రాజ్య ప్రచారకుల నివేదిక
దేవుని వాక్యానికున్న మార్చే శక్తి
ఆయన స్వయంగా అంగీకరించినట్లుగా, ఆయన ‘దూషకునిగా, హింసకునిగా, హానికరునిగా’ ఉండేవాడు. (1 తిమోతి 1:12) కాని ఆయన మారాడు! అపొస్తలుడైన పౌలు మార్పు ఎంత గొప్పగా ఉందంటే, ఆ తర్వాత ఆయనిలా ప్రకటించగలిగాడు: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.”—1 కొరింథీయులు 11:1.
నేడు, ప్రపంచమంతటా ఉన్న వందల వేలమంది యథార్థవంతులైన ఆరాధికులు అలాంటి మార్పులు చేసుకుంటున్నారు. అలా చేయడానికి వారికేది సహాయం చేస్తుంది? వారు దేవునివాక్య జ్ఞానాన్ని పొంది, దాన్ని తమ జీవితాల్లో అన్వయించుకుంటున్నారు. దేవుని వాక్యానికున్న మార్చే శక్తిని ఈ క్రింది అనుభవం ఉన్నతపరుస్తుంది.
స్లోవీనియాలో, ఒక గ్రామం వెలుపల ఒక వృద్ధ జంట ఒంటరిగా నివసించేది. భర్త యోజ 60 సంవత్సరాలవాడు, మద్యపానం ఆయనకున్న తీవ్రమైన సమస్య. అయినా, ఆయన అనారోగ్యవంతురాలైన తన భార్య ల్యూడ్మీలా గురించి శ్రద్ధ తీసుకునేవాడు. ఒకరోజు యోజను ఇద్దరు రాజ్య ప్రచారకులు కలిశారు. ఆయన సాక్షులను తన ఇంటికి ఆహ్వానించాడు, అక్కడ వారు ఆయన భార్యను కలిశారు. రాజ్య వర్తమానం విన్నప్పడు ల్యూడ్మీలా కళ్లలోనుండి ఆనంద బాష్పాలు రాలాయి. తాను విన్నదాన్ని బట్టి యోజ కూడా సంతోషించి, ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఆ జంటకు కొంత బైబిలు సాహిత్యం ఇచ్చిన తర్వాత సాక్షులు వెళ్లిపోయారు.
ఒక నెల తర్వాత సాక్షులు తిరిగి రాగలిగారు, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం బల్ల మీద ఉండడం వారు గమనించారు. అది ఎక్కడిదని ఆయనను అడిగినప్పుడు, యోజ ఇలా చెప్పాడు: “మీరు మాకిచ్చివెళ్లిన పత్రికల్లో ఒకదాని వెనుక పేజీమీద నేనొక ప్రకటన చూశాను. అందుకని పుస్తకం కావాలని జాగ్రేబ్లోవున్న మీ కార్యాలయానికి వ్రాశాను.” ఆయనకున్న ఆసక్తి దృష్ట్యా, రాజ్య మందిరంలో జరుగనున్న క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి హాజరు కమ్మని ఆయనను ఆహ్వానించారు. ఆయన వచ్చినందుకు సాక్షులు ఆనందించారు.
త్వరలోనే బైబిలు పఠనం ప్రారంభించారు, మంచి అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు, ‘విగ్రహములను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదని’ బైబిలులోనుండి చూపించినప్పుడు, అతడు వెంటనే ఇంట్లోవున్న బొమ్మలన్నిటితోసహా మతసంబంధమైన విగ్రహాలన్నింటినీ ఏరి పారేశాడు.—నిర్గమకాండము 20:4, 5.
ఆత్మీయ సత్యం కొరకు యోజకున్న దాహం తీర్చబడింది. అయితే, విచారకరంగా, ఆయనకు ఇంకా మరో దాహం ఉంది. దాదాపు 18 సంవత్సరాలుగా, ఆయన రోజుకు ఇంచుమించు పది లీటర్ల మద్యం సేవించేవాడు. ఆయన త్రాగుడు సమస్య మూలంగా, ఆయన తన వ్యక్తిగత రూపానికి ఎక్కువ శ్రద్ధనివ్వలేదు. మద్యాన్ని దుర్వినియోగం చేయడం గురించిన దేవుని దృక్కోణాన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన మారాలని నిర్ణయించుకున్నాడు.
రోజుకు ఎంత త్రాగుతున్నాననేది లెక్కపెట్టుకుంటూ, ఆయన మెల్లిగా తన త్రాగుడు సమస్యను అధిగమించగలిగాడు. త్వరలోనే ఆయన మద్యానికి ఇక బానిసగా లేడు. తన బైబిలు పఠనాల సమయంలో, నిజ క్రైస్తవులు మంచి వ్యక్తిగత పరిశుభ్రత కలిగివుండాలని కూడా ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి, ఆయన సాక్షులకు డబ్బు ఇచ్చి ఇలా చెప్పాడు: “వెళ్లి క్రైస్తవ కూటాలకూ ప్రాంతీయ సేవకు తగినట్లుగా ఉండేందుకు నాకు అవసరమైన వస్త్రాలు కొని తీసుకురండి!” లోదుస్తులు, సాక్సులు, బూట్లు, షర్టులు, సూట్లు, టైలు, ఒక బ్రీఫ్ కేస్, ఇవన్నీ తీసుకుని సాక్షులు తిరిగివచ్చారు.
ఒక సంవత్సరంపాటు బైబిలు పఠించిన తర్వాత, యోజ మరియు ల్యూడ్మీలా సాక్షులతో కలిసి ఇంటింటి ప్రకటన పనిలో పాల్గొనడానికి అర్హులయ్యారు. మూడునెలల తర్వాత, యెహోవాసాక్షుల జిల్లా సమావేశంలో వారు దేవునికి తమ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించారు. వృద్ధాప్యంలో ఉండి, ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ యోజ సువార్త ప్రకటించడంలో క్రమంగా పాల్గొని ఆ తర్వాత 1995 మే నెలలో తన మరణం వరకు, సంఘంలో పరిచర్య సేవకునిగా నమ్మకంగా సేవచేశాడు. దీనుడైన ఈ వ్యక్తి, ఇతని భార్య జీవితాల్లో ఫలించిన అనుకూలమైన ఫలాలు దేవుని వాక్యానికున్న మార్చే శక్తికి నిదర్శనాలు!