చక్రవర్తి ఆరాధన నుండి సత్యారాధనకు
ఈసాము సూగీయూరా
1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోబోతుందన్నది స్పష్టమే అయినప్పటికీ, కామికేజ్ (“దైవిక గాలి”) వీచి శత్రువును ఓడగొడ్తుందన్న నమ్మకంతో మేమున్నాం. 1274లోను, 1281లోను ఆక్రమించడానికి వచ్చిన మంగోలుల యుద్ధనౌకలను చాలావాటిని జపాన్ తీరం దగ్గర నాశనం చేసి, వాళ్ళు వెనుదిరగడం తప్పనిసరి చేసిన తుపానులను కామికేజ్ సూచిస్తుంది.
కనుక, 1945, ఆగస్ట్ 15న జపాన్ మిత్ర దేశాల బలగాలకు లొంగిపోయిందని చక్రవర్తి హిరోహిటో ప్రకటించినప్పడు, తమను తాము ఆయనకు సమర్పించుకున్న లక్షలాది మంది ప్రజల ఆశలన్నీ అడియాశలైపోయాయి. నేను అప్పుడు బడి పిల్లవాడ్ని. ఆ సమయంలో నా ఆశలు కూడా అడియాశలైపోయాయి. ‘సజీవ దైవం చక్రవర్తి కాకపోతే, ఇంకెవరు?’ ‘నేను ఎవరిని నమ్ముకోవాలి?’ అని అనుకున్నాను.
అయితే, నిజానికి రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోవడం వల్ల నేనూ, మరనేక వేలమంది జపానీయులూ సత్యదేవుడైన యెహోవాను గురించి తెలుసుకునే మార్గం తెరుచుకుంది. నేను చేసుకోవలసి వచ్చిన మార్పులను గురించి చెప్పే ముందు, నేను పెరిగిన మతసంబంధ వాతావరణాన్ని గురించి చెబుతాను.
చిన్నప్పటి మతసంబంధ ప్రభావాలు
నేను నగోయా నగరంలో 1932, జూన్ 16న జన్మించాను. మేము నలుగురం అబ్బాయిలం. నేనే చిన్నవాడ్ని. మా నాన్నగారు నగర సర్వేయర్‌గా పని చేసేవారు. అమ్మ షింటో మత సంబంధ టెన్రిక్యో బోధలను శ్రద్ధాభక్తులతో విశ్వసించేది. మా పెద్దన్నయ్య టెన్రిక్యో టీచర్‌గా మతసంబంధ ట్రెయినింగ్ తీసుకున్నాడు. ఎక్కువగా నేనూ అమ్మ సన్నిహితంగా ఉంటాం. ఆమె నన్ను తనతో పాటు ఆరాధనకు కూడుకునే స్థలానికి తీసుకువెళ్ళేది.
తల వంచుకుని ప్రార్థించడం నాకు నేర్పించారు. టెన్రి ఓ నో మీకోటో అనే సృష్టికర్త మీదా, అలాగే కొంచెం క్రింది స్థానంలో ఉండే పది దేవతల మీదా విశ్వాసాన్ని టెన్రిక్యో మతం బోధించింది. ఈ మత సభ్యులు విశ్వాస స్వస్థతలను చేసేవారు. ఇతరులకు సపర్యలు చేయాలనీ, తమ నమ్మకాలను ప్రచురం చేయాలని నొక్కి చెప్పేవారు.
పిల్లవాడిగా, నాకు చాలా జిజ్ఞాస ఉండేది. నేను చంద్రుడ్నీ, రాత్రి ఆకాశంలోని లెక్కించలేనన్ని తారలను చూసి అచ్చెరువొందేవాడ్ని, ఆకాశానికి అవతల అంతరిక్షం ఎంతమేరకు విస్తరించి ఉందా అని ఆలోచించేవాడ్ని. పెరట్లో కొంచెం స్థలంలో నేను నాటిన వంగమొక్కలు, దోసపాదులు పెరగడాన్ని గమనించడం అద్భుతంగా ఉండేది. ప్రకృతిని పరిశీలించడం దేవుడిపైన నా విశ్వాసాన్ని బలపరచింది.
యుద్ధం జరుగుతున్న సంవత్సరాలు
1939 నుండి 1945 వరకు నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకోవడమూ, రెండవ ప్రపంచ యుద్ధమూ అనుకోకుండా ఒకేసారి జరిగాయి. చక్రవర్తి ఆరాధన షింటోలో ముఖ్యభాగం. మా పాఠశాల విద్యాభ్యాసంలో దానికి ప్రాముఖ్యత ఇవ్వబడేది. జాతీయ, మరియు సైనిక సంబంధమైన మితిమీరిన భావాలతో కూడిన నైతిక శిక్షణ ఇమిడివుండే షూషీన్ నీతిశాస్త్రం మాకు బోధించబడేది. పతాకం ఎగురవేసే తంతులు, జాతీయ గీతాన్ని పాడడం, సామ్రాజ్య విద్యాభ్యాస సంబంధ శాసనాలను పఠించడం, చక్రవర్తి ఫోటోకు భక్తి చూపించడం అన్నీ కూడా పాఠశాల దైనందిన కార్యక్రమంలో భాగమే.
మా రాజ్యపు సైనికుల విజయం కోసం దేవుడ్ని ప్రార్థించడానికి మేం స్థానిక షింటో పుణ్యక్షేత్రానికి వెళ్ళేవాళ్ళం. నా ఇద్దరు అన్నయ్యలు సైన్యంలో సేవచేసేవారు. నేను చేసిన జాతీయ మత విద్యాభ్యాసాన్నిబట్టి, జపానీయుల సైన్యం గెలుపొందిందన్న వార్త విన్నప్పుడు చాలా ఆనందించాను.
జపనీస్ ఎయర్‌క్రాఫ్ట్ పరిశ్రమకు నగోయ కేంద్రం గనుక, అది అమెరికా యొక్క పెద్ద యుద్ధ విమానాల దాడికి ముఖ్య లక్ష్యమయ్యేది. పగటి వేళ B-29 సూపర్‌ఫోర్‌ట్రెస్ బాంబర్‌లు నగరం మీదుగా, దాదాపు 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ కర్మాగారాలుండే జిల్లాల్లో వందల కొలది టన్నుల బాంబులను వేసేవి. రాత్రి వేళ అవి 4,500 అడుగుల అంత తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని సెర్చ్‌లైట్లు కనుగొన్నాయి. బాంబులను పేల్చుతూ మళ్ళీ మళ్ళీ పైనుంచి దాడులు జరగడం వల్ల ఇండ్లున్న ప్రాంతాలు బాగా వేడెక్కిపోయాయి. యుద్ధం జరిగిన గత తొమ్మిది నెలల్లో కేవలం నగోయాలోనే 54 సార్లు పైనుంచి దాడులు జరిగాయి. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించడమూ, 7,700 కన్నా ఎక్కువ మరణాలు సంభవించడమూ జరిగింది.
ఇంతలో, యుద్ధనౌకల్లో నుండి తీరప్రాంతపు పది నగరాల మీద బాంబుల దాడి మొదలైంది. టోక్యోకు సమీపంలో అమెరికా ఫోర్స్‌లు సైన్యాలు దిగే సాధ్యతను గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు వెదురు ఈటెలతో పోరాడేందుకు స్త్రీలకూ మగ పిల్లలకూ తర్ఫీదు ఇవ్వబడింది. “ఈచియోకూ సోగ్యోకూసై” అనే మా నినాదానికి అర్థం “లొంగిపోవడం కన్నా కోట్లమంది యుద్ధంలో చనిపోవడమే మేలు.”
“హిరోషిమా మీద క్రొత్త రకం బాంబు వేయబడింది” అని 1945, ఆగస్ట్ 7న, వార్తాపత్రికలోని హెడ్‌లైన్ నివేదించింది. రెండు రోజుల తర్వాత, మరో బాంబు నాగసాకి మీద వేయబడింది. ఈ రెండూ అణు బాంబులే. ఆ రెండు బాంబు దాడుల వల్ల 3,00,000 కన్నా ఎక్కువ మంది చనిపోయినట్లు మాకు చెప్పారు. తర్వాత, ఆగస్ట్ 15న, చెక్క తుపాకీలతో మార్చ్ చేయడంలో తర్ఫీదు ముగుస్తుండగా, చక్రవర్తి మాట్లాడడమూ, జపాన్ లొంగిపోవడాన్ని గురించి ఆయన ప్రకటించడమూ విన్నాం. మేము జయిస్తాం అనే నమ్ముతూ వచ్చాం. కానీ ఇప్పుడు, నిస్సహాయులమయ్యాం!
క్రొత్త నిరీక్షణ కలగడం
అమెరికా సైన్యాలు ఆక్రమించుకోవడం మొదలుపెట్టడంతో, మేము యుద్ధంలో అమెరికా జయించింది అన్న వాస్తవాన్ని నెమ్మదిగా జీర్ణించుకున్నాం. జపాన్‌లో ప్రజాప్రభుత్వమూ, ఆరాధనా స్వాతంత్ర్యాన్ని హామీ ఇచ్చే క్రొత్త రాజ్యాంగమూ ప్రవేశపెట్టబడ్డాయి. జీవన పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి, భోజన పదార్థాలకు కరువు ఏర్పడింది. 1946లో మా నాన్నగారు కుపోషణ వల్ల మరణించారు.
అంతలో, నేను వెళ్ళే స్కూల్లో, ఇంగ్లీష్ బోధన మొదలైంది. NHK రేడియో స్టేషన్ ఇంగ్లీష్ సంభాషణా ప్రోగ్రామ్‌ను ఆరంభించింది. ఐదు సంవత్సరాలపాటు, ప్రతి రోజూ టెక్స్‌ట్ బుక్‌ను చేతిలో ఉంచుకుని ప్రసిద్ధిగాంచిన ఈ కార్యక్రమాన్ని వినేవాడ్ని. ఇది నేను ఒక రోజు అమెరికా వెళ్ళాలి అని కలలు కనేలా చేసింది. షింటో మరియు బౌద్ధ మతాలతో నిరాశ చెందినందువల్ల, దేవుడ్ని గురించిన సత్యం పాశ్చాత్య మతాల్లో లభించవచ్చని అనుకోవడం మొదలెట్టాను.
1951 ఏప్రిల్ తొలి భాగంలో, నేను గ్రేస్ గ్రిగరీ అనే వాచ్ టవర్ సొసైటీ మిషనరీని కలిశాను. ఆమె నగోయా రైల్వే స్టేషన్ ముందు నిలబడి కావలికోట ఇంగ్లీష్ ప్రతినీ, జపాన్ భాషలో బైబిలు అంశంపైనున్న ఒక బుక్‌లెట్‌నూ ప్రతిపాదించింది. అలాంటి పని చేయడంలో ఆమెకున్న నమ్రత నన్ను ముగ్ధుడ్ని చేసింది. నేను ఆ రెండు ప్రచురణలను తీసుకున్నాను. బైబిలు పఠనాన్నిస్తానన్న ఆమె వాగ్దానాన్ని వెంటనే అంగీకరించాను. కొన్ని రోజుల తర్వాత, బైబిలు పఠనం కోసం వాళ్ళింటికి వస్తానని నేను ఆమెకు వాగ్దానం చేశాను.
ట్రెయిన్‌లో నా సీట్లో కూర్చుని, కావలికోట చదవడం మొదలుపెట్టినప్పుడు, మొదటి శీర్షికలో, “యెహోవా” అని కనిపించిన మొదటి పదం నా దృష్టిని ఆకట్టుకుంది. నేను ఆ పేరును మునుపెన్నడూ చూడలేదు. నాతో పాటు తెచ్చుకున్న చిన్న ఇంగ్లీష్-జపనీస్ నిఘంటువులో ఆ పదం కనిపిస్తుందని నేను అనుకోనే లేదు. కాని ఆ నిఘంటువులో అది ఉంది ! “యెహోవా . . . బైబిలులోని దేవుడు” అని ఉంది. నేను ఇప్పుడు క్రైస్తవత్వపు దేవుడ్ని గురించిన విషయాలను తెలుసుకోవడం మొదలుపెట్టానన్నమాట !
నేను మిషనరీ హోమ్‌ను మొదటిసారిగా సందర్శించినప్పుడు, అప్పట్లో వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన నేథన్ హెచ్. నార్ కొన్ని వారాల తర్వాత ఇవ్వబోతున్న బైబిలు ప్రసంగాన్ని గురించి తెలుసుకున్నాను. ఆయన తన సెక్రెటరీ మిల్టన్ హెన్‌షెల్‌తోపాటు జపాన్‌ను సందర్శించి, నగోయాకు వచ్చారు. నా బైబిలు పరిజ్ఞానం చాలా తక్కువే అయినప్పటికీ, నేను ఆ ప్రసంగాన్నీ చాలా ఆస్వాదించాను. అక్కడ హాజరైన మిషనరీలతోనూ, ఇతరులతోనూ సహవసించడంలో కూడా ఆనందించగల్గాను.
దాదాపు రెండు నెలల కాలంలో, నేను గ్రేస్‌తో చేసిన పఠనాల నుండి యెహోవా, యేసుక్రీస్తు, విమోచన క్రయధనం, అపవాదియైన సాతాను, అర్మగిద్దోను, పరదైసు భూమి వంటి ప్రాథమిక సత్యాలను గురించి తెలుసుకోగలిగాను. రాజ్యసువార్త సరిగ్గా నేను వెదుకుతున్నటువంటి సందేశమే. నేను పఠనాన్ని ప్రారంభించిన సమయంలోనే, సంఘ కూటాలకు హాజరవ్వడం కూడా మొదలుపెట్టాను. ఆ కూటాల్లోని స్నేహభావంతో కూడిన వాతావరణం నాకు బాగా నచ్చింది. అక్కడ మిషనరీలు జపానీయులతో బాగా కలివిడిగా ఉండేవారు, మాతోపాటు టాటామీ (గడ్డిపోచలతో అల్లిన చాపలు)పై కూర్చునేవారు.
1951 అక్టోబర్‌లో, జపాన్‌లో మొదటి సర్కిట్ అసెంబ్లీ ఓసాకా నగరంలో నాకానోషీమా పబ్లిక్ హాల్‌లో జరిగింది. జపాన్ అంతటిలో సాక్షులు 300కన్నా తక్కువే ఉండేవారు; అయినప్పటికీ, దాదాపు 50 మంది మిషనరీలతో సహా దాదాపు 300 మంది అసెంబ్లీకి హాజరయ్యారు. నాకు అసెంబ్లీ కార్యక్రమంలో చిన్న భాగం కూడా లభించింది. నేను అక్కడ చూసినవాటిని బట్టి, విన్నవాటిని బట్టి ఎంత ముగ్ధుడనయ్యానంటే, నా జీవితాంతం నేను యెహోవాకు సేవ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. మరుసటి రోజు, దగ్గర్లో ఉన్న పబ్లిక్ బాత్‌హౌస్‌లో గోరువెచ్చని నీటిలో బాప్తిస్మం పొందాను.
పయినీర్ సేవలోని ఆనందం
నేను పయినీర్ అవ్వాలనుకున్నాను. పూర్తికాల సేవకులైన యెహోవాసాక్షులు అలా పిలువబడుతారు. కానీ నేను నా కుటుంబానికి మద్దతునివ్వవలసిన బాధ్యత ఉందని కూడా నేను భావించాను. నేను నా కోరిక గురించి మా బాస్‌కి చెప్పడానికి ధైర్యం చేసుకుని వెళ్ళినప్పుడు, “అది నిన్ను సంతోషపరచేటట్లయితే నీతో ఆనందంగా సహకరిస్తాను” అని ఆయన అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. నేను వారంలో రెండు రోజులే పనిచేయగల్గినప్పటికీ, నేను మా అమ్మకు ఇంటి ఖర్చులకు కొంత ఇవ్వగల్గేవాడ్ని. నిజంగా నేను పంజరం నుండి బయటికి వచ్చిన స్వతంత్రపక్షిలాగా భావించాను.
పరిస్థితులు మెరుగుపడుతూ ఉండగా, నేను 1954లో ఆగస్ట్ 1న పయినీరింగ్ చేయడం మొదలుపెట్టాను. నగోయా స్టేషన్ వెనుక భాగంలో గ్రేస్‌ను నేను మొదట కలిసిన స్థలం నుండి కొన్ని నిమిషాల నడక దూరంలో ఉన్న ప్రాంతంలో పయినీరింగ్ మొదలుపెట్టాను. కొన్ని నెలలు గడిచిన తర్వాత, పశ్చిమ దీవుల్లో ఒకటైన క్యూషూలోని బెప్పూ నగరంలో, ప్రత్యేక పయినీరుగా చేసేందుకు నాకు నియామకం లభించింది. ట్సుటోమూ మీయూర నా భాగస్వామిగా నియమించబడ్డాడు.a ఒకప్పుడు ఆ దీవి అంతటిలో యెహోవాసాక్షుల సంఘాలు లేవు. కాని ఇప్పుడు వందల కొలది ఉన్నాయి. అవి 22 సర్కిట్లుగా విభజించబడ్డాయి!
క్రొత్తలోకాన్ని ముందుగా చవిచూడడం
బ్రదర్ నార్ 1956 ఏప్రిల్‌లో జపాన్‌ను మరలా సందర్శించినప్పుడు, ఆయన ఇంగ్లీష్ కావలికోట నుండి కొన్ని పేరాలను బిగ్గరగా చదవమని నన్నడిగారు. ఎందుకు అన్నది నాకు చెప్పలేదు. కొన్ని నెలల తర్వాత, గిలియడ్ మిషనరీ స్కూల్ 29వ తరగతికి హాజరు కమ్మని ఆహ్వానిస్తున్న లేఖ నాకు అందింది. కనుక, ఆ సంవత్సరం, నవంబరు నెలలో, నేను అమెరికాకు పులకరింత కలుగజేసే ప్రయాణాన్ని చేయడంతో, దీర్ఘకాలంగా నేను కన్న కల నిజమైంది. బ్రూక్లిన్‌లోని పెద్ద బెతేల్ కుటుంబంతో కొన్ని నెలలు ఉండి పనిచేయడం యెహోవా యొక్క దృశ్య సంస్థపైన నాకున్న నమ్మకాన్ని బలపరచింది.
1957 ఫిబ్రవరిలో, బ్రదర్ నార్ న్యూయార్క్ ఉత్తర భాగాన ఉన్న దక్షిణ లాన్‌సింగ్‌లో గిలియడ్ స్కూల్ క్యాంపస్‌కు విద్యార్థులైన మమ్మల్ని ముగ్గురిని తీసుకువెళ్ళారు. తర్వాత ఐదు నెలలు గిలియడ్ స్కూల్లో యెహోవా వాక్యం నుండి నిర్దేశాలను పొందుతూ, తోటి విద్యార్థులతో అందమైన పరిసరాల్లో జీవిస్తూ పరదైసు భూమిని ముందుగా చవిచూడగలిగాను. 103 విద్యార్థుల్లో పదిమంది జపాన్‌కు నియమించబడ్డారు. ఆ పదిమందిలో నేను ఒకడ్ని.
నా నియామకాలను గుణగ్రహించడం
నేను 1957 అక్టోబర్‌లో తిరిగి వెళ్ళినప్పుడు జపాన్‌లో దాదాపు 860 సాక్షులు ఉన్నారు. నన్ను ప్రయాణ పనికి సర్కిట్ ఓవర్‌సీయర్‌గా నియమించారు. అయితే ఆ పనికి నేను నగోయాలో ఆడ్రియన్ థాంప్సన్ నుండి కొన్ని రోజులు ట్రెయినింగ్ పొందాను. నా సర్కిట్ మౌంట్ ఫ్యూజీకి సమీపాన ఉన్న షిమిజు నుండి షికోకూ దీవి వరకూ ఉంది. అందులో క్యోటో, ఓసాకా, కోబే, హిరోషిమా వంటి పెద్ద నగరాలు కూడా ఉన్నాయి.
1961లో నన్ను డిస్ట్రిక్ట్ ఓవర్‌సీయర్‌గా నియమించారు. అందులో మంచుగా ఉండే ఉత్తర హొక్కైడో దీవి మొదలుకొని, ఉపఉష్ణమండల దీవియైన ఓకినావా వరకూ, తైవాన్‌కు సమీపాన ఇషిగాకీ దీవుల వరకూ ఉంది. అది మొత్తం దాదాపు 3,000 కిలోమీటర్ల దూరం.
తర్వాత, 1963లో, బ్రూక్లిన్ బెతేల్‌లో పది నెలల గిలియడ్ క్లాస్‌కు ఆహ్వానించబడ్డాను. ఆ కోర్సు కాల వ్యవధిలో, వర్క్ అసైన్‌మెంట్ల విషయమై ఉండవలసిన సరైన దృక్పథాన్ని గురించి బ్రదర్ నార్ నొక్కి చెప్పాడు. ఆఫీస్‌లో వర్క్ ఎంత ప్రాముఖ్యమైనదో, బాత్‌రూమ్‌లను శుభ్రం చేయడం కూడా అంతే ప్రాముఖ్యం అని ఆయన చెప్పాడు. బాత్‌రూమ్‌లు శుభ్రంగా ఉండకపోతే, బెతేల్ కుటుంబమంతటిపై, అలాగే వాళ్ళ పనిపై కూడా అవి దుష్ప్రభావం చూపుతాయి. తర్వాత, టాయ్‌లెట్లను శుభ్రం చేయడం జపాన్ బెతేల్‌లో నాకివ్వబడిన పనిలో భాగం అయ్యింది. నేను ఆ సలహాను గుర్తుంచుకున్నాను.
జపాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత, నన్ను మళ్ళీ ప్రయాణ పనికి నియమించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, మాస్ట్యూ నగరంలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న జూన్‌కో ఈవాసకీని 1966లో వివాహమాడాను. అప్పుడు జపాన్ బ్రాంచ్ ఓవర్‌సీయర్‌గా ఉన్న లోయిడ్ బ్యారీ, హృదయానందకరమైన వివాహ ప్రసంగాన్నిచ్చాడు. తర్వాత జూన్‌కో నాతో పాటు ప్రయాణ పనిలో కలిసింది.
టోక్యోలోని బ్రాంచ్ ఆఫీస్‌లో ట్రాన్స్‌లేషన్ పనికి 1968లో నాకు పిలుపు వచ్చినప్పుడు మా నియామకాలు మారాయి. బెతేల్‌లో గదులు తక్కువగా ఉండడం వల్ల, నేను సుమిదా వార్డ్ నుండి టోక్యోకు వెళ్ళి వచ్చేవాడ్ని. జూన్‌కో స్థానిక సంఘంతో కలిసి ప్రత్యేక పయినీర్‌గా సేవ చేసేది. ఇంతలో, బ్రాంచ్ సౌకర్యాలను విస్తృతపర్చవలసిన అవసరం వచ్చింది. కనుక, 1970లో మౌంట్ ఫ్యూజీకి కొంత దూరంలో నుమాజూలో స్థలం కొనుగోలు జరిగింది. అక్కడ మూడంతస్థుల ఫ్యాక్టరీ, ఒక నివాస భవనమూ నిర్మించబడ్డాయి. నిర్మాణ పని మొదలవ్వక ముందు, ఆ స్థలంలో ఉన్న అనేక ఇండ్లను సంఘ పైవిచారణకర్తలకు ట్రెయినింగ్ ఇచ్చే కింగ్‌డమ్ మినిస్ట్రీ స్కూల్ కోసం ఉపయోగించారు. ఆ స్కూల్లో బోధించే ఆధిక్యత నాకు లభించింది. జూన్‌కో విద్యార్థుల కోసం వంట చేసేది. వందల కొలది క్రైస్తవ పురుషులకు పరిచర్య నిమిత్తమై ప్రత్యేక తర్ఫీదివ్వడాన్ని చూడడం చాలా పులకింత కలిగించింది.
ఒక రోజు మధ్యాహ్నం నాకు ఒక అర్జెంట్ టెలిగ్రామ్ అందింది. అమ్మను ఆసుపత్రిలో చేర్చారు. అమ్మ బ్రతుకుతుందనే ఆశ లేదు. నేను బుల్లెట్ ట్రెయిన్‌లో నగోయాకు వెళ్ళి గబాగబా ఆసుపత్రికి వెళ్ళాను. ఆమె స్పృహలో లేదు. అయినా నేను అమ్మ ప్రక్కన ఆ రాత్రంతా గడిపాను. అమ్మ వేకువజామున చనిపోయింది. నేను నుమాజూకు తిరిగివెళ్తుండగా, అమ్మ తన జీవితంలో పడిన కష్టాలనూ, నా మీద చూపించిన వాత్సల్యాన్నీ గుర్తు చేసుకున్నప్పుడు కన్నీళ్ళను ఆపుకోలేకపోయాను. యెహోవా చిత్తమైతే, అమ్మను పునరుత్థానంలో మళ్ళీ కలుస్తాను.
నుమాజూలో బెతేల్ సభ్యుల సంఖ్య బ్రాంచ్ సౌకర్యాలను మించి పోయింది. కనుకనే, ఎబినా నగరంలో 18 ఎకరాల స్థలం కొన్నారు. 1978లో క్రొత్త బ్రాంచ్ కాంప్లెక్స్ నిర్మాణ పని ప్రారంభమైంది. ఆ భూమిలో ఖాళీగా ఉండిన స్థలంలో ఇప్పుడు, ఫ్యాక్టరీ, నివాస గృహాలు, అలాగే, 2,800 కన్నా ఎక్కువ సీట్లు గల అసెంబ్లీ హాల్ ఉన్నాయి. చివరిగా నిర్మించిన 13 అంతస్తుల రెండు నివాస కట్టడాలూ, 5 లెవల్‌ల పార్కింగ్/సర్వీస్ బిల్డింగ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ముగిశాయి. ఇప్పుడు బెతేల్ కుటుంబంలో దాదాపు 530 సభ్యులున్నారు. అయితే విస్తృతపర్చబడిన సౌకర్యాలు దాదాపు 900 మందికి చోటివ్వగలవు.
ఆనందించేందుకు అనేక కారణాలు
“ఎన్నికలేనివాడు బలమైన జనమగును” అనే బైబిలు ప్రవచనం నెరవేరడాన్ని చూడడం చాలా పులకింతగా ఉంది. (యెషయా 60:22) మునుపు, “జపాన్‌లో ఎంత మంది సాక్షులున్నారు?” అని మా అన్నయ్య 1951లో అడగడం నాకు ఇప్పటికీ గుర్తుంది.
“దాదాపు 260 మంది” అని జవాబిచ్చాను.
“అంతేనా?” అని ఆయన చిన్నబుచ్చే స్వరంతో అడిగాడు.
‘షింటో, బౌద్ధ మతాలు గల ఈ దేశంలో యెహోవా ఎంత మందిని తన ఆరాధనవైపుకు ఆకర్షిస్తాడో కాలం గడుస్తున్న కొలది తెలుస్తుంది’ అని నేననుకోవడం నాకు గుర్తుంది. యెహోవాయే జవాబు చెప్పాడు! నేడు, జపాన్‌లో ప్రకటించడానికి నియమించబడని టెరిటరీలు లేనే లేవు. సత్యారాధకుల సంఖ్య 3,800 సంఘాల్లో 2,22,000 కన్నా ఎక్కువగా పెరిగి పోయింది !
నా జీవితంలో, పూర్తికాల పరిచర్యలో గడిచిన గత 44 సంవత్సరాలు—ప్రేమామయురాలైన నా భార్యతో 32 ఏండ్లు—చాలా సంతోషకరంగా గడిచాయి. వాటిలో 25 సంవత్సరాలు, నేను బెతేల్‌లో ట్రాన్స్‌లేషన్ డిపార్ట్‌మెంట్‌లో సేవ చేశాను. 1979 సెప్టెంబరులో, జపాన్‌లో యెహోవాసాక్షుల బ్రాంచ్ కమిటీ సభ్యుడిగా ఉండడానికి ఆహ్వానించబడ్డాను.
యథార్థ హృదయులైన శాంతికాముకులైన ప్రజలు యెహోవా ఆరాధనలోకి రావడానికి సహాయం చేయడంలో చిన్న భాగం కలిగి ఉండే ఆధిక్యతా, ఆశీర్వాదమూ నాకు లభించాయి. నాలాగే అనేకులు చక్రవర్తికి భక్తిని చూపించే బదులు ఏక సత్యదేవుడైన యెహోవా దేవుడ్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇంకా అనేకులు అజేయుడైన యెహోవా పక్షానికి వచ్చి, శాంతియుతమైన క్రొత్త లోకంలో అనంతకాల జీవితాన్ని పొందాలన్నది నా యథార్థ కోరిక.—ప్రకటన 22:17.
[అధస్సూచీలు]
a వాళ్ళ నాన్నగారు 1945లో జపనీస్ జైలులో ఉన్నప్పుడు ఆటంబాంబు ప్రేలినప్పుడు మృత్యువును తప్పించుకున్న నమ్మకమైన సాక్షి. తేజరిల్లు! అక్టోబర్ 8, 1994, 12-14 పేజీలను చూడండి.
[29వ పేజీలోని చిత్రం]
చక్రవర్తి ఆరాధనే కేంద్ర బిందువుగా ఉన్న పాఠశాల విద్య
[క్రెడిట్ లైను]
The Mainichi Newspapers
[29వ పేజీలోని చిత్రం]
న్యూయార్క్‌లో బ్రదర్ ఫ్రాన్జ్‌తో
[29వ పేజీలోని చిత్రం]
నా భార్య జూన్‌కోతో
[31వ పేజీలోని చిత్రం]
ట్రాన్స్‌లేషన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేయడం