మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
“భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును.” (సామెతలు 29:25) ఈ వాక్యములతో ఆ ప్రాచీన సామెత ఏ భయము మానసిక విషమువంటిదో హెచ్చరిస్తుంది. అదేమనగా మనుష్యునికి భయపడుట. అది ఒక ఉరితో పోల్చబడినది. ఎందుకు? ఎందుకనగా కుందేలువంటి చిన్న జంతువు ఉరిలో చిక్కుకొనినప్పుడు నిస్సహాయస్థితిలో ఉండును. అది పారిపోవలెనని ప్రయత్నిస్తుంది. కాని ఆ ఉరి విడువకుండా పట్టుకుంటుంది. ఎరగా చిక్కిన అది శక్తిహీనమౌతుంది.
మనము మనుష్యుని భయములో బంధింపబడితే ఆ కుందేలు వలె ఉన్నాము. మనము ఏమి చేయవలెనో మనకు తెలిసియుండవచ్చు. అది చేయాలనే కోరిక కూడా మనలో ఉండవచ్చు. అయితే భయము మనలను బంధితులను చేస్తుంది. శక్తిహీనమై ఏమి చేయలేము.
మనుష్యులకు భయపడుటవలన వచ్చు ఉరి
బైబిలు సమయములలో భయము అను ఉరిలో బంధింపబడిన వారినిగూర్చి కొన్ని ఉదాహరణలనుగూర్చి ఆలోచించుము. యెహోషువ దినములలో ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వాధీన పరచుకొనుటకు దాడిచేయకమునుపు, 12 మంది మనుష్యులు ఆ దేశమున సంచరించి వేగుచూచుటకై పంపబడిరి. ఆ వేగులవారు తిరిగివచ్చి ఆదేశము దేవుడు చెప్పినట్లే పుష్కలము మరియు సారవంతమైనదని చెప్పిరి. అయితే ఆ వేగులవారిలో 10 మంది వేగులు ఆ దేశ నివాసుల బలముచూచి విభ్రాంతి చెందిరి. ఆ విధముగా మనుష్యులు భయమునకు స్వాధీనులై ఆ దేశ ప్రజల బలమును అధికముచేసి ఇశ్రాయేలీయులకు యిచ్చిన వర్తమానము వలన దేశమంతా భయము నిండెను. ఇశ్రాయేలీయులు కనానుదేశముపై దాడిచేసి దానిని స్వాధీనపరచుకొనుమను దేవుని ఆజ్ఞకు విధేయతచూపుటకు నిరాకరించిరి. ఆ కారణముచేత 40 సంవత్సరముల వ్యవధిలో ఆ సమయములో బ్రతికియున్న పురుష జనాబా అంతా—కొందరు తప్పించి ఆ అరణ్యములో మరణించిరి.—సంఖ్యాకాండము 13:21–14:38.
మనుష్యుని భయమునకు యోనా మరియొక ఎర అయ్యాడు. నీనెవె మహాపట్టణములో ప్రకటించుటకు పంపినపుడు అతడు “యెహోవా సన్నిధిలోనుండి తార్షీషు పట్టణమునకు పారిపోయెను.” (యోనా 1:3) ఎందుకు? నీనెవె పట్టణపు ప్రజలు క్రూరులై హింసకు ప్రఖ్యాతిగాంచిన వారైయుండిరి, మరియు యోనా అది ఎరిగియుండెను. మనుష్యుల యెడల భయము నీనెవె నుండి దూరముగా పారిపోవుటకు అతని నడిపెను. నిజమే, అతడు తరువాత తనకు నిర్దేశించిన పనిని స్వీకరించెను. కాని యెహోవా యొద్దనుండి అసాధారణమైన శిక్షను పొందిన తరువాత మాత్రమే.—యోనా 1:4, 17.
రాజులు కూడా మనుష్యులకు భయపడగలరు. సౌలు రాజు దేవుడు వ్యక్తపరచిన ఆజ్ఞకు నేరుగా అవిధేయత చూపెను. అతని సాకు ఏమిటి? “జనులకు భయపడి వారిమాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.” (1 సమూయేలు 15:24) కొన్ని శతాబ్దముల తరువాత యెరూషలేముపై బబులోనీయులు దాడిచేసినపుడు యదార్ధవంతుడైన ప్రవక్తయగు యిర్మీయా, సిద్కియా రాజును వారికి లొంగిపోయి యెరూషలేమును అధిక రక్తపాతము నుండి తప్పించుమని సలహా ఇచ్చెను. కాని సిద్కియా దానిని నిరాకరించాడు. ఎందుకు? అతడు యిర్మీయాతో ఇలా ఒప్పుకున్నాడు: “కల్దీయులు పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒక వేళ కల్దీయులు నన్ను వారిచేతికి అప్పగించిన యెడల వారు నన్ను అపహసించెదరు.”—యిర్మీయా 38:19.
చివరికి ఒక అపొస్తలుడు కూడా భయపడగలడు. తాను మరణించనైయున్న దినమున యేసు తన అనుచరులందరు తనను విడిచిపోవుదురని హెచ్చరించెను. అయితే పేతురు ధైర్యముతో ఇట్లు ప్రకటించెను: “ప్రభువా నీతోకూడా చెరలోనికి మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా వున్నాను.” (లూకా 22:33; మత్తయి 26:31, 33) ఈ మాట ఎంతతప్పుగా నిరూపించబడెను! కొన్నిగంటల తరువాతనే పేతురు భయముతో యేసుతో కలిసియుండలేదని, అతనిని యెరుగనని చెప్పెను. మనుష్యుని భయము అతనిని అధికమించింది. అవును మనుష్యునికి భయపడుట మానసిక విషమైయున్నది.
మనము ఎవరికి భయపడవలెను?
మనుష్యులకు భయపడుటను మనము ఎట్లు అధికమించగలము? దానికి బదులుగా ఉత్తమమైన భయమును కలిగియుండుటద్వారా. ఈ విధమైన భయమును ప్రోత్సహిస్తూ అదే అపొస్తలుడైన పేతురు ఇట్లు చెప్పెను: “దేవునికి భయపడుడి.” (1 పేతురు 2:17) ప్రకటనలో యోహాను చూసిన దూత మానవజాతిని ఇట్లు పిలిచెను: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి.” (ప్రకటన 14:7) బుద్ధిమంతుడైన సొలొమోను రాజుకూడా అట్టి భయమును ప్రోత్సహిస్తూ ఇట్లనెను: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి 12:13) అవును దేవునికి భయపడుట ఒక విధియై యున్నది.
దేవునికి భయపడుట ప్రయోజనములను తెచ్చును. పురాతన కీర్తనల రచయిత ఇట్లు పాడెను: “ఆయన [యెహోవా] రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా ఉన్నది.” (కీర్తన 85:9) ఒక బైబిలు సామెత కూడా ఇట్లు నొక్కిచెపుతుంది: “యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము.” (సామెతలు 10:27) అవును, యెహోవాకు భయపడుట ఆరోగ్యకరమైనది, ప్రయోజనకరమైనది. అయితే మీరిట్లనవచ్చు ‘నిశ్చయముగా యెహోవా ప్రేమగల దేవుడు, మరి అలాంటప్పుడు ప్రేమగల దేవునికి మనమెందుకు భయపడవలెను?’
ప్రేమగల దేవునికి భయపడటమా?
దేవునికి భయపడుట కొన్నిసందర్భములలో ప్రజలను బిగిసి పట్టు, అల్పమైన శక్తిహీనముచేయు భయమువంటిది కాదు. అది ఒక బాలుడు తన తండ్రిని ప్రేమించి, తన తండ్రితనను ప్రేమిస్తున్నాడని తెలిసినప్పటికి, తన తండ్రియెడల కలిగియున్న భయమువంటిది.
తన సృష్టికర్త నీతి, న్యాయము, బుద్ధి మరియు ప్రేమలను, సంపూర్ణంగా కలిగియున్నాడని గ్రహించుటవలన కలుగు ప్రగాఢ భక్తిభావమే నిజముగా దేవునియెడల భయమైయున్నది. ఆయన ప్రతిఫలమిచ్చుటకును మరియు శిక్షించుటకును శక్తిగల సర్వోన్నత న్యాయాధిపతి అని ఎరిగి దేవునిని అసంతోషపరచుటకు భయపడుట అందులో ఇమిడియున్నది. “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము” అని అపొస్తలుడైన పౌలు వ్రాసెను. (హెబ్రీయులకు 10:31) దేవుని ప్రేమను మనము చులకనగా చూడరాదు, మరియు ఆయన న్యాయతీర్పు అంత తీవ్రముగా ఉండదని ఎంచరాదు. అందుకే బైబిలు మనకు యిలా గుర్తుచేయుచున్నది. “యెహోవాయందు భయము కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.”—సామెతలు 9:10.
అయితే మనము గుర్తుంచుకొనవలసిన విషయమేమంటే యెహోవా తనకు విధేయత చూపని వారిని శిక్షించు శక్తిని కలిగియున్నప్పటికి—అలా తరచుగా శిక్షించినప్పటికిని—ఆయన క్రూరుడు లేక రక్త దాహము గలవాడు ఏ మాత్రముకాడు. ఒక ప్రేమగల తండ్రివలె నీతియుక్తమైన ఆగ్రహము ప్రకటించినను ఆయన నిజముగా ఒక ప్రేమగల దేవుడు. (1 యోహాను 4:8) అందుకే ఆయనకు భయపడుట ఆరోగ్యకరమైయున్నది. ఆయన మన మంచికొరకు ఏర్పరచిన కట్టడలను అనుసరించుటకు అది మనలను నడిపించును. దేవుని నియమములను అనుసరించుట మనకు సంతోషమునిచ్చును. అదేవిధముగా, వాటికి అవిధేయత చూపుట ప్రతిసారి చెడుపరిణామములు తెచ్చును. (గలతీయులు 6:7, 8) గాయకుడు ఇట్లు వ్రాయుటకు ప్రేరేపించబడెను: “యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.”—కీర్తన 34:9.
నీవు ఎవరికి భయపడుచున్నావు?
దేవునియెడల భయము మనుష్యుల భయమును జయించుటకు ఎట్లు సహాయముచేయును? సరే, మనము నీతిమార్గము అనుసరించినపుడు మనుష్యులు మనలను ఎగతాళి చేయవచ్చు లేక హింసించవచ్చు, ఇదంత మనపై వత్తిడి తెస్తుంది. అయితే దేవుని యెడల గౌరవముతో కూడిన భయము, నీతిమార్గమును అనుసరిస్తూ ఉండుటకు ఒత్తిడితెచ్చును. ఎందుకంటే ఆయనను అసంతోషపరచుటకు మనము ఇష్టపడము. అంతేకాకుండా దేవునియెడల ప్రేమ ఆయన హృదయాన్ని సంతోషపరుచు విషయములు చేయుటకు మనలను పురికొల్పును. అనగా, దేవుడు సరియైన దానిని చేయువారికి గొప్పగా ప్రతిఫలమిచ్చునని గుర్తుంచుకొందము. అది మనమాయనను ఇంకా ప్రేమించి ఆయన చిత్తమును జరిపించుటకు నడుపును. కావున దేవునిని గూర్చి సమతూకపు దృష్టిని కలిగియుండుట మనలో ఉన్న మనుష్యుల భయమును జయించుటకు సహాయపడును.
ఉదాహరణకు తమ సహచరులు ఏమనుకుంటారో అనే భయముతో ఎందరో తప్పుచేయుటకు ఒత్తిడికి గురి అవుతున్నారు. యవ్వనులు పాఠశాలలో, పొగత్రాగుదురు. చెడుభాష వాడుదురు. వారి లైంగిక అనుభవమును గూర్చి గొప్పగా చెప్పుకొందురు. (నిజమైనది లేక ఊహించినది) మద్యపానము మరియు మత్తుమందులు కూడా ప్రయోగింతురు. ఎందుకు? ఎందుకనగా అన్నిసమయములలో వారు ఇష్టపడుట వలనకాదుకాని, వారు వేరుగా ప్రవర్తిస్తే వారి సహచరులు ఏమంటారో అనే భయముతో. యవ్వనప్రాయములో ఉన్నవారికి ఎగతాళి మరియు వెక్కిరింపు సహించుట శారీరక హింసను సహించినంత బాధను కలుగజేయును.
ఒక ప్రౌఢ వయస్కుడు కూడా తప్పుచేయుటకు ఒత్తిడిని పొందగలడు. బహుశా పనిచేయు స్థలములో యజమానుడు కార్మికునితో తప్పుడు లెక్క వ్రాయమని లేక పన్ను జాబితాను—తప్పుగాచూపి అవినీతికరంగా కర్మాగారం పన్నులు తగ్గించులాగా చేయమని చెప్పవచ్చును. ఆ క్రైస్తవుడు తనయజమాని చెప్పినది చేయనట్లయితే ఉద్యోగము పోతుందేమో అని భావించవచ్చును. ఆవిధంగా మనుష్యుని భయము అతనిని తప్పుచేయుటకు ఒత్తిడిచేయును.
పైరెండు విషయాల్లోను దేవునియెడల ఆరోగ్యకరమైన భయము, ఆ క్రైస్తవున్ని శక్తిహీనముచేయు మనుష్యుని భయమునకు లోనుకాకుండా ఆపుతుంది. మరియు దేవునియెడల గల ప్రేమ దేవుడు నిషేధించిన కార్యములు చేయకుండా అతనిని ఆపుతుంది. (సామెతలు 8:13) అంతేకాకుండా దేవుని యందు అతనికున్న విశ్వాసము, అతడు బైబిలు ద్వారా తర్ఫీదుపొందిన మనస్సాక్షిననుసరించి ప్రవర్తించినపుడు ఏ పరిస్థితులయందైనా దేవుడు అతనికి మద్దతునిచ్చునన్న నిశ్చయతనిచ్చును. అపొస్తలుడైన పౌలు తన విశ్వాసమును ఈ మాటల ద్వారా వ్యక్తపరిచెను, “నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను.”—ఫిలిప్పీయులకు 4:13.
అతి తీవ్రమైన పరీక్షలలో కూడా దేవునికి యదార్థతను నిలుపుకొన్న స్త్రీపురుషులను గూర్చి బైబిలు అనేక ఉదాహరణములు కలిగియున్నది. వారు “తిరస్కారములను కొరడా దెబ్బలను. . .మరియు బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. (హెబ్రీయులు 11:36, 37) అయితే వారు మనుష్యులయెడల భయమును వారి మనస్సులను స్వాధీనపరచ నీయలేదు. దానికి బదులుగా యేసు తన శిష్యులకు చూపిన బుద్ధికరమైన మార్గమునే అనుసరించిరి: “మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా (గెహెన్నాలో) నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.”—మత్తయి 10:28.
యేసు సలహాను అనుసరించి మనుష్యునికి కాక దేవునికి భయపడుట ఆదిక్రైస్తవులకు అన్నివిధములైన కష్టములను, పరీక్షలను, హింసలను “సువార్త విషయమై” సహించుటకు సహాయపడెను. (ఫిలేమోను 13) ఈ విషయములో అపొస్తలుడైన పౌలు చెప్పుకొనతగిన ఉదాహరణమైయున్నాడు. కొరింథీయులకు వ్రాసిన తన రెండవ పత్రికలో దేవునియెడల భయము అతనిని చెరసాలదెబ్బలు, రాళ్లతో దెబ్బలు, ఓడ పగిలి శ్రమ, రహదారిలో ఆపద, జాగరణము, ఆకలిదప్పులు, చలి మరియు దిగంబరత్వమును సహించుటకు ఎట్లు బలపరిచెనో చూపెను.—2 కొరింథీయులు 11:23-27.
దేవునియెడల భయము ఆ తొలిక్రైస్తవులు రోమా సామ్రాజ్యమునుండి అతి తీవ్ర హింసను ఎదుర్కొనుటకు బలపరిచెను, జనసమూహములు చూచుచుండగా కొందరిని కృరమృగముల ఎదుట పడవేశారు. మాద్యమిక కాలములలో ధైర్యము గల విశ్వాసులు తమవిశ్వాసమందు రాజీపడనందుకు బహిరంగంగా కాల్చి చంపబడిరి, ఎందుకంటే వారు తమ విశ్వాసమును విడువ నంగీకరించలేదు. చివరి ప్రపంచ యుద్ధంలో క్రైస్తవులు దేవుని అసంతోషపరచుటకంటే కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపులలో బాధపడి మరణించుటను ఎన్నుకొనిరి. దైవిక భయము ఎంత బలమైన శక్తియైయున్నది! నిశ్చయముగా అటువంటి పరీక్షించు పరిస్థితులలో క్రైస్తవులను, మనుష్యుని భయమును అధిగమించుటకు అది బలపరిచినప్పుడు, ఏ పరిస్థితులలో మనమున్నప్పటికిని అది మనలను బలపరచగలదు.
ఈనాడు అపవాదియైన సాతాను దేవునిని అసంతోషపరచుటకు మనపై ఒత్తిడి తెచ్చుటకై తాను చేయగలిగినదంతా చేస్తున్నాడు. కావున నిజక్రైస్తవులు అపొస్తలుడైన పౌలు వ్యక్తపరిచిన దృఢనిశ్చయమును కలిగియుండవలెను. అతడు ఇట్లువ్రాసెను: “అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాదుగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.” (హెబ్రీయులు 10:39) యెహోవాయొక్క భయము నిజమైన బలమునకు ఆధారము. దాని సహాయముతో మనము కూడా “‘యెహోవా నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?’ అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.”—హెబ్రీయులు 13:6 (w89 6⁄1)
[7వ పేజీలోని చిత్రాలు]
దెబ్బలను, ఖైదును, ఓడ బ్రద్ధలైనప్పుడు కలుగు శ్రమలతో సహా సమస్తమును సహించుటకు దేవుని భయము పౌలును ధైర్యపరచినది.—2 కొరింథీయులు 11:23-27