దేవుని తొలిసేవకుల్లో స్త్రీల గౌరవప్రదమైన పాత్ర
“దేవుడైన యెహోవా—నరుడు ఒంటరిగా నుండుట మంచిదికాదు; వానికి సాటియైన సహాయమును (సహాయకారిగా ఓ సాటివ్యక్తిని NW) వానికొరకు చేయుదుననుకొనెను.”—ఆదికాండము 2:18.
1. ప్రాచీన కాలాల్లో స్త్రీల పరిస్థితిని ఒక బైబిలు నిఘంటువు ఎలా వర్ణిస్తున్నది?
“ఆధునిక పాశ్చాత్య దేశాల్లో స్త్రీలనుభవిస్తున్న స్వేచ్ఛ ప్రాచీన మధ్యధరాసముద్ర తీరదేశాల్లో లేదా ఆసియాకు నైరృతిదిక్కున, ఆఫ్రికాకు పశ్చిమోత్తర దిక్కునున్న దేశాల్లో ఎక్కడా ఇవ్వబడలేదు. దాసులు స్వతంత్రులకు, యౌవనులు వృద్ధులకు లోకువగా ఉండాలన్నట్లే, స్త్రీలు పురుషులకు లోకువగా ఉండాలనుట సాధారణ కట్టడగా ఉండెను . . . ఆడపిల్లలకంటే మగపిల్లలే మురిపెంగా చూడబడేవారు, కొన్నిసార్లు ఆడపిల్లలు ఎలాంటి సంరక్షణ లేకుండా చనిపోవడానికే వదిలివేయబడేవారు.” ప్రాచీన కాలాల్లో స్త్రీల పరిస్థితిని ఓ బైబిలు నిఘంటువు ఆ విధంగా వర్ణిస్తున్నది.
2, 3. (ఎ) ఒక నివేదిక ప్రకారం అనేకమంది స్త్రీల నేటి పరిస్థితి ఏమైయుంది? (బి) ఏ ప్రశ్నలు లేవదీయబడ్డాయి?
2 నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఏమిలేదు. మొదటిసారిగా, 1994లో అమెరికా డిపార్టుమెంట్ వారి మానవహక్కుల వార్షిక నివేదిక స్త్రీలు ఆదరింపబడే విధానంపై దృష్టి నిలిపింది. ఆ నివేదికను గూర్చి “నేటి వివక్ష ఉన్న వాస్తవమని 193 దేశాల పట్టిక చూపుతున్నదని” న్యూయార్క్ టైమ్స్ శీర్షిక ఒకటి చెబుతున్నది.
3 భూవ్యాప్తంగా యెహోవాప్రజల సంఘాలతో విభిన్న సంస్కృతులనుండి వచ్చిన అనేకమంది స్త్రీలు సహవసిస్తున్నందున, ఇట్టి ప్రశ్నలు కొన్ని ఉత్పన్నమౌతాయి: ఇక్కడ వర్ణింపబడినట్లే స్త్రీలను చూడాలని దేవుడు మొదట ఉద్దేశించాడా? బైబిలుకాలాల్లో యెహోవా ఆరాధికులమధ్య స్త్రీలెలా ఆదరింపబడేవారు? మరి నేడు స్త్రీలెలా ఆదరింపబడాలి?
“సహాయకారి” మరియు “ఓ సాటివ్యక్తి”
4. మొదటి మానవుడు కొంతకాలం ఏదెనులో ఒంటరిగావున్న తర్వాత యెహోవా ఏమి గమనించాడు, ఆ పిమ్మట దేవుడేమి చేశాడు?
4 ఏదెనుతోటలో ఆదాము ఒంటరిగా కొంతకాలమున్న పిమ్మట, యెహోవా “నరుడు ఒంటరిగా నుండుట మంచిదికాదు; వానికి సాటియైన సహాయమును (సహాయకారిగా ఓ సాటివ్యక్తిని NW) వానికొరకు చేయుదుననుకొనెను.” (ఆదికాండము 2:18) ఆదాము పరిపూర్ణ మానవుడైననూ సృష్టికర్త సంకల్పాన్ని నెరవేర్చడానికి మరియేదోకూడ అవసరమైయుండెను. ఆ అవసరం తీర్చడానికే యెహోవా స్త్రీని సృజించి, మొదటి వివాహం జరిపించాడు.—ఆదికాండము 2:21-24.
5. (ఎ) “సహాయకారి” అని అనువదింపబడిన హెబ్రీ నామవాచకాన్ని తరచు బైబిలు రచయితలు ఎలా ఉపయోగించారు? (బి) మొదటి స్త్రీని “సాటివ్యక్తి” అని యెహోవాచూపిన వాస్తవం ఏమి సూచిస్తుంది?
5 “సహాయకారి,” “సాటివ్యక్తి” అనే పదాలు స్త్రీలకు దేవుడేర్పరచిన పాత్ర చులకనని సూచిస్తున్నవా? దానికి భిన్నముగా, బైబిలు రచయితలు “సహాయకారి” అని తర్జుమా చేయబడిన హెబ్రీ నామవాచకాన్ని (ఎజెర్)ను తరచూ దేవునికి అన్వయించారు. ఉదాహరణకు, యెహోవా “మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడని” నిరూపించుకుంటాడు. (కీర్తన 33:21; నిర్గమకాండము 18:4; ద్వితీయోపదేశకాండము 33:7) హోషేయ 13:9లో యెహోవా తానుగా ఇశ్రాయేలీయుల “సహాయకర్తగా” సూచించుకుంటున్నాడు. “సాటివ్యక్తి” అని తర్జుమా చేయబడిన హెబ్రీ పదాన్ని (నెగెద్)ను గూర్చి ఒక బైబిలు విద్వాంసుడు ఇలా వివరిస్తున్నాడు: “ఎదురుచూసే సహాయమనగా ప్రతిదిన పనిలో లేదా ప్రజోత్పత్తిలో అతనికి చేయూతనిచ్చుట మాత్రమే కాదుగాని . . . అది సహవాసం అందజేయు పరస్పర మద్దతైయుంది.”
6. స్త్రీ సృజింపబడిన తర్వాత ఏమి చెప్పబడింది, ఎందుకు?
6 ఆ విధంగా స్త్రీని యెహోవా “సహాయకారి,” “సాటివ్యక్తి” అని వర్ణించుటలో ఏ మాత్రం చులకనభావం లేదు. స్త్రీకి తనదైన ఉన్నతమగు మానసిక, భావోద్రేక, శారీరక నిర్మాణమున్నది. ఆమె పురుషునికి సరియైన జత, తృప్తినిచ్చే సాటివ్యక్తి. వీరు భిన్నంగా ఉన్ననూ, సృష్టికర్త సంకల్పం చొప్పున “భూమిని నిండిం”చేందుకు ఇద్దరూ అవసరమే.” స్త్రీపురుషులిద్దరినీ సృష్టించిన తర్వాతే “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగనుండెను.”—ఆదికాండము 1:28, 31.
7, 8. (ఎ) ఏదెనులో పాపం ప్రవేశించుటతో స్త్రీల పాత్ర ఏ విధంగా ప్రభావితం చెందింది? (బి) యెహోవా ఆరాధికులమధ్య ఆదికాండము 3:16 నెరవేర్పును గూర్చి ఏ ప్రశ్నలు లేవదీయబడ్డాయి?
7 పాపంచేసిన తర్వాత స్త్రీపురుషుల పరిస్థితి మారింది. వారిద్దరు పాపులని యెహోవా వారికి శిక్ష విధించాడు. తానే కలుగజేస్తున్నట్లుగా తన అనుమతినిబట్టివచ్చే ఫలితాన్నిగూర్చి మాట్లాడుతూ యెహోవా హవ్వతో, “నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను” అంటూ, ఆయనింకా ఇట్లన్నాడు: “వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.” (ఆదికాండము 3:16) అప్పటినుండి అనేకమంది భార్యలపై వారి భర్తలు తరచూ కఠినంగా అధికారం చెలాయించారు. సహాయకర్తలుగా, సాటివ్యక్తులుగా ఎంచబడడానికి బదులు తరచు వారు ఎక్కువగా సేవకురాండ్రుగా లేక దాసీలుగా చూడబడ్డారు.
8 అయిననూ, ఆదికాండము 3:16 నెరవేర్పు యెహోవాయొక్క మహిళా ఆరాధికులకు ఎట్టి భావాన్నిచ్చింది? వారు అధఃస్థాయికి, అవమానకర స్థాయికి త్రోసివేయబడ్డారా? ఎంతమాత్రమూ లేదు! అయితే నేటి సమాజాల్లో కొన్నింటియందు బహుశ అనంగీకృతమనిపించే స్త్రీలపై ప్రభావంచూపిన ఆచారాల్ని, అభ్యాసాలను గూర్చి బైబిలుచెప్పే వృత్తాంతాల విషయమేమిటి?
బైబిలు ఆచారాల్ని అర్థంచేసుకొనుట
9. బైబిలు కాలాల్లో స్త్రీలు ఇమిడియుండే ఆచారాల్ని మనమాలోచించినప్పుడు, ఏ మూడు సంగతుల్ని మనం మనస్సునందుంచుకోవాలి?
9 బైబిలు కాలాల్లో దేవుని సేవకులమధ్య స్త్రీలు చక్కగా ఆదరింపబడేవారు. ఆ రోజుల్లో స్త్రీలు ఇమిడియున్న ఆచారాల్ని పరిశీలించుటలో, అనేక సంగతుల్ని మనస్సునందుంచుకొనుట సహాయకరమౌతుంది. మొదట, దుష్టపురుషుల స్వార్థ అధికారాన్నిబట్టి వృద్ధియైన అసంతోషకరమైన పరిస్థితుల్నిగూర్చి బైబిలు చెప్పునప్పుడు, స్త్రీలనలా చూడడాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడని దాని భావం కాదు. రెండవది, కొద్దికాలం కొరకు తన సేవకులమధ్య అట్టి ఆచారాల్ని కొన్నింటిని యెహోవా సహించినా, స్త్రీలను కాపాడుటకాయన వీటిని క్రమబద్ధం చేశాడు. మూడవది, ఆధునిక ప్రమాణాల్నిబట్టి ప్రాచీనకాల ఆచారాల్ని విమర్శించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. నేడు జీవించే ప్రజలకు బహుశ అసంతోషకరంగా కన్పించే కొన్ని ఆచారాల్ని ఆ కాలంనాటి స్త్రీలు నిశ్చయముగా అవమానకరమని దృష్టించలేదు. మనం కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.
10. బహుభార్యాత్వాన్ని యెహోవా ఎలా దృష్టించాడు మరియు తన ఆది కట్టడయగు ఏకపత్నీవ్రతాన్ని ఆయనెన్నడూ విసర్జించలేదని ఏది సూచిస్తున్నది?
10 బహుభార్యాత్వం:a యెహోవా ఆది సంకల్పం ప్రకారం ఓ భార్య తన భర్తను మరో స్త్రీతో పంచుకోదు. దేవుడు ఆదాము కొరకు ఒక భార్యను మాత్రమే సృజించాడు. (ఆదికాండము 2:21, 22) ఏదెనులో తిరుగుబాటు జరిగిన తర్వాత, కయీను వంశమందు మొదటిసారిగా ఈ బహుభార్యాత్వం కనబడింది. చివరకది ఒక ఆచారంగా తయారయ్యింది, కొంతమంది యెహోవా ఆరాధికులు దానిని అవలంబించారు. (ఆదికాండము 4:19; 16:1-3; 29:21-28) ఇశ్రాయేలీయుల జనాబా వృద్ధికావడానికి ఉపయోగపడిన బహుభార్యాత్వాన్ని యెహోవా అనుమతించిననూ, భార్యలు వారి పిల్లలు కాపాడబడులాగున ఆ అభ్యాసాన్ని క్రమబద్ధం చేయుటద్వారా ఆయన స్త్రీలయెడల శ్రద్ధచూపాడు. (నిర్గమకాండము 21:10, 11; ద్వితీయోపదేశకాండము 21:15-17) అంతేకాదు, యెహోవా తన ఆది సంకల్పమగు ఏకపత్నీ విధానాన్ని ఎన్నడూ విడనాడలేదు. ‘మీరు ఫలించి అభివృద్ధిపొంది భూమిని నింపుడని’ తాను మళ్లీ ఆజ్ఞయిచ్చిన నోవహు, ఆయన కుమారులందరూ ఏకపత్నీవ్రతులే. (ఆదికాండము 7:7; 9:1; 2 పేతురు 2:5) ఇశ్రాయేలీయులతో తన సంబంధాన్ని చిహ్నార్థకం చేసినప్పుడు దేవుడు తననుతాను ఏకపత్నీవ్రతుడైన భర్తగా వర్ణించుకున్నాడు. (యెషయా 54:1, 5) ఆ పిమ్మట, యేసుక్రీస్తు కూడ దేవుని మొదటి కట్టడయగు ఏకపత్నీవ్రతాన్ని పునఃస్థాపించాడు మరియు అది తొలి క్రైస్తవ సంఘమందు అభ్యసించబడింది.—మత్తయి 19:4-8; 1 తిమోతి 3:2, 12.
11. బైబిలు కాలాల్లో కన్యాశుల్కం ఎందుకు చెల్లింపబడింది, ఇది స్త్రీలకు అవమానకరమా?
11 కన్యాశుల్కం చెల్లించుట: ప్రాచీన ఇశ్రాయేలు—దాని ఉనికి మరియు సమాజాలు (ఆంగ్లం) అనే పుస్తకమిలా అంటోంది: “అమ్మాయి కుటుంబానికి కొంత డబ్బు లేదా దానికి సమానంగా ఏదైనా ఇవ్వడం ఇశ్రాయేలీయుల వివాహాన్ని బయటకు ఓ కొనుగోలుగా కన్పించేటట్టుచేస్తుంది. అయితే ఆమె కుటుంబానికి నష్టపరిహారంగా ఆ స్త్రీ కొరకు చెల్లింపబడే మూల్యం [కన్యాశుల్కం] పెద్దమొత్తంలో ఉన్నట్టు లేదు.” (ఇటాలిక్కులు మావి.) కాబట్టి ఆ స్త్రీ కుటుంబానికి ఆమె చేసే సేవల నష్టానికి, ఆమె పోషణార్థమై ఆ కుటుంబంచేసిన కృషికి, ఖర్చుకు నష్టపరిహారంగా కన్యాశుల్కం చెల్లించడం పనిచేసింది. అందువల్ల, స్త్రీని చులకన చేయడానికి బదులు, తన కుటుంబానికి ఆమె ఓ విలువైన మనిషని అది రూఢిపర్చింది.—ఆదికాండము 34:11, 12; నిర్గమకాండము 22:16; కావలికోట (ఆంగ్లం) జనవరి 15, 1989 పేజీలు 21-4 చూడండి.
12. (ఎ) వివాహిత స్త్రీపురుషులు కొన్నిసార్లు లేఖనాల్లో ఎలా చెప్పబడ్డారు, ఈ పదాలు స్త్రీలకు అభ్యంతరంగా ఉండెనా? (బి) ఏదెనులో యెహోవా ఉపయోగించిన పదాల విషయంలో ఏది గమనార్హమైయుంది? (అథఃస్సూచి చూడండి.)
12 భర్తలు “యజమానులుగా”: సుమారు సా.శ.పూ. 1918లో అబ్రాహాము, శారాల జీవితంలో జరిగిన ఓ సంఘటన, ఆ కాలానికి వివాహిత పురుషుడు (హెబ్రీ, బాల్) “యజమానిగా,” వివాహిత స్త్రీ (హెబ్రీ, బ్యూలా) ‘యజమానికివ్వబడిన’ దానిగా దృష్టించడమొక ఆచారంగా తయారయ్యిందని సూచిస్తున్నది. (ఆదికాండము 20:3) ఈ పదాలు ఆ పిమ్మట కొన్నిసార్లు లేఖనాల్లో ఉపయోగింపబడ్డాయి, అయితే క్రైస్తవకాలానికి ముందున్న స్త్రీలు వీటినిబట్టి అభ్యంతరపడ్డారనుటకు ఎట్టి సూచనాలేదు.b (ద్వితీయోపదేశకాండము 22:22) అయిననూ, స్త్రీలను ఆస్తిపాస్తుల్లో ఓ భాగమన్నట్లుగా పరిగణింపకూడదు. ఆస్తి లేదా సంపదను క్రయవిక్రయాలు చేయవచ్చు, స్వాస్థ్యముగా పొందవచ్చు, అయితే భార్య విషయమిలా లేదు. “గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము” అని ఓ బైబిలు సామెత చెబుతున్నది.—సామెతలు 19:14; ద్వితీయోపదేశకాండము 21:14.
ఓ గౌరవప్రదమైన పాత్ర
13. దైవభయంగల పురుషులు యెహోవా మాదిరిననుసరించి ఆయన ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు అది స్త్రీలకు ఏ ఫలితాన్నిచ్చింది?
13 మరి క్రైస్తవ కాలాలకు ముందున్న దేవుని సేవకులమధ్య స్త్రీల పాత్ర ఏమైయుండెను? వారెలా దృష్టింపబడేవారు, ఆదరింపబడేవారు? సులభంగా చెప్పాలంటే, దైవభయంగల పురుషులు స్వయంగా యెహోవా మాదిరిని అనుసరించి, ఆయన నియమానికి లోబడినప్పుడు స్త్రీలు తమ గౌరవం కలిగివుండి అనేక హక్కుల్ని, ఆధిక్యతల్ని అనుభవించారు.
14, 15. ఇశ్రాయేలునందు స్త్రీలు గౌరవింపబడ్డారనుటకు ఏ సూచనలు కలవు, తన పురుష ఆరాధికులు వారిని గౌరవించాలని యెహోవా ఎందుకు యుక్తంగా అపేక్షించగలడు?
14 స్త్రీలు గౌరవింపబడాలి. తల్లిని తండ్రిని గౌరవించాలని దేవుని ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల్ని శాసించింది. (నిర్గమకాండము 20:12; 21:15, 17) “మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను” అని లేవీయకాండము 19:3 చెబుతున్నది. ఓ సందర్భంలో బత్షెబ తన కుమారుడగు సొలొమోను దగ్గరకొచ్చినప్పుడు, గౌరవసూచకంగా “రాజులేచి ఆమెకు ఎదురుగావచ్చి ఆమెకు నమస్కారము చేసెను.” (1 రాజులు 2:19) ఎన్సైక్లోపీడియా జూడైకా ఇలా చెబుతున్నది: “ఇశ్రాయేలీయులయెడల దేవునికున్న ప్రేమను భార్యయెడల భర్తకుండే ప్రేమకు పోలికగా పలుకబడిన ప్రవచనాలు కేవలం స్త్రీలు గౌరవింపబడిన సమాజంలోనే చెప్పబడగలవు.”
15 ఆయనే స్త్రీలను గౌరవిస్తాడు కాబట్టి, పురుషులైన తన ఆరాధికులు కూడ వారిని గౌరవించాలని యెహోవా అపేక్షిస్తాడు. దీనికి సంబంధించిన సూచనలు లేఖనాల్లో కన్పిస్తాయి, వాటియందు యెహోవా సోదాహరణముగా స్త్రీల అనుభవాల్ని ఉపయోగిస్తూ ఆ స్త్రీలభావాల్ని తన స్వంతభావాలుగా పోల్చిచూపాడు. (యెషయా 42:14; 49:15; 66:13) యెహోవా ఎలా భావిస్తాడో అర్థంచేసుకోవడానికి పాఠకులకిది సహాయం చేస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే, యెహోవా తనకు అన్వయించుకునే “కరుణ” లేదా “కనికరం” కొరకు ఉపయోగింపబడిన హెబ్రీ పదం “గర్భం” అనే పదానికి దగ్గర సంబంధము కలిగివుంది మరియు అది ‘తల్లిచూపే వాత్సల్యముగా’ వివరింపబడగలదు.—నిర్గమకాండము 33:19; యెషయా 54:7.
16. దైవికస్త్రీల సలహాకు విలువ ఇవ్వబడిందని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?
16 దైవిక స్త్రీల సలహా విలువైనదిగా ఎంచబడింది. ఒక సందర్భంలో దైవభక్తిగల తన భార్య శారా సలహాను లక్ష్యపెట్టుటకు దైవ భయంగల అబ్రాహాము వెనుకాడినప్పుడు, ఆయనకు యెహోవా “ఆమెమాట వినుము” అని చెప్పాడు. (ఆదికాండము 21:10-12) ఏశావుయొక్క హిత్తీయవంశపు భార్యలు “ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.” తమ కుమారుడైన యాకోబు ఒకవేళ హిత్తీయవంశపు స్త్రీని వివాహం చేసుకుంటే తనకుకలిగే దుఃఖాన్ని రిబ్కా చివరకు వ్యక్తపర్చింది. ఇస్సాకు ప్రతిస్పందన ఏమైయుండెను? ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “ఇస్సాకు యాకోబును పిలిపించి—నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదని . . . ఆజ్ఞాపించి . . . దీవించెను.” అవును, రిబ్కా సూటిగా సలహా ఇవ్వకపోయిననూ, ఆమె భావాల్ని పరిగణలోనికి తీసుకుంటూ ఆమె భర్త ఓ నిర్ణయం తీసుకున్నాడు. (ఆదికాండము 26:34, 35; 27:46; 28:1-4) అబీగయీలు వేడుకోవడాన్ని విన్నందునే దావీదు ఆ తర్వాత రక్తాపరాధాన్ని తప్పించుకున్నాడు.—1 సమూయేలు 25:32-35.
17. కుటుంబంలో స్త్రీలకు కొంత అధికారముండెనని ఏది చూపిస్తున్నది?
17 కుటుంబమందు స్త్రీలు కొంత అధికారము కలిగివున్నారు. పిల్లలకిలా ఉద్బోధింపబడింది: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” (సామెతలు 1:8) శ్రమించే వివాహిత స్త్రీ గృహనిర్వహణే కాకుండ తమ స్థిరాస్తి లావాదేవీలను, పంటపొలం చక్కబెట్టడం, చిన్నపాటి వ్యాపారం నడపడం, తన జ్ఞానయుక్తమైన మాటలకు కూడ పేరుగాంచిందని సామెతలు 31వ అధ్యాయమందలి “గుణవతియైన భార్యను” గూర్చిన వర్ణన వెల్లడిస్తుంది. యెహోవాయెడల ఆ స్త్రీకున్న కొనియాడదగిన భక్తిప్రదమైన భయం అన్నింటికంటే ప్రాముఖ్యమైయుండెను. అట్టి భార్యకుండే విలువ “ముత్యముకంటే (పగడముకంటే NW) అమూల్యమైనది”! నగలు, అలంకరణ కొరకు ఉపయోగించే అమూల్యమైన ఎర్రపగడం అమితవిలువ కలిగివుంటుంది.—సామెతలు 31:10-31.
దేవుని ప్రత్యేకానుగ్రహం పొందిన స్త్రీలు
18. బైబిలు కాలాల్లోని కొంతమంది స్త్రీలకు ఏయేవిధాలుగా ప్రత్యేకానుగ్రహం చూపబడింది?
18 బైబిలు కాలాల్లోని కొంతమంది స్త్రీలను ప్రత్యేకంగా అనుగ్రహించుటలో స్త్రీలయెడల యెహోవాకున్న గౌరవం ప్రతిబింబించబడింది. హాగరును, శారాని, మానోహ భార్యను దేవదూతలు సందర్శించి, దైవ నడిపింపును గూర్చి వారికి తెలియజేశారు. (ఆదికాండము 16:7-12; 18:9-15; న్యాయాధిపతులు 13:2-5) ఆలయగుడారమందు “సేవకురాండ్రు” దేవాలయమందు గాయకురాండ్రును ఉన్నారు.—నిర్గమకాండము 38:8; 1 సమూయేలు 2:22; ప్రసంగి 2:8.
19. తనకు ప్రాతినిధ్యం వహించునట్లు ఏయేవిధాలుగా యెహోవా ఆయాసమయాల్లో స్త్రీలనుపయోగించాడు?
19 ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేకమార్లు తనకు ప్రాతినిధ్యం వహించేందుకు లేదా తనపక్షముగా మాట్లాడుటకు యెహోవా స్త్రీలను ఉపయోగించాడు. ప్రవక్త్రియైన దెబోరాను గూర్చి మనమిలా చదువుతాము: “తీర్పుచేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చుచుండిరి.” (న్యాయాధిపతులు 4:5) కనాను రాజగు యాబీనును జయించిన తర్వాత, దెబోరా నిజంగా ఓ ప్రత్యేకమైన ఆధిక్యతను కలిగియుండెను. కడకు యెహోవా ప్రేరేపిత వాక్యంలో భాగమైన విజయోత్సాహ గీతమందలి కనీసం కొంతభాగాన్ని ఆమే కూర్చింది.c (న్యాయాధిపతులు, 5వ అధ్యాయం) శతాబ్దాల తర్వాత, యెహోవాయొద్ద విచారణ చేయుటకు రాజైన యోషీయా ప్రవక్త్రియైన హుల్దానొద్దకు ప్రధాన యాజకుడు చేరియున్న ఓ ప్రతినిధి బృందాన్ని పంపాడు. హుల్దా వారికి అధికారికంగా, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా” అని జవాబు చెప్పగల్గింది. (2 రాజులు 22:11-19) ఆ సందర్భంలో ఓ ప్రవక్త్రినియొద్దకు వెళ్లమని రాజు ప్రతినిధి బృందాన్ని ఆజ్ఞాపించాడు. కానీ యెహోవా నడిపింపు కొరకే అలా చేయడం జరిగింది.—మలాకీ 2:7 పోల్చండి.
20. స్త్రీల భావాలయెడల వారి సంక్షేమంయెడల యెహోవా శ్రద్ధను ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?
20 తన మహిళారాధికుల్లో కొందరి పక్షముగా చర్య తీసుకున్న సంఘటనల్నిబట్టి చూస్తే స్త్రీ సంక్షేమం విషయంలో యెహోవాకున్న శ్రద్ధ స్పష్టమౌతుంది. అబ్రాహాము అందమైన భార్య శారాపై అత్యాచారం జరుగకుండా కాపాడుటకు ఆయన రెండుసార్లు జోక్యం చేసుకున్నాడు. (ఆదికాండము 12:14-20; 20:1-7) యాకోబు తక్కువగా ప్రేమించిన లేయా ఓ కుమారుని కనునట్లు ఆమె ‘గర్భము తెరచుట’ ద్వారా దేవుడామెను అనుగ్రహించాడు. (ఆదికాండము 29:31, 32) ఐగుప్తులో శిశు హత్యాకాండ నుండి హెబ్రీయుల మగ శిశువులను కాపాడేందుకు భక్తిగల ఇద్దరు ఇశ్రాయేలీయ మంత్రసానులు తమ జీవితాల్నే పణంగాపెట్టినప్పుడు, ప్రశంసతో యెహోవా “వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.” (నిర్గమకాండము 1:17, 20, 21) ఆయన హన్నా చేసిన ఎడతెగని ప్రార్థనలకు ప్రత్యుత్తరమిచ్చాడు. (1 సమూయేలు 1:10, 20) అప్పు తీర్చమని అప్పులవాడు తన ఇద్దరు కుమారులను తీసుకుపోవడానికి సిద్ధమైన పరిస్థితిని ఓ ప్రవక్త విధవరాలు ఎదుర్కొన్నప్పుడు, యెహోవా ఆమెను ఎడబాయలేదు. దేవుడు ప్రేమతో ఆమె తన అప్పు తీర్చునట్లు ఆమెకు సమృద్ధిగా నూనె దయచేసేలా ప్రవక్తయైన ఎలీషాను బలపర్చాడు. ఆ విధంగా ఆమె తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని కాపాడుకుంది.—నిర్గమకాండము 22:22, 23; 2 రాజులు 4:1-7.
21. స్త్రీల భాగాన్నిగూర్చి హెబ్రీ లేఖనాలు ఏ సమతూకమైన వర్ణనను అందిస్తున్నవి?
21 కాబట్టి, స్త్రీలను చిన్నచూపు చూడడాన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా హెబ్రీ లేఖనాలు దేవుని సేవకులమధ్య వారి భాగాన్నిగూర్చిన ఓ సమతూకమైన వర్ణనను అందిస్తున్నవి. ఆదికాండము 3:16 నెరవేర్పు నుండి యెహోవా తన మహిళారాధికుల్ని కాపాడకపోయినా, యెహోవా మాదిరిని అనుసరించి ఆయన ధర్మశాస్త్రాన్ని లక్ష్యపెట్టిన దైవభక్తిగల పురుషులు స్త్రీలను మర్యాదగా, గౌరవంగా చూశారు.
22. యేసు భూమిపైవున్న కాలానికి స్త్రీల పాత్ర ఎలా మారింది, ఏ ప్రశ్నలు అడుగబడుతున్నాయి?
22 హెబ్రీలేఖనాలు పూర్తైన తర్వాతి శతాబ్దాల్లో యూదులమధ్య స్త్రీల పాత్ర మారింది. యేసు ఈ భూమికి వచ్చే నాటికి రబ్బీల ఆచారాలు స్త్రీలను తమ మత ఆధిక్యతల్లో, సామాజిక జీవితంలో ఎంతగానో నిర్బంధించాయి. అట్టి ఆచారాలు స్త్రీలతో యేసు వ్యవహార విధానంపై ప్రభావం చూపాయా? నేడు క్రైస్తవస్త్రీలు ఎలా దృష్టించబడాలి? ఈ ప్రశ్నలు తర్వాతి శీర్షికలో చర్చించబడతాయి.
[అధస్సూచీలు]
a వెబ్స్టర్స్ నైన్త్ న్యూ కాలేజియేట్ డిక్షనరీ ప్రకారం “బహుభార్యాత్వం” “భార్యభర్తల్లో ఎవరైనాసరే ఒకే సమయంలో ఒక జతకంటే ఎక్కువమందిని కలిగియుండే వివాహాన్ని” సూచిస్తుంది. మరి విశేషంగా “బహుభార్యాత్వం” అనే పదం “ఒకే సమయంలో ఒక భార్య లేక ఒక స్త్రీ జతకంటే ఎక్కువమందిని కలిగివుండే స్థితి లేక అభ్యాసము” అని నిర్వచింపబడింది.
b హెబ్రీ లేఖనాలన్నింటిలో వివాహిత స్త్రీపురుషులు అనేకమార్లు “భార్య” (హెబ్రీ, ఇష్షా) “భర్త” (హెబ్రీ, ఇష్)అనే చెప్పబడ్డారు. ఉదాహరణకు, ఏదెనులో “యజమాని” ‘యజమానికివ్వబడినది’ అనే పదాల్ని కాదుగాని “భార్య” “భర్త” అనే పదాల్నే యెహోవా ఉపయోగించాడు. (ఆదికాండము 2:24; 3:16, 17) పరవాసంనుండి తిరిగివచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపముతో యెహోవానిక “యజమాని” అనికాకుండ “నా భర్త” అని పిలుస్తారని హోషేయ ప్రవచనం ముందుగానే తెల్పింది. ఇది “భర్త” అనేపదం “యజమాని” అనేమాటకంటే మరింత మృదువైన అర్థాన్ని కలిగియున్నదని సూచించవచ్చు.”—హోషేయ 2:16, NW.
c న్యాయాధిపతులు 5:7లో దెబోరాను ప్రథమవ్యక్తిగా ప్రయోగించి చెప్పడం గమనార్హం.
మీరెలా జవాబిస్తారు?
◻ “సహాయకారి” “సాటివ్యక్తి” అనే పదాలు స్త్రీల దైవనియమిత పాత్రనుగూర్చి ఏమి సూచిస్తున్నాయి?
◻ బైబిలు కాలాల్లో స్త్రీలపై ప్రభావం చూపిన ఆచారాల్ని ఆలోచించేటప్పుడు మనమేమి మనస్సునందుంచుకోవాలి?
◻ తొలికాలాల్లో దేవుని సేవకులమధ్య స్త్రీలు ఓ గౌరవప్రదమైన పాత్ర కలిగివున్నారని ఏది చూపుతున్నది?
◻ క్రైస్తవపూర్వ కాలాల్లో ఏయేవిధాలుగా స్త్రీలను యెహోవా ప్రత్యేకంగా అనుగ్రహించాడు?