కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 7/15 పేజీలు 4-7
  • ఆత్మ సామ్రాజ్యమందలి పరిపాలకులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆత్మ సామ్రాజ్యమందలి పరిపాలకులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని విరోధియగు ఓ నిజమైన వ్యక్తి
  • పరిపాలించుటకు సాతాను ఎందుకు అనుమతింపబడ్డాడు
  • సాతానుకిక కొద్దిసమయమే ఉంది!
  • రాజ్య పరిపాలనక్రింద ఆనందించుట
  • జాగ్రత్తగా ఉండండి—సాతాను మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీ శత్రువు గురించి తెలుసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • అపవాది ఎవరు?
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 7/15 పేజీలు 4-7

ఆత్మ సామ్రాజ్యమందలి పరిపాలకులు

లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మానవాతీత పర్యవేక్షణలాంటిదేమైనా ఉన్నదా? లేక తామే అన్నీ చూసుకోవడానికి మానవుల్ని దేవుడు వదిలేశాడా? ఈ ప్రశ్నలకు జవాబులు వెదకుటలో మొదట మనం యేసుక్రీస్తు భూపరిచర్య కాలంలో జరిగిన ఓ సంఘటనను పరిశీలిద్దాం.

యేసు బాప్తిస్మం తీసుకున్న కొద్దిరోజులకే, అపవాదియగు సాతానని పిలువబడిన అదృశ్య ఆత్మీయ ప్రాణి ఆయనను శోధించాడు. ఆ శోధనల్లో ఒకదానిని ఉదహరిస్తూ, “అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను [యేసును] తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు” చూపాడని బైబిలు చెబుతున్నది. (మత్తయి 4:8) ఆ పిమ్మట సాతాను యేసుతో ఇలా అన్నాడు: “ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీ కిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగును.”—లూకా 4:6, 7.

ఈ లోకమందలి సమస్త రాజ్యాలమీద లేక ప్రభుత్వాలమీద తనకు అధికారముందని సాతాను చెప్పుకున్నాడు. ఈ వాదాన్ని యేసు నిరాకరించాడా? లేదు. నిజానికి ఆయన మరో సందర్భంలో సాతానును “ఈ లోకాధికారి” అని సూచించుట ద్వారా ఈ విషయాన్ని స్థిరపర్చాడు.—యోహాను 14:30.

బైబిలు ప్రకారంగా, సాతాను గొప్ప అధికారముగల ఓ దుష్ట దూతయైయున్నాడు. సాతాను “దురాత్మల సమూహముల” పాలివాడని, వారు “ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులని” క్రైస్తవ అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (ఎఫెసీయులు 6:11, 12) అంతేకాకుండ, “లోకమంతయు దుష్టునియందున్నది” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. (1 యోహాను 5:19) సాతాను “సర్వలోకమును మోసపుచ్చు”చున్నాడని బైబిలు పుస్తకమగు ప్రకటన తెలియజేస్తున్నది. (ప్రకటన 12:9) సాతాను ఓ ఘటసర్పమని, అతడు లోక రాజకీయ విధానానికి “తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను” అనికూడ ప్రకటన చిహ్నార్థక పదాలతో వర్ణిస్తున్నది.—ప్రకటన 13:2.

ఓ దుష్టశక్తి చురుకుగా పనిచేస్తున్నదని, హాని కలుగునట్లు మానవులనది నేర్పుగా ఆడిస్తున్నదని ప్రపంచ సంఘటనలు కూడా రుజువు చేస్తున్నవి. మరే కారణంచేత మానవ ప్రభుత్వాలు శాంతిని వృద్ధి చేయలేకపోతున్నాయి? ప్రజలు పరస్పరం ద్వేషించుకొని, చంపుకోవడానికి మరింకేది కారణమౌతుంది? ఓ అంతర్యుద్ధంలో జరిగిన సంహారం, మరణం ద్వారా భీతిల్లిన ఒక ప్రత్యక్షసాక్షి ఇలా చెప్పింది: “ఈ దుర్మార్గం ఎలా సంభవించగల్గిందో నాకు తెలియడంలేదు. అది కేవలం ద్వేషమే కాదు. పరస్పర నాశనానికి ఓ దురాత్మే ఈ మానవుల్ని ఉపయోగిస్తున్నది.”

దేవుని విరోధియగు ఓ నిజమైన వ్యక్తి

అపవాదియగు సాతాను ఉన్నాడని నేడనేకమంది నమ్మరు. అయినా, కొందరు నమ్మునట్లు అతడు మానవుల్లోని దుష్టలక్షణం మాత్రం కాదు. బైబిలు, లోకం ఈ రెండూ అతడొక నిజమైన వ్యక్తియని చూపిస్తున్నాయి. అంతేకాదు, సాతాను యెహోవా దేవుని బద్ధవిరోధి. నిస్సందేహంగా, సాతాను దేవునికి సమానుడు మాత్రం కాదు. యెహోవా సర్వశక్తిగల సృష్టికర్త గనుక, సమస్త సృష్టిపై ఆయనే హక్కుగల పరిపాలకుడు.—ప్రకటన 4:11.

తనకు విరోధిగా ఓ దుష్ట ప్రాణిని దేవుడు సృజించలేదు. బదులుగా, దేవదూతలగు “దేవుని కుమారుల్లో” ఒకడు, న్యాయంగా యెహోవాకు దక్కాల్సిన ఆరాధన తనకు దక్కాలనే స్వార్థకోరికను పెంచుకున్నాడు. (యోబు 38:7; యాకోబు 1:14, 15) ఈ కోరికే అతడు దేవునికి వ్యతిరేకమైన పనిని చేయడానికి నడిపింది. తిరగబడటం ద్వారా, ఈ ఆత్మీయ ప్రాణి తానే సాతానుగా (“ఎదిరించువాడని” భావం) అపవాదిగా (“కొండెగాడని” భావం) తయారయ్యాడు. దీనియంతటి దృష్ట్యా, లోకాన్ని పరిపాలించుటకు సాతాను ఎందుకు అనుమతింపబడ్డాడని మీరాలోచించవచ్చు.

పరిపాలించుటకు సాతాను ఎందుకు అనుమతింపబడ్డాడు

భూమిపై పరిపాలనను గూర్చి యేసుతో సాతాను అన్నమాటలు మీకు గుర్తున్నాయా? “ఈ అధికారమంతయు . . . నీకిత్తును; అది నా కప్పగింపబడియున్నది” అని సాతాను చెప్పాడు. (లూకా 4:6) ఆ మాటలు కేవలం దేవుని అనుమతిచొప్పునే అపవాదియగు సాతాను అధికారం చేస్తున్నాడని చూపిస్తున్నాయి. అయితే దేవుడెందుకు సాతానును సహిస్తున్నాడు?

ఆ ప్రశ్నకున్న జవాబు లోక పరిపాలకునిగా సాతాను తన పనిని ఎక్కడ ప్రారంభించాడో, ఆ ఏదెను తోటలోని సంఘటనలకు సంబంధం కలిగివుంది. మొదటి స్త్రీపురుషులగు ఆదాముహవ్వలకు మేలైనది అందకుండాచేస్తూ దేవుడు దుష్పరిపాలన చేస్తున్నాడని సాతాను అక్కడ సూచించాడు. సాతాను చెప్పినట్లు, దేవుడు నిషేధించిన ఆ ఫలాన్ని వారుతింటే, వారు విడుదల పొందుతారు. ఆదాముహవ్వలు యెహోవానుండి స్వేచ్ఛ పొంది, స్వతంత్రులౌతారు. వారు దేవునివలె ఉంటారు!—ఆదికాండము 2:16, 17; 3:1-5.

ఈ విధంగా అబద్ధం చెప్పి హవ్వను మోసగించి దేవుని నియమం ఉల్లంఘించునట్లు ఆమెమూలంగా ఆదామును సమ్మతింపజేయుట ద్వారా, మొదటి మానవజతను సాతాను తన నాయకత్వం మరియు అధీనం క్రిందకు తెచ్చుకున్నాడు. ఆ విధంగా యెహోవాకు విరోధంగా అపవాది వారి దేవుడయ్యాడు. అయితే విడుదలకు బదులు ఆదాముహవ్వలు సాతానుకు, పాపానికి, మరణానికి దాసులయ్యారు.—రోమీయులు 6:16; హెబ్రీయులు 2:14, 15.

తన పరిపూర్ణ న్యాయానికి పొందికగా, యెహోవా వెంటనే సాతానును అతని ఇద్దరు క్రొత్త అనుచరుల్ని హతమార్చగల్గేవాడే. (ద్వితీయోపదేశకాండము 32:4) అయితే, అందు ఒక నైతిక వివాదాంశము ఇమిడియుండెను. యెహోవా న్యాయ పరిపాలనా విధానాన్ని సాతాను సవాలుచేశాడు. తననుండి స్వతంత్రంగా ఉండుట విపత్కరమని నిరూపింపబడగల్గునట్లు దేవుడు తన జ్ఞానాన్నిబట్టి, కాలం గడచుటకు అనుమతించాడు. ఆదాముహవ్వలు సంతానం కలిగివుండుటకు సమ్మతిస్తూ, యెహోవా ఆ తిరుగుబాటుదార్లు కొంతకాలం జీవించుటకు అనుమతించాడు.—ఆదికాండము 3:14-19.

ఆదాము సంతానంలో అత్యధికులు యెహోవా పరిపాలనకు లోబడకపోయిననూ, తన ఆరాధికులతో దేవుని వ్యవహారములందు ఆయన పరిపాలనా ఔన్నత్యం ప్రదర్శింపబడింది. యెహోవా అధికారాన్ని యుక్తంగా గుర్తించుట ధన్యతను, నిజమైన భద్రతను తీసుకొస్తుంది. మరోవైపున, సాతాను ప్రభావం క్రిందగల మానవ పరిపాలనా ఫలితంగా దుఃఖం, భద్రతలేనితం కలిగాయి. అవును, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:9) సాతాను అధికారమందలి ఈ లోకంలో మానవ పరిపాలన క్రింద మానవులు నిజమైన భద్రతను, శాశ్వత సంతోషాన్ని కనుగొనలేదు. అయితే, ఆశాభావం కలిగివుండుటకు గట్టి కారణం కలదు.

సాతానుకిక కొద్దిసమయమే ఉంది!

భూమిపై సాతాను ప్రభావం తాత్కాలికం. సాతాను పరిపాలనను మరెంతోకాలం యెహోవా సహించడు! త్వరలోనే అపవాది కార్యశూన్యునిగా చేయబడతాడు. స్వయంగా దేవుడే ఎంపికచేసిన నీతిమంతుడగు ఓ క్రొత్త పరిపాలకుడు భూమిపై అధికారం చేపడతాడు. ఆ రాజు యేసుక్రీస్తు. ఆయన పరలోకమందు సింహాసనాసీనుడు కావడాన్ని గూర్చి ప్రకటన ఇలా చెబుతున్నది: “ఈ లోకరాజ్యము మన ప్రభువు [యెహోవా] రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను.” (ప్రకటన 11:15) బైబిలు కాలవృత్తాంతము, ఆలాగే లేఖనాల ప్రవచన నెరవేర్పు ఈ సంఘటన 1914వ సంవత్సరంలో జరిగినట్లు నిరూపిస్తున్నాయి.—మత్తయి 24:3, 6, 7.

యేసు సింహాసనాసీనుడైన కొద్దికాలానికే ఏమి జరిగిందో కూడ బైబిలు వివరిస్తున్నది. అదిలా చెబుతున్నది: “పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును [యేసుక్రీస్తు] అతని దూతలును ఆ ఘటసర్పముతో [సాతానుతో] యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరిగాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితోకూడ పడద్రోయబడిరి.”—ప్రకటన 12:7-9.

పరలోకమునుండి సాతాను పడద్రోయబడుట ఫలితమేమైయుంటుంది? పరలోకమందున్నవారు సంతోషించగలరు, మరి భూనివాసుల సంగతేమిటి? “భూమి, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని” ప్రకటన 12:12 చెబుతున్నది. పరలోకంనుండి సాతాను పడద్రోయబడుట, భూమికి నిజంగా శ్రమను తెచ్చింది. ద కొలంబియా హిస్టరీ ఆఫ్‌ ద వరల్డ్‌ ఇలా చెబుతున్నది: “నాలుగు సంవత్సరాలపాటు అనగా 1914-1918 వరకు జరిగిన యుద్ధపు మహాగొప్ప విపత్తు . . . స్వీయ బుద్ధిహీనత లేదా దుష్ట ప్రేరణనుండి నాగరికతను కాపాడలేకపోయిందని పాశ్చాత్య ప్రపంచానికి చూపింది. ఆ విధ్వంసపు తాకిడినుండి పాశ్చాత్య ప్రపంచపు మానసిక స్థయిర్యం నిజానికి ఎన్నడూ కోలుకోలేదు.”

ధ్వంసమైన మానసిక స్థయిర్యంకంటే మరెక్కువైన వాటితో ఈ తరపు శ్రమలు గుర్తించబడ్డాయి. యేసు ఇలా ప్రవచించాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును.” ఆయన తెగుళ్లనుగూర్చి కూడ ముందే చెప్పాడు. (మత్తయి 24:7, 8; లూకా 21:11) అంతేకాకుండ, సాతాను విధానపు “అంత్యదినములలో” అనేకులు “స్వార్థప్రియులు ధనాపేక్షులు . . . తలిదండ్రులకు అవిధేయులు . . . అతిద్వేషులుగా” ఉంటారని బైబిలు చెబుతున్నది. ఆలాగే ప్రజలు “దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారుగా” కూడ ఉంటారు.—2 తిమోతి 3:1-5.

యుద్ధాలు, తెగుళ్లు, కరవులు, భూకంపాలు, నైతిక విలువలు దిగజారిపోవడం—ఇవన్నీ బైబిలు ముందేచెప్పినట్లు, 1914 నుండి అసాధారణ రీతిలో సంభవించాయి. అవి దేవునికి, మానవునికి శత్రువైన ఆ క్రోధముగల అపవాదియగు సాతాను పరలోకం నుండి పడద్రోయబడి ఇప్పుడు భూపరిపాలనపైకి తన ఉగ్రతను మళ్లిస్తాడని సూచిస్తున్నాయి. అయితే ఇంకెక్కువ కాలం పనిచేయడానికి సాతాను అనుమతింపబడడని కూడా బైబిలు చూపిస్తున్నది. సాతాను అదుపు చేసే ఈ లోక విధానాన్ని దేవుడు అర్మెగిద్దోనులో నాశనం చేసేంతవరకు అతనికి కేవలం “సమయము కొంచెమే” మిగిలియున్నది.

ఆ కొంచెం సమయం ముగిసినప్పుడు సాతానుకు ఏమి సంభవిస్తుంది? అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “పెద్దసంకెళ్లను చేతపట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి . . . అగాధమును మూసి దానికి ముద్రవేసెను.” (ప్రకటన 20:1-3) బాధపడుతున్న మానవజాతికి ఎంత ఉపశమనమో గదా!

రాజ్య పరిపాలనక్రింద ఆనందించుట

సాతాను అడ్డు తొలగడంతో, యేసుక్రీస్తు అధికారమందలి దేవుని రాజ్యం మానవ వ్యవహారాలన్నింటిని తన అధీనంలోకి పూర్తిగా తీసుకుంటుంది. భూమిపై అనేక ప్రభుత్వాలకు బదులుగా, ఈ యావత్‌ గ్రహాన్ని పరిపాలించేందుకు ఒకే పరలోక ప్రభుత్వం ఉంటుంది. యుద్ధం గతించిపోగా, ప్రతిచోట శాంతి వెల్లివిరుస్తుంది. దేవునిరాజ్య పరిపాలన క్రింద అందరూ ప్రేమగల సహోదరత్వమందు కలిసి జీవిస్తారు.—కీర్తన 72:7, 8; 133:1; దానియేలు 2:44.

ఎటువంటి పరిపాలకునిగా యేసు నిరూపించుకుంటాడు? భూమిపై ఉన్నప్పుడు ఆయన ప్రజలయెడల లోతైన ప్రేమను ప్రదర్శించాడు. ఆకలిగొన్న వారికి యేసు కనికరంతో ఆహారం పెట్టాడు. ఆయన రోగుల్ని స్వస్థపర్చాడు, గ్రుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారికి పలుకునిచ్చాడు, మంచి అవయవాలిచ్చి వికలాంగుల్ని బాగుచేశాడు. చనిపోయిన వారిని సహితం యేసు జీవానికి తెచ్చాడు! (మత్తయి 15:30-38; మార్కు 1:34; లూకా 7:11-17) ఆ అద్భుతాలు రాజుగా ఆయనింకనూ చేయబోవు ఆశ్చర్యకార్యాలకు ముంగుర్తులై ఉండెను. అటువంటి ఉపకారియైన పరిపాలకుణ్ణి కలిగివుండుట ఎంత అద్భుతమో గదా!

యెహోవా సర్వాధిపత్యానికి లోబడేవారు అనంత ఆశీర్వాదాలు అనుభవిస్తారు. లేఖనాలిలా వాగ్దానం చేస్తున్నాయి: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును.” (యెషయా 35:5, 6) ఆ మహత్తైన రోజును ముందుగానే సూచిస్తూ, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “అప్పుడు—ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”—ప్రకటన 21:3, 4.

అపవాదియగు సాతాను అధికారమందలి ప్రస్తుత విధానంలో మనం బహుశ అనుభవించిన ఎట్టి బాధనైనా తన కుమారుడగు యేసుక్రీస్తుద్వారా యెహోవా దేవుని పరిపాలన అనుగ్రహించు ఆనందాలు మరిపిస్తాయి. దేవుని వాగ్దత్త నూతన లోకంలో ప్రజలు, ‘నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?’ అని ఆశ్చర్యపడరు. (2 పేతురు 3:13) ఆత్మ సామ్రాజ్యమందలి ప్రేమగల పరిపాలకులగు యెహోవా, యేసుక్రీస్తుల అధికారం క్రింద భూమిపై విధేయతగల మానవజాతి సంతోషంగా, భద్రంగా ఉంటుంది. వారి పౌరుల్లో ఉండాలన్న నిరీక్షణను ఎందుకు హత్తుకొన కూడదు?

[7వ పేజీలోని చిత్రం]

భూమిపై దేవునిరాజ్య అధికారమందు మానవజాతి భద్రంగా ఉంటుంది

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

NASA photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి