“నేను బంగారానికి బదులు వజ్రాలను కనుగొన్నాను”
మీకాలీస్ కామీనారిస్ చెప్పినది
నేను బంగారాన్ని వెదుక్కుంటూ దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళిన ఐదు సంవత్సరాల తర్వాత, మరింత అమూల్యమైనదానితో నేను ఇంటికి తిరిగి వచ్చాను. నాకిప్పుడున్న, నేను ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటున్న సంపదను గూర్చి చెబుతానుండండి.
నేను 1904లో లోనియా సముద్రంలోని సెఫలోనియా అనే గ్రీకు దీవిలో జన్మించాను. తరువాత కొద్ది కాలంలోనే నా తలిదండ్రులిరువురూ చనిపోయారు కనుక నేను అనాథగా పెరిగాను. నేను సహాయం కొరకు వాంఛించాను, నేను దేవునికి తరచూ ప్రార్థించేవాడ్ని. నేను గ్రీక్ ఆర్థడాక్స్ చర్చికి క్రమంగా హాజరవుతున్నప్పటికీ, నాకు బైబిలు గురించి బొత్తిగా తెలియదు. నాకు ఏ మాత్రం సాంత్వన దొరకలేదు.
1929లో నేను వలస వెళ్లి మేలైన జీవితం కొరకు అన్వేషించాలని నిర్ణయించుకున్నాను. మా ఊషర దీవిని వదిలి, నేను ఇంగ్లండ్ గుండా దక్షిణ ఆఫ్రికాకు సముద్ర ప్రయాణం చేశాను. సముద్రంలో 17 రోజులు ప్రయాణం చేసిన తర్వాత, నేను దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చేరుకున్నాను, అక్కడే ఉంటున్న మా స్వదేశస్థుని క్రింద వెంటనే పనికి కుదురుకున్నాను. అయినప్పటికీ నేను వస్తు సంపదలో స్వాంతనను పొందలేకపోయాను.
మరింత అమూల్యమైనది
నేను దక్షిణ ఆఫ్రికాకు వచ్చి రెండు సంవత్సరాలు గడిచాక, యెహోవాసాక్షుల్లో ఒకరు నేను పనిచేసే స్థలానికి వచ్చి నాకు గ్రీకు భాషలోని బైబిలు సాహిత్యాన్ని చూపించారు. ఆయన చూపించిన వాటిలో మృతులు ఎక్కడున్నారు? మరియు అణచివేత, అది ఎప్పుడు అంతమౌతుంది? అనే చిన్నపుస్తకాలు కూడా ఉన్నాయి. నేను ఎంతో ఆతురతతో వాటిని చదవడమూ, ఉల్లేఖించబడిన లేఖనాలన్నింటినీ కంఠాపాఠంగా నేర్చుకోవడమూ కూడా నాకు బాగా గుర్తుంది. “నేను ఇన్ని సంవత్సరాలుగా వెదుకుతున్నదానిని కనుగొన్నాను. నేను బంగారం కోసం దక్షిణ ఆఫ్రికాకు వచ్చాను, అయితే దానికి బదులుగా వజ్రాలను కనుగొన్నాను” అని ఒక రోజు నేను నా సహోద్యోగితో చెప్పాను.
దేవునికి వ్యక్తిగత నామముందని, అది యెహోవా అని, ఆయన రాజ్యం ఇప్పటికే పరలోకంలో స్థాపించబడిందని, మనం ఈ విధానాంతం యొక్క అంత్య దినాలల్లో జీవిస్తున్నామని తెలుసుకుని నేను మహదానందం పొందాను. (కీర్తన 83:18; దానియేలు 2:44; మత్తయి 6:9, 10; 24:3-12; 2 తిమోతి 3:1-5; ప్రకటన 12:7-12) యెహోవా రాజ్యం సకల జాతులకు చెందిన మానవులకు అనంతమైన ఆశీర్వాదాలను తెస్తుందని తెలుసుకోవడం ఎంత పులకింపజేసేదిగా ఉండిందో! ఈ అమూల్యమైన సత్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతున్నాయన్నది నన్ను ముగ్ధుడ్ని చేసిన మరో వాస్తవం.—యెషయా 9:6, 7; 11:6-9; మత్తయి 24:14; ప్రకటన 21:3, 4.
నేను వెంటనే కేప్ టౌన్‌లోని వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచ్ ఆఫీస్ చిరునామాను కనుగొని మరిన్ని బైబిలు సాహిత్యాలను పొందాను. మరి ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా బైబిలు ప్రతిని పొందినప్పుడు చాలా సంతోషించాను. నేను చదివినది సాక్ష్యమిచ్చేందుకు నన్ను పురికొల్పింది. నా సొంత ఊరైన లిక్సూరియోన్‌లో ఉన్న నా బంధువులకు, స్నేహితులకు, పరిచయస్థులకు నేను బైబిలు ప్రచురణలను పంపనారంభించాను. ఒకరు యెహోవాను ప్రీతిపరచేందుకు తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలని నేను నా పఠనాల ద్వారా కాలక్రమేణా అర్థం చేసుకున్నాను. కనుక, నేను వెంటనే ప్రార్థనలో నన్ను నేను సమర్పించుకున్నాను.
ఒక తరుణంలో నేను యెహోవాసాక్షుల కూటానికి హాజరయ్యాను కాని, నాకు ఆంగ్లం రాదు కనుక, ఒక్క ముక్క అర్థం కాలేదు. పోర్ట్ ఎలీజబెత్‌లో గ్రీకు వాళ్ళు చాలా మంది నివసిస్తున్నారని తెలుసుకుని, అక్కడికి తరలివెళ్ళాను, కానీ గ్రీకు మాట్లాడే సాక్షులను ఎవరినీ కనుగొనలేకపోయాను. కనుక, పూర్తికాల సువార్తికుడనయ్యేందుకు నేను గ్రీసుకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ‘నేను గ్రీసుకు అర్ధనగ్నంగా చేరవలసి వచ్చినా నేను అక్కడికి తిరిగి వెళ్తాను’ అని నాలో నేనే అనుకోవడం నాకు గుర్తుంది.
గ్రీసులో పూర్తికాల పరిచర్య
నేను 1934 వసంతంలో, ఇటలీ సముద్ర ఓడయైన డ్వూలీయోలోని డెక్కులో ఉన్నాను. నేను ఫ్రాన్స్‌లోని మార్సీల్స్‌కు చేరుకున్నాను, అక్కడ పది రోజులున్న తర్వాత, నేను గ్రీసుకు వెళ్ళేందుకు పాట్రీస్ అనే పాసెంజర్ ఓడ ఎక్కాను. మేము సముద్రంలో ఉన్నప్పుడు ఓడ యంత్రంలో ఏవో రిపేర్ చేయవలసి వచ్చింది. లైఫ్‌బోట్లను సముద్రంలోనికి దించమని రాత్రి పూట ఆజ్ఞ జారీ చేయబడింది. అర్ధనగ్నంగానైనా సరే గ్రీసుకు చేరుకోవాలన్న నా తలంపులను నేనప్పుడు గుర్తు చేసుకున్నాను. అయినప్పటికీ, చివరికి ఇటలీవారి ఓడను లాగే పడవ వచ్చి మమ్మల్ని ఇటలీలోని నేపల్ఝ్‌కు తీసుకువెళ్ళింది. తర్వాత మేము తుదకు గ్రీసులోని పిరైవ్స్ (పిరాయుస్)కు చేరుకున్నాం.
అక్కడి నుండి నేను ఏథెన్స్‌కు వెళ్ళి, అక్కడ ఉన్న వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచ్ ఆఫీస్‌ను సందర్శించాను. ఆ బ్రాంచ్ పైవిచారణకర్త ఆధానాస్యోస్ కారానాస్యోస్‌తో చేసిన సంభాషణలో నాకు పూర్తికాల ప్రకటనా నియామకం ఇప్పించమని కోరుకున్నాను. ఆ మరుసటి రోజే నేను గ్రీస్ దీవిలోని దక్షిణభాగమైన పెలపనీసస్‌కు బయలుదేరాను. ఆ జిల్లా అంతా నా వ్యక్తిగత ప్రదేశంగా నాకు నియమించబడింది!
ఒక నగరం నుండి మరో నగరానికి, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి, ఒక పొలం నుండి మరో పొలానికి వెళ్తూ అవధుల్లేని ఉత్సాహంతో నేను ప్రకటనా పనిని ఆరంభించాను. కొంత కాలానికే మికాయేల్ ట్రీయాడాఫీలొపూలొస్ పరిచర్యలో నాతో చేరాడు. ఆయనే 1935 వేసవిలో, అంటే నేను పూర్తికాల పరిచర్యను ఆరంభించి ఒక సంవత్సరం కన్నా ఎక్కువే గడిచిన తర్వాత నాకు బాప్తిస్మమిచ్చారు! ప్రజారవాణా అందుబాటులో ఉండేది కాదు, కనుక మేము ప్రతిచోటికి నడిచివెళ్ళేవాళ్ళం. మమ్మల్ని ఆపడానికి ఏమైన చేసేందుకు వెనుకాడని చర్చి పురోహితుల వ్యతిరేకతే మాకున్న గొప్ప సమస్య. దాని ఫలితంగా, మేము నిర్హేతుకమైన ఎంతో వ్యతిరేకాభిప్రాయాన్ని ఎదుర్కొన్నాం. అయినప్పటికీ, ఆటంకాలున్నప్పటికీ సాక్ష్యపు పని జరిగేది, యెహోవా నామం సుదూర ప్రాంతాల వరకూ ప్రసిద్ధం చేయబడేది.
వ్యతిరేకతను సహించడం
ఒక ఉదయం, నేను ఆర్కాడియాలోని ఓ పెద్ద జిల్లాలో ప్రకటిస్తూ మాగూల్యానా గ్రామం చేరుకున్నాను. ఒక గంట సాక్ష్యమిచ్చిన తర్వాత, నేను గుడి గంటలు మ్రోగడం విన్నాను, అవి నాకోసమే మ్రోగించబడ్డాయని నేను త్వరగానే గ్రహించాను! గ్రీక్ ఆర్థడాక్స్ ఆర్కిమాన్‌డ్రైట్ (చర్చిలో బిషప్పుకన్నా తక్కువ హోదా) నాయకత్వంలో ఓ గుంపు గుమికూడింది. నేను వెంటనే నా సాక్ష్యపు సంచీని మూసి, మౌనంగా యెహోవాకు ప్రార్థన చేశాను. పిల్లల గుంపును తన వెంట వేసుకుని ఆర్కిమాన్‌డ్రైట్ నాకు ఎదురుగా నేరుగా వచ్చాడు. “ఇతన్నే! ఇతన్నే!” అని ఆయన అరవడం మొదలుపెట్టాడు.
ఆ పిల్లలు నన్ను చుట్టు ముట్టారు, ఆ మతనాయకుడు నా ముందుకు అంగలు వేస్తూ వచ్చి, నీ మీద చెయ్యిచేసుకుని ‘నేను మలినమౌతానేమో’ అందుకు నేను ఇష్టపడను అని అంటూ తన పెద్ద బాన పొట్టతో నన్ను నెట్టడం ప్రారంభించాడు. “వాణ్ణి చితక బాదండి! చితక బాదండి!” అని ఆయన కేకలు వేశాడు. కానీ అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మా ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళాడు. ఆ చర్చి పురోహితుడు ఒక గుంపును రెచ్చగొట్టించినందుకు విచారణకు తీసుకువెళ్ళబడ్డాడు, 300 డ్రాక్మాలు, కోర్టుకైన ఖర్చు జరిమానాగా ఆయనకు విధించబడింది. నేను విడుదల చేయబడ్డాను.
మేము క్రొత్త ప్రదేశానికి చేరుకున్నప్పుడు, మేము మరి కాస్త పెద్ద పట్టణాన్ని మా పనికి కేంద్రంగా చేసుకున్నాము. మేము అక్కడ నుండి నాలుగు గంటలు నడిచి చుట్టుప్రక్కల ప్రాంతాన్నంతా పూర్తిచేశాము. అంటే మేము పెందలకడనే ఇంకా చీకటిగా ఉండగానే ఇంటి నుండి బయలుదేరి, చీకటిపడ్డాక ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. సాధారణంగా మేము ప్రతిరోజు ఒకటో రెండో గ్రామాలను సందర్శించేవాళ్ళం. చుట్టుప్రక్కల గ్రామాలను పూర్తి చేసిన తర్వాత, మేము కేంద్రంగా తీసుకున్న పట్టణంలో ప్రకటించి, అక్కడి నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం. చర్చిపురోహితులు మాకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించేవాళ్ళు గనుక మేము తరచూ అరెస్ట్ చేయబడేవాళ్ళం. మధ్య గ్రీస్‌లోని పారనాస్సస్ మండలంలో పోలీసులు నా కోసం కొన్ని నెలల దాకా వెదికారు. అయినప్పటికీ వారు నన్ను పట్టుకోలేకపోయారు.
ఒకరోజు నేను, సహోదరుడు ట్రయన్‌టఫిలోపౌలోస్ మూరీకీ గ్రామంలో బోయోటియా జిల్లాలో ప్రకటిస్తున్నాం. మేము ఆ గ్రామాన్ని రెండు విభాగాలుగా విభజించుకున్నాం. నేను యౌవనస్థున్ని గనుక నిట్రమైన కొండ ప్రాంతాల్లో పనిచేయనారంభించాను. అకస్మాత్తుగా క్రింది నుండి అరుపులు విన్నాను. ‘సహోదరుడు ట్రయన్‌టఫిలో పౌలోస్‌ను కొడుతున్నారు’ అని నాలో నేనే అనుకుంటూ నేను పరుగెత్తాను. స్థానిక ఫలహారశాలలో ఆ గ్రామస్థులు గుమికూడారు. ప్రీస్ట్ మదమెక్కిన ఎద్దులా చిందులు తొక్కుతున్నాడు. “ఈ ప్రజలు మనలను ‘సర్ప సంతానం’ అంటారు” అని అతడు కేకలు వేస్తున్నాడు.
ప్రీస్ట్ అప్పటికే చేతికర్రతో సహోదరుడు ట్రయన్‌టఫిలోపౌలోస్ తలపై కొట్టి దాన్ని విరగ్గొట్టాడు, సహోదరుని ముఖం మీదుగా రక్తం కారుతోంది. నేను రక్తం కడిగి వేసిన తర్వాత, మేము అక్కడి నుండి వెళ్లిపోగలిగాము. మేము మూడు గంటలు నడిచి తెబెస్ నగరాన్ని చేరుకున్నాము. అక్కడ ఒక క్లినిక్‌లో గాయానికి కట్టు కట్టడం జరిగింది. మేము జరిగిన కథను పోలీస్‌కు రిపోర్ట్ చేశాము, కేసు దావా వేయబడింది. అయితే, ఆ మతగురువుకు పలుకుబడి ఉండింది కనుక చివరికి విడుదల చేయబడ్డాడు.
మేము లూకస్ పట్టణంలో పని చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోని ఒక రాజకీయ నాయకుని అనుచరులు కొందరు మమ్మల్ని “అరెస్ట్ చేసి” మమ్మల్ని ఆ గ్రామపు ఫలహారశాలకు తీసుకు వెళ్ళి, ఆ గ్రామస్థుల చట్టరహిత ప్రజా కోర్టులో నేరారోపణ చేశారు. ఆ రాజకీయ నాయకుడు ఆయన మనుష్యులు వంతులవారీగా మమ్మల్ని చుట్టుముట్టి అటు ఇటు తిరుగుతూ పెద్దగా అరుస్తూ—పెద్ద గొంతుతో మాట్లాడుతూ పిడికిలి బిగించి మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ మద్యం త్రాగారు. మాకు వ్యతిరేకంగా వారు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు శాపనార్థాలు పెట్టారు. కాని మేము మౌనంగా, మా నిర్దోషత్వాన్ని ప్రకటిస్తూ చిరునవ్వుతో ఉండిపోయాము, సహాయం కోసం మేము మౌనంగా యెహోవా దేవునికి ప్రార్థించాము.
చీకటిపడుతుండగా, ఇద్దరు పోలీసులు వచ్చి మమ్మల్ని కాపాడారు. వారు మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్ళి చక్కగా ఆహార పానీయాలనిచ్చారు. తను చేసిన దాన్ని సమర్థించుకునేందుకు రాజకీయ నాయకుడు మరుసటిరోజు వచ్చి, గ్రీసు రాజుకు వ్యతిరేకంగా మేము ప్రచారాన్ని ప్రబలపరుస్తున్నామని ఆరోపించాడు. ఇద్దరు మనుష్యులను మా వెంట కాపలాగా ఉంచి, తరువాతి విచారణ కొరకు లామియా పట్టణానికి పోలీసులు మమ్మల్ని పంపించారు. మమ్మల్ని ఏడు రోజులు కస్టడీలో ఉంచారు, తర్వాత విచారణ కొరకు చేతికి సంకెళ్ళు వేసి లారిస్సా పట్టణానికి తీసుకు వెళ్ళారు.
ముందుగా తెలపబడిన లారిస్సాలోని మన క్రైస్తవ సహోదరులు మా రాక కోసం ఎదురుచూశారు. వాళ్ళు మాపై చూపిన మహా గొప్ప వాత్సల్యం గార్డ్‌లకు చక్కని సాక్ష్యాన్నిచ్చింది. మా న్యాయవాది యెహోవాసాక్షుల్లో ఒకరు, మునుపు సైనిక కమిషనర్ ఆఫీసర్, పట్టణంలో పేరుగాంచినవాడు. ఆయన కోర్టుకి వచ్చి, మా కేసును వాదించినప్పుడు మాకు వ్యతిరేకమైన ఆరోపణ అబద్ధమని తేలింది, మేము స్వతంత్రులముగా చేయబడ్డాము.
యెహోవాసాక్షుల ప్రకటనా పని అంతటా సఫలం కావడం వ్యతిరేకత ఉద్ధృతమయ్యేందుకు కారణమయ్యింది. 1938లోను 1939లోను మత మార్పిడిని నిషేధించే చట్టాలు రూపొందించబడ్డాయి, నేను, మిఖాయేలు ఈ ఉత్తరువు కారణంగా అనేకసార్లు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాం. తర్వాత, మేము మా పనివైపుకు ఇతరుల అవధానాన్ని ఎక్కువ ఆకర్షించకుండా ఉండేందుకు విడి విడిగా పని చేయాలని బ్రాంచ్ ఆఫీస్ మాకు సలహా ఇచ్చింది. ఒక సహచరుడు లేకుండా ఉండడం కష్టమని నేను కనుగొన్నాను. అయినప్పటికీ, నేను యెహోవాయందు నమ్మకముంచి, పాదయాత్ర చేసి, అట్టికా, బోయోటియా, దైయోటస్, యూబోయ, యేటోలియా, అకర్నానియా, యూరటేనీయ మరియు పెలొపొనీసస్ జిల్లాల్లో పని పూర్తి చేశాను.
“నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు” అని యెహోవాయందలి నమ్మకముతో కీర్తనల గ్రంథకర్త పలికిన చక్కని మాటలు ఆ సమయంలో నాకు సహాయం చేశాయి.—కీర్తన 18:29, 32, 33.
1940లో ఇటలీ గ్రీస్‌పై యుద్ధాన్ని ప్రకటించింది, ఆ తర్వాత వెంటనే జర్మనీ సైన్యాలు దేశం మీదికి దండెత్తాయి. సైనిక శాసనం ప్రకటించబడింది, వాచ్‌టవర్ సొసైటీ పుస్తకాలు నిషేధించబడ్డాయి. అవి గ్రీసులోని యెహోవాసాక్షులకు క్లిష్టమైన సమయాలు; అయినప్పటికీ, వారి సంఖ్య నాటకీయంగా పెరిగింది—1940లో 178గా ఉన్న సాక్షుల సంఖ్య రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి 1945లో 1,770కి పెరిగింది!
బేతేలులో సేవచేయడం
1945లో, ఏథెన్సులోని యెహోవాసాక్షుల బ్రాంచ్ ఆఫీస్‌లో సేవ చేసేందుకు నేను ఆహ్వానించబడ్డాను. బేతేలు అంటే “దేవుని గృహం” అని అర్థం, అది అప్పట్లో లొమ్‌బార్డూ స్ట్రీట్‌లో అద్దెకు తీసుకున్న భవంతిలో ఉండేది. కార్యాలయాలు మొదటి అంతస్తులో ఉండేవి, ముద్రణాలయం క్రిందస్తులో ఉండేది. అందులో చిన్న ప్రెస్సూ, ట్రిమ్మింగ్ మెషీనూ ఉండేవి. ముద్రణాలయంలోని సిబ్బందిలో మొదట కేవలం ఇద్దరే ఉండేవారు. అయితే త్వరలోనే స్వచ్ఛంద సేవకులు ఈ పనిలో సహాయపడేందుకు ప్రతి రోజు తమ సొంత ఇంటి నుండి వచ్చి వెళ్ళనారంభించారు.
1945లో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న వాచ్‌టవర్ సొసైటీ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు పునఃస్థాపించబడ్డాయి. ఆ సంవత్సరమే మేము కావలికోటను గ్రీసులో క్రమంగా మళ్ళీ ముద్రించనారంభించాము. 1947లో తర్వాత, మేము మా బ్రాంచ్‌ను 16 టెనెడూ స్ట్రీట్‌కు మార్చాము. అయితే ముద్రణాలయాన్ని లొమ్‌బార్డో వీధిలోనే ఉంచాము. తర్వాత ఆ ముద్రణాలయం లొమ్‌బార్డో వీధిలో నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాక్షికి చెందిన ఒక కర్మాగారానికి మార్చబడింది. కనుక కొంత కాలం మేము మూడు చోట్లకూ వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం.
మేము నివసించే టెనెడూ స్ట్రీట్‌లోని మా క్వార్టర్‌ల నుండి పెందలకడనే బయలుదేరి ముద్రణాలయానికి ప్రయాణం మొదలెట్టడం నాకు గుర్తుంది. నేను అక్కడ మధ్యాహ్నం ఒంటిగంట దాకా పనిచేసి మేము పేపర్ షీట్లను ముద్రించే లొమ్‌బార్డో స్ట్రీట్‌కు వెళ్ళేవాడ్ని. అక్కడ అవి పత్రికలుగా మడవబడేవి, కుట్టబడేవి, చేతితో కత్తిరించబడి సవరించబడేవి. తర్వాత పూర్తయిన పత్రికలను మేము పోస్టాఫీస్‌కు తీసుకువెళ్ళేవాళ్ళం, వాటిని మూడవ అంతస్తుకు తీసుకు వెళ్ళి, వాటిని వేరు చేసే పనిలో, కవర్లపైన తపాలా కొరకు స్టాంపులను అంటించే పనిలో తపాలా సిబ్బందికి సహాయం చేసేవాళ్ళం.
1954 అయ్యేసరికి గ్రీస్‌లోని సాక్షుల సంఖ్య 4,000 కన్నా ఎక్కువగా పెరిగింది, విస్తృతమైన సౌకర్యాలు అవసరమయ్యాయి. అలా, మేము ఏథెన్స్ శివార్లలోని కారాలీ స్ట్రీట్‌లోని మూడంతస్తుల భవంతికి బేతేలును తరలించాం. 1958లో నేను వంటగది బాధ్యత వహించాలని కోరబడింది. 1983 వరకు అది నా బాధ్యతగా ఉండేది. అంతలో 1959లో నేను ఎలెఫ్తారీయాను పెళ్ళి చేసుకున్నాను, యెహోవా సేవలో నమ్మకస్థురాలైన సహాయకురాలుగా తను రుజువు చేసుకుంది.
మళ్ళీ వ్యతిరేకతను సహించడం
1967లో సైనిక ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకుంది. మరి మా ప్రకటనా పనిపై మళ్ళీ ప్రతిబంధకాలు వేయబడ్డాయి. అయినప్పటికీ, మా పనిపై నిషేధాలను అధిగమించడంలో మాకు మునుపటి అనుభవం ఉన్నందువల్ల మేము వెంటనే దానికి తగ్గట్లు సర్దుబాట్లు చేసుకుని రహస్యంగా పని సాగించడంలో సఫలీకృతులమయ్యాము.
మేము స్వంత గృహాల్లో కూటాలు జరుపుకునేవాళ్ళం, మా ఇంటింటి పరిచర్యలో జాగ్రత్తలను తీసుకున్నాము. అయినప్పటికీ, మా సహోదరులు తరచూ అరెస్ట్ చేయబడేవారు. కోర్టు కేసులు పెరిగాయి. మా న్యాయవాదులు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని విచారణలను జరిపేందుకు సదా ప్రయాణించవలసి వచ్చేది. వ్యతిరేకత ఉన్నప్పటికీ, సాక్షుల్లో అధికసంఖ్యాకులు తమ ప్రకటనా పనిలో ముఖ్యంగా వారాంతాల్లో క్రమంగా ఉండేవారు.
ఒక శనివారం లేదా ఆదివారం రోజున మా ప్రకటనా పని ముగిసిన తర్వాత, మాలో ఎవరైనా కనిపించకుండా పోయారా అని చూడడం జరిగేది. మామూలుగా, ఎవరైనా కనిపించలేదంటే వారు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఉంచబడ్డారన్నమాట. కనుక మేము వారికి రగ్గులను ఆహారాన్ని ఇచ్చి ప్రోత్సహించేవాళ్ళం. అలాగే, మేము మా న్యాయవాదులకు తెలిపేవాళ్ళం, వారు సోమవారం న్యాయవిచారణకర్త ఎదుటకు వచ్చి, కస్టడీలో ఉన్నవారి పక్షంగా వాదించేవారు. మేము సత్యం కోసం కష్టం అనుభవించవలసి వస్తుంది కనుక ఈ పరిస్థితిని మేము సంతోషంగా ఎదుర్కున్నాం!
నిషేధమున్న కాలంలో బేతేలులోని మా ముద్రణా పనులు ఆపివేయబడ్డాయి. కనుక ఏథెన్స్‌లోని నగరశివారులో నేను ఎలెఫ్తారీయా నివసించిన ఇల్లు ఒక ముద్రణాలయంలా అయ్యింది. ఎలెఫ్తారీయా కావలికోట శీర్షికలను పెద్ద టైప్‌రైటర్‌తో టైప్‌చేసి కాపీ చేసేది. ఆమె ఒకే సారి పది షీట్లను తీసుకుని టైప్‌రైటర్‌లో ఎక్కించి, ఆ పది షీట్లలోనూ అచ్చుపడేలా చాలా గట్టిగా కీబోర్డులను నొక్కవలసివచ్చేది. ఆ తర్వాత నేను ఆ పేజీలను సేకరించి వాటిని కలిపి కుట్టేవాడ్ని. ప్రతి రోజు సాయంకాలం మొదలుకొని మధ్యరాత్రి వరకు ఈ పని కొనసాగేది. ఒక పోలీసు క్రింది అంతస్తులో ఉండేవాడు. అతనికి ఎప్పుడూ సందేహం రాలేదెందుకా అని మేమిప్పటికీ ఆశ్చర్యపోతాం.
కొనసాగుతున్న విస్తరణలో ఆనందించడం
గ్రీస్‌లో 1974లో ప్రజా ప్రభుత్వం పునఃస్థాపించబడింది, మా ప్రకటనా పని మళ్ళీ మరింత బాహాటంగా జరిగింది. అయితే, మా పనిపై ఉండిన ఏడు సంవత్సరాల నిషేధ కాలంలో 6,000 కన్నా ఎక్కువ మంది క్రొత్త సాక్షుల అద్భుత పెరుగుదలలో మరియు మొత్తం రాజ్య ప్రచారకుల సంఖ్య 17,000ను దాటడంలో మేము ఆనందించాం.
అలాగే మేము మా బ్రాంచ్‌లోనే మా క్రమమైన ముద్రణను పునఃప్రారంభించాం. దాని ఫలితంగా కర్టాలీ స్ట్రీట్‌లోని బేతేలు సౌకర్యాలు మరీ చిన్నవయ్యాయి. కనుక, ఏథెన్స్ నగర శివారైన మారూసీలో 2.5 ఎకరాల స్థలం కొనడం జరిగింది. 27 పడకగదులు, కర్మాగారమూ, కార్యాలయాలు, ఇతర వసతులూ ఉన్న క్రొత్త బేతేలు భవనం నిర్మించబడింది. 1979 అక్టోబర్‌లో దాని ప్రతిష్ఠాపన జరిగింది.
ఇంతలో మాకు ఇంకా ఎక్కువ స్థలం అవసరమైంది. కనుక ఏథెన్స్‌కు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరాన 54 ఎకరాల భూమి కొనడం జరిగింది. పర్వతాలు, బాగా నీటి సరఫరా ఉన్న పల్లపు ప్రదేశాలు కనిపించే కొండచరియ ప్రాంతమైన ఎలీయోనా అనే స్థలమది. 1991 ఏప్రిల్‌లో, ఒక్కో ఇంట్లో 8 మంది చొప్పున సభ్యులు నివసించగల 22 ఇండ్లున్న మరో పెద్ద వసతిని మేము ప్రతిష్ఠాపన చేశాము.
పూర్తికాల పరిచర్యలో 60 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిపిన తర్వాత కూడా నేను మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించబడ్డాను. సంతోషకరంగా “ముసలితనమందు ఇంక చిగురుపెట్టు”తున్నాను. (కీర్తన 92:14) ముఖ్యంగా ఆయన సత్యారాధికుల మహత్తరమైన పెరుగుదలను నా కళ్ళారా చూసేందుకు నేను బ్రతికి ఉన్నందుకు యెహోవాకు కృతజ్ఞుడనై ఉన్నాను. యెషయా ప్రవక్త అలాంటి పెరుగుదలను ప్రవచించాడు: “నీ యొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు . . . నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.”—యెషయా 60:11.
సకల జాతుల నుండి లక్షలాదిమంది ప్రజలు యెహోవా సంస్థలోకి చేరడాన్ని, మహాశ్రమల నుండి దేవుని నూతన లోకంలోనికి ఎలా మనుగడ సాధించాలన్న విషయం బోధించబడడాన్ని చూడడం ఎంత అద్భుతంగా ఉందో! (2 పేతురు 3:13) ఈ లోకం ఇవ్వగల మరి దేనికన్నా పూర్తికాల పరిచర్య నాకు ఎంతో అమూల్యమైనదని నిరూపించబడిందని నేను నిజాయితీగా చెప్పగలను. అవును, నేను బంగారపు నిధులను కాదు కాని నా జీవితాన్ని చెప్పనలవి కానంత విధంగా ఐశ్వర్యపూర్ణముగా చేసిన ఆత్మీయ వజ్రాలనే కనుగొన్నాను.
[23వ పేజీలోని చిత్రం]
మీకాలీస్ మరియు ఎలెఫ్తారీయా కామీనారిస్
(కుడివైపు) లొమ్‌బార్డో స్ట్రీట్‌లో ముద్రణాలయం