యథార్థత ఏ మూల్యముతో?
“యథార్థవంతుల యెడల నీవు యథార్థవంతుడవుగా నుందువు.”—కీర్తన 18:25.
1, 2. (ఎ) యథార్థత అనగానేమి, దాని వివిధ కోణాలు మన జీవితాలపై ఎట్టి ప్రభావం కలిగియున్నవి? (బి) యెహోవాయే మనకు శ్రేష్ఠమైన మాదిరియని ఆయనవైపు తిరుగుట ఎందుకు మంచిది?
విశ్వాస్యత, విధి, ప్రేమ, బాధ్యత, భక్తి, భావన. ఈ పదముల సర్వసాధారణ భావమేమిటి? అవి యథార్థతయొక్క వివిధ కోణాలు. యథార్థతయనునది హృదయపూర్వక భక్తినుండి వెలువడే దైవ లక్షణం. అయిననూ, అనేకులకు ఈనాడు యథార్థత చాలా అల్పమైనది. వివాహ జతయెడల విశ్వాస్యతను చూపుట, కుటుంబములోని వృద్ధులయెడల బాధ్యతవహించుట, ఉద్యోగి తన యజమానుని యెడల భక్తిభావన కల్గియుండుట—అను వాటన్నిటినీ అలుసుగాను, తరచూ రాజీపడే విధముగాను తీసుకుంటారు. మరి యథార్థతల పోరాటం చెలరేగినప్పుడు, ఏం జరుగుతుంది? ఇటీవల ఇంగ్లాండులో అకౌంటెంట్ తన కంపెనీకి సంబంధించిన ఆర్ధిక సత్యాలను పన్నుల అధికారితో చెప్పినందుకు తన ఉద్యోగాన్ని పోగొట్టుకొన్నాడు.
2 యథార్థతనుగూర్చి మామూలుగా మాట్లాడుట సులభమే, గాని నిజమైన యథార్థత భయంతోకూడిన రాజీపడేదిగాక, క్రియారూపకమైవుంటుంది. అసంపూర్ణ మానవులుగా మనం ఇందులో తప్పిపోతాము. గనుక మనం యథార్థతకు మారుపేరుగల యెహోవా దేవుని మాదిరినే పరిశీలించుట మనకు మంచిది.
యథార్థత మాదిరిగా చూపబడింది
3. ఆదికాండము 3:15 లోని తన సంకల్పం విషయములో తాను యథార్థవంతుడని యెహోవా ఎట్లు రుజువు చేసికొన్నాడు?
3 ఆదాము పాపము చేసినప్పుడు, యెహోవా ఇంకను జన్మించనైయున్న మానవ కుటుంబాన్ని విడుదలచేయు తన సంకల్పమును స్పష్టముగా తెలియజేసెను. ఈ క్రియకు మూలాధారమేమనగా తన మానవసృష్టియెడల తనకున్న ప్రేమను బట్టియే. (యోహాను 3:16) సకాలములో, ఆదికాండము 3:15 నందు ప్రవచింపబడిన వాగ్దాన సంతానమనబడు యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా రుజువయ్యాడు మరియు యెహోవా తాను తెల్పిన సంకల్పం విషయంలో వెనుదీయుట ఊహాతీతమే. యేసు బలి అర్పణను అంగీకరించుటవలన మన విశ్వాసం నిరాశచెందదు.—రోమీయులు 9:33.
4. యెహోవా, యేసునకు ఎట్లు యథార్థపరునిగా రుజువు చేసికొన్నాడు?
4 యెహోవా యేసుయెడల చూపిన యథార్థత కుమారుడు భూమిపై ఉన్నకాలంలో ఆయననెంతో బలపరచింది. తాను మరణించవలసియున్నదని యేసుకు తెలుసు మరి ఆయన అంతంవరకు తనదేవునికి యథార్థంగా వుండుటకు తీర్మానించుకున్నాడు. తన మానవపూర్వపు ఉనికినిగూర్చి సంపూర్ణ జ్ఞానం తాను బాప్తిస్మముపొంది, పరిశుద్ధాత్మవలన ఆయన అభిషేకించబడినప్పుడు ఆయనకు తెలియజేయబడింది. తాను అప్పగింపబడిన రాత్రి తన పరలోక తండ్రియొద్దకు కొనిపోబడవలెననియు ‘లోకము పుట్టకముందు యెహోవా యొద్ద తనకున్న మహిమతో మహిమపరచబడునట్లు’ ప్రార్థించాడు. (యోహాను 17:5) ఇదెట్లు సాధ్యమాయెను? యెహోవా తన యథార్థవంతుడైన కుమారుని సమాధిలోనే క్రుళ్లిపోకుండ చూచుటద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. యెహోవా ఆయనను మృతులలోనుండి లేపి అమర్త్యతనిచ్చాడు. ఆలాగు ఆయన కీర్తన 16:10 నందు ప్రవచనార్థక వాగ్దానాన్ని యథార్థంగా నెరవేర్చాడు: “నీవు నా ఆత్మను షియోల్‌లో విడిచిపెట్టవు.”—అపొ.కార్యములు 2:24-31, NW; అపొ.కార్యములు 13:35; ప్రకటన 1:18.
5. ఏ ఇతర యథార్థతా క్రియలు, యెహోవా యేసునకు చేసిన వాగ్దానములకు సంబంధించియున్నవి?
5 తాను పునరుత్థానుడైన తదుపరి ‘తన శత్రువు లను తన పాదపీఠముగా చేయునను’ యెహోవా ప్రమాణంమీద ఆధారపడగలడని యేసుకు తెలుసు. (కీర్తన 110:1) “అన్యరాజుల కాలములు” అయిపోయిన తర్వాత పరలోకమందు రాజ్యస్థాపనతో ఆ కాలం 1914వ సంవత్సరములో వచ్చింది. తన శత్రువులమీద యేసును ఉన్నతునిగాచేయు క్రియ సాతానును అతని దయ్యములను పరలోకమునుండి నెట్టివేయబడుటతో ప్రారంభమైంది. వారు వెయ్యేండ్లు బంధింపబడినప్పుడు మరియు “భూరాజులు వారి సైన్యము” నాశనము చేయబడినప్పుడు అది ముగియును.—లూకా 21:24; ప్రకటన 12:7-12; 19:19; 20:1-3.
6. దేవుడు మనకు ఏ నిశ్చయమైన నిరీక్షణనిచ్చాడు, మనం దానికెట్లు అభినందన తెలుపగలము?
6 కీర్తనల రచయిత ఇలా హితవు చెప్పాడు: “యెహోవా కొరకు కనిపెట్టుకొని వుండుము. ఆయన మార్గముననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును.” (కీర్తన 37:34) యెహోవా తనమాటను నిలబెట్టుకుంటాడనియు, ఈ దుష్టవిధానాంతం వరకు అలా నిలబెట్టుకుంటూ “తన మార్గమందున్న” స్త్రీపురుషులను పిల్లలను రక్షిస్తాడని మనం ధృఢనమ్మకం కలిగియుండగలము. అసలు హెబ్రీభాషలో ఆ వాక్యము, యెహోవాను సేవించుటలో పట్టుదల, విశ్వాస్యతను కనబరచుట అను రెండు భావాలను ఇస్తుంది. గనుక మనకివ్వబడిన సేవాధిక్యతలను వదులుకొనుటకు లేక అలసిపోవుటకిది సమయము కాదు. మన దేవుడైన యెహోవాకు ఆయన రాజ్యానికి యథార్థముగా సేవచేయుటకు మనం గట్టికృషి చేయవలసిన సమయమిదే. (యెషయా 35:3, 4) మనల్ని ప్రోత్సహించే మంచి మాదిరిలున్నవి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము.
పితరులు యథార్థతకు ప్రతిబింబములు
7, 8. (ఎ) యెహోవా, నోవహుకు అతని కుటుంబమునకు ఏయే పనులనప్పగించాడు? (బి) భూలోకమంతట వచ్చిన జలప్రళయకాలములో దేవుని రక్షణకు వారు యోగ్యులని నోవహు కుటుంబం ఎట్లు రుజువు చేసికున్నారు?
7 జలప్రళయముతో దుష్టమానవ సమాజాన్ని నాశనము చేయుటకు యెహోవా సంకల్పించినప్పుడు పితరుల తండ్రియైన నోవహుతో ఒక నిబంధనచేసి అతని సంతానమును రక్షించి ఈ భూమిమీద జీవాన్ని కొనసాగిస్తానన్నాడు. (ఆదికాండము 6:18) నోవహు దైవరణా నిరీక్షణకై కృతజ్ఞుడై వున్నాడుగాని తాను తన కుటుంబం అందుకు యోగ్యులైవుండాలి. ఎట్లు? యెహోవా ఆజ్ఞాపించినదాన్ని చేయుటద్వారా. మొదట వారు ఓడను నిర్మించే పెద్దపని చేయవలసివుండిరి. అది పూర్తయిన తర్వాత నోవహు జంతు ప్రపంచంనుండి ప్రతిజాతిని తెచ్చినింపి, దానిలో దీర్ఘకాలం సరిపడేంత ఆహారాన్ని నిల్వచేసికోవలసివచ్చింది. అంతమాత్రమే కాదు, సిద్ధపడే ఆ కాలమంతటిలోను నోవహు ముందెన్నడు చేయని ప్రచారపు పనిని సాధ్యమైనంత వరకు చేయగలిగాడు, రానైయున్న దేవుని తీర్పునుగూర్చి హెచ్చరించాడు.—ఆదికాండము 6, 7 అధ్యాయములు; 2 పేతురు 2:5.
8 “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను,” అని బైబిలు మనకు తెల్పుతుంది. (ఆదికాండము 6:22; 7:5) నోవహు అతని కుటుంబం వారికప్పగింపబడిన పనులు చేయుటలో యథార్థవంతులని రుజువుపర్చుకున్నారు. వారి స్వయంత్యాగ దీక్షను గమనిస్తే వారు తమ సమయాన్ని ప్రయోజనకరంగా వినియోగించారని అర్థమౌతుంది. అయితే ఆ పని కఠినంగాను ప్రకటించే పని కష్టంగావుండెను. జలప్రళయానికి ముందు వారు సంతానోత్పత్తి కలుగజేయలేదంటే అట్టి క్రియ నోవహు కుమారులు కోడళ్లు వారికప్పగించబడిన పనిమీద కేంద్రీకరించి దానికి సహకరించవలసియుండుటకు వారికి సహాయపడింది. ఆ ప్రచండ ప్రళయం దుష్టలోకాన్ని న్యాయంగా అంతమొనర్చింది. నోవహు అతని భార్య వారి ముగ్గురు కుమారులు, కోడళ్లు మాత్రమే తప్పించబడిరి. మనలో ప్రతిఒక్కరం నేరుగా నోవహు కుమారులైన షేము, లేక హాము లేక యాపేతునుండి వచ్చిన వారసులము గనుక వారు దేవునికి ఆయన ఆజ్ఞలకు యథార్థత కనబరచారని మనం ఆనందించగలము.—ఆదికాండము 5:32; 1 పేతురు 3:20.
9. (ఎ) యెహోవా, అబ్రాహామును పరీక్షించుట ఎట్లు యథార్థతా పరీక్షయాయెను? (బి) ఈ విషయములో ఇస్సాకు ఎట్లు యథార్థతను చూపాడు?
9 అబ్రాహాము ఇస్సాకును బలియివ్వడానికి సిద్ధపడినప్పుడు ఆయన యెహోవా ఆజ్ఞకు విశ్వాసముతోకూడిన విధేయతతో ప్రవర్తించాడు. యథార్థతకు అదెంతటి గొప్ప పరీక్ష! అయినను, యెహోవా అబ్రాహాము చెయ్యిపట్టుకొని ఆపి ఇట్లన్నాడు: “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడివని యిందువలన నాకు కనబడుచున్నది.” అయితే అంతకు మందు జరిగిన దాన్ని మనం పరిశీలించాలి. మూడు రోజుల మొరియా పర్వత ప్రయాణ సమయంలో అబ్రాహాము అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి తన మనస్సు మార్చుకొనుటకు చాలా సమయముండెను. బలి అర్పణకు కట్టెలుమోసి తనకాళ్లు చేతులు తానే కట్టుకొనుటకనుమతించబడిన ఇస్సాకు విషయమేమిటి? తన తండ్రియగు అబ్రాహాముకు యథార్థత కనబరచుటలో వెనుకాడలేదు లేక తన యథార్థత మూలముగా తన ప్రాణానికే ముప్పు వస్తుందని అనిపించినప్పటికి తాను నిర్వహించవలసిన బాధ్యతనుగూర్చి ప్రశ్నింపనులేదు.—ఆదికాండము 22:1-18; హెబ్రీయులు 11:17.
క్రైస్తవ యథార్థత
10, 11.తొలిక్రైస్తవులు యథార్థతయొక్క ఏ మాదిరులను కలిగియుండిరి?
10 యెహోవా ఎల్లప్పుడు నిజమైన యథార్థతను చూపిస్తాడు. “దేవుని పోలినడుచుకొనుడని” అపొస్తలుడైన పౌలు హితవునిచ్చాడు. (ఎఫెసీయులు 5:1, 2) పితరులు విన్నట్లే క్రైస్తవులుకూడా వినాలి. తొలి క్రైస్తవులు యథార్థతా ఆరాధనలో శ్రేష్ఠమైన మాదిరులు కనబరచినట్లు ఈ క్రింది అనుభవం తెల్పుతుంది.
11 కాన్‌స్టంటైన్ చక్రవర్తి తండ్రియైన 1వ కాన్‌స్టాంటియస్ అను రోమా చక్రవర్తికి యేసుక్రీస్తు అనుచరులంటే నిజంగా ఎంతో గౌరవముండేది. తన రాజగృహములోనున్న క్రైస్తవుల యథార్థతను పరీక్షించుటకు ఆయన విగ్రహాలకు బలియర్పించుటకు ఇష్టపడినవారే నా దర్బారులోనుండ అర్హులని చెప్పాడు. ఆజ్ఞాతిక్రమణవల్ల వారి ఉద్యోగాలు ఊడిపోతాయని, తన ఆగ్రహానికి గురి కావలసివస్తుందని వారికాజ్ఞాపింపబడెను. యథార్థత విషయంలో ఎన్నటికి రాజీపడని వారెవరో తెలిసికొనుటకే కాన్‌స్టాంటియస్ ఈ చిన్న నాటకమాడాడు. దేవునికి, ఆయన నియమాలకు యథార్థత చూపినవారు చక్రవర్తి సేవలోనే వుండిపోయారు, వారిలో కొందరు నమ్మకమైన సలహాదారులుగాకూడ నియమించబడిరి. దైవాజ్ఞకు అవిధేయులైన వారు నిర్దాక్షిణ్యముగా తొలగించబడిరి.
12. క్రైస్తవ పెద్దలెట్లు యథార్థతను కనబరచవలెను, మరి ఇదెందుకు సంఘక్షేమం కొరకు అవసరమైయున్నది?
12 యథార్థత క్రైస్తవులందరి జీవితాల్లను వుండవలసిన లక్షణమైనప్పటికీ, తీతు 1:8 నందు క్రైస్తవ కాపరిగా ఒక పురుషునికి అవసరమైన లక్షణాలలో ఒకటిగా ప్రత్యేకంగా తెలుపబడింది. “యథార్థతయని తర్జుమా చేయబడిన హోసిమోస్ అనే గ్రీకు పదం “ఏ మానవ చట్టాలు రాకముందున్న, ఇప్పుడునువున్న నిత్యశాసనములకు విధేయుడగు మానవుని గూర్చియేనని” విలియం బార్‌క్లే తెలిపాడు. పెద్దలు దేవుని శాసనాలకు విధేయతతో కూడిన యథార్థతను కనబరచవలసిన అవసరమున్నది. ఈ మంచిమాదిరి, సంఘం అభివృద్ధి చెందుటకును, సంఘముగను లేక వ్యక్తిగతముగా దాని సభ్యులను భయపెట్టు అన్ని శోధనలు, ఒత్తిళ్లను ఎదుర్కొనుటకు శక్తిమంతులగుటకును సహాయము చేయును. (1 పేతురు 5:3) నియమించబడిన పెద్దలకు, యెహోవా యెడల మందకువున్న యథార్థత విషయంలో రాజీపడకుండునట్లు చేయుటలో చాలా బాధ్యతవున్నది. ఏలయనగా సంఘం “వారిమాదిరిని అనుసరించ”వలెనని హెచ్చరించబడినది.—హెబ్రీయులు 13:7.
యథార్థత—ఏ మూల్యముతో?
13. “అందరికి వారి మూల్యమున్నదను” సిద్ధాంత భావమేమిటి, మరి ఏ ఉదాహరణలు దీనిని రుజువు చేస్తున్నట్లున్నవి?
13 “అందరికి వారివారి మూల్యమున్నది” అనే సిద్ధాంతము 18వ శతాబ్దపు బ్రిటీష్ ప్రధాని సర్ రాబర్ట్ వాల్‌పోల్‌కు వర్తించబడింది. చరిత్రయంతటిలోను యథార్థతలు స్వలాభం కొరకు తరుచు కొనబడినవనే సత్యాన్ని అది అందంగా క్లుప్తీకరించింది. బైబిలు అనువాదకుడైన విలియం టిండేల్ విషయం పరిశీలించండి. ఆయన హెన్రి ఫిలిప్స్‌ను పొరపాటున తన నమ్మకమైన స్నేహితుడని అంగీకరించాడు. 1535వ సంవత్సరంలో ఫిలిప్స్, టిండేల్‌ను మోసగించి అతనిని శత్రువులకప్పగించాడు తద్వారా టిండేల్ వెంటనే జైలుపాలయ్యాడు చివరకు చంపబడ్డాడు. ఓ చరిత్రకారుడు చెప్పునదేమనగా, ఫిలిప్స్ బహుశా ఇంగ్లీషు రాజునకుగానీ ఇంగ్లీషు కాథోలిక్కులకుగాని ఏజంటుగావుండి “యూదావంటి పని చేసినందుకు అతనికి చాలా ధనంముట్టి వుండవచ్చును.” ఈ చరిత్రకారుడు యేసుక్రీస్తును అప్పగించడానికి 30 నాణెములు తీసుకొన్న యూదా ఇస్కరియోతును గూర్చి చెబుతున్నాడు. ఈ ఉదాహరణనుబట్టి ఒకవ్యక్తి “యథార్థతకు” చెల్లించే “మూల్యం” అంటే ఎల్లప్పుడు ధనమేయని మనమనుకొనకూడదు. అదికాదు.
14. యెహోవా యెడల యోసేపు యథార్థత ఎట్లు పరీక్షకు గురియైనది, మరి ఏ ఫలితముతో?
14 పోతీఫరు భార్య యోసేపును “తనతో శయనించుమని” తొందరపెట్టినప్పుడు యెహోవా యెడల ఆయనకున్న యథార్థత పరీక్షకు గురియైనది. ఆయనేంచేశాడు? అందులోని నీతినియమాలు ముందే స్పష్టంగా తన మనస్సులో వున్నందువల్ల యోసేపు ఆ గృహమునుండి పారిపోయాడు, అట్టి “ఘోరమైన దుష్కార్యముచేసి దేవునికి విరోధముగా పాపము” చేయకూడదని నిశ్చయించుకున్నాడు. లైంగికానుభూతి, తన దేవుడైన యెహోవా యెడల యోసేపు కనబరచే యథార్థతను అధిగమించలేదు.—ఆదికాండము 39:7-9.
15. అబ్షలోము ఎట్లు అపనమ్మకత్వమును కనబరచాడు, ఏ ఫలితం వచ్చినది?
15 అయినను, ఇతర అపాయాలున్నవి; అత్యాశ యథార్థతను అణచివేస్తుంది. తన తండ్రియు, రాజైన దావీదుయెడల అబ్షాలోముచేసిన తిరుగుబాటు వెనుకనున్న ఆంతర్యమదే. కుట్ర, కుయుక్తివలన అబ్షలోము ప్రజల దయను చూరగొనవలెనని ప్రయత్నించాడు. చివరకు తనతండ్రికి యథార్థవంతులుగావున్న మద్దతుదారులమీద యుద్ధానికి ఓ సైన్యాన్ని పురికొల్పాడు. యోవాబు చేతిలో అతని మరణముతో తనతండ్రియైన దావీదునకు అబ్షలోముచూపిన అపనమ్మకమునకు అంతమొచ్చింది, గాని దైవ ఏర్పాటును పడద్రోయుటకు చేసిన ప్రయత్నాలకెంత మూల్యం చెల్లించవలసి వచ్చిందో చూడండి!—2 సమూయేలు 15:1-12; 18:6-17.
ఏ మూల్యంలేని యథార్థత
16. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 11:3 సాతాను తలంపులనుగూర్చి ఏమి తెల్పుచున్నది?
16 ప్రతివారికి ఓ మూల్యమున్నదని సాతాను అంటున్నప్పటికిని, అబ్షలోము విషయంలో ఇది సత్యమైనప్పటికీ, యోసేపు విషయంలో నిజంకాదు, యెహోవా యథార్థ ఆరాధికుల విషయంలో ఎన్నటికిని వాస్తవం కాలేదు. అయినను, మనం మన సృష్టికర్తయెడల యథార్థతను విడనాడునట్లు చేయుటకుగాను సాతాను దేనినైనను ఇవ్వజూపుతాడు. “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసగించినట్లు” మన తలంపులు చెరుపబడి, యెహోవా మరియు ఆయన ఆరాధన యెడల మనకున్న యథార్థత విషయంలో రాజీపడుదుమేమోనని పౌలు భయపడుచున్నాడు.—2 కొరింథీయులు 11:3.
17. కొందరు వేటికొరకు అమూల్యమైన సేవాధిక్యతలను పణంగా పెట్టారు?
17 మనలను మనమే ఇట్లు ప్రశ్నించుకొనుట యుక్తం: ‘నా సృష్టికర్తను యథార్థంగా ఆరాధించే ఆధిక్యతకు బదులు నేను అంగీకరించగల మూల్యమేదైనా ఉన్నదా?’ యోసేపువలెకాక కొందరు యెహోవాకు సమర్పించుకొన్న సేవకులు, బదులుగా అతిస్వల్పమైన వాటిని కోరుకున్నారు. కొందరు పెద్దలైతే తుచ్ఛమైన తాత్కాలిక అవినీతికరమగు సుఖభోగాలకొరకు తమకుగల అమూల్యమైన పవిత్రసేవాధిక్యతలను పణంగాపెట్టారు. పెద్దలైనా కాకపోయినా, ఇలాచేసే అనేకులు నిరాశతో కుటుంబ ఐక్యతను, సంఘ గౌరవప్రేమలను, యెహోవా అంగీకారాన్ని పోగొట్టుకున్నారు—మనం యథార్థంగా నిలిచి సాతాను శోధననెదిరించునట్లు మనకు ఆయనే బలమీయగలడు.—యెషయా 12:2; ఫిలిప్పీయులు 4:13.
18. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6:9, 10 నందలి హెచ్చరికను లక్ష్యపెట్టుట ఎందుకు ప్రాముఖ్యము?
18 ఇతరులైతే, లోకాశలను పెంచుకునే అత్యాశతోకూడిన ధృఢసంకల్పముతో, బైబిలు స్పష్టంగా హెచ్చరికలిచ్చినను, “నానా బాధలతో తమ్మునుతామే పొడుచుకొనిరి.” (1 తిమోతి 6:9, 10) పౌలుచెప్పిన దేమా అనే క్రైస్తవుడు ఈ కారణముచేతనే తాత్కాలికముగా కాని శాశ్వతముగాగాని వెళ్లిపోయాడు. (2 తిమోతి 4:10) యెహోవా యెడల యథార్థత ఏ దుష్ఫలితాలు లేకుండ ఎన్నటికీ రాజీపడనేరదు. “దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.”—గలతీయులు 6:7.
19, 20. (ఎ) అతిగా దూరదర్శిని తిలకించుట వలన కలిగే కొన్ని అనర్థాలేమిటి? (బి) ఓ సాక్షి కుటుంబం ఎటువంటి మాదిరిని చూపెను?
19 కొన్నిసార్లు బేరసారాలతోకూడిన మూల్యం చాలా మోసకరంగావుంటుంది. ఉదాహరణకు, అమెరికానుండి వచ్చు ఓవార్త తెలుపునదేమంటే అనేక కుటుంబాలు వారు మేలుకొనియున్న సమయంలో సగభాగాన్ని ఇంటి దూరదర్శిని తిలకిస్తూవుంటారు, ముఖ్యంగా యౌవనస్థులు దానికి అలవాటు పడ్డారు. ఒక క్రైస్తవుడు ముఖ్యంగా హింస లైగింక అవినీతితోకూడిన దూరదర్శిని చిత్రాలతోనే తన మనస్సును నింపుకుంటే త్వరలో తాను క్రైస్తవ సూత్రాలకు విలువనివ్వక పోవచ్చును. అది అతన్ని యెహోవాకు దూరంచేసి, యథార్థత కోల్పోవునట్లు చేస్తుంది. అట్టి చెడుసహవాసం మంచి అలవాట్లను చెడగొడుతుంది. (1 కొరింథీయులు 15:33) యెహోవా వాక్యాన్ని చదివి ధ్యానించుటకు సమయాన్ని వ్యయపరచవలెనను లేఖన హెచ్చరికను మనం మరువకూడదు. యెహోవాకు యథార్థపరుడగు ఆరాధికునిగా నిత్యజీవానికి నడుపు జ్ఞానాన్ని పొందుటకుపయోగించే సమయాన్ని దూరదర్శిని తెరముందు కూర్చొని దాన్ని తిలకిస్తు విశ్రాంతి పొందుటకు అధిక సమయాన్ని వ్యయపరచుచున్నావా? ఈనాడు సత్యాన్ని నేర్చుకునేవారనేకులు ఈ విషయాన్నిగూర్చి వారి తలంపులలో పెద్దమార్పులు చేసికోవలసిన అవసరముంది.—1 తిమోతి 4:15, 16; 2 తిమోతి 2:15.
20 తాకాషియనే జపానుదేశ వ్యాపారస్థుడు ఇంగ్లాండులో నివసిస్తున్నాడు. ఆయన తన కుటుంబముతో కలిసి సాయంకాలంపూట మూడు నాలుగు గంటలు దూరదర్శిని తిలకిస్తూవుండేవాడు. నాలుగు సంవత్సరాల క్రితం తాను తన భార్య బాప్తిస్మం తీసుకున్న అనంతరం వ్యక్తిగత, కుటుంబ బైబిలు పఠనానికి ప్రథమస్థానమీయవలెనని ఆయన తీర్మానించుకున్నాడు. రోజుకు 15 లేక 30 నిమిషాలు మాత్రమే దూరదర్శిని చూచుటకు సమయాన్ని కుదించి, కుటుంబములో మంచి నాయకత్వం తీసుకుంటున్నాడు. తాకాషి రెండు బైబిళ్లను అనగా ఒకటి ఇంగ్లీషు మరొకటి జపాను భాషలలో పఠించవలసివచ్చినను, అతని ఆత్మీయాభివృద్ధి చాలా చురుకుగా సాగింది. ఆయనిప్పుడు ఇంగ్లీషు మాట్లాడే సంఘములో పరిచారకునిగా సేవచేస్తున్నాడు. ఆయన భార్య సహాయ-పయనీరుగా చేస్తుంది. “మా ఇద్దరు చిన్నపిల్లలు ఆత్మీయతను కాపాడుటకు వారు దూరదర్శినిలో చూడదగు వాటినిగూర్చి నేను నా భార్య జాగ్రత్తవహించి ప్రతిరోజు నేను పరిశీలించవలసివస్తుంది” అని ఆయన అంటున్నాడు. అట్టి స్వయం-శిక్షణ దీవెనకరమే.
21. సాతాను యుక్తులనుగూర్చి మనకేమి తెలుసు, మరి మనలను మనమెట్లు పరిరక్షించుకోగలం?
21 మనకిది నిశ్చయమే: సాతానుకు మన బలహీనతలు తెలుసు, బహుశా వాటినిగూర్చి మనకు తెలిసినదానికంటే ఎక్కువ అతనికి తెలుసు. యెహోవా యెడల మనకున్న భక్తిశ్రద్ధను బలహీనపరచుటకుగాని రాజీపడచేయుటకుగాని అతడు చేసే ప్రయత్నాలలో వెనుకకుపోడు. (మత్తయి 4:8, 9 పోల్చుము.) మరి ఎలా మనం మనలను పరిరక్షించుకోగలం? ఎల్లప్పుడు మన సమర్పణకు ప్రథమ స్థానమిస్తు, ఇతరుల ఆత్మీయావసరతల కొరకు మన సేవా నైపుణ్యములను పెంపొందించుకొనుటలో ఆనందించుటద్వారా పరిరక్షించుకోగలం. యెహోవా యథార్థ సేవకులముగా ఆయన సేవలో నిమగ్నమైవుంటూ, ఆయన పరిశుద్ధ వాక్యముచేత ఎల్లప్పుడు నడిపించబడుతూ వుండవలెను. సాతాను చెల్లించే ఏమూల్యమైనను, ఎప్పుడైననూ మనలను దేవుని యథార్థతనుండి తొలగిపోనివ్వదని మనం చేసుకొనే స్థిరమైన తీర్మానము మనకు తోడ్పడుతుంది.—కీర్తన 119:14-16. (w90 8/15)
నీవెట్లు జవాబిత్తువు?
◻ యెహోవా, యేసు ఎట్లు యథార్థతను కనబరచారు?
◻ యథార్థతకు సంబంధించి బైబిలులోని కొన్ని ఇతర ఉదాహరణలు ఏవి?
◻ సాతాను మనకేమి ఇవ్వజూపును లేదా ఏమి చేయజూచును?
◻ యెహోవా ఆరాధనలో మనం యథార్థముగా నిలిచియుండుటకు మనలను మనమెట్లు బలపరచుకొనగలం?