వాగ్ధానదేశమునుండి దృశ్యములు
నజరేతు ప్రవక్తయొక్క స్వదేశము
“‘ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు’ అని జనసమూహము చెప్పుకొనుచుండిరి.” అవును యేసు పరిచర్యకాలములో కూడ ఆయననుగూర్చి పేర్కొనబడినది, నేటి ప్రముఖపట్టణమైన నజరేతును మనమనస్సునకు తెచ్చుచున్నది. ఆవిధంగా ఆయనను పట్టుకొనడాన్కి వచ్చిన వారు తాము యేసుకొరకు వెదకుచున్నామని చెప్పలేదుకాని “నజరేయుడగు యేసును” వెదకుచున్నామని చెప్పిరి.—మత్తయి 21:11; 26:71; యోహాను 18:3-5; అపొస్తలులకార్యములు 26:9.
నేడు నీవు నజరేతును సందర్శిస్తే ఏమి కనుగొనగలవో ఈ పైనున్న చిత్రము చూపుచున్నది. మరియ, దేవుని కుమారుని కనునని చెప్పుటకు ఒకదేవదూత, “గలిలయలోని నజరేతు అను పట్టణమునకు” వచ్చినప్పటికంటె ఇప్పుడది చాలా పెద్దది. (లూకా 1:26-33) చాలావరకు ఆ కాలమందు నజరేతు, కొండప్రక్కన ఒకగుంపువలె చతురస్ర ఆకారములోనున్న ఇళ్లతో, తరువాయి పేజీలో చూపబడిన గ్రామమును పోలియుండెను. యోసేపు, మరియ బహుశ అటువంటి ఒక గృహమందు నివసించియుండవచ్చును. కాని మరియ ప్రసవించకముందుగా వారు బెత్లేహేమునకు దక్షిణంగా వెళ్లవలసివచ్చెను, అచ్చట యేసు జన్మించెను. హేరోదుచేసిన హత్యాపన్నాగమునుండి శిశువును కాపాడుటకు వారు ఐగుప్తుకు పారిపోయిరి. అటుపిమ్మట, “వారు గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను తమ స్వంత ఊరికి వచ్చిరి.”—లూకా 2:4, 39; మత్తయి 2:13-23.
ఆవిధంగా యేసు యెరూషలేము లేదా తిబెరయవంటి సందడిగల ప్రాంతములో పెరగలేదుగాని ఒక ప్రశాంత ప్రదేశములో పెరిగెను. గలిలయ దిగువప్రాంతమందు పర్వతములతో చుట్టబడియున్న పల్లపు ప్రాంతమందు నజరేతు ఉన్నది. అచ్చట ధాన్యము, ద్రాక్ష ఒలీవ మరియు అంజూరము సమృద్ధిగా పండును. వేసవిలో చల్లదనముతో ఆహ్లాదముగా ఉంటుంది. అయితే గలిలయ ఎగువ ప్రాంతములో ఉన్నంత విపరీతంగా ఇక్కడ శీతాకాలమందు ఉండదు.
యోసేపు వడ్రంగివానిగా పనిచేయుట మూలంగా తన భార్యను కుమారులను కుమార్తెలను పోషించెను, ఆధునిక నజరేతునందున్న ఇలాంటి ఒక కార్ఖానాను బహుశా ఆయన కల్గియుండవచ్చును. పట్టణమందలి ఇండ్లకు పైకప్పుల దూలములను, చెక్కద్వారములను లేక బల్లలు, పీటలు, మరి యితర చెక్క సామాగ్రిని ఆయన తయారు చేసియుండవచ్చును. యేసు దానిని గమనించి నేర్చుకొనియుండునని మనకు తెలుసు, ఎందుకనగా ఆయనకూడా “వడ్రంగివాడు” అని పిలువబడెను. (మార్కు 6:3; మత్తయి 13:55) నజరేతు పరిసరములందలి వ్యవసాయము దానికి సంబంధించిన పనులు మరి యితర కార్యములకు నడిపించియుండవచ్చును. బహుశ, యేసు ఈ పశువుల మీదనున్న కాడివంటి నొకదానిని తయారుచేసియుండవచ్చును. ఈ లోపుగా, యోసేపు ఈ కాడిచేత లాగబడే నాగలిని లేదా నూర్చుకర్ర సామానులను తయారుచేయడాన్కి తనపరికరములను వాడుచుండవచ్చును.—2 సమూయేలు 24:22; యెషయా 44:13.
బాలుడుగా ఉన్నప్పుడు, యేసు నజరేతుకు ఉత్తరంగా ఎనిమిది మైళ్లదూరముననున్న “గలిలయలోని కానా” అను ప్రదేశమువంటి పరిసరప్రాంతములలో తిరిగి యుండవచ్చును. అటుపిమ్మట ఆయన అచ్చట తన మొదటి అద్భుత క్రియను చేసెను. (యోహాను 2:1-12) యెజ్రేయేలు లోయ మరియు మోరె కొండగుండా ఆరుమైళ్లు ఆగ్నేయంగా నడిస్తే యేసు నాయీను పట్టణమునకు చేరుకోగలుగును, దానిని 11వ పేజీలో చూడవచ్చును.a (న్యాయాధిపతులు 6:33; 7:1) తనమొదటి ప్రచారదండయాత్రలో నాయీను సమీపమున అంత్యక్రియలు చేయడానికి వెళ్తున్న జనాన్ని యేసు ఎదుర్కొనిన దృశ్యాని జ్ఞాపకము చేసుకొనండి. జాలితో విధవరాలి కుమారుని ఆయన పునరుత్థానముచేసెను.—లూకా7:11-16.
నజరేతు ఆ ప్రదేశమందలి ఏ ప్రధానమార్గములను ఆనుకొని లేదు. కాని అట్టి మార్గములకు సులభంగా పోవు ప్రవేశము అది కలిగియున్నది. దీనిని మీరు 1990 యెహోవాసాక్షుల కేలండరు అట్టపైనున్న చిత్రములో చూడవచ్చును. అందులో ప్రస్తుత నజరేతు యొక్క పెద్ద చిత్రముకూడా ఉన్నది. యెజ్రెయేలు లోయగుండా పోవు తూర్పు-పశ్చిమ మార్గము అక్రేయ ఓడలరేవును కలుపుతుంది, లేదా ప్టొలిమైస్‌ను గలిలయసముద్రము మరియు యోర్దానులోయతో కలుపుతుంది. దమస్కునుండి దక్షిణంగా ఒకమార్గము, సమరయగుండా యెరూషలేమునకుపోవు మార్గము యొక్క కూడలి కలదు.
నజరేతునకు స్వంత సమాజమందిరము కలదు. యేసు తనపరిచర్య ఆరంభములో “తన వాడుకచొప్పున” అచ్చటికి వెళ్లెను. యెషయా 61:1, 2 వచనములను ఆయన చదివి, దానిని తనకు అన్వయించుకొనెను. ఆయన అచ్చట పెరిగినందున మరియు వడ్రంగి పని నిమిత్తము ఆయనకు డబ్బులు చెల్లించిన ఆ పట్టణ ప్రజలు ఆయన మాటలకు ఎలా ప్రతిస్పందించారు? వారు ఆగ్రహముతో నిండుకొని కొండ పేటునుండి పడద్రోయుటకు ప్రయత్నించిరికాని యేసు తప్పించుకొనెను. (లూకా 4:16-30) అయితే, అటుపిమ్మట ఆయన నాయీనులోను మరి ఇతర ప్రాంతములలో చేసిన క్రియలను గూర్చినవార్త నజరేతుకు చేరుకున్నది. ఆతర్వాత ఆయన మరలా తిరిగివచ్చి సమాజమందిరములో బోధిస్తే ఆయనను చంపడాన్నిగూర్చి ఎవరూ మాటలాడలేదు. అయినను, “ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు,” ఏలయనగా నజరేతులో ఆయనకు పరిచయమున్నవారు ఆయనను ప్రవక్తగా విశ్వసించలేదు.—మత్తయి 13:53-58.
యేసు ప్రతిచర్యను మార్కు వ్రాసియున్నాడు: “ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తనయింటివారిలోను తప్ప మరియెక్కడను ఘనహీనుడుకాడు.” నజరేతునందలి అనేకుల విషయములో ఇది నిజమగుట ఎంత విచారకరము. అయినప్పటికిని, మనము మహిమపరచుటకు ఎంచుకొనిన ప్రవక్తయొక్క స్వదేశముగా ఆ పట్టణమును తలంచుకొనవచ్చును.—మార్కు 6:4. (w90 3⁄1)
[అధస్సూచీలు]
a 1990 యెహోవాసాక్షుల కేలండరుయొక్క అట్టపైనున్న పటములో 2వ చిత్రమునందు నజరేతు కలదు. మోరె కొండ 3వ చిత్రము దిగువ భాగమున కన్పించుచున్నది.
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.