లోకాన్ని భయం ఎందుకు ఆవరించుకొని ఉంది?
భయపడుతూ జీవించాలని ఎవరు కోరుకుంటారు? తన జీవితానికి ఎలాంటి ముప్పు రాకుండా భద్రతతో జీవించాలని సగటు మనిషి కోరుకుంటాడు. అందుకే అనేకులు నేరం నిండివున్న ప్రాంతాల నుండి దూరంగా ఉంటారు. అయినా, భయకారకాలు అంతటా ఉన్నాయి.
అణ్వస్త్ర ఆయుధాలు, రియాక్టర్ల ప్రమాదాల వల్ల కలిగే అపాయాలు మానవజాతి నాశనమౌతుందేమోననే భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆకాశాన్నంటుతున్న దౌర్జన్యం భయాన్ని వృద్ధి చేస్తోంది. ఈ శతాబ్దానికి ఎయిడ్స్ మరింత మరణకర అంటువ్యాధిగా పరిణమిస్తుందని అనేకులు భయపడుతున్నారు. భయానికి గల కారణాల్లో పర్యావరణ వినాశనం మరొకటి. ఈ భయాలు నిజంగా విశేషమైనవేనా? మరి అలాంటి భయం లేని లోకంలో మనం జీవించగలమని ఎన్నడైనా నిరీక్షించగలమా?
ప్రపంచవ్యాప్త భయం విశేషమైనది
నేటి విస్తృతమైన భయం, బైబిల్లో ప్రవచింపబడినదాన్ని బట్టి, విశేషమైంది. అంత్యదినాలను గూర్చిన తన ప్రవచనంలో, భయాన్ని కల్గించే పరిస్థితులను యేసుక్రీస్తు సూచించాడు. ఆయన యిలా అన్నాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును.” “అక్రమము విస్తరించుట,”ను గూర్చి కూడా యేసు మాట్లాడాడు. పందొమ్మిది వందల పద్నాలుగు నుండి, అసమానమైన యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అక్రమం, అధిక భయానికి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి.—మత్తయి 24:7-14.
ప్రజా వైఖరి కూడా నేడు భయానికి కారణమౌతుంది. అపొస్తలుడైన పౌలు యొక్క ప్రవచనార్థక మాటలను 2 తిమోతి 3:1-4 నందు మనమిలా చదువుతాము: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” ఈ అంత్య దినాల్లో మనం అలాంటి ప్రజల మధ్య ఉన్నాము గనుక, ఎంతో భయం నెలకొని ఉండడంలో ఆశ్చర్యంలేదు!
ఈ లోకం దేన్ని ఎదురు చూడవచ్చు
యేసు ఈ కాలాన్ని నోవహు సమయంలోని అంత్యదినాలతో పోల్చాడు. నిస్సందేహంగా, అప్పుడు ఎంతో భయం ఉండేది, ఎందుకంటే బైబిలు చారిత్రాత్మక రికార్డు యిలా చెబుతోంది: “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” కనుక “దేవుడు నోవహుతో—సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది.” (ఆదికాండము 6:11, 13) ఆ దుష్టలోకం బలాత్కారంతో ఎంతగా నిండిపోయిందంటే దేవుడు ఒక ప్రపంచవ్యాప్త జలప్రళయం ద్వారా దాన్ని అంతమొందించాడు. అయితే, ప్రేమనుబట్టి యెహోవా దేవుడు నీతిమంతుడైన నోవహును, అతని కుటుంబాన్ని కాపాడాడు.—2 పేతురు 2:5.
కాబట్టి, బలాత్కారంతో నిండిన ప్రస్తుత లోకం దేనిని ఎదురుచూడవచ్చు? యితరుల క్షేమాన్ని దౌర్జన్యంగా ఉపేక్షించేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కీర్తనల గ్రంథకర్త మాటల్లో యిది స్పష్టమౌతోంది: “యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు.” (కీర్తన 11:5) నోవహు దినాల్లో బలత్కారంతో నిండిన లోకాన్ని యెహోవా అంతమొందించాడు. కాబట్టి, భయంకరమైన దౌర్జన్యంతో నిండివున్న ఈ లోకాన్ని కూడా దేవుడు అంతమొందిస్తాడని మనం అపేక్షించవద్దా?
అపొస్తలుడైన పేతురు, క్రీస్తు ప్రత్యక్షతను గూర్చి మాట్లాడడానికి, ప్రస్తుత దుష్ట లోకానికి సంభవించబోయే నాశనాన్ని గూర్చి ప్రవచించడానికి దైవికంగా ప్రేరేపించబడ్డాడు. ఆయనిలా వ్రాశాడు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,—ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.” పేతురు ఆ తర్వాత, మానవజాతిపైనున్న అసంపూర్ణ పరిపాలక విధానాన్ని సూచించడానికి “ఆకాశము” అనే పదాన్ని, అవినీతికరమైన మానవ సమాజాన్ని సూచించడానికి “భూమి” అనే మాటను ఉపయోగించాడు. “ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్లవలన అప్పుడున్న [నోవహు దినాల్లోని] లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.”—2 పేతురు 3:3-7.
అదే భావంలో, క్రీస్తు, శక్తిమంతులైన ఆయన దూతలు “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికిని ప్రతిదండన చేయునప్పుడు . . . అట్టివారు . . . నిత్యనాశనమను దండన పొందుదురు” అని పౌలు నొక్కిచెప్పాడు. (2 థెస్సలొనీకయులు 1:6-9) బైబిలు చివరి పుస్తకం, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు” జనాంగములను సమకూర్చడాన్ని గూర్చి మాట్లాడుతూ, యెహోవా “భూమిని నశింపజేయువారిని నశింపజేయు”నని మనకు అభయమిస్తుంది.—ప్రకటన 11:18; 16:14-16.
ఆనందించాల్సిన సమయమేకానీ, భయపడాల్సినది కాదు
ఈ లోకాన్ని గూర్చి బైబిలు ప్రవచించేదానికి భయపడే బదులు నీతిమంతులైన ప్రజలు ఆనందించడానికి కారణముంది. యెహోవా త్వరలోనే ఈ దుష్ట లోకాన్ని అంతమొందిస్తాడు, అయితే నీతిని ప్రేమించేవారి శ్రేయస్సుకొరకే యిది జరుగుతుంది. ప్రస్తుత దుష్ట విధానం దేవునిచేత అంతంచేయబడిన తర్వాత ఏమి జరుగుతుంది? ఏమి జరుగుతుందంటే, యేసు తన అనుచరులకు ప్రార్థించమని నేర్పిన, దేవుని పరలోకరాజ్య ఆధ్వర్యంలో నూతన విధానము వస్తుంది! ఆయనిలా చెప్పాడు: “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి,—పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9, 10) దేవుని చిత్తం ఈ భూమి మీద జరిగినప్పుడు ఏ మార్పులు వస్తాయని ఎదురుచూడవచ్చు?
యుద్ధము దానికి సంబంధించిన భయాలు అంతరించిపోతాయి. కీర్తన 46:9 యిలా చెబుతోంది “ఆయనే [యెహోవా దేవుడు] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.” అప్పుడు ప్రజలు “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును.”—మీకా 4:4.
మరణకరమైన వ్యాధులు యిక ఎంత మాత్రమూ భయాన్ని కల్గించవు, ప్రాణాలు బలిగొనవు. దైవిక వాగ్దానమేమంటే: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు.” (యెషయా 33:24) ఆనందించడానికి యిది ఎంత చక్కటి కారణం!
నేరము, దౌర్జన్యాలకు సంబంధించిన భయాలు కూడా గతించిన సంగతులై ఉంటాయి. కీర్తన 37:10, 11 యిలా వాగ్దానం చేస్తోంది: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”
ప్రస్తుత దిన భయం స్థానంలో నిజమైన శాంతి భద్రతలు ఎలా వస్తాయి? ఒక నీతియుక్తమైన ప్రభుత్వం ద్వారా, అంటే దేవుని రాజ్యము ద్వారానే. మన కాలాన్ని గురించి దానియేలు 2:44 యిలా పేర్కొంటోంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” యెహోవా నియమిత రాజైన యేసుక్రీస్తు, ‘తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచువరకు ఆయన పరిపాలన చేయుచుండవలెను.’ (1 కొరింథీయులు 15:25) యేసు వెయ్యేండ్ల పాలనలో, ఆనందభరితమైన మానవులు పరదైసు భూమిని నిరంతరం స్వతంత్రించుకోవాలనే దేవుని మొదటి సంకల్పం నెరవేరుతుంది.—లూకా 23:43; ప్రకటన 20:6; 21:1-5.
ఆ పరదైసు భూమిలో, ప్రయోజనకరమైన భయమొకటి ఉంటుంది. అది ‘యెహోవా యందు భయము.’ (సామెతలు 1:7) వాస్తవానికి, ఈ భయాన్ని మనం యిప్పుడు కూడా కల్గివుండాలి, ఎందుకంటే మనం దేవుని కృపను, ఆయన మంచితనాన్ని మెచ్చుకుంటాము గనుక అది సంపూర్ణ గౌరవము, భక్తిపూర్వక భయంతో దేవున్ని అప్రీతిపరుస్తామనే భీతి. ఈ భయానికి, యెహోవా యందు ప్రగాఢ నమ్మకము, ఆయనకు నమ్మకంతో కూడిన విధేయత అవసరము.—కీర్తన 2:11; 115:11.
భయోత్పాత సంఘటనలు వీటిని అంత్యదినాలని సూచిస్తున్నాయి. అయితే మనం దేవునిపై మనకున్న ప్రేమను నిరూపించుకుంటే, మనం భయపడడానికి బదులు సంతోషించగలము. ఈ లోకానికి దేవుడు తెచ్చే ముగింపు దగ్గరపడిందని బైబిలు ప్రవచనాలు చూపిస్తున్నాయి. దాని స్థానంలో యెహోవా దేవుడు వాగ్దానంచేసిన నీతియుక్తమైన నూతన లోకం చోటుచేసుకుంటుంది. (2 పేతురు 3:13) వాస్తవానికి, రాజ్యపరిపాలన క్రింద త్వరలోనే అప్రయోజనకరమైన భయంలేని లోకం ఉంటుంది.
[6వ పేజీలోని బాక్సు]
ఒక్క ప్రతికి ఉన్న ప్రభావం
పోలెండుకు చెందిన టోమాష్ అనే యువకుడు ఒక న్యాయబద్ధమైన సమస్యలో చిక్కుకున్నాడు, అది అతను ఆ దేశం నుండి పారిపోయేలా చేసింది. ఆరు నెలలపాటు అతను గుడారాల్లో పడుకుంటూ పలురకాల పనులు చేసుకుంటూ లిఫ్ట్ అడగడం ద్వారా అతను ఐరోపాకు ప్రయాణించాడు. ఈ మధ్యలో, ఒక ప్రశ్న అతని మదిలో ఎప్పుడూ ఉండేది: జీవిత సంకల్పం ఏమిటి?
పోలిష్ భాషలో అతనికి ఒక కావలికోట ప్రతిని యిచ్చినప్పుడు టోమాష్ ప్రశ్నకు జవాబు దొరికింది. అతను దాన్ని అనేక మార్లు చదివి, అతను వెదుకుతున్న సత్యం ఆ పత్రికలో ఉందని గ్రహించాడు. టోమాష్, 200 కిలోమీటర్ల దూరంలోని జర్మనీ నందలి సెల్టర్స్/టావునస్స్‌లోని వాచ్‌టవర్ బ్రాంచి కార్యాలయానికి లిఫ్ట్ అడుగుతూ ప్రయాణించాడు. సోమవారం సాయంత్రం అక్కడికి చేరి, అతను తన కావలికోట పత్రికను చేతబట్టుకుని యిలా అన్నాడు: “ఈ పత్రికలో ఉన్న వాటిని గురించి మరి విశిదంగా ఎవరైనా నాకు వివరించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏం చేయాల్సిన అవసరం ఉంది?”
ఆ సాయంత్రం, యిద్దరు యెహోవాసాక్షులు టోమాష్‌తో తమ సంభాషణకు ఆధారంగా బైబిలును ఉపయోగిస్తూ జీవితం యొక్క సంకల్పాన్ని గూర్చి మాట్లాడారు. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలన్న కుతూహలంతో, బైబిలును, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని పఠిస్తూ టోమాష్ ఆ వారంలో ప్రతి రోజు బ్రాంచి కార్యాలయానికి వచ్చేవాడు.
సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చినప్పటికీ, పోలండ్‌కు తిరిగి వెళ్లాలని టోమాష్ నిర్ణయించుకున్నాడు. అలా శుక్రవారం, అంటే సెల్టర్స్ బ్రాంచి కార్యాలయానికి చేరిన కేవలం నాలుగు రోజులకే టోమాష్ తన స్వదేశానికి ప్రయాణం ప్రారంభించాడు. వెంటనే అతడు పోలండ్‌లోని యెహోవాసాక్షులతో పఠించడం మొదలుపెట్టాడు. టోమాష్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ తాను నేర్చుకునే దాన్ని గూర్చి యితరులతో చెప్పడం ప్రారంభించాడు. జెల్టర్స్ కార్యాలయాన్ని మొదటి సారి సందర్శించిన నాలుగునెలల తర్వాత అంటే 1993 అక్టోబరు నెలలో అతను ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాడు.
ఈ యువకుడు జీవిత సంకల్పాన్ని పరిశీలించడానికి ఒక్క కావలికోట ప్రతి సహాయపడింది!
[7వ పేజీలోని చిత్రం]
యేసుక్రీస్తు రాజ్యపరిపాలన క్రింద, భయము లోకాన్ని మరెన్నడూ ఆవరించదు