క్రీస్తు దుర్నీతిని ద్వేషించెను—మరి మీరో?
“నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.”—హెబ్రీయులు 1:9.
1. నీతిని ప్రేమించుటయే గాకుండ, యెహోవా దేవుని నిజమైన సేవకులందరి నుండి ఏమి కోరబడుచున్నది?
యెహోవా నిజమైన సేవకులు వారి హృదయముతో, ఆత్మతో, మనస్సుతో, బలముతో ఆయనను ప్రేమింతురు. (మార్కు 12:30) యథార్థతను కాపాడుకొనుట ద్వారా వారు యెహోవా హృదయమును సంతోషపరచలెనని కోరుకుందురు. (సామెతలు 27:11) దానిని చేయుటకు, వారు నీతిని ప్రేమించుటయే కాదు, దుర్నీతిని సహితము ద్వేషించవలెను. వారి మాదిరికర్తయైన యేసుక్రీస్తు, నిశ్చయముగా అలా చేసెను. ఆయనను గూర్చి ఇట్లు చెప్పబడింది: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి.”—హెబ్రీయులు 1:9.
2. దుర్నీతియందు ఏమి ఇమిడియున్నది?
2 దుర్నీతి అంటే ఏమిటి? అది పాపమని చూపించుచు అపొస్తలుడైన యోహాను ఇట్లు వ్రాసెను: “పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.” (1 యోహాను 3:4) ఆజ్ఞను అతిక్రమించువాడు/దుర్నీతిపరుడైన వ్యక్తి “నియమమునకు కట్టుబడడు లేదా దాని అధీనములో ఉండడు.” (వెబ్‌స్టర్స్ నైన్త్ కాలేజియేట్ డిక్షనరీ) దుర్నీతియందు సమస్తమైన చెడు, దుష్టత్వము, లైంగిక అవినీతి, కుళ్లు, మోసము చేరియుండును. లోకమువైపు ఒకసారి చూస్తే దానిలో క్రితమెన్నడూ లేనంత ఎక్కువగా ఈ దుర్నీతి పేరుకుపోవడం మనము చూస్తాం. అపొస్తలుడైన పౌలు 2 తిమోతి 3:1-5లో ప్రవచించినట్లుగా మనము “అపాయకరమైన కాలములలో” జీవించుచున్నామనుటకు ఎలాంటి సందేహము లేదు. ఈ దుర్నీతియంతటి దృష్ట్యా, సమస్త దుర్నీతిని ద్వేషించవలెనని మనము ఆజ్ఞాపింపబడుట ఎంత చక్కని విషయం! ఉదాహరణకు మనమిట్లు ఉపదేశించబడ్డాము: “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.” (కీర్తన 97:10) అదే విధంగా, మనమింకను ఇట్లు చదువుదుము: “కీడును ద్వేషించి మేలును ప్రేమించుము.”—ఆమోసు 5:15.
మూడు రకాల ద్వేషము
3-5. ఏ మూడు విధములుగా “ద్వేషము” అను పదము దేవుని వాక్యమందు ఉపయోగింపబడినది?
3 ద్వేషించుట అనగా భావమేమిటి? దేవుని వాక్యములో “ద్వేషించుట” మూడు ప్రత్యేక రీతులలో ఉపయోగింపబడినది. దుర్బుద్ధి ద్వారా ప్రేరేపింపబడు ద్వేషము కలదు, అది దానికి గురియైన వారికి హానిచేయుటకు ప్రయత్నించును. ఇటువంటి ద్వేషమును క్రైస్తవులు విసర్జించాలి. నీతిమంతుడైన తన తోబుట్టువగు హేబెలును చంపుటకు ఇటువంటి ద్వేషమే కయీనును పురికొల్పెను. (1 యోహాను 3:12) యేసుక్రీస్తు యెడల ఇటువంటి ద్వేషమునే మతనాయకులు కలిగియుండిరి.—మత్తయి 26:3, 4.
4 ఇంకా, లేఖనములలో తక్కువగా ప్రేమించుట అను భావముతో “ద్వేషము” అను పదము ఉపయోగింపబడినది. ఉదాహరణకు, యేసు ఇట్లన్నాడు: “ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.” (లూకా 14:26) స్పష్టముగా, మనమాయనను ప్రేమించుటకంటే వీరిని తక్కువగా ప్రేమించవలెనని అని మాత్రమే యేసు భావమైయుండెను. యాకోబు ‘లేయాను ద్వేషించెను,’ అంటే ఆయన నిజానికి రాహేలుకంటె ఆమెను తక్కువ ప్రేమించెను.—ఆదికాండము 29:30, 31.
5 ఇప్పుడు మనము ప్రత్యేకముగా శ్రద్ధ కలిగియున్న “ద్వేషము” యొక్క భావము మిగిలియున్నది. ఒక వ్యక్తి లేదా ఒక విషయము యెడల తీవ్రమైన అయిష్టత లేక విముఖత కలిగియుండి, ఆ వ్యక్తితో లేక ఆ విషయముతో ఎటువంటి సంబంధమైనను కలిగియుండుటకు అయిష్టపడు భావమును ఇది యిస్తుంది. 139వ కీర్తనలో ఇది “పూర్ణద్వేషము” అని మాట్లాడబడింది. అక్కడ దావీదు ఇట్లు చెప్పెను: “యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా? వారియందు నాకు పూర్ణద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను.”—కీర్తన 139:21, 22.
దుర్నీతిని ఎందుకు ద్వేషించవలెను
6, 7. (ఎ) ప్రాముఖ్యముగా మనమెందుకు దుర్నీతిని ద్వేషించవలెను? (బి) దుర్నీతిని ద్వేషించుటకుగల బలమైన రెండవ కారణమేమి?
6 మనమెందుకు దుర్నీతిని ద్వేషించవలెను? దానికిగల ఒక కారణమేమనగా, మనము ఆత్మగౌరవం, మంచి మనస్సాక్షిని కలిగియుండగలం. ఈ విధముగా మాత్రమే మనము నీతిమంతుడును, ప్రేమగల మన పరలోక తండ్రియగు యెహోవాతో మంచి సంబంధమును కలిగియుండగలము. దావీదు ఈ విషయములో చక్కని మాదిరినుంచెను, 26వ కీర్తన చదువుట ద్వారా దీనిని మనము చూడగలము. ఉదాహరణకు ఆయనిట్లన్నాడు: “దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను.” (కీర్తన 26:5) యెహోవాను ద్వేషించి, ఆయనకు లోబడని వారి దుర్నీతిక్రియలతో సహా, ఆయన దృష్టికి దుర్నీతిగానుండు సమస్తము యెడల మనము నీతియుక్తమైన ఆగ్రహమును—అవును, ద్వేషమును—కలిగియుండుటకు దేవునియెడల, నీతియెడల మనకున్న ప్రేమ మనలను ప్రేరేపింపవలెను. అంతేకాకుండ, దుర్నీతి దేవుని నామమునకు అవమానము తెచ్చును గనుక మనము దానిని ద్వేషించవలెను.
7 దుర్నీతి బహు ప్రమాదకరమైనది, హానికరమైనది గనుకనే, యెహోవా ప్రజలు దుర్నీతిని ద్వేషింతురు. శరీరాశలనుబట్టి విత్తుట, అనగా దుర్నీతిని విత్తుట, ఏ ఫలితము నిచ్చును? పౌలు ఇలా హెచ్చరించాడు: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంటకోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.” (గలతీయులు 6:7, 8) కాబట్టి మనము కచ్చితముగా దుర్నీతితో ఏ సంబంధము లేకుండా ఉండుటకు కోరుకొనవలెను. మన స్వంత క్షేమము కొరకు, మనశ్శాంతి కొరకు సమస్త దుర్నీతిని మనము నిజముగా ద్వేషించవలెను.
దుర్నీతిని ద్వేషించువారు
8. దుర్నీతిని ద్వేషించుటలో ఎవరు అత్యున్నతమైన మాదిరినుంచారు, ఏ లేఖనములు దానిని చూపిస్తున్నవి?
8 దుర్నీతిని ద్వేషించుటలో తెలివిగల సృష్టి ప్రాణులందరికి దేవుడు అత్యున్నతమైన మాదిరి నుంచుచున్నాడు. దుర్నీతి విషయములో ఆయన నీతియుక్తమైన ఆగ్రహమును కలిగియున్నాడు, ఆయన వాక్యమిట్లు చెప్పుచున్నది: “యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు; ఏడును ఆయనకు హేయములు. అవేవనగా, అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును, లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.” మనమింకా ఇట్లు చదువుదుము: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, నాకు అసహ్యములు.” (సామెతలు 6:16-19; 8:13) అంతేకాకుండా మనకిట్లు తెల్పబడింది: “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము.”—యెషయా 61:8.
9, 10. తాను దుర్నీతిని ద్వేషించెనని యేసు ఎట్లు చూపించెను?
9 దుర్నీతిని ద్వేషించుటలో యేసుక్రీస్తు తన తండ్రిని అనుకరించెను. మనము యీ విధముగా చదువుదుము: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.” (హెబ్రీయులు 1:9) ఈ విధముగా ద్వేషించుటకు యేసు మనకు ఒక మాదిరినుంచెను. ఉద్దేశపూర్వకముగా దుర్నీతిని అభ్యసించువారిని—అబద్ధ మతనాయకులను బహిర్గతం చేయుట ద్వారా ఆయన దుర్నీతియెడల తనకున్న ద్వేషమును చూపించెను. పదేపదే, ఆయన వారిని వేషధారులని ఖండించెను. (మత్తయి, 23వ అధ్యాయము) మరొక సందర్భములో ఆయన వారితో ఇట్లనెను: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు.” (యోహాను 8:44) తన శారీరక శక్తి నుపయోగించి కూడా యేసు రెండు సందర్భాలలో దురాశపరులైన మత వేషధారులను దేవాలయమునుండి వెళ్లగొట్టుట ద్వారా దుర్నీతియెడల తనకున్న ద్వేషమును చూపించెను.—మత్తయి 21:12, 13; యోహాను 2:13-17.
10 దుర్నీతినుండి, పాపమునుండి దూరముగా ఉండుట ద్వారా కూడ, యేసు వాటియెడల తనకున్న ద్వేషమును ప్రదర్శించెను. కావున, ఆయన తన వ్యతిరేకులను సరిగా ఇట్లడుగ గలిగెను: “నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును?” (యోహాను 8:46) యేసు, “పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునై” యుండెను. (హెబ్రీయులు 7:26) పేతురు దీనిని స్థిరపరచుచు, యేసు “పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదని” వ్రాసెను.—1 పేతురు 2:22.
11. దుర్నీతిని ద్వేషించిన అసంపూర్ణ మానవుల ఏ లేఖనానుసారమైన ఉదాహరణలు మనకు కలవు?
11 అయితే యేసు పరిపూర్ణ మనుష్యుడై యుండెను. దుర్నీతిని నిజముగా ద్వేషించిన అసంపూర్ణ మానవుల లేఖననానుసారమైన ఉదాహరణలు మనకేమైనా కలవా? అవును, మనకలాంటి మాదిరులు కలవు. ఉదాహరణకు, యెహోవా ఆజ్ఞమేరకు దాదాపు 3,000 మందిని సంహరించుట ద్వారా మోషే, ఆయన తోటి లేవీయులు విగ్రహారాధనయెడల బహు ద్వేషమును కనబరచిరి. (నిర్గమకాండము 32:27, 28) యీటెతో యిద్దరు జారులను హతమార్చినప్పుడు ఫీనెహాసు దుర్నీతియెడల బహు ద్వేషమును చూపించెను.—సంఖ్యాకాండము 25:7, 8.
దుర్నీతియెడల ద్వేషమును వ్యక్తపరచుట
12. (ఎ) దుర్నీతియెడల ద్వేషమును మనమెట్లు చూపించగలము? (బి) దుర్నీతికరమైన తలంపులు విడనాడుటకుగల కొన్ని అభ్యాససిద్ధమైన మార్గములేవి?
12 మన కాలానికొస్తే, దుర్నీతియెడల మన ద్వేషమును మనమెట్లు చూపించగలము? మన తలంపులను, మాటలను, క్రియలను అధీనములో ఉంచుకొనుట ద్వారా చూపగలము. ఏదో ఒక పనితో మన మనస్సులు నిండియుండనట్లయిన, మనము క్షేమాభివృద్ధికరమైన విషయములను తలంచు అలవాటును పెంపొందించుకొనవలెను. మనకు రాత్రులందు నిద్రపట్టకపోతే, తనకు జరిగిన వాటినిగూర్చి అదేపనిగా వ్యధచెందుట లేక లైంగిక భ్రమలలో మునిగిపోవుట వంటి ప్రతికూల ఆలోచనలు చేయుటకు మొగ్గుచూప వచ్చును. అటువంటి వాటికి ఎన్నడును అవకాశమియ్యకుండా, ప్రయోజనాత్మకమైన సంగతులలో పాల్గొను అలవాటును పెంపొందించుకొనుము. ఉదాహరణకు, లేఖనములను, తొమ్మిది ధన్యతలను, తొమ్మిది ఆత్మ ఫలములను కంఠస్థము చేయుటకు ప్రయత్నించుము. (మత్తయి 5:3-12; గలతీయులు 5:22, 23) 12 మంది అపొస్తలుల పేర్లను నీవు చెప్పగలవా? పది ఆజ్ఞలు నీకు తెలుసా? ప్రకటన గ్రంథమందు సంబోధించబడిన ఏడు సంఘాల పేర్లేమి? కింగ్‌డం సాంగ్స్ కంఠస్థము చేయుటకూడ మన మనస్సులను ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి విలువైనవో, ఏవి కొనియాడదగినవో వాటిమీద నిల్పుటకు సహాయము చేయును.—ఫిలిప్పీయులు 4:8.
13. దుర్నీతిని ద్వేషించుట మనమే విధమైన మాటలను ద్వేషించుటకు కారణమగును?
13 అంతేకాకుండా, సమస్తమైన చెడ్డమాటలను విసర్జించుట ద్వారా మనము దుర్నీతిని ద్వేషించుచున్నామని చూపించవచ్చును. లోకులనేకులు జుగుప్సాకరమైన హాస్యోక్తులు చెప్పుటకు, వినుటకు ఆనందింతురు. కాని క్రైస్తవులు వాటిని వినుటకైననూ మొగ్గుచూపకూడదు. బదులుగా, అటువంటి దిగజారిన మాటలకు ఊతమిచ్చు ఎటువంటి సంభాషణలోనైనను పాల్గొనుటను మనము విసర్జించి, అక్కడనుండి వెళ్లిపోవాలి. అలా వెళ్లిపోవుట సాధ్యము కానట్లయిన, మనమటువంటి మాటలను అసహ్యించుకొనుచున్నామని కనీసము మన ముఖకవళికల ద్వారా చూపించవచ్చును. మనమీ చక్కని సలహాను లక్ష్యపెట్టవలెను: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” (ఎఫెసీయులు 4:29) అశుద్ధమైన దానిని మాట్లాడుట ద్వారాగాని, అటువంటి వాటిని వినుట ద్వారాగాని మనలను మనము మలినపరచుకొనకూడదు.
14. వ్యాపార అభ్యాసములు మరియు ఉద్యోగము విషయములో దుర్నీతిని ద్వేషించుట ఏ సంరక్షణను సమకూర్చును?
14 సమస్త పాపసహిత అభ్యాసముల విషయములో కూడా మనము దుర్నీతిని ద్వేషించవలెను. దుర్నీతిని ద్వేషించుట, ఈ విషయములో రాజీపడు ఉరిని తప్పించుకొనుటకు మనకు సహాయము చేయును. నిజమైన క్రైస్తవులు పాపము నభ్యసించరు. (1 యోహాను 5:18 పోల్చుము.) ఉదాహరణకు, మనము మోసకరమైన సమస్త వ్యాపార అభ్యాసములను ద్వేషించవలెను. ఈనాడు, అనేకమంది యెహోవాసాక్షులు తమ యజమానుల ప్రయోజనార్థమై మోసకరమైన పనులు చేయవలెనని వత్తిడికి గురయ్యారు, అయితే వారట్లు చేయుటకు తిరస్కరించిరి. బైబిలుచే శిక్షణ ఇవ్వబడిన తమ మనస్సాక్షికి వ్యతిరేకముగా దేనినైనను చేయుటకు మారుగా క్రైస్తవులు తమ ఉద్యోగాలను పోగొట్టుకొనుటకైనను ఇష్టపడ్డారు. అంతేకాకుండ, రహదారి చట్టాలను ఉల్లంఘించకుండుట ద్వారా, మనము పన్నులు, సరిహద్దుపన్ను (కస్టమ్స్) చెల్లించవలసినప్పుడు దగాచేయకుండుట ద్వారా దుర్నీతియెడల మన ద్వేషమును చూపించుటకు కూడ మనము కోరుకొందుము.—అపొ. కార్యములు 23:1; హెబ్రీయులు 13:18.
లైంగిక అశుద్ధతను ద్వేషించుట
15. జతగూడు బలమైన అంతర్భావములతో మానవజాతిని సృష్టించుట ఏ రెండు చక్కని సంకల్పములను నెరవేర్చెను?
15 క్రైస్తవులుగా, లైంగిక విషయాలు చేరియుండు సమస్త అశుద్ధతను మనము ప్రత్యేకముగా ద్వేషించవలెను. జతగూడు బలమైన అంతర్భావములతో మానవజాతిని సృష్టించుట ద్వారా, దేవుడు రెండు చక్కని సంకల్పములను నెరవేర్చాడు. మానవజాతి అంతరించిపోకుండా ఆయన రూఢిపరచాడు, ఆలాగే సంతోషము పొందుటకు అత్యంత ప్రేమగల ఏర్పాటును సమకూర్చాడు. బీదలు, పామరులు, లేక మరొక రకముగా ఇబ్బందిలో ఉన్నవారు సహితము వివాహ సంబంధమందు ఎంతో ఆనందించగలరు. అయితే, ఈ సంబంధమందలి ఆనందము కొరకు యెహోవా కొన్ని హద్దులు ఉంచాడు. దేవుడు సెలవిచ్చిన ఈ హద్దులను గౌరవించవలెను.—ఆదికాండము 2:24; హెబ్రీయులు 13:4.
16. లైంగిక అశుద్ధ వినోదము, అభ్యాసములయెడల మన దృక్పధమేమై యుండవలెను?
16 మనము దుర్నీతిని ద్వేషించినట్లయిన, పట్టుదలతో మనము సమస్త లైంగిక అశుద్ధ అభ్యాసములను, లైంగిక దుర్నీతిగల వినోదమును విడనాడుదుము. ఆలాగే మనము సమస్తమైన సందేహాస్పద పుస్తకములను, పత్రికలను, వార్తాపత్రికలను విసర్జింతుము. అదేవిధముగా, మనము దుర్నీతిని ద్వేషించినట్లయిన, మనము ఎటువంటి అశుద్ధమైన దృశ్య ప్రసారాలను, అనగా దూరదర్శినిలోనైనను, లేక చలన చిత్రములలోనైనను లేక రంగస్థలము మీదనైనను చూడము. ఒకానొక కార్యక్రమము లైంగిక దుర్నీతిగలదని మనము కనుగొంటే, వెంటనే మనము టి.వి.ని ఆపుజేయవలెను లేదా ఆ థియేటరు విడిచి బయటకు వెళ్లిపోయే ధైర్యముండాలి. ఆలాగే, సంగీతమందలి చరణాలలో లేక ఆ రచనలో మోహము రేకెత్తించు సంగతులుంటే, దుర్నీతియెడల మనకున్న ద్వేషము, అట్టి సమస్త సంగీతము విషయములో మనము జాగ్రత్త వహించునట్లు చేయును. లైంగిక దుర్నీతి విషయాల జ్ఞానార్జనకు కాదుగాని, ‘చెడు విషయమై శిశువులుగా ఉండి, బుద్ధివిషయమై పెద్దవారివలె’ ఉండుటకు మనము ప్రయత్నించుదము.—1 కొరింథీయులు 14:20.
17. నైతికముగా పరిశుభ్రముగా ఉండుటకు మనకు సహాయపడగల ఏ సలహాను కొలొస్సయులు 3:5 ఇస్తున్నది?
17 సరియైన రీతిగా, మనకిట్లు సలహా ఇవ్వబడింది: “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను . . . చంపివేయుడి.” (కొలొస్సయులు 3:5) నైతికముగా పరిశుభ్రముగా నిలిచియుండవలెనని మనము తీర్మానించుకొనిన యెడల మనపక్షమై శక్తివంతమైన చర్యలు అవసరమనుటలో సందేహము లేదు. కొలొస్సయులు 3:5లో “చంపివేయుడి” అని భాషాంతరము చేయబడిన గ్రీకు క్రియాపదమును గూర్చి, ది ఎక్స్‌పోజిటర్స్ బైబిల్ కామెంట్రీ ఇలా చెప్పుచున్నది: “చెడు క్రియలను, స్వభావములను మనము కేవలము అణగద్రొక్కుట లేక అధీనములో ఉంచుకొనుట కాదని అది సూచించుచున్నది. వాటిని మనము తుడిచివేయవలెను, మన పాతజీవన విధానమును పూర్తిగా హతమార్చవలెను. ‘బొత్తిగా సంహరించుము’ అనుమాట దాని శక్తిని వ్యక్తపరచవచ్చును. . . . ఆ క్రియాపదము, దాని కాలవివరముయొక్క శక్తి, ఈ రెండింటి భావము వ్యక్తిగత తీర్మానముయొక్క బలమైన, బాధతోకూడిన చర్యను సూచించుచున్నవి.” కాబట్టి, అశ్లీల సాహిత్యము ప్రమాదకరమన్నట్లు, అంటురోగము వంటిదన్నట్లు, మరణకరమగు వ్యాధిలాంటిదన్నట్లు మనము దానిని విసర్జించవలెను. ఏలయనగా అది నైతికముగా, ఆత్మీయముగా అటువంటిదే. మనకు అభ్యంతర కారణమైన చేతిని, పాదమును లేదా చివరకు కంటినైనను తొలగించివేయమని చెప్పినప్పుడు అటువంటి తలంపునే క్రీస్తు వ్యక్తపరచెను.—మార్కు 9:43-48.
అబద్ధమతమును, మతభ్రష్టత్వమును ద్వేషించుట
18. మతపరమైన దుర్నీతియెడల మనమెట్లు ద్వేషమును వ్యక్తపరచగలము?
18 వేషధారులైన మతవాదులను బహిర్గతము చేయుటద్వారా యేసు దుర్నీతియెడల తన ద్వేషమును చూపించినట్లే, వేషధారణతో కూడిన సమస్త మత దుర్నీతియెడల ఈనాడు యెహోవాసాక్షులు తమ ద్వేషమును చూపించుచున్నారు. ఎట్లు? నిజముగా మత వేశ్యయైయున్న మహాబబులోనును బహిర్గతముచేయు బైబిలు సాహిత్యములను పంచిపెట్టుట ద్వారా చేస్తున్నారు. దుర్నీతితో కూడిన మత వేషధారణను మనము నిజముగా ద్వేషించినట్లయిన, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమగు, మహాబబులోనును బహిర్గతము చేయుటలో మనము ముందుంటాము. అది గ్రుడ్డితనము కలుగజేసి, ఆత్మీయ దాసత్వమందుంచిన సహృదయులైన ప్రజల కొరకే మనమట్లు చేయుదుము. మనమెంత మేరకు మహాబబులోను దుర్నీతిని నిజముగా ద్వేషింతుమో, అంతయెక్కువగా మనము రాజ్య పరిచర్యయొక్క అన్ని అంశములందు ఆసక్తితో భాగము వహింతుము.—మత్తయి 15:1-3, 7-9; తీతు 2:13, 14; ప్రకటన 18:1-5.
19. మత భ్రష్టులను మనమెట్లు దృష్టించవలెను, ఎందుకు?
19 దుర్నీతిని ద్వేషించు బాధ్యత మతభ్రష్టుల సమస్త కార్యములకు కూడా అనువర్తించును. మతభ్రష్టుల యెడల మన దృక్పధము దావీదు కలిగియున్న దృక్పధమును పోలియుండవలెను. ఆయనిట్లు ప్రకటించెను: “యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా? వారియందు నాకు పూర్ణద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను.” (కీర్తన 139:21, 22) ఆధునిక-దిన మతభ్రష్టులు, “పాపపురుషుడగు” క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులతో చేతులు కలిపియున్నారు. (2 థెస్సలొనీకయులు 2:3) కావున, యెహోవా యథార్థ సాక్షులుగా మనము వారితో కచ్చితముగా ఎటువంటి పొత్తు కలిగియుండము. అసంపూర్ణులము గనుక, మన సహోదరుల యెడల విమర్శనాత్మకముగా ఉండు స్వభావమును మన హృదయములు సులభముగా కలిగియుండగలవు. వేర్వేరు వ్యక్తులుగా, “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతి వారు అసంపూర్ణ మానవులై యున్నారు. (మత్తయి 24:45-47) అయితే ఈ తరగతివారు నమ్మకస్థులును బుద్ధిమంతులునై యున్నారు. నాయకత్వము తీసికొను సహోదరుల తొట్రుపాట్లను లేక తప్పిదాలుగా కన్పించువాటిని మతభ్రష్టులు తమ స్వప్రయోజనమునకు వాడుకుంటారు. మతభ్రష్ట ప్రచారమును విషమువలె విసర్జించుటలో మన భద్రత ఉన్నది. అటువంటి ప్రచారము నిజముగా విషమే.—రోమీయులు 16:17, 18.
20, 21. దుర్నీతిని ద్వేషించుటకుగల కారణములను ఎట్లు క్లుప్తీకరించవచ్చును?
20 పాపమునకు సమానార్థముగల దుర్నీతితో లోకము నిండియున్నదని మనము చూశాము. మనము నీతిని ప్రేమించుట మాత్రమే సరిపోదు; మనము దుర్నీతినికూడ ద్వేషించవలెను. క్రైస్తవ సంఘము నుండి వెలివేయబడిన కొందరు, తాము నీతిని ప్రేమించామని తలంచియుండ వచ్చును, అయితే వారు తగినంతగా దుర్నీతిని ద్వేషించలేదు. దుష్టత్వమును ఎందుకు ద్వేషించవలెనో కూడ మనము చూశాము. అలా చేయనట్లయిన, మనము ఆత్మగౌరవాన్ని, మంచి మనస్సాక్షిని కలిగియుండలేము. అంతేకాకుండ, దుర్నీతి అనగా యెహోవా దేవునియెడల యథార్థముగా లేకపోవుటయని అర్థము. మరియు దుర్నీతి మనము దుఃఖము, క్షయత, మరణమను బహు చేదైన ఫలాలను కోయుటకు కారణమగును.
21 దుర్నీతిని ద్వేషించుచున్నామని మనమెట్లు చూపించగలమో కూడ మనము గమనించాము. ఏ విధముగాకూడ మోసముతో, లైంగిక దుర్నీతితో, లేక మతభ్రష్టత్వముతో సంబంధము లేకుండుట ద్వారా మనము దుర్నీతిని ద్వేషింతుము. యెహోవాను మహిమపరచి, ఆయన హృదయమును సంతోషపెట్టుటలో భాగము వహించవలెనని మనము ఇచ్ఛయించుదుము గనుక, మనము నీతిని ప్రేమించుచు, ఆయన సేవలో పనిరద్దీని కలిగియుండుట మాత్రమే కాదుగాని, మన నాయకుడును, అధిపతియునైన యేసుక్రీస్తు చేసినట్లుగానే దుర్నీతినికూడ ద్వేషించవలెను? (w92 7/15)
మీరెలా జవాబిస్తారు?
◻ “ద్వేషము” అను పదమును లేఖనములెట్లు ఉపయోగించుచున్నవి?
◻ దుర్నీతిని ద్వేషించుటకు మనకుగల కొన్ని మంచి కారణములు ఏమైయున్నవి?
◻ దుర్నీతిని ద్వేషించిన వారి ఏ చక్కని ఉదాహరణలు మనకున్నవి?
◻ దుర్నీతియెడల మన ద్వేషమును మనమెట్లు చూపించగలము?
[20వ పేజీలోని చిత్రం]
దుర్నీతిని ద్వేషించినందు వలన యేసు ఆలయమును శుభ్రపరచెను
[22వ పేజీలోని చిత్రం]
మనము దుర్నీతిని ద్వేషించినట్లయిన, లైంగిక దుర్నీతిగల వినోదమును మనము విడనాడుదుము