యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనేందుకు నేర్చుకోవడం
“పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.”—కీర్తన 34:11.
1. దేవుని రాజ్యం భయాన్ని ఎలా తీసివేస్తుంది, అయితే దానిలో అన్ని విధాలైన భయాలూ ఉన్నాయా?
అన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయం, అంటే నేర దౌర్జన్యాల భయం, నిరుద్యోగ భయం, తీవ్ర అస్వస్థతా భయం నుండి స్వాతంత్ర్యం కావాలని ఎంతగానో కోరుకుంటారు. ఆ స్వాతంత్ర్యం దేవుని రాజ్యంలో వాస్తవిక రూపాన్ని దాల్చినప్పుడు ఆ రోజు ఎంత గొప్పగా ఉంటుందో కదా! (యెషయా 33:24; 65:21-23; మీకా 4:4) అయినప్పటికీ, అప్పుడు అన్ని విధాల భయాలూ తీసివేయబడవు, లేక ఇప్పుడు మన జీవితాలనుండి అన్ని విధాల భయాలనూ మనం ప్రక్కకు నెట్టే ప్రయత్నం చేయకూడదు. మంచిదైన భయమూ ఉంది, చెడ్డదైన భయమూ ఉంది.
2. (ఎ) ఎలాంటి భయం మంచిదికాదు, మరి ఎలాంటిది కోరదగినది? (బి) దైవ భయం అంటే ఏమిటి, మరి సూచించబడిన లేఖనాలు దాన్ని ఎలా సూచిస్తున్నాయి?
2 భయం, ఒక వ్యక్తి ఆలోచనా శక్తిని నష్టపర్చే ఒక మానసిక విషం కావచ్చు. అది ధైర్యాన్ని అణచివేసి నిరీక్షణను నాశనం చేయగలదు. శత్రువు తనకు శారీరకంగా హాని కల్గజేస్తానని భయపెట్టినప్పుడు ఒక వ్యక్తి అలాంటి భయాన్ని అనుభవించగలడు. (యిర్మీయా 51:30) అధికారం గల కొందరు వ్యక్తుల అంగీకారానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే వ్యక్తి దాన్ని అనుభవిస్తాడు. (సామెతలు 29:25) అయితే ప్రయోజనకరమైన భయము కూడా ఉంది, మనకు మనం హాని చేసుకునేలా దేన్నీ మనం అజాగ్రత్తగా చేయకుండా అది నివారిస్తుంది. దైవ భయంలో అంతకంటే ఎక్కువే ఉంది. అది యెహోవా యెడల పూజ్యభావం, అపారమైన భయభక్తులతో చేరినదైన ఆయనను అప్రీతిపరుస్తామేమోననే ప్రయోజనకరమైన భయం. (కీర్తన 89:7) దేవున్ని అప్రీతిపరుస్తామేమోననే ఈ భయం ఆయన కృప మరియు మంచితనాల యెడలగల మెప్పుదలనుండి చిగురిస్తుంది. (కీర్తన 5:7; హోషేయ 3:5) తనకు అవిధేయులైన వారికి దేవుడు శిక్ష విధించగలడని, మరణాన్ని సహితం విధించగల శక్తి గల యెహోవా ఉన్నత న్యాయాధిపతియని, సర్వశక్తిమంతుడని తెలుసుకుని ఉండడం కూడా ఇమిడి ఉంది.—రోమీయులు 14:10-12.
3. యెహోవా యెడల భయం, కొన్ని అన్యమత దేవతలకు సంబంధించిన దానికి ఎలా విరుద్ధంగా ఉంది?
3 దైవ భయం ప్రయోజనకరమైనది, అది హానికరమైంది కాదు. ఒకరు చెడుచేయడం ద్వారా రాజీపడకుండా, సరైనదాని కొరకు దృఢంగా ఉండేటట్లు అది ప్రేరేపిస్తుంది. అది, తీవ్రమైన భయాన్ని కలిగించే దుష్ట దేవునిగా వర్ణించబడే ఫోబొస్ అనే గ్రీకు దేవుని యెడల కనపర్చే భయం వంటిది కాదు. మరి, శవాలూ పాములూ మరియు కపాలాలు తన ఆభరణాలుగా వేసుకుని రక్తపిపాసన గల దేవతగా కొన్నిసార్లు చిత్రించబడే హిందూ దేవతైన కాళికకు సంబంధించిన భయం వంటిది కాదు. దైవ భయం ఆకర్షిస్తుంది; అది తిరగగొట్టేదికాదు. అది ప్రేమ మెప్పుదలలతో ముడివడివుంటుంది. ఆ విధంగా, దైవ భయం మనలను యెహోవా తట్టుకు తెస్తుంది.—ద్వితీయోపదేశకాండము 10:12, 13; కీర్తన 2:11.
ఎందుకది కొందరికి ఉంది, మరి కొందరికి లేదు
4. అపొస్తలుడైన పౌలు చూపించినట్లుగా, మానవజాతి ఏ పరిస్థితికి వచ్చింది, మరి దీనికి ఏది కారణం?
4 మానవజాతి అంతా కూడా దైవ భయమనే లక్షణంవల్ల ప్రేరేపితం కావడంలేదు. రోమీయులు 3:9-18 నందు అసలు పరిపూర్ణతనుండి మానవులు ఎంతగా పడిపోయారో అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. అందరూ పాపంలో ఉన్నారని చెప్పిన తర్వాత, పౌలు కీర్తనల నుండి ఎత్తిరాస్తూ ఇలా అన్నాడు: “నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.” (కీర్తన 14:1 చూడండి.) ఆ తర్వాత, దేవుని వెదకడంలో మానవజాతి అలక్ష్యం, వారి నిర్దయ, వారి మోసకరమైన మాటలు, శపించడం, రక్తం చిందించడం వంటి వాటిని సూచించడం ద్వారా ఆయన వివరాలను అందిస్తున్నాడు. అది నేటి లోకాన్ని ఎంత సరిగ్గా వర్ణిస్తోందో కదా! అనేకమంది ప్రజలకు దేవుని యందుగానీ ఆయన సంకల్పాలయందుగానీ ఏ ఆసక్తీ లేదు. ఏదొక లాభముంటుందని అనుకున్న సందర్భాల్లో మాత్రమే కనికరం తరచూ చూపించబడుతుంది. అబద్ధమాడడం మరియు బూతులు సామాన్యమే. రక్తపాతం వార్తల్లోనే కాదు వినోదాల్లో కూడా చూపించబడుతోంది. అలాంటి పరిస్థితికి కారణమేమిటి? మనం పాపియైన ఆదాము వారసులమే అయితే, అపొస్తలుడైన పౌలు వివరించిన విషయాలను ప్రజలు తమ జీవిత విధానంగా చేసుకున్నప్పుడు అది ఒక్కటే కారణం కాదు. పద్దెనిమిదవ వచనం అదేమిటో వివరిస్తూ ఇలా చెబుతోంది: “వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.”—కీర్తన 36:1 చూడండి.
5. ఎందుకు కొందరికి దైవ భయముంది, మరికొందరికి లేదు?
5 అయితే, కొందరికి దైవ భయం ఎందుకుంది, మరికొందరికి ఎందుకు లేదు? ఒక్క మాటలో చెప్పాలంటే, కొందరు ప్రజలు దాన్ని అలవర్చుకుంటారు, మరికొందరు అలవర్చుకోరు. మనలో ఎవరమూ దానితో జన్మించలేదు, కానీ అందరికి దాన్ని కల్గివుండే సామర్థ్యం ఉంది. దైవభయమన్నది మనం నేర్చుకోవల్సిన విషయం. కాబట్టి, అది మన జీవితంలో బలమైన ప్రేరణా శక్తిగా ఉండాలంటే మనం దాన్ని అలవర్చుకోవాలి.
ఆకర్షణీయమైన ఆహ్వానం
6. కీర్తన 34:11 నందు రాయబడిన ఆహ్వానాన్ని మనకు ఎవరు అందిస్తున్నారు, మరి దైవ భయాన్ని నేర్చుకోవాలని ఈ వచనం ఎలా చూపుతోంది?
6 యెహోవా భయాన్ని నేర్చుకోవాలనే ఆకర్షణీయమైన ఆహ్వానం కీర్తన 34 నందు మనకు ఇవ్వబడుతోంది. ఇది దావీదు కీర్తన. మరి దావీదు ఎవరిని సూచిస్తున్నాడు? ఎవరినోకాదు ప్రభువైన యేసుక్రీస్తునే. అపొస్తలుడైన యోహాను యేసుకు ప్రత్యేకంగా అన్వయించిన ప్రవచనం ఈ కీర్తనలోని 20వ వచనంలో ఉంది. (యోహాను 19:36) మన కాలంలో, 11వ వచనమందున్నటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నది యేసే: “పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.” దైవ భయమన్నది నేర్చుకోగల్గేదేనని ఇది స్పష్టంగా కనపరుస్తోంది, మరి మనకు నేర్పించేందుకు యేసుక్రీస్తు అత్యుత్తమ అర్హతగలవాడు. ఎందుకు?
7. దైవ భయమును నేర్చుకోగల వారిలో యేసు ఎందుకు ప్రత్యేకమైనవాడు?
7 యేసుక్రీస్తుకు దైవ భయపు ప్రాముఖ్యత తెలుసు. హెబ్రీయులు 5:7 ఆయనకు గూర్చి ఇలా చెబుతోంది: “శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.” హింసాకొయ్యపై మరణాన్ని ఎదుర్కొనకముందే యేసు అలాంటి దైవ భయమనే లక్షణాన్ని కనపర్చాడు. జ్ఞాపకముంచుకోండి, సామెతలు 8వ అధ్యాయంలో దేవుని కుమారుడు జ్ఞానానికి మూర్తిమంతునిగా వర్ణించబడ్డాడు. మరియు సామెతలు 9:10 నందు మనకిలా చెప్పడం జరిగింది: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.” కనుక ఈ దైవ భయము, దేవుని కుమారుడు భూమ్మీదికి రాకమునుపు ఆయన వ్యక్తిత్వంలో ప్రాముఖ్యమైన భాగంగా ఉండేది.
8. యెషయా 11:2, 3 నందు యెహోవాను గూర్చిన భయం నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
8 అంతేకాకుండ, యేసు రాజైన మెస్సీయా అవ్వడాన్ని గూర్చి యెషయా 11:2, 3 ఇలా పేర్కొంటోంది: “యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.” అది ఎంత అద్భుతంగా వ్యక్తపర్చబడింది! యెహోవా భయం అప్రీతికరమైంది కాదు. అది ప్రయోజనకరమైంది, నిర్మాణాత్మకమైంది. అది, క్రీస్తు రాజుగా పరిపాలించే ప్రాంతమంతటిలోనూ వర్ధిల్లే లక్షణము. ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నాడు, మరి ఆయన ప్రజలుగా సమకూర్చబడినవారందరికి ఆయన యెహోవా భయమందు బోధిస్తున్నాడు. ఎలా?
9. యేసుక్రీస్తు మనకు యెహోవా భయమును ఎలా నేర్పిస్తున్నాడు, మరి మనం దాన్ని గూర్చి ఏమి నేర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు?
9 యేసు, నియమిత సంఘానికి శిరస్సుగా నియమించబడిన వానిగా మరియు రాజైన మెస్సీయాగా, మన సంఘ కూటాలు, సభలూ మరియు సమావేశాల ద్వారా దైవ భయం అంటే ఏమిటి మరియు అది ఎందుకు ప్రయోజనకరం అనే విషయాలను స్పష్టంగా అర్థం చేసుకునేందుకు మనకు సహాయపడుతున్నాడు. ఆ విధంగా, తనవలెనే యెహోవా భయమందు ఆనందం కనుగొనునట్లు మనం నేర్చుకొనులాగున, దాని యెడల మనమెప్పును మరింత అధికం చేయడానికి ఆయన కృషిచేస్తున్నాడు.
మీరు కృషిసల్పుతారా?
10. క్రైస్తవ కూటాలకు హాజరయ్యేటప్పుడు, యెహోవా భయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి?
10 నిస్సందేహంగా, మనం కేవలం బైబిలును చదవటం, రాజ్యమందిరంలో కూటాలకు హాజరుకావడం, మనకు దైవ భయం ఉందనే నిశ్చయతను ఇవ్వడంలేదు. యెహోవా భయం ఏమిటో మనం నిజంగా అర్థం చేసుకునేందుకు మనం ఏమి చేయాలో గమనించండి. సామెతలు 2:1-5 ఇలా చెబుతోంది: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు. దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.” కనుక కూటాలకు హాజరయ్యేటప్పుడు, చెప్పే విషయాలపై మనం శ్రద్ధను నిలపాలి, కీలకమైన తలంపులపై ఏకాగ్రతను నిలిపేందుకు మరియు వాటిని జ్ఞాపకముంచుకునేందుకు యథార్థమైన కృషిచేయాలి, అలాగే మనం యెహోవాను గూర్చి ఎలా భావిస్తున్నామన్నది ఇవ్వబడిన సలహా యెడల మన దృక్పథంపై ఎలా ప్రభావం చూపగలదో దీర్ఘంగా ఆలోచించాలి—అవును, మన హృదయాలను తెరవాలి. అప్పుడు మనం యెహోవా భయాన్ని అర్థం చేసుకుంటాము.
11. దైవ భయమును మనం అలవర్చుకోవాలంటే, యథార్థంగానూ తరచూగానూ మనం ఏమి చేయాలి?
11 ప్రార్థన విషయంలోని మరో ప్రాముఖ్యమైన విషయానికి కీర్తన 86:11 మన అవధానాన్ని ఆకర్షిస్తోంది. “యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము,” అని కీర్తనల గ్రంథకర్త ప్రార్థించాడు. ఆ ప్రార్థనను యెహోవా అంగీకరించాడు, ఎందుకంటే ఆయన దాన్ని బైబిల్లో నమోదు చేయించాడు. దైవ భయాన్ని అలవర్చుకునేందుకు, ఆయన సహాయం కొరకు మనం యెహోవాకు ప్రార్థించాలి, మరియు యథార్థంగానూ తరచుగానూ ప్రార్థించడం నుండి మనం ప్రయోజనం పొందుతాం.—లూకా 18:1-8.
మీ హృదయం అందులో చేరివుంది
12. హృదయానికి ప్రత్యేకమైన శ్రద్ధను ఎందుకివ్వాలి, మరి దానిలో ఏమి ఇమిడివుంది?
12 కీర్తన 86:11 నందు మనం గమనించాల్సిన మరొక విషయం ఉంది. దేవుని భయాన్ని గూర్చిన మనో అవగాహనను మాత్రమే కీర్తనల గ్రంథకర్త అడుగుటలేదు. ఆయన తన హృదయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దైవ భయమును అలవర్చుకోవడంలో సూచనార్థకమైన హృదయం ఇమిడివుంది, దానికి ప్రత్యేకమైన అవధానం అవసరం ఎందుకంటే, అది మన జీవన క్రియలన్నింటిలోనూ కనబడే మన అంతరంగ వ్యక్తే మరియు దానిలో మన ఆలోచనలూ, మన కోరికలూ, మన ఉద్దేశాలూ, మన గమ్యాలు చేరివుంటాయి.
13. (ఎ) ఒక వ్యక్తి హృదయం విభాగించబడిందని ఏది సూచించవచ్చు? (బి) దైవ భయమును మనం అలవర్చుకుంటుండగా, ఏ గమ్యాన్ని చేరుకునేందుకు మనం పనిచేయాలి?
13 ఒక వ్యక్తి హృదయం విభజించబడగలదని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. అది మోసకరమైందిగా ఉండవచ్చు. (కీర్తన 12:2; యిర్మీయా 17:9) అది మనం ప్రయోజనకరమైన కార్యాల్లో పాల్గొనేందుకు మనలను కదిలించగలదు—సంఘ కూటాలకు హాజరు కావడం మరియు ప్రాంతీయసేవకు వెళ్లడం—అయితే లోక జీవిత విధానంలోని కొన్ని విషయాలను కూడా అది ఇష్టపడవచ్చు. ఇది రాజ్యాసక్తులను మనం నిజంగా పూర్ణాత్మతో చేయకుండా మనలను వెనక్కిలాగవచ్చు. అప్పుడు, మనం కూడా ఇతరులు చేసినంతా చేస్తున్నాంలే అని అనుకునేట్లుగా, మోసకరమైన మన హృదయం మనలను ఒప్పింపజేసేందుకు ప్రయత్నిస్తుంది. లేక, బహుశ పాఠశాలలో గానీ లేక మనం పనిచేసే స్థలంలో గానీ మన హృదయం మనుష్య భయంతో ప్రభావితం కాగలదు. తత్ఫలితంగా, అలాంటి పరిస్థితుల్లో మనలను మనం యెహోవాసాక్షులుగా గుర్తించేందుకు వెనుకంజవేయగలం మరియు క్రైస్తవులకు తగని పనులను కూడా మనం చేయగలం. అయితే తర్వాత, మన మనస్సాక్షి మనలను పీడిస్తుంది. మనం అలాంటి వ్యక్తులుగా ఉండేందుకు ఇష్టపడం. కనుక, కీర్తనల గ్రంథకర్తతో మనం యెహోవాకు ఇలా ప్రార్థిద్దాము: “నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.” మన జీవన క్రియలన్నింటిలో కనబడేటట్లు మన పూర్తి అంతరంగ పురుషుడు, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచు”చున్నామనేందుకు నిదర్శనమివ్వాలి.—ప్రసంగి 12:13.
14, 15. (ఎ) బబులోను చెరనుండి ఇశ్రాయేలును విడిపించడం గూర్చి ప్రవచించినప్పుడు తన ప్రజలకు ఏమి ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు? (బి) తన ప్రజల హృదయాల్లో దైవ భయాన్ని నాటే దృష్టితో యెహోవా ఏమి చేశాడు? (సి) యెహోవా మార్గాలనుండి ఇశ్రాయేలు ఎందుకు వైదొలగింది?
14 యెహోవా అలాంటి దైవ భయం గల హృదయాన్ని తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఇశ్రాయేలు పునరుద్ధరణను గూర్చి ముందే చెప్పి, యిర్మీయా 32:37, 39నందు మనం చదువునట్లుగా ఇలా అన్నాడు: “ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలై యుందురు నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.” నలభైయ్యవ వచనంలో దేవుని వాగ్దానం మరింత దృఢపర్చబడింది: “వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.” సా.శ.పూ. 537 నందు, యెహోవా వాగ్దానం చేసినట్లుగానే వారిని యెరూషలేముకు తిరిగి తీసుకువచ్చాడు. అయితే మిగిలిన వాగ్దానమైన, ‘ఆయనకు ఎల్లప్పుడు భయపడేందుకు ఏక హృదయమును’ ఇస్తానన్న దాని విషయమేమిటి? ప్రాచీన ఇశ్రాయేలు జనాంగాన్ని బబులోనునుండి బైటికి తీసుకు వచ్చిన తర్వాత, వారి ఆలయం సా.శ. 70లో నాశనం చేయబడి మరెన్నడూ తిరిగి నిర్మించబడకుండా అయ్యేంతగా అది ఎందుకు యెహోవానుండి వైదొలగింది?
15 దానికి కారణం యెహోవా విఫలమవ్వడం కాదు. వాస్తవానికి, దైవ భయాన్ని తన ప్రజల హృదయాల్లో పెట్టేందుకు యెహోవా చర్యలను చేపట్టాడు. బబులోను నుండి వారిని విడిపించడం, వారిని తమ మాతృ భూమికి తీసుకురావడం వల్ల ఆయన చూపిన కనికరం ద్వారా, తనను పూర్తి పూజ్యభావంతో దృష్టించాలనేందుకు ఎన్నో రుజువులను అందించాడు. ప్రవక్తలైన హగ్గయి, జెకర్యా, మలాకీల ద్వారా; వారికి ఒక బోధకునిగా పంపించబడిన ఎజ్రా ద్వారా; అధిపతియైన నెహమ్యా ద్వారా; మరియు దేవుని స్వంత కుమారుని ద్వారా జ్ఞాపికలూ, సలహాలూ, గద్దింపులతో వీటన్నింటినీ దేవుడు పునరుద్ధరించాడు. కొన్ని సార్లు ప్రజలు విన్నారు. హగ్గయి మరియు జెకర్యా యెహోవా ఆలయాన్ని పునర్మించమని ఉద్బోధించినప్పుడు మరియు ఎజ్రా కాలంలో తమ అన్యమత భార్యలను పంపించివేసినప్పుడు వారు అలా చేశారు. (ఎజ్రా 5:1, 2; 10:1-4) మరి తరచూ వారు వినలేదు. శ్రద్ధ నిలిపే విషయంలో వారు ఏకరీతిలో లేరు; ఇవ్వబడిన సలహాలకు వారు ప్రతిస్పందించడంలో కొనసాగలేదు; వారు తమ హృదయాలను తెరచివుంచలేదు. ఇశ్రాయేలీయులు దైవ భయాన్ని అలవర్చుకోలేదు తత్ఫలితంగా, వారి జీవితాల్లో అది బలమైన ప్రేరణా శక్తి కాలేదు.—మలాకీ 1:6; మత్తయి 15:7, 8.
16. ఎవరి హృదయాల్లో యెహోవా దైవ భయం నాటాడు?
16 అయినప్పటికీ, తన ప్రజల హృదయాల్లో దైవ భయమును పెట్టాలన్న యెహోవా వాగ్దానం విఫలం కాలేదు. ఆత్మీయ ఇశ్రాయేలీయులతో అంటే పరలోక నిరీక్షణ ఇవ్వబడిన క్రైస్తవులతో ఆయన ఒక క్రొత్త నిబంధనను చేశాడు. (యిర్మీయా 31:33; గలతీయులు 6:16) మహా బబులోను, అనగా ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం చెరనుండి 1919లో వారిని విడిపించాడు. వారి హృదయంలో ఆయన తన భయాన్ని దృఢంగా నాటాడు. అది వారికినీ, రాజ్యపు భూ ప్రజలుగా జీవించే నిరీక్షణగలవారైన “గొప్ప సమూహము”నకునూ గొప్ప ఆశీర్వాదాలను తెచ్చింది. (యిర్మీయా 32:39; ప్రకటన 7:9) యెహోవా భయము వారి హృదయాల్లో కూడా నివాసమేర్పర్చుకుంది.
దైవ భయము మన హృదయాల్లో ఎలా నాటుకుంటుంది
17. యెహోవా దైవ భయాన్ని మన హృదయాల్లో ఎలా పెట్టాడు?
17 ఈ దైవ భయాన్ని మన హృదయాల్లో యెహోవా ఎలా నాటాడు? తన ఆత్మను పనిచేయించడం ద్వారా. మరి పరిశుద్ధాత్మ ఫలితంగా కల్గినదేది మనదగ్గిర ఉంది? దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు. (2 తిమోతి 3:16, 17) ఆయన గతంలో చేసిన దాని ద్వారా తన ప్రవచన వాక్య నెరవేర్పుగా తన సేవకులతో ఇప్పుడు వ్యవహరిస్తున్నదాని ద్వారా, మరియు రాబోవు విషయాలను గూర్చిన ప్రవచనాల ద్వారా దైవ భయమును వృద్ధి చేసుకునేందుకు మనకందరికీ యెహోవా మంచి ఆధారాన్ని అందిస్తున్నాడు.—యెహోషువ 24:2-15; హెబ్రీయులు 10:30, 31.
18, 19. సమావేశాలూ, సభలూ మరియు సంఘ కూటాలూ దైవ భయాన్ని పొందేందుకు మనకు ఎలా సహాయపడతాయి?
18 ద్వితీయోపదేశకాండము 4:10 నందు రాసివున్నట్లు, యెహోవా మోషేతో చెప్పినది గమనార్హం, ఆయన ఇలా అన్నాడు: “నా యొద్దకు ప్రజలను కూర్చుము; వారు ఆ దేశముమీద బ్రదుకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదను” అదే విధంగా నేడు, తన ప్రజలు తనకు భయపడడం నేర్చుకునేందుకు సహాయకరంగా యెహోవా ఎన్నో ఏర్పాట్లు చేశాడు. పెద్దపెద్ద సమావేశాలూ సభలూ మరియు సంఘ కూటాల్లో యెహోవా కృప ఆయన మంచితనపు రుజువులను మనం కనుగొంటాము. జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని మనం పఠించినప్పుడు మనం అదే చేశాము. ఆ పఠనం మిమ్మల్నీ, యెహోవా యెడల మీ దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేసింది? మన పరలోకపు తండ్రి గొప్ప వ్యక్తిత్వంలో వివిధ విషయాలు తన కుమారునిలో ప్రతిబించడాన్ని మీరు చూసినప్పుడు, ఎన్నడూ దేవున్ని అప్రీతిపర్చకూడదనే మీ కోరికను అది దృఢపర్చలేదా?—కొలొస్సయులు 1:15.
19 మన కూటాలందు, గతంలో తన ప్రజలను యెహోవా విడిపించిన వృత్తాంతాలను కూడా మనం పఠిస్తాము. (2 సమూయేలు 7:23) ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకం సహాయంతో బైబిలు పుస్తకమైన ప్రకటనను మనం పఠించినప్పుడు, ఇప్పటికే 20వ శతాబ్దంలో నెరవేరిన ప్రవచనార్థక దర్శనాలను గూర్చి మరియు ఇంకనూ కలుగబోయే భయోత్పాత సంఘటనలను గూర్చి మనం నేర్చుకుంటాము. అలాంటి దైవ క్రియలన్నింటిని గూర్చి, కీర్తన 66:5 ఇలా పేర్కొంటోంది: “దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.” అవును, సరిగ్గా చూస్తే, ఈ దైవ క్రియలు అపారమైన భక్తిశ్రద్ధను, యెహోవాను గూర్చిన భయాన్ని మనమనస్సుల్లో కలుగజేస్తుంది. ఆ విధంగా తన ఈ ప్రవచనాన్ని యెహోవా ఎలా నెరవేరుస్తాడో మనం చూడగలము: “వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.”—యిర్మీయా 32:40.
20. మన హృదయాల్లో దైవ భయం లోతుగా నాటుకునేందుకు, మన వంతుగా మనం ఏమి చేయాలి?
20 అయితే, మనం స్వయంగా ప్రయత్నించందే దైవ భయం మన హృదయంలోకి రాదన్నది స్పష్టం. ఫలితాలు యాంత్రికంగా రావు. యెహోవా తనవంతును తాను చేస్తాడు. దైవ భయాన్ని మనం అలవర్చుకోవడం ద్వారా మనం మన వంతును చేయాలి. (ద్వితీయోపదేశకాండము 5:29) సహజ ఇశ్రాయేలీయులు దాన్ని చేయడంలో విఫలమయ్యారు. అయితే యెహోవాపై ఆధారపడడం ద్వారా, ఆత్మీయ ఇశ్రాయేలీయులు మరియు వారి సహచరులు, దైవ భయంగలవారు అనుభవించే ప్రయోజనాల్లో ఎన్నింటినో ఇప్పటికే అనుభవిస్తున్నారు. తదుపరి శీర్షికలో ఈ ప్రయోజనాల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాము.
మీరెలా జవాబు చెబుతారు?
◻ దైవ భయం అంటే ఏమిటి?
◻ యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనే విషయంలో మనం ఎలా బోధించబడుతున్నాము?
◻ దైవ భయం కల్గివుండేందుకు, మనం ఏ ప్రయత్నం చేయవల్సి ఉంది?
◻ దైవ భయాన్ని సంపాదించడంలో మన సూచనార్థక హృదయాల్లోని అన్ని విషయాలు ఎందుకు ఇమిడివున్నాయి?
[12, 13వ పేజీలోని చిత్రాలు]
యెహోవా భయాన్ని గూర్చిన గ్రహింపును పొందేందుకు శ్రద్ధగా పఠించడం అవసరము