యెహోవాకు భయపడి ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుడి
“ప్రభువా, (యెహోవా NW) నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు?”—ప్రకటన 15:4.
1, 2. (ఎ) యెహోవా ఎట్లు 1991లో ఆకాశపువాకిండ్లను విప్పెను? (బి) నమ్మకమైన ఒక మిషనరీ: “యెహోవాకు భయపడుము” అను సలహానిచ్చుటకు ఏ జీవిత అనుభవము ఆయనను పురికొల్పెను? (1991 వార్షిక పుస్తకము, పుటలు 187-9 కూడ చూడుము.)
యెహోవా ‘ఆకాశపువాకిండ్లను విప్పి, నిజముగా పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెను.’ ఆ మాటలు ఇటీవలి కాలములలో యెహోవాసాక్షులకు మరలా మరలా అన్వయింపబడగలవు. (మలాకీ 3:10) ఉదాహరణకు, 1991వ సేవా సంవత్సరములో భూవ్యాప్తముగా జరిగిన ప్రత్యేక సమావేశములలో—దక్షిణ అమెరికాలోని బ్యూనోస్‌ఏర్స్; తూర్పున మనీలా, టాయ్‌పాయ్ మరియు బ్యాంకాక్ నుండి తూర్పు యూరపులోని బుడాపెస్ట్, ప్రాగూ మరియు జాగ్రెబ్ (ఆగష్టు 16-18, 1991) వరకు జరిగిన “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను సమావేశములలో ఇతర ప్రాంతముల నుండి వచ్చిన సాక్షులు మరియు స్థానిక సమావేశ ప్రతినిధుల ఉత్సాహము వారి క్రైస్తవ సహవాసమందు పెల్లుబుకినది.
2 ఆ ప్రాంతములలోని దీర్ఘకాల నమ్మకమైన సాక్షులను కలిసికొనుట దూరదేశములనుండి వచ్చిన ప్రతినిధులకు ఎంత సంతోషముగా ఉండెనో! ఉదాహరణకు, బ్యాంకాక్‌లో, ఫ్రాంక్ డేవర్—థాయ్‌ల్యాండ్‌లో ఒకప్పుడు ఆయనొక్కడే రాజ్యప్రచారకుడు—తన 58 సంవత్సరముల మిషనరీ సేవనుగూర్చి తెల్పెను. ఫసిఫిక్ సముద్ర ద్వీపముల నుండి ఆగ్నేయాసియా, మరియు చైనాకు వరకు ఆయన పని విస్తరించెను. ఓడ బ్రద్దలగుట, అరణ్యములలో కౄర జంతువులు, ఉష్ణమండల వ్యాధులు, జపాను యుద్ధప్రభువుల కౄరపరిపాలన మున్నగువాటినుండి ఆయన అపాయముల నెదుర్కొనెను. సమావేశ ప్రతినిధులకు మీ సలహా ఏమిటని అడిగినప్పుడు, ఆయనిచ్చిన సాదా జవాబేమనగా: “యెహోవాకు భయపడుము!”
3. మనమెందుకు దైవభయమును ప్రదర్శించవలెను?
3 “యెహోవాకు భయపడుము!” మనమందరము ఆ ఆరోగ్యదాయకమైన భయమును పెంపొందించుకొనుట ఎంత ప్రాముఖ్యము! “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము.” (కీర్తన 111:10) యెహోవాయెడల ఈ భయము రోగగ్రస్తమైన భీతికాదు. బదులుగా, అది దేవుని వాక్య పఠనముద్వారా మనముపొందు జ్ఞానముమీద ఆధారపడిన, భీతిగొలుపు ఆయన ఘనత మరియు దైవలక్షణముల యెడల లోతైన గౌరవమైయున్నది. ప్రకటన 15:3, 4 నందు మోషే మరియు గొర్రెపిల్ల కీర్తన ఇట్లు ప్రకటించుచున్నది: “ప్రభువా, (యెహోవా NW) దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, (యెహోవా NW) నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు?” తన ఆరాధికులయెడల యథార్థతను ప్రదర్శిస్తూ, “ఆయన నామమును స్మరించుచు, యెహోవాయందు భయభక్తులు కలిగియుండువారి కొరకు . . . ఆయన సముఖమందు వ్రాయబడిన జ్ఞాపకార్థ గ్రంథము” నొకదానిని యెహోవా కల్గియున్నాడు. వారికి నిత్యజీవము అనుగ్రహింపబడినది.—మలాకీ 3:16 NW; ప్రకటన 20:12, 15.
దైవిక భయము జయించును
4. ప్రాచీనకాల ఏ విడుదల మనము యెహోవాకు భయపడునట్లు ప్రోత్సహించవలెను?
4 ఇశ్రాయేలీయులు ఫరోయొక్క ఐగుప్తునుండి బయటకు నడచినప్పుడు, తాను కేవలము యెహోవాకు మాత్రమే భయపడెనని మోషే స్పష్టముగా చూపించెను. త్వరలోనే, ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రము మరియు ఐగుప్తు బలమైన సర్వవిధ సైన్యము మధ్య చిక్కుకొనిరి. వారేమి చేతురు? అప్పుడు, “మోషే—భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.” అద్భుతరీతిన, యెహోవా ఆ నీటిని పాయలుగా చేసెను. ఇశ్రాయేలీయులు సముద్ర గర్భమున నడిచివెళ్లిరి. ఆ పిమ్మట నీరు మరలా పొర్లిపారగా, ఫరో సైన్యమంతయు రూపుమాపబడెను. దేవునికి భయపడిన జనాంగమును యెహోవా రక్షించి, అదేసమయములో దేవుని అవమానపరచిన ఐగుప్తునకు ఆయన తీర్పుతీర్చెను. అదేవిధముగా నేడు, ఆయన సాతాను లోకమునుండి తన దైవభయముగల సాక్షులను విమోచించుటలో తన యథార్థతను ప్రదర్శించును.—నిర్గమకాండము 14:13, 14; రోమీయులు 15:4.
5, 6. మనుష్యులకు కాదు మనము యెహోవాకు భయపడవలెనని యెహోషువ కాలమునాటి ఏ సంఘటనలు చూపించుచున్నవి?
5 ఐగుప్తునుండి నిష్క్రమించి వచ్చేసిన తర్వాత, వాగ్దాన దేశమునకు మోషే 12 మంది వేగులవారిని పంపెను. భారీకాయులైన ఆ దేశనివాసులను చూచి భయకంపితులైన పదిమంది ఆ దేశములో ప్రవేశించకుండ ఇశ్రాయేలీయులను ఆపుజేయుటకు ప్రయత్నించిరి. అయితే మిగిలిన యిద్దరు, అనగా యెహోషువ మరియు కాలేబు ఇట్లనిరి: “[అది] మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడి.”—సంఖ్యాకాండము 14:7-9.
6 ఏమైనను, ఆ ఇశ్రాయేలీయులు మానవ భయమునకు లొంగిపోయారు. దాని ఫలితముగా, వారెన్నడును వాగ్దానదేశమునకు చేరుకొనలేదు. అయితే ఇశ్రాయేలీయుల క్రొత్తతరముతో యెహోషువ, కాలేబులు ఆ కోరదగిన దేశములో ప్రవేశించి దాని ద్రాక్షతోటలను, ఒలీవ చెట్లను సాగుచేయు ఆధిక్యతను పొందిరి. గుమికూడిన ఇశ్రాయేలు సమాజమునకు తన వీడ్కోలు ప్రసంగములో, యెహోషువ ఈ సలహానిచ్చెను: “మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుము.” ఆ తదుపరి యెహోషువ ఇంకను ఇట్లనెను: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” (యెహోషువ 24:14, 15) దేవుని నీతియుక్త నూతన లోకములోనికి ప్రవేశించుటకు మనము సిద్ధపడుచుండగా యెహోవాకు భయపడు విషయములో కుటుంబ శిరస్సులకు, ఇతరులందరికి అవి ఎంత ప్రోత్సాహకరమైన మాటలైయున్నవి!
7. దేవుని భయ ప్రాముఖ్యతను దావీదు ఎట్లు నొక్కితెల్పెను?
7 గొర్రెలకాపరియైన బాలుడగు దావీదుకూడ దేవుని పేరిట గొల్యాతు నెదుర్కొనినప్పుడు యెహోవాయందు మాదిరికరమైన భయమును ప్రదర్శించెను. (1 సమూయేలు 17:45, 47) తన మరణశయ్యపై దావీదు ఇట్లు ప్రకటింపగల్గెను: “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు, నాద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలెను . . . అతడు ఉండును.” (2 సమూయేలు 23:2-4) ఈ లోక పాలకులలో దేవునిగూర్చిన ఈ భయము లేదు, కావున ఫలితము ఎంత దుఃఖకరముగా ఉన్నది! యెహోవా భయమందు, “దావీదు కుమారుడైన” యేసు భూమిని పరిపాలించినప్పుడు అది ఎంత భిన్నముగా ఉండును!—మత్తయి 21:9.
యెహోవాయందలి భయముతో ప్రవర్తించుట
8. యెహోషాపాతు ఏలుబడి క్రింద యూదా ఎందుకు వర్ధిల్లెను, మనకీనాడు అది ఏమి సూచించుచున్నది?
8 దావీదు మరణించిన దాదాపు వంద సంవత్సరముల తర్వాత, యెహోషాపాతు యూదాకు రాజయ్యెను. ఈ రాజుకూడ యెహోవా భయమందు పనిచేసెను. ఆయన యూదాలో దైవపరిపాలనా క్రమమును పునరుద్ధరించి, దేశమంతటా న్యాయాధిపతులను ఏర్పాటుచేసి, వారికీలాగున ఆజ్ఞాపించెను: “మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతోకూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పుతీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. . . . యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను.” (2 దినవృత్తాంతములు 19:6-9) ఆ విధముగా, కనికరముగల పైవిచారణకర్తల సేవద్వారా ఈనాడు దేవుని ప్రజలు ప్రయోజనము పొందుచున్నట్లే, యెహోవా భయమందు యూదా వర్ధిల్లెను.
9, 10. యెహోవా భయమందు యెహోషాపాతు ఎట్లు విజయమునొందెను?
9 అయితే, యూదాకు శత్రువులుండెను. వీరు దేవుని జనాంగమును రూపుమాపవలెనని నిర్ణయించుకొని యుండిరి. అమ్మోను, మోయాబు మరియు శేయీరు మన్యపువారి సమిష్టి సైనిక బలగాలు యూదా భూభాగములోనికి చొచ్చుకొనివచ్చి, యెరూషలేమును బెదిరించెను. అది బలమైన సైన్యము. “యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడగా,” యెహోషాపాతు యెహోవావైపు తిరిగి ప్రార్థించెను. ఆ పిమ్మట ఆ ప్రార్థనకు జవాబుగా, యెహోవా ఆత్మ లేవీయుడగు యెహీయేలుపై రాగా, అతడిట్లనెను: “యెహోవా సెలవిచ్చున దేమనగా—ఈ సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారిమీదికి పోవుడి; . . . ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును.”—2 దినవృత్తాంతములు 20:5-17.
10 మరుసటి ఉదయము పెందలకడనే లేచి, విధేయతతో యూదావారలు శత్రువును ఎదుర్కొనుటకు పోవుచుండగా, యెహోషాపాతు నిలువబడి ఇట్లనెను: “యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు.” సాయుధులైన మనుష్యులకు ముందు నడచుచు, గాయకులు ఏకస్వరముతో, “యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి” అని యెహోవాకు గానము చేసిరి. శత్రువులు ఒకరినొకరు సంహరించుకొనునట్లు వారిమధ్య గందరగోళమును సృష్టించుటద్వారా యెహోవా ఆ కృపను వ్యక్తపరచెను. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చుసరికి, అక్కడ కేవలము శత్రువుల కళేబరములు మాత్రమే ఉండెను.—2 దినవృత్తాంతములు 20:20-24.
11. భయము సంబంధముగా, జనాంగములు దేవుని ప్రజలకెట్లు భిన్నముగా ఉందురు?
11 పొరుగు జనాంగములవారు ఈ అద్భుత విమోచనను గూర్చి విన్నప్పుడు, “దేవుని భయము” వారిమీదికి వచ్చెను. మరొకవైపున, యెహోవాయందలి భయముతో లోబడిన జనాంగము “నిమ్మళముగా నుండెను.” (2 దినవృత్తాంతములు 20:29, 30) అదేప్రకారము, హార్‌మెగిద్దోనునందు యెహోవా తీర్పుతీర్చినప్పుడు, జనాంగములకు, “దేవుని” మరియు శిక్షను అమలుచేయు ఆయన కుమారుడగు, యేసుక్రీస్తు “భయము” ఉండును, మరియు వారు దేవుని ఉగ్రతయొక్క ఆ మహాదినమందు నిలువజాలరు.—ప్రకటన 6:15-17.
12. గతకాలములలో యెహోవాయందలి భయమునకు ప్రతిఫలమెట్లు లభించెను?
12 యెహోవాయందలి ఆరోగ్యదాయకమైన భయము గొప్ప దీవెనలను తెచ్చును. నోవహు, “భయభక్తులు గలవాడై, తన యింటివారి కొరకు ఒక ఓడను సిద్ధముచేసెను.” (హెబ్రీయులు 11:7) మొదటి శతాబ్దపు క్రైస్తవులను గూర్చి వ్రాయబడినదేమనగా, హింస కలిగిన కాలము తర్వాత, సంఘము “క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు (యెహోవా NW) భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.”—అపొ. కార్యములు 9:31.
మంచిని ప్రేమించి, చెడుతనము నసహ్యించుకొనుము
13. ఎట్లు మాత్రమే మనము యెహోవా ఆశీర్వాదమును అనుభవించ వచ్చును?
13 యెహోవా అన్నివిధముల మంచివాడు. కావున, “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే.” (సామెతలు 8:13) యేసునుగూర్చి ఇట్లు వ్రాయబడెను: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడివారికంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.” (హెబ్రీయులు 1:9) మనము యేసువలె, యెహోవా ఆశీర్వచనమును కోరినట్లయిన, మనము చెడుతనమును, లైంగిక దుర్నీతిని, హింసను, మరియు సాతాను అహంకార లోకముయొక్క పేరాశను అసహ్యించుకొనవలెను. (సామెతలు 6:16-19 పోల్చుము.) మనము యెహోవా ప్రేమించు దానిని ప్రేమించవలెను ఆయన అసహ్యించుకొను దానిని అసహ్యించుకొనవలెను. యెహోవాకు అయిష్టకరమైన దేనిని చేయుటకైనను మనము భయపడవలెను. “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.”—సామెతలు 16:6.
14. యేసు మనకెట్లు ఒక మాదిరినుంచెను?
14 మనము ఆయన అడుగుజాడలలో జాగ్రత్తగా నడచుకొనవలెనని యేసు మనకొరకు ఒక మాదిరియుంచెను. “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.” (1 పేతురు 2:21-23) యెహోవాయందలి భయముతో మనముకూడ, సాతాను లోకము మనపై తీసికొనివచ్చు నిందలను, వెక్కిరింతలను, హింసలను సహించగలము.
15. శరీరమును చంపగల వారికి కాక, మనమెందుకు యెహోవాకు భయపడవలెను?
15 మత్తయి 10:28 (NW) నందు, యేసు మనకిట్లు చెప్పుచున్నాడు: “ఆత్మను చంపలేక శరీరమును చంపు వారికి భయపడకుడి; అయితే ఆత్మను దేహమునుకూడ గెహెన్నాలో నాశనముచేయగల వానికి భయపడుడి.” యెహోవాకు భయపడువాడు ఒకవేళ శత్రువులచే చంపబడినను, ఆ మరణ పాశములు కేవలము తాత్కాలికమే. (హోషేయ 13:14) పునరుత్థానము చేయబడుటతోనే, అతడు ఇట్లు చెప్పగల్గును: “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”—1 కొరింథీయులు 15:55.
16. యేసు ఎట్లు యెహోవాయెడల భయము చూపి, ఆయనను మహిమపరచెను?
16 యెహోవా నీతిని ప్రేమించుచు, దుర్నీతిని ద్వేషించు వారందరికి యేసు తానుగా ఉత్తమమైన మాదిరినుంచుచున్నాడు. యెహోవాయందలి ఆయన భయము శిష్యులకు ఆయన చెప్పిన చివరి మాటలలో ప్రతిబింబించును, వాటిని మనము యోహాను 16:33లో కనుగొందుము: “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.” యోహాను వృత్తాంతము ఇంకను చెప్పునదేమనగా: “యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను—తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. . . . లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని.”—యోహాను 17:1-6.
యెహోవాకు భయపడి, ఆయనను స్తుతించుము
17. యేసు మాదిరిని మనమే విధములుగా అనుకరించగలము?
17 ధైర్యవంతమైన యేసు మాదిరిని ఈనాడు మనము అనుకరించగలమా? యెహోవాయందలి భయముతో నిశ్చయముగా మనమట్లు చేయగలము. యెహోవా ప్రసిద్ధనామమును, లక్షణములను యేసు మనకు తెలియజేసెను. మన సార్వభౌమాధిపతిగా యెహోవాకు భయపడు మనము, నామరహిత క్రీస్తుమత సామ్రాజ్యపు మర్మమయ త్రిత్వముతోసహా, ఇతర దేవతలందరికంటే పైగా ఆయనను హెచ్చింతుము. మృతతుల్యమైన నరుని భయపు ఉరిలో చిక్కుకొనుటకు బదులు, యేసు ఆరోగ్యదాయక భయముతో యెహోవాను సేవించెను. “శరీరధారియై యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.” యేసు వలెనే మనముకూడ, బాధపడు సంగతులనుండి విధేయతను నేర్చుకొనుటకు మనము కొనసాగుచుండగా, యెహోవాకు భయపడుదము గాక.—హెబ్రీయులు 5:7-9.
18. దైవభయముతో మనమెట్లు దేవునికి పవిత్రసేవ చేయవచ్చును?
18 ఆ తర్వాత హెబ్రీ క్రైస్తవులకు వ్రాసిన తన లేఖలో, అభిషక్తులైన క్రైస్తవులకు పౌలు ఇట్లు ఉద్భోదిస్తున్నాడు: “మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము.” ఈనాడు, “గొప్ప సమూహము” ఆ పవిత్రసేవలో భాగము వహించుచున్నది. కాగా దానిలో ఏమి ఇమిడియున్నది? తన కుమారుడైన యేసుక్రీస్తు బలిని దయచేయుటలో యెహోవా చూపిన కృపను చర్చించిన తర్వాత పౌలు ఇట్లనుచున్నాడు: “ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వఫలము అర్పించుదము.” (హెబ్రీయులు 12:28; 13:12, 15) యెహోవా కృపయెడల మనకున్న మెప్పునందు, మనము సాధ్యమైన ప్రతి గడియ ఆయన పవిత్ర సేవకు వినియోగించుటకు కోరుకొనవలెను. మిగిలియున్న అభిషక్త క్రైస్తవుల నమ్మకమైన సహవాసులుగా, గొప్పసమూహము ఈనాడు ఆ సేవలో అధిక భాగమును నెరవేర్చుచున్నది. దేవుని సింహాసనము యెదుట సూచనార్థకముగా నిలువబడి వారు, “రాత్రింబగళ్లు . . . ఆయన పవిత్ర సేవచేయుచు” తమకు రక్షణ దేవునివలన మరియు క్రీస్తువలన కలిగెనని చెప్పుదురు.—ప్రకటన 7:9, 10, 15 NW.
యుగయుగములు యెహోవాను మహిమపరచుము
19, 20. “యెహోవా దినమందు” ఏ రెండు విధములైన భయము స్పష్టమగును?
19 యెహోవాను మహిమపరచు ఆ మహిమగల దినము వేగముగా సమీపించుచున్నది! “నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, . . . రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” ఆ విపత్కర కాలము, “యెహోవా నియమించిన భయంకరమైన . . . మహాదినమై” యుండును. (మలాకీ 4:1, 5) అది దుష్టుల హృదయములలో “భీతి” పుట్టింపగా, “వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.”—యిర్మీయా 8:15; 1 థెస్సలొనీకయులు 5:3.
20 అయితే యెహోవా ప్రజలు, మరొక విధమైన భయముచే ప్రేరేపింపబడుదురు. “నిత్యసువార్త” అప్పగింపబడిన దేవదూత పెద్దశబ్దముతో వారిని పిలుచుచు, ఇట్లనెను: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను.” (ప్రకటన 14:6, 7) హార్‌మెగిద్దోనుయొక్క అమితమైన వేడి సాతాను లోకమును దహించివేయుచుండగా భక్తిపూర్వకమైన భయముతో నిలువబడి మనము ఆ తీర్పును చూచెదము. యెహోవాయందలి ఆరోగ్యదాయకమైన భయము మన హృదయములలో చెరగని ముద్రగా ముద్రింపబడియుండును. కాబట్టి ‘యెహోవా నామమున ప్రార్థనచేసి రక్షింపబడినవారి’ మధ్య మనకూ ఒక స్థానము అనుగ్రహింపబడును గాక!—యోవేలు 2:31, 32; రోమీయులు 10:13.
21. యెహోవాయందలి భయము ఎటువంటి ఆశీర్వాదములకు నడుపును?
21 దాని తర్వాత, శాశ్వతముగా అంతకంతకు “జీవించు సంవత్సరములు అధికమగుటతో” సహా, అనేక అద్భుతమైన ఆశీర్వాదములు కలుగును. (సామెతలు 9:11; కీర్తన 37:9-11, 29) కాబట్టి, మన నిరీక్షణ రాజ్యమును స్వతంత్రించు కొనుటయైనను లేక దాని భూప్రాంతములో సేవచేయుటయైనను, దైవిక భయముతో, భక్తిపూర్వకమైన భీతితో దేవునికి పవిత్రసేవ చేయుటలో మనమిప్పుడు కొనసాగుదము గాక. ఎడతెగక మనమాయన పరిశుద్ధ నామమును మహిమపరచుదుము గాక. మరిదాని ఆశీర్వాదకర ఫలితమేమి? అన్నిసమయములలో యెహోవాకు భయపడుము అను జ్ఞానయుక్తమైన సలహాను మన హృదయమునకు తీసికొనిన శాశ్వతకాల కృతజ్ఞత! (w92 1/1)
మీరెట్లు జవాబిత్తురు?
◻ “యెహోవాయందలి భయము” అనగానేమి?
◻ దేవుని భయము ఆయన ప్రాచీన ప్రజలకెట్లు ప్రయోజనమిచ్చెను?
◻ దైవిక భయముయొక్క ఏ మాదిరిని యేసు మనకొరకు ఉంచెను?
◻ యెహోవా భయమందు మనమెట్లు యథార్థతను కాపాడుకొనవచ్చును?
[16వ పేజీలోని చిత్రాలు]
ప్రకటన గ్రంథములో, యేసు సహోదరులు యెహోవాకు స్తుతిగీతమును, అనగా “మోషే కీర్తన” పాడుచున్నట్లు కనబడెను
[18వ పేజీలోని చిత్రాలు]
యెహోవాయందలి భయముతో యెహోషాపాతు సైన్యము విజయమునొందెను
[20వ పేజీలోని బాక్సు]
యెహోవాకు భయపడువారికి శాశ్వతముగా అంతకంతకు జీవించు సంవత్సరములు అధికము చేయబడు బహుమతి లభించును