కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జూలై పేజీలు 26-30
  • నన్ను మలిచే బాధ్యతను యెహోవా చేతుల్లోనే ఉంచాను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నన్ను మలిచే బాధ్యతను యెహోవా చేతుల్లోనే ఉంచాను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవున్ని తెలుసుకోవాలనే కోరిక చిన్నప్పుడే చిగురించింది
  • పయినీరింగ్‌ చేయడానికి యూనివర్సిటీ చదువును వదిలేశాను
  • బ్రూక్లిన్‌ బెతెల్‌ నన్ను మంచి బ్రదర్‌గా మార్చింది
  • “నువ్వు జపనీస్‌ భాష నేర్చుకో!”
  • జపాన్‌లో బెతెల్‌ సభ్యులుగా, తర్వాత ప్రత్యేక పయినీర్‌లుగా
  • నన్ను మలిచే బాధ్యతను యెహోవా చేతుల్లోనే ఉంచాను
  • ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్‌ కాగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
    మన రాజ్య పరిచర్య—1995
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
  • అందరికీ ఆహ్వానం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జూలై పేజీలు 26-30
కెన్‌ క్యుచి

జీవిత కథ

నన్ను మలిచే బాధ్యతను యెహోవా చేతుల్లోనే ఉంచాను

కెన్‌ క్యుచి చెప్పినది

న్యూయార్క్‌లోని, బ్రూక్లిన్‌ బెతెల్‌లో పనిచేసిన మొదటి రోజును నేను అస్సలు మర్చిపోలేను. నన్ను పుస్తకాలు బైండింగ్‌ చేసే డిపార్ట్‌మెంట్లో వేశారు. నాకు ఇంకా గుర్తు, నేను అక్కడ అడుగుపెట్టగానే ఆ మెషిన్ల నుండి టకటక అని పెద్దపెద్ద శబ్దాలు వినిపించాయి. ఎటు చూసినా పేపర్‌ దుమ్మే ఉంది. ఆ మెషిన్లకి వాడే నూనె వాసనైతే అసలు తట్టుకోలేం.

అక్కడ నాకు చాలా విషయాలు నచ్చాయి. కానీ అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే, అక్కడ పనిచేస్తున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌. వాళ్లందరూ యౌవనులే! వాళ్లు చేసే పని చూడడానికి బోర్‌ కొట్టేలా అనిపించినా, వాళ్లని ఎవరూ పెద్దగా మెచ్చుకోకపోయినా, ఈ పనిని వాళ్లు చాలా సంతోషంగా చేసేవాళ్లు. వాళ్లని చూసి యెహోవాను వినయంగా సేవించడం అంటే ఏంటో నేను నేర్చుకున్నాను.

నేను ఒక మంచి సేవకుడిగా అవ్వడానికి యెహోవా నాకు చాలా ఏళ్లుగా సహాయం చేస్తూనే వచ్చాడు. అయితే, దాని గురించి చెప్పేముందు నేను బౌద్ధ మతంలో ఉన్నప్పుడు సత్యం కోసం ఎలా వెతికానో చెప్తాను.

దేవున్ని తెలుసుకోవాలనే కోరిక చిన్నప్పుడే చిగురించింది

నేను అమెరికాలోని, ఇల్లినాయిస్‌లోని, చికాగోలో పుట్టి పెరిగాను. నాకు ఒక చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు. అప్పట్లో మా అమ్మానాన్నలు అమెరికాకు వెళ్తే లైఫ్‌ చాలా బావుంటుందని అనుకున్నారు. అందుకే జపాన్‌ నుండి చికాగోకు వచ్చేశారు. మమ్మల్ని బాగా చదివించాలి, మేము జీవితంలో బాగా ఎదగాలి అన్నదే వాళ్ల కోరిక.

మా అమ్మానాన్నలు బౌద్ధ మతంలో పాతుకుపోయారు. మా అమ్మవాళ్ల ఇంట్లోనైతే బుద్ధుడి కోసం ఏకంగా ఒక గుడే ఉండేది. మా తాతయ్య, ఇద్దరు మామయ్యలు బౌద్ధ సన్యాసులుగా సేవచేశారు. కాబట్టి నేను చిన్నప్పటి నుండి బౌద్ధ ఆచారాలు నేర్చుకుంటూ పెరిగాను. స్కూల్‌ నుండి ఇంటికి రాగానే బుద్ధుడి విగ్రహం ముందు అగర్బత్తి వెలిగించి, బియ్యం, నీళ్లు పెట్టేవాడిని. ప్రతీ ఆదివారం మేము బుద్ధుడి గుడికి వెళ్లి పూజించేవాళ్లం. అక్కడున్న విగ్రహం మా ఇంట్లో దానికంటే చాలా పెద్దది, బంగారంతో పూత పూసి ఉండేది.

నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు, మా ఇంట్లో ఉన్న విగ్రహం వైపు చూస్తూ, ‘చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది?’ అని ఆలోచించడం మొదలుపెట్టాను. బౌద్ధ మతంలో, చనిపోయిన తర్వాత ఆత్మ వేరేచోట ఉంటుందని చెప్తారు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏదోక రోజు నేను చనిపోతాను; నా ఆత్మ కూడా ఏదో లోకంలో తిరుగుతుంటుంది. కానీ, ఒక మనిషిలా ఇంకెప్పుడూ నా జీవితాన్ని ఆనందించలేను. ఆ విషయం నాకు చాలా బాధగా అనిపించింది.

నాకు దాదాపు 15 ఏళ్లు ఉన్నప్పుడు, బౌద్ధ ఆచారాలన్నీ అర్థంపర్థం లేనట్టుగా అనిపించాయి. నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది, ఇది కాదు అని అనిపించేది. (మత్త. 5:3) నిజమైన, శక్తివంతమైన దేవుడు ఇంకెవరో ఉంటాడని మనసులో గట్టిగా అనిపించేది. ఆయన గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. నా ప్రశ్నలన్నిటికీ బైబిల్లో జవాబు ఉంటుందని ఎందుకో అనిపించి, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిల్ని కొన్నాను. అది ఎక్కడ దొరికిందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు! బౌద్ధుల ఉత్సవాలు జరిగే చోట దాన్ని సెకండ్‌ హ్యాండ్‌లో కొన్నాను.

తనకు స్టడీ ఇచ్చిన విల్సన్‌ బాషౌతో యువకుడైన కెన్‌ క్యుచి.

నాకు స్టడీ ఇచ్చిన విల్సన్‌ బాషౌతో

నేను ఒకరోజు నా కుక్కని వాకింగ్‌కు తీసుకెళ్లినప్పుడు, విల్సన్‌ బాషౌ అనే బ్రదర్‌ని కలిశాను. అప్పుడు నాకు 17 ఏళ్లు. ఆయన నన్ను, “భవిష్యత్తు గురించి దేవుడు ఏమని మాటిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగాడు. ఆ చిన్ని ప్రశ్నతో మా మాటలు బైబిల్లోని లోతైన విషయాల దాకా వెళ్లిపోయాయి. ఆయన ప్రకటన 17:1 చదివి, “ఈ లేఖనంలో ‘అనేక జలాలు’ అంటే ఏంటో మీకు తెలుసా?” అని అడిగాడు. నాకు తెలీదు అన్నాను. అప్పుడు ఆయన 15వ వచనం చూపించి, అనేక జలాలు అంటే ప్రజలే అని చెప్పాడు. అలా యెహోవాసాక్షులు, ప్రతీ దానికి బైబిల్లో నుండే జవాబులు చూపించడం నాకు బాగా నచ్చింది. విల్సన్‌ నాకు నిత్య జీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం ఇచ్చాడు. ఆ నీలం రంగు పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది.

పది రోజుల తర్వాత, నేను మొదటిసారి మీటింగ్‌కి వెళ్లాను. వాళ్లు చూపించిన ప్రేమను నేను అస్సలు మర్చిపోలేను. అప్పటినుండి మానకుండా మీటింగ్స్‌కి వెళ్లాను. తర్వాత విల్సన్‌ నాకు బైబిలు స్టడీ మొదలుపెట్టాడు. నాకు స్టడీ ఎంత బాగా నచ్చేదంటే, కొన్నిసార్లు ఎనిమిది గంటలు కూర్చొని స్టడీ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇదంతా చూసి, నేను ఎక్కడ మారిపోతానో అని మా అమ్మానాన్నలకు భయం పట్టుకుంది. ఇంక స్టడీ వద్దంటే వద్దని చెప్పేశారు. కానీ స్టడీ తీసుకునే కొద్దీ, ఇదే సత్యమని నా నమ్మకం ఇంకాఇంకా పెరిగేది. అలా నేను 1983లో బాప్తిస్మం తీసుకున్నాను.

పయినీరింగ్‌ చేయడానికి యూనివర్సిటీ చదువును వదిలేశాను

నేను బాప్తిస్మం తీసుకునే సమయానికి, డాక్టర్‌ అవ్వాలని ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. నన్ను అక్కడ చదివించడానికి మా అమ్మవాళ్లు ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చుపెట్టారో నాకు తెలుసు. కాబట్టి ఒకపక్క చదవాలని ఉన్నా, యెహోవాకే నా బెస్ట్‌ ఇవ్వాలని, పూర్తికాల సేవ చేయాలని నా మనసులాగేది.

మా నాన్న నాతో, “నువ్వు గనుక చదువు మానేస్తే, ఇంట్లోంచి గెంటేస్తా!” అని అన్నాడు. నాకు చాలా బాధగా అనిపించింది. అమ్మానాన్న అంటే నాకు చాలా ఇష్టం, వాళ్లని అస్సలు బాధపెట్టాలని లేదు. అందుకే నేను చాలాసార్లు రాత్రిపూట క్యాంపస్‌ గ్రౌండ్‌లో కూర్చొని నక్షత్రాలను చూస్తూ, యెహోవాకు ఇలా ప్రార్థించే వాడిని, “యెహోవా, నేను మంచి నిర్ణయం తీసుకునేలా నాకు హెల్ప్‌ చెయ్యవా ప్లీజ్‌.” తర్వాత నేనిక చదువును ఆపేయాలని నిర్ణయించుకున్నప్పుడు, మా నాన్న చెప్పినట్టే నన్ను ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. నేను విల్సన్‌కి కాల్‌ చేసి జరిగింది చెప్పాను. అప్పుడు ఆయన నన్ను తనతో ఉండమని పిలిచాడు. అలా నేను నా వస్తువులన్నీ ఒక బ్యాగ్‌లో సర్దుకొని, బస్సు ఎక్కి విల్సన్‌ ఉండే అపార్ట్‌మెంట్‌కి వెళ్ళిపోయాను. ఇదంతా జరిగినా కూడా నాకు అస్సలు బాధగా అనిపించలేదు. కానీ ఒక తెలియని ప్రశాంతత నాలో ఉంది. అప్పుడే నేను సరైన నిర్ణయం తీసుకున్నా అని అనిపించింది.

నాకు పంజరంలో నుండి బయటికి వచ్చిన పావురంలా అనిపించింది. ఇంకా పూర్తిగా యెహోవా సేవ చేయడానికి రెక్కలు కట్టుకొని వెళ్లిపోయాను. అలా నేను నా పయినీరింగ్‌ని 1984లో మొదలుపెట్టాను.

నేను రెగ్యులర్‌ పయినీరింగ్‌ చేస్తున్న రోజుల్లో, యెహోవా నాకు చాలా మంచి లక్షణాల్ని నేర్పించాడు, అందులో ఒకటి పట్టుదల చూపించడం. ఒకరోజు నాకు ప్రీచింగ్‌కి వెళ్లాలని అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఆ మధ్యాహ్నం నాతో పాటు ప్రీచింగ్‌ చేయడానికి ఎవరూ లేరు. అయినాసరే వెళ్లాను. రెండు గంటల తర్వాత, చివరిగా ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లాను. ఒక్కడినే ఉండిపోయాను, బాగా అలసిపోయాను, చూస్తే వర్షం పడేలా ఉంది. మూడో ఫ్లోర్‌ ఎక్కుతూ, ‘ఇంటికి వెళ్లిపోనా, వద్దా?’ అని ఆలోచిస్తున్నాను. ఇంతలో నాకు ఫిలిప్పీన్స్‌కి చెందిన ఒకవ్యక్తి కనిపించాడు. ‘ఈయన అస్సలు వినడులే!’ అని నేను అనుకున్నాను. ఎంత తప్పుగా ఆలోచించానో! ఎందుకంటే ఆయన స్టడీ తీసుకుని బ్రదర్‌ అయ్యాడు.

బ్రూక్లిన్‌ బెతెల్‌ నన్ను మంచి బ్రదర్‌గా మార్చింది

విల్సన్‌తో రెండేళ్లు ఉన్న తర్వాత, 1985లో నన్ను బ్రూక్లిన్‌ బెతెల్‌కి పిలిచారు. నేను మొదట్లో చెప్పినట్టు, నాకు పుస్తకాలు బైండింగ్‌ చేసే పని అప్పగించారు. ఒకరోజు నేను పుస్తకాల కవర్లకు అచ్చు వేసే మెషీన్‌ దగ్గర పనిచేస్తున్నాను. అప్పుడు, అనుకోకుండా కొన్ని వందల పుస్తకాల కవర్లను పాడుచేశాను. తర్వాత, బ్రదర్స్‌ నన్ను ఏం జరిగిందో ఓవర్సీర్‌కి చెప్పమని అన్నారు. ఆ తప్పు ఎలా జరిగిందో నేను చెప్పుకుంటూ వెళ్లిపోతున్నాను కానీ, ఒక మాట చెప్పలేదు. మా ఓవర్సీర్‌ నాకు చాలా దయగా ఒక విషయం గుర్తుచేశాడు ఏంటంటే, “సారీ చెప్పడంలో తప్పులేదు.” నా తప్పుల్ని ఒప్పుకోవడం, “సారీ” చెప్పడం ఎంత ప్రాముఖ్యమో ఆ క్షణం అర్థమయ్యింది.

బ్రూక్లిన్‌ బెతెల్‌లో బైండింగ్‌ చేసే డిపార్ట్‌మెంట్‌లో పుస్తకాలకు వేసే అట్టల్ని చూపిస్తున్న కెన్‌.

బ్రూక్లిన్‌లో బైండింగ్‌ చేసే డిపార్ట్‌మెంట్‌ని చూపిస్తున్నప్పుడు

పెద్ద వయసులో కూడా నమ్మకంగా బెతెల్‌లో సేవ చేస్తున్నవాళ్లను చూసి, ఇతరులకు సేవ చేసే విషయంలో నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ఒకరోజు మధ్యాహ్నం, పరిపాలక సభ సభ్యుడైన బ్రదర్‌ మిల్టన్‌ హెన్షెల్‌ లంచ్‌ కోసం మా టేబుల్‌ దగ్గర కూర్చున్నాడు. ఆ రోజు ఎక్కువ మంది ఉండడంతో డైనింగ్‌ హాల్‌ అంతా నిండిపోయింది. దాంతో వడ్డించేవాళ్లు చాలా హడావిడిగా కంగారుగా వడ్డిస్తున్నారు. కానీ యువకులైన మేము, మా టేబుల్‌ దగ్గర కూర్చొని, ఏంటి ఇంత మెల్లగా వడ్డిస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. అయితే బ్రదర్‌ హెన్షెల్‌ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి వడ్డించేవాళ్లతో కలిసి ఆయన కూడా నీళ్లు, బ్రెడ్‌, బటర్‌ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన వినయంగా చేసిన ఆ పని, యేసు తన అపొస్తలులకు ఎలా సేవ చేశాడో గుర్తుచేసింది. నేను ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.—యోహా. 13:3-5.

“నువ్వు జపనీస్‌ భాష నేర్చుకో!”

సిస్టర్‌ మిచికో, ఆమె భర్తతో

1987లో నేను ఒకసారి జపాన్‌కి వెళ్లాను. అక్కడ ప్రచారకులు చూపించిన వినయం, ఉత్సాహం నాకు బాగా నచ్చాయి. వాళ్లకు సహాయం చేయాలనుకున్నాను. కానీ నాకు జపనీస్‌ భాష రాదు. నేను మళ్లీ అమెరికాకు తిరిగొచ్చాక, బెతెల్‌లో ఉన్న మిచికో అనే సిస్టర్‌కి ఆ విషయం చెప్పాను. అప్పుడు ఆమె, “నువ్వు జపనీస్‌ భాష నేర్చుకో!” అని చెప్పింది. నేను అదే చేశాను, ఆ భాష నేర్చుకున్నాను. ఆమె ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేస్తుందని నాకు అప్పుడు తెలీదు.

కొన్ని నెలల తర్వాత నన్ను న్యూయార్క్‌లోని, జపనీస్‌ సంఘానికి పంపించారు. జపనీస్‌ భాష నేర్చుకోవడం వల్ల యెహోవా సేవలో ఎన్నో అవకాశాలు నా ముందుకు వచ్చాయి. 1989లో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన జపనీస్‌ ప్రాదేశిక సమావేశానికి నేను మొదటిసారి హాజరయ్యాను. అక్కడి డ్రామాలో నటించిన, మివాకో ఓనామి అనే ఒక పయినీరు సిస్టర్‌ మీద మనసుపడ్డాను.

నేను, మివాకో 1992లో పెళ్లి చేసుకున్నాం. తర్వాత, మా ఇద్దరికి బ్రూక్లిన్‌ బెతెల్‌లో కలిసి సేవ చేసే గొప్ప అవకాశం దొరికింది. మివాకో చక్కగా ఆలోచిస్తుంది, ఇతరుల్ని పట్టించుకుంటుంది, సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. ఇతరులతో ఇంకా దయగా ఎలా ఉండాలో తనని చూసే నేర్చుకున్నాను. యెహోవా నాకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్‌ తనే. తను నా పక్కన ఉంటే నాకు ఎప్పుడూ సంతోషంగా, హాయిగా ఉంటుంది.

తమ పెళ్లిరోజున కెన్‌, మివాకో.

మా పెళ్లిరోజు

జపాన్‌లో బెతెల్‌ సభ్యులుగా, తర్వాత ప్రత్యేక పయినీర్‌లుగా

కొంతకాలానికి, జపాన్‌లో ఉంటున్న మివాకో వాళ్ల అమ్మానాన్నల ఆరోగ్యం బాగా పాడైంది. కాబట్టి వాళ్లని దగ్గరుండి చూసుకునేలా మమ్మల్ని జపాన్‌ బ్రాంచికి పంపించారు. 1999లో మేము అక్కడికి వెళ్లాం.

జపాన్‌లోని బెతెల్‌ కుటుంబం మమ్మల్ని అక్కున చేర్చుకుంది. మా కొత్త ఇంటికి మేము మెల్లమెల్లగా అలవాటుపడ్డాం. వాళ్లకున్న ఆతిథ్య స్ఫూర్తిని, ఉదారంగా ఇచ్చే గుణాన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. పని విషయానికొస్తే, వాళ్లు మనసుపెట్టి చాలా శ్రద్ధగా పనిచేస్తారు. సహజంగానే జపాన్‌ సంస్కృతిలో, ఎవరి స్వార్థం వాళ్లు చూసుకోకుండా అందరూ ఒక టీంలా కలిసి పనిచేస్తారు. కాబట్టి, ఈ బ్రదర్స్‌-సిస్టర్స్‌ కూడా ఒక టీంలా చక్కగా కలిసిమెలిసి పనిచేసేవాళ్లు. యెహోవా కోసం నేను చేసే చిన్నచిన్న పనుల్ని విలువైనవిగా చూడాలని, వినయంగా ఇతరులతో కలిసి పనిచేయాలని వాళ్లను చూసి నేర్చుకున్నాను.

నేను పెరిగిన విధానానికి, జపాన్‌ సంస్కృతికి చాలా తేడా ఉంది. కాబట్టి, కొన్నిసార్లు బ్రదర్స్‌ కొన్ని విషయాల్ని ఫలానా విధంగా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. కానీ, నేను అతిగా స్పందించకుండా ఓపిక చూపించడం నేర్చుకున్నాను. కొంతకాలానికి నేనొక విషయాన్ని అర్థం చేసుకున్నాను. అదేంటంటే, తన సంస్థ ద్వారా యెహోవా ఇచ్చే నిర్దేశాన్ని పాటించినంత కాలం మేము ఏ నిర్ణయం తీసుకున్నా యెహోవా దాన్ని దీవిస్తాడు. ఎందుకంటే, తన పనిని ఎలా చేయించుకోవాలో యెహోవాకు బాగా తెలుసు.

బెతెల్‌లో నాకు దొరికిన శిక్షణ మోషే ప్రవక్తని గుర్తుచేసింది. నేను కూడా ఆయనలాగే ఉన్నత విద్య చదివాను. దానివల్ల సొంత నిర్ణయాలు తీసుకుంటూ, గర్వంతో ఉండేవాణ్ణి. అయితే, మోషే 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సాత్వికాన్ని నేర్చుకునేలా యెహోవా సహాయం చేశాడు. నేను కూడా వినయంగా ఉంటూ యెహోవా మీద ఆధారపడేలా బెతెల్‌ నేర్పించింది. యెహోవా మోషేను ఓపిగ్గా మలిచినట్టే, నన్ను కూడా ఇన్ని సంవత్సరాలు మలుస్తూ వచ్చాడు.

తన టేబుల్‌ దగ్గర కూర్చున్న కెన్‌.

జపాన్‌ బ్రాంచిలో పని చేస్తున్నప్పుడు

మివాకో వాళ్ల అమ్మానాన్నల్ని దాదాపు 24 సంవత్సరాలు అంటే వాళ్లు చనిపోయేంతవరకు జాగ్రత్తగా చూసుకున్నాం. ఎన్నో ఫోన్‌ కాల్‌లు, గుండెదడ పుట్టించే సందర్భాలు, హాస్పిటల్‌కి ఉరుకులు పరుగులు . . . ఇలా ఎన్నో చూశాం. మా అత్తగారు మసాకో ఆరోగ్యం ఎంతలా పాడైందంటే, ఆమె లేచి నిలబడడం కూడా గగనమయ్యేది. మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి రావాలన్నా ఆమె చాలా కష్టపడేది. ఆమె చివరి రోజుల్లో వీల్‌ఛైర్‌కే పరిమితమైంది. ఏదేమైనా, యెహోవా మీద ఆమెకు ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. సత్యం గురించి మాట్లాడినప్పుడల్లా, ఆమె మొహం సంతోషంతో వెలిగిపోయేది. పరిస్థితులు ఎలా ఉన్నా యెహోవా సేవ చేయాలని, సంతోషంగా-సంతృప్తిగా ఉండాలని మా అత్తగారి నుండి నేను నేర్చుకున్నాను.

ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్న కెన్‌, మివాకో.

ఓకినావాలో మివాకోతో ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు

2024లో మా నియామకం మారింది. అది మా జీవితంలో ఒక పెద్ద మార్పనే చెప్పాలి. బెతెల్‌లో దాదాపు 30 ఏళ్లకు పైగా సేవ చేసిన తర్వాత, మమ్మల్ని ఓకినావా ద్వీపానికి స్పెషల్‌ పయినీర్లుగా పంపించారు. మేము ఇప్పుడు అక్కడే సేవ చేస్తున్నాం. అక్కడి సైనిక శిబిరానికి దగ్గరలో ఉన్న కుటుంబాలకు పరిచర్య చేసే అవకాశం మాకు దొరికింది. బెతెల్‌లో మాకు దొరికిన శిక్షణ వల్ల, మమ్మల్ని కొత్త నియామకానికి పంపించినప్పుడు మేము పెద్దగా కష్టపడలేదు. మాకు ఒక మంచి షెడ్యూల్‌ ఉంది. మాకు ఉన్న సమయాన్ని పూర్తిగా పరిచర్యకు ఉపయోగిస్తూ కష్టపడుతున్నాం. యెహోవా మాకు మంచి స్టడీల్ని ఇచ్చి దీవించాడు. వాళ్లు మాకు కుటుంబంతో సమానం. ప్రజల్ని ప్రేమించడమే అన్నిటికన్నా ముఖ్యమని, ఇప్పుడు ఇంకా ఎక్కువగా నేర్చుకుంటున్నాం. ఇంత మంచి నియామకం ఇచ్చినందుకు, మివాకో ఇంకా నేను యెహోవాకు ఎంత థాంక్స్‌ చెప్పినా తక్కువే.

నన్ను మలిచే బాధ్యతను యెహోవా చేతుల్లోనే ఉంచాను

ఇప్పుడు నా కుటుంబం నన్ను వ్యతిరేకించట్లేదు. అలాగని సత్యంలోకి కూడా ఇంకా రాలేదు. కానీ, తన శిష్యులు అవ్వడం కోసం కుటుంబాన్ని కూడా వదులుకున్న వాళ్లకు 100 రెట్లు ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఇస్తానని యేసు ముందే మాటిచ్చాడు. (మార్కు 10:29, 30) ఆ మాటలు అక్షరాల నిజం. నా జీవితంలో నేను దాన్ని కళ్లారా చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వందల కుటుంబాలు నన్ను వాళ్ల సొంత కొడుకులా ప్రేమగా చూసుకున్నాయి. వాళ్లని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

విల్సన్‌ నాకు ఇచ్చిన సత్యం పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ చిన్ని పుస్తకాన్ని చూసినప్పుడల్లా, యెహోవా నాకు పరిచయం అయిన రోజులు గుర్తుకొస్తాయి. (1 దిన. 28:9) యెహోవా చేతిలో నన్ను నేను ఇంకా మలచుకోవాలని, శాశ్వత జీవితానికి నడిపించే సత్యాన్ని ఇతరులకు నేర్పించాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి