యెహోవాయందు నాకున్న నమ్మకాన్నిబట్టి బలపర్చబడ్డాను
అజెనోర్ డ పైషువన్ చెప్పినట్లు
మా ఏకైక కుమారుడు పౌలూ కేవలం 11 నెలల వయస్సులో బ్రోంఖైటిస్తో మరణించాడు. మూడునెలల తర్వాత, 1945 ఆగస్టు 15న నా అమూల్యమైన భార్య న్యుమోనియాతో మరణించింది. అప్పుడు నాకు 28 సంవత్సరాలు, ఈ విపత్తులు నాకు దుఃఖాన్ని, వేదనను కలిగించాయి. అయినప్పటికీ, యెహోవాయందు ఆయన వాగ్దానాలందు ఉన్న నమ్మకం నన్ను బలపర్చింది. ఈ నమ్మకం నాకెలా కలిగిందో చెప్పనివ్వండి.
బ్రెజిల్ నందలి బహాయా రాష్ట్రంలోని సాల్వడార్లో 1917 జనవరి 5న నేను జన్మించాను అప్పటి నుండి, కాథోలిక్ చర్చికి చెందిన “పరిశుద్ధులను” ఆరాధించడాన్ని అమ్మ నాకు నేర్పించింది. మేము కలిసి ప్రార్థించగలిగేలా ఆమె నన్ను నా సహోదరులను ఉదయాన్నే త్వరగా నిద్రలేపేది. అయితే నా తలిదండ్రులు, ఆఫ్రికా-బ్రెజిల్‌లకు సంబంధించిన వూడూ కర్మలైన కాన్డోంబుల్ కూటాలకు కూడా హాజరయ్యేవారు. ఈ నమ్మకాలను నేను గౌరవించేవాడిని, కాని కాథోలిక్ మతం లేక కాన్డోంబుల్లకు చెందిన పరిశుద్ధులని పిలువబడేవారిలో నాకు నమ్మకం ఉండేది కాదు. ముఖ్యంగా ఈ మతాల్లో కనిపించే జాత్యాహంకారం నాకు నిరుత్సాహం కలిగించేది.
కొంత కాలానికి నా అన్నలిద్దరూ పని వెతుక్కోవడానికి ఇల్లు విడిచి వెళ్లారు. ఆ తర్వాత మా నాన్న కుటుంబాన్ని వదిలేసి వెళ్లాడు. కాబట్టి మా అమ్మకు చెల్లికి సహాయం చేసేందుకు నేను తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే పని వెతుక్కోవలసి వచ్చింది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత, ఫ్యాక్టరీలో నా సహోద్యోగి ఒకతనితో జరిగిన సంభాషణలు నా జీవితంలో మైలురాయిగా నిరూపించబడ్డాయి.
యెహోవాయందు నమ్మకాన్ని సంపాదించుకోవడం
నేను 1942లో ఫెర్నాన్డూ టెలెజ్ను కలిశాను. ఆయన తరచూ “పరిశుద్ధులను” ఆరాధించడం తప్పని చెప్పేవాడు. (1 కొరింథీయులు 10:14; 1 యోహాను 5:21) మొదట్లో ఆయన చెప్పేదాని ఎడల నేను ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు. కాని ఆయనకున్న యథార్థత, ఏ రంగువారైనప్పటికీ ప్రజల ఎడల ఆయనకుగల ఆసక్తి నన్ను ముగ్ధున్ని చేశాయి, ఆయనకున్న బైబిలు జ్ఞానాన్ని ప్రాముఖ్యంగా దేవుని రాజ్యం గురించి పరదైసు భూమి గురించి ఆయన చెప్పేదాన్ని నేను మెచ్చుకోసాగాను. (యెషయా 9:6, 7; దానియేలు 2:44; ప్రకటన 21:3, 4) నా ఆసక్తిని గమనించి, ఆయన నాకు ఒక బైబిలును కొంత బైబిలు సాహిత్యాన్ని ఇచ్చాడు.
కొన్ని వారాల తర్వాత, సంఘ బైబిలు పఠనానికి ఆహ్వానించినప్పుడు నేను దాన్ని అంగీకరించాను. ఆ గుంపు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన మతం (ఆంగ్లం) అనే పుస్తకాన్ని పఠిస్తోంది. నాకు ఆ పఠనం నచ్చింది, యెహోవాసాక్షుల సంఘ కూటాలన్నిటికీ హాజరుకావడం ప్రారంభించాను. అక్కడ జాత్యాహంకారం లేకపోవడం మరియు నేను వెంటనే అంగీకరింపబడిన విధానం ప్రాముఖ్యంగా నన్ను ఆకర్షించాయి. ఆ సమయానికల్లా నేను లీండూరను వివాహం చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నాను. నేను నేర్చుకుంటున్నదాని గురించి ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె నాతోపాటు కూటాలకు హాజరుకానారంభించింది.
కూటాల్లో నన్ను ప్రభావితం చేసిన మరో విషయమేమిటంటే, ప్రకటన పని గురించి నొక్కి చెప్పబడటం. (మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 20:20) పయినీర్లని పిలువబడే పూర్తికాల సేవకుల ద్వారా ప్రోత్సహింపబడి, నేను రైలులో ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా ఇతరులతో అనియతంగా మాట్లాడడం ప్రారంభించాను. ఆసక్తిగల వారినెవరినైనా నేను కనుగొన్నప్పుడు, ఆయన చిరునామా తీసుకుని, ఆ ఆసక్తిని వృద్ధి చేయడానికి ఆయనను దర్శించేవాడిని.
ఈ మధ్య కాలంలో, యెహోవాయందు ఆయన ఉపయోగిస్తున్న సంస్థయందు నా నమ్మకం పెరుగుతూవచ్చింది. అందుకే, క్రైస్తవ సమర్పణను గూర్చిన ఒక బైబిలు ప్రసంగాన్ని విన్న తర్వాత, 1943 ఏప్రిల్ 19న, అట్లాంటిక్ మహాసముద్రంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. అదే రోజున, నేను మొదటిసారిగా క్రమమైన ఇంటింటి పరిచర్యలో భాగం వహించాను.
రెండు వారాల తర్వాత, మే 5న లీండూర నేను వివాహం చేసుకున్నాము. ఆ తర్వాత, 1943 ఆగస్టులో, సాల్వడార్ నగరంలో యెహోవాసాక్షులు నిర్వహించిన మొదటి సమావేశంలో ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఆ సమావేశం గురించి యెహోవాసాక్షుల 1973 వార్షిక పుస్తకం ఇలా తెలియజేసింది: “మతనాయకుల చర్య సాల్వడార్లో బహిరంగ ప్రసంగాన్ని నిలిపివేయగలిగింది, కాని దానికి ముందే చక్కని ప్రచారం ముమ్మరంగా . . . సాగింది.” తీవ్ర హింస ఉన్న సమయంలో యెహోవా నడిపింపు యొక్క నిదర్శనం ఆయన ఎడల నా నమ్మకాన్ని బలపర్చింది.
నేను ప్రారంభంలో చెప్పినట్లుగా, లీండూర బాప్తిస్మం తీసుకున్న కేవలం రెండు సంవత్సరాల తర్వాత అంటే మా కుమారుడు మరణించిన మూడునెలల తర్వాత, నా ప్రియమైన భార్య మరణించింది. ఆమెకు 22 సంవత్సరాలు మాత్రమే. కాని యెహోవాయందు నాకుగల నమ్మకం ఆ కష్టతరమైన నెలల్లో నన్ను బలపర్చింది.
ఆత్మీయ కార్యకలాపం ద్వారా బలపర్చబడడం
నా భార్యను, కుమారున్ని కోల్పోయిన ఒక సంవత్సరం తర్వాత 1946లో, అప్పుడు సాల్వడార్లోవున్న ఒక సంఘంలో నేను బైబిలు పఠన సేవకునిగా నియమింపబడ్డాను. అదే సంవత్సరం బ్రెజిల్‌నందలి సంఘాల్లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ప్రారంభించబడింది, బహాయా రాష్ట్రంలో నేను మొదటి పాఠశాల నిర్వాహకుణ్ణయ్యాను. ఆ తర్వాత 1946 అక్టోబరులో, సావుపౌలో నగరంలో “ఆనందభరిత దేశాలు” అనే దైవపరిపాలనా సమావేశం జరిగింది. పది సంవత్సరాలుగా నాకు యజమానిగా ఉన్న వ్యక్తి తనకు నా అవసరం ఉందని చెబుతూ వెళ్లవద్దని నన్ను ఒత్తిడి చేశాడు. అయితే, నేను సమావేశానికి హాజరుకావడం నాకు ఎంత ప్రాముఖ్యమైనదో నేను ఆయనకు వివరించిన తర్వాత, ఆయన నాకు ఒక ఉదార బహుమానాన్నిచ్చి, వీడుకోలు చెప్పాడు.
సావుపౌలోలోని మునిసిపల్ హాలులో జరిగిన సమావేశ కార్యక్రమాలు బ్రెజిల్ దేశ భాషయైన పోర్చుగీసు అదేవిధంగా ఆంగ్లం, జర్మను, హంగేరియన్, పోలిష్, మరియు రష్యన్ భాషల్లోను నిర్వహించబడ్డాయి. ఆ సమావేశంలో తేజరిల్లు! పత్రిక పోర్చుగీసు భాషలో విడుదల చేయబడింది. దాదాపు 1,700 మంది బహిరంగ ప్రసంగానికి హాజరైన ఆ సమావేశాన్నిబట్టి నేను ఎంతో ప్రేరేపితుణ్ణై, 1946 నవంబరు 1 నుండి పయినీరు సేవ ప్రారంభించడానికి నేను దరఖాస్తును నింపాను.
ఆ సమయంలో మేము మా పయినీరు పనిలో ఫోనోగ్రాఫ్‌ను విస్తృతంగా ఉపయోగించేవాళ్లము. “కాపుదల” అనే ప్రసంగాన్ని మేము గృహస్థులకు తరచూ వినిపించేవాళ్లము. దాని తర్వాత మేమిలా చెప్పేవాళ్లము: “ఒక అదృశ్య శత్రువు నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, మనం అదృశ్యుడైన ఒక స్నేహితునికి సన్నిహితమవ్వాలి. యెహోవా మన అత్యంత గొప్ప స్నేహితుడు, మన శత్రువైన సాతానుకంటే ఎంతో ఎక్కువ శక్తిమంతుడు. కాబట్టి మనల్ని మనం అతని నుండి కాపాడుకోవడానికి మనం యెహోవాకు సన్నిహితమవ్వాలి.” ఆ తర్వాత మేము, అదనపు సమాచారాన్ని అందజేసే కాపుదల (ఆంగ్లం) అనే చిన్నపుస్తకాన్ని అందజేసేవాళ్లము.
రియో డి జనైరోలోని కార్యీక సంఘంతో ప్రత్యేక పయినీరుగా సేవ చేయడానికి ఆహ్వానింపబడే సమయానికి నేను ఒక సంవత్సరంకంటే తక్కువకాల పయినీరు సేవ చేశాను. అక్కడ మేము కొన్నిసార్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాము. నా సహభాగియైన ఈవాన్ బ్రెన్నర్పై ఒకసారి ఒక గృహస్థుడు నిజంగా దాడి చేశాడు. ఇరుగుపొరుగువారు పోలీసులను పిలిపించారు, మమ్మల్నందరినీ పోలీసుస్టేషనుకు తీసుకువెళ్లారు.
విచారణ సమయంలో, ఉద్రిక్తుడైన గృహస్థుడు మేము శాంతిని పాడుచేస్తున్నామని మమ్మల్ని నిందించాడు. నిశ్శబ్దంగా ఉండమని పోలీసు చీఫ్ అతనికి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత పోలీసు చీఫ్ మా వైపు తిరిగి సౌమ్య స్వరంతో, మేము వెళ్లవచ్చునని చెప్పాడు. మమ్మల్ని నిందిస్తున్న వ్యక్తిని ఆపివేసి, మాపై దాడి చేశాడని అతనిపై నేరాన్ని మోపాడు. అలాంటి సందర్భాలు యెహోవాయందలి నా నమ్మకాన్ని బలపర్చాయి.
విస్తృత పూర్తికాల పరిచర్య
బేతేలులో సేవ చేయడానికి 1949 జూలై 1న ఆహ్వానాన్ని అందుకున్నప్పుడు నేను పులకించిపోయాను, ఒక దేశంలోవుండే యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం బేతేలు అని పిలువబడుతుంది. అప్పుడు బ్రెజిల్లోవున్న బేతేలు రియో డె జనైరోలో 330 లిసిన్యో కార్డోసో వీధిలో ఉండేది. ఆ సమయంలో, మొత్తం బేతేలు కుటుంబంలో కేవలం 17 మందే ఉండేవారు. కొంతకాలం నేను స్థానిక ఎన్జెన్యో డె డెంట్రూ సంఘానికి హాజరయ్యాను, కాని ఆ తర్వాత నేను రియో డె జనైరో నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలోవున్న నగరమైన బెల్‌ఫోర్ రోక్షూలో ఉన్న ఏకైక సంఘంలో సంఘ పైవిచారణకర్తగా నియమింపబడ్డాను.
వారాంతాల్లో చాలా బిజీగా ఉండేది. శనివారాల్లో నేను రైలులో బెల్‌ఫోర్ రోక్షూకు ప్రయాణించి, మధ్యాహ్నం ప్రాంతీయ పరిచర్యలో పాల్గొని, ఆ తర్వాత సాయంకాలం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు, సేవాకూటానికి వెళ్లేవాడిని. రాత్రి నేను సహోదరుల దగ్గర ఉండి, మరునాడు ఉదయం ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనేవాడిని. ఆ మధ్యాహ్నం నేను బహిరంగ బైబిలు ప్రసంగానికి, కావలికోట పఠనానికి హాజరై, రాత్రి తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో బేతేలుకు తిరిగివచ్చేవాడిని. నేడు బెల్‌ఫోర్ రోక్షూలో 18 సంఘాలున్నాయి.
1954లో, ఆ పట్టికను మూడున్నర సంవత్సరాలపాటు అనుసరించిన తర్వాత, సావో క్రిస్టావో సంఘంలో సంఘ పైవిచారణకర్తగా నేను తిరిగి రియో డె జనైరోకు నియమింపబడ్డాను. తర్వాతి పది సంవత్సరాలు నేను ఆ సంఘంతోపాటు సేవ చేశాను.
నా బేతేలు నియామకాలు
సంస్థకున్న ఏకైక వాహనమైన, దానికున్న గోదుమ వర్ణాన్నిబట్టి చాక్లెట్ అని పిలువబడుతున్న 1949 డాడ్జ్ వ్యాను కొరకు ఒక గారాజ్ను నిర్మించడం బేతేలులో నా మొదటి నియామకం. గారాజ్ నిర్మాణం ముగిసినప్పుడు, నాకు వంటగదిలో పని అప్పగించబడింది, అక్కడ నేను మూడు సంవత్సరాలపాటు పని చేశాను. ఆ తర్వాత నాకు జాబ్ ప్రెస్ విభాగంలో పని ఇవ్వబడింది, అక్కడ నేను 40 సంవత్సరాలపైగా పనిచేస్తున్నాను.
మావద్ద ఉండిన ముద్రణా పరికరాలు చాలావరకు పాతవి. ఉదాహరణకు, అనేక సంవత్సరాలపాటు మావద్ద పాత ప్లాటెన్ ప్రెస్ ఉండేది, దాన్ని మేము అబ్రాహాము భార్య పేరు మీదుగా ప్రేమతో శారా అని పిలిచేవాళ్లము. న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లో ఉన్న వాచ్‌టవర్ సొసైటీ ప్రధాన కార్యాలయంలోని ఫ్యాక్టరీలో అది సంవత్సరాలపాటు ఉపయోగించబడింది. తర్వాత 1950లలో, అది బ్రెజిల్‌కు రవాణా చేయబడింది. ఇక్కడ, అబ్రాహాము భార్యలా, అది తన వృద్ధాప్యంలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల రూపంలో ఫలవంతమయింది.
బ్రెజిల్ ముద్రణా విభాగంలో ఉత్పత్తి చేయబడిన ప్రచురణల సంఖ్యలో వచ్చిన అభివృద్ధినిబట్టి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉన్నాను. 1953వ సంవత్సరమంతటిలో, మేము 3,24,400 పత్రికలు ముద్రించాము, కాని ఇప్పుడు ఉత్పత్తి ప్రతి నెల 30 లక్షలకంటే ఎక్కువగా ఉంది!
మా బేతేలు భవనాలు
బ్రెజిల్ నందలి మా బేతేలు భవనాల విస్తృతిని చూడడం ఈ సంవత్సరాలన్నిటిలో ఎంతో ఉత్తేజకరంగా ఉంది. 1952లో మేము రియె డె జనైరోలో మా బేతేలు గృహం వెనుక రెండంతస్తుల భవనాన్ని నిర్మించాము. ఆ తర్వాత 1968లో, బేతేలును సావుపౌలో నగరంలోని ఒక క్రొత్త భవనానికి మార్చడం జరిగింది. మేము అందులోకి మారినప్పుడు, 42 మంది సభ్యులుగల మా బేతేలు కుటుంబానికి అన్నీ పెద్దగా విశాలంగా ఉన్నట్లు అనిపించింది. భవిష్యత్తులో జరిగే అభివృద్ధి అంతటికీ ఈ భవనం సరిపోతుందని మేము నిజంగా తలంచాము. అయితే, 1971లో ఐదంతస్తుల భవనాలు రెండు నిర్మింపబడ్డాయి, దాని ప్రక్కనేవున్న ఫ్యాక్టరీని కొని, మార్పులు చేసి, ఈ భవన సముదాయానికి దాన్ని జతచేశారు. కాని కొన్ని సంవత్సరాల్లో, రాజ్య ప్రచారకుల అభివృద్ధి కొనసాగడంతో, అంటే 1975లో మేము 1,00,000 సంఖ్యను దాటడంతో ఎక్కువ స్థలం అవసరమయ్యింది.
అందుకే, సావుపౌలో నుండి 140 కిలోమీటర్ల దూరంలోవున్న సిజెర్యో లాంజ్ అనే చిన్న పట్టణం దగ్గర క్రొత్త భవనాల సముదాయం నిర్మింపబడింది. 170 మంది సభ్యులుగల మా బేతేలు కుటుంబం 1980లో ఈ క్రొత్త భవనాల్లోకి మార్చబడింది. అప్పటినుండి రాజ్య పని నాటకీయంగా పెరిగింది. ఇప్పుడు బ్రెజిల్లో 4,10,000 కంటే ఎక్కువమంది ప్రకటనపనిలో క్రమంగా భాగం వహిస్తున్నారు! ఈ రాజ్య ప్రచారకులందరి ఆత్మీయ అవసరతల గురించి శ్రద్ధ వహించేందుకు, బైబిలు సాహిత్యాన్ని ముద్రించడానికి, బేతేలు స్వచ్ఛంద సేవకులకు క్రొత్త వసతి స్థలాల కొరకు మేము క్రొత్త ఫ్యాక్టరీలను నిర్మిస్తూనే ఉండవలసి వచ్చింది. ప్రస్తుతం మా దగ్గర దాదాపు 1,100 మంది బేతేలు కుటుంబ సభ్యులున్నారు!
విలువైన ఆధిక్యతలు
నేను బేతేలు సేవను అమూల్యమైన ఆధిక్యతగా పరిగణిస్తాను. అందుకే, తొలి సంవత్సరాల్లో నేను మళ్లీ వివాహం చేసుకోవడం గురించి ఆలోచించినప్పటికీ, బేతేలులోనూ ప్రకటన పనిలోనూ నాకుగల ఆధిక్యతలపై పూర్తిగా శ్రద్ధ నిలపడానికి నేను ఎంపిక చేసుకున్నాను. ముద్రణాలయంలో అసంఖ్యాకులైన యౌవనస్థులతో కలిసి సేవచేస్తూ, వారికి వారి నియామకాల్లో తర్ఫీదునిచ్చే ఆనందం నాకు లభించింది. వారితో నేను, వారు నా కుమారులన్నట్లుగా వ్యవహరించడానికి ప్రయత్నించాను. వారి ఆసక్తి మరియు నిస్వార్థత నాకు గొప్ప ప్రోత్సాహానికి మూలంగా ఉన్నాయి.
మరో ఆధిక్యతేమిటంటే, సంవత్సరాలుగా చక్కని రూమ్మేట్ల సహవాసాన్ని ఆనందించడం. నిజమే, కొన్నిసార్లు వ్యక్తిత్వంలోని తేడాలు సవాలును ముందుంచాయి. అయినప్పటికీ, ఇతరుల నుండి పరిపూర్ణతను అపేక్షించకూడదని నేను నేర్చుకున్నాను. నేను గోరంతలను కొండంతలు చేయకుండా ఉండడానికి లేక నాకు నేను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుకోకుండా ఉండడానికి ప్రయాసపడ్డాను. అది నా సొంత తప్పులను చూసి నవ్వుకోవడం, ఇతరుల తప్పులను సహించడానికి నాకు సహాయం చేసింది.
నేనానందించిన మరో ఆధిక్యతేమిటంటే, అమెరికాలో జరిగిన పెద్ద అంతర్జాతీయ సమావేశాలకు హాజరు కాగల్గడం. వాటిలో ఒకటి, 1963లో న్యూయార్క్ నందలి యాంకీ స్టేడియంలో జరిగిన “నిత్య సువార్త” అనే సమావేశం, మరొకటి అదే స్థలంలో 1969లో జరిగిన “భూమిపై శాంతి” అనే అంతర్జాతీయ సమావేశం. నేనక్కడున్నప్పుడు సమీపంలోవున్న, న్యూయార్క్ నందలి బ్రూక్లిన్‌లో గల యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని దర్శించే ఆనందం నాకు లభించింది!
పది సంవత్సరాలపాటు బేతేలు కుటుంబంలో ఇతర పెద్దలతోపాటు ఉదయకాల ఆరాధనకు అధ్యక్షత వహించే ఆధిక్యత కూడా నాకు లభించింది. అయినప్పటికీ, నాకు ఎంతో ఆనందాన్ని ప్రోత్సాహాన్ని కలిగించిన అత్యంత గొప్ప ఆధిక్యత ఏమిటంటే, మన యజమానియైన యేసుక్రీస్తు చేసినట్లుగా రాజ్య వర్తమానాన్ని యథార్థ హృదయం గలవారివద్దకు తీసుకువెళ్లడం.
ఇటీవలి సంవత్సరాల్లో నేను పార్కిన్సన్ వ్యాధితో జీవించే సవాలు నెదుర్కొన్నాను. బేతేలు వైద్యాలయంలోని సహోదర సహోదరీల ప్రేమపూర్వక శ్రద్ధ నాకు ఎడతెగని సహాయానికి ఓదార్పుకు కారణమయ్యింది. యెహోవా సత్యారాధన కొరకు నేను చేయగల శ్రేష్ఠమైనది చేయడంలో కొనసాగడానికి నాకు కావలసిన బలాన్ని ఆయన ఇవ్వాలని నేను పూర్తి నమ్మకంతో ప్రార్థిస్తున్నాను.
[23వ పేజీలోని చిత్రం]
1945లో మరణించిన నా భార్యతో
[23వ పేజీలోని చిత్రం]
నేనిప్పుడు నివసిస్తున్న బ్రెజిల్ బ్రాంచి