కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 3/1 పేజీలు 3-5
  • మీరెలాంటి ప్రజలను ఎక్కువగా అభిమానిస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరెలాంటి ప్రజలను ఎక్కువగా అభిమానిస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సాధారణ కట్టుబాట్ల విలువ
  • ఇవి సరియైన కట్టడలేనా?
  • దేవుని అనుగ్రహం ఎవరికున్నది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • అదనపు విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • విద్య—యెహోవాను స్తుతించేందుకు దానిని వినియోగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 3/1 పేజీలు 3-5

మీరెలాంటి ప్రజలను ఎక్కువగా అభిమానిస్తారు?

“వధువు కావలెను. మంచి శరీరఛాయతో సన్నగావుండి కనీసం గ్రాడ్యుయేట్‌ అయివుండాలి, పోస్టు గ్రాడ్యుయేట్‌ అయితే మంచిది. మంచి ఆస్తి, ఉన్నత కుటుంబానికి చెంది, అదే కులమై ఉండాలి.”

ఇలాంటి వివాహ ప్రకటనను మీరు సాధారణంగా ఇండియాలోని వార్తా పత్రికలందు చూడవచ్చును. బహుశ, ఇలాంటి ప్రకటనలనే ప్రపంచమందలి అనేక ఇతర ప్రాంతాలలోను మీరు చూడగలరు. ఇండియాలో సాధారణంగా కాబోయే వరుని తలిదండ్రులు అలాంటి ప్రకటనలిస్తారు. వారికందే జవాబుతోపాటు మెరిసే ఎర్రచీర కట్టుకుని, ఒంటినిండా బంగారు నగలు పెట్టుకున్న అమ్మాయి ఫొటోకూడ ఉంటుంది. పిల్లవాని కుటుంబంవారు అంగీకరిస్తే, వివాహానికి సంబంధించిన మిగతా విషయాలు మాట్లాడుకోవడం ఆరంభమవుతాయి.

సాధారణ కట్టుబాట్ల విలువ

మంచి శరీరఛాయగల వధువు కొరకు అడగడం ఇండియాలో సర్వ సాధారణమైన విషయం. తక్కువ కులస్థులు నల్లగా ఉంటారనే హిందూ సమాజమందలి బలమైన నమ్మకమే దీనికిగల కారణం. ఇటీవలనే, ఇండియాలో ఒక టివి. కార్యక్రమంలో ఒకరు ఎర్రగా మరొకరు నల్లగావున్న ఇద్దరు అమ్మాయిలను గూర్చిన కథ ప్రసారం చేయబడింది. ఎర్రగావున్న అమ్మాయి కఠినురాలు, అమర్యాదస్థురాలు; అయితే నల్లగావున్న అమ్మాయి దయగలది, మృదువైనది. ఆశ్చర్యకరమైన రీతిలో వారిద్దిరిలో మార్పు సంభవించినప్పుడు, శిక్షగా ఎర్రగావున్న అమ్మాయి నల్లగాను, నల్లగావున్న అమ్మాయి వరప్రసాదంగా ఎర్రగాను మారిపోతారు. చివరకు మంచితనమే జయించినను, ఎరుపురంగు మాత్రం కోరదగిన వరమని ఆ కథ నీతి.

అటువంటి వర్ణభేదాలు ఒకడు గుర్తించిన దానికంటే తరచు ఎంతో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. ఉదాహరణకు, ఆసియా ఖండానికిచెందిన వ్యక్తి ఒకానొక పాశ్చాత్య దేశాన్ని సందర్శించి తన శరీరఛాయను బట్టి, కంటి తీరునుబట్టి తనను చెడ్డగా చూశారని ఫిర్యాదు చేయవచ్చును. అటువంటి చర్యలు అతన్ని కలవరపరచి, తనయెడల వివక్షత చూపబడెనని అతడు భావించునట్లు చేయవచ్చును. కాని తన స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు, వేరే జాతికి చెందిన వారిని అతడు అదేరీతిలో చూడవచ్చును. ఈనాడు కూడ వేరొక వ్యక్తి విలువను అనేకులు వేసే అంచనాలో శరీర రంగు, జాతిచరిత్ర ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

“ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును” అని ప్రాచీన కాలమందు రాజైన సొలొమోను వ్రాశాడు. (ప్రసంగి 10:19) అదెంత నిజం! ప్రజలు దృష్టింపబడే విధానాన్ని ధనం కూడ ప్రభావితం చేస్తుంది. ఆ ధనమెక్కడ నుండి వచ్చిందనే విషయాన్ని అంతగా ప్రశ్నించరు. కష్టపడి పనిచేయడంవల్ల లేదా జాగ్రత్తగా వాడడంవల్ల లేదా మోసంవల్ల ఆ వ్యక్తి ధనవంతుడయ్యాడా? అదే ఎవ్వరూ పట్టించుకోరు. మోసంచేత సంపాదించిననూ, లేక అలాకాకపోయినను, ధనవంతుల అభిమానం సంపాదించుటకు ప్రయత్నించేటట్లు ధనం అనేకమందిని నడిపింది.

పోటీ నిండిన ఈ లోకంలో ఉన్నతవిద్య కూడ బహు ఉన్నతంగా ఎంచబడుతుంది. పిల్లవాడు జన్మించిన వెంటనే, తలిదండ్రులు అతని విద్యకొరకు పెద్దయెత్తున ధనం కూడబెట్టుటకు వత్తిడి చేయబడుచున్నారు. ఆ పిల్లవాడు రెండు, మూడేండ్ల వాడయ్యేప్పటికి, విశ్వవిద్యాలయంలో డిగ్రీ సంపాదించే సుదీర్ఘ ప్రయాణానికి తొలిమెట్టుగా అతన్ని సరైన నర్సరీ పాఠశాలలో లేదా కిండర్‌గార్టెన్‌లో చేర్చడానికి వారు చాలా ఇబ్బంది పడతారు. ప్రతిష్ఠాకరమైన డిప్లొమాతోపాటు ఇతరుల అభిమానం గౌరవం పొందే హక్కు వస్తుందని కొందరు ఆలోచిస్తున్నట్లు కన్పడుతున్నది.

అవును, వేరొక వ్యక్తిని గూర్చి చెప్పడానికి లేదా ముందే నిర్ణయించడానికి అనేకమంది ప్రజలకు శరీరఛాయ, విద్య, ధనం, జాతిచరిత్ర వంటివి ప్రమాణాలుగా తయారయ్యాయి. తామెవరిని అభిమానించాలి, ఎవరిని అభిమానించ కూడదో ఈ విషయాలే తీర్మానిస్తాయి. మరి నీ విషయమేమి? నీ వెవరిని అభిమానిస్తావు? ఎర్రని శరీరఛాయ లేదా ఉన్నత విద్య, ధనంవున్న వారెక్కువ అభిమానింపబడాలని, గౌరవింపబడాలని నీవనుకుంటావా? అట్లయిన, నీ భావాలకు ఆధారమేమిటో దాన్ని గూర్చి నీవు గంభీరముగా ఆలోచించాల్సిన అవసరమున్నది?

ఇవి సరియైన కట్టడలేనా?

హిందూ వరల్డ్‌ అనే గ్రంథం యిలా వ్రాసింది: “బ్రాహ్మణున్ని చంపిన ఏ తక్కువ కులస్థుడైనను చిత్రహింసలతో చంపబడి, అతని ఆస్తి స్వాధీనం చేసుకోబడేది, ఆలాగే అతడి ఆత్మ నిత్యమూ నరకములో బాధింపబడేది. అయితే బ్రాహ్మణుడు ఎవరినైనా చంపితే అతడికి కేవలం కొంత జుల్మానా వేయబడేది, అంతేగాని అతడికి మరణశిక్ష విధింపబడేది కాదు.” ఆ గ్రంథము ప్రాచీన కాలాలను గూర్చి మాట్లాడుతున్నను, మరి నేటి విషయమేమి? జాతి దురభిమానము, మతోన్మాదము ఈ 20వ శతాబ్దంలో రక్తపుటేరులు ప్రవహించడానికి కారణమయ్యాయి. ఇది కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణాఫ్రికాలోని జాతివివక్షత, అమెరికాలోని వర్ణ వైషమ్యం, బాల్టిక్‌ దేశాల ప్రజల జాతీయ దురభిమానం—ఇలాంటివాటి పట్టిక యింకా చాలావుంది—వాటిద్వారా కొనసాగిన హింస, ద్వేషం వారిదే శ్రేష్ఠమైనదనే అంతరంగ భావాల కారణంగానే జరిగాయి. నిశ్చయంగా, తెగనుబట్టి, జాతినిబట్టి ఒకర్ని కాదని వేరొక వ్యక్తిని అలా అభిమానించడం మేలైన, సమాధానకరమైన ఫలాలను ఫలించలేదు.

ధనం విషయమేమి? నిస్సందేహంగా, అనేకమంది నమ్మకంగా కష్టించి పనిచేసి ధనవంతులయ్యారు. అయితే, చీకటి ప్రపంచ నేరస్తులు, నల్లబజారు, మాదకద్రవ్య వ్యాపారులు, చట్టవిరుద్ధ ఆయుధాల దళారులు, ఇతరులు విస్తారమైన ధనం సంపాదించారు. నిజమే, వీరిలో కొందరు ధర్మాదాయ సంస్థలకు విరాళాలిస్తారు లేదా బీదవారికి సహాయమందించే పథకాలకు మద్దతునిస్తారు. అయినప్పటికిని, వారి నేర కృత్యాలు వారి చేతుల్లో బలైపోయిన వారికి చెప్పనలవిగాని బాధను దుఃఖాన్ని కల్గించాయి. లంచం పుచ్చుకునే లేదా చాటుమాటు వ్యాపారంలో పాల్గొనే వారు సహితం వారి ఉత్పాదనలు లేదా సేవలు విఫలమై సరిగా పనిచేయని కారణంగా కలిగిన బాధలకు, గాయాలకు, మరణాలకు బాధ్యులైయున్నారు. నిజమే, ధనం కలిగియుండుట అభిమానపూర్వక తీర్పుకు ఆధారం కానేరదు.

మరి విద్య విషయమేమి? ఒక వ్యక్తి పేరువెంబడి వుండే పెద్ద డిగ్రీల పట్టిక, బిరుదులు అతడు నమ్మకస్థుడని, నీతిమంతుడని హామీనిస్తాయా? అవివుంటే అతన్ని అభిమానించవలెనని దాని భావమా? నిజమే, విద్య ఒకని ఆలోచనలను విశాలపరస్తుంది, మరియు ఇతరుల ప్రయోజనార్థమై తమ విద్యను ఉపయోగించిన వారు సన్మానాన్ని, గౌరవాన్ని పొందనర్హులై యున్నారు. కాని విద్యాధికుల తరగతికి చెందిన వారు అనేకులను మోసగించి, అణగద్రొక్కిన ఉదాహరణలతో చరిత్రపుటలు నిండివున్నాయి. ఆలాగే నేడు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఏమిజరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వాటి ప్రాంగణాలు మాదకద్రవ్య దుర్వినియోగ సమస్యలతో, సుఖరోగాలతో నిండిపోయాయి, కాగా చాలామంది విద్యార్థులు కేవలం ధనార్జన, అధికారం, కీర్తిప్రతిష్టలు సంపాదించాలని తాపత్రయపడుతున్నారు. ఒకని విద్య మాత్రమే, అతడు నిజమైన వ్యక్తిత్వాన్ని కలిగియున్నాడని సూచించదు.

ఒక వ్యక్తి విలువను అంచనా వేయుటకు శరీరఛాయ, విద్య, ధనం, జాతిచరిత్ర లేదా అలాంటిదే మరోసంగతి సరియైన ఆధారం కానేకాదు. ఇతరుల అభిమానాన్ని సంపాదించుటకు క్రైస్తవులు ఈ సంగతులందు మునిగి యుండకూడదు. అయితే, ఒక వ్యక్తి దేని విషయమై శ్రద్ధ కలిగియుండాలి? ఒకడు ఏ కట్టడలు అనుసరించాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి