కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 5/1 పేజీలు 22-26
  • పట్టుదల అభివృద్ధికి నడిపిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పట్టుదల అభివృద్ధికి నడిపిస్తుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చిన్న ప్రారంభాలు
  • నాన్న మాదిరిని అనుసరించడానికి ప్రయత్నించడం
  • రాజ్య పరిచర్యలో భాగం వహించడం
  • వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు ధైర్యం
  • నమ్మకమైన, యథార్థమైన సహాయకురాలు
  • పట్టుదలతో కొనసాగితే ఆనందం లభిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెహోవాయందు నాకున్న నమ్మకాన్నిబట్టి బలపర్చబడ్డాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా ఆహ్వానాలను అంగీకరించడం ప్రతిఫలదాయకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఐక్య కుటుంబంగా యెహోవా సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 5/1 పేజీలు 22-26

పట్టుదల అభివృద్ధికి నడిపిస్తుంది

జూజ్‌ మాగ్లావ్సకీ చెప్పినది

పోలీసు నా చేతిని పట్టుకున్నప్పుడు, నేను మా నాన్న కోసం చూసాను. అయితే, నాకు తెలియకుండానే, ఆయన పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లబడ్డాడు. నేను అక్కడికి వెళ్లినప్పుడు, పోలీసులు మా బైబిళ్లతో సహా మా ప్రచురణలన్నీ తీసుకుని, నేలపై పడవేశారు. అది చూసి మా నాన్న ఇలా అడిగాడు: “మీరు బైబిళ్లు కూడా నేలమీద పడవేశారా?“ పోలీసు అధికారి క్షమాపణ చెప్పి, బైబిళ్లను తీసి బల్లపై ఉంచాడు.

మేమెందుకు పోలీసు స్టేషనుకు రావలసి వచ్చింది? మేమేమి చేస్తున్నాము? బైబిలు కూడా మా వద్ద నుండి తీసివేయబడేలా మేము నాస్తికత్వపు పోలీసు రాష్ట్రంలో ఉన్నామా? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు, నేను జన్మించక ముందుకు, అంటే మనం వెనక్కి 1925కి వెళ్లాలి.

ఆ సంవత్సరంలో మా నాన్న ఎస్టెఫానో మాగ్లావ్సకీ, మా అమ్మ జూలియానా, అప్పట్లో యుగోస్లావియా అని పిలువబడేదాన్ని విడిచి బ్రెజిల్‌కు వచ్చి సావోపాలోలో స్థిరపడ్డారు. నాన్న ప్రొటెస్టెంటు అమ్మ కాథోలిక్‌ అయినప్పటికీ, వారి మధ్యన మతం ఒక నిర్ణయాత్మక విషయమై ఉండలేదు. వాస్తవానికి, వారిని మతపరంగా దగ్గరచేర్చిన ఒక సంఘటన పది సంవత్సరాల తర్వాత జరిగింది. మృతుల స్థితిని గూర్చి తెలియజేసే, హంగేరియన్‌ భాషలోవున్న పూర్తి రంగుల చిన్న పుస్తకాన్ని నాన్న వాళ్ల తోడళ్లుడు తెచ్చాడు. ఆయన ఆ చిన్న పుస్తకాన్ని బహుమానంగా పొందాడు, ఆయన నాన్నను అది చదివి, దానిలోని విషయాల గురించి ప్రాముఖ్యంగా “నరకం” అనే భాగంపై తన అభిప్రాయం చెప్పమని అడిగాడు. నాన్న ఆ రాత్రంతా ఆ చిన్న పుస్తకాన్ని చదువుతూ, మళ్లీ మళ్లీ చదువుతూ గడిపాడు, మరునాడు, ఆయన అభిప్రాయం కొరకు వాళ్ల తోడళ్లుడు వచ్చినప్పుడు, నాన్న స్పష్టంగా ఇలా ప్రకటించాడు: “ఇదే సత్యము!”

చిన్న ప్రారంభాలు

ఆ ప్రచురణ యెహోవాసాక్షులది గనుక, వారి నమ్మకాల గురించి బోధల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇద్దరూ వారి కొరకు వెదకడం మొదలుపెట్టారు. చివరికి వారిని కలుసుకున్నప్పుడు, మా కుటుంబంలోని అనేకమంది సభ్యులు సాక్షులతో బైబిలు చర్చలు ప్రారంభించారు. అదే సంవత్సరం, 1935లో సగటున ఎనిమిదిమంది వ్యక్తులు హాజరవుతుండగా, హంగేరి భాషలో ఒక క్రమ బైబిలు పఠనం ప్రారంభించబడింది, అప్పటినుండి మా ఇంట్లో క్రమ బైబిలు పఠనాలు జరుగుతుండేవి.

రెండు సంవత్సరాలు బైబిలు పఠించిన తర్వాత, నాన్న 1937లో బాప్తిస్మం తీసుకుని, ఇంటింటి ప్రకటనా పనిలో భాగం వహిస్తూ, నియమిత సేవకునిగా, పఠన నిర్వాహకునిగా సేవచేస్తూ, యెహోవా యొక్క ఉత్సాహవంతమైన సాక్షి అయ్యాడు. విల్లా మార్యానా భాగంలో సావోపాలోనందు మొదటి సంఘం ఏర్పడడానికి ఆయన సహాయం చేశాడు. ఆ తర్వాత సంఘం నగరం మధ్య భాగానికి మార్చబడి, మధ్య సంఘంగా పిలువబడింది. పది సంవత్సరాల తర్వాత ఇపిరాంగా ప్రాంతంలో రెండవ సంఘం ఏర్పడింది, అక్కడ నాన్న సంఘ సేవకునిగా నియమింపబడ్డాడు. మొయిన్‌యు వెల్‌యో ప్రాంతమందు 1954లో మూడవ సంఘం ఏర్పడింది, అక్కడ కూడా ఆయన సంఘ సేవకునిగా సేవచేశాడు.

ఈ గుంపు బాగా స్థిరపడిన వెంటనే ఆయన సమీపంలోవున్న సావో బెర్‌నార్‌డో డో కాంపో గుంపుకు సహాయం చేయడం మొదలు పెట్టాడు. ఆ సంవత్సరాల్లో సాక్షుల ఆ చిన్న గుంపు ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించడం వల్ల, అభివృద్ధి అసాధారణంగా ఉండింది, అందుకే 1994లో గ్రేటర్‌ సావోపాలో నందలి 760 సంఘాల్లో 70,000 కంటే ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. విచారకరంగా, ఈ అభివృద్ధిని చూడడానికి నాన్న జీవించివుండలేదు. ఆయన 57 ఏళ్ల వయస్సులో 1958లో మరణించాడు.

నాన్న మాదిరిని అనుసరించడానికి ప్రయత్నించడం

ఇతర పరిణతి చెందిన క్రైస్తవులవలెనే, ఆతిథ్యమివ్వడం మా నాన్న యొక్క ఒక విశేషమైన గుణం. (3 యోహాను 1, 5-8 చూడండి.) ఫలితంగా, 1936లో యూలీ సహోదర సహోదరీలతో పాటు అమెరికా నుండి బ్రెజిల్‌కు వచ్చిన ఆంటాన్యో అన్‌డ్రాడ్‌ను, ఆయన భార్యా కుమారులను అతిథులుగా కలిగివుండే ఆధిక్యత మాకు లభించింది. బ్రెజిల్‌కు 1945లో నియమింపబడిన మొదటి మిషనరీలు, వాచ్‌టవర్‌ బైబిలు గిలియడ్‌ పాఠశాల యొక్క ఇద్దరు పట్టభద్రులైన హెర్రీ బ్లాక్‌ మరియు డిల్లార్డ్‌ లిత్‌కోలు కూడా మా ఇంట్లో అతిథులుగా ఉన్నారు. వారి తర్వాత అనేకులు వచ్చారు. ఈ సహోదర సహోదరీలు మా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ప్రోత్సాహానికి తదేక మూలంగా ఉండేవారు. దీన్ని గుణగ్రహిస్తూ, నా కుటుంబ ప్రయోజనార్థం, ఆతిథ్యమిచ్చే క్రైస్తవ లక్షణానికి సంబంధించి మా నాన్న మాదిరిని అనుసరించడానికి నేను ప్రయత్నించాను.

నాన్న 1935లో సత్యం తెలుసుకునే సమయానికి నేను కేవలం ఎనిమిది సంవత్సరాలవాడినే అయినప్పటికీ, పెద్ద కుమారునిగా నేను ఆయన దైవపరిపాలనా కార్యాలలో ఆయనతో వెళ్లడం మొదలు పెట్టాను. ఇసా డె కెరాజ్‌ వీధి, 141 సంఖ్యనందుగల సాక్షుల ప్రధాన కార్యాలయం వద్దనున్న రాజ్య మందిరంలో మేమందరం ఆయనతోపాటు కూటాలకు హాజరయ్యే వాళ్లం. మా నాన్న నాకిచ్చిన బోధన, తర్ఫీదుల వల్ల నేను యెహోవాను సేవించాలనే తీవ్రమైన కోరికను ఏర్పరచుకుని, 1940లో నేను, సావోపాలో మధ్య నుండి ప్రవహిస్తూ ఇప్పుడు కలుషితమైవున్న ట్యటె నదిలో నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవాకు నన్ను నేను సమర్పించుకున్నాను.

సువార్త యొక్క క్రమ ప్రచారకుడై ఉండడమంటే ఏమిటో, ఇతరులలో సత్య వర్తమానాన్ని నాటడం, నీరు పోయడం, గృహ బైబిలు పఠనాలు నిర్వహించడం నేను త్వరలోనే నేర్చుకున్నాను. ఇప్పుడు బ్రెజిల్‌నందు వేలాది సమర్పిత యెహోవాసాక్షులను చూసినప్పుడు, వారిలో అనేకులు సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందడానికి లేక దాని ఎడల తమ మెప్పును అధికం చేసుకోవడానికి వారికి సహాయం చేయడంలో ఆయన నన్ను ఉపయోగించుకున్నాడని తెలుసుకుని నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను.

నేను సహాయం చేసినవారిలో, నేను ఇంటింటి పరిచర్యలో కలిసిన జ్వాకీన్‌ మెలో ఒకరు. నేను ఇంకా ఇతర ముగ్గురు వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నాను కాని, వాళ్లు అంత ఆసక్తిగా వినడంలేదు. అప్పుడు నేను మాతో కలిసి, శ్రద్ధగా వింటున్న ఒక యౌవనున్ని గమనించాను. ఆయన ఆసక్తిని గమనించి, నేను నా ధ్యాసను ఆయనవైపు మళ్లించాను, మంచిగా సాక్ష్యమిచ్చిన తర్వాత సంఘ పుస్తక పఠనానికి అతన్ని ఆహ్వానించాను. ఆయన పఠనానికి హాజరు కాలేదు కాని, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు వచ్చాడు, అప్పటి నుండి ఆయన కూటాలకు క్రమంగా హాజరయ్యేవాడు. ఆయన మంచి అభివృద్ధి సాధించి, బాప్తిస్మం తీసుకుని, తన భార్యతో కలిసి ప్రయాణ కాపరిగా అనేక సంవత్సరాలు సేవ చేసాడు.

ఆ తర్వాత నేను నా పని స్థలంలో కలిసిన అర్నాల్డో ఆర్సీ ఒకరు. నేను నా తోటి ఉద్యోగి ఒకరికి క్రమంగా సాక్ష్యం ఇచ్చేవాణ్ణి, కాని గడ్డంవున్న ఒక యౌవనుడు ఎప్పుడూ వింటుండడం నేను గమనించాను. కాబట్టి నేను ఆయనతో సూటిగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఆయన ఒక సనాతన కాథోలిక్‌ కుటుంబానికి చెందినవాడు, కాని పొగత్రాగడం, అశ్లీల చిత్రాలను చూడడం, జూడో యొక్క మార్షల్‌ ఆర్ట్‌ను అభ్యసించడం వంటివాటి గురించి అనేక ప్రశ్నలు అడిగాడు. బైబిలు ఏం చెబుతుందో నేను ఆయనకు చూపించాను, నాకు ఆనందాశ్చర్యాలు కలిగే విధంగా, తాను పైపు మరియు లైటర్‌లను శిలువతోపాటు విరగ్గొడుతుండగా, తన అశ్లీల చిత్రాలను పాడుచేసి, తను గడ్డం తీసుకొంటుండగా చూడమని ఆయన నన్ను ఆహ్వానించాడు. కేవలం నిమిషాల్లో మారిపోయిన మనిషి! ఆయన జూడో అభ్యసించడం కూడా మానేసి, తనతో ప్రతిదినం బైబిలు పఠించమని నన్ను అడిగాడు. తన భార్య, తండ్రి నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ, తనకు సమీపంలో నివసిస్తున్న సహోదరుల సహాయంతో ఆయన ఆత్మీయంగా మంచి అభివృద్ధి సాధించాడు. కొంత కాలంలో, ఆయన బాప్తిస్మం పొంది, నేడు సంఘ పెద్దగా పనిచేస్తున్నాడు. ఆయన భార్యా, పిల్లలు కూడా సత్యాన్ని అంగీకరించారు.

రాజ్య పరిచర్యలో భాగం వహించడం

నాకు 14 సంవత్సరాలున్నప్పుడు, నేను ఒక వ్యాపార ప్రకటనల కంపెనీలో పనిచేయడం మొదలు పెట్టాను, అక్కడే నేను సైను బోర్డులు పెయింట్‌ చేయడం నేర్చుకున్నాను. అది చాలా ప్రయోజనకరమైనదిగా నిరూపించబడింది, సావోపాలోలో చాలా సంవత్సరాల వరకు ప్లాకార్డులను మరియు యెహోవాసాక్షుల బహిరంగ ప్రసంగాలను, సమావేశాలను ప్రచారంచేసే బ్యానర్లను పెయింట్‌ చేసే సహోదరున్ని నేనొక్కణ్ణి మాత్రమే ఉండేవాణ్టి. దాదాపు 30 సంవత్సరాల వరకు, సమావేశ సైను బోర్డుల విభాగానికి అధ్యక్షునిగా సేవచేసే ఆధిక్యత నాకు లభించింది. సమావేశాల వద్ద పనిచేయడం కొరకు నేను ఎప్పుడు నా సెలవు దినాలను దాచుకొనేవాణ్ణి, బ్యానర్లను తగిన సమయానికి పెయింట్‌ చేయించడం కొరకు నేను సమావేశ హాలులో నిద్రించేవాణ్ణి కూడా.

ఆ సమయంలో నిజమైన క్రొత్తదనంగా ఉండిన సంస్థ యొక్క సౌండ్‌ కారుతో పనిచేసే అవకాశం కూడా నాకు లభించింది. మేము మా బైబిలు ప్రచురణలను ఒక స్టాండుపై ఉంచి, రికార్డు చేయబడిన వర్తమానాన్ని సౌండ్‌ కారు ద్వారా వినిపిస్తుండగా ఏమి జరుగుతుందోనని చూడడానికి తమ గృహాల్లో నుండి బయటికి వచ్చిన ప్రజలతో మేము మాట్లాడేవాళ్లం. రాజ్య సువార్తను తెలియజేయడానికి మేము ఉపయోగించిన మరో పరికరం ఎక్కడికైనా తీసుకు వెళ్లగల గ్రామఫోన్‌, సంస్థ ప్రచురణలను అందజేయడానికి ఉపయోగించబడిన రికార్డులు ఇప్పటికీ నావద్ద ఉన్నాయి. దాని ఫలితంగా ఎంతో బైబిలు సాహిత్యం అందజేయబడేది.

ఆ రోజుల్లో కాథోలిక్‌ చర్చి సావోపాలో వీధుల్లో పెద్ద ఊరేగింపులు చేసేవారు, తరచూ ఆ ఊరేగింపులకు ముందు కొందరు మార్గాన్ని శుభ్రపరుస్తుండేవారు. ఒక ఆదివారం నేను, నాన్న వీధిలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు అందిస్తుండగా ఒక పెద్ద ఊరేగింపు కనిపించింది. నాన్న తన అలవాటు ప్రకారం తన టోపీని పెట్టుకుని ఉన్నాడు. ఊరేగింపుకు ముందున్న వారిలో ఒక వ్యక్తి ఇలా అరిచాడు: “నీ టోపి తియ్యి! ఊరేగింపు వస్తుందని నీవు చూడడం లేదా?” నాన్న తన టోపీని తీయకపోవడంతో, మమ్మల్ని ఒక దుకాణం కిటికీవైపుకు తోస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఇంకా కొందరు వ్యక్తులు వచ్చారు. జరుగుతున్నదాన్ని చూడడానికి వచ్చిన ఒక పోలీసు దృష్టిని ఇది ఆకర్షించింది. అతనితో మాట్లాడాలని వారిలో ఒకరు అతని చెయ్యి పట్టుకున్నాడు. పోలీసు ఆ వ్యక్తి చేతిపై కొడుతూ, “నా దుస్తులపైనుండి నీ చెయ్యి తియ్యి!” అని ఆజ్ఞాపించాడు. తర్వాత అతడు జరుగుతున్న దేమిటని అడిగాడు. ఊరేగింపు వస్తుంటే నాన్న టోపి తీసివేయలేదని ఆ వ్యక్తి వివరించి, ఇలా తెలియజేశాడు: “నేను అపోస్టోలిక్‌ రోమన్‌ కాథోలిక్‌ను.” అనుకోని సమాధానం ఇలా వచ్చింది: “నీవు ఒక రోమన్‌వని చెబుతున్నావా? అయితే రోమ్‌కే వెళ్లిపో! ఇది బ్రెజిల్‌.” తర్వాత, “ముందు ఇక్కడికి ఎవరు వచ్చారు?” అని అడుగుతూ అతడు మా వైపు తిరిగాడు. మేము వచ్చామని నాన్న సమాధానమిచ్చినప్పుడు, పోలీసు ఆ వ్యక్తులను పంపివేసి మా పనిలో మమ్మల్ని కొనసాగమని చెప్పాడు. ఊరేగింపు మొత్తం వెళ్లిపోయే వరకు అతడు మా ప్రక్కన నిలుచున్నాడు—నాన్న తన టోపిని అలాగే ఉంచుకున్నాడు!

ఇలాంటి సంఘటనలు అరుదుగా జరిగేవి. కాని అవి జరిగినప్పుడు, అల్ప సంఖ్యాక వర్గానికి న్యాయం జరగాలని విశ్వసించే ప్రజలున్నారని, కాథోలిక్‌ చర్చికి మోకరిల్లనివారున్నారని తెలుసుకోవడం ప్రోత్సాహకరంగా ఉండేది.

మరో సందర్భంలో, ఆసక్తి చూపించి తర్వాతి వారం నన్ను మళ్లీ రమ్మని కోరిన ఒక యౌవనస్థున్ని నేను కలిశాను. నేను మళ్లీ వెళ్లినప్పుడు అతడు నన్ను చక్కగా ఆహ్వానించి, లోపలికి రమ్మని కోరాడు. ఒక గుంపు నా చుట్టూచేరి నన్ను వెక్కిరిస్తూ, నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుండడం చూసి నేనెంత ఆశ్చర్యపోయానో! పరిస్థితి విషమించింది, వాళ్లు త్వరలోనే నాపై దాడి చేస్తారని నేననుకున్నాను. నాకేమైనా జరిగితే దానికి పూర్తిగా తనే బాధ్యుడని, నేనెక్కడున్నానో నా కుటుంబానికి తెలుసని నేను నన్ను ఆహ్వానించిన వ్యక్తికి చెప్పాను. నన్ను వెళ్లనివ్వమని వాళ్లనడిగాను, వాళ్లు అంగీకరించారు. అయితే, నేను వెళ్లిపోయే ముందు, నాతో ఎవరైనా ఒంటరిగా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చని చెప్పాను. తర్వాత, వాళ్లు ఒక మూఢ భక్తిగల గుంపని, స్థానిక ప్రీస్టు స్నేహితులని, ఇలా సమావేశమవ్వడానికి అతడే వారిని ప్రోత్సహించాడని నేను తెలుసుకున్నాను. వారి అదుపులో నుండి తప్పించుకోగలిగినందుకు నేను సంతోషించాను.

అయితే, ప్రారంభంలో, బ్రెజిల్‌నందు అభివృద్ధి చాలా మందకొడిగా జరిగేది, దాదాపు కనిపించనట్లుగా ఉండేది. మేము “నాటడం” యొక్క తొలి అంకంలో ఉన్నాము, “సాగుచేయడానికి,” మా కష్టఫలం యొక్క “కోతకోయడానికి” కొద్ది సమయం మాత్రమే ఉండేది. అపొస్తలుడైన పౌలు వ్రాసిన దీన్ని మేము ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనేవాళ్లం: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే కాబట్టి వృద్ధికలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లుపోయువానిలోనైనను ఏమియులేదు.” (1 కొరింథీయులు 3:6, 7) మొదటి ఇద్దరు గిలియడ్‌ పట్టభద్రులు 1945లో రావడంతో, ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఈ అభివృద్ధికి సమయం వచ్చిందని మేము భావించాము.

వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు ధైర్యం

అయితే, ప్రాముఖ్యంగా ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత వ్యతిరేకత లేకుండా అభివృద్ధి జరిగేలాలేదు. సామాన్య ప్రజలు, అధికారంలోవున్న కొందరు మా తటస్థ స్థానాన్ని అర్థం చేసుకోలేదు గనుక తీవ్రమైన హింస ఉండేది. ఒక సందర్భంలో, 1940లో, సావోపాలో మధ్యభాగంలో మేము ప్లాకార్డులతో వీధి సాక్ష్యమిస్తుండగా, ఒక పోలీసు నా వెనుక నుండి వచ్చి, ప్లాకార్డును చింపేసి, నన్ను పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లడానికి నా చెయ్యిపట్టి లాగాడు. నేను మా నాన్న కోసం చూసాను, కాని ఆయన ఎక్కడా కనిపించలేదు. నాకు తెలియకుండా, బ్రెజిల్‌లో జరుగుతున్న పనిని పర్యవేక్షించేవాడైన సహోదరుడు యూలీతో సహా, ఆయనను మరి ఇతర సహోదర సహోదరీలను కొంతమందిని ఎప్పుడో పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మొదటి పేరాలో సూచించినట్లుగా, అక్కడ మళ్లీ నేను నాన్నను కలిశాను.

నేను ఇంకా మైనరును కాబట్టి నన్ను నిర్బంధంలో ఉంచకూడదు గనుక ఒక పోలీసు నన్ను ఇంటికి తీసుకువెళ్లి మా అమ్మకు అప్పగించాడు. అదే దినం సాయంత్రం సహోదరీలు కూడా విడుదల చేయబడ్డారు. ఆ తర్వాత సహోదరుడు యూలీని తప్ప మిగతా సహోదరులనందరిని అంటే దాదాపు పదిమందిని విడుదల చేయడానికి పోలీసులు నిర్ణయించుకున్నారు. అయితే, సహోదరులు: “వెళ్లితే మేమందరం వెళ్లతాము లేదా ఎవ్వరం వెళ్లం” అని నొక్కిచెప్పారు. పోలీసులు అంగీకరించలేదు, చల్లని గదిలో సిమెంటు నేలపై ఆ రాత్రి అందరూ కలిసి గడిపారు. మరునాడు అందరు ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయబడ్డారు. ప్లాకార్డులతో సాక్ష్యమిస్తున్నందుకు అనేకసార్లు సహోదరులు నిర్బంధింపబడ్డారు. అవి బహిరంగ ప్రసంగం గురించి, ఫాసిజమ్‌ లేక స్వాతంత్ర్యం (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని గురించి ప్రకటించేవి, మేము ఫాసిజమ్‌ను సమర్థిస్తున్నామని కొందరు అధికారులు అనుకోవడంతో, అది సహజంగానే అపార్థాలకు దారితీసింది.

తప్పనిసరిగా సైనిక సేవలో చేరాలనడం కూడా యౌవన సహోదరులకు సమస్యలను సృష్టించింది. ఈ విషయంగా 1948లో బ్రెజిల్‌నందు నిర్బంధింపబడినవారిలో నేను మొదటివాడిని. నన్ను ఏమి చేయాలో అధికారులకు అసలు తెలియలేదు. నేను కాసాపావాలోని సైనిక శిబిరాలకు బదిలీ చేయబడి, తోటలో కూరమొక్కలను నాటడం, వాటి గురించి శ్రద్ధ వహించడం అలాగే ఫెన్సింగ్‌ కొరకు అధికారులు ఉపయోగించే గదిని శుభ్రం చేయడం వంటి పనులు నాకివ్వబడ్డాయి. వ్యక్తులకు సాక్ష్యమిచ్చి, ప్రచురణలను అందజేసే అనేక అవకాశాలు నాకు లభించాయి. సంస్థ యొక్క పిల్లలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని తీసుకున్నవారిలో అక్కడి పర్యవేక్షకుడు మొదటివాడు. తర్వాత, వ్యాయామం చేయలేని, గదిలోనే ఉంచబడిన దాదాపు 30 లేక 40 మంది సైనికులకు మతం గురించి తరగతులు నిర్వహించే పని కూడా నాకు అప్పగించబడింది. చివరికి, పదినెలలు జైలులో ఉన్న తర్వాత, నేను తీర్పుకు తేబడి, విడుదల చేయబడ్డాను. కొంతమంది వ్యక్తుల నుండి నేను పొందిన బెదిరింపులను, అవమానాలను, వెక్కిరింతను ఎదుర్కొనే శక్తినిచ్చిన యెహోవాకు నేను కృతజ్ఞుడిని.

నమ్మకమైన, యథార్థమైన సహాయకురాలు

నేను 1951, జూన్‌ 2న బార్‌బరాను వివాహం చేసుకున్నాను, అప్పటినుండి ఆమె మా పిల్లలకు విద్యాభ్యాసాన్నివ్వడంలో, వారిని “ప్రభువు [యెహోవా] యొక్క శిక్షలోను బోధలోను” పెంచడంలో యథార్థమైన, నమ్మకమైన సహచరిగా ఉంది. (ఎఫెసీయులు 6:4) మా ఐదుగురు పిల్లల్లో, నలుగురు వేరు వేరు బాధ్యతల్లో యెహోవాను ఆనందంగా సేవిస్తున్నారు. వారు మాతోపాటు సత్యంలో పట్టుదలతో కొనసాగుతారని, సంస్థ అభివృద్ధికి మరియు జరుగుతున్నపనికి దోహదపడతారని మేము ఎదురుచూస్తున్నాము. చేతుల్లోవున్న చిన్న బాలిక తప్ప పై చిత్రంలోని కుటుంబ సభ్యులందరూ యెహోవా సమర్పిత సేవకులే. “కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము” అనివున్న సామెతలు 17:6 యొక్క సత్యత్వాన్ని ఉదాహరిస్తూ, వీరిలో నలుగురు పెద్దలు అందులో ఇద్దరు క్రమ పయినీర్లు కూడా.

ఇప్పుడు, 68 సంవత్సరాల వయస్సులో, నా ఆరోగ్యం అంత బాగా లేదు. నేను 1991లో ట్రిపుల్‌ బైపాస్‌ శస్త్రచికిత్స, ఆ తర్వాత ఆంజ్యాప్లాస్టీ చేయించుకున్నాను. అయితే, సావో బెర్‌నార్‌డో డో కాంపోలో పనిని ప్రారంభించిన మొదటి వారిలో ఒకడైన మా నాన్న అడుగుజాడలను అనుసరిస్తూ, ఇక్కడి ఒక సంఘంలో సంఘాధ్యక్షునిగా సేవ చేయడంలో కొనసాగగల్గుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వాస్తవానికి, మరెన్నడూ పునరావృతం గావించబడని పనియైన, యెహోవా యొక్క మెస్సీయా రాజ్య స్థాపనను గూర్చి ప్రకటించే ఆధిక్యతలో భాగం వహించే అవకాశంగల మన తరం విశేషమైనది. కాబట్టి పౌలు తిమోతికి వ్రాసిన ఈ మాటలను మనమెన్నడూ మరచిపోకూడదు: “అయితే నీవు . . . సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.”—2 తిమోతి 4:5.

[23వ పేజీలోని చిత్రం]

నా తల్లిదండ్రులు, ఎస్టెఫానో మరియు జూలియానా మాగ్లావ్సకీ

[26వ పేజీలోని చిత్రం]

యెహోవా సమర్పిత సేవకులైన తన కుటుంబ సభ్యులతో జూజ్‌ మరియు బార్‌బరా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి