకున్నాను. యెహోవా సహాయంతో ఆమె తట్టుకుని, గ్రీస్‌లో ప్రయాణపనిలో తన భర్త వెంబడి వెళ్లిన మొదటి స్త్రీ అయ్యింది.
గ్రీస్‌లోని అనేక సంఘాలలో సేవ చేస్తూ, మేము ఇద్దరం ప్రయాణపనిలో పది సంవత్సరాలపాటు కలిసి కొనసాగాము. తరచూ మేము మారువేషం వేసుకుని, మా పెట్టెను మోస్తూ, ఒక్కో సంఘాన్ని చేరడానికి రాత్రి సమయంలో గంటల తరబడి నడిచేవాళ్లం. మేము తరచూ గొప్ప వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, సాక్షుల సంఖ్యలోని అద్భుతమైన పెరుగుదలను మేమే మొదటిసారిగా చూసి పులకించిపోయాము.
బేతేలు సేవ
1967 జనవరిలో, బేతేలు అని పిలువబడే యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో పని చేయడానికి నికి నేను ఆహ్వానించబడ్డాము. ఆ ఆహ్వానం మాకిద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది, కాని విషయాలను యెహోవా నడిపిస్తున్నాడనే నమ్మకంతో మేము దాన్ని అంగీకరించాము. సమయం గడుస్తుండగా, దైవపరిపాలనా కార్యక్రమం యొక్క ఈ కేంద్రస్థానంలో సేవచేయడం ఎంత గొప్ప ఆధిక్యతో మేము గుణగ్రహించాము.
మేము బేతేలు సేవలో ప్రవేశించిన మూడు నెలల తర్వాత, సైనిక కుట్రదారులు అధికారం చేజిక్కించుకున్నారు మరియు యెహోవాసాక్షులు తమ పనిని గుప్తంగా కొనసాగించవలసి వచ్చింది. మేము చిన్న గుంపులుగా కూడడం మొదలు పెట్టాము, అడవుల్లో మా సమావేశాలు జరుపుకుని, యుక్తిగా ప్రకటిస్తూ, బైబిలు సాహిత్యాన్ని రహస్యంగా ముద్రించి పంచిపెట్టాము. ఈ పరిస్థితులకు సర్దుకుపోవడం అంత కష్టమేమీ కాలేదు, ఎందుకంటే మేము కేవలం గడచిన సంవత్సరాల్లో మా కార్యక్రమాల విషయంలో ఉపయోగించిన పద్ధతులనే పునఃప్రారంభించాము. నిషేధాలు ఉన్నప్పటికీ, 1967లో 11,000 కంటే కొంచెం తక్కువగా ఉన్న సాక్షుల సంఖ్య 1974లో 17,000 కంటే ఎక్కువకు పెరిగింది.
బేతేలు సేవలో దాదాపు 30 సంవత్సరాలు గడిపిన తర్వాత, ఆరోగ్యపరమైన, వయస్సుకు సంబంధించిన పరిమితులు ఉన్నప్పటికీ నేను, నికి మా ఆత్మీయ ఆశీర్వాదాలను ఆనందించడంలో కొనసాగాము. పది సంవత్సరాలకుపైగా, ఏథెన్సులోని కార్తాలి వీధిలో స్థాపించబడివున్న బ్రాంచి ఆవరణలో మేము నివసించాము. 1979లో, ఏథెన్సు శివార్లలో మారూసీలో క్రొత్త బ్రాంచి ప్రతిష్ఠాపన జరిగింది. కాని ఏథెన్సుకు 60 కిలోమీటర్లు ఉత్తరంగావున్న ఇలీయోనాలో, 1991 నుండి మేము విశాలమైన క్రొత్త బ్రాంచి సౌకర్యాలను ఆనందించాము. ఇక్కడ నేను మన బేతేలు వైద్యశాలలో పని చేస్తున్నాను, నేను జైలు వైద్యుని వద్ద సహాయకునిగా ఉన్నప్పుడు పొందిన తర్ఫీదు ఎంతో ప్రయోజనకరమైనదిగా నిరూపించబడింది.
పూర్తికాల సేవలో నేను గడిపిన నాలుగు దశాబ్దాల కంటే ఎక్కువ కాలంలో, యిర్మీయావలె నేను, “వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు” అని యెహోవా చేసిన వాగ్దాన సత్యాన్ని గుర్తించాను. (యిర్మీయా 1:19) అవును నేను, నికి గిన్నె నిండి పొంగి పొరలుతున్నట్లుగా యెహోవా ఆశీర్వాదాలను అనుభవించాము. ఆయన విస్తారమైన ప్రేమపూర్వక శ్రద్ధను, కృపాబాహుళ్యాన్ని బట్టి మేము ఎడతెగక ఆనందిస్తున్నాము.
పూర్తికాల సేవను చేపట్టమని యెహోవా సంస్థలోవున్న యౌవనులను నేను ప్రోత్సహిస్తున్నాను. ఆ విధంగా వారు, యెహోవా ‘తాను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని’ చేసిన వాగ్దానానికి తానే కట్టుబడి ఉంటానో లేదో పరీక్షించమని ఇస్తున్న ఆహ్వానాన్ని స్వీకరించగలుగుతారు. (మలాకీ 3:10) యెహోవాను పూర్తిగా విశ్వసించే యౌవనులైన మిమ్మల్నందరినీ ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడని, నేను నా స్వంత అనుభవం నుండి మీకు హామీ ఇవ్వగలను.
[26వ పేజీలోని చిత్రం]
లాంప్రోస్ జూంపోస్, ఆయన భార్య నికి