ఎవరైనా ఆహ్వానిస్తే, మీరంగీకరిస్తారా?
షినిషి టొహార చెప్పినది
నా జీవిత తొలి ఘట్టంలో, నేను దేవున్ని ప్రార్థించలేదు, లేక ఆయన నడిపింపుకు నేను ఎదురు చూడలేదు. మా తాతలు జపానునుండి హవాయికి వలసవచ్చారు, మా తలిదండ్రులు బౌద్ధమతస్థులు. వారు తమ విశ్వాసమందు చురుకుగా లేనందున, నేను ఎదిగేకొలది దేవుని గూర్చి అంతగా ఆలోచించలేదు.
ఆ తర్వాత నేను పరిణామ సిద్ధాంతం నేర్చుకుని, దేవున్ని నమ్మడం ఎంత అవివేకమో అని తలంచాను. అయితే, నా సాధారణ విద్యాస్థాయి పెరుగుచుండగా, విజ్ఞానశాస్త్ర తరగతులు నన్ను ఖగోళశాస్త్రానికి, భౌతిక శాస్త్రానికి జీవశాస్త్రానికి పరిచయం చేశాయి. రాత్రులందు ఆకాశంవైపు చూసి ఆ నక్షత్రాలన్నీ ఎలావచ్చాయని ఆలోచించేవాడిని. నాలో ఏదో తెలియని స్వరం ఇలా ప్రశ్నించడం ప్రారంభించింది: ‘వీటన్నింటిని తన అధీనంలో పెట్టుకున్న దేవుడనే వాడు ఉన్నాడా?’ అవును ఎవరో ఒకరు తప్పకుండా వుండాలి అని నేను భావించసాగాను. ‘ఆ దేవుడెవరు?’ అని నా హృదయం ఘోషించ నారంభించింది.
ఉన్నత పాఠశాల విద్య ముగించిన తర్వాత, సాకి అనే మద్యపాన ఉత్పత్తి కేంద్రంలో మెకానిక్‌గా నేను నా పనిలో మునిగిపోయాను, దేవున్ని గూర్చి తలంచే సమయమే నాకు లేకపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే నాకు మాసాకో పరిచయం కావడం, 1937లో ఆమెతో నా వివాహం ఆ తర్వాత మాకు ముగ్గురు పిల్లలు కలగడం జరిగింది. నమ్మకమైన సహవాసిగా, కష్టపడి పనిచేసే తల్లిగా మాసాకో పనితీరు ఎంతో ప్రశంసనీయం!
నాకిప్పుడు కుటుంబం ఉండడంతో, నేను మా భవిష్యత్తును గూర్చి గంభీరంగా తలంచాను. మరలా నేను బయటకువెళ్లి ఆకాశంలో నక్షత్రాలు చూడడం ప్రారంభించాను. దేవుడనే వాడొకడున్నాడనే విషయం నాలో బలపడింది. ఆ దేవుడెవరో నాకు తెలియదు, కాని ఏమైనా సరేనని నేనాయనకు ప్రార్థించడం ప్రారంభించాను. ‘నీవెక్కడున్నా సరే, నా కుటుంబం సంతోషంగా జీవించే మార్గం కనుగొనేటట్లు దయచేసి సహాయం చేయుమని’ నేను పదేపదే యాచించాను.
చివరకు నా ప్రార్థనకు సమాధానమొచ్చింది
మా పెళ్లయిన దగ్గరనుండి మేము మా తలిదండ్రులతోనే కలిసి జీవించాము, అయితే 1941నుండి హవాయి నందలి హిలొలో మేము స్వతహాగా జీవించ నారంభించాము. అలా మేం మా క్రొత్త యింటిలో స్థిరపడ్డామో లేదో, 1941లో డిశంబరు 7న పెరెల్ నౌకాశ్రయంపై జపానీయులు దాడిచేశారు. అది ఉద్రిక్తత నిండిన కాలం, ప్రతివారు తమ భవిష్యత్తును గూర్చి కలత చెందారు.
పెరెల్ నౌకాశ్రయంపై దాడి జరిగిన ఒక నెల తర్వాత, నేను నా కారును పాలిష్ చేస్తుండగా ఒక వ్యక్తి నా దగ్గరకువచ్చి చిల్డ్రన్ అనే పేరుగల పుస్తకం నా కందించాడు. అతను తన పేరు రాల్ఫ్ గారుట్ అని యెహోవాసాక్షుల పరిచారకుడనని పరిచయం చేసుకున్నాడు. అతనేమి చెప్పుచున్నాడో నా కర్థం కాలేదు, అయితే దేవునియందు నాకు ఆసక్తి ఉన్నందున నేనా పుస్తకం తీసుకున్నాను. ఆ మరుసటి వారం, రాల్ఫ్‌వచ్చి గృహ బైబిలు పఠనం గూర్చి చెప్పాడు. నేను బైబిలును గూర్చి విన్నప్పటికిని, నిజంగా నేను బైబిలును చూడడం అదే మొదటిసారి. నేను బైబిలు పఠనానికి అంగీకరించాను, నాతో నా భార్య, ఆమె చెల్లెలుకూడా కలిశారు.
బైబిలు దేవుని వాక్యమనే సత్యం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. (2 తిమోతి 3:16, 17) ఆలాగే యెహోవా ఒక సంకల్పం కలిగియున్నాడనే విషయం మాకు మరింత అద్భుతకరంగా ఉండెను. నేను ఎదురుచూసిన సృష్టికర్త ఆయనే. (యెషయా 45:18) పోగొట్టబడిన పరదైసు తిరిగి ఈ భూమిపై పునరుద్ధిరింప బడుతుందని, మేమందులో ఒక భాగమై యుండగలమని తెలుసుకోవడానికి ఎంతో పులకిరించిపోయాము. (ప్రకటన 21:1-4) దేవునికి నేను చేసిన ప్రార్థనకు ఇక్కడ సమాధానం లభించింది!
మేం క్రొత్తగా కనుగొన్న సత్యాల్ని గూర్చి ప్రతివారితో మాట్లాడేవారం. మేం పిచ్చివాళ్లమని మా తలిదండ్రులు తలంచారు, అయితే అది మమ్ములను నిరుత్సాహపరచలేదు. మూడునెలలు తీవ్రంగా బైబిలు పఠించిన తర్వాత, మా దేవుడైన యెహోవాకు మేము సమర్పించుకున్నామన్న దానికి సూచనగా నేను నా భార్య 1942లో ఏప్రిల్ 19న బాప్తిస్మం పొందాము. బైబిలు పఠనమందు అప్పటికే మాతో కలిసిన మాసాకో చెల్లెలు యోషి, ఆమె భర్త, జెరి మాతోపాటు బాప్తిస్మం పొందారు. పరిశుద్ధ లేఖనములలో మాకు కేవలం పరిమిత జ్ఞానమే ఉన్నప్పటికిని, దేవుని సేవించగోరుటకు పురికొల్పేందుకు అది చాలు.
రెండవ ప్రపంచ యుద్ధం యింకను కొనసాగుచుండగా, ఈ విధానాంతం ఎంతో చేరువలోనే వుందని నేను ఊహించాను, కాగా నేను నా భార్య దీనిని గూర్చి ప్రజలకు హెచ్చరిక చేయాల్సిన అవసరముందని అనుకున్నాము. ఈ విషయంలో మాకు గారుట్ దంపతులు ఒక మాదిరిగా ఉన్నారు. రాల్ఫ్ అతని భార్య యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులైన పయినీర్లుగా సేవచేస్తున్నారు. నేను నా పరిస్థితిని రాల్ఫ్ పరిస్థితితో పోల్చుకున్నాను. ఆయనకు భార్య నలుగురు పిల్లలున్నారు. నాకు ఒక భార్య ముగ్గురు పిల్లలున్నారు. ఆయన దానిని చేయగల్గాడంటే, నేను కూడ దానిని చేయగలను. కాబట్టి మా బాప్తిస్మము తర్వాతి నెలలోనే, మేము పయినీరు సేవకు దరఖాస్తు చేశాము.
పయినీరుగా అంగీకరించబడడానికి ముందే, నా స్టీలు గిటార్, సాక్సాఫోన్, వయోలిన్‌తో సహా అనవసరమైన వస్తువులన్నీ నేను అమ్మేసాను. సంగీతమంటే నాకు మహాప్రీతి, కాని నా దగ్గరున్న చిన్న హార్మోనికా తప్ప మిగతావన్నీ వదులుకున్నాను. అంతేకాదు, సాకి మద్యపాన ఉత్పత్తి కేంద్రంలో నా ఉద్యోగంపై నాకు విరక్తి పుట్టింది. (ఫిలిప్పీయులు 3:8) నివాసం కొరకు నేనొక ట్రెయిలర్ తయారు చేసుకొని, నేను సేవ నిమిత్తం ఉపయోగించబడాలనే నా విన్నపానికి యెహోవా యిచ్చే జవాబు కొరకు వేచియున్నాను. అయితే నేను ఎక్కువకాలం వేచియుండాల్సిన పని లేకుండెను. మేము 1942 జూన్ 1నుండి పయినీర్లుగా అంగీకరింపబడ్డాము. మేం తిన్నగా యెహోవాను పూర్తికాలం సేవించుటకు వెళ్లాము, మా నిర్ణయానికి మేమెన్నడూ చింతించలేదు.
హవాయిలో పయినీరు సేవ
గారుట్ దంపతులతో కలిసి మేము, కాఫీ తోటలకు ప్రఖ్యాతిగాంచిన పెద్ద ద్వీపమగు కోనా మరియు కావ్‌తో సహా హవాయి అంతా తిరిగి సేవచేశాము. ఆ రోజుల్లో మేము ఫొనొగ్రాఫ్‌తో పనిచేసేవారం. అది చాలా బరువుండేది, అయితే మేమింకా యౌవనంగా, బలంగా ఉండేవారం. కాబట్టి, ఒక చేత్తో ఫొనొగ్రాఫ్, మరో చేత్తో నిండా పుస్తకాలున్న సంచి పుచ్చుకుని కాఫీ పొలాల్లో, తోటల్లో ఇతర ప్రాంతాల్లో వినేవారు ఎక్కడుంటే అక్కడకు వెళ్లేవారం. ఆ పిమ్మట, ఆ ద్వీపమంతా సేవచేసిన తర్వాత, మరొక పెద్ద ద్వీపమందున్న కొహలకు మమ్మల్ని పంపించారు. అది చెరుకు తోటలుగల చిన్న ప్రాంతం, అక్కడ ఎక్కువగా తెల్లవాళ్లు, ఫిలిప్పైన్స్ ప్రజలు, చైనీయులు, హవాయి దేశస్థులు, జపానీయులు, పోర్చుగీసు దేశస్థులు నివసించే వారు. ప్రతివారు వారివారి స్వంత ఆచారాలు, నమ్మకాలు, అభిరుచులు, మతాలు కలిగివుండేవారు.
నేను పయినీరు సేవచేయ నారంభించిన తర్వాత, మరలా ఉద్యోగంవైపు తిరిగి చూడలేదు. మేం పొదుపు చేసుకున్న దానిపై కొంత కాలం జీవించిన తర్వాత, అవసరం ఏర్పడినపుడల్లా నేను ఈటెతో చేపలుపట్టే వాడను. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, నేను ప్రతిసారి కొన్ని చేపలతోనే ఇంటికి వెళ్లేవాడిని. సాయంకాల భోజనానికి అవసరమైన ఆకుకూరల్ని మేం రోడ్డు ప్రక్కన మొలిచే మొక్కలనుండి సేకరించేవారం. నేనొక రేకుతో పొయ్యి తయారుచేశాను, మాసాకో రొట్టె తయారుచేయడం నేర్చుకుంది. నేను తిన్న రొట్టెలలోకెల్ల అవి అత్యంత రుచికరమైన రొట్టెలుగా ఉండేవి.
మేము 1943లో హొనొలులులో జరిగిన క్రైస్తవ సమావేశానికి వెళ్లినప్పుడు, ఆ కాలంలో హవాయి బ్రాంచి అధ్యక్షునిగావున్న డొనాల్డ్ హాజ్‌లెట్, మమ్ములను అక్కడికివచ్చి వాచ్‌టవర్ సొసైటి గ్యారేజిలో నిర్మించిన చిన్న అపార్టుమెంటులో ఉండమని ఆహ్వానించాడు. బ్రాంచి ఆస్తికి కాపలాదారుగా నేను నియమించబడి, అక్కడేవుండి ఆ తర్వాతి ఐదు సంవత్సరాలు నేను పయినీరు సేవలో ఆనందంగా గడిపాను.
అనుకోని ఆహ్వానం
విదేశాల్లో సేవచేయడానికి మిషనరీలకు శిక్షణనిచ్చే పాఠశాలను సొసైటి ఆరంభించిందని మేము 1943లో విన్నాము. దానికి హాజరు కావడానికి మేమెంతగా సంతోషించామో! కాని, పిల్లలున్న కుటుంబాలు దానికి ఆహ్వానింపబడలేదు, కాబట్టి మేం ఆశవదులుకున్నాం. అయితే 1947లో జపానులో సేవచేయడానికి ఇష్టపడే హవాయి నివాసులు ఎవరైనా ఉన్నారో తెలిసికోవడానికి సొసైటి యిష్టపడుతున్నట్లు బ్రదర్ హాజ్‌లెట్ మాకు చెప్పారు. మా ఉద్దేశమేమిటని ఆయన మమ్మల్ని అడిగారు, దానికి యెషయా వలెనే నేను ‘నన్ను పంపండి’ అని సమాధానమిచ్చాను. (యెషయా 6:8) నా భార్యకూడ అదే విధంగా భావించింది. యెహోవా యిచ్చిన పిలుపుకు వెనుకంజ వేసే ప్రసక్తే మాకు లేదు.
కాబట్టి మిషనరీలుగా శిక్షణపొందుటకు మేము వాచ్‌టవర్ గిలియడ్ పాఠశాలకు హాజరయ్యేందుకు ఆహ్వానింపబడ్డాము. ఆ యాహ్వానమందు మా ముగ్గురు పిల్లలుకూడ చేర్చబడ్డారు. మరి ఐదుగురు కూడా అంటే డొనాల్డ్ మరియు మాబెల్ హాజ్‌లెట్, జెరి మరియు యోషి టొమా, ఎల్సి టానిగావ కూడ ఆహ్వానింపబడ్డారు, ఆలా మేమందరం 1948లో శీతాకాలమందు న్యూయార్క్‌కు ప్రయాణమయ్యాము.
బస్సులో ప్రయాణించి మేం ఆ ఖండాన్ని దాటాము. బస్సులో మూడు రోజుల ప్రయాణం తర్వాత మేమందరం అలసిపోయాము, కాబట్టి ప్రయాణం ఆపి ఆ రాత్రికి ఏదైనా హోటల్లో ఉందామని బ్రదర్ హాజ్‌లెట్ సూచించారు. మేమలా బస్సు దిగామో లేదో, ఒక వ్యక్తి పరుగెత్తుకొచ్చి, “జపాను వారా! నేనిప్పుడేపోయి గన్ తీసుకొచ్చి వారందరిని కాల్చిపారేస్తాను” అని బిగ్గరగా అరిచాడు.
వెంటనే బ్రదర్ హాజ్‌లెట్ కలుగజేసుకొని, “వాళ్లు జపాను వారు కాదు, వాళ్లు హవాయి దేశస్థులు, నీకామాత్రం తేడా తెలియడం లేదా?” అని అన్నాడు. ఆయనలా వెంటనే మాట్లాడడంతో మేమంతా ప్రాణాలు దక్కించుకున్నాం.
మేం నిజంగా గిలియడు పాఠశాలలో 11వ బ్యాచ్ వారమేనా? అదొక అద్భుతమైన కలలా మాకు అన్పించింది. అయితే త్వరలోనే అది వాస్తవమని తేలిపోయింది. జపానులో మిషనరీ సేవచేయడానికి శిక్షణిచ్చేందుకు వాచ్‌టవర్ సొసైటి అప్పటి అధ్యక్షుడగు నేథన్ హెచ్. నార్ మా బ్యాచ్‌నుండి 25మంది విద్యార్థులను ఎంపిక చేశాడు. నాకు జపానీయుల వారసత్వం ఆలాగే నేను కొంతమేరకు జపాను భాష మాట్లాడగలను గనుక, ఈ గుంపు విద్యార్థులకు భాష నేర్పించే పని నాకప్పగింపబడింది. భాషా ప్రావీణ్యం నాకంతగా లేనందున, ఈ పని అంత సులభము కాదు; మొత్తానికి ఎలాగో మేమంతా గట్టెక్కగల్గాం.
అప్పటికి మా కుమారుడు, లోయ్‌కి పది సంవత్సరాలు, మా అమ్మాయిలు థెల్మాకు ఎనిమిది, సాలికి ఆరు సంవత్సరాలు. మేమా పాఠశాలలో ఉండగా వారికేం జరిగింది? వారు కూడ పాఠశాలకు వెళ్లారు. ఒక బస్సు ఉదయాన్నే వారిని తీసుకెళ్లి సాయంకాలానికి ఇంటికి తిరిగి తీసుకొచ్చేది. పిల్లలు పాఠశాలనుండి ఇంటికి తిరిగివచ్చిన వెంటనే, లోయ్ సహోదరులతో కలిసి సొసైటి ఫామ్‌లో పనిచేసేవాడు, ఆలాగే థెల్మా, సాలి చేతిరుమాళ్లు మడతపెడుతూ లాండ్రిలో పనిచేసేవారు.
తెలియని విషయాల కొరకు మనస్సును సిద్ధంచేయుట
మేము 1948లో ఆగష్టు 1న గిలియడ్ పాఠశాలనుండి ఉత్తీర్ణులైనప్పుడు సేవకు మమ్ములను ఎక్కడికి పంపిస్తారోనని మేము ఎదురుచూశాము. మిషనరీలు ఉండడానికి తగిన స్థలం చూడడానికి బ్రదర్ హాజ్‌లెట్ మాకంటె ముందుగా వెళ్లారు. చివరకాయన 1949 ఆగష్టు 20న టోక్యోలో రెండంతస్తుల ఇల్లు చూశాడు, అలా మాకుటుంబమంతా భవిష్యత్తులో మేం ఉండాల్సిన ఇంటికి బయల్దేరి వెళ్లాము.
జపానుకు రాకముందు, నేను ఈ తూర్పు దేశాన్ని గూర్చి తరచు తలంచేవాడిని. తమ మానవ ప్రభువులకు, చక్రవర్తులకు జపానీయులు చూపే యథార్థతను నేను ఆలోచించాను. అనేకమంది జపానీయులు మానవ పరిపాలకుల కొరకు తమ ప్రాణాలు అర్పించారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, శత్రు నౌకల పొగగొట్టాలను గురిగా పెట్టుకొని తమ విమానాలను నడిపి, యుద్ధవిమాన పైలట్లు తమ చక్రవర్తి కొరకు చనిపోయారు. మానవ ప్రభువులకే జపాను ప్రజలు అంత విశ్వాసపాత్రులై యుంటే, వారు నిజమైన ప్రభువగు యెహోవాను కనుగొంటే వారేమి చేస్తారో? అని ఆలోచించడాన్ని నేను గుర్తుచేసుకున్నాను.
మేము జపానుకు వచ్చేప్పటికి, అక్కడ కేవలం ఏడుగురు మిషనరీలు, ఆ దేశమంతటిలో కొద్దిమంది ప్రచారకులు మాత్రమే ఉన్నారు. మేము పనిచేయడం ఆరంభించాము, కాగా నేను నా భాషా పరిజ్ఞానాన్ని వృద్ధిచేసికొనుటకు కృషిచేయడమే కాకుండ తమ హృదయాల్లో దేవునికి మొరపెట్టే అనేకమందితో బైబిలు పఠనాలు ఆరంభించ గల్గాను. ఆనాటి అనేకమంది బైబిలు విద్యార్థులు నేటికి విశ్వాసముగా నడుచుకొనుచున్నారు.
మా పిల్లలతో మిషనరీ సేవ
మేం శ్రద్ధచూపవలసిన ముగ్గురు పిల్లలతో మేమెట్లు మిషనరీ సేవను నిర్వహించగలము? దీనియంతటి వెనుక యెహోవా శక్తి మాకుండెను. సొసైటి మాకయ్యే కొద్ది ఖర్చులు చెల్లించి భర్తీచేస్తుండేది, మాసాకో పిల్లలకు బట్టలు కుట్టేది. దానికితోడు మా తలిదండ్రులు మాకు కొంత సహాయం చేసేవారు.
మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, లోయ్ కొంతకాలంపాటు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటివారి జపాను బ్రాంచి కార్యాలయంలో పనిచేశాడు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా, చికిత్స నిమిత్తమై అతడు హవాయ్‌కు తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతడు, అతని భార్య కాలిఫోర్నియాలో నమ్మకంగా యెహోవాను సేవిస్తున్నారు. అతని పెళ్లి మాకు నమ్మకమైన నలుగురు మనుమళ్లను ప్రసాదించింది. వాళ్లందరు బాప్తిస్మం పొందారు, కాగా వారిలో ఒకరు తన భార్యతో కలిసి యిప్పుడు యెహోవాసాక్షుల ప్రపంచ కేంద్ర కార్యాలయమైన బ్రూక్లిన్ బేతేలులో సేవచేస్తున్నారు.
మా అమ్మాయిలైన థెల్మా, సాలి పెరిగి పెద్దవారైనప్పుడు, వారుకూడ మిషనరీలుగా చేయబడ్డారు. థెల్మా యిప్పుడు టొయామా నగరంలో మిషనరీగా పనిజేస్తుంది. సాలి మిషనరీ సహోదరుడైన రాన్ ట్రోస్ట్‌ను వివాహం చేసుకుంది. వారిప్పుడు మిషనరీలుగా జపానులో గత 25 సంవత్సరాల నుండి ప్రయాణ కాపరిగా సేవ చేస్తున్నారు.
ఉత్తరం నుండి దక్షిణానికి
టోక్యోలో రెండు సంవత్సరాలు గడిపిన తర్వాత, రెండు సంవత్సరాల కొరకు మమ్ములను ఒసాకా పంపించారు. మా తర్వాతి అసైన్‌మెంట్ మమ్ములను ఉత్తరాన సెండాయ్‌కు తీసుకెళ్లింది, మేమక్కడ దాదాపు ఆరు సంవత్సరాలు సేవచేశాము. సెండాయ్‌లోని పరిస్థితులు, ఉత్తరానగల సుదూర జపాను దీవియైన హొక్కాయిడొలో సేవచేయుటకు మమ్ములను సంసిద్ధం చేశాయి. యిక్కడే హొక్కాయిడొలో మా అమ్మాయిలు మిషనరీ హోదా పొందారు. మేము కూడ అక్కడ కొన్నిసార్లు సున్న డిగ్రీలకంటే తక్కువగావుండే శీతాకాల ఉష్ణోగ్రతలకు అలవాటుపడ్డాము. ఉష్ణమండల హవాయ్‌కి ఇక్కడికి చాలా భేదం!
ఆ పిమ్మట, సొసైటినుండి వచ్చిన ఉత్తరం రూపంలో నేనొక క్రొత్త పిలుపు విన్నాను. అప్పటికి యింకా అమెరికా అధీనంలోనేవున్న ఓకినావలో ఒక బ్రాంచి కార్యాలయం తెరవాల్సిందిగా ఆ ఉత్తరం నాకు తెల్పింది. ఉత్తరాన జపాను శీతల అగ్రభాగాన్నుండి ప్రస్తుతం జపాను దక్షిణభాగ ప్రాంతంగా తయారైన ఆ ప్రదేశానికి వెళ్లడం మాకు ఓ గొప్ప సవాలుగా నిలిచింది. నేనేం చేస్తాను? తగిన సమర్థుడను కాననే భావంతోనే, ఎప్పుడూ నాకు తోడుగావుండే నా భార్యతో కలిసి నేను 1965 నవంబరులో ఓకినావ చేరుకున్నాను. ఓకినావలో జీవితం జపానులో ఉన్నట్లే ఉంటుందా? అక్కడి సంస్కృతి మాటేమిటి? యెహోవాయొక్క రక్షణ వర్తమానానికి ప్రజలు ప్రతిస్పందిస్తారా?
మేమక్కడకు వచ్చేసరికి, ఓకినావలో 200 కంటే పైగా ప్రచారకులుండిరి. ఇప్పుడక్కడ 2,000 కంటే ఎక్కువమంది ప్రచారకులున్నారు. తొలిరోజుల్లో, నేను పార్ట్ టైం ప్రయాణకాపరిగా, పార్ట్ టైం బ్రాంచి అధ్యక్షునిగా పనిచేశాను. ఆ ద్వీపాలన్ని తిరగడం అక్కడున్న సహోదరులతో సన్నిహిత సంబంధం పెంచుకోవడానికి నాకు సహాయపడింది, అక్కడ సేవచేయడాన్ని నేనొక ఆధిక్యతగా పరిగణిస్తాను.
సమస్యలు లేకుండెనా?
మా మిషనరీ సేవలో మాకెలాంటి సమస్యలు లేవని కాదు. మేము 1968లో సెలవుమీద అమెరికాలో ఉన్నప్పుడు, మాసాకో జబ్బుపడగా, ఆమెకు ఆపరేషను చేయాల్సొచ్చింది. ఆమె ప్రేవులలోనుండి ఒక కణితి తీయడం, ఆ తర్వాత ఆమె అద్భుతంగా కోలుకోవడం జరిగింది. మాకు వైద్య భీమా లేకుండెను, అందువలన మేము మా అసైన్‌మెంటుకు తిరిగి వెళ్లలేమేమోనని కలతచెందాము. అయితే మేం ఆశ్చర్యపడే రీతిలో, విశ్వాసులైన తోటి స్నేహితులు మాక్కావల్సినవన్నీ ఏర్పాటుచేశారు.
నా విషయానికొస్తే, ప్రస్తుతం నేను మధుమేహ వ్యాధివల్లవచ్చే సాధారణ సమస్యలతో జీవిస్తున్నాను. అంధత్వం రాలేదు, అయితే నా చూపు పూర్తిగా దెబ్బతింది. గాని యెహోవా కృపచొప్పున, టేప్‌రికార్డర్‌లో ది వాచ్‌టవర్, అవేక్! టేపులు వింటూ క్రమంగా ఆత్మీయ పోషణ పొందగల్గుచున్నాను. వివిధ విషయాలను నా కొరకు చదువుతూ విశ్వాసమందలి సహోదర సహోదరీలు కూడ నాకు సహాయపడుచున్నారు.
కంటిచూపు దెబ్బతిన్ననూ ఇంకా నేనెట్లు బహిరంగ ప్రసంగాలివ్వగల్గుచున్నాను? మొదట్లో నా ప్రసంగాల్ని టేపుచేసి సౌండు సిస్టమ్ ద్వారా వాటిని విన్పిస్తూ తదనుగుణంగా నా పెదాలు కదుపుతూ ఉండేవాడిని. అయితే, నా కూతురు సూచనమేరకు, ఈ విషయంలో నేను అభివృద్ధి సాధించాను. యిప్పుడు నా ప్రసంగాలను చిన్న టేపురికార్డర్‌లో రికార్డుచేసి, ఇయర్‌ఫోన్‌ద్వారా వాటినివింటూ ప్రసంగాలివ్వగల్గుచున్నాను.
మాకు నిజమైన సమస్యలు కలిగినప్పుడెల్ల, మేము యెహోవాకు ప్రార్థన చేయడం మానలేదు. సమస్యల్ని పరిష్కరిస్తూ యెహోవానుండి వచ్చిన ఆశీర్వాదములు చివరకు అన్నిసమయాల్లో సమస్యలకంటె గొప్పవిగా కన్పించేవి. ఆయన సేవలో కొనసాగుటయే మనమాయనకు కృతజ్ఞత చూపుటకున్న ఏకైక మార్గము.
ఓకినావలో 23 సంవత్సరాలున్న తర్వాత, సేవచేయడానికి మేము జపానులో మొట్టమొదట కాలుమోపిన ఆ ప్రదేశానికే మమ్మల్ని మరలా పంపించారు. అనేక సంవత్సరాల క్రితం మొదట బ్రదర్ హాజ్‌లెట్ టోక్యోలో కొన్న ఆ రెండంస్తుల ఇల్లు ఉన్న స్థలంలోనే యిప్పుడు సొసైటియొక్క ముఖ్య కార్యాలయము, అతిపెద్ద మిషనరీ గృహము ఉన్నాయి.
నేను, మాసాకోకాక యిప్పుడు 11మంది మా బంధువులు జపానులో మిషనరీ సేవ యందున్నారు. బౌద్ధమతం, షింటో సంస్కృతులు ప్రముఖమైయున్న ఈ దేశంలో యెహోవా దయచేసిన అభివృద్ధిని చూసినవారిగా వారందరు తమ సేవను ఒక ఆధిక్యతగా భావిస్తున్నారు. జపానులో సేవ కొద్ది పరిమాణంలో ఆరంభమైనను, యెహోవా శక్తి దానిని 1,67,000 సువార్త ప్రచారకుల “జనాంగముగా” మలిచింది.—యెషయా 60:22.
దేవునికి నేను ప్రార్థించగా, ఆయన నా మొర ఆలకించాడు. ఆయన నన్ను ఆహ్వానించినప్పుడు నేను క్రియాత్మకంగా ప్రతిస్పందించాను. మేము చేయవలసిన దానినే మేము చేశామని నేను నా భార్య భావిస్తున్నాము. మరి నీ విషయమేమి? నీ సృష్టికర్త నిన్నాహ్వానిస్తే, నీవు ప్రత్యుత్తరమిస్తావా?
[28వ పేజీలోని చిత్రం]
హవాయ్‌లో తమ పయినీర్ సహవాసులలో కొందరితో టొహార దంపతులు, 1942
[29వ పేజీలోని చిత్రం]
గిలియడ్ నందు 1948లో టొహార పిల్లలు
[31వ పేజీలోని చిత్రం]
ఇవ్వబడిన పిలుపుకు జవాబిచ్చిన వారు ధన్యులు, షినిషి, మాసాకో టొహారాలు మిషనరీ సేవలో 43 సంవత్సరాలు పూర్తిచేశారు