ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—బ్రెజిల్
అనేక విషయాల్లో బ్రెజిల్ ఓ సువిశాల దేశమే. ఇటు విస్తీర్ణంలో, అటు జనాబా సంఖ్యలో ఇది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద దేశం. ఇది దక్షిణ అమెరికాలో దాదాపు సగం స్థలం ఆక్రమిస్తుంది మరియు అది ఆ ఖండంలోని మిగతా దేశాలన్నింటి జనాబాకంటే ఎక్కువ జనాబాను కలిగివుంది. ఆలాగే ప్రపంచంలోని అతిపెద్ద వర్షారణ్యం బ్రెజిల్‌లోనే ఉంది. భూమిమీది మహాగొప్ప జీవనదియగు అమెజాన్ ఆ అరణ్యంలోనుండే ప్రవహిస్తుంది.
మరో భావమందు కూడ బ్రెజిల్ ఓ సువిశాలదేశమే. అక్కడ దేవునిరాజ్య సువార్తను ప్రకటించు ప్రచారకుల సంఖ్య గత సంవత్సరం 4,00,000లకు చేరువైంది మరియు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి 10,00,000కంటే ఎక్కువమంది హాజరయ్యారు. కాబట్టి రాజ్యప్రచారానికి సంబంధించి ఈ దేశం ప్రత్యేకంగా చెప్పుకోదగిందిగా ఉంది. ఇటీవలి అనుభవాలు ఈ అంశాన్ని ఉదహరిస్తున్నాయి.
అవసరత ఎక్కువున్నచోట సేవచేయుట
రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగానున్న మినాస్ జెరిస్ రాష్ట్రమందు సేవచేసేందుకు ఆంటన్యో ఆయన భార్య సావోపౌలోనందు మంచి జీతమొచ్చే పదిలమైన ఉద్యోగాన్ని, తమ బంధువుల్ని విడిచివెళ్లే ఓ కష్టమైన నిర్ణయం తీసుకున్నారు. వారి సేవాప్రాంతంలో చక్కెరశుద్ధి కర్మాగారమందలి కార్మికుల ఓ కాలనీకూడ ఉంది. మొదటిరోజు వారక్కడ సాక్ష్యమిచ్చి, తొమ్మిది బైబిలు పఠనాలు ప్రారంభించారు. ఆ తర్వాత 18 నెలల్లోనే వారు 40కంటే ఎక్కువ పఠనాలు నిర్వహించసాగారు!
మొదట, కూటాలు శుద్ధిచేసే ఆ కర్మాగారమందే నిర్వహింపబడ్డాయి. అయితే, క్రొత్త ప్రచారకులు అసలైన రాజ్యమందిరాన్ని చూడాలని ఇష్టపడ్డారు. అందువల్ల, సమీపంలోగల సంఘానికి 75 మందిని తీసుకెళ్లేలా అద్దెకు ఓ బస్సు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత, ఒక సమావేశం జరిగింది; దానికి 45 మంది క్రొత్త బైబిలు విద్యార్థులు హాజరయ్యారు మరియు పరిచయం చేయబడ్డారు. వీరిలో 15 మంది ఆ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడ ఆనందబాష్పాలు వర్షించాయని ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదనుకోండి!
అట్టి ప్రయాణాలన్నింటికి అదే బస్సు కంపెనీ ఉపయోగించబడింది, మరియు అధికారులు చార్జీలు తక్కువ తీసుకునేవారు. తన ప్రశంసనుబట్టి ఆంటన్యో బైబిలు పఠనానికి సహాయపడే ఓ పుస్తకాన్ని ఆ సంస్థ యజమానికి ఇచ్చాడు. ఆ సాయంత్రమే ఆయన బైబిలు పఠనం ఆరంభించేందుకు అంగీకరించి, పట్టుదలతో ఆ పఠనం కొనసాగించి కొన్ని నెలల్లోనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన భార్య ఆ పఠనాన్ని మొదట వ్యతిరేకించింది, అయితే అనతి కాలంలోనే ఆమె దృక్పథం మెత్తబడింది. నేడు ఆమెకూడ బాప్తిస్మం పొందిన యెహోవాసాక్షి.
ఫిబ్రవరి 1992లో 22 మంది చురుకైన ప్రచారకులతో ఓ సంఘం నెలకొల్పబడింది. నలుగురు క్రమ పయినీర్లు, లేదా పూర్తికాల సువార్త ప్రచారకులతో 1994 నాటికి ఈ సంఖ్య 42కు పెరిగింది. ఫలితంగా, ఆంటన్యో చివరికిలా అన్నాడు: “మలాకీ 3:10 చెబుతున్నట్లు, మనం ‘యెహోవాను శోధించినయెడల’ ఆయన ‘పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడని’ నేను నా భార్య చూశాము.”
బైబిలు సాహిత్యాల్ని అందించుట
బ్రెజిల్లో సువార్తసేవ వేగంగా ముందుకు సాగడానికి సాక్షులు ప్రతి అవకాశమందునూ సాహిత్యాల్ని అందించడం బహుశ మరో కారణంకావచ్చు. ఉదాహరణకు ఒక సంఘం, యౌవనస్థుల ప్రశ్నలు—ఆచరణాత్మకమైన జవాబులు (ఆంగ్లం) అనే పుస్తక ప్రతులు తమకు 250 కావాలని వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి వ్రాశారు. ఎందుకన్ని ప్రతులు ఆర్డరుచేశారు?
ఆ ఉత్తరమిలా వివరించింది: ‘పట్టణంలోని ఓ పాఠశాల ఈ పుస్తకాన్ని తరగతిలో బోధనా విషయంగా ఉపయోగించాలని నిర్ణయించింది. విద్యార్థులైన యెహోవాసాక్షుల తలిదండ్రులు, పాఠశాల పర్యవేక్షకుల్లో ఒకాయనకు ఇచ్చిన అనియత సాక్ష్యాన్నిబట్టి పాఠశాల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పుస్తకంతో వారు చక్కని ఉపదేశమిస్తుండగా యెహోవా తన సేవకులను ఎడతెగక దీవించుగాక.’ అవును, సువిశాల దేశమగు బ్రెజిల్లో శ్రేష్ఠమైన రాజ్యప్రచార సేవాభివృద్ధిని యెహోవా ఎడతెగక దీవించుగాక.
[8వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1994 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 3,85,099
నిష్పత్తి: 1 సాక్షికి 404
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 10,18,210
సగటు పయినీర్ ప్రచారకులు: 38,348
సగటు బైబిలు పఠనాలు: 4,61,343
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 24,634
సంఘాల సంఖ్య: 5,928
బ్రాంచి కార్యాలయం: సిజారియో లాంజా
[9వ పేజీలోని చిత్రం]
సావోపౌలోనందు 1940 నాటి సౌండ్ కారు
[9వ పేజీలోని చిత్రం]
రియో డి జనారియోలో వృక్షశాస్త్ర ఉద్యానవనంలో సాక్ష్యమిచ్చుట
[9వ పేజీలోని చిత్రం]
సిజారియో లాంజాలోని బ్రాంచి కార్యాలయం