కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 2/1 పేజీలు 23-26
  • యెహోవా మనకొరకు ఏమిచేశాడో చూడండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మనకొరకు ఏమిచేశాడో చూడండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • పాశ్చాత్యమందు, మధ్య ఆఫ్రికాలో మరింతగొప్ప స్వేచ్ఛ
  • దక్షిణ ఆఫ్రికాలో చట్టబద్ధం చేయబడుట
  • సాక్ష్యపు పనిలో యౌవనులు పాల్గొంటున్నారు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 2/1 పేజీలు 23-26

యెహోవా మనకొరకు ఏమిచేశాడో చూడండి!

“అటువంటి సందర్భం కొరకు మేము ప్రార్థించే వాళ్లము” అని ఒకాయనన్నాడు. మరొకాయన ప్రార్థించడానికి ప్రతి ఉదయం నాలుగు గంటలకే మేల్కొనేవాడు. దేనికొరకు? “ఏదొక రోజు బహిరంగంగా యెహోవాను ఆరాధించే స్వేచ్ఛ మాకు లభిస్తుందని ప్రార్థించడానికే” అని ఆయనన్నాడు. జనవరి 1992లో ఆడిస్‌ అబాబా, ఇతియోపియాలో యెహోవాసాక్షులు “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను తమ జిల్లా సమావేశానికి కూడుకొన్నప్పుడు, దీనత్వంతో, చిత్తశుద్ధితో చేసిన ఈ ప్రార్థనలకు సమాధానం లభించిందనే విషయం స్పష్టమయింది.

ఆఫ్రికాలో జరిగే మార్పుల్ని ఇతియోపియాలో జరిగిన ఆ సమావేశం సూచిస్తుంది. పూర్వం నిషేధించబడిన, లేక ఆంక్షలు విధించబడిన 13 దేశాలలో ఇటీవల సంవత్సరాలందు చట్టబద్ధమైన స్వేచ్ఛ లభించడం యెహోవా ప్రజలకెంతో సంతోషానిచ్చింది. ప్రభుత్వాధికారుల గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ పూర్తవడంతో ఇతియోపియాలో గత 34 సంవత్సరాల అధికార నిషేధానికి 1991 నవంబరు 11లో తెరపడింది. వెంటనే సాక్షులు అంతర్జాతీయ సమావేశానికి తగిన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికిని, ఆడిస్‌ అబాబ నగర స్టేడియంలో 7,573 మంది సమకూడడం ప్రతివారిని ఆనందోత్సాహంలో ముంచివేసింది. హాజరైన అనేకులకు అది ఒక కలలా అన్పించింది. వారు పదే పదే ఒకరితోనొకరు, “బ్రదర్‌, యెహోవా మనకొరకు ఏమిచేశాడో చూడండి!” అని చెప్పుకున్నారు.—కీర్తన 66:1-5; 126:1 పోల్చండి.

వారి 34 సంవత్సరాల నిషేధం కొన్ని అనూహ్య సమస్యల్ని సృష్టించింది. వారిలో అనేకులకు వీనులవిందైన రాజ్య పాటలు తెలియవు. సమావేశానికి ముందు వారెలా ఆ పాటలు పాడడాన్ని నేర్చుకున్నారు? సమావేశ కార్యక్రమమందలి 17 పాటలతో సహా నలభై పాటలు అమ్‌హరిక్‌ భాషలోనికి అనువదించబడ్డాయి. ఆ పాటలను ఒక ఆడియో క్యాసెట్టులో రికార్డు చేయడానికి ఒక ప్రత్యేకమైన కోరస్‌ ఏర్పాటు చేయబడింది. ముఖ్యపట్టణమందలి ప్రతి సంఘం ఒక్కొక టేపును పొందగల్గారు. సంఘమంతా కలిసి కూటములకు ముందు ఆ తర్వాత, 30 నిమిషాలు ఆ పాటలను పాడుతూ అభ్యాసం చేశారు. ఫలితం? సమావేశ సమయంలో ఆ స్టేడియమంతా హృదయ పూర్వకంగా, ఆనందంతో పాడిన పాటలతో మారుమ్రోగిపోయింది.

ఆ దేశ తూర్పుప్రాంతం కల్లోలితమై యున్నందున డిరిడెవ, హారర్‌ నుండి ముఖ్యపట్టణానికున్న రహదారి మూసివేయబడింది. అక్కడనుండి కేవలం విమానంలోనే ప్రయాణించాలి. విమాన ప్రయాణానికయ్యే ఖర్చులు భరించలేని స్థితిలోవున్ననూ, సమావేశానికి హాజరు కావలెననే కృతనిశ్చయంతో హారర్‌లోని ఎనిమిది మంది సహోదరులు సైనిక స్థావరానికి వెళ్లి తమను సైనిక విమానంలో వెళ్లనివ్వాల్సిందిగా వేడుకున్నారు. వారు ఆశ్చర్యపడే రీతిలో వారి విన్నపం ఆమోదించబడి, సమావేశానికి వెళ్లి రావడానికి వారికి ఉచిత ప్రయాణ ఏర్పాటు చేయబడింది.

గత మూడు దశాబ్దాలుగా కష్టాల్ని, హింసను భరిస్తూ, విశ్వాసం నిమిత్తం ప్రాణాలొడ్డిన తమ స్నేహితులను చూస్తూ వారు చేసిన ప్రార్థనలకు సమాధానం రావడం చూసిన ఇథియోపియాలోని ఈ సహోదరుల కళ్లు ఆనందంతో చెమర్చాయి. ఒక ప్రతినిధి యిలా అన్నాడు: “సమావేశం ఆరంభమయిన దగ్గరనుండి నేను ఏడుస్తునే ఉన్నాను.” మరొకాయన యిలా అన్నాడు: “హృదయాల్ని చదివే శక్తి మీకుంటే, నేనెంత ఆనందపడుతున్నానో మీరు చూడగలరు.” అవును, ఈ నమ్మకమైన సాక్షుల విషయంలో యెహోవా అద్భుతకరమైన కార్యం చేశాడు.—కీర్తన 66:16, 19.

పాశ్చాత్యమందు, మధ్య ఆఫ్రికాలో మరింతగొప్ప స్వేచ్ఛ

యెహోవా ప్రజల సేవ ఇటీవలనే చట్టబద్ధం చేయబడిన మరో దేశం బెనిన్‌. దాన్నిగూర్చి సాక్షులెలా భావిస్తున్నారు? అక్కడ ఒక క్రైస్తవ కూటానికి వెళ్లిన ప్రసంగీకుడొకరు యిలా అంగీకరించాడు: “ఈ దేశంలో ఆరాధనా స్వాతంత్ర్యం నిజంగా యెహోవా అనుగ్రహించిన వరం.” అవును, ఆరాధనలో కూడుకోవడానికి, యెహోవా రాజ్యాన్ని గూర్చి తమ పొరుగువారితో మాట్లాడడానికి నిషేధంలేని స్వేచ్ఛను—ధారాదత్తమని మనలో అనేకులు తలంచే స్వాతంత్ర్యాలను—అనుభవించగలందుకు అక్కడున్న సేవకులిప్పుడు మిక్కిలి కృతజ్ఞులై యున్నారు.

తమ ఆనందాన్ని వారెట్లు చూపగలరు? పైన ప్రస్తావించబడిన ప్రసంగీకుడు యిలా అన్నప్పుడు ఆయనొక మార్గాన్ని సూచించాడు: “ప్రకటించే పనిలో మనం పాలుపంచుకోవడం—ప్రత్యేకంగా సువార్తతో మనం ప్రతి ఇంటికి వెళ్లడం—ఈ స్వేచ్ఛయెడల మనం చూపే మెప్పును ప్రతిబింబిస్తుంది.” బెనిన్‌లో ఇది వాస్తవమే. దానికి రుజువుగా, పయినీర్ల సంఖ్యనే తీసుకోండి. పధ్నాలుగు సంవత్సరాల నిషేధం ఎత్తివేసిన తర్వాత అనగా 1990 జనవరిలో, 77 మంది ప్రచారకులు క్రమమైన పూర్తికాల సేవలో పాల్గొన్నారు. రెండు సంవత్సరాల తర్వాత ఆ సంఖ్య వేగంగా మూడింతలకంటే ఎక్కువగా పెరిగి 244కు చేరుకుంది!

అంటే నిషేధం ఎత్తివేయక ముందు బెనిన్‌లోని సాక్షులు చురుకుగా లేరని చెప్పడం కాదు. అరెస్టు చేయబడి తాము తీసుకురాబడే క్యాంపుకు నియమితుడైన ఒక సైనికాధికారి మీద వారి సహనం నిజంగా గొప్ప ప్రభావాన్ని చూపింది. యెహోవాను సేవించాలనే వారి స్థిరనిశ్చయత ఫలితంగా వారు తరచు అరెస్టు చేయబడుచున్నప్పటికినీ ఆయన వారితో తత్సంబంధాలు కల్గియుండెను. అలాచేయుట వలన, అంతకుముందు వారు చట్టరీత్యా స్వేచ్ఛననుభవించిన దినాల్లో తాను వారితో చేసిన ఉల్లాసవంతమైన బైబిలు చర్చలను ఆయనకు జ్ఞాపకం చేసుకొనుటకు అది సహాయపడింది.

చివరకు, వారి దృఢ విశ్వాసం ఆయనలో ఆత్మీయాకలిని తట్టిలేపింది. ఆయన వివిధ చర్చీలను, తెగలను తిరిగి చూశాడు, కాని వాటిలో ఏవియు ఆయన ఆకలిని తీర్చలేకపోయాయి. ఆ నిషేధం జనవరి 1990లో ఎత్తివేయబడినప్పుడు మాత్రమే ఆయన సాక్షులతో బైబిలును స్వేచ్ఛగా చర్చించి, తన ఆత్మీయావసరతకు సమాధానం పొందగల్గాడు. ఆయనిప్పుడు బాప్తిస్మం పొంది పయినీరుగా సేవ చేస్తున్నాడు. ఒక విధంగా, ఆయనలో వచ్చిన మార్పు, “మునుపు మనలను హింసపెట్టి . . . [ఇప్పుడు] మతమును ప్రకటించుచున్నాడని” చెప్పబడిన తార్సువాడైన సౌలుకు సంభవించిన దానిని బెనిన్‌లోని సహోదరులకు గుర్తుచేస్తుంది.—గలతీయులు 1:23.

మరొక పశ్చిమాఫ్రికా దేశమగు నైజర్‌లో, డిశంబరు 1991లో యెహోవాసాక్షులు చట్టబద్ధమైన కార్పొరేషన్‌గా రిజిష్టరు చేయబడి, వారి సేవపైవున్న నిషేధములు ఎత్తివేయబడెను. ఇక్కడ కూడ ఆనందం పెల్లుబుకింది. నైజర్‌లోని కార్యకలాపములను పర్యవేక్షించు నైజీరియా బ్రాంచి కార్యాలయం, ఒక సమావేశంలో కలిగిన ప్రతిస్పందనను యిలా నివేదిస్తున్నది: “మరాడి సమావేశంలో శుక్రవారం ముఖ్యాంశ ప్రసంగం అయిన తర్వాత, నైజర్‌లో మనకిప్పుడు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వబడిందని సహోదరులకు ప్రకటించడం జరిగింది. వారెంతో ఉప్పొంగిపోయి ఎన్నో నిమిషాలు వారలాగే చప్పట్లు కొట్టారు. ఆ ఉదయకాల కార్యక్రమ ముగింపునందు, సహోదరులంతా కోలాహలంగా మాట్లాడుతూ, ఆ శుభవార్త విషయమై ఒకరినొకరు కౌగలించుకుంటూ వారెంతో ఆనందించారు.” ఆ దృశ్యాన్ని ఊహించుకొని, మనం కూడ వారితోపాటు ఆనందించవచ్చును.

అక్కడి సహోదరులు తమకు క్రొత్తగా లభించిన స్వాతంత్ర్యాన్ని ఎలా ఉపయోగిస్తారు. నైజర్‌లోని ఒక పయినీర్‌ సహోదరి నిస్సంకోచంగా ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది. ఆమె యిలా వ్రాస్తున్నది: “మా ప్రాంతమగు నైజర్‌లో, అంతానికి ముందు మహాబబులోను నుండి బయటకు వచ్చువారు అసంఖ్యాకముగా ఉందురని వాస్తవాలు చూపిస్తున్నాయి. దీనికి రుజువుగా, నేను సందర్శించాల్సిన అనేకులను ఇతర ప్రచారకులకు అప్పగించిననూ, ప్రతినెల నేను 80 నుండి 85 పునర్దర్శనములు రిపోర్టు చేస్తూ, 13 లేదా 14 బైబిలు పఠనములను నిర్వహిస్తున్నాను.” ఆ నమ్మకమైన సహోదరి ఇంకను ఇట్లనుచున్నది: “నాకున్న ఆరోగ్య సమస్యల మూలంగా నేను అనుకున్నంతగా ప్రాంతీయ సేవ చేయలేక పోతున్నాను, అయితే ప్రతివారు తాము చేయగలిగినంతా చేస్తున్నారు.”

మధ్య ఆఫ్రికాలోని రువాండలో కూడ యెహోవాసాక్షుల పరిస్థితి నాటకీయంగా మారింది. వారిది చట్టబద్ధమైన సంస్థయని గుర్తిస్తూ 1992 ఏప్రిల్‌లో అధికార పత్రం జారీచేయబడింది. జ్ఞాపకార్థ దినమున్న వారంలోనే ఆ పత్రం అందగా, ఆ సంఘటనకు 6,228 మంది హాజరవడాన్ని చూసిన 1,526 మంది ప్రచారకులు ఎంతగానో పులకించిపోయారు. సువార్తను ప్రకటించడంలో మరింతగా పాల్గొంటూ ఈ ప్రియ సహోదరులు ఆనందాన్ని, హర్షాన్ని ప్రదర్శిస్తారా? నిశ్చయంగా. ఆ ఏప్రిల్‌ నెలలోనే సంఘ ప్రచారకులు ప్రకటించే పనిలో సగటున 27.7 గంటలు గడిపి, సగటున 17 పునర్దర్శనాలు చేసి, 2.4 బైబిలు పఠనాలు నిర్వహించారు. మరియు వారిలో 40 శాతం మంది ఏదోక రకమైన పూర్తికాల సేవలో ఉండిరి.

దక్షిణ ఆఫ్రికాలో చట్టబద్ధం చేయబడుట

దక్షిణ ఆఫ్రికా క్రింది భాగంలోగల రెండు అందమైన దేశాలగు మొజాంబిక్‌, అంగోలాల్లో క్రొత్తగా స్వాతంత్ర్యం లభించింది. మొజాంబిక్‌లో 1991 ఫిబ్రవరిలో సేవ చట్టబద్ధం చేయబడింది. అంతర్యుద్ధంచే చిన్నాభిన్నం చేయబడిన తర్వాత నెమ్మదిగా పరిస్థితి చక్కబడుచుండగా, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆ దేశానికి మిషనరీలను పంపించింది. మిషనరీలు అదెంతో సారవంతమైన ప్రాంతంగా కనుగొన్నారు. బైబిలు సాహిత్యాలకు—ప్రత్యేకంగా యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌—డిమాండు ఎక్కువగా ఉంది. కేవలం రెండున్నర గంటలకంటె తక్కువ సమయంలోనే తాను 50 పుస్తకాలు అందించినట్లు ఒక మిషనరీ నివేదిస్తున్నది.

ఆసక్తిగల ప్రజలు వెంటనే స్పందిస్తున్నారు. సొసైటికి ఇవ్వబడిన అడ్రసుకు ఒక మిషనరీ వెళ్లగా, ఆ యింటి యజమాని ఒక సైనికోద్యోగియని తెలిసింది. అక్కడ ఆయనతో, ఆయన ఇద్దరి బంధువులతో ఒక చక్కని చర్చ జరిగింది. పునర్దర్శనమందు ఆ వ్యక్తి ఆలాగే మరి ఐదుగురు ఇతర వ్యక్తులతో మరొక ఫలవంతమైన చర్చ జరిగింది. ఆ పిమ్మట బహిరంగ ప్రసంగానికి, కావలికోట పఠనానికి రావల్సిందిగా వారికివ్వబడిన ఆహ్వానాన్ని వారంగీకరించారు—ఇదంతా కేవలం నాలుగు రోజుల్లోనే జరిగింది.

అంగోలాలో స్వాతంత్ర్యం క్రమేణి వృద్ధియై చివరకు ఏప్రిల్‌ 1992లో సేవ చట్టబద్ధం కావడంతో సాక్షులు ఎంతో ఆనందించారు. లభించిన ఈ గొప్ప స్వాతంత్ర్యాన్ని వారెట్లు ఉపయోగిస్తున్నారు? ప్రాంతీయ సేవలో వారు పాల్గొంటున్నారు. అంగోలాలో దాదాపు 17,000 మంది ప్రచారకులుండగా, వారు 60,000 బైబిలు పఠనములను నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌ అభివృద్ధికి యిదెంత చక్కని ఉత్తరాపేక్ష!

సాక్ష్యపు పనిలో యౌవనులు పాల్గొంటున్నారు

ప్రకటించే పని ఇటీవలనే చట్టబద్ధం చేయబడిన ఈ దేశాల్లో, యౌవనులు, ఇంకా బాప్తిస్మం పొందని వారు సహితం పరిచర్యలో పాల్గొనుట ద్వారా తమ మెప్పును చూపిస్తున్నారు. యెహోవాసాక్షులు నవంబరు 1990లో చట్టబద్ధం చేయబడిన కేప్‌వర్డీ రిపబ్లిక్‌లో జరిగిన ఒక సమావేశంలో, తన విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తం చేయడానికి ఒక 17 సంవత్సరాల బాలిక లేచి నిలబడింది. బాప్తిస్మం తర్వాత, ఆమె చుట్టూ చేరిన ఒక గుంపును సందర్శకుడొకరు చూశారు. ఆమెను అభినందించడానికి ఆయనక్కడకు వెళ్లి, ఆ గుంపు ఎవరని ఆమెనడిగాడు. దానికామె, “ఓహా అదా, వారు నా బైబిల్‌ స్టడీస్‌” అని జవాబిచ్చింది. ఆమె ఏడు బైబిలు పఠనములు నిర్వహిస్తుంది, కాగా ఆమె బాప్తిస్మం తీసుకోవడాన్ని అభినందించడానికి వారంతా అక్కడకు వచ్చారు. ఆమె అప్పటికే సహాయ పయినీర్‌ సేవచేయడానికి దరఖాస్తు చేసింది. ఆలాగే ఆమె చివరకు క్రమ పయినీర్‌ కావడానికి అర్హురాలయ్యేందుకు నిరీక్షిస్తుంది.

తను ప్రచారకురాలేనా అని ఒక పది సంవత్సరాల బాలికను ప్రశ్నించినప్పుడు, దానికామె “అవును” అని సమాధానం చెప్పింది. ఆమె ఏమైనా బైబిలు పఠనములు నిర్వహిస్తుందా? “అవును.” ఎన్ని? “ఏడు” అని ఆ పది సంవత్సరాల అమ్మాయి సమాధానం చెప్పింది.

మొదటి శతాబ్దంలో ఒక సందర్భమందు, “యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెనని” మనం అపొ. కార్యములలో చదివెదము. (అపొ. కార్యములు 9:31) ఆఫ్రికాలోనున్న మన సహోదరులకు ఇది సమాధానకర కాలముగా కూడ ఉండవలెనని కూడా మనము ప్రార్థిస్తాము. వారు బలపడుచుండగా వారితోకూడ మనమానందిస్తాము, ఆలాగే సువార్తను ప్రకటించుటకు వారి స్వాతంత్ర్యంనుండి వారు ప్రయోజనం తీసుకుంటూ, వారు విస్తరిస్తుండగా యెహోవా పరిశుద్ధాత్మ వారిపై ఉండాలని మనం ప్రార్థిస్తాము.

[24వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

యెహోవాసాక్షులు చట్టబద్ధం చేయబడడం లేదా వారిపైనున్న ఆంక్షలు తొలగించబడిన దేశాలు

1. గాంబియా, డిశంబరు 1989

2. బెనిన్‌, జనవరి 1990

3. కేప్‌వర్డీ రిపబ్లిక్‌, నవంబరు 1990

4. మొజాంబిక్‌, ఫిబ్రవరి 1991

5. ఘానా, నవంబరు 1991

6. ఇతియోపియా, నవంబరు 1991

7. కాంగో, నవంబరు 1991

8. నైజర్‌, డిశంబరు 1991

9. టొగొ, డిశంబరు 1991

10. చాడ్‌, జనవరి 1992

11. కెన్యా, మార్చి 1992

12. అంగోలా, ఏప్రిల్‌ 1992

13. రువాండా, ఏప్రిల్‌ 1992

[23వ పేజీలోని చిత్రం]

బెనిన్‌లో రాజ్య ప్రచారకుడు తన టాకింగ్‌ డ్రమ్‌తో మత్తయి 24:14లోని మాటలు మ్రోగిస్తున్నాడు

[25వ పేజీలోని చిత్రం]

అనేక ఆఫ్రికా దేశాలలో, తమకు క్రొత్తగా లభించిన స్వాతంత్ర్యాన్ని నిజ క్రైస్తవులు సద్వినియోగం చేసుకుంటున్నారు

[26వ పేజీలోని చిత్రం]

సాక్షులు యెహోవాకు నీటి బాప్తిస్మం ద్వారా తాము చేసుకొనిన సమర్పణను సూచిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి