ప్రపంచ పరిశీలన
భాష అంతరించిపోవడం
అలాస్కాలోని, ఈయక్ భాషను మాట్లాడే సంస్కృతిలో చివరి వ్యక్తీ, నాయకురాలూ అయిన మరీ స్మిత్ జోన్స్, “నా పిల్లలకు ఈ భాషను నేర్పనందుకు కొన్నిసార్లు నాలో నేనే చాలా కలత చెందుతున్నాను,” అని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా, వాడుకలో ఉన్నవని అంచనావేయబడుతున్న 6,000 భాషల్లో 40, 50 శాతం తర్వాతి శతాబ్దంలోగా అంతరించిపోవచ్చునని ప్రస్తుతమున్న వైఖరులు సూచిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఒకప్పుడు 250 భాషలు ఉండేవి, అయితే ఇప్పుడు దాదాపు 20 భాషలు మాత్రమే ఉన్నాయి. ఇలా ఎందుకు సంభవిస్తుంది? “ఇంగ్లీషూ, ‘సర్వవ్యాప్తంగా మాట్లాడే’ వేరే భాషలూ వ్యాప్తి చెందడంతో” ఆ భాషలు “మరవబడుతున్నాయి” అని న్యూస్‌వీక్ పత్రిక సూచిస్తుంది. “‘తక్కువ ప్రభావం’ ఉన్న భాషలకు, అల్పసంఖ్యాకుల భాషలకు ఎక్కువ ప్రాముఖ్యత లేదు కనుక వాటిని మరచిపోవాలి అన్నదే తరచూ వచ్చే అభిప్రాయం” అని ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ ప్రచురించిన అట్లస్ ఆఫ్ ద వాల్డ్స్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్ ఆఫ్ డిసప్పియరింగ్ సంపాదకుడైన ప్రొఫెసర్ స్టీఫెన్ వుర్మ్ చెప్పారు.
రోడ్డు రౌద్రాన్ని నివారించడం
“మరీ దాడిచేసే వైఖరిగల డ్రైవర్లను అంత తేలిగ్గా తీసుకోకూడదు,” అని కారు-రేసుల్లో ఆరితేరిన వ్యక్తి సిఫార్సు చేసినది ఫ్లీట్ మెయిన్‌టెనెన్స్ & సేఫ్టీ రిపోర్ట్‌లో ఉటంకించబడింది. ఆవేశపడకుండా ఉండటమూ, పరిస్థితులు విషమించడాన్ని నివారించడమూ రోడ్డు రౌద్రపు ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడగలవు. సురక్షిత సలహాదారులు ఈ క్రింది వాటిని సిఫార్సు చేస్తున్నారు:
◼ ఎల్లప్పుడూ మర్యాదకరంగా నడపండి.
◼ దాడిచేసే మోటరిస్టు నుండి సురక్షితంగా తప్పుకోగలిగేటట్లయితే తప్పుకోండి.
◼ ముందున్న వాహనం వెనకాలే దగ్గరగా నడపడం ద్వారా లేక వేగాన్ని పెంచడం ద్వారా వేరే డ్రైవర్‌తో ఎన్నడూ పోటీపడవద్దు.
◼ భయపెట్టే భావ సూచనలకు ప్రతిస్పందించవద్దు, తప్పుగా వ్యాఖ్యానం చేయబడగల సంజ్ఞలు చేయవద్దు.
◼ బాగా కోపంతో ఉన్న డ్రైవరుతో చూపులు కలపకండి.
◼ వేరే డ్రైవరును ఎదిరించేందుకు వాహనాన్ని రోడ్డు ప్రక్కకు ఆపవద్దు.
నవ్వు తగ్గిపోవడం
స్విట్జర్లాండ్‌లో, ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ హ్యూమర్‌లో సమర్పించబడిన రుజువుల ప్రకారం, ఆర్థికంగా దెబ్బతిన్న 1950లలో, సగటు మనిషి ఒక రోజుకి 18 నిమిషాలు నవ్విన దానితో పోల్చితే, ధనసమృద్ధి ఉన్న 1990లలో 6 నిమిషాలే నవ్వుతున్నాడు. నవ్వు ఎందుకంత తగ్గిపోయింది? “డబ్బు సంతోషాన్ని తీసుకురాలేదన్న పాతకాలంనాటి సామెత యొక్క నిజత్వాన్ని నిరూపిస్తూ, ఈ [నవ్వు తగ్గిపోతున్న] ధోరణికి కారణం భౌతికమైన విషయాల కోసం, కరీర్ కోసం, వ్యక్తిగత విజయాలకోసం ఎడతెగక శ్రమించడమేనని నిపుణులు ఆరోపిస్తున్నారు,” అని లండన్‌లోని సండే టైమ్స్ వివరించింది. ఆ విధంగా, “డబ్బుకు ఎక్కువ విలువ ఇచ్చేవారికి సంతృప్తి చాలా తక్కువ, మానసిక ఆరోగ్యం కూడా తక్కువే. దీనికి కారణం, డబ్బు పైపై సంతృప్తులను మాత్రమే అందిస్తుందన్నదే కావచ్చు,” అని రచయితయైన మైఖెల్ ఆర్గైల్ ముగించారు.
ప్రపంచ నిరక్షరాస్యతా రేటు పెరుగుతోంది
“ప్రపంచంలోని 590 కోట్లమంది ప్రజల్లో దాదాపు 1/6వ వంతు మంది ప్రజలకు చదవడం గానీ వ్రాయడం గానీ రాదు,” అని ద న్యూ యార్క్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి (UNICEF) ప్రకారం, నిరక్షరాస్యత రేటు ఇంకా పెరగవచ్చని నిరీక్షించబడుతుంది. ఎందుకు? ఎందుకంటే, ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లోని ప్రతి నలుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లలు ప్రస్తుతం స్కూలుకి వెళ్ళడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సమస్యల కారణాలతోపాటూ వర్గ భేదాలు లక్షలాదిమంది పిల్లలు చదువుకోవడాన్ని నిషేధిస్తున్నాయి. యుద్ధాలు స్కూళ్ళను నాశనం చేయడమే కాకుండా అనేకమంది పిల్లలను విద్యార్థులుగా ఉండే బదులు సైనికులుగా కూడా మార్చివేస్తున్నాయి. నిరక్షరాస్యత తప్పకుండా సాంఘిక సమస్యలకు కూడా దోహదపడుతుంది. నిరక్షరాస్యతకూ జననాలరేటుకూ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని UNICEF చేసిన ద స్టేట్ ఆఫ్ ద వాల్డ్స్ చిల్డ్రన్ 1999 అన్న పేరు గల రిపోర్టు తెలియజేసింది. ఉదాహరణకు, ఒక దక్షిణ అమెరికా దేశంలో “నిరక్షరాస్యులైన స్త్రీలకు సగటున 6.5 మంది పిల్లలు ఉండగా, సెకెండరీ-స్కూలు వరకు చదువుకున్న తల్లులకు సగటున 2.5 మంది పిల్లలు ఉన్నారు” అని టైమ్స్ చెప్పింది.
సహస్రాబ్ద పిచ్చి
సహస్రాబ్దం సంబంధంగా రేకెత్తగల విధ్వంసకాండ విషయమై ముందు జాగ్రత్తగా, “[ఇశ్రాయేలీ] ప్రభుత్వం టెంపుల్ మౌంట్‌కి భద్రతను పెంచడం కోసం 120 లక్షల డాలర్లు కేటాయించింది,” అని నండో టైమ్స్ రిపోర్టు చేసింది. యూదుల దేవాలయాన్ని పునఃనిర్మించడం కోసం టెంపుల్ మౌంట్ దగ్గర ఉన్న మసీదులను నాశనం చేయడానికి యూదా లేక “క్రైస్తవ” మతోన్మాదులు ప్రయత్నం చేస్తారేమోనని పోలీసులు ఆందోళనపడుతున్నారు. ఇది లోకాంతాన్నీ, క్రీస్తు రెండవ రాకడనీ త్వరితపరుస్తుందని కొన్ని “క్రైస్తవ” తెగలు నమ్ముతున్నాయి. ఆ నివేదిక ప్రకారం, ముస్లిములకు అల్-హరమ్ అల్-షరీఫ్‌గా తెలియబడుతున్న టెంపుల్ మౌంట్, “మధ్యప్రాచ్య పోరాటాల్లో అత్యధికంగా దెబ్బతినగల ప్రాంతంగా ఇది ఎంచబడుతుంది.” ఈ టెంపుల్, “1967 మధ్యప్రాచ్య యుద్ధంలో ఇశ్రాయేలీయులు జోర్డాన్ నుంచి స్వాధీనం చేసుకొన్న గోడలుగల పాత నగరమైన యెరూషలేములో” ఉంది. క్రీస్తు తిరిగి వస్తాడన్న నిరీక్షణతో అనేకమంది “క్రైస్తవులు” ఒలీవల పర్వతం మీది ప్రాంతాన్ని అప్పుడే అద్దెకు తీసుకొని ఉన్నారని కూడా గమనించడం జరిగింది.
యాంగ్‌ట్సి నది ఉత్పత్తి చేస్తుంది
ఒకసారి పూర్తయితే, చైనా యాంగ్‌ట్సి నదిపై ఉన్న త్రీ గోర్జెస్ డామ్ ప్రపంచంలోని అతి పెద్ద జలవిద్యుత్ ఉత్పాదక కేంద్రం అవుతుంది. ఈ ఆనకట్ట 185 మీటర్ల ఎత్తు, 2.3 కిలోమీటర్ల వెడల్పు ఉండి, 18.2 మిలియన్ కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ డామ్‌ను కట్టడానికి గల ప్రధాన కారణం జలవిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలన్నది కాదు. యాంగ్‌ట్సి నది ద్వారా వరదలను నిరోధించడానికి ఈ డామ్‌ను కట్టారు. ఈ నిర్మాణపు పని 1994లో ప్రారంభమైంది, 2009 నాటికెల్లా ముగుస్తుందని నిరీక్షించబడుతుంది. మొత్తంగా, ఈ భారీ పథకానికి భూమినీ రాళ్ళనూ 147 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకూ తొలవడమూ, 25 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీటును దానిలో పోయడమూ, సుమారు రెండు మిలియన్ టన్నుల ఉక్కును దింపడమూ అవసరం. “అయితే, అన్నింటి కన్నా కష్టమైన పని ఏమంటే ఆ నిర్మాణపు పని జరుగుతున్న ప్రాంతాల్లో నివసించే 11 లక్షలకన్నా ఎక్కువమంది ప్రజలకు వేరే స్థలాన్నివ్వడమే” అని చైనా టుడే అంటోంది.
ఆస్త్మా ఎక్కువవుతుంది
గత దశాబ్దంలో, ప్రపంచవ్యాప్తంగా ఆస్త్మా ప్రబలమవ్వడంలోను, ఆసుపత్రి పాలవ్వడంలోను 40 శాతం పెరుగుదల ఉండిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చిన రిపోర్టులు సూచిస్తున్నాయి. ఎందుకు పెరుగుతుంది? పెంపుడు జంతువులు అధికం కావడంతోపాటు, ఇరుకుగా ఉండే, గాలి వెలుతురుల ప్రసరణ అంతగాలేని క్వార్టర్లలో జీవించే ప్రస్తుత ధోరణులు దీనికి కారణమని అమెరికన్ కాలెజ్ ఆఫ్ చెస్ట్ సభ్యులు సూచించారు. “పశుపక్ష్యాదుల (చర్మం, బొచ్చు, ఈకలు) నుండి రాలిపడేవి, ధూళిలో ఉండే కీటకాలు, బూజు, సిగరెట్ పొగ, పుప్పొడి, పర్యావరణాన్ని కలుషితం చేసే పదార్థాలు, ఘాటైన వాసనలు,” ఆస్త్మా కలిగించగలవు అని ద టొరొంటో స్టార్ అంటోంది. అయితే, పిల్లి శరీరం నుండి రాలిపడేది ఎక్కువ ఎలర్జీని కల్గిస్తుంది. ఆస్త్మా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఎందుకంటే వీటివల్ల కలిగే చాలా మరణాలు నివారించగల్గేవే అని ఈ వార్తాపత్రిక అంటోంది. ప్రస్తుతం, కెనడాలో దాదాపు 15 లక్షల ప్రజలకు ఆస్త్మా ఉంది. ఈ జబ్బుతో ప్రతి సంవత్సరం దాదాపు 500మంది చనిపోతున్నారు.
అసాధారణమైన వాతావరణ నష్టం
1998వ సంవత్సరంలోని మొదటి 11 నెలలు, వాతావరణ వైపరీత్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైనంతగా, 8,900 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. ఈ నష్టం, “1980ల దశాబ్దమంతటిలో జరిగిన 5,500 కోట్ల అమెరికన్ డాలర్ల నష్టానికన్నా చాలా ఎక్కువ” అని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టు అంటోంది. “1980లలో జరిగిన నష్టం ఇప్పటి లెక్కల ప్రకారం ఎంత అవుతుందంటే 8,270 కోట్ల అమెరికన్ డాలర్లు అవుతుంది, 1998వ సంవత్సరంలోని మొదటి 11 నెలల్లో జరిగిన నష్టం దీనికన్నా చాలా ఎక్కువ” అని 1998 రిపోర్టు తెలియజేసింది. వస్తుపరమైన నష్టాలు కలగడమే కాక, తుపానులు, వరదలు, నిప్పంటుకోవడాలు, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల 32,000 మంది చనిపోయినట్లుగా కూడా అంచనా వేయబడింది. “ప్రకృతి వైపరీత్యాల్లో మానవుని హస్తం ఉండటం అధికమౌతుంది” అని ద వాల్డ్‌వాచ్ ఇన్‌స్టిట్యూట్‌లోని సేత్ డన్ చెప్పాడు. ఎలా? వృక్షాలుండే ప్రాంతాలను తడిప్రాంతాలను లేకుండా చేయడం ద్వారా అడవులు లేకుండాపోవడం సమస్యకు కారణమవుతుంది, ‘ప్రకృతిని తుడిచిపెట్టేస్తుంది’ అని డన్ చెబుతున్నారు.
ఒత్తిళ్ళకు గురౌతున్న కుటుంబాలు
ఇటీవల కెనడా దేశీయుల్లో జరిపిన ఒక సర్వే, ఒక 50 ఏళ్ళ క్రితం, యుద్ధానంతరం, కుటుంబాలు ఎదుర్కొన్న ఒత్తిడి కన్నా ఈ రోజుల్లో కుటుంబాలు ఆర్థికంగా భావోద్వేగంగా చాలా ఒత్తిడికి గురౌతున్నాయన్న నిర్ధారణకు వచ్చింది. కుటుంబ ఒత్తిళ్ళకున్న ప్రముఖ కారణాలలో విడాకులు, కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడం అగ్రస్థానంలో ఉన్నాయని నేషనల్ పోస్ట్ వార్తాపత్రిక పేర్కొంది. అవరోహణ క్రమంలో చెప్పాలంటే, “తల్లిదండ్రులు చాలా ఎక్కువ గంటలు చాలా కష్టపడి పనిచేయడం, భద్రతలేని ఉద్యోగ పరిస్థితులు, పన్నులు ఎక్కువ చెల్లించడాలు, పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు పడే ప్రయాసకు గౌరవం లేకపోవడం,” అనేవి కుటుంబ ఒత్తిళ్ళకున్న వేరే ప్రముఖ కారణాలు. ఈ ఒత్తిళ్ళు ఒంటరి తల్లి/తండ్రి ఉండే కుటుంబాలలో ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వేలో పాల్గొన్నవాళ్ళు చెప్పారు.