“ప్రతి శ్రేష్ఠమైన యీవియు” యిచ్చేవాడు
“ఒకానొక సందర్భంలో, రిఫార్మడ్ చర్చి మతగురువు నాదగ్గరకు వచ్చాడు అతనికి, నా చర్చీని నేను ఎలా నడపగలుగుతున్నానని తెల్సుకోవాలని వుంది. నేను అతనితో యిలా అన్నాను: . . . ‘మేము జీతాలు యివ్వం మనుష్యులు కొట్లాడుకునేలా చేసే పనేమీ లేదు. మేము ఎన్నడూ చందా సేకరించం.’ ‘మీకు డబ్బు ఎలా వస్తుంది?’ అని అతడు అడిగాడు. “నేను యిలా సమాధానమిచ్చాను, ‘యిప్పుడు, డా.——, అతి సూక్ష్మమైన సత్యాన్ని నేను మీకు చెబితే మీరు దాన్ని నమ్మలేరు. ప్రజలు ఈవిధమైన ఆసక్తిని చూపితే, తమ వద్దకు ఏ చందా పళ్లెం తేబడదు. అయితే ఖర్చులు ఉన్నాయని వారు గ్రహిస్తారు. తమలో తాము యిలా అనుకుంటారు, “ఈ హాలుకు ఎంతోకొంత వెల ఉంటుంది. . . . అందుకు కొరకు నేను కొంత డబ్బును ఎలా యివ్వగలను?”’ ‘అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు—పసివాడ్ననా?’ అని అనుకుంటున్నట్లు నావైపు చూశాడు. ‘యిప్పుడు, డా.——, మీకు నేను పచ్చి నిజం చెబుతున్నా. . . . ఒకనికి ఆశీర్వాదం లేక ఏ రకమైన వస్తుసంబంధ ఆధారం దొరికినా, దాన్ని ప్రభువు కొరకు ఉపయోగించాలని చూస్తాడు. అతనికి ఏ ఆధారమూలేకపోతే, దానికొరకు మనం అతన్నెందుకు బలవంతపెట్టాలి?’ అని నేనన్నాను.”
—చార్లస్ టి. రస్సల్, వాచ్‌టవర్ సొసైటి మొదటి ప్రెసిడెంటు, “ది వాచ్‌టవర్” జూలై 15, 1915.
మనం యిస్తాం, ఎందుకంటే యెహోవా దేవుడే మనకు ముందుగా యిచ్చాడు. ఇలా ఆయన యివ్వడం అనంత కాలంలో తన సృష్టితో—ఆయన మొట్టమొదటి సృష్టియైన “అద్వితీయ కుమారుని”తో ప్రారంభమైంది. (యోహాను 3:16) ప్రేమతో ఆయన యితరులకు జీవమనే బహుమానాన్ని యిచ్చాడు.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, మనకు దేవుని అమూల్య యీవిగా ఉన్నాడు. అయితే దేవుని కుమారునితోనే దేవుని యీవులు అంతం కావు. “దేవుడు కనుపరచిన అత్యధికమైన కృప” అని అపొస్తలుడైన పౌలు యెహోవా యొక్క “చెప్ప శక్యము కాని ఆయన వరమును” గూర్చి చెప్పాడు. (2 కొరింథీయులు 9:14, 15) ఈ యీవుల్లో, దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన ప్రజలకు అందించే మంచితనం, కృపావరాలన్నీ యిమిడివున్నాయి. ఆ కృపావరం, మానవుడు వివరించగల లేక వ్యక్తపర్చగల శక్తికి మించినంత అద్భుతమైంది. అయితే, దేవుడు యిచ్చేవాటిలో యితర విషయాలు కూడా ఉన్నాయి.
ఎంతో కాలంక్రితం, ఒక రాజు, తానిచ్చే మంచి కానుకలన్నీ అసలు యెహోవాకు చెందినవేనని వివేకయుక్తంగాను వినయంగాను ఒప్పుకున్నాడు. అతనిలా అన్నాడు: “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; . . . యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. . . . ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను? నాజనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా?”—1 దినవృత్తాంతములు 29:11-14.
దేవుని మాదిరి
అన్ని విధాల మంచిదైన ప్రతిదానికి యెహోవా దేవుడే ఆధారం యేసుక్రీస్తు శిష్యుడైన యాకోబుకు, అని తెలుసు. కేవలం పరిపూర్ణమైన యీవులే దేవుని నుండి వస్తాయి. యాకోబు యిలా రాశాడు: “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.”—యాకోబు 1:17.
ఈవులను యిచ్చే విషయంలో కూడా దేవుడు మానవులకంటే ఎంత భిన్నంగా ఉన్నాడో యాకోబు గ్రహించాడు. మానవులు మంచి యీవులను యివ్వగలరు అయితే అన్నిసార్లూ అలా చేయలేరు. ఈ యీవులు స్వార్థపూరిత దృక్పథంతో కూడినవి కావచ్చు, లేక ఒక మనిషిని చెడు కార్యాన్ని చేయడానికి నడిపేదే కావచ్చు. యెహోవా యందు ఏ తేడాలేదు; ఆయన మారడు. కనుక, ఆయన యిచ్చే యీవుల్లో కూడా మార్పుండదు. అవి ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాయి. అవి అన్ని వేళలా మానవజాతికి శ్రేయస్సునూ సంతోషాన్నీ తీసుకొస్తాయి. అవి ఎల్లప్పుడూ దయగా సహాయకరంగా ఉండి, ఎన్నడూ నాశనకరంగా ఉండవు.
కానుకలు యివ్వడానికి గల దృక్పథాలు
యాకోబు జీవించిన కాలంలోని పేరుగాంచిన మత నాయకులు, ప్రాముఖ్యంగా మనుష్యులు చూడాలనే కోరికతో కానుకలను యిచ్చే అలవాటు అలవర్చుకున్నారు. చెడు ఉద్దేశాలతో వారు వాటిని యిచ్చేవారు. మనుష్యుల మెప్పును పొందాలనే ఆతురతతో వారు తమ నీతియుక్త కట్టడలతో రాజీపడేవారు. అయితే క్రైస్తవులు మాత్రం వేరుగా ఉండాలి. యేసు వారికి యిలా సలహానిచ్చాడు: “కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధుల్లోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.”—మత్తయి 6:2-4.
ఒక క్రైస్తవుడు కానుకలను యివ్వవలసిన కారణం, యితరులు తమ అవసరతను తీర్చుకోడానికి లేక వారిని సంతోషపెట్టడానికి లేక సత్యారాధనను వ్యాప్తి చేయడానికై ఉండాలి. అది స్వయం ఘనత కొరకు చేసేది కాదు. ఏమైనప్పటికీ యెహోవా కళ్లు మన హృదయంలోని మారు మూల ప్రాంతానికి కూడా చొచ్చుకు పోగలవు. మనం దయతోకూడిన కానుకలు యిచ్చే దృక్పథాల అంతర్భావాన్ని కూడా ఆయన చూడగలడు.
కానుకలు యివ్వడంతో యెహోవాసాక్షులు, యెహోవానూ ఆయన కుమారుని మాదిరులను అనుసరించడానికి ప్రయత్నిస్తుంటారు. వారికేముందో అదే వారిస్తారు. వారి దగ్గర రాజ్యసువార్త ఉంది, అది యితరులకు ఆశీర్వాదాలను తెచ్చేలాగున వారు వాటిని అందించారు. సామెతలు 3:9 పేర్కొన్న విషయం వారికి తెలుసు: “నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.” ప్రతి బ్రాంచి కార్యాలయం, సంఘం, ప్రతి వ్యక్తీ, యితరులందరి క్షేమాభివృద్ధికై హృదయపూర్వకంగా యివ్వడానికి పాటుపడుతున్నారు కనుక, ప్రపంచవ్యాప్త సహోదరత్వం ఆత్మీయంగా బలపడుతోంది, వర్థిల్లుతోంది. వస్తుసంబంధ సమృద్ధి, ఆత్మీయ సమృద్ధికి నడపదు, అయితే ఆత్మీయ సమృద్ధి యెహోవా పనికి సరిపడేంత వస్తుసంబంధ సమృద్ధికి నడుపుతుంది.
పంచుకునే విధాలు
సువార్తకు మద్దతునివ్వడానికి ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా తోడ్పడే ఎన్నో విధానాలున్నాయి. ఒక మార్గం రాజ్య మందిరం యెడల గౌరవం. సంఘంలోని సభ్యులందరూ రాజ్య మందిరాన్ని వాడుకుంటారు. కొందరు వాటి నిర్మాణానికి, లేదా అద్దెకు తీసుకోవడానికి, లైటింగ్‌కు, ఎయిర్ కండిషన్‌కు, దాన్ని శుభ్రం చేయించడానికి కూడా చందాలను అందించారు. ప్రతి ఒక్కరూ సంఘానికి మద్దతు యివ్వాల్సిన అవసరముంది గనుక, రాజ్యమందిరంలో చందా పెట్టెలుంటాయి, అలా అందిన స్వచ్ఛంద విరాళాలు సంఘ ఖర్చులకు ఉపయోగించబడతాయి. ఖర్చులు పోగా మిగిలిన దాన్నుండి సంఘ నిర్ణయాన్ని బట్టి, స్థానిక వాచ్ టవర్ బ్రాంచికి చందాలు పంపవచ్చు.
సువార్త ప్రకటించబడని ప్రజలున్న ప్రాంతాలకు మిషనరీలను స్పెషల్ పయినీర్లను శిక్షణనిచ్చి పంపేదుకు వారికి మద్దతు నిచ్చేందుకు సొసైటి బ్రాంచికే చందాలను పంపవచ్చు. సువార్తను వ్యాపింపజేసే ఇతర ఖర్చులు ప్రయాణ కాపరికి సంబంధించినవి. మొదటి శతాబ్దంలో ప్రయాణ పనిలో మంచి మాదిరినుంచిన అపొస్తలుడైన పౌలు, ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకుంటూ యిలా రాశాడు: “మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.” (ఫిలిప్పీయులు 4:14-16) అన్ని బ్రాంచిలకున్న ఈ పూర్తికాల సేవా విషయాలకు సంబంధించిన ఖర్చులే కాకుండా, ప్రతి బేతేలు గృహ నిర్వహణం, అలాగే అక్కడ ఉండి పని చేసేవారి నిర్వహణం కూడా ఉంటుంది. సువార్త యొక్క ఎంతో రమ్యమైన సమాచారాలున్న సాహిత్యాలను వ్రాయడం వాటిని ముద్రించడం దేవుడిచ్చిన అధిక్యతే, మరి దానికి ఖర్చవుతుంది. ఇంకా సమావేశాలకూ సభలకూ, ‘సువార్త పక్షమున వాదించి స్థిరపరచుటకు’ తోడ్పడే కోర్టు కేసులను పోరాడడానికి ఖర్చులున్నాయి.—ఫిలిప్పీయులు 1:7.
సువార్తను ప్రకటించడానికి సమయాన్ని వ్యయపర్చే ప్రతి యెహోవా సేవకుని పని స్వచ్ఛందమే, అలాగే అతని వస్తుసంబంధమైన పని కూడ. క్రమంగా, నిజమైన ఆరాధనను వ్యాపింపజేయడానికి కావలసిన డబ్బును ప్రక్కన ఉంచేందుకు అపొస్తలుడైన పౌలు యిలా సలహానిస్తున్నాడు: “పరిశుద్ధులకొరకైన చందావిషయమైతే . . . ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్థిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.”—1 కొరింథీయులు 16:1, 2.
ఒక వ్యక్తి విరాళాలు యిచ్చినప్పుడు, అది ఎలా ఉపయోగించబడుతుందని అతనికి అన్ని సార్లూ తెలియదు, అయితే రాజ్య ప్రచార పనిలో వృద్ధిని అతను చూస్తాడు. రాజ్యసువార్త 200 దేశాల్లో, సముద్రంలోని ద్వీపాల్లో, 45,00,000 కంటె ఎక్కువ మంది క్రైస్తవ ప్రచారకులతో ప్రకటించబడుతోందని 1993 ఇయర్ బుక్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్ నివేదించింది. ఈ నివేదికలు ఊరటనిస్తాయి. ఏ కానుకైనా, అది ఎంత పరిమాణాన్ని గలదైనా ప్రపంచవ్యాప్త సువార్తను వ్యాపింపజేయడంలో అది తోడ్పడుతుంది.
అందరూ సమిష్టిగా యివ్వడంతో ఈ పనికి ఆర్థిక సహాయం లభిస్తుంది. కొందరు ఎక్కువ యివ్వగల్గుతున్నారు, అది ప్రకటించే పనిలో ఎక్కువగా సహాయపడుతుంది. ఇతరులు తక్కువ యిస్తారు. అయితే, తక్కువ విరాళాలు యిచ్చేవారు సిగ్గుపడనవసరం లేదు లేక వారు పాలుపంచుకునేది అంత ప్రాముఖ్యంకాదని అనుకోనవసరం లేదు. కచ్చితంగా యెహోవా ఆ విధంగా భావించడు. ఒక విధవరాలు వేసిన రెండు కాసులను యెహోవా ఎంత మెచ్చుకుంటున్నాడో చూపినప్పుడు యేసు దీన్ని చాలా చక్కగా స్పష్టీకరించాడు. “ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి—‘ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని’ వారితో చెప్పెను.”—లూకా 21:2-4.
మన ఆర్థిక పరిస్థితి ఏమైనప్పటికీ, యెహోవాను సంతోషపర్చే విధంగా మనం యివ్వగలం. మన రాజునూ న్యాయాధిపతియైన వానికి ఘనతనెలా యివ్వాలో కీర్తనల గ్రంథకర్త చక్కగా చెబుతున్నాడు. “యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన సన్నిధిని వణకుడి.” (కీర్తన 96:8) కాబట్టి, సంతోషంగా కానుకలను యిస్తూ మనం మన పరలోక తండ్రి ప్రేమపూర్వక మాదిరిని అనుకరించుదాం ఎందుకంటే ఆయనే ముందుగా మనకు యిచ్చాడు.
[30వ పేజీలోని బాక్సు]
రాజ్య ప్రచార సేవకు కొందరెలా విరాళాలిస్తారు
▫ ప్రపంచవ్యాప్త సేవకు చందాలిచ్చుట: “సొసైటియొక్క ప్రపంచవ్యాప్త సేవకొరకు చందాలు—మత్తయి 24:14” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీస్తారు లేదా తమ బడ్జెట్టులో దాన్ని చేరుస్తారు. ప్రతినెల ఈ మొత్తాలను సంఘాలు న్యూయార్క్ బ్రూక్లిన్‌లోని ప్రపంచ ముఖ్య కార్యాలయానికి గానీ, తమ దగ్గరలోని వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.
▫ బహుమతులు: స్వచ్ఛంద విరాళాలను సూటిగా Watch Tower Bible and Tract Society of India, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., లేదా ఈ పత్రిక ప్రకాశకులకు పంపించవచ్చును. ఆభరణాలు, ఇతర వెలగల నగలు సహితము విరాళముగా ఇవ్వవచ్చును. ఈ విరాళములతో పాటు అది పూర్తిగా ఒక విరాళమని తెలియజేసే ఒక క్లుప్త లేఖను కూడ పంపవలెను.
▫ షరతుపై విరాళమిచ్చు ఏర్పాటు: వ్యక్తిగత అవసరము కలిగినప్పుడు దాతకు ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటుతో, దాత మరణించు పర్యంతము వాచ్‌టవర్ సొసైటి ట్రస్టుకు డబ్బు ఇవ్వవచ్చును.
▫ భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథకము యొక్క లబ్దిదారుగా వాచ్‌టవర్ సొసైటి పేరును సూచించవచ్చును. అలాంటి ఏర్పాట్లనుగూర్చి సొసైటికి ముందుగానే తెలియపర్చాలి.
▫ బ్యాంకు ఖాతాలు: బ్యాంకు ఖాతాలను, డిపాజిట్ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలను స్థానిక బ్యాంకు నియమాలను అనుసరించి వాచ్‌టవర్ సొసైటి ట్రస్టు కొరకు లేదా మరణానంతరము వాటిని ఆ సొసైటికే చెల్లించు ఏర్పాటుచేయవచ్చును. అలాంటి ఏ యేర్పాటునైనను సొసైటికి తెలియజేయవలెను.
▫ స్టాక్స్ మరియు బాండ్లు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించు ఏర్పాటుతో స్టాక్స్ మరియు బాండ్లను వాచ్‌టవర్ సొసైటికి విరాళముగా ఇవ్వవచ్చును.
▫ ఇళ్లస్థలాలు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆమె లేదా అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో పూర్తిగా అమ్మదగిన ఇళ్లస్థలాలను వాచ్‌టవర్ సొసైటికి విరాళముగా ఇవ్వవచ్చును. ఇటువంటివాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకమునుపు సొసైటిని సంప్రదించాలి.
▫ వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధముగా Watch Tower Bible and Tract Society పేర వీలునామా వ్రాయవచ్చును, లేదా ఒక ట్రస్టు ఏర్పాటుయొక్క లబ్దిదారుగా సొసైటి పేరు వ్రాయవచ్చును. ఒక మత సంస్థకు లాభం సమకూర్చే ట్రస్టుకు పన్నులు చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలివ్వవచ్చును. వీలునామా లేదా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన ఒక కాపీని సొసైటికి పంపవలెను.
ఇటువంటి విషయాలలో మరింత సమాచారము కొరకు, Watch Tower Bible and Tract Society of India, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah. లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి.
[31వ పేజీలోని చిత్రాలు]
మీ విరాళాలు ఎలా ఉపయోగించబడుతున్నాయి:
1. బేతేలు స్వచ్ఛంద సేవకులు
2. బ్రాంచి కార్యాలయ నిర్మాణం
3. విపత్తుల సహాయకాలు
4. రాజ్యమందిరాలు
5. మిషనరీలు