“ధర్మవిరోధిని” గుర్తించుట
“ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు . . .వానిని నాశనముచేయును.”—2 థెస్సలొనీకయులు 2:8.
1, 2. ఈ ధర్మవిరోధిని మనము గుర్తించుట ఎందుకు ముఖ్యము?
ధర్మములోపించిన ఒక ప్రత్యేక కాలములో మనము జీవించుచున్నాము. ఇది లోకమంతా వ్యాపించియున్నది. ఇతరులకు హాని కలిగించు స్వార్థముతోకూడిన ధర్మవిరుద్ధమైన వారియొక్క భయము ప్రతిచోట ఉన్నది. మరియు వారు మన ప్రాణములకు, ఆస్తికి బెదరింపును కలుగజేస్తున్నారు. అయినను యింకను మించిన ధర్మవిరుద్ధమైన మూలధాతువొకటి అనేక శతాబ్దములుగా కొనసాగుచున్నది. బైబిలులో అది “ధర్మవిరోధి” అని పిలువబడెను.
2 ఈ “ధర్మవిరోధిని” మనము గుర్తించుట ముఖ్యము. ఎందుకు? ఎందుకనగా దేవునితో మనకు గల మంచిస్థానమును మరియు మన నిత్యజీవ నిరీక్షణను పడగొట్టుటకు అతడు ఉద్దేశించియున్నాడు. ఎట్లు? సత్యమును వదలివేసి దానిస్థానములో అబద్ధమును నమ్మునట్లు చేయుచు, దేవుని “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించుటనుండి తొలగించుటద్వారా. (యోహాను 4:23) ఈ ప్రత్యేక ధర్మవిరోధి దేవుని, మరియు ఆయన సంకల్పములను మరియు సమర్పించుకొనిన ఆయన ప్రజలను, ఎదిరించుచున్నాడని వాని క్రియలు రుజువు చేయుచున్నవి.
3. ఈ ధర్మవిరోధిపై మన శ్రద్ధను బైబిలు ఎట్లు రాబట్టుచున్నది?
3 ఈ ధర్మవిరోధిని గూర్చి బైబిలు 2 థెస్సలొనీకయులకు 2:3వ వచనమువద్ద తెల్పుచున్నది. దేవుని ఆత్మచే ప్రేరేపింపబడి అపొస్తలుడైన పౌలు ఇట్లు వ్రాసెను: “మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము [ఈ దుష్టవిధానమును నాశనముచేయు యెహోవాదినము] రాదు. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.” ఇక్కడ పౌలు, ప్రవచించినదేమిటంటే భ్రష్టత్వము పెరిగి ఆ ధర్మవిరోధి ఈ దుష్టవిధానమునకు ముందు బయలుపడును. నిజానికి 7వ వచనములో పౌలు యిట్లనెను: “ధర్మవిరోధసంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది.” గనుక మొదటి శతాబ్దములోనే ఈ ధర్మవిరోధి బయలుపడుటకు ప్రారంభించెను.
ఈ ధర్మవిరోధియొక్క మూలము
4. ఈ ధర్మవిరోధిని ప్రారంభింపజేసినది మరియు దానికి మద్దతునిస్తున్నది ఎవరు?
4 ఈ ధర్మవిరోధిని ఎవరు కలుగజేసి, మద్దతునిచ్చుచుండెను? పౌలు ఇట్లు సమాధానమిచ్చుచున్నాడు: “నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంభింపకపోయిరి గనుక, వాని రాక అబద్ధవిషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచక క్రియలతోను, మహాత్కార్యములతోను నశించుచున్నవారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును.” (2 థెస్సలొనీకయులు 2:9, 10) కనుక ఈ ధర్మవిరోధికి తండ్రియు మరియు సంరక్షకుడు సాతాను. అట్లు యెహోవాకు, ఆయన సంకల్పములకు మరియు ఆయన ప్రజలకు సాతాను ఎదిరించువాడు పాట్లయెనో, అట్లే తాను గ్రహించినను గ్రహించకపోయినను, ఆ ధర్మవిరోధి కూడా ఎదిరించువాడయ్యెను.
5. ఈ ధర్మవిరోధి మరియు వానిని అనుసరించు వారికొరకై ఎదురుచూస్తున్న భవిష్యత్తు ఏమిటి?
5 ధర్మవిరోధి ననుసరించువారుకూడ అతడు పొందు ఫలితమును, నాశనమును పొందెదరు: “అప్పుడా ధర్మవిరోధి బయలు పరచబడును. ప్రభువైన యేసు. . .వానిని సంహరించి తన ఆగమనప్రకాశముచేత నాశనముచేయును.” (2 థెస్సలొనీకయులకు 2:8) “యేసు తన ప్రభావమును కనపరచు దూతలతోకూడా పరలోకమునుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునినెరుగనివారికిని, మనప్రభువైన యేసుసువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయు” నప్పుడు ఆ ధర్మవిరోధి మరియు వాని మద్దతుదారులు (“నశించుచున్నవారు”) పొందు నాశన సమయము, సమీపములో వచ్చును. అప్పుడు వారు “నిత్యనాశనమను దండన పొందుదురు.”—2 థెస్సలొనీకయులకు 1:6-9.
6. ఈ ధర్మవిరోధిని గూర్చి పౌలు ఇంకను ఏమి సమాచారమునిచ్చుచుండెను?
6 పౌలు ఇంకను ఆ ధర్మవిరోధిని వర్ణించుచు ఇట్లనెను: “‘ఏది దేవుడనబడునో’, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగావాడు తన్నుతానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును.” (2 థెస్సలొనీకయులు 2:4) కావున దేవుని ధర్మశాస్త్రమునకుపైన తన్నుతాను హెచ్చించుకొను ఒక ధర్మవిరోధిని, ఆరాధింపబడు ఒక అబద్ధరూపమును, సాతాను కలుగజేయునని పౌలు హెచ్చరించెను.
ధర్మవిరోధిని గుర్తించుట
7. పౌలు ఒక వ్యక్తినిగూర్చి మాట్లాడుటలేదని మనమెట్లు ముగింపుకు రాగలము, మరియు ఈ ధర్మవిరోధి ఎవరి స్థానములోనున్నాడు?
7 పౌలు ఒక వ్యక్తిని గూర్చి మాట్లాడుచున్నాడా? లేదు, ఎందుకనగా ఈ “పురుషుడు” (ధర్మవిరోధి) పౌలు దినములలో ఉండెనని మరియు ఈ దుష్టవిధాన అంతమునందు యెహోవా నాశనముచేయువరకు అతడు కొనసాగునని ఆయననెను. అట్లు అతడు అనేక శతాబ్దాలుగా ఉంటూ ఉండెను. ఏ మనిషి అంతకాలము జీవించియుండలేడు. కనుక “ధర్మవిరోధి” అని వ్యక్తపరచబడిన పదము ప్రజలయొక్క ఒక సంఘమునకు లేక తరగతిని సూచించుచున్నది.
8. ఈ ధర్మవిరోధి ఎవరు, మరియు గుర్తుపట్టే కొన్ని లక్షణాలు ఏవి?
8 వారు ఎవరు? అనేక శతాబ్దములుగా వారే ధర్మశాస్త్రమైనట్టుగా చేసి కొనిన గర్వము మరియు పేరాశగల క్రీస్తుమతసామ్రాజ్యపు క్రైస్తవ మతాధికారుల సంఘమని అది రుజువగుచున్నది. ఈ విషయము, క్రైస్తవ సామ్రాజ్యములో అనేక వేల వేరువేరు మతములు మరియు శాఖలు ఉంటు ప్రతి ఒక్క మతము మతాధికారులచేత నడిపింపబడుచుకూడ ఏదో ఒక మూల సూత్రము లేక ఆచరణ విధానములో ఒకరికొకరు పొసగకపోవుటలోని సత్యమునుబట్టి స్పష్టముగా కనబడుచున్నది. వారుదేవుని చట్టమును అనుసరించుటలేదని ఈ చీలికల పరిస్థితే రుజువుపరచుచున్నది. వారు దేవుని సంబంధులు కానేరరు. (మీకా 2:12; మార్కు 3:24; రోమా 16:17; 1 కొరింథీయులకు 1:10 పోల్చుము.) ఈ మతములన్నియు, “లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదు” అను శాసనమును ఉల్లంఘించుచు బైబిల్ బోధలయందు నిలకడగా నుండక పోవుటలో ఏకముగా నున్నవి.—1 కొరింథీయులు 4:6; మత్తయి 15:3, 9, 14 కూడా చూడుము.
9. బైబిల్ సత్యముల స్థానములో ఈ ధర్మవిరోధి పెట్టిన లేఖనాధారము లేని నమ్మకములేవి?
9 అట్లు ఈ ధర్మవిరోధి, కొంతమందిని సూచించు వ్యక్తియైయుండెను. వారెవరనగా క్రైస్తవ సామ్రాజ్యముయొక్క మతాధికారులైయున్నారు. వారందరు, పోపులు, గురువులు, పేట్రియక్స్ లేక ప్రొటస్టెంట్ ప్రచారకులు లేక ఎవరైనను, క్రైస్తవ సామ్రాజ్యముయొక్క మతసంబంధమైన పాపములను భరించవలసియున్నారు. మానవ ఆత్మ అమర్త్యమని, నరకాగ్ని, పర్గేటరి మరియు త్రిత్వము మొదలగు లేఖనాధారములేని బోధలు అనగా అన్యమత అబద్ధములను స్వీకరించి దేవుని సత్యములను విడిచిపెట్టిరి: “మీరు మీతండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. . .వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు,” అని యేసు ఏమతనాయకులను గూర్చి చెప్పెనో వారివలెనె వీరు ఉన్నారు. (యోహాను 8:44) దేవుని చట్టములను ఉల్లంఘించు కార్యక్రమములలో పాల్గొనుటను బట్టి వారి ఆచారములు కూడ వారిని ధర్మవిరోధులుగా బయలుపరచుచున్నవి. అట్టివారితో యేసు ఇట్లు చెప్పెను: “అక్రమము (ధర్మవిరుద్ధము) చేయువారలారా నాయొద్దనుండి పొండి.”—మత్తయి 7:21-23.
తమ్మునుతాము హెచ్చించుకొనుట
10. ఈ ధర్మవిరోధి రాజకీయ పరిపాలకులతో ఎట్టి సంబంధమును కలిగియున్నాడు?
10 ఈ ధర్మవిరోధి తరగతిలోనున్నవారు ప్రపంచ పరిపాలకులను ఆదేశించునంతటి గర్వమును మరియు అహంకారమును వ్యక్తపరచిరి. ‘రాజుల యొక్క దైవిక హక్కు’ అను మిషతో, దేవునికిని పరిపాలకులకును మధ్య వారు ప్రాముఖ్యమైన మధ్యవర్తులని తెల్పిరి. రాజులను, చక్రవర్తులను వారు గద్దె ఎక్కించిరి మరియు దింపిరి. అట్లే జనసమూహమును పరిపాలకులకు అనుకూలముగా లేక వ్యతిరేకముగా రెచ్చగొట్టగల్గిరి. దాని ఫలితముగా యేసును తృణీకరించిన యూదా మతాధిపతులవలె వారిట్లనిరి: “కైసరు తప్ప మాకు వేరొక రాజులేడు.” (యోహాను 19:15) అయినను యేసు స్పష్టముగా బోధించెను: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.”—యోహాను 18:36.
11. ఈ మతాధికారులు తమ్మునుతాము ఎట్లు హెచ్చించుకొనిరి?
11 సామాన్యప్రజలపై హెచ్చించుకొనుటకు ఈ ధర్మవిరోధి వివిధ ప్రత్యేక విధానములోనున్న దుస్తులను, సామాన్యముగా నల్లవి, ధరించిరి. మరియు వారు అన్నిరకములైన రాజులుపయోగించు వస్తువులతోను, కిరీటములు, సిలువలు మరియు పొడుగాటి చాలా ఖరీదైన గొప్పగా అలంకరింపబడిన (పోపులు లేక బిషప్‌లు ఉపయోగించు) టోపీలతో అలంకరించుకొనిరి. (మత్తయి 23:5, 6ను పోల్చుము) కాని యేసు మరియు ఆయన అనుచరులు అట్టి దుస్తులు ధరించలేదు; వారు సామాన్యప్రజలవలె దుస్తులను ధరించిరి. ఈ మతాధికారులు, “తండ్రి”, “పరిశుద్ధ తండ్రి”, “రెవరెండ్,” “మోస్ట్ రెవరెండ్,” “హీజ్ ఎక్సలెన్‌సీ,” మరియు “హీజ్ ఎమ్మినెన్‌స్” అను బిరుదులతో ‘ప్రతి ఒక్కరిపైన హెచ్చించుకొనిరి.’ అయినను మతసంబంధమైన బిరుదులనుగూర్చి యేసు బోధించెను: “భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు.” (మత్తయి 23:9) అటులనే వేషధారులై యోబునకు ఆదరణ మాటలను చెప్పుచున్నవారితో తర్కించుచు ఎలీహు ఇట్లనెను: “నేను ఎవరి యెడలను పక్షపాతినైయుండను. నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను.”—యోబు 32:21.
12. నిజానికి ఈ మతాధికారులు ఎవరిని సేవించుచున్నారని పౌలు చెప్పెను?
12 పౌలు తనదినములలోనే ధర్మవిరోధి తనక్రియను ప్రారంభించెనని చెప్పినపుడు, ఆ ధర్మవిరోధి యొక్క స్వభావమును ప్రతిబింబించువారిని గూర్చి కూడ ఇట్లు చెప్పెను: “ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునైయున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూతవేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్పసంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.”—2 కొరింథీయులు 11:13-15.
సత్యారాధనపై తిరుగుబాటు
13. పౌలు ముందే తెలియజేసిన భ్రష్టత్వమేమి?
13 ఈ ధర్మవిరోధి భ్రష్టత్వముతో పాటు వృద్ధిచెందునని పౌలు చెప్పెను. వాస్తవానికి ఈ ధర్మవిరోధి తరగతిని గుర్తించుటకు పౌలు మొట్టమొదట మనకిచ్చిన తలంపు: “మొదట భ్రష్టత్వము సంభవించితేనే. . .గాని ఆ దినము [ఈ దుష్టవిధానమును యెహోవా నాశనము చేయునపుడు] రాదు. (2 థెస్సలొనీకయులు 2:2, 3) కాని “భ్రష్టత్వ” మనగానేమి? ఈ సందర్భములో అది, కేవలం ఒక లోపమని లేక ఆత్మీయ బలహీనతవలన తప్పిపోవుట అని అర్థముకాదు. “భ్రష్టత్వము” కొరకై ఉపయోగింపబడిన గ్రీకుపదమునకు అర్థము, మిగిలినవాటితోపాటు “లోపము,” లేక “తిరుగుబాటు.” అనేక తర్జుమాలలో “ఎదురు తిరుగుట” అని వ్రాయబడినది. విలియంబార్‌క్లే యొక్క తర్జుమా ఇట్లు చెప్పెను: “గొప్పతిరుగుబాటు వస్తేనేతప్ప ఆ దినమురాదు.” ది జెరూషలేము బైబిల్ దానిని “గొప్ప ఎదిరింపు” అని పిలిచినది. గనుక పౌలు తర్కించు సందర్భమును బట్టి “భ్రష్టత్వము” అనగా సత్యారాధనపై తిరుగుబాటు.
14. ఈ భ్రష్టత్వము ఎప్పుడు ప్రారంభమయినది?
14 ఈ “భ్రష్టత్వము,” ఈ తిరుగుబాటు ఎట్లు వృద్ధిచెందెను? 2 థెస్సలొనీకయులు 2:6 నందు, తన దినమునకు సంబంధించి, ఆ “ధర్మవిరోధిని” అడ్డగించుదానిని గూర్చి పౌలు వ్రాసెను. అది ఏమిటి? అది అపొస్తలుల యొక్క అడ్డగించు శక్తి. పరిశుద్ధాత్మద్వారా శక్తివంతమైన వరములతో వారి ఉనికియే, భ్రష్టత్వము వ్యాపించకుండ అడ్డగించినది. (అపొస్తలులకార్యములు 2:1-4; 1 కొరింథీయులు 12:28) కాని అపొస్తలులు మరణించిన తరువాత అనగా మొదటి శతాబ్దంతములో ఈ అడ్డగించునవి తీసివేయబడినవి.
లేఖనానుసారముకాని మతాధికారుల తరగతి వృద్ధిచెందుట
15. క్రైస్తవ సంఘము కొరకు యేసుచేత నియమింపబడిన ఏర్పాటు ఏది?
15 యేసు స్థాపించిన సంఘము మొదటి శతాబ్దములో, పెద్దలు (అధ్యక్షులు) మరియు పరిచారకుల యొక్క నడిపింపు క్రింద వృద్ధి అయినది. (మత్తయి 20:25-27; 1 తిమోతి 3:1-13; తీతు 1:5-9) వీరు సంఘమునుండి తీయబడినవారు. యేసువలెనె వారికి ఏ ప్రత్యేక వేదాంత శిక్షణలేదు. వారు సామర్థ్యముగల ఆత్మీయపురుషులైయుండిరి. నిజానికి వారి వ్యతిరేకులు ఆశ్చర్యపడిరి: “చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెను?” (యెహాను 7:15) మరియు మతాధికారులు అపొస్తలులయందును దానినే గుర్తించిరి: “వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినపుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.”—అపొస్తలులకార్యములు 4:13.
16. సంఘ సంస్థీకరణ కొరకైన మొదటి శతాబ్దపు క్రైస్తవవిధానము నుండి విడిపోవుటకు ఈ భ్రష్టత్వము ఎట్లు కారణమైనది?
16 అయినను, ఈ భ్రష్టత్వము యూదా మతాధికారుల మరియు అన్యమత రోమా మతపద్ధతినుండి తీయబడిన తలంపులను తెచ్చినది. కాలము గడుచుకొలది, సత్యమైన విశ్వాసమునుండి తొలగిపోతున్నకొలది, లేఖనాధారములేని మతాధికారుల తరగతి వృద్ధిచెందినది. ప్రత్యేకముగా తర్ఫీదు పొందిన ప్రీస్ట్స్ ఉండిరి. వారిలో హెచ్చింపబడినవారు బిషప్‌లు మరియు ఆర్చ్‌బిషప్‌లు అయిరి. వారినుండి హెచ్చింపబడినవారు కార్డినల్స్ అనగా పోప్‌చేత నియమింపబడిన ఉన్నత అధికారులుగావుండిరి. ఈ ఉన్నతాధికారుల సమూహమును, కిరీటము ధరించిన ఒక పోపు పరిపాలించుట కారంభించెను. అట్లు మొదటి శతాబ్దమనంతరము దగ్గరలోనే ఒకమర్మముతో కూడిన మతాధికారులు క్రైస్తవసామ్రాజ్యమును చేపట్టెను. ఈ తరగతి, మొదటి శతాబ్దపు పెద్దలు మరియు పరిచారకుల పద్ధతినగాక అన్యమత విధానములో రూపొందింపబడినది.
17. ఎప్పుడు ప్రత్యేకముగా ఈ ధర్మవిరోధియొక్క శక్తి ఘనీభవించినది?
17 సామాన్య శకము మూడవ శతాబ్దమునందు సామాన్యవిశ్వాసులు రెండవ తరగతి స్థానమునందు నియమింపబడిరి. భ్రష్టుడైన ధర్మవిరోధి క్రమేణ పరిపాలించుశక్తిని పుంజుకొనెను. ఈ శక్తి, రోమా పరిపాలకుడైన కాన్‌స్టెన్‌టైన్ పాలించునపుడు, ముఖ్యముగా క్రీ.శ. 325లో కౌన్సిల్ ఆఫ్ నైసియా తరువాత జటిలమైనది. అప్పుడు చర్చి మరియు ప్రభుత్వము కలిసి పోయినవి. అట్లు ధర్మవిరోధి—క్రెస్తవసామ్రాజ్యముయొక్క మతాధికారులు—శతాబ్దముల తరబడి భ్రష్టత్వములోనుంటు సత్యదేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటుచేసెను. వారు అనుసరించిన చట్టములు మరియు పద్ధతులు వారి సొంతవేగాని దేవునివి కావు.
అన్యమత బోధలు
18. ఈ ధర్మవిరోధి దేవదూషణ కలిగించు ఏ అన్యబోధలను చేర్చుకొనెను?
18 ఎదుగుచున్న ఈ ధర్మవిరోధి అన్యమత బోధలను కూడ కలుపుకొనెను. ఉదాహరణకు “యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.” “నేను యెహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు,” అని తెల్పిన దేవుని స్థానములో, రహస్యపూరితమైన మరియు అర్థముకాని ఒక త్రియేకదేవునిని పెట్టిరి. (యెషయా 42:8; 45:5) మానవుని యొక్క, అంతేగాక అన్యమతముయొక్క, ఈ మార్పు ఎంతవరకు విస్తరించినదంటే, బైబిలుయొక్క వినయముగల మరియ క్రైస్తవసామ్రాజ్యముయొక్క “దేవుని తల్లి” గా గౌరవింపబడి మరింత దైవదూషణకు కారణమైనది. అట్లు అబద్ధబోధలను విస్తరింపజేసినవారు, మతాధికారుల తరగతి, యేసు విత్తిన మంచి విత్తనములకు ఆటంకము కలిగించుటకు ప్రయత్నించు సాతానుచే విత్తబడిన “గురుగుల” కోవకు చెందినవారైయున్నారు.—మత్తయి 13:36-39.
19. ఈ శతాబ్దములన్నింటిలో ఇప్పటివరకు క్రైస్తవసామ్రాజ్యము ఎట్లు చీలికలై పోయినది, మరియు ఏది కొనసాగియున్నది?
19 చీలికలు బేధములు చోటుచేసుకొని క్రైస్తవ సామ్రాజ్యము అనేక వందల మతములు మరియు తెగలుగా మారినది. కాని ప్రతి నూతన మతము లేక తెగ దాని మతాధికారుల తలంపులను, కొన్ని మినహాయించి అట్టే పెట్టుకొనియున్నారు. అట్లు ఈ ధర్మవిరోధి తరగతి ఈ దినమువరకు కొనసాగియున్నాడు. మరియు ప్రత్యేకమైన దుస్తులతో మరియు ఉన్నతమైన బిరుదులతో సామాన్యప్రజలపై హెచ్చించుకొనుటను అది ఇంకను కొనసాగించుచునేయున్నది. ఈ ధర్మవిరోధి తరగతి తన్నుతాను మహిమపరచుకొని దేవుని వంటి స్థానమునకు హెచ్చించుకొనుచున్నాడని పాలు చెప్పినపుడు అతడు దానిని అతిశయోక్తిగా చెప్పలేదు.
పోపు పరిపాలన
20. ఒక కాథలిక్ మూలము పోపును ఎట్లు వర్ణించినది?
20 అట్టి మహిమపరచుకొనుచుండుటకు ఉదాహరణ రోమాయొక్క పోపు పరిపాలన. ఇటలీలో ప్రచురింపబడిన లూసియో ఫెర్రరిస్ యొక్క చర్చికి సంబంధించిన డిక్షనరి పోపును గూర్చి ఇట్లు వర్ణించినది: “పోపు ఎంత గౌరవముగల లేక ఉన్నతమైన వాడంటే అతడు కేవలం ఒక మనిషి కాడుకాని దేవునివంటివాడు; మరియు దేవునియొక్క ప్రతినిధి.” అతని కిరీటము మూడు విధములుగల కిరీటము, ఏలయనగా ఆయన “పరలోకము, భూమి మరియు నరకములకు రాజు” అని అది సూచించుచున్నది. అదే డిక్షనరీ ఇట్లు చెప్పుచున్నది: “పోపు ఈ భూమి మీద దేవునివంటివాడు ఇతడు మాత్రమే క్రీస్తుయొక్క నమ్మకమైన యువరాజు, రాజులందరికంటే అతి గొప్ప రాజు.” అది ఇంకను ఇట్లు కలిపినది: “పోపు కొన్నిసార్లు దైవిక చట్టమునకు వ్యతిరేకముగా పోవచ్చు.” మరియు ది న్యూకేథలిక్ డిక్షనరి పోపును గూర్చి ఇట్లు చెప్పుచున్నది: “అతని రాయబారులు ఇతర ప్రభుత్వ అధికారులపై ఆధిపత్యమును కలిగియున్నారు.”
21. పేతురు మరియు ఒక దూతకు పోల్చి పోపుయొక్క భిన్నక్రియలను వివరించుము.
21 యేసు శిష్యులవలెకాక, పోపు ఆకర్షనీయమైన దుస్తులు ధరించి మనుష్యుల పొగడ్తలను ఆహ్వానించును. ప్రజలు అతనికి వంగి మ్రొక్కుటను, ఉంగరమును ముద్దుపెట్టుకొనుటను, మరియు ఒక ప్రత్యేక కుర్చీలో వారిచే మోయబడుటను అనుమతించును. అనేక శతాబ్దాలుగా ఈ పోపులు ఎంత అత్యధికమైన గర్వమును ప్రదర్శించుచున్నారు! రోమా సైన్యాధికారియైన కొర్నేలీ పేతురునకు మ్రొక్కుటకు ఆయన పాదముల వద్ద మోకరించినపుడు కొర్నేలీతో ఈ క్రింది విధముగా చెప్పిన వినయముగల పేతురు నిశ్చయముగా ఎంత వ్యత్యాసముగా నున్నాడు: “నీవు లేచి నిలువుము, నేను కూడ కేవలం ఒక నరుడనే.”! (అపొస్తలులకార్యములు 10:25, 26, ది కాథలిక్ జెరూషలేము బైబిల్) మరియు అపొస్తలుడైన యోహానుకు ప్రకటనల నందించిన దూతకూడ ఎంత వ్యత్యాసముగా నున్నాడు! ఆ దూతకు ఆరాధనపూర్వకముగా సాగిలపడుటకు యోహాను ప్రయత్నించెను, కాని దూత ఇట్లు ప్రకటించెను: “వద్దు సుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను, దేవునినే ఆరాధించుము.”—ప్రకటన 22:8, 9.
22. ఏ లేఖనాధారమైన చట్టమును బట్టి ఈ ధర్మవిరోధి గుర్తింపబడవచ్చు?
22 ఈ మతాధికారుల యొక్క ఈ అంచనా అతిబలమైనదా? అబద్దప్రవక్తలను గుర్తించుటకు యేసు ఇచ్చిన సూత్రమును అనువర్తించుటను బట్టి మనము నిర్ణయించగలము: “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు.” (మత్తయి 7:15, 16) కావున అనేక శతాబ్దాలుగా మరియు ఇప్పుడు మన 20వ శతాబ్దములో ఈ మతాధికారుల ఫలములెట్లున్నవి? ఈ ధర్మవిరోధి యొక్క ముగింపు ఏమైయున్నది మరియు ఆ ఫలితములో ఎవరు పాలు పొందెదరు? దేవునికి నిజముగా భయపడువారు, ఈ ధర్మవిరోధి యెడల ఎట్టి బాధ్యతను కలిగియున్నారు? ఈ అంశములు తదుపరి ఆర్టికల్స్ చర్చించును. (w90 2/1)
పునరీక్షణ కొరకైన ప్రశ్నలు:
◻ ఈ ధర్మవిరోధి ఎవరు, మరియు ఎప్పుడు బయటపడుట కారంభించెను?
◻ ఈ ధర్మవిరోధి తరగతిని రూపొందించినవానిని బైబిల్ ఎట్లు గుర్తించుచున్నది?
◻ మతాధికారులు సామాన్యప్రజలపై ఎట్లు హెచ్చించుకొనిరి?
◻ మతాధికారులచే భ్రష్టత్వపు ఏ బోధలు మరియు క్రియలు వృద్ధిచేయబడినవి?
◻ పేతురు మరియు ఒక దూతయొక్క స్వభావమునకు పోపుల యొక్క స్వభావము ఎట్లు భిన్నమైనది?
[16వ పేజీలోని చిత్రాలు]
పోపులకు భిన్నముగా, అపొస్తలుడైన పేతురు మానవుడు తనను మ్రొక్కుటను అనుమతించలేదు