కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 3/1 పేజీలు 5-6
  • దేవుని అనుగ్రహం ఎవరికున్నది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని అనుగ్రహం ఎవరికున్నది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని ఉన్నత ప్రమాణాలు
  • మనం దేవుని అనుగ్రహం పొందగలం
  • మీరెలాంటి ప్రజలను ఎక్కువగా అభిమానిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మీరు ‘దేవునియెడల ధనవంతులై’ ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • నిజంగా ముఖ్యమైనది ఏమిటి?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 3/1 పేజీలు 5-6

దేవుని అనుగ్రహం ఎవరికున్నది?

మన సహవాసులు మనలను ఇష్టపడాలని మనమందరము కోరుకుంటాము. దేవుని అనుగ్రహం పొందాలనే బలమైన కోరిక ఒక క్రైస్తవునికి ఉంటుంది. యెహోవా దేవుని గూర్చి కీర్తన 84:11లో యిలా చెప్పబడింది: “యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన యే మేలును చేయక మానడు.” యేసు జన్మమప్పుడు, పరలోకమందలి దేవదూతలు చేసిన ఆనంద గీతాలాపన “ఆయన అనుగ్రహించు మనుష్యులకు భూమిమీద సమాధానమును” వాగ్దానము చేసింది.—లూకా 2:14, మోఫత్‌.

అయితే దేవుడు ఎవరికి అనుగ్రహమునిస్తాడు? దేవుని ప్రమాణాలు మానవుల ప్రమాణాల వంటివేనా? క్రిందటి శీర్షికలో చర్చించినది సూచించినట్లుగా అవి అలాలేవని అర్థంచేసుకోవచ్చు. వాస్తవానికి, “దేవునిపోలి నడుచుకొనుడని” క్రైస్తవులకు ఉపదేశింపబడింది గనుక, ప్రతివ్యక్తి యిలా ప్రశ్నించుకోవచ్చును, దేవుడనుగ్రహించు వ్యక్తులనే నేను అభిమానింతునా, లేదా ప్రజల విషయంలో నేను లోక ప్రమాణాలనే అనుసరించుటకు మొగ్గు చూపుదునా? (ఎఫెసీయులు 5:1) దేవుని అనుగ్రహాన్ని, గుర్తింపును సంపాదించుటకు, ఆయన దృష్టితో చూడ్డానికి మనం జాగ్రత్తపడాలి.

దేవుని ఉన్నత ప్రమాణాలు

అపొస్తలుడైన పేతురు యిలా చెప్పాడు: “దేవుడు పక్షపాతి కాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును.” అంతేకాకుండ, దేవుడు “ఒకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడని” అపొస్తలుడైన పౌలు సాక్ష్యమిచ్చాడు. (అపొ. కార్యములు 10:34, 35; 17:26) కాబట్టి, మానవుల భౌతిక లక్షణములేమైయున్నను వారందరు దేవుని దృష్టిలో సమానులేనని తేల్చిచెప్పుట సహేతుకమై యున్నది. అసలు విషయమది గనుక, ఆ వ్యక్తి ఫలాని ప్రాంతాన్నుండి వచ్చాడని, లేదా ఫలాని రంగు గలవాడని లేదా ఫలాని జాతికి చెందిన వాడని అతనియెడల అసాధారణమైన అభిమానం చూపుట క్రైస్తవునికి తగదు. బదులుగా, ఆయన పక్షపాతం చూపలేదని శత్రువులు సహితం అంగీకరించిన తన మాదిరికర్తయగు యేసుక్రీస్తును అనుసరించుట అతనికి యుక్తమై యుండును.—మత్తయి 22:16.

నిస్సారమైన లేదా ప్రాముఖ్యతలేని దానిని వర్ణించుటకు కొన్నిసార్లు “స్కిన్‌ డీప్‌” (చర్మమంత లోతు) అనే పదం ఉపయోగింపబడింది. చర్మం రంగు కూడ అంతే; అది కేవలం చర్మమంత లోతుగలది. శరీరఛాయ ఏ విధంగా కూడ అతని వ్యక్తిత్వాన్ని లేదా అంతరంగ లక్షణాలను ప్రతిబింబించదు. సహవాసం చేయడానికి, కలిసి భోజనం చేయడానికి లేదా కరచాలనం చేయడానికి నిశ్చయంగా మనం ఆ వ్యక్తి రంగు చూడకూడదు. క్రితమెన్నడు వ్రాయబడనంత బహు రమ్యమైన, ప్రణయ కావ్యరచనకు ప్రేరణ కల్గించిన కన్య తననుగూర్చి యిలా చెప్పుకోవడాన్ని మనం జ్ఞాపకముంచుకోవాలి: “నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను, . . . నేను నల్లనిదానను . . . [ఎందుకంటె] నేను ఎండ తగిలినదానను.” (పరమగీతము 1:5, 6) అభిమానించడానికి జాతిగాని, రంగుగాని సరియైన ఆధారము కాదు. ఆ వ్యక్తి దేవునికి భయపడి, నీతిక్రియలు చేస్తున్నాడా లేదాయనేది అన్నింటికంటె ప్రాముఖ్యము.

ధన సంపత్తి కలిగియుండడాన్ని దేవుడెట్లు భావించును? అందరికంటె, అన్నింటికంటె మిన్నగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. అయినప్పటికిని, యేసు భూమిపై నున్నప్పుడు, ఆయనకు “తలవాల్చుకొనుటకైనను స్థలము” లేకపోయింది. (మత్తయి 8:20) ఆయనకు స్వంత ఆస్తి, ఇళ్లు, పొలాలు, ఫలవృక్షాలు, లేదా పశువులు లేకుండెను. అయినను, దేవుడైన యెహోవా ఆయనను సన్మానించి, తను మినహా విశ్వంలో మిగిలిన వారందరికంటె పైగా ఉన్నత స్థానానికి ఆయనను హెచ్చించాడు.—ఫిలిప్పీయులు 2:9.

వస్తు సంపత్తినందు కాదుగాని శ్రేష్ఠమైన కార్యములు చేసినందుకే యేసుక్రీస్తు దేవుని అనుగ్రహం పొందాడు. (1 తిమోతి 6:17, 18 పోల్చండి.) ఆయన తన శిష్యులకిట్లు ఉపదేశించాడు: “భూమిమీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.” (మత్తయి 6:19, 20) ఆ విధంగా, ఈ లోకంలో ధనసంపత్తిగల వారిని మాత్రమే అభిమానించుటకు బదులు, క్రైస్తవులు లోకాస్తుల ఆధారంగా ఎలాంటి భిన్నత్వాలను కలిగియుండరు. వస్తు రూపకముగా వారు ధనవంతులైనను, బీదవారైనను దేవునియెడల ధనవంతులైయున్న వారిని వారు వెదకెదరు. “ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, . . . రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనెనని” ఎన్నటికిని మర్చిపోకుము. (యాకోబు 2:5) మీరు దేవుని దృష్టిని కలిగియున్నట్లయిన, వస్తురీత్యా సంపన్నులైన వారిని అభిమానించే సాధారణ అభ్యాసానికి మీరెన్నటికిని బలికారు.

విద్య విషయానికొస్తే, మనం జ్ఞానవివేచనలు సంపాదించాలని దేవుడు కోరుచున్నాడనియు, ఈ భూమిపై జీవించిన వారిలోకెల్ల యేసుక్రీస్తు మహాగొప్ప బోధకుడనియు బైబిలు స్పష్టంగా చూపిస్తున్నది. (సామెతలు 4:7; మత్తయి 7:29; యోహాను 7:46) అయితే లోక జ్ఞానం లేదా విద్య దేవుని అనుగ్రహం పొందలేదు. దానికి భిన్నంగా, పౌలు మనకిట్లు తెల్పుచున్నాడు: “లోకరీతిని జ్ఞానులైన . . . అనేకులు పిలువబడలేదు గాని . . . జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.”—1 కొరింథీయులు 1:26, 27.

ఉన్నత విద్యా సంస్థలలో బోధింపబడు లౌకిక అంశాలలో విద్యావంతులైన వారిని గాక, దేవుని వాక్యమగు బైబిలునందలి సత్యమనే “స్వచ్ఛమైన భాషలో” విద్యావంతులైన వారిని దేవుడు అనుగ్రహించును. (జెఫన్యా 3:9, NW) వాస్తవానికి, ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తున్న విద్యా కార్యక్రమము ద్వారా నేడు యెహోవా తానే తన ప్రజలకు బోధిస్తున్నాడు. యెషయా ప్రవక్త ప్రవచించినట్లు, “యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి; ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము” అని చెప్పుచు అన్ని జనాంగముల ప్రజలు దానికి ప్రత్యుత్తరమిస్తున్నారు. కాబట్టి, లౌకిక విద్యను మహిమపరచడానికి బదులు, తమ మాటలద్వారా, క్రియలద్వారా తాము నిజంగా “యెహోవాచేత ఉపదేశము” నొందినవారని నిరూపించుకొను వారిని క్రైస్తవులు వెదకెదరు. అలాచేయుట ద్వారా, వారు దేవుడనుగ్రహించు ‘అధిక విశ్రాంతి’ ననుభవించెదరు.—యెషయా 2:3; 54:13.

మనం దేవుని అనుగ్రహం పొందగలం

అవును, ఇతరులపై దేవుడుచూపే అనుగ్రహపు ప్రమాణాలు మానవుని ప్రమాణాలకంటే ఎంతో భిన్నమైయున్నవి. అయినప్పటికిని, ఆయన దృష్టిలో అనుగ్రహం సంపాదించాలంటే, ఆయన మార్గాల ద్వారా నడిపింపబడుటకు మనం కృషిచేయాలి. అంటే స్వార్థంచే, దురభిమానంచే ప్రభావితమైన మానవ ప్రమాణాలనుబట్టి కాక దేవుని దృష్టినిబట్టి ఇతరులను చూడడానికి నేర్చుకోవడమని దాని భావం. దానిని మనమెట్లు చేయగలం?

యెహోవా దేవుడు హృదయాన్ని పరిశీలించి, ప్రేమ, మంచితనము, దయాళుత్వము, దీర్ఘశాంతమువంటి లక్షణాలను కనబరచే వారిని అనుగ్రహిస్తాడు. (1 సమూయేలు 16:7; గలతీయులు 5:22, 23) మానవులుగా మనము సాధ్యమైనంత మేరకు శరీరఛాయ లేదా జాతిచరిత్రను కాదుగాని, ఒక వ్యక్తి అంతరంగాన్ని చూడాలి. వస్తురీత్యా ధనవంతులైన వారిని వెదకే బదులు, ధనంయెడల దేవుని దృష్టిని కలిగియుండి, “సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై” యుండుటకు మనం పాటుపడాలి. (1 తిమోతి 6:18) దేవుని అనుగ్రహం పొందుటకు, మనం సత్యమనే స్వచ్ఛమైన భాషయందు విద్యావంతులుగా తయారగుచు, దేవుని గూర్చి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుటలో కొనసాగాలి. (యోహాను 17:3, 17) అలాచేస్తూవుంటే, మనం కూడ దేవుడు అనుగ్రహము చూపే వారిలో ఉంటాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి